కోలాటం- సమష్ఠి నృత్యకళ

డా. జోగధేను స్వరూప కృష్ణ గారు కడప జిల్లా, ప్రొద్దటురు ఎస్. సి . ఎన్. అర్. కళాశాల లో తెలుగు శాఖలో రీడర్. నెట్ బ్రౌజింగ్, రేడియొ ప్రసంగాలు, కవితలు రాయడం, వెబ్ డిజైనింగ్ వీరి వ్యాసంగం. యు.జి.సి ఢిల్లి ఆర్థిక సహకారంతో రాయలసీమ జానపద కళారూపలు- సాంఘిక, చారిత్రక నేపథ్యము అన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు. వీరు జానపద కళల గూర్చి విశేషమైన పరిశోధన చేసి కనుమరుగువుతున్న మన జన పథాలలోని కళలను వెలికితీసి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా సుజనరంజని ద్వారా ప్రపంచవ్యాప్త తెలుగువారికి తమ అసలైన సంపదను గురించి తెలియజెప్పే ఊహతో పతినెలా తమ పరిశోధనాత్మక వ్యాసాలను అందిస్తున్నారు. అమూల్యమైన విశేషాలు ప్రతినెలా మీకోసం...


అనాగరక దశలో మానవుడు వేటాడిన తరువాత జంతువులు చిక్కిన సంతోషంతో గెనంతులు వేయడం నృత్యానికి ఆవిర్భావంగా చెప్పవచ్చు. తరువాతి కాలంలో అరిచే శబ్దాలను లయబద్దంచేసి సంగీతాన్ని సృష్టించుకున్నాడు. వీటికి తోడు కొయ్య, చర్మంలను ఉపయోగించుకుని సంగీత ఉపకరణాలను సృష్టించుకున్నాడు. భాషను నేర్చుకుని సాహిత్యాన్ని సృష్టించుకున్నాడు. మానవ పరిణామక్రమంలోని ఆటవికదశలోని గెంతులు, చిందులే కాలక్రమంలో నాట్యం అయ్యాయి.“Nevertheless Primitive dance was the foundation of Folkdance; and Folk dance was the foundation of the refined form” – (Folkdance of India; ProJesh Benarji) ఇట్లాంటి జానపద నృత్యాల్లో భారత దేశమంతటా వ్యాపించిన నృత్య రీతుల్లో కోలాటం ఒకటి.

పాటలతో ముడిపడిఉన్న జానపద సాముహిక ప్రదర్శన కళారూపం కోలాటం. ఇది ఒక వ్యాయామ క్రీడ. శ్రమ చేసి అలసిన దశలో తిరిగి ఉల్లాసాన్ని పొందేందుకు జానపదులు కోలాటాన్ని సాధనంగా సృష్టించుకున్నారు. ఇది బృంద నృత్యం. కోల-ఆట అనే వ్యుత్పత్తి కలిగిన కోలాటం కోలన్న, కోలుకోలన్నలు, కొట్టమాట అనే రూపాంతరాలను కలిగిఉంది. కోల అంటే కర్ర, పుల్ల అని అర్థం.

కోలాటం -చారిత్రక నేపధ్యం:

చరిత్రలో కోలాటానికి సంభందించిన ఆధారాలు క్రీ.శ. 7వ శతాబ్దమ్నుండే ఉన్నాయి. పల్లవుల కాలంలోని మహబలిపురంలోని శల్పాలు క్రీ.శ 630 నుంచి 660 ప్రాంతానికి చెందినవి. వీటిలో కోలాటం వేస్తున్న శిల్పం ఉంది. గుణగ విజయాదిత్యుని కాలంలో(క్రీ. శ 848-891) నిర్మించబడిన భీమేశ్వరాలయంలోని శిల్పాలలో కోలాటం శిల్పం ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించబడిన రామప్ప దేవాలయ కుడ్యాల మీద కోలాట భంగిమలు కనిపిస్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన దేవాలయ కట్టడాల్లో హంపి దేవాలయ కుడ్యం పై కోలాట భంగిమలున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో క్రీ.శ 1509 ప్రాంతానికి చెందిన రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కట్టించిన భోగమంటపం, గోపురం ప్రాకారాల్లోని శిల్పాల్లో కోలాటం వేస్తున్నట్లు శిల్పం ఉంది.

సాహిత్య ఆధారాలు:

జాయపసేనాని నృత్త రత్నావలిలో కోలాటం ప్రసక్తి కనిపిస్తుంది. కానీ ఇది కోల్లాటం అని జాయప సేనాని ప్రస్తావన. 12వ శతాబ్దంలో పాల్కురికి సోమన దేశినృత్యాలను, దేశీ గీతాలను వివరించాడు. పండితారాధ్య చరిత్రలో కోలాటం ప్రసక్తి కనిపిస్తుంది. 13వ శతాబ్ధానికి చెందిన తిక్కన భారతంలో అర్జునుడు నేర్చిన నృత్యాల్లో దండలాసకాన్ని పేర్కొన్నాడు. దండలాసకం అంటే కోలాటమే. 14వ శతాబ్ధానికి చెందిన నాచన సోమన ఉత్తర హరివంశంలో కోలాటం ప్రస్తావించబడింది. అట్లే శ్రీనాధుడు, రఘునాథ రాయలు, కంకంటి పాపరాజు కోలాటన్ని తమ రచనల్లో ప్రస్తావించారు.

చరిత్రకారులు కూడా కోలాటాన్ని ప్రస్తావించారు. కాకతీయుల కాలంలో స్త్రీల క్రీడల్లో కోలాటం ఒకటని సురవరం ప్రతాపరెడ్డి గారు అంధ్రుల సాంఘిక చరిత్రలో పేర్కొన్నారు. విజయనగర రాజుల కాలంలో ఫయాస్ అను యాత్రికుని రచనల ఆధారంగా మహర్నవమి ఉత్సవాల్లో కోలాటం జరిగేదని తెలుస్తోంది.(The Forgotten Empire P. 137) చారిత్రక , సాహిత్య ఆధారాలు పరిశిలిస్తే అంధ్రదేశంలో దాదాపు 7వ శతాబ్ధినాటికే కోలాటం ప్రాచుర్యంలో ఉన్నాట్లు తెలుస్తోంది. కానీ జానపద కళలకు కాలనిర్ణయం చేయడం సాహస కృత్యం. జానపద కళ ఏ కాలంలో ఉద్భవించని చెప్పడానికి ప్రయత్నిచడం గాలిలో రాత వంటిదే. ఎందుకంటే నాగరికుడైన మానవుని కంటే అనాగరికుడైన ఆటవికుడు తన కళా తృష్ణకు మెరుగు పెట్టే దశలో ప్రకృతిని అనుకరించిన దశలో పుట్టిన ఏ జానపద కళ అయినా కాలానికి కట్టుబడి ఉండదు. అట్లే కోలాటం కూడా అతి ప్రాచీనమైనది.

కోలాటం- స్వరూపం:

కోలాటంలో 12 మొదలు 40 మంది దాకా ఆటగాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉన్నా సరి సంఖ్యలో ఉండాలి. ఇద్దరిని కలిపి ఉద్ది అంటారు. ప్రతి కోలాట గుంపుకు ఒక నాయకుడుంటాడు. జట్టు నాయకుని సారధ్యంలో కోలాటం జరుగుతుంది. ప్రతి ఆటగాని చేతిలో మూరెడు పొడవున్న కోలలుంటాయి. ప్రారంభంలో ఆటగాళ్ళంతా వలయంగా ఏర్పడి ప్రర్థనా గేయాన్ని పడుతారు. ప్రార్థనా గీతంలో కోలలతో ఆడరు. జట్టు నాయకుడు ప్రార్థనా గీతాన్ని పడుతుంటే సభ్యులు వంతలు కలుపుతుంటారు. ప్రార్థనా గీతం తరువాత జట్టు నాయకుడు- ఇట్తయ్యాకు తద్దిమి- అని చెప్పి పీక ఊదుతాడు. జట్టులోని ఆటగాళ్ళు సగం మంది రాముళ్ళు, మిగిలిన సగం మంది లక్ష్మణులని అంటారు.

వుద్దులు రెండురకాలు. లోవుద్ది, వెలుద్ది. వలయంలో లోపలి భాగంలో ఉన్నవారు లోవుద్దులని, వలయం వెలుపలి భాగంలో ఉన్నవారు వెలుద్దులని అంటారు. రాముళ్ళంతా లోపలి భాగంలో లో వుద్దులుగా- లక్ష్మణులంతా వెలుపలి భాగంలో వెలుద్దులుగా నిలబడి లయబద్దంగా కోలలు కొడతారు. జట్టు నాయకుడు లయను సరిదిద్దుతాడు. లయను సరిదిద్దడంలో భాగంగా- తక, తక, తక, తక, తయ్యకు తద్దిమి- అని, కోలు, కోలుకోలే, కోలన్న కోలు కోలేయ్, అని లయను సరిదిద్దుతాడు. కోలాటంలో వేసే అడుగులను కోపులంటారు.

జట్టు నాయకుని కోలన్న పంతులని, పెన్నుద్ది అని, ముందు పాటగాడు , అయ్యవారు, మేళగాడు అని అంటారు. జట్టు నాయకుడు ఆటగాళ్ళలో ఎవరు తప్పు చేసినా, తప్పటడుగులు వేసినా, ఆట చెడిపోవడానికి కరకులైనా వారిని మందలించడం, కొరడాతో కొట్టడం వంటి శిక్షలు అమలు చేస్తాడు.

కోలాట కర్రలు:

కోలన్నలు, కోలాట కర్రలు, కోలలు అని పిలువబడే ఇవి కోలాటానికి ప్రాణం. కోల అంటే కార్ర అని అర్థం. ఈ కర్రలు దాదాపు 18 అంగుళాలు పొడవు, 1.5 నుండి 2.5 అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ కర్రలను బిల్లుడు, సండ్ర, రేల, తేకు, ఏగె, దిరిసెన, తుమ్మ, వేప, చింత మొదలయిన కొయ్యలతో తయారు చేస్తారు. కర్రలు అందంగా కనిపించడానికి రంగు రంగుల పట్టెలు వేస్తారు. కర్రకు పిడి వద్ద రేగు పండు పరిమాణంలో ఉండే గజ్జెలు కడతారు. గజ్జెల మధ్య ఎరుపు, ఆకుపచ్చ వూలు దారాలు వేలాడుతుంటాయి. దీనికి పూల కుచ్చాలు కడతారు.
ఎత్తుగడ: జట్టు నాయకుని సారధ్యంలో ఆటగాళ్ళంతా గుండ్రంగా నిలబడి తరువాత ఉద్దులు కడతారు. ఎత్తుగడ ఈ క్రింది విధంగా ఉంటుంది.

జ. నా: వినాయకుడికి

జ. సభ్యు: జై

జ.నా: తిరుపతి వెంకన్నకు

జ. సభ్యు: జై

జ. నా: భారతమాతకు

జ. సభ్యు: జై

జ. నా: గంధీ తాతకు

జ. సభ్యు: జై

తరువాత జట్టులోని ఒక సభ్యుడు: కోలన్న పంతులుకూ

సభ్యులు: జై

తరువాత కోలాటం ప్రార్థనతో మొదలవుతుంది.

ప్రార్థన: (తాలుపు కట్టి కోపు) ( వినాయకుని ప్రార్థన ఇది) గానన్నాయికా ఈశ్వరి గాన నాయికా
రాజామూర్తి మువ్వలింగా గానన్నాయికా గాన
ఇద్ది నీదే బుద్ది నీదే గానన్నాయికా
యిగ్గినేశ్వరుడందురు సామి గానన్నాయికా గాన
సదువు నీదె సాము నేదె గానన్నాయికా
సారస్వతి నీకు దండము గానన్నాయికా గాన

సెలకట్టి కోపులో- శివ ప్రార్థన:

శివ శివ ముర్తివి గననాత
నీవు శివుని కుమారుడవు గననాత
యిద్ది నీదె బుద్ది నీదె గననాత
నిన్ను యిగినేశ్వరుడందురు గననాత
సదువు నీదె సాము నీదె గననాత
సారస్వతి నీకు దండము గననాత
ఉసెత్తు: ఉసెత్తు అంటే వేగం పెంచడం. అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్నది వేగంగా పాటపాడుతూ, పాట కనుగుణంగానే అడుగులు వేగంగా వేస్తూ చేసేది. ఒక్కొక్క కోపులో వరుసగా పాటలు పాడుతూ ఉసెత్తు తరువాత నెమ్మదిగా వేస్తూ మరొక పాటను పడుతూ మరల ఉసెత్తులో ఆడుతూ పాటను అందుకుంటూ ఉంటారు.

ముక్తాయింపు:

ఇట్తయ్యకు తద్ద్మిత్త అనే చరణంతోగాని, కిటకిట తయ్యకు తద్దిమిత్త అనే చరణంతో గాని ఆటను ముగించడం ముక్తాయింపు. ముక్తాయింపు తరువాత మరొక పాటతో ఆట మొదలవుతుంది. కోపులు మారినపుడల్లా కోపు కోపుకి, ఎత్తుగడ, ఉసెత్తు, ముక్తాయింపులుంటాయి.

కోపులు:

కోపు అనే శబ్ధానికి నాట్యము, నాట్యము తీర్పు, నాట్య గతి భేదము, నాట్య గతి విశేషము అనే ఆర్థాలున్నాయి. కోలాటంలోని వివిధ రకాల నాట్య గతి భేధాలను కోపులు అంటారు.

ముఖ్యమైన కోపులు:

ప్రార్థన కోపు, ఉజ్జితిరుగుడు కోపు, వరగత్తెర కోపు, కృష్ణ కోపు, చెలియ కోపు, కంస కోపు, జడకోపు, భారత కోపు, భామకోపు, లాలికోపు, తాలువు కట్టి కోపు, బాలనారి కోపు, నిండు చిత్తరి కోపు, చదరంగం కోపు, సింగారి కోపు, గొబ్బిళ్ళ కోపు, ఎదురు కోపు, చుక్కల కోపు, జంజము కోపు వంటివి ప్రసిద్దమైనవి. వందల కొద్ది కోపులు తెలుగు వారి కోలాటంలో ఉన్నాయి. కోలాటంలో అన్ని కోపులు కాకుండా ఏ నాలుగో ఐదో కోపులతో ఆటను ముగిస్తుంటారు.

రాయలసీమలో కోలాటం:

రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కోలాటం ప్రచురంగా ఉంది. అనంతపురం జిల్లాలో కోలాటాన్ని గురించి ప్రత్యేకంగా పరిశోధన చేసినవారిలో డా. చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు ప్రముఖులు. అనంతపురం జిల్లాలో ప్రతి మండలంలోనూ కోలాట బృందాలున్నాయి. ఈ జిల్లాలోని ముఖ్యమైన కోపులు: తాలుపు కట్టి, సెలకట్టి, నిండుచిత్తారి, వెలుద్ది చిత్తారి, మంగారి, బాలనారి కోపు, వుద్ది తిరుగుడు కోపు, శివి కోపు, ఉయ్యాలకోపు, చదరంగంకోపు, జడకోపు మొదలైనవి. నిండు చిత్తారి కోపులో వేసే ఈ పాటలో అనంతపురం జిల్లాలోని అనేక గ్రామాల పేర్లు తెలుస్తాయి.

చిని పల్లి పెదపల్లి నడుమ నాగులాపురము
పక్కన పాముదుర్తి పైన బీముల కుంట
పాక సదనై పల్లి సొగసైన కొత్త పేట
చిన్నోనడ నెల సిన్నోడ తై తందాన తాన తందానాన
కలికి దుర్గమ్రా పాల్లూరు గొల్లపల్లి పాత చెర్లోపల్లి
ముచ్చాటికి మూడిండ్లు ముశ్టోళ్ళ ముందర

రామ రామ కోదండ రామన్న బైరి రమ రామ కోదండ రామ
రేనిగుంట దొరసాని రేని గుంట దొరసాని
ఇచ్చెనమ్మా దీవెనలు దీవెనలు తీసుకొని
దగ్గున పైకి తీసి అంది అనంతపురం అంది రాము డెల్లినాడు
గుత్తి వుదిరిపి కొండ గుడి కాండ్ల దోసిరో
ఆమిదాల రాకట్లు ఆమడ పొద్దుకు దాసిరా

బూమికే దొడ్డది ముక్క పట్నం సెర్వు
కట్రాల్లు కదిలి చెప్పెన్నా దానికి దొడ్డది
దరమారము చెరువు దండి మరకలు పారెనన్న
వోరన్న దండి మరవలు పారెనన్న

జడకోపులు:

దీన్నే జడకోలాటం అంటారు. అనంతపురం జిల్లాలో జడకోలాటం ప్రసిద్దమైనది. గుండ్రటి చెక్కకు సరిసంఖ్యలో తాళ్ళు కట్టి రకరకాల జడలల్లడం జడ కోలాటం. వీతినే జడకోపులు అంటారు. వీటిళొ అనేక రకాలున్నాయి. మాగయ జడ- పచ్చం జడ- సీతమ్మ జడ- సిక్కిం- సాదా జడ- పట్టెడ- వుట్లు జడ మొదలైనవి ప్రసిద్దమైనవి.

చిత్తూరు జిల్లాలో కోలాటం:

చిత్తూరు జిల్లాను ఆనుకుని వున్న తమిళనాడులో కోలాటం పుట్టుకకు సంబంధించిన ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. పూర్వం బసవాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడని అతన్న్ని జయించలేక పోయే వారని, అతనిని జయించడానికి కొందరు బాలికలు గానం చేస్తూ కోలాట్టం ఆడారని, రాక్షసుడు సంతోషించి తన క్రూరత్వాన్ని విడచిపెట్టాడని అంటారు.

చిత్తూరు జిల్లాలోని కోపులు:

కొలువు కోపు, చిన్న చెలియలి కోపు, పెద్దచెలియలి కోపు, జంజము కోపు, జడకోపు వంటివి ప్రసిద్దమైనవి. చిత్తూరు జిల్లాలో కోలాటం మీద పరిశోధనలు చేసిన వారిలో పేట శ్రీనివసులు రెడ్డి ప్రముఖులు.

సాంఘిక నేపధ్యం:

కోలాటం ఇప్పటి సాంఘిక నేపధ్యంలో ఎంతవరకు ఇముడుతుందో పరిశీలించగలిగితే సమాధానం చాలా నిరాశగా ఉంటుంది. ఆధునిక కాలంలో టి.వి., సినిమాల ప్రభావం వలన దెబ్బతిన్న జానపదకళారూపాల్లో కోలాటం కూడా ఒకటి. కానీ ఆధునిక ప్రసార మాధ్యమాలు కూడా కొంత విలువనిచ్చి కోలాటాన్ని కాపాడుతున్నాయి. జాతరలు, పండుగల సంధర్భాల్లో కోలాటంలో కోలాటం పాటలకు బదులుగా సినిమాపాటలు పాడుతున్నా డశ కనిపిస్తోంది. జానపదత్వం కోలుపోయి అతి నాగరికతకు చేరువవుతున్న మానవునికి కోలాటం చాలా దూరమవుతోంది అన్న వాస్తవానికి ఇది నిదర్శనం.
ఆధార గ్రంధాలు:
1. జానపద నృత్యకళ: డా. చి. కృష్ణారెడ్డి
2. చిత్తూరు జిల్లలో కోలాటం. డా. పేట శ్రీనివాసులు
3. జానపద కళాసంపద
4. పల్నాటి సీమలో కోలాటం: డా. బి. వెంకటేశ్వరులు.
5. Traditions of Indian Folk Art
6. The Forgotten Empire
7. Traditions of Indian Folk Dances, Kapila Vatshyayan

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)