సుబ్బారావు ఆఫీసుకొచ్చి అప్పుడే పద్దెనిమిది నిముషాలయింది.సుబ్బారావు ఆఫీసులో చాలా కష్టపడుతుంటాడు.పని చేస్తూ
కాదు.పని చేస్తున్నట్టు నటిస్తూ.
సుబ్బారావు ఆ ఆఫీసులో గత నాలుగేళ్ళుగా పనిచేస్తున్నాడు.కానీ ఈ విషయం వాళ్ళ బాస్ ఛస్తే ఒప్పుకోడు.సుబ్బారావు
ఆఫీసులో చేరి నాలుగేళ్ళయినా పనిచేసింది మాత్రం ముప్పై తొమ్మిది గంటలే.
ఆఫీసులో ఫోన్ మోగుతోంది.ఒక్కరూ సీట్లోంచి కదల్లేదు.అది వచ్చింది సుబ్బారావుకేనని అందరికీ తెలుసు.సుబ్బారావు
గబాల్న ఫోన్ అందుకుని "సుబ్బారావ్ స్పీకింగ్" అన్నాడు.
సుబ్బారావు చేరిన నాలుగేళ్ళలో ఆఫీసుకంటూ వచ్చిన ఫోన్ కాల్స్ ఓ ఎనిమిదికి మించలేదు.అన్నీ సుబ్బారావుకే
వస్తాయి.దాదాపుగా సుబ్బారావు రోజంతా అంటాఎ లంచ్ అవర్లో తప్ప మిగతా టైమంలో ఫోన్ దగ్గరే ఉంటాడు.
అలా హలో అన్న సుబ్బారావుకి అవతలనించి ఓ కోకిల గొంతు 'తెలుసులే నువ్వేనని, నేను నీరజనూ అంది.
ఓహ్ ! వాట్ ఎ ప్లెజంట్ సర్ప్రైజ్ నీరు.నీతో మాట్లాడి దాదాపు పందొమ్మిది గంటలయ్యింది అన్నాడు సుబ్బారావు
ఉత్సాహంగా.'సర్లే నేను చెప్పేది విను.అది వింటే ప్లెజంట్ సర్ప్రైజ్ కాదు టెర్రిబుల్ షాక్ అని తెలుసుకుంటావు ' అంది
నీరజ.
'ఆ టెర్రిబుల్ సర్‌ప్రైజ్ ఏంటో తెలుపుము ' అన్నాడు సుబ్బు.'నిన్న నేను, నువ్వు కలిసి సినిమాకి వెళ్ళిన విషయం మా
అన్నయ్యకి తెలిసిపోయింది ' అంది.
అంతే సుబ్బారావుకి వెన్నుముకలోంచి ఒణుకు మొదలయ్యాక కింద నేల బద్దలవటం మొదలెట్టిందో లేక తల తిరగటం
మొదలయ్యాక కాలం స్తంభించి పోయిందో చెప్పటం కష్టం అయితే అన్నీ జరిగిపోయాయి.
చేతిలో రిసీవర్లోంచి వచ్చే "హలో" ఎక్కడో అగాధంలోనించి వస్తున్నట్టు అనిపించి వినిపించింది సుబ్బారావుకి. అంతే
ఆనాడు టెర్రరిస్టుల ఎటాక్‌కి కూలిపోయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లా కూలబడిపోయాడు.
ఈ విషయం ఆఫీసులో అందరినీ కుదిపేయటమే కాకుండా, ఆశ్చర్యంలో ముంచెత్తి పారేసింది.అతి ముఖ్యంగా సుబ్బారావు
బాస్ మార్కండేయుల్ని.
సుబ్బారావు ఇంత తొందరగా ఫోన్ పెట్టేయటం ఇదే మొదటిసారి.రాంగ్ నంబర్‌తో కూడా కనీసం అరగంట మాట్లాడే
సుబ్బారావు ఇవాళ అరనిముషానికి పద్నాలుగు సెకండ్లు తక్కువ మాట్లాడి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో
ముంచేశాడు.మార్కండేయులికి ఒక అనుమానం వచ్చింది కూడా - కొంపదీసి వీరబ్రహ్మం గారు చెప్పినట్లు నిజంగా అద్భుతాలు
జరుగుతాయా?
సుబ్బారావు ముఖంమీద నీళ్ళు కొట్టి తిరిగి స్పృహలోకి తెప్పిచ్చారు సదరు ఆఫీసువాళ్ళు.కళ్ళు తెరచిన సుబ్బారావు
ఎదురుగా బాస్‌ని చూసి, నీరజ అన్న జగ్గారావనుకొని 'జ..జ..జ..జగ్గారావు 'అని తిరిగి మూర్ఛలోకి వెళ్ళిపోయాడు.
మరో రెండుసార్లు ఇలా జరిగాక స్ప్ర్హలోకి వచ్చిన ఉత్తర క్షణాన 'ఈసారి పడిపోతే నీ ముఖాన కొడతానికి నీళ్ళు,
నిన్ను లేపటానికి మాకు ఓపిక లేవు ' అని ఖచ్చితంగా చెప్పేసరికి సుబ్బారావు తమాయించుకుని లేచి కూర్చున్నాడు.
సుబ్బారావు చుట్టూ చేరిన తన కొలీగ్స్ కేసి చూస్తూ తన విషాద ప్రేమగాధను వివరించాడు.
'నేను నీరజను గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాము.ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెల్యెదు.నిన్ననే తెలిసింది.ఆ
జగ్గారావు కూడా ఇదివర్లో సినిమాలో వేసిన జగ్గారావులానే వుంటాడు.ఇక నన్ను వాడు బతకనీయడు ' అంటూ భోరున
ఏడ్చాడు సుబ్బు.
ఫోన్‌లో చలాకీగా నవ్వుతూ మాట్లాడే సుబ్బు, ఫోన్ పెట్టేస్తే ఇంత విషాదంగా మారుతుందా? మార్కండేయులు కళ్ళు
తుడుచుకున్నాడు.భార్య పెట్టే బాధలన్నిటినీ నవ్వుతూ సోక్రటీస్‌లా అనుభవించే మార్కండేయులి కళ్ళలో నీరు చూసి
స్టాఫ్ అంతా నీరుకారిపోయారు.అలా కారి వరదలో ప్రవహించే నీరులోంచి సుందరానికో అయిడియా కొట్టుకొచ్చింది.
'సుబ్బు చేత సెలవు పెట్టించి, అర్జంటుగా ఏ ఊరో పంపించేస్తే? భేషుగ్గా ఉంది అయిడియా. సుబ్బారావుకీ మరీ
నచ్చింది.ఎన్నాళ్ళ నించో తన ప్రాణమిత్రుడు సత్తిపండుని కలుసుకోవాలని అనుకుంటున్నాడు.పైగా జగ్గారావునుంచి
తప్పిచ్చుకోవటానికి ఇంతకన్నా మార్గం లేదు.
సుబ్బులేచి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.మగ కొలీగ్స్ దగ్గర డబ్బులు, ఆడ కొలీగ్స్ దగ్గర వీడ్కోలు
తీసుకున్నాడు.మార్కండయులు మాత్రం సుబ్బారావు దగ్గరో మాట తీసుకున్నాడు.రోజు తనతో తన క్షేమ సమాచారాలు
మాట్లాడాలని.
సుబ్బారావు అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని సరాసై బస్టాండ్‌కి బయలుదేరాడు.
అంతే ఆఫీసులో ఫోన్ మ్రోగింది.మార్కండయులు ఫోన్ తీసుకుని 'సుబ్బారావు లేడు. ఓ నెలరోజుల దాకా రాడు ' అని
ఫొనె పెట్టేసి గర్వంగా అందరికేసి చూశాడు.స్టాఫ్ అంత అతనిని ఒలంపిక్స్ లో గోల్డ్‌మెడల్ సాధించిన వాడిలా
అభినందించారు.తాను పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే ఈ ఫోన్‌లో మాట్లాడేలా చేసింది.
దుఃఖానందభరితుడైన మార్కండయులుకి అసలు విషయం తెలీదు.ఆ ఫోన్ వచ్చింది సుబ్బారావుకి కాదు. అతనికే.అతని
భార్య మంగతాయారు దగ్గర్నుంచి.
సుబ్బారావు విజయవాడ వెళ్ళే బస్సులో ఎక్కి కూర్చున్నాడు.కళ్ళకి నల్ల కళ్ళజోడు, అడ్డంగా పేపర్ పెట్టుకున్నాడు
ఎవ్వరికీ కనిపించకుండా. 'ఛ .ముఖం చాటెయ్యటం కూడా కష్టమే ' అనుకున్నాడు.
సుబ్బారావుకి కుక్క మీద భలే కోపం వచ్చింది.'ఛీ పాడు కుక్క ' అనుకున్నాడు.అది కొంచెం గట్టిగా అరిచేసరికి పక్కన
కూర్చున్న తను భయపడి కాళ్ళు సీటు పైన పెట్టుకుని, సీటు కిందకి చూశాడు.
ఇదివర్లో మనముఖాలన్నీ డిటాచబుల్ స్పీకర్స్ లాగ మెడమీద నుంచి తీసుకునేట్టుగా వుండేవట.కళ్ళేమో పొట్టమీద
వుండేవి కాబోలు.ఓనాడు ఒకావిడ తల దువ్వుకునే నెపంతో తలతీసి కుర్చీ పీట మీద పెట్టి తలకి నూనె రాసి, జడ
వేస్తుందట.ఈలోగా పక్కనున్న పొయ్యి మీద ఎసరు మరుగుతుంటే, ఎసర్లో బియ్యం పోద్దామని అటుతిరిగిందట.అంతే
పెరట్లోంచి ఓ కుక్క వచ్చి, సగం జడ వేసిన తలని నోటితో పట్టుకుపోయిందట.అప్పుడు దేవుడు ఇలా లాభం లేదని
తలని మెడకి 'క్విక్ ఫిక్స్ ' తో అతికించి పారేశాడట.సరిగ్గా అప్పుడే మనుష్యులకి కళ్ళు నెత్తికెక్కాయి.పక్క సీట్లో
ఆయన ఎందుకైనా మంచిదని కాళ్ళు సీటు పైనే పెట్టుక్కూర్చున్నాడు.
పేపర్లో సినిమా పేజీలో 'ఫేస్ ఆఫ్ ' అనే సినిమా యాడ్ చూసేసరికి సుబ్బుకి ఓ మహత్తరమైన ఐడియా వచ్చింది.'
ఏన్ ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్ ' అనుకున్నాదు మనసులో.
విజయవాడ చేరాడు.ఆటో తీసుకుని పటమటలో వున్న తన ప్రాణ స్నేహితుడు సత్తిపండు ఇకంటికెళ్ళాడు.
తలుపు కొట్టగానే సత్తి తలుపు తీసి ఎదురుగా ఉన్న సుబ్బుని చూసి ఆశ్యర్యపోయి లొపపలికి తీసుకెళ్ళాడు.
సుబ్బారావు తన రాక వెనక గాధను వివరించాడు.
'ఓహ్! అయితే నాకున్న ఒక్కగానొక్క ప్రాణమిత్రుడు, ఇక ఉండబోడన్నమాట.సరేలే వెళ్ళి ఓ ఫొటో
తీయించుకొద్దాం.మనిద్దరం ఉన్న ఫొటో నాదగ్గర లేదు ' అన్నాడు జగ్గారావుని తలుచుకుంటూ.
'ఏడిశావులే వెధవ సటైర్లు వెయ్యకు.నేను ముఖాన్ని మార్చుకుంటున్నాను ' అన్నాడు సుబ్బు.
'ముఖం మార్చుకుంటావా? అదేమన్నా చొక్కా మార్చుకున్నంత వీజీ అనుకుంటున్నావా? ' అన్నాడు సత్తి
'కాదు అంత కన్నా వీజీ' అన్నాడు సుబ్బు. మనం అర్జంటుగా బీసెంటురోడ్డులో ఉన్న డా.అపరబ్రహ్మం గారిని కలవాలి.
సరే ఒక్క నిముషం ఆగు.చొక్కా మార్చుకుని, ముఖం కడుక్కుని వస్తాను అని లోపలికెళ్ళాడు సత్తి.
డా.అపరబ్రహ్మం.ముఖాల స్పెషలిస్ట్.
ఇచట ముఖాలు అందంగా మార్చబడును.
అన్న బోర్డు చూసి ఆటో దిగారు సత్తి, సుబ్బు.
లోపల అపరబ్రహ్మం పేషెంట్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. 'నీ ముఖం నాకు చూపించకు అని కసిరిన నీ గర్ల్ ఫ్రెండ్
దగ్గరికి దర్జాగా వెళ్ళు.ఈ ముఖం చూపించు.తనే తన ముఖం ఇక ఈ జన్మలో చూపించదు ' అన్నాడు గర్వంగా
అపరబ్రహ్మ.
అద్దంలో పేషెంట్ తన ముఖం చూసుకున్నాడు.
నా ముఖంలా వుంది అన్నాడు పేషెంట్.
నో ..మై బాయ్ ...నీ ముఖంలా లేదు.మారి పోయింది.సరిగ్గా చూసుకో అద్దంలో అన్నాడు.
అద్దంలో చూసుకున్న పేషెంట్ 'డాక్టర్ కొంత నేటివిటీ తగ్గినట్టుంది 'ముఖం అటూ ఇటూ తిప్పుతూ.
'మరేం పర్లేదు.ఇదీ భారతీయుడిదే, కానీ యు.ఎస్.లో సెటిల్ అయినవాడిది. ఎన్.ఆర్.ఐ. ఫేస్. నాన్ రెసిడెంట్ ఇంపోర్టెడ్
ఫేస్.నాల్రోజులు హైదరాబాదు ఎండలో తిరిగితే సెట్ అయిపోతుంది అన్నాడు బ్రహ్మం.
పేషెట్ వెళ్ళిపోయాడు.చేతులు తుడుచుకుంటూ బ్రహ్మం బయటకు వచ్చాడు.
'ఈ ముఖానికి బదులు వేరే ముఖం అమర్చాలి ' అన్నాడు సుబ్బు.
'ఓహ్! నా దగ్గర అన్నీ ఇంపోర్టెడ్ ముఖాలే వున్నాయి. మీ స్కిన్ టెక్స్చర్ కి సరిపోయేవి లేవు.మీరు ముఖాన్ని ఏర్పాటు
చేసుకొండి.నేను ఫిక్స్ చేస్తాను.
రిక్షాలో కూర్చుని రాత్రి ఊరంతా తిరిగుతున్నారు.
ముఖాలు ఎక్కడ దొరుకుతాయిరా బాబూ సత్తి సందేహం. చాలా ఈజీ గురూ!జీవితం మీద విరక్తి పొందిన వారు సగటున
రోజుకి ఓ రెండు లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.సాధారణంగా అలా ఆత్మహత్యలు చేసుకునేవారు నదిలో
దూకో, రైలు కింద తలపెట్టో ఛస్తుంటారు.ఏ విషమో, సాఫ్ట్ డ్రింకో తాగి కూడా ఆత్మహత్యలు చేసుకోవచ్చు కదా?
సందేహించాడు సత్తి.
'ఏడ్చినట్టుంది నీ ముఖం. అలా ఎండ్రినో, సాఫ్ట్ డ్రింకో కొనుక్కునే వాళ్ళయితే, ఏ మిరపకాయి బజ్జీలో, పునుగులో
తిని బ్రతుకుతారు కానీ చావరు.నదిలో దూకటనికో, రైలు కింద తలపెట్టడనికో డబ్బులు అవసరం లేదు, తేల్చి
చెప్పాడు సుబ్బు.అందుకు ఇలా నదిలో పడేవాళ్ళనో రైలు కింద తలపెట్టే వాళ్ళనో బతిమాలి ముఖాలు మార్చుకుని ఒదిలేస్తే
వాళ్ళ చావు వాళ్ళు చస్తారు.
నిజమే సుమి..చచ్చేవాడు ఏ ముఖం పెట్టుకు ఛస్తే ఏంటి? అనుకున్నాడు సత్తి.
రిక్షా ప్రకాశం బ్యారేజీ మీద ఆగింది.ఇద్దరూ దిగి చుట్టూ చూశారు.ఎవ్వరూ కనపడ్లేదు.ఒంటిగంటయింది.దూరంగా
ఒకడు కూర్చున్నాడు.వాడు వీళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు.సుబ్బుకి డౌట్ వచ్చింది.వాడు ఖచ్చితంగా ఆత్మహత్య
చేసుకోటానికే వచ్చాడు.కానీ మనల్ని చూసి మొహమాట పడుతున్నాడు.ఎలాగైనా వాడ్ని బ్రతిమాలి ఆత్మహత్య చేసుకునేలా
చేస్తే తన పని పూర్తవుతుంది..అంతే అనుకుని వాడి వైపు నడిచారు.వాడో బికారిలా వున్నాడు.సుబ్బుకి నిర్థారణ
అయిపోయింది.
ఏంటోయ్! ఇలా వచ్చావు? అన్నాడు సుబ్బు.
ఏంలేదోయ్. చల్లగాలికి ఇలా కూర్చున్నాను అన్నాడు.
'వోయ్' అనేసరికి సుబ్బుకి కోపం వచ్చింది.అయినా తమాయించుకు కూర్చున్నాడు.అవసరం తనది.
ఈసారి ఇండైరెక్టుగా మొదలెట్టాడు.సాధారణంగా ఇలాంటి చోటుకి నీలాంటి వాళ్ళు రారు.ఈ వేళప్పుడు ఆత్మహత్య
చేసుకోవటానికి వస్తారు తెలుసా? అడిగాడు సుబ్బు
'తెలుసు.అందుకే గత పదేళ్ళుగా వస్తున్నాను ' అన్నాడు బికారి.
'ఏంటి గత పదేళ్ళుగా ప్రయత్నిస్తున్నావా? అదే వస్తున్నావా? ఆశ్చర్యపోయాడు సత్తి.సంబరపడ్డాడు సుబ్బు.
'అవును కానీ గత కొద్ది రోజులుగా మరీ వేస్ట్ అనిపిస్తోంది.జీవితం మీద విరక్తి పుడుతూంది ' అన్నాడు బికారి బీడీ
వెలిగిస్తూ.
'మరే మాలాంటి వాళ్ళే బతకలేక ఛస్తూంటే, నీలాంటి వాళ్ళకి మరీ కష్టం బాధ పడ్డాడు సుబ్బు.
'జీవితం మీద ఒక్కసారి విరక్తి విరక్తి కలిగినా ఇక బతక్కూడదు. చావ్వలిసిందే నొక్కి వక్కాణించాడు సత్తి. తన
వంతు కృషి చేస్తూ.
'కానీ ఏ ఎదవ వచ్చి ఛస్తాడోనని చూస్తున్నా. ఇక విసుగెత్తిందంటే నేనే దూకి ఛస్త, అన్నాడు బికారి బీడీ దమ్ము
లాగి.
జీవితంతో చాలా విసిగిపోయినట్టున్నావు.,కొంపదీసి చస్తావా ఏంటి? అడిగాడు సుబ్బు ఆత్రం ఆపుకోలేక.
ఛస్ నేను చావటమేమిటి.ఇంక ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలి, బీడీ ఆర్పి పడేశాడు.
'మరైతే నువ్వు ఆత్మహత్య చేసుకోవా?' అడిగాడు సత్తి దిగులుగా
'కోను.మీరు గాని చేసుకుంటారా?' అడిగాడు బికారి.సత్తి, సుబ్బు అవాక్కయ్యారు.
'ఓర్ని, మరా సంగతి చెప్పరే.మీ మొగమాటాన్ని దొంగలు దోల.ఇంత మొగమాటమైతే ఆత్మహత్య ఏం చేసుకుంటారు? అంటూ
లేచి రండి మీకు మంచి స్పాట్ చూపిస్తాను.అక్కడ నీరు దండిగా వుంటాయి.రాళ్ళురప్పలు అస్సలుండవు.దెబ్బలు
తగలవు.ప్రశాంతంగా చావొచ్చు.మీకు తెలియెక ఏ రాళ్ళ మీదో పడితే, ఆ పైన చస్తే చావరు.దెబ్బల్తో బయట
పడ్తారు.తర్వాత పోలీసోళ్ళతోనూ చిక్కూ ' అన్నాడు బికారి.
సుబ్బు, సత్తి ఇంకా తేరుకోలేదు.
'ఇక మరి ఆలోచించబాకండి.మీ చొక్కాలాగూలు, ఉంటే క్యాష్, వాచీ గట్రా నాకియ్యండి.హాయిగా సావండి.
మొన్నో కుర్రాడు, లవ్ కేసనుకుంటా...దూకెయ్యబోయాడు..చొక్కాయియ్యి బాబు..మంచి చోటు
చూపిస్తానన్నాను.ఇన్లేదు.దూకేశాడు.అంతే రాళ్ళమీద పడ్డాడు.ముఖం చెక్కుకు పోయింది.కుడి కాలిరిగి పోయింది.ఆఖరికి
చొక్కా చూసి గుర్తు పట్టి, పోలీసోళ్ళు కేసెట్టి లాక్కుపోయారు.ఇపుడు పాత శివాలయం దగ్గర అడుక్కుంటున్నాడు ' అంటూ
వాళ్ళ కేసి చూశాడు.
'కానీ మీకా ఛాన్స్ లేదు.పాత శీవాలయం దగ్గర ఖాళీ లేదు.ఆలోచించుకోండి. అన్నాడు బికారి వాళ్ళ చొక్కాల కేసి
చూస్తూ...
సుబ్బు, సత్తి స్పృహలోకొచ్చారు.
'అబ్బే మేము ఆత్మహత్యకోసం రాలేదు.నీలాగే అడుక్కోటానికి వచ్చాము ' అన్నారు.
'ఏంటి నాలాగ అడుక్కోటానికొచ్చారా?చొక్కాలాగూలు బానే వున్నాయి కదా? ఇంకేం కావాలి? గోచీలు, అండర్‌వేర్లు బాగోవు
తేల్చి చెప్పాడు బికారి.
'అబ్బే చొక్కాలు..లాగూలు కాదు....ముఖం అడుక్కోవటానికి వచ్చాము ' అన్నాడు సుబ్బు.
ఒక్కసారి వారి ముఖాలకేసి ఎగాదిగా చూసి 'మీ ముఖాల్లా వుంది మీరు చెప్పేది. ఆ రోజులు వేరు. రోజు నదిలో స్నానం
చేసినట్టుగా వచ్చి బోల్డు మంది ఆత్మహత్యలు చేసుకునేవారు.కానీ ఇప్పుడు పుష్కరాలకి కూడా రావట్లేదూ.
ఏం? ఎందుకని ? అన్నాడు సత్తి.
'నీళ్ళుంటేగా పడతానికి.అయినా దీనికంతటికీ కారణం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ' కసిగా అన్నాడు
బికారి.
అదెలా? అడిగాడు సుబ్బు
'ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళు బస్సులు, రైళ్ళు నడుపుతున్నారు.ఇక ఆత్మహత్యలు చేసుకునేవారు టిక్కెట్టు కొనుక్కుని బస్సో,
రైలో ఎక్కెళ్తున్నారు.ఆ బస్సులు బ్రిడ్జీల మీద నుంచి నదిలో పడిపోయో, దేన్నో కొట్టేసుకొనో,రైళ్ళయితే చెప్పనే
అక్కర్లేదు. గట్టిగా వాన పడినా పడిపోతూంది.జనం మరీ సుఖానికి అలవాటు పడిపోయారు.బొత్తిగా కష్ట పడలేక
పోతున్నారు.ఇదివరకు బస్సో, రైలో ఎక్కితే తెల్లారేసరికి ఊళ్ళకెళ్ళేవారు.కానీ ఇపుడు జీవితమే తెల్లారి
పోతుంది.ఇలా ఆత్మహత్య చేస్య్కునేవారి సౌకర్యార్థం సెపరేటు బళ్ళు నడుపుతూ మూకుమ్మడిగా బోల్డు మంది ఒక్కసారిగా
ఆత్మహత్య చేసుకునే అవకాశం కలిగించింది ఈ ప్రభుత్వం.పైగా అలా పోయిన వారికి నష్టపరిహారం కూడా
ఇస్తోంది.ఈమధ్య మీరు గమనించే వుంటారు, పరీక్షల రిజల్ట్స్ రోజుల్లో స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.
అలా సునాయాసంగా చనిపోయేవారికి నష్టపరిహారం, బతికి బయటపడ్డ వారికి ఉద్యోగమో, సద్యోగమో
ఇస్తోంది.ఒకోసారి నాకే అనిపిస్తుంది టికెట్టు కొనుక్కుని ఏ బస్సో ఎక్కేద్దామని, అన్నాడు నిస్పృహగా బికారి.
బికారిని ఓదార్చి సుబ్బు, సత్తి వెనుదిరిగారు.ఈలోగా ఓ స్కూటర్ వీళ్ళని దాటుకుని ముందున్న స్తంభాన్ని కొట్టుకుని
పడిపోయింది.దాని మీద ఒకడు పడిపోయాడు.కదలటం లేదు. సుబ్బు, సత్తి పరిగెత్తికెళ్ళి చూశారు.పడిపోయినవాడిలో
చలనం లేదు.పోయేవుంటాడని గ్రహించి గబగబ వాడ్ని మోసుకుని డా.బ్రహ్మం దగ్గరికి తీసుకు పోయారు.బ్రహ్మం ముఖాలు
మార్చేశాడు.సత్తి తిరిగి ఆ స్కూటర్ వాడ్ని, అదే సుబ్బు ముఖంతో తిరిగి బ్యారేజీ మీద, స్కూటరు దగ్గర పడేసి
చక్కగా వెళ్ళిపోయాడు.
సుబ్బు సత్తి ఇంట్లో కూర్చుని ఉన్నారు.అన్నిపేపర్లు తిరగేసినా ఈ యాక్సిడెంట్ గురించి కనపడలేదు.టి.వి.లో మాత్రం ఓ
గుర్తు తెలియని మనిషి వెళ్తూ స్తంభానికి కొట్టుకుని పడిపోతే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారని అని
చెప్పారు.హమ్మయ్య అనుకున్నాడు సుబ్బు.
సుబ్బారావుకో ఆలోచన వచ్చింది.ఇప్పుడు తను ముఖం మార్చుకున్నాడు.జగ్గారావుగాని, నీరజ కాని అతన్ని
గుర్తుపట్టలేరు.ఈముఖంతో వారి ముందుకు వెళ్తే ఎలా వుంటుంది? థ్రిల్లింగా ఉంటుంది అనుకొని వెంటనే హైదరాబాద్
బయలుదేరాడు.
నీరజ వాళ్ళింట్లో....
నీరజ, ఆమె అన్న జగ్గారావు, తండ్రి రాజనాల మరో ముగ్గురు కూర్చున్నారు.అంతా టెన్షన్‌గా ఉన్నారు.
సుబ్బు తన కొత్త మొహంతో దూరంగా నిలుచుని గమనిస్తున్నాడు.వాళ్ళందరూ వీధి వైపు చూస్తున్నారు, ఎవరికోసమో
అన్నట్లు.సుబ్బుకి తెలుసు..జగ్గారావు తనని లేపైయమని పంపిన మనుషుల కోసం ఆతృతగా చూస్తున్నాడని.ఇక
ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక సుబ్బు సరాసరి లోపలికి వెళ్ళాడు.
"జగ్గారావుగారు..." అంటూ ఏదో చెప్పబోయాడు.
"ఏరా ...సుబ్బారావు దొరికాడా? అని ఎదురు ప్రశ్న వేశాడు.
సుబ్బు ఖంగు తిని అటూ ఇటూ చూశాడు.చుట్టూ ఎవరూ లేరు.జగ్గారావు తనతోనే మాట్లాడుతున్నాడు.అంతా తనవైపే
చూస్తున్నారు.
ఏరా మాట్లాడవు? రాజనాల అడిగాడు.
"చెప్పు సుబ్బారావు దొరికాడా?" నీరజ ఆతృతగా అడిగింది.
సుబ్బుకి అర్థం అయింది. అంటే తనని లేపైయమని పంపిన మనిషి బ్యారేజీ మీద స్తంభానికి కొట్టుకు చచ్చిపోయిన
వాడా? షాక్ తిన్నవాడిలా అలాగే చూస్తుండిపోయాడు.
ఇంతలో మరో విషయం జరిగింది.
నీరజ, జగ్గారావు, రాజనాల మొహంలో ఆనందం చోటుచేసుకుంది.
"ఏరా సన్నాసి..సుబ్బారావుని తెచ్చానని చెప్పవే?" అన్నాడు జగ్గారావు.
"నువ్వు నిజంగా గొప్పవాడివిరా" అన్నాడు రాజనాల
"థాంక్స్ రా సన్నాసి సుబ్బారావుని తెచ్చినందుకు" అంది నీరజ కృతజ్ఞతతో
సుబ్బు నెమ్మదిగా గేట్‌వైపు చూశాడు.మళ్ళీ షాక్.ఎదురుగా సుబ్బారావు.
నీరజ పరుగెత్తికెళ్ళింది సుబ్బారావు దగ్గరికి. "ఏంటి ఫోను్‌లో నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోవు.మా
అన్నయ్యకి మన ప్రేమ వ్యవహారం అంతా తెలిసిపోయింది.మనకి పెళ్ళి చేస్తానన్నాడు.నిన్ను వెంటనే రమ్మన్నాడు" అని
చెబుదామని ఫోన్ చేస్తే సగంవిని విజయవాడ పారిపోయావట, నవ్వింది నీరజ.
"ఏంటి బావగారు...ఖంగు తిన్నారా? ఏదో ఊరికే ఓ సారి ఆట పట్టిద్దామని" జగ్గారావు అన్నాడు.
"రావోయ్..అల్లుడూ" అంటూ రాజనాల సుబ్బారావుని లోపలికి తీసుకెళ్తున్నాడు.
సుబ్బారావు - సుబ్బు ముఖాలు చూసుకున్నారు.
అంటే సుబ్బు ముఖం పెట్టి బ్యారేజి మీద వదిలేస్తే, వాడు చావకుండా బ్రతికి బట్టకట్టి ఇలా వచ్చి నీరజను
కట్టుకుంటున్నాడా?
నో..నో..గట్టిగా అరిచాడు సుబ్బారావు.బస్సు ఆగిపోయింది.సుబ్బారావు కలలోంచి బయటకి వచ్చాడు.వెంటనే బస్సు దిగి
హైదరాబాదు వైపుకు బయలుదేరాడు....జగ్గారావుని కలవడానికి....





























