వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?!

--వేమూరి వేంకటేశ్వరరావు

తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఆ ఇంగ్లీషైనా బాగా మాట్లాట్టం, రాయటం వచ్చా అంటే అదీ లేదు. ఏదీ, ఇంగ్లీషులో మంచి కథ కానీ, నవల కానీ రాసిన తెలుగువాళ్ళని చూపించండి. నూటికో, కోటికో ఒక వ్యక్తి ఉంటే ఉండొచేమో కానీ నాకు ఇప్పటి వరకు ఎవ్వరు తారస పడలేదు. నేర్చుకుంటూన్న భాషలో పెద్ద పాండిత్యం ఉన్నట్లు మాట్లాడతాము కాని వచ్చిన మాతృభాష రాదనుకొని మాట్లాడటానికి చిన్నతనం పడిపోతున్నాం. ఇంగ్లీషులో మాట్లాట్టం ఎదో గొప్పనే భావం ఎంతలా నాటుకుపోయిందంటే, “మా హసుబెండు గారు ఇంగ్లీషులోనే కాని తెలుగులో థింకు చెయ్యలేరంటే మీరు బిలీవు చేస్తారా, రావు గారూ!” అంటూ నన్ను ఒక గృహిణి ఒకసారి నిలదీసి అడిగింది.

ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. “మన భాషలో వొకేబ్యులరీ లేదండీ” అని ఒక సాకు వినిపిస్తూ ఉంటుంది. నిజమే! ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. బూజు పట్టినవి, మూలబడ్డవి కలుపుకుంటే ఇంకా చాలానే ఉంటాయి. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. హిమాలయా పర్వతాలలా ఇంగ్లీషు ఇంకా పెరుగుతోంది. దక్షిణాదికి వస్తూ అగస్త్యుడు వింధ్య పర్వతాలని ఎదగొద్దని చెప్పినట్లు మన తెలుగుని కూడ పెరగొద్దని శపించేడో ఏమిటో మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకుబేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే – అది ఇంగ్లీషువాడి సొత్తు కాదు. అది ఇంగ్లీషు వాళ్ళకి దైవదత్తంగా వచ్చిన బాధ్యతా కాదు. అందుకని తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. పై నెలనుండి మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము.

ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది.

ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను. ఈ ప్రయత్నం దేవుడి పెళ్ళి లాంటిది; కనుక దీనికి అందరూ పెద్దలే.

దేవుడి ప్రస్తావన వచ్చింది కనుక ‘దేవుడు’ తో మొదలు పెడతాను.

(0) దేముడు, దేవుడు: మనలో చాలా మంది ‘దేముడు’ అని రాస్తూ ఉంటారు. కాని ఈ ప్రయోగం తప్పని నా మనవి. దైవ శబ్దంలోంచి వచ్చిన శబ్దం కనుక దేవుడు అన్నదే సరి అయిన ప్రయోగం. ‘దేమాలయం’ అనం కదా – ‘దేవాలయం’ అంటాం. దేవుడి భార్య దేవేరి. దేవుడు ప్రకృతి, దయ్యము వికృతి. ‘దెయ్యం’ కాదు – దయ్యం.

(1) కంప్యూటర్: ఈ మాట మనందరికీ పరిచయమైనదే. దీనికి తెలుగు మాట ఉందా? కంప్యూటర్లు వాడుకలోకి రాకపూర్వమే కంప్యూటర్ అనే మాట ఇంగ్లీషులో ఉంది. డ్రైవర్, కండక్టర్ లాగే కంప్యూటర్ ఒక వ్యక్తి. ఖాతా కొట్లో లెక్కలు సరిచూసే (చేసే కాదు) మనిషిని ఆ రోజుల్లో ఇంగ్లీషు వాళ్ళు ‘కంప్యూటర్’ అనే వారు. అదే రకం పనిని చేసే యంత్రాన్ని అదే పేరుతో పిలవటం మొదలెట్టేరు. మన పల్లెటూళ్ళల్లో లెక్కలు సరిచూసే మనిషి మన కరణం అనేవాళ్ళం. కాలాగ్నికి సమర్పించిన సమిధలా ఈ మాట ఇప్పుడు మరుగున పడిపోతోంది – యంటీయార్ వోడి ధర్మమా అని! ఒకొక్కప్పుడు ఈ మనిషినే గుమస్థా (ఇది మరాటీ మాట) అంటాం. కొన్ని ఇతర భాషలలో గణక్ అంటారు. కనుక ఈ కంప్యూటర్ అనే యంత్రం మన తెలుగు దేశంలో కనిపెట్టబడి ఉంటే దానిని కరణం అనో, గణక్ అనో, గుమస్తా అనో అనుండేవారేమో!

మొదట్లో ఈ కంప్యూటర్ ని ఇంగ్లీషులో కేలుక్యులేటింగ్ ఇంజన్ అనీ, కంప్యూటింగ్ మెషీన్ అనీ, బిజినెస్ మెషీన్ అనీ అనేవారు. ఈ పేర్ల అవశేషాలే ఇప్పటికీ అసోషియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషీన్స్ (ACM) లోనూ, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (IBM) లోనూ మనకి కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ రోజుల్లో కంప్యూటర్ అన్న మాటకీ, కేలుక్యులేటర్ అన్న మాటకీ అర్ధంలో తేడా ఉంటోంది.

ఇంతకీ ‘కంప్యూటర్’ ని తెలుగులో ఏమందాం? నేను 1968 లో ‘కంప్యూటర్లు’ అనే మకుటంతో రాసిన వ్యాస పరంపర తెలుగు భాషాపత్రికలో రెండేళ్ళపాటు ధారావాహికగా ప్రచురించబడింది. అప్పటికి తెలుగువాళ్ళకి ఇంకా కంప్యూటర్లు అలవాటు కాలేదు. కనుక కంప్యూటర్‌కి ‘కలన యంత్రం’ అని పేరు పెట్టేను. ఇదొక్క మాటే కాకుండా ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్న యంత్రాలని దృష్టిలో పెట్టుకుని digital computer ని ‘అంక కలన యంత్రం’ అనీ, analog computer ని ‘సారూప్య కలన యంతరం’ అనీ, hybrid computer ని ‘సంకర కలన యంత్రం’ అనీ అన్నాను. అలాగే computing అన్న మాటని ‘కలనం’ అని తెలిగించేను. మనకి సంకలనం (addition), వ్యవకలనం (subtraction), కలన గణితం (calculus), సమాకలనం (integral calculus) మొదలగు మాటలు వాడుకలో ఉన్నాయి కనుక, వాటిని పోలిన మాటే ఇదీ కనుక సందర్భానుసారంగా ఈ మాట కూడ అర్ధం అవుతుందనే ఆశతో చేసిన పని ఇది.

ఇప్పుడు ‘డ్రైవర్’ అంటే ఏమిటని H-2 వీసాలతో అమెరికాలో వాలిన కంప్యూటర్ వలస పక్షులని అడిగి చూడండి. అచ్చు యంత్రాల లాంటి ఉపకరణాల్ని తోలే ‘సాఫ్‌ట్‌వేర్’ అంటారు కాని కారు తోలే మనిషి అనే అర్ధం స్పురించకపోవచ్చు వారికి.

పై రెండు ఉదాహరణల వల్ల తేలింది ఏమిటంటే మనం రోజూ వాడే మాటలనే సాంకేతిక రంగంలో రూఢ్యర్ధాలతో వాడొచ్చని. ఉదాహరణకి lift అనే మామూలు ఇంగ్లీషు మాట వైమానిక రంగంలో ఒక ప్రత్యేకమైన రూఢ్యర్ధంతో వెలుగుతోంది. అదే మాట మేడ ఎక్కడానికి వాడే విద్యుత్ ఉపకరణానికీ వాడుతున్నాం కదా.

(2) బిట్: కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి bit అనే మాట సుపరిచితమే. Bit అనేది BInary digiT అన్న మాటలలోని అక్షరాలలో కొన్నింటిని ఏర్చి, కూర్చిన మాట. ఇంగ్లీషులో ఈ రకం మాటలు కొల్లలు. తెలుగులో కసాగు (కనిష్ట సామాన్య గుణిజము) అని గణితంలో వచ్చే మాట ఇటువంటిదే. ఇది Least Common Multiple (LCM) అన్నదానికి మక్కీకి మక్కీ తెలుగు అనువాదం. కనుక bit ని తెలుగులోకి తర్జుమా చెయ్యాలంటే ముందు binary digit ని ‘ద్వియాంశ అంకము’ అని తెలుగులో రాసుకుని, కావాలనుకుంటే దీనిని కుదించి ‘ద్వింకము’ అనొచ్చు. నాలుగు చింతపిక్కలని పుంజీ అనీ, ఐదు మల్లె పువ్వులని చెయ్యి అనీ అన్నట్లే byte కీ, nibble కీ కొత్త మాటలు మనమూ సృష్టించవచ్చు.

(3) బేస్: ఇదే బాణీలో base-2, base-8, base-10, base-16 అన్న కంప్యూటర్ రంగపు మాటలని వరుసగా ద్వియాంశ, అష్టాంశ, దశాంశ, షోడశాంస అని మనకి అలవాటయిన, పరిచయమైన మాటలతో వర్ణించవచ్చు.

(4) ఆర్గానిక్ కెమిస్ట్రి: రసాయన శాస్త్రంలో స్థూలంగా రెండు భాగాలు ఉన్నాయి. వాటిని ఇంగ్లీషులో organic chemistry, inorganic chemistry అని అంటారు. ఈ రెండు పేర్లూ రసాయనాల తత్వం పరిపూర్ణంగా అర్ధం కాని రోజులలో బెర్జీలియస్ అనే ఆయన పెట్టిన పేర్లు. ఒక విధంగా ఇవి అతకని పేర్లు లేదా దుర్నామాలు (misnomers). పాశ్చాత్యుడు చేసిన తప్పునే మనం తెలుగులోకి దింపి పై రెండింటిని ‘ఆంగిక రసాయనం, అనాంగిక రసాయనం’ అని తెలిగించ వచ్చు; లేదా, అప్పుడెప్పుడో జరిగిపోయిన తప్పుని సవరించి సరైన మాట వాడొచ్చు. గ్రంధ విస్తరణ భీతి వల్ల దీని పూర్వ గాధ ఇక్కడ చెప్పను కాని, కావాలంటే నేను రాసిన ‘రసగంధాయ రసాయనం’ పుస్తకం చదవండి. ప్రస్తుతానికి ఆర్గానిక్ కెమిస్ట్రిని ‘కర్బన రసాయనం’ అనీ, ఇనార్గానిక్ కెమిస్ట్రిని ‘వికర్బన రసాయనం’ అని తెలిగించమని నా సలహా.

(5) పోలరైజేషన్. పోలరైజ్‌డ్ కళ్ళద్దాలు పెట్టుకునే వారికి ఈ మాట అసంకల్పంగా అర్ధం అవుతుంది. ఈ మాటని ‘ధృవీకరణం’ అని ఎవ్వరో తెలిగించేరు. నిజమే! ‘పోలరైజేషన్’ అన్న ఇంగ్లీషు మాటకి వాచ్యార్ధం ధృవీకరణమే. కాని పోలరైజేషన్ అనే మాట ఒక దుర్నామం. భౌతికంగా జరిగే ప్రక్రియలో ఎక్కడా ధృవాలు (poles) లేవు. ఈ ప్రక్రియ అర్ధం కాని రోజులలో ఇంగ్లీషువాడు పప్పులో వేసిన కాలు ఇది. ఈ కాలినే మనం పట్టుకు వేల్లాడడం ఎందుకు? ఈ ప్రక్రియ ఒక జల్లింపు లాంటిది. అన్ని దిశలలోనూ బ్రమణం పొందే కాంతి తరంగాలని ‘జల్లించి’ ఒకే తలంలో ఊగేలా చేసే ప్రక్రియ కనుక దీనిని ‘తలీకరణ’ అని తెలిగించమని నా సలహా.

ఈ నెలకి ఈ ఆరు చాలు. ఇప్పుడు మీ మెదడుకి పదును పెట్టి ఈ దిగువ ఇచ్చిన ఇంగ్లీషు మాటలకి తెలుగు మాటలు ఏవి నప్పుతాయో మీరు కూడా ప్రయత్నించి ప్రయోగించి చూడండి. మీ సలహాలు RTSలో అంతర్జాల చిరునామా:sujanaranjani@siliconandhra.org కి పంపించండి. మీ ప్రయోగాలు మాకు నచ్చితే మీకు కూడ ఘటోత్కచుడి చేత ఒక వీరతాడు ఇప్పించి గౌరవిస్తాము!

మీ పదాలు మాకు చేరటానికి ఆఖరు తేదీ: 25 ఏప్రిల్ 2007. మీరు ఈ నెల ప్రయత్నించవలసిన శాస్త్రీయ ఆంగ్ల పదాలు:

  • 1. hardware
  • 2. software
  • 3. molecule
  • 4. signal
  • 5. communication channel
  • 6. protein