ఇటు ఇండియా, అటు ఇండియా!
ఈరోజు శుక్రవారం.
సాఫ్ట్ వేర్ డెవెలప్ మెంట్ అంటే మాటలా? గుడ్డు దశనుండి లార్వా దశకు, లార్వా నుండి ప్యూపా దశకు, అటు తర్వాత రంగుల సీతకోకచిలుకగా రూపాంతరం చెందినట్టు సాఫ్ట్ వేర్ కు అంతకంటే ఎక్కువ దశలే ఉంటాయి. అలాగే ఎంతమంది ఎన్ని అహర్నిశలు కష్టపడాలో, చివరగా కల సాకారం కావటానికి! ప్రసవం లో అనుకోకుండా కొన్ని అవాంతరాలు వచ్చినట్టు, ఎంత జాగ్రత్త పడ్డా చివరగా సాఫ్ట్ వేర్ రిలీజ్ చేస్తున్నప్పుడు, అనుకోకుండా కొన్ని ఇబ్బందులు రావచ్చు. దానికి పాశ్చాత్య పరిభాషలో ఓ పేరు కూడా ఉండి, 'మర్ఫీస్ లా' అని. 'ఏదైతే ఎప్పుడైనా తప్పుగా పోగల్గుతుందో, అంతా సవ్యంగా అయిపోయింది అనుకున్నప్పుడే అది మన దురదృష్టవశాత్తు తప్పుగా అవతారమెత్తి కష్టాలు తీసుకొరావచ్చు ' అని ఆ పేరు వెనుకనున్న సారాంశం.
అలాంటి అవాంతరాల్లో మునిగితేలుతున్న తరుణంలో నా డెస్క్ టాప్ మీద ఓ యాహూ మెసెజ్ ప్రత్యక్షమయ్యింది.
'హాల్లో, ఎలా ఉన్నారు?'
మెసెజ్ చూస్తేనేమో, అది వచ్చింది 'ఆకాశరామన్న ' దగ్గర్నుండి.
'ఈ ఆకాశరామన్న ఎవడు? ఇలాంటి ఐడీ ఉన్నవాడు నా బడ్డీలిస్ట్ లో ఎవడూ లేడే?' అనుకొంటుంటే మళ్ళీ ఆ సదరు రామన్నే 'నన్ను గుర్తు పట్టారా?' అన్నాడు.
బుద్ధున్న ఏ తల్లితండ్రులైనా తమ పుత్రరత్నానికి పోయి పోయి 'ఆకాశరామన్న ' అని పేరెట్టుకుంటారా? అదేవన్నా 'రఘురాముడు, కోదండరాముడు ' లాంటి మంచి పేరా గుర్తుపెట్టుకోటానికి. పురాణాల్లో చెప్పినట్టు ద్వాపర, త్రేతా యుగాల్లో 'ఆకాశవాణి ' అనే అదృశ్య గొంతు ఆకాశంలో మేఘాల మాటున దాక్కొని భూమ్మీదున్న వారికి అప్పుడప్పుడు 'జరగబోయే మంచి చెడు విషయాలు ' అనౌన్స్ చేసేది. అది కాస్తా పాపాలు పుట్టలుగా పెరిగి పోతున్న ఈ కలియుగంలో 'పేరు చెప్పకుండా ఇతరుల మీద నీలాప నిందలు మోపేవారికి, సంఘంలో చాడీలు ప్రచారం చేసేవారికి ' వ్యంగ్యం గా 'ఆకాశరామన్న ' గా పేరుపెట్టబడింది.
మరి ఈ ఇంటర్నెట్ లోకంలో ఇతగాడెవడబ్బా అనుకొంటూ 'మీరు ఫలానా తాలూకు...' అంటూ టైపు చేసాను.
'అక్కడే మీరు పప్పులో కాలేసారు ' అంటూ చివరగా నవ్వుముఖాన్ని కూడా టైపు చేసాడు.
మళ్ళీ కొనసాగిస్తూ - 'నేను పోయిన వారం మీకు మీ బే ఏరియాలోని రామా అండ్ కో కిరాణం షాపు వద్ద కలిసాను చూడండి. నేను ఇంద్రలోక డిజైనర్స్ అండ్ బిల్డర్స్ కంపెని హైద్రాబాద్ నుండి ఛాట్ చేస్తున్నాను ' అన్నాడు.
అవును! ఈ మధ్య ఇలాంటివారు ఎక్కడకెళ్ళినా ఎదురౌతున్నారు. మోన్నామధ్య ఒక ఇండియన్ గ్రోసరీ స్టొర్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు పుచ్చులు లేనివి ఏరుతుంటే ఇతగాడు ప్రత్యక్షమైనట్టు గుర్తు.
'హైద్రాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ కు కూతవేటు దూరంలో కొత్త ఇళ్ళు కడుతున్నాము. అన్నీ వేడివేడి సమోసాల్లా అమ్ముడు పోకముందే మీ అమెరికావాళ్ళకు ట్వెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అందులో మరీ స్పెషల్ గా మీకు ప్రత్యేకంగా మరో పదిశాతం తగ్గింపు నా తరఫున రికమెండ్ చేస్తాను. కొంటారా?' అంటూ 'ఆలసించిన ఆశాభంగం, మంచితనం మించిన దొరకదు, నేడే చూడండి, శ్రీ రామా టాకీస్ లో ఏంటీవోని ఆడవిరాముడు ' అంటూ మా ఊళ్ళో బండి మీద చేసే సినిమా అనౌన్స్ మెంట్ తరహలో మెసెజ్ లు పంపించసాగాడు.
ఏమని సమాధానం చెప్పాలి. అసలు నాకు ఈ-మెయిల్ పంపిచకుండా ఇలా మెసెజ్ లు పంపిస్తూ పైపెచ్చున కొంటారా అంటూ నిలదీస్తున్నాడు. ఇదెక్కడి గొడవరా బాబూ? అసలే అమెరికా ఆర్థిక పరిస్థితి వారం రోజులుండి పోయే జలుబులా కాకుండా స్ప్రింగ్ లో వచ్చే సీజనల్ ఎలర్జీలా బాగా పట్టింది.
అయినా ఇంటర్నెట్ పుణ్యమా అని భూగోళానికి ఆవల కూర్చుని ఈవల అమెరికాలోనున్న నాకు ఛాటింగ్ ద్వారా భూమిని అమ్మటానికి ప్రయత్నిస్తున్నాడు. బిజినెస్ చెయ్యటం ఎన్ని కొత్త పుంతలు తొక్కింది.అయినా ఈ మధ్య ఇండియాలో భూముల అమ్మకాలు అమెరికాలో ఎక్కువయ్యాయి.
మైసూరుబోండా మైసూరులోనే వండాలని రూలైతే ఎలాగో లేదో, అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళందరి దగ్గర డాలర్ల కొద్ది ధనం మూల్గదని వీళ్ళకు తెలియదు బాబోలు.
అలా అనుకుంటూ, 'సారీ! ప్రాజెక్ట్ రిలీజ్ తో బిజీగా ఉన్నాను ' అంటూ ఛాటింగ్ మూసేశాను.
ఇంతలో మా టీములో కొత్తగా చేరిన లిండా నా దగ్గరకొచ్చింది. ఆవిడ త్వరలోనే ఇండియా వెళ్ళే అవకాశం కొరకు చకోర పక్షిలా ఎదురుచూస్తున్నది. అందుకే ఎపూడు కలిసినా నాతో ఇండియా ట్రిప్ గురించి తప్పక రెండు మాటలైనా మాట్లాడుతుంది.
'మీ ఇండియాలో ఎవరి ఇంటికైనా వెడితే బయట చెప్పులు వదిలి లోపలికి వెళ్ళాలట కదా! ఇంట్లో తప్పక భోజనం చెయ్యాలట గదా! కొసరి కొసరి వడ్డిస్తారట గదా! వద్దు అంటే కోపం వస్తుందట గదా! చెప్మా చెయ్యకుండా నేనుండే హోటల్ కి ఇండియన్ కొలీగ్స్ వచ్చి తలుపుకొట్టి నన్ను బయటకు తీసుకెళ్ళుతారట గదా!...' మొదలైన ప్రశ్నలను సంధించింది.
అవి ప్రశ్నలు అనకూడదేమో, కామెంట్స్ అనాలేమో! ఎందుకంటే నా సమాధానాల కొరకు ఆవిడ ఎదురు చూడలేదు. చెప్పనివ్వటానికి టైం ఇవ్వలేదు కనుక. ఏంటో ఏమో, లిండా ఇండియా లోకం లిండాది.
ఏపాటు తప్పినా సాపాటు తప్పదు కనుక ఇంటికి వెళుతూ దారి మధ్యలో ఇండియన్ గ్రోసరీ స్టోర్ వద్ద ఆగాను. లోపల పప్పు దినుసుల గురుంచి వెదుకుతుంటే ఓ తెల్ల జంట తారసపడ్డారు. వాళ్ళు కళ్ళంతా పెద్దవి చేసుకొని, నోరంతా వెళ్ళబెట్టుకొని అక్కడ ఉన్న రకరకాల పచ్చళ్ళను, రంగురంగుల మసాల పొళ్ళను ఒకింత ఆశ్చర్యపోతూ, మరింత తికమక పడుతూ ఏం కొనాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. నేను చిరునవ్వుతో హలో చెప్పగానే 'మాకు ఇండియా కర్రీ మసాలా అంటే చాలా ఇష్టం. ఏది కొనుక్కోవాలో, ఎలా వండాలో కాస్తా చెబుతారా?' అంటూ సహాయమర్థించారు.
నాకున్న పాకశాస్త్ర పరిజ్ఞాన పరిధిలో సాంబారు పౌడరు, కందిపప్పు, మునక్కాడలు కొనిపించి సాంబారు ఎలా చేసుకోవాలో టూకీగా చెప్పాను. అలా చెపుతుంటేనే వాళ్ళ నోళ్ళలో లాలాజలం ఊరుతుండడం నాకు స్పష్టంగా కనిపించింది.
బయటికి అడుగెయ్యబోతూ 'దుకాణం బయట చాలా సినిమా పోస్టర్లు అంటించి ఉన్నాయి. ఏ సినిమా బాగుంటుంది చుడటానికి?' అంటూ అడిగారు.
గొప్ప ఇరకాటంలో పడ్డాను. తెలుగు సినిమాల సంగతి 'ఏ రాయైతే ఏంటీ, తల కొట్టుకోటానికి ' లా ఉంది. మరి, మలయాళం సినిమా రికమెండ్ చేద్దామంటే మరేమైనా 'సత్రతిల్ ఒరు రాత్రి ' లాంటి సీన్లు ఉంటే మన పరువు పోదు. పోనీ, తమిళ్ సినిమా వెళ్ళమని చెబుదామంటే - మరి ఆ తమిళ్ తంబుల అతి యాక్షన్ భరించ గల్గుతారా? - అన్న అనుమానమొచ్చింది. ఈ మధ్య అమెరికన్లకు బాలీవుడ్ సినిమాలు, మ్యూజిక్కు, డాన్స్ ఐశ్వర్యారాయ్ వంటి వాళ్ళచే తెలిసొచ్చింది కాబట్టి హిందీ సినిమా రికమెండ్ చేశాను.
'హిప్, హిప్, హుర్రే! సాంబార్ ఫుడ్, అండ్ బాలీవుడ్ సినిమా! ఇట్ ఈజ్ గోఇంగ్ టు బీ యే స్పెషల్ ఫ్రైడే ఈవెనింగ్ ' అంటూ ఆ బాయ్ ఫ్రెండు, గర్ల్ ఫ్రెండ్ చెట్టపట్టాలేసుకొని చేతులూపుకుంటూ బయటికి నడిచారు.
స్టోర్లో నుండి కారు దగ్గరకు వస్తుంటే ఫ్రండు దగ్గరినుండి కాలొచ్చింది. 'రేపు శనివారం ఏం చేస్తున్నావ్? మన సిటీ పార్కులో సమ్మక్క-సారక్క జాతర అమెరికాలోనే మొదటిసారి జరుపుతున్నాం. నువ్వు తప్పక రావాలి సుమా. ఇంకో రెండొందల కాల్స్ చేయాలి. సీ యూ దేర్ ' అంటూ గడగడా చెప్పి ఫోను పెట్టేసాడు.
ఇంటికి డ్రైవ్ చేస్తూ అనుకొన్నాను - ఈ ఆమెరికాలో అటూ, ఇటూ, ఎటూ చూసిన చూసిన ఇండియా నామ స్మరణే, జపమే. మరి మన భారతదేశానికి దిష్టి తగులుతుందేమో!?





























