జరిగిన కాలేజిలో వత్తిడి, ఇంట్లో వాళ్ళ పోరు భరించలేక అనూష రూమ్మేట్, కల్పన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల మరణానికి తాము బాధ్యులు కాదంటు యాజమాన్యం తప్పించుకోజూస్తుంది. అనూష ఆ ఘోరాన్ని దిగమింగుకోలేక ఉంటుంది. కల్పన ఆత్మహత్య కాలేజిని, పిల్లలను, యాజమాన్యాన్నీ కుదిపేస్తుంది. వాడిగా చర్చలూ ప్రారంభమవుతాయి. అనూష దిగమింగుకోలెకౌంటే హఠాత్తుగా కల్పన కనిపిస్తుంది. అనూష దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తూంటుంది. మరో వైపు ఆనూష తమ్ముడు అనిరుధ్ కూడా ఇంట్లొ పోరు భరించలేక ఇంటినుంచీ పారిపోతాడు.

ఇల్లు వదిలి వెళ్ళిన అనిరుధ్ ఒక రెండ్రోజులు వేరే ఊరు వెళ్ళి, అక్కడ తన పరిస్థితి తెలుసుకున్నాక ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తననెవరో కిద్నాప్ చేశారని తండ్రిని నమ్మించి, స్థానిక పోలీసుల సాయంతో హైదరాబాద్ తిరిగివస్తాడు. అనిరుధ్ పారిపోయిన విషయం తెలుసుకున్న పోలీసు కానిస్టేబుల్ అనిరుధ్ తండ్రికి వత్తిడి లేకుండా పిల్లలను చదివించడం గురించి చెబుతాడు.

హిమవర్ష చదువు ఒత్తిడి తట్టుకోలేక తన స్కూల్ స్నేహితునితో "ప్రేమ" అనుకుని గుట్టలూ పుట్టల వెంట తిరుగుతూ మధుమిత కంట పడుతుంది. మధుమత ఆమెను తనతో తీసుకువచ్చి అపోహల్లో ఉండదని నచ్చచెబుతుంది. అనూష పిచ్చి ముదిరి తట్టుకోలేని స్థాయికి వెళ్ళటంతో హాస్టల్ యాజమాన్యం రమణారావుని పిలుస్తారు.

16 వ భాగం(చివరి భాగం)

రమణారావు హాస్టల్‌కి చేరుకునేప్పటికి ఉదయం ఆరున్నరయింది. మనసులో విపరీతమైన అదుర్దా ఉంది. అనూషకేమైందోనన్న భయం .. జ్వరమైతే జ్వరమని చెప్పేవారుగా. ఏమి చెప్పకుండా ఉన్నపళంగా రమ్మంటే ఏమనుకోవాలి? అనూషని వీలైనంత తొందరగా చూస్తేకాని మనశ్శాంతి దొరికేలా లేదు. వార్డెన్ ద్వారా కబురు పెట్టించాడు. ఆ లోపలే ఆగలేక చీఫ్ వార్డెన్ని వాకబు చేశాడు.

అనూష గురించి ఏం చెప్పాలో మొదట చీఫ్ వార్డెన్ సత్యవతికి అర్థం కాలేదు. దయ్యం పట్టిందని చెప్పాలనుకుంది. అలా చేస్తే తండ్రి హృదయం గాయపడ్తుందేమోననిపించి "ఈ మధ్య అదో రకంగా మాట్లాడుతోంది. సరిగ్గా చదవటం లేదు. పుస్తకం ముట్టుకుంటే తన రూమ్మేట్ కల్పన చంపేస్తానని బెదిరిస్తుందట" అనిచెప్పింది.

ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడతను. "కల్పన బెదిరించడమేమిటి? రూంలో పురేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయే కదూ"

"ఔను. కల్పన చనిపోయి నెల దాటుతోంది. ఆ రూంలో కల్పన ఆత్మ తిరుగుతోందని స్టూడెంట్స్ అనుకుంటున్నారు."

"నాన్‌సెన్‌స్. అంతా భ్రమ. చదువుకున్నవాళ్ళు కూడా ఇలాంటివి నమ్మితే ఎలా?"

"భ్రమ కాదు. నిజమే. కల్పన మీ అమ్మాయికి కనిపిస్తోందట. మాట్లాడుతోందట"

"ఇదంతా మీ నిర్వాహక లోపం. అందరూ టీనేజ్ అమ్మయిలు కదా. కాసింత జాగ్రత్త తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోతే ఎలా?"

ఇంగితం లేదన్నందుకు సత్యవతికి కూడా కోపం వచ్చింది. "దయ్యాలు భూతాలు పడ్తే మేమేం చేస్తాం? వైద్యం చేయించాం. అదేం రోగం కాదుగా తగ్గడానికి. అందుకే మీకు కబురెట్టింది. యింటికి పిల్చుకెళ్ళి భూతవైద్యులకు చూపించుకుంటారో, తాయెత్తులు కట్టించుకుంటారో మీ ఇష్టం."

"ఆ గదిలో తమతోపాటు కొన్నాళ్ళు కల్సి తిరిగిన అమ్మాయి వురేసుకుని చచ్చిపోతే మిగతా పిల్లల్ని అదే రూంలో పెట్టడం తప్పు కదా. ఆ జ్ఞపకాలు వాళ్ళని బాధించడమే కాదు భయపెడ్తాయి కూడా. మరో రూంలో వీళ్ళని అకామడేట్ చేసుండాల్సింది"

"రూం మార్చినంత మాత్రాన కల్పన ఆత్మ వదుల్తుందనుకోవటం మీ భ్రమ" అంది.

"ట్రాష్ ... ఆత్మలేమిటి... అంతా మన మనసు చేసే మాయాజాలం"

నీకెం తెలుసు... నా రూంకి కూడా వచ్చి నన్ను బెదిరిస్తుంది.. నేనెవరికి చెప్పుకోను? అనుకుందామే మనసులో.

"నాన్న బావున్నావా?" అంటూ పలకరించి అతని పక్కన కూచుంది అనూష.

తన కూతుర్ని ఆసాంతం పరీక్షగా చూశాడు. మామూలుగానే ఉంది. తనకేమి తేడాగా కనిపించడం లేదు.

"అమ్మా తమ్ముడూ బాగున్నారా నాన్నా? ఏమిటీ చెప్పపెట్టకుండా వచ్చావు? నన్ను చూడాలనిపించిందా?" అంటూ నవ్వింది.

ఆ నవ్వులో ఏదో తేడా.. ఆ చూపులో ఏదో తేడా... దిగంతాల్లోకి చూస్తున్నట్లు...

"అమ్మా.. బాగా చదువుతున్నావా?" అని అడిగాడు.

అనూష భయం భయంగా అటూ ఇటు చూసి మెల్లగా చెప్పింది "నాన్నా. పెద్దగా మాట్లాడకు. చదువు పేరెత్తితే కల్పనకు కోపం వస్తుంది. పుస్తకం ముట్టుకుంటే చాలు చంపెస్తానంది. చదువుకన్నా ప్రాణం ముఖ్యం కదా నాన్న. అందుకే చదవటం లేదు" అంటూ హిస్టీరిక్ గా నవ్వింది.

"కల్పన చనిపోయింది కదమ్మా"

"లేదు నాన్న. మా రూంలోనే ఉంది" అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.

ఈశ్వరరావు దగ్గర పర్మిషన్ తీసుకుని అనూషని పిల్చుకుని మొదట ప్రముఖ సైక్రియాటిస్ట్ రామిరెడ్డి దగ్గరకు పిల్చుకెళ్ళాడు.

కేసంతా విన్నాక " దీనికంతా కారణం యంసెట్ కోచింగ్‌లో ఉన్న స్ట్రెస్. ర్యాంకు రాదేమోనన్న భయం. అపజయం అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందన్న భీతి. ఈ వత్తిడి తట్టుకునే స్థాయి దాటిపోతే మనసు ఆ వత్తిడి కలుగ చేస్తున్న పరిస్థితుల్నించి పారిపోవాలనిపిస్తుంది. దానికో ఆలంబనని వెతుక్కుంటుంది. మీ అమ్మాయి విషయంలో అదే జరిగింది. కల్పన ఆత్మహత్యకు కారణం తనని తన తల్లిదడ్రులు నుంచి దూరం చేసిన హాశ్టల్ చదువుని అసహ్యించుకోవటం. మీ అమ్మాయికి ఆ కారణం చాలా కన్‌వీనియంట్‌గా మనసులో నాటుకునిపోయింది. మీ భార్య పెట్టిన వత్తిడి .. లెక్చరర్లు పెట్టే టెన్‌షన్... తన మనసులొ గూడుకట్టుకున్న భయం.. ఇవన్నీ ఒక సాలె గూడులా పని చేశాయి." అన్నాడాయన.

"ఇప్పుడేం చేయమంటారు డాక్టర్" అన్నాడు దిగులుగా రమణారావు.

"డోంట్ వర్రీ. ఇది చాలా సింపుల్ కేస్. విజయవాడలో కార్పోరేట్ కాలేజీలున్నంత కాలం మా దగ్గరకు ఇలాంటి కేసులు సంవత్సరానికి మూడో నాలుగో వస్తుంటాయి. కొన్నాళ్ళు నా మందుల్తో పాటు రెస్ట్ ఇద్దాం. యంసెట్ గురించి ఇంట్లో మాట్లాడకండి. ర్యాంకుల ప్రసక్తి అమ్మాయి దగ్గర తిసుకు రాకండి. మెల్లగా అన్నీ సర్దుకుంటాయి" అన్నాడు.

రమణారావు మందుల్ని కొనుక్కుని అనూషతొ పాటు రైలెక్కాడు. అతనికి దు:ఖం వచ్చింది. కొన్ని నెలలు క్రితం ఎన్న్ని ఆశల్తో అమ్మాయిని పిల్చుకుని విజయవాడ వచ్చాడు? హాస్టల్లో పెట్టి చదివిస్తే యంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది, తన కుతురు యింజనీరింగ్ కోర్సులో చేరి పెద్ద యింజనీరై పోతుందని.. కాని ఇపుడు మందులు వాడితేగానీ తగ్గని మానసిక రుగ్మతని మోసుకుంటూ.. బరువైన గుండెల్తో తిరుగు ప్రయాణమౌతున్నారు. తన కూతురు ఇంజనీరు కాకపోతే మానే.. మానసికంగా శారీరికంగా ఆరోగ్యంగా ఉంటే చాలు భగవంతుడా అనుకున్నాడు. ((((((((((( (((((((((((((( (((((((((((((((((

"అనూషకు బాగాలేదట నాన్నా.. కాలేజీ నుంచి పిల్చుకొచ్చేశారట. నేనూ హిమవర్ష వెళ్ళి చూసొద్దమనుకుంటున్నాం" అంది మధుమిత.

"మళ్ళా ఏమైందమ్మ.. జ్వరమా" అని అడిగాడు హరికృష్న.

"లేదు నాన్న. తన రూమ్మేట్ ఒకమ్మాయి సూయిసైడ్ చేస్కుందని చెప్పాగా. అనూష బాగా డిస్త్రబ్ అయినట్టుంది. ఏదేదో మాట్లాడ్తొందట"

"ఏదేదో అంటే"

"అదే నాన్న.. ఆ ఆమ్మాయి కనిపిస్తోందని .. తనతో మాట్లాడ్తోందని"

"విజువల్ హేలూసినేషన్.. తప్పు తన పేరెంట్‌స్ దేనమ్మా. పిల్లల శక్తి సామర్ధ్యాలు తెల్సుకోకుండానే వాళ్ళపైన మోయలేనంత బాధ్యతని కుదేస్తున్నారు. ఆ బరువుకింద వాళ్ళు నలిగి పోతున్న్నారు."

"దీనికో సొల్యూషన్ లేదా నాన్న?"

"దాని గురించే నేను ఆలోచిస్తున్నానమ్మా. ఇలా ప్రతి క్షణం చదువు చదువు అంటూ పిండి రుబ్బినట్లు రుబ్బే చదువు కాకుండా ఆటలూ, లలిత కళలు నేర్పిస్తూ మానసిక వికాసాన్ని, ఉల్లాసాన్ని, అందిస్తూనే చదువునూ నేర్పిస్తే బావుంటుంది కదా"

"బాగానే ఉంటుంది నాన్న. కానీ చేరదామన్నా అలాంటి స్కూళ్ళూ, కాలేజీలు ఏవి? అంత ధైర్యం చేసి ఎవరు తెరుస్తారు?"

"ఎవరో ఏదో చేస్తే బావుంటుందనై మనం ఎదురుచుస్తూ కూచోవటం మంచిది కాదమ్మా?. మనమే అటువంటి స్కూలో కాలేజినో ఎందుకు పెట్టకూడదు?"

"ఐడియా బావుంది. కాని దానికి కావల్సిన పెట్టుబడి మన దగ్గర ఉండొద్దా?"

"ఇది ఒకరితో అయ్యే పని కాదమ్మా. లైక్ మైండెడ్ పర్సన్‌స్ నలుగురైదుగురు కలవాలి. అప్పుడే సానుకూల పడ్తుంది"

"కాలేజి పెడ్తారు సరే... మీరు ఆడుతు పాడుతు చదివిస్తానంటే ఎవరు చేర్తారు నాన్నా? ఒకవేళ పిల్లలు చేర్తానన్నా పెద్దవాళ్ళు చేర్పించరు"

"నిజమే. ఏ మంచి పనికైనా మొదట ప్రతికూలత ఎదురౌతుంది. దాన్ని తట్టుకుని నిలబడగలిగితే విజయం సాధ్యపడ్తుంది. మొదటి రెండు సంవత్సరాలు కష్టంగా ఉంటుంది. ఒక్కసారి యంసెట్ రిజల్త్స్ వచ్చాక, ఇలా చదివినా కూడా ర్యాంకులు సాధించవచ్చని మనం ప్రూవ్ చేశాక ఇక తిరుగుండదమ్మా"

"చాలా మంచి ఆలోచన నాన్న"

"పిల్లలకు స్పూన్ ఫీడింగ్ చేసి వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీని, ఆలోచనా శక్తిని హరిస్తున్న్నారమ్మ. పచ్చగా కళకళలాడుతూ కనిపించాల్సిన పిల్లల్ని రాతి మొక్కలుగా మార్చేసి ఎదగనీకుండా చేస్తున్నరు. ఎటుచూసినా అడ్డుకోవాలమ్మ. ఇప్పటికే ఆలస్యమైంది" అన్నడతను.

మధుమిత అనూష వాళ్ళింటికెళ్ళేప్పటికే అక్కడ హిమవర్ష ఉంది. వాళ్ళిద్దర్ని చూడగానే మధుమితకు వాళ్ళ నాన్న మాటలు గుర్తోచ్చాయి. తనకు తెల్సిన విరిసిన పూలతలు కాదు వాళ్ళిప్పుడు. రాతి మొక్కలు... ఎంతో అందంగా రంగురంగుల పూలతో పరిమళించాల్సిన ఈ లేత మొక్కల్ని ప్రకృతికి విరుద్ధంగా రంగులేకుండా, మృదు పరిమళం లేకుండా రాళ్ళుగా మార్చిన పాపం ఎవరిది? నూటికి తొంభైకి పైగా మార్కులు తెచ్చుకోవటంలోనే జీవిత సాఫల్యం ఉందని నూరిపోసే తల్లిదండ్రులదా? తమ కాలేజీ ప్రతిభ ఇనుమడించాలని ర్యాంకుల కోసం పిల్లల్ని రాచి రంపాన పెడుతున్న మాష్టార్లదా? అనారోగ్యకరమైన పోటీని పెంచి పోషించి, కాలేజీల్ని కారాగారాల్లా మార్చేసిన కార్పొరేట్ కాలీజీ యాజమాన్యాలదా?

అనూషని ఒకచేత్తో, హిమవర్షని మరో చేత్తో అప్యాంగా చుట్టేస్తూ అనుకుంది మధుమిత.

'నా తండ్రిలా ఆలోచించే తల్లిదండ్రులు అందరికీ ఉంటే ఎంత బావుంటుందో.. అప్పుడీ రాతి వనాలకు బదులుగా అందమైన పూలవనాలే ఉంటాయి '

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)