అనిరుధ్ కంప్యూటర్ స్క్రీనుకేసే చాలా సేపటినుంచి తదేకంగా చూస్తున్నాడు … అది ఒక కంపెనీ యొక్క స్టాక్ ఛార్టు .. రియల్ టైములో అంకెలు మారుతూ వున్నాయి. అది ఒక అంతర్జాతీయంగా చాలా పేరొందిన ఫైనాన్షియల్ సెర్వీసెస్ కంపెనీ. చాలా ఇంటెరెస్టింగా వుంది స్టాక్ పేటెర్న్. అనిరుధ్ చాలా కాలంగా ఈ కంపెనీ స్టాకుని గమనిస్తున్నాడు. సరైన సమయం చూసి కొందామని. త్వరలోనే తను అనుకున్న ధరకి వచ్చేటట్టుగా వుంది. అప్పుడు కొనాలి.. చాలా కొనాలి .. దీంట్లో చాలా డబ్బులు చేసుకోవాలి…సీరియస్ మనీ చేసుకోవాలి..
అనిరుధ్ స్వతహాగా కొంచెం ఎక్కువగా ఆత్మవిశ్వాసం వున్న వ్యక్తి. అది అప్పుడప్పుడు హద్దులు దాటి అహంకారపు చాయలు కూడా కనిపిస్తూ వుంటాయి. స్నేహితులతో వారాంతాల్లో జరుపుకునే పార్టీల్లో తనకు స్టాకులని అదను చూసి సరైన సమయంలో కొనడంలో వున్న చాకచక్యం గురించి చాలా ఆశక్తికరంగా వర్ణించి కధలు చెబుతాడు. ఆ కధలు చెప్పడంలో ఆత్మవిశ్వాసంతో పాటు కాస్తంత స్వోత్కర్ష కుడాను చోటుచేసుకుంటూ వుంటుంది. ఆ డాంబికం చూసి కొంత మంది దూరంగా వున్నా అతను చెప్పే స్టాక్ టిప్పుల గురించి, కంపెనీల ఆర్ధిక పరిస్థితి, స్టాకు ఛార్టులగురించి చేసే విశ్లేషణా ఆశక్తికరంగా వుండడం వలన, వింటూ వుంటారు. ఆ సంగతి అనిరుధ్ గమనించాడు కూడానూ.
ప్రస్తుతానికి కొంచెం అస్థిమితంగా వుంది అతని పరిస్థితి. చాలా మంచి కంపెనీలు అని బాగా ఎంచీ, గణించి రెండు గొప్ప ఫైనాన్సు సెర్వీసెస్ కంపెనీల స్టాకులు కొన్నాడు. అవి గోల్డ్మన్ సాక్స్, లీమన్ బ్రదర్సూ. కానీ మార్కెట్ అంతా కింద పడీ వుండటంతో, మంచి కంపెనీలైనా తాను కొన్న కంపెనీల షేరు ధర కూడా పడిపోయాయి. అవి పైకి వస్తాయని తెలుసును కానీ ఎంత కాలంలో అన్నదే ప్రశక్తి. అందుకని అస్థిమితంగా వుంది అనిరుధ్ కి.
మార్చ్ 7, 2008 శుక్రవారం: తను గమనిస్తున్న కంపెనీ షేరు ధర 70 డాలర్లు. ఇదే కంపెనీ క్రితం ఏడాది జనవరిలో నూటా డెభ్భై వుంది. ఇప్పుడు, డెబ్బై కి వస్తోంది. నిజానికి ఆ కంపెనీకి చాలా అపఖ్యాతి తెచ్చే వార్తలు వచ్చాయి. ఆ కంపెనీ నడుపుతున్న రెండు హెడ్జ్ ఫండ్ లు దివాళా తీసాయి, కంపెనీకి హౌసింగ్ మార్టుగేజ్ విభాగంలో అత్యంత నష్టాలు వచ్చాయి.. అవన్నీ అలా వున్నా, ఈ కంపెనీ అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పేద్ద కంపెనీ, ఇంత కంటే ధర ఇంకా కిందకి పడే చాన్సులు తక్కువ అని అనిరుధ్ ధృడ నమ్మకం. పాతిక సంవత్సరాలుగా బిజినెస్ లో వుంది ఈ కంపెని.. అల్లాటప్పా కంపెనీ కాదు.
ఆ వారాంతంలో భార్యతో చెప్పాడు.. చూడు, ఈ కంపెనీ క్రితం ఏడాది 170 వుండేది, ఇప్పుడు 70కి వస్తోంది కొనడం మంచిది, వచ్చే వారంలో కొంటాను అని.
క్రితం ఏడాది బాగా వచ్చిన లాభాలూ, సేవింగ్సు లోనూ చెకింగ్ అకౌంట్లోనూ వున్నవి అన్నీ బ్రోకెరేజ్ అకౌంట్లో కి మార్చేశాడు. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్లోవీ, అన్నింటిలోనూ వున్న డబ్బంతా తీసి, గోతి దగ్గిర నక్కలాగ, ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తూ వున్నాడు అనిరుధ్.
అతను చెప్పినట్టుగానే అవతలి వారం షేరు ధర పడుతూ లేస్తూండడం జరిగింది. అంతా చూస్తూనే వున్నాడు, ఎప్పుడు సమయం వస్తుందా అని. మొదటి మూడు రోజులూ .. రోజంతా 67-70కి మధ్యలో వూగినా చివరికి 62 కి క్లోస్ అయ్యింది. లక్ష్మి వారం నాడు కొందాము అనుకుంటూండగా 57కి వెళ్ళింది.. … ఆల్మోస్ట్ కొనేయబోయాడు.
మార్చ్ 14, 2008, శుక్రవారం: మధ్యాహ్నం లంచ్ టైము వరకూ చూశాడు, 50 ల్లో వుంది… సడెన్ గా 30 డాలర్లుకి పడింది. అనుకున్న దానికంటే చాలా తక్కువ ధరకి వస్తోంది. ఇంక ఇవ్వాళ కొనేయాలి, మళ్ళీ ఈ అవకాశం రాదు. ఇంత తక్కువ పడిందీ అంటే ఇది ఖచ్చితంగా టేక్ ఓవర్ కేండిడేటే. లిమిట్ ఆర్డరు పెట్టాడు.. 27 డాలర్లుకి దొరికింది… కొనేశాడు…. మామూలు షేరులు కాదు.. ఆప్షన్సు.. కాల్ ఆప్షన్సు. కాల్ ఆప్షన్సు అంటే అది ఒక కాంట్రాక్టు – ఫలానా రోజు లోపల ఫలానా ధరకి కొనడానికి హక్కులు. ఆ హక్కులు మనం కొన్నందుకు కొంత ఖరీదు చెల్లించాలి. అది ఆప్షను ఖరీదు అన్నమాట. ఆప్షను యొక్క వివరాల్ని బట్టి, షేరు ధర 30 డాలర్లు వున్నా ఈ ఆప్షన్సు ధర ఏ అయిదో ఆరో వుంటుంది. మామూలు షేరు ధర కనుక, ఉదాహరణకి, పది డాలర్లు పెరిగితే తన ఆప్షన్సు ఒక 50 శాతం పైగా పెరిగే అవకాశం వుంది.
ఈ సారి, అనిరుధ్ కి తన స్టాక్ మార్కెట్ ప్రతిభ మీద ఎంత నమ్మకం వుందంటే…అతను పెట్టిన మొత్తం పెట్టుబడి .. వెయ్యి కాల్ షార్ట్ టెర్మ్ కాల్ ఆప్షన్సు, స్ట్రైక్ ప్రైస్ 35, ఎక్ష్పైరీ డేట్ జూన్ 20008 .. ఒక్కొక్కటీ 8.5 డాలర్లు చొప్పున .. 850 వేల డాలర్లు! అతని ఎంటైర్ లైఫ్ సేవింగ్స్! ఒక్క సారిగా మల్టై మిలియనైర్ అయిపోవచ్చని .. నమ్మకం .. చాలా నమ్మకం!
అతను కొన్న తరవాత మెల్లిగా పైకి రావడం మొదలుపెట్టి 30 కి క్లోజ్ అయ్యింది. హమ్మయ్య అని గట్టిగా వూపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వస్తూ దారిలో పిల్లల కోసమని టైంస్క్వేర్ దగ్గర వున్న గొడైవా షాపులో ఆగి, వైట్ చాక్లెట్స్ కొన్నాడు. మనసులో మారుమూల ఎక్కడో చిన్ని శంక వుంది కానీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమని హుషారుగా ఈల వేసుకుంటూ బయలు దేరాడు. మార్చిలో న్యూ యార్కు, మేన్ హాటన్ లో, టైం స్క్వేరు లో చల్లటి గాలి ముఖానికి కొడ్తుంది. పెద్ద పెద్ద బిల్డింగుల మధ్యలోంచి టన్నెలింగు ఎఫెక్టు వలన ఈదురు గాలి వీస్తుంది. వాహనాలు, టూరిష్టుల రద్దీ దాటుకుంటూ పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ కి నడుచుకుంటూ వచ్చి బస్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళడానికి. న్యూ యార్కులో పని, న్యూజెర్సీలో ఇల్లు.
ఆ మరునాడు, శనివారం స్నేహితుడి ఇంటిలో పార్టీ. యధాప్రకారంగా బియర్లూ, పకోడీలూ, బేస్ మెంటులో బిగ్ స్క్రీన్ టీవీమీద ఫుట్బాల్ గేం చూడ్డం. మధ్య మధ్యలో రాజకీయాలు, స్టాకు మార్కెట్టూ, పడుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్.. వీటి గురించి కబుర్లు. ఇలాంటి వాతావరణంలో అనిరుధ్ చాలా నేచురల్ కలిసిపోతాడు.
ఆనిరుధే మొదలు పెట్టాడు స్టాక్ మార్కెట్ టాపిక్ – “Did you guys see the market today?” ఎవరో అందుకున్నారు, “yes, man it is so volatile “ అని.
ఇంతలో ఎవరో అడిగారు, “ఏంటి గురూ కొత్తగా ఏం కొన్నావు?” అని.
అడగడం తరువాయి, “ఒకటి కొన్నాను .. చాలా కాలం నుంచీ చూస్తూ, మంచి ధర కోసం ఆగాను..చివరకి కొన్నా …”
“ ఏంటి ఆ కంపెనీ? మాక్కూడా చెప్పు .. ఈజ్ ఇట్ గూడ్ టైం టు బై?” అని అడిగిన వాళ్ళకి … ఎప్పుడూ లాగానే అందరినీ వూరించీ, డ్రెమటైజ్ చేసి, ఆశక్తికరంగా కధలు చెప్పాడు. ఎలాగ రోజు మధ్యలో అతి తక్కువ ధరలో కొన్నాడో..
ఇంతలో ఎవరో అడిగారు “ఇంతకీ కంపెనీ పేరేంటి గురూ, స్టాక్ సింబల్ ఏమిటి?” అని.
అప్పుడు చెప్పాడు గర్వంగా అనిరుధ్ … “బేర్ స్టెర్న్స్!”
“వ్వాట్, అర్యూ క్రేజీ?” ఎవరో అన్నారు. “ఇట్ ఇజ్ ఎ సింకింగ్ షిప్, మేన్” అని.
చివుక్కున తగిలింది, ఎక్కడో బాణం. ఇంతలోనే డాంబికం తెచ్చుకుని, “వారెన్ బఫ్ఫెట్ ఏమన్నాడు, buy when there is blood on the streets, sell when there is celebration. ఇప్పుడు మార్కెట్ బాగులేదు, అందరూ అమ్మేస్తున్నారు. అందుకనే మనం కొనాలి. ఇప్పుడే చెబుతున్నాను చూస్తూ వుండండి, ఈ కంపెనీని ఎవరో కొనేస్తారు. కనీసం 50 దాలర్లకి”.
క్రితం ఏడాది తాను చైనీస్ సోలా కంపెనీల స్టాకుల్లో ఎలా లాభాలు చేసుకున్నాడో చెబుతూంటే కొంత మంది ఈర్ష్యతో చూడ్డం గమనించాడు. ఆ థ్రిల్ ఆల్కహాలు కంటే ఎక్కువ కిక్ ఇస్తుంది అనిరుధ్ కి.
పార్టీ అయిన తరవాత ఇంటికి వెళుతూ భార్య సుమతితో చెప్పాడు ఏమిటి కొన్నాడో. సుమతికి స్టాక్ మార్కెట్ గురించి అంతగా తెలియదు. తన భర్త అస్తమానూ ఆ స్టాక్ మార్కెట్లోనే కాలం గడపడం, ఎన్నో కబుర్లు చెబుతూ వుండడంతో, ఆ కొన్న కంపెనీ పేర్లుతో పరిచయం తప్ప అంతకంటే ఇంకేమీ తెలీదు. కానీ, తన భర్త అందులో మునిగి తేలుతూ పిల్లలిద్దరినీ ఆశ్రద్ధ చేయడం మాత్రం నచ్చేది కాదు. చాలా సార్లు చెప్పింది, కానీ అనిరుధ్ చాలా డామినేటింగ్ స్వభావం వున్నవాడు, సుమతి స్వతహాగా మెత్తనైనది. పోన్లే తన భర్త ఏవో గొప్ప సాదిస్తున్నాడు కదా అని సరిపెట్టుకుంది. ఇంట్లో పనులూ, పిల్లల పనులూ అన్నీ సుమతే చూసుకుంటుంది. సెలవ రోజున కూడా, అనిరుధ్, ఆ వాల్ స్ట్రీట్ జర్నలూ, IBD, బేరన్సూ, ఇంకా ఎవో న్యూస్ లెటర్స్ చదువుతూ cnbc TV చూస్తూ వింటాడు. పిల్లలతో అస్సలు ఆడ్డం మానేశాడు. అది సుమతికి కొంచెం బాధగా వుంటోంది.
మరునాడు ఆదివారం, సాయంత్ర, అనిరుధ్ సర్క్యూట్ సిటీ షాపు లో సోనీ 52 ఇంచెస్ HDTV కొందామని చూస్తున్నాడు. ఇంతలో భార్య సుమతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది..
“నిన్న మీరు చెప్పిన కంపెనీ గురించి స్పెషల్ న్యూస్ ఏదో చెబుతున్నారండీ టీవీలో” అని.
“ఏమిటిట” అని చాలా యధాలాపంగా అడిగాడు అనిరుధ్.
“ఏదో జే.పీ మోర్గన్ అన్న కంపెనీ ఒకటి మీ కంపెనీ బేర్ స్టెర్న్స్ ని కొనేసిందిట”
“ఫేంటాస్టిక్!” అని గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల షాపులో వాళ్ళందరూ అదిరిపడి చూసారు. సారీ అని చెప్పి బయటకు వచ్చాడు.
“వావ్, నే చెప్పలా, ఎవరో కొంటారు త్వరలో, అని?” తను కొన్న ఒక్క రోజులో, అందులోనూ ఆదివారం డీల్ అనౌన్స్ చేశారంటే రేపే తన ఆప్షన్సు అన్నీ బ్రహ్మాండమైన ధరకి అమ్మేసేయ వచ్చు అనుకున్నాడు.
“జే.పీ మోర్గన్ ఎంతకి కొంటోందో చెప్పారా?” అని అడిగాడు.
“లేదు ఇంకా చెప్పలేదు … అనుకుంటా”
“ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను” అని ఫోను పెట్టేసి, వెంటనే బయలు దేరాడు, షాపు నుంచి. కారులో జోరుగా ఇంటికి వచ్చి వెంటనే టీవీ ఆన్ చేసి, లేప్ టాప్ కంప్యూటర్ తెచ్చుకుని వచ్చి ధీమాగా రిక్లైనర్ కుర్చీలో కూర్చున్నాడు.
టీవీలో స్పెషల్ న్యూస్ ఐటెం, ఫెడరల్ రిజర్వ్ బేంక్ అధికారులు, ప్రెసిడెంట్ బుష్ తో కలిసీ, మునుపెన్నడూ జరగని విధంగా, ఆదివారం నాడు ఎమెర్జెన్సీ మీటింగ్ పెట్టి ఒక పెద్ద నిర్ణయం తీసుకుని, బేంక్ ఒవర్నైట్ లెండింగ్ రేట్లు తగ్గించారు! లేక పోతే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిపోయే ప్రమాదం వుందని. ఈ సబ్ ప్రైం లెండింగ్ సమస్య దేశ ఆర్ధిక పరిస్థితిని, బేంకింగ్ వ్యవస్థని పడదోస్తోంది.
రిజర్వ్ బేంక్, జే.పీ మోర్గన్ కి బేర్ స్టెర్న్స్ కంపెనీని కొనడానికి మద్దతు ఇచ్చిందిట…. జే.పీ మోర్గన్ బేర్ స్టెర్న్స్ ని కొన్న ఖరీదు … 2 డాలర్స్ పెర్ షేర్! కేవలమూ రెండు డాలర్లు! ఘోరంగా అన్యాయంగా ముష్టి రెండు డాలర్లు..ఒక వారం క్రిందట అది 10 బిలియన్ డాలర్ల విలువగల కంపెనీ. ఇవ్వాళ దాన్ని 236 మిలియన్లకి కొంది!
“వ్వాట్!?” పక్కలో స్కడ్ మిస్సైల్ పడ్డట్టు అదిరి పడ్డాడు. “2 డాలర్స్, వాట్ థ ఫ…” గట్టిగా అరిచాడు. పిల్లలిద్దరూ అదిరి పడ్డారు. మేడ మీద బాత్రూం లో వున్న సుమతి ఆ కేకకి అదిరిపడి, గబ గబా కిందకి వచ్చేసరికి …అనిరుధ్ నెత్తి మీద తల పెట్టుకుని జుట్టు పీక్కుని, రెక్లైనెర్కీ జార్ల బడి, కింద నేల మీద కూర్చుని వున్నాడు. తెన్షంకి అతని ముఖంలో నరాలు బద్దలయిపోయేలా వున్నాయి.
“ఏమండి” కంగారుగా భర్త దగ్గరికి వచ్చింది సుమతి.
అనిరుధ్ కి జీవితం తల్ల కిందులైపోయింది. సంపదంతా అకస్మాత్తుగా ఆవిరైపోయింది.. కట్టుకున్న పేక మేడలు ప్రభంజనానికి కూలిపోవడం కాదు… చిన్నా భిన్నం అయిపోయాయి. ఒక్క వారం రోజుల సమయంలో ఎవెరెస్టు శిఖరమ్మీదనుండి, అధహ్పాతాళంలోకి పడిపోయినట్టయ్యింది.. అంత గభీరంగా, దర్పంగా వుండే అనిరుధ్… ఆక్రోశించాడు.
“చాలా పెద్ద మొత్తం పెట్టాను సుమతీ. మనం ఈ సారి చాలా డబ్బులు చేసుకుంటాము అని నాకున్న చాలా గట్టి నమ్మకంతోనే పెట్టాను. ఇంతవరకూ నా టైమింగ్ ఎప్పుడూ రాంగ్ అవలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న నష్టాలు వచ్చాయి కానీ, నథింగ్ లైక్ థిస్.. ఇప్పుడు, ఓ మై గాడ్ .. అంతా పోయింది.. ఇంత తక్కువ సమయంలో వున్న డబ్బంతా ఇలా నాశనమైపోతుందని వూహించ లేదు సుమతీ. నన్ను క్షమించు..we lost everything.. నేను ఇంక బతకలేను…”
గబుక్కున నోరు మూసేసింది సుమతి. భర్తని గట్టిగా కౌగలించుకుని కాసేపయ్యాక మెల్లిగా … “పరవాలేదు, నేను, ఫూడ్ టౌన్ గ్రోసెరీ షాపులో చెకౌట్ కౌంటెర్లో వుద్యోగంకి అప్ప్లై చేస్తానండి” పాపం చాలా సిన్సియర్ గా చెప్పింది. అనిరుధ్ కళ్ళల్లోంచి కన్నీరు రక్తమై ప్రవహించింది. భార్య మీద ప్రేమ గుండెలోతుల్లోంచి పెల్లుబికింది.
** ** **
కొన్ని రోజులయ్యాక మెల్లిగా అనిరుధ్ తో .. ఎన్నాళ్ళనుంచో తను చెబుదామనుకుంటున్న మాటలు చెప్పింది..ఇన్నాళ్ళూ చెప్పడనికి ఆస్కారంలేని తన మనసులో భావాలని …అతి సిన్సియర్ గా చెప్పింది.
“ఏమండీ, డబ్బు పోయిందని బెంగ పడొద్దు. బుజ్జి మేకల్లాంటి మన పిల్లలతో సమయం గడపలేక పోతున్నారు మీరు. వాళ్ళతో ఆనందంగా గడిపిన సమయమే నిజంగా జీవించిన క్షణాలండీ. మీరు మన కోసమే డబ్బు సంపాదన కోసమని కష్ట పడారు..కాదనను. కానీ, మీరు అలాగ బిజీ అయిపోయి..ఎన్నో మధురమైన క్షణాలు కోల్పోతున్నారు. మన చంటివాడు రోజుకీ ఓ కొత్త విద్య నేర్చుకుంటున్నాడు. బోల్డన్ని విశేషాలు మీతో చెప్పడానికి ఉత్సాహంగా, అమాయకంగా మీ దగ్గరకి వస్తున్నాడు. మీరు మీధ్యాసలో వుండి, వాడి ముద్దు అల్లరి చూడ్డం లేదు. మళ్ళీ వాడి ముద్దు అల్లరి చూసే రోజులు రావండీ.. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చును ..కానీ మన పిల్లల పసితనం సరదాగా గడిపే సమయమూ… అవకాశమూ జీవితంలో మళ్ళీ రాదండీ... సమయాన్ని సంపాదించలేము.. అది చాలా విలువైంది…”
అనిరుధ్ కంప్యూటర్ స్క్రీనుకేసే చాలా సేపటినుంచి తదేకంగా చూస్తున్నాడు … ఫొటోలో వున్న చంటివాడి బుగ్గ మీద సొట్ట ఎంత అందంగా వుందో.. అంతా వాళ్ళ్ అమ్మ పోలికే… వెంటనే సుమతినీ చంటివాణ్ణీ చూడాలని కోరిక పెరిగిపోయింది.. ఆఫీసులోనుండి బేగ్ తీసుకుని ఇంటికి బయలు దేరాడు..





























