ఆంగ్ల మూలం: Pulitzer బహుమతి గ్రహీత, ఝుంపాలాహిరి
INTERPRETER OF MALADIES నుండీ
పెద్ద కథ- రెండవ భాగం
మొదటి భాగానికై ఈ లంకెను అనుసరించండి
రిక్షా అబ్బికి డబ్బులిచ్చి పంపించేశాక, దలాల్ బోరీమా కలిసి రిక్షాలోంచి దింపిన పింగాణీ బేసిన్లు మూడవ అంతస్థులో ఉన్న దలాల్ ఇంటికి మోసుకెళ్ళడం మొదలుపెట్టారు.
పని పూర్తి అయ్యాక దలాల్, తానింక ప్లంబింగ్ హోల్‌సేల్ షాపులో ఫైళ్ళు చూసే ఉద్యోగి మాత్రమే కాడని, భార్యకు, బోరీమాకు మాత్రమే కాకుండా, కుతూహలం పట్టలేక చూడవచ్చిన ఇరుగు-పొరుగుల వారికి కూడా ఎలుగెత్తి చెప్పాడు.
దలాల్ పనిచేస్తున్న షాపు యజమానికి మంచి లాభాలువస్తున్నాయి. షాపులో ఒత్తిడి ఎక్కువైపోయి అమ్మకాలు జరగడం చాలా కష్టంగా ఉంది. ఊపిరి పీల్చుకునేందుకు కూడా వ్యవధి ఉండటం లేదు. అందుకని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కాలేజి వీధిలో మరోషాపు తెరవాలనుకున్నడు. దలాల్ చాలా ఏళ్ళుగా యజమానికి విశ్వాసంతో పనిచేసింది వృధా కాలేదు. అతడు దలాల్‌నే కొత్త షాపుకి మెనేజరుగా వేస్తానని మాట ఇచ్చాడు. ఆ సంతోషంలో దలాల్ ఇంటికి వస్తూ రెండు వాష్‌బేసిన్లు ఇంటికి తీసుకువచ్చాడు - అదీ సంగతి.
"రెండు గదుల వాటాలో కాపురముంటూ రెండు వాష్ బేసిన్లు మనమేం చేసుకోవాలి" అంటూ భర్తను నిలదీసింది దలాల్ భార్య.
అప్పటికే వాన మూలంగా నష్టపోయిన నిమ్మబద్దల్ని తల్చుకు బాధపడుతూ ఉంది. రగిలే మనసును నెమ్మది పరచుకోడానికి ఎవరో ఒకరిమీద విరుచుకుపడడం తప్పనిసరి అయ్యింది ఆమెకు.
"నా బ్రతుక్కి నేనింకా కిరసనాయిలు స్టౌ మీదనే వంట చేస్తున్నానని నేనెవరితో చెప్పుకోను? ఫోన్‌కి అప్లికేషను పడేయమన్నా వినిపించుకోవు. మనకు పెళ్ళైన కొత్తలో నాకో ఫ్రిజ్ కొంటానని మాట ఇచ్చావు కానీ ఇప్పటికింకా ఆ మాట నిలబెట్టుకోలేదు. ఈ రెండు బేసిన్లతో ఆ లోట్లన్నీ ఏకంగా తీరిపోతాయనా తెచ్చావు?"
ఆమె మాటను ఖండిస్తూ అతడేదో చెప్పాడు. ఆమె మరి నాలుగంది. వాదోపవాదాలు పెరగడంతో గొంతుకలూ పెరిగాయి. ఆ కంఠాలు నేలబారుగా ఉన్న పోస్ట్ డబ్బా దాకా వినిపించాయి. రెండవ సారి మెట్లను సుభ్రం చేస్తూ బోరీమా కూడా అంతా వింది. అందుకనే ఆమె ఆరోజున తను పడ్డ కష్టాలను కానీ, తాననుభవించిన సుఖాల్ని గాని తల్చుకోలేదు. ఆ రాత్రి కూడా ఆమె పేపర్లు పరుచుకునే పడుకుంది.
భార్యాభర్తల మధ్య అవిశ్రామతంగా సగిన వాదోపవాదాల పర్యవసానం ఏమోగని మరునాదు తెల్లారి పొద్దెక్కేసరికల్లా పనివాళ్ళు వచ్చికూర్చున్నారు ఆ బేసిన్లు అమర్చిపోవడానికి. రాత్రంతా ఆలోచించిన దలాల్ చివరకు ఒక నిర్ణయానికి రాగలిగాడు. ఒక బేసిను తనుంతున్న ఇంట్లోను, రెండవదాన్ని తొలి అంతస్థులో మెట్లపక్కనా అమర్చడం చాలా బాగుంటుంది అనుకున్నాడు. అలా అందరికీ ఉపయొగపడుతుంది అనుకున్నాడు. వెంటనే ప్రతిగుమ్మం దగ్గరా నిలబడి ఆ విషయం చెప్పి వాళ్ళ అనుమతి కోరాదు. ఆ మేడలో అద్దెకుంటున్న వాళ్ళంతా చాలా సంతోషించారు. ఇకనుండీ చెంబుతో నీళ్ళు తీసుకుని పళ్ళుతోముకునే కష్టం తప్పుతున్నందుకు దలాల్ని అభినందించారు.
"మెట్లపక్కన కామన్ ప్లేసులో ఉన్న బేసిన్ జనాన్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ఇప్పుడు నేనొక కంపెనీ మేనేజర్ని కదా. ఏమో! భవిష్యత్తులో ఎంతో అభివృధ్ధిలోకి రావచ్చునేమో . ఎవరికి తెలుసు. అలాంటప్పుడు ఏ గొప్ప వ్యక్తో నా ఇంటికి వచ్చి చూస్తే ఎంతో గొప్పగా ఉంటంది" అని అనుకుంటూ తనలో తానే సంతోషించాడు దలాల్.
పనివాళ్ళు చాలా గంటలు పనిచేశారు. మెట్లమీదకీ కిందకీ పరుగులుపెట్టారు. వాళ్ళు తెచ్చుకున్న తిఫిన్ బాక్సులు మెట్లమీద పెట్టుకున్నారు. సుత్తితో కొట్టి చప్పుడు చేశారు. గట్టిగా కేకలు పెట్టినట్లుగా అరిచి మాట్లాడుకున్నారు. అక్కడే ఉమ్ములు వేశారు. చుట్టలూ, బీడీలు కాల్చారు. మొత్తానికి వాళ్ళు చేస్తున్న హడావిడికి బోరీమాకు ఆరోజు మెట్లు తుడవడానికి వీలు కుదరలేదు. ఇక ఆమెకు పొద్దు గడవకపోవడంతో ఆమె నెమ్మదిగా డాబా మీదకు వెళ్ళి పైన బొంతలో పనికివచ్చే భాగాలు ఏమైనా ఉన్నాయేమో ఛుసి వాటిని చింపి దాచింది.
సాయంత్రమైనాక పగలంతా జరిగిన పనిని చూడడానికి ఆ మేడలో కాపురమున్న వాళ్ళందరూ వచ్చారు. అందరూ కలిసి బోరీమాను కూడా ఆ బేసినులో కడుక్కోమన్నారు. వెంటనే బోరీమా, " మా రోజుల్లో స్నానానికి పెట్టిన నీళ్ళల్లో పూలరేకులు, సెంట్లు వేసేవారు. నువ్వు నమ్మూ, నమ్మకపో! అది ఎటువంటి వైభోగమంటే - అది నీకు కలగా కూడా రాదు తెలుసా" అంది ప్రగల్భంగా.
దలాల్ గారు ఆ బేసిన్ ని ఎలా ఉపయోగించాలో అందరికీ చూపించాడు. ఒక్క సీల తిప్పితే నీల్లు నింపడం. ఆపడం. పట్టి ఉంచడం ఇలా అన్నీ ప్రదర్శించాడు గొప్పగా.
"అధుతంగా ఉంది కదూ" అని అడిగాడు అంతా పూర్తిచేశాక అందర్నీ.
"అవును. ఇది మారిపోయిన కాలానికి ఒక బండగుర్తు కదూ" అన్నాడు ముసలి చటర్జీ బాల్కనీలోంచి తొంగి చూస్తే.
కొన్ని రోజులు గడిచేశరికి నెమ్మదిగా ఆడవాళ్ళలో చిరాకులు పుట్టి క్రమంగా అవి పెరగడం మొదలయ్యింది. పొద్దున్నే పళ్ళుతోముకునేందుకు బేసిన్ ముందు క్యూలో నిలబడటం, పళ్ళుతోముకున్నాక బేసిన్ శుభ్రం చేసి తరువాతి వాళ్ళకి అందించడం, వాళ్ళ వాళ్ళ వస్తువులు అక్కడ విడిచిపెట్టడనికి లేకపోవడం చాలా మందికి నచ్చలేదు.
"దలాల్ ఇంట్లో స్వంత బేసిన్ ఉంది. మనం మాత్రం ఈ ఒక్కదాన్నే అందరం పంచుకుని వాడుకోవలసి వస్తోంది. ఖర్మ!" అనుకునేవారు చాటున.
వాళ్ళల్లో ఒకామె పైకే అనేసింది. "పెద్దగొప్ప! దలాల్ గారు ఒక్కరేనేమిటి ఈ ఇంటికి సౌకర్యాలు పెంచేది! ఆ పాటి మనమూ చెయ్యగలం" అంటూ నిష్టూరంగా మాట్లాడింది. నెమ్మదిగా గుసగుసలు మొదలయ్యాయి.
బేసిన్లు తెచ్చిన నేరానికి భార్యను ఓదార్పుగా ఉంచడం కోసం దలాల్ గారు ఆమె చెప్పినవన్నీ కొనాల్సి వచ్చింది. రెండు కిలోల ఆవనూనె, ఒక కాశ్మీర్ శాలువ, ఒక డజను శాండల్ సబ్బులు కొనాల్సి వచ్చింది.టెలిఫోన్ కనెక్షన్ కోసం అప్లికేషన్ వేయల్సి వచ్చింది. ఇది చాలదన్నట్లు ఒకరోజు ఉదయమే హౌరా స్టేషన్ కి వెళ్ళేందుకని టాక్సీ ఒకటి గుమ్మంలోకంటా వచ్చి గేటు ముందర ఆగింది.
అందంగా ముస్తాబై మేడ దిగి వచ్చింది దలాల్ భార్య. ఆమె బోరీమా ఉన్నచోటికి వచ్చి, "బోరీమా! నేనేం మర్చిపోలేదు. మేము తిరిగ్వచ్చేటప్పుడు నీకోసం ఆ పర్వతాల్లో పెరిగిన గొఱ్ఱెల బొచ్చుతో చేసిన బ్లాంకెట్ ఒకటి కొనితెస్తాలే" అంటూ చెప్పి వెళ్ళి టాక్సీ ఎక్కి కూర్చుంది. టాక్సీలోంచి ఆమె అందరికీ వీడ్కోలు చెబుతుండగా, "ఒకటి కాదు రెండు తెస్తాం" అంటూ కారెక్కుతూ బోరీమానుద్దేశించి కేకపెట్టాడు దలాల్ గారు. జేబు తడిమిచూసుకుని పర్సు సురక్షితంగా ఉందని నిర్ధారించుకుని భార్య పక్కన సర్దుకుకూర్చున్నాడు ఆయన.
ఆ మేడలో కాపురముంటున్న వారిలో గేటు దాకా వచ్చి క్షేమంగా వెళ్ళిరమ్మంటూ వీడ్కోలు చెప్పింది బోరీమా ఒక్కాతే!
దలాల్ దంపతులు అలా వెళ్ళారో లేదో, ఇలా వెంటనే అందరూ ఒకచోట చేరి, ఆ మేడకు తమవంతుగా తాము చేయవలసిన సౌకర్యాలను గూర్చి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒకామె తనకు పెళ్ళిలో బహుమతిగా అత్తగారు ఇచ్చిన బంగారు గాజుల్ని తాకట్టు పెట్టి మేడచుట్టూ, గోడలకు వెల్లవేయించాలనుకుంది. మరొకామె తన కుట్టు మిషనే అమ్మేయాలనుకుంది. ఆ మేడలో పేరుకున్న చెత్తా చదారం అంతా తీయించి, అక్కడింక బొద్దింక కూడా మిగలకుండా శుభ్రం చేయించాలనుకుంది. ఇంకొకామె తన వెండి సామాన్నంతా అమ్మేసి ఆ డబ్బుతో గుమ్మాలకు పసుపురంగు వేయిద్దామనుకుంది.
పనివాళ్ళు వచ్చి ఆ మేడలో పగలూ రాత్రీ ఏకబిగిన పనిచెయ్యడం ప్రారంభించారు. హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ పనులు చేస్తున్న జనాన్ని తప్పించుకుని తిరగలేక బోరీమా తన మకాం డాబా పైకి మార్చింది. రాత్రుల్లో కూడా అక్కడే నిద్రపోతోంది. ఇప్పుడు మేడలో ఎంతో మంది జనం వస్తూ పోతూ ఉన్నారు. వారిలో ఎవరెవరో గుర్తించడం కూడా కష్టంగా ఉంటోంది. ఎటుచూసినా కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. బోరీమా కుంపటితో సహా సామానంతా డాబా మీదకు చేరేసి, అన్ని పనులూ అక్కడే కానిస్తూ, ఎప్పటికి పనులు పూర్తయి కొత్త జనం రాకపోకలు ఆగుతాయా అని డాబా మీదే ఎదురుచూడసాగింది బోరీమా. తాను సేకరించిన గుడ్డముక్కలతో బానిష్టర్లు తుడవడం కోసం రోజులు లెక్కపెడుతోంది బోరీమా. అమె జాగ్రత్త చేసుకున్న న్యూస్ పేపర్లు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. రాత్రి వాటిని పక్కగా పరుచుకుని పడుకోవడమే కాకుండా, వాన కురిసినప్పుడు తడవకుండా ఆపేందుకు కూడా అవే శరణ్యమయ్యాయి.
క్రమంగా ఆమెకు రోజు గడవడం కష్టమైపోయింది. ఆఖరుసారి ఆమె టీ త్రాగి ఎన్నాళ్ళయిందో తెలియదు. వెనకటి రోజుల్ని, అప్పటి కష్ట సుఖాల్ని తల్చుకోవడమే మానేసింది. దలాల్ దంపతులు ఎప్పుడు వసారా అని ఆశగా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది బోరీమా.
ఒక్కర్తే రోజులతరబడి డాబా మీద ఒంటరిగా బ్రతకలేక గుదులు కట్టిన కాళ్ళౌ కాస్త అటూ ఇటూ కదిపితే బాగుండుననిపించి ఆ మధ్యాహ్నం మేడ పరిసరాల్లో అటూ ఇటూ తిరగాలని మేడ దిగింది బోరీమా చీపురు చేతపుచ్చుకుని. గేటు దాటి బయటికి నడిచింది. న్యూస్ పేపర్ మీది అక్షరాలు అంటిన చీరెతో, ఆమె బజార్ల వెంట తిరుగుతూ కొంగున ముడివేసుకున్న చిల్లర కొంచెం కొంచెం తీసి ఖర్చు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక నిమ్మతొన, మరొకరోజు కాసిని మరమరాలు. ఇంకొకరోజు కాసిని శనగపప్పులు, ఒక గ్లాసు చెఱుకురసం - అలా ఏదో ఒకటి కొనుక్కు తినడం మొదలుపెటింది. ఒకరోజు ఆమె అలా నడుస్తూ కాలేజి వీధిలోక్కి, మరో నాడు ఇంకా చాలా దూరం వెళ్ళింది. అప్పటికి ఆమె కొంగున కట్టుకున్న చిల్లరలో చాలా అయిపోయింది. కూరగాయల సంతలో పనసపళ్ళు అమ్ముతున్న షాపు పక్కన నిలబడి చూస్తుండగా, ఆమెకు ఎవరో కొంగు పట్టుక్ని లాగినట్లు అనిపించింది
వెనక్కు తిరిగిచూసేసరికి ఆమె ఇన్నాళ్ళూ నోరుకట్టుకుని కూడబెట్టిన చిల్లర మొత్తం ఎవరో విప్పుకుపోయారు. అంతేకాదు. ఆమె ఇన్నాళ్ళూ పూర్వ వైభవం తాలూకు జ్ఞాపక చిహ్నంగా వెంట ఉంచుకుని ఆమె ప్రాణప్రదంగా చూసుకున్న తాళం చెవుల గుత్తికూడా మాయమైంది.
ఆమె పుట్టెడు దుఃఖంతో ఇంటికి తిరిగివచ్చేసరికి, ఆ మధ్యాహ్నపుటెండలో ఆ మేడలో వాళ్ళంతా గేటుదగ్గర నిలబడి ఆమె రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఆమె కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా గలగలా మాట్లాడసాగారు. దాని సారాంశమిది - మెట్లపక్కన ఉండే బేసిన్ ఎవరో ఎత్తుకుపోయారు - అని! కొత్తగా వెల్లవేసిన గోడలో దానికి ఋజువుగా పెద్ద కంత కనిపిస్తోంది. ఆ కంతలో వేలాడుతున్నాయి రబ్బరు గొట్టాలు. గోడనుంఛి ఊడిపడిన సిమెంటు పెళ్ళలు నేలంతా చిందరవందరగా పడి ఉన్నాయి. వాటన్నింటి వైపు చూస్తూ తెల్లబోయి, చీపురుకట్టని గట్టిగా బిగించి పట్టుకుని స్థాణువులా నిలబడింది బోరీమా.
వాళ్ళంతా మంచి ఖంగారులో ఉన్నారేమో, ఆ మేడలో ఉన్నవాళ్ళంతా కలసి బోరీమని తోసుకుంటూ డాబా మీదకు తీసుకుపోయారు. ఆమెను బట్టలారేసే దండెం దగ్గర నిలబెటి వాళ్ళు ఆమెను చుట్టుముట్టారు.
"ఇదంతా ఈమే చేసింది" అంటూ వారిలో ఒకడు బోరీమాను వేలెత్తి చూపించాడు. "ఈమే దొంగాళ్ళకు ఆచూకీ ఇచ్చి ఉంటుంది. లేకపోతే ఈ గుమ్మంలో కాపలాగా ఉండవలసిన టైంలో ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళినట్లుట?" అంటూ ఠొకాయించాడు అతడు.
"చాలా రోజుల్నుంచీ ఈమె వీధులవెంట తిరుగుతూ వాళ్ళతో, వీళ్ళతో కబుర్లు చెబుతోంది. నేను చూశా." అన్నారు మరొకరు గట్టిగా.
"మన బొగ్గుల్లో ఈమెకూ వాటా ఇస్తున్నాం. ఉండటానికి చోటు ఇచ్చాం. ఇంతచేసిన మనల్ని చూడండి ఎలా మోసం చేసిందో!" అన్నాడు మూడో వ్యక్తి ప్రగల్భంగా.
వాళ్ళల్లో ఎవరూ తనను పలకరించి మాట్లాడకపోయినా, "నన్ను నమ్మండి, నన్ను నమ్మండీ. నేనే దొంగాళ్ళనూ కలిసి, ఏమీ చెప్పలేదు. నా మాట నమ్మండి." అంటూ బోరీమా వాళ్ళను బ్రతిమాల సాగింది.
"సంవత్సరాల తరబడి నీ అబధ్ధాలన్నిటినీ విని సహిస్తూ వచ్చాం. ఇంకా నీ మాటల్ని నమ్మమంటావా?" అందరూ ఏకగ్రీవంగా ప్రశ్నించారు.
అసలు సమస్య సమస్యగానే ఉండిపోయింది. అందరి మనసుల్లో ఉన్నదీ ఒకటే మాట - "రేపు దలాల్ దంపతులు వచ్చాక వాళ్ళకేం చెప్పాలి" - అన్నది! అందరూ కలిసివెళ్ళి చటర్జీని సలహా అడగాలి అనుకున్నారు. బాల్కనీలో కూర్చుని రోడ్డు మీద ట్రాఫిక్ జాం చూస్తూ కూర్చున్న ఛటర్జీ దగ్గరకు అందరూ వెళ్ళారు.
ఒకతను ముందుకొచ్చి, "బోరీమా ఈ మేడకు రక్షణ లేకుండా చేసింది. ఆమెను నమ్మితే చూడండి ఎంత ఘోరం జరిగిందో! ఇకపై ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మన ఇళ్ళల్లో విలువైన వస్తువులు ఏవేవో ఉంటాయి. విధవరాలు మిశ్రానే చూడండి. ఒక్కామె టెలిఫోన్ పెట్టుకుని ఇంట్లో ఉంటూంది. ఆమెకు రక్షణ ఉండాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి" అని అడిగాడు.
ఛటర్జీ గారు వాళ్ళందరూ చెప్పిన మట్లని ఓపిగ్గా విన్నారు. ఆ తరువాత ఆలోచిస్తూ శాలువాను ఒకసారి సర్దుకున్నారు. వెనక్కి తిరిగి కిటికీకి ఉన్న షట్టర్లవైపు చూశాదు. ఆయనకు గుర్తున్న వరకు అవి రంగు వెలిసి ఉండేవి. కాని, ఇప్పుడు?
పసుపు రంగులో ధగధగా మెరుస్తున్నాయి. వాటివైపే చూస్తూ ఆలోచిస్తున్న ఛటర్జీ గారు ఒక నిర్ణయానికి వచ్చి అందర్నీ కలయజూసి చెప్పడం మొదలుపెట్టాడు.
"బోరీమా నోరు మహా చెడ్డది అన్న విషయం మనకేం కొత్తది కాదు. కాని కొత్తైనదేమంటే - ఇప్పుడు ఈ బిల్దింగ్ కనిపిస్తున్న తీరు. ఇటువంటి అందమైన మేడకు ఒక సమర్ధుడైన దర్వాన్ ఉంటే బాగుంటుంది" - అంటూ ఆగాడు ఆయాన్.
అంతే! ఆ మేడలో ఉన్న జనం చెలరేగిపోయారు. డాబా మీదున్న బోరీమా తాలూకు పాతసామానంతా పోస్టుబాక్సుల్ని దటివెళ్ళి రోడ్డుమీద పడేలా మెట్లమీద నిలబడి దూరంగా విసిరిపారేశారు. అలాగే బోరీమాని కూడా గేటు బయటకు వెళ్ళగొట్టారు. అందరి మనసులు రాబోయే కొత్త దర్వాన్ కోసం ఆత్రంగా ఎదురుచూడ్డం మొదలుపెట్టాయి.
రోడ్డు మీద చెల్ల చెదురుగా పడి ఉన్న తన సామనులోంచి బోరీమా చీపురుకట్టను మాత్రం తీసుకుంది. అక్కడ నుండి వెళ్ళిపోతూ "మీరు నన్ను నమ్మండి, నమ్మకపొండ్! కాని, నేను మాత్రం దొంగని కాను" అంటూ వాపోయింది. అలవాటుగా ఆమె పైటకొంగును ఛెళ్ళున దులిపింది. కానీ ఘల్లున మోగడానికి అక్కడ తాళపుచెవుల గుత్తి మాత్రం లేకుండా పోయింది.





























