సుజననీయం

-- ప్రఖ్య వంశీ కృష్ణ

సంపాదక బృందం:
ప్రఖ్య వంశీ కృష్ణ
తల్లాప్రగడ రావు
కూచిభొట్ల ఆనంద్
తాటిపాముల మృత్యుంజయుడు
శంకగిరి నారాయణ స్వామి
డా. జుర్రు చెన్నయ్య
శ్రీమతి తమిరిశ జానకి

శీర్షికా నిర్వాహకులు:
కాకుళవరపు రమ
పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం

సాంకేతిక సహకారం:
తూములూరు శంకర్
మద్దాలి కార్థీక్
వక్కలంక సూర్య
లొల్ల కృష్ణ కార్తీక్

అక్షర కూర్పు:
మహేశ్వరి మద్దాలి
అనంత్ రావు

ప్రచార విభాగం:
అయ్యగారి లలిత
కొండా శాంతి

ముఖచిత్రం:
ఏప్రిల్ మాసంలో జన్మించిన
రచయిత, సంఘ సంస్కర్త
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.


"నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషను" అన్నమాట తెలుగు సాహిత్యంపై మక్కువ ఉన్నవారందరికీ చిర పరిచితం. గిరీశంలాటి వారి సంగతి ఎలా ఉన్నా, మన నిత్య జీవితంలో నిజంగా మాట్లాడితేనే మనకు కొత్త దృక్కోణాలు అందించే వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ముఫ్ఫైయ్యేళ్ళ క్రితం బ్యాచిలర్సు డిగ్రీ చదవటమే మహా గొప్పవిషయం అవుతుండేదట. బి.ఏ. పూర్తి చేసినవారికి అమితమైన గౌరవ మర్యాదలుండేవట. అలాంటి వారి మాటలే సమాజానికి వెలుగు బాటలు చూపిస్తుండేవట. ఈనాడు మాస్టరు చదువు సామాన్యమైన విషయం అవుతోంది. అలాంటి నేటి పరిస్థితుల్లో మరి మనకు అడుగుకి ఓ అవతారపురుషుడు తారసపడాలి, న్యాయంగా. కానీ, నేటి సమాజం పరిస్థితి ఏమిటో మనకు తెలియనిది కాదు. చాలా మంది చదువుకుంటూనే ఉన్నారు. వారందరికీ వ్రాయడం, చదవడం వరకు వచ్చు. చదివినది ముక్కున పట్టి పరీక్షలలో తుమ్మేసి ఆ జలుబు వదిలించుకున్న ఆనందంలో చదువుకున్న దాన్ని ఆచరణ కాదు కదా కనీసం అవగాహన అయినా చేసుకోకుండా "పట్టభద్రు"లవుతున్నారు చాలామంది. వారికి ఆయా పట్టాలు భద్రంగా దాచుకుని మురిసిపోయే అలంకారాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి.

విద్యయొసగు వినయము.. దాని నుండి పాత్రత, అందువల్ల వివేకము, అటునుండి ధనం, ఆపై ధర్మ సాధనము, తద్వారా సుఖము మానవునకు సంప్రాప్తించును అని ఆర్య వాక్యం. ఈ క్రమంలో ఎవరు ఎక్కడ గాడి తప్పుతూ ఎటు నుండి ఎటు వెళుతునారో ఎవరికివారు బేరీజు వేసుకోవలసినదే. ఇదే స్థిరమైన పంథా అనో లేక ఈ పధ్ధతిలో సాగితేనే సరైన తీరు అనో వాదించడంలేదు. స్థూలంగా ధర్మసాధన వైపుగా మన పంథా నడిపింపబడటంలేదని చెప్పడం ఉద్దేశ్యం. అనగా ఏదో మతాన్ని అనుసరించడం కాదని పాఠకులకు మనవి.

మన పిల్లలెవరన్నా అబధ్ధం అడో లేక మాటలతో మోసం చేసో అనుకొన్నది మొండిగా చేస్తే తప్పు అనో ఒద్దనో సుద్దులుచెప్పక "ఆహా మావాడు అద్భుతమైన తెలివితేటలతో ఉన్నాడు, వీడు బ్రహ్మాండంగా బతికేస్తాడు" అని మురిసిపోయేవాళ్ళే మనలో చాలా మంది. మనది కానిది ఎంత విలువైనదైనా మనకు దొరికితే ఎవరూ చూడకపోయినా జేబులో పెట్టుకోకుండా ఉండటం చాలా విశేషం అయింది ఈనాడు. నిజాయితీగా మనలో తప్పులను నిర్మణాత్మకంగా ఎత్తిచూపడం శతృత్వం. అవకాశం వచ్చినా అలుసు తీసుకోకుండా ఉండేవాడు ఒట్టి చవట. ఒక వేళ అలా చేయకుండా 'మంచిగా' ఎవరన్నా ఉంటే అది చాలా గొప్ప ఆదర్శం నేర్చుకోండని చెప్పడం వరకే పరిమితం, లోపల ఎంత నవ్వుకున్నా. ఆర్య చాణక్యుదు చెప్పినట్లు మనిషికి కనీస ధర్మాలు ఆచరించడమే గొప్ప ఆదర్శమైపోయింది ఈనాడు. భారత జాతి పరిరక్షణా ఉద్యమంలో పాల్గొని కనీస ధర్మం నిర్వర్తించమని ప్రాధేయపడ్డ ఆ మహావ్యక్తి కి తామేదో గొప్ప ఆదర్శాన్ని లోకానికి పరిచయం చేస్తున్నట్టు ప్రవర్తించిన రాజులనుద్దేశించి ఆయన ఆ మాట అన్నాడు. నేటి పరిస్థితికి ఇంకేమి అనగలడో!

ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన రావడం మానవ నైజం. తాను సాధించిన దానికన్న గొప్ప విషయాలు శోధించడం సహజం. తనకు ఇవ్వబడిన మేధస్సుతో ప్రకృతికి సరికొత్త అందాలను అద్భుతాలను అందించడం మనిషికి ఆనందాన్ని కలిగించే విషయం. నిత్య వ్యవహారంలో అబధ్ధమాడకుండా ఉండటం ఉండాల్సిన లక్షణం. నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వటం మనిషికి కనీసపు ఆశ. ఇలాటివి ఎన్నో. నైజం అన్నా, లక్షణం అన్నా అవన్నీ మనిషి ధర్మాలు. స్థూలంగా చెప్పాలంటే సత్యానికే విజయం కలిగేలా తన ప్రవృత్తిని, తద్వారా విలువలు నిండిన నాగరికతను పెంపొందించుకోవడం ప్రతి మానవునికీ అత్యంత ముఖ్యమైన ధర్మం.

ఇవన్నీ వినటానికి బాగానే ఉన్నా మన నిత్య జీవితంలో ఎంతో మంది "చదువుకున్న" వారి ప్రవర్తనలోనే ఇవి మృగ్యం అవుతున్నాయి. అంటే మనిషి తన ధర్మాన్ని తప్పుతున్నాడని ప్రతిక్షణం తేటతెల్లమవుతోంది. ధర్మాలు, విలువలు గుఱించి తెలిపేది, మన జీవితంలో అన్నిటికీ మూలము అయిన "విద్య"లోనే ఏదో లోపం జరుగోతోందని స్పష్టం. విద్య వివేకాన్ని, విలువలను గాక పశు ప్రవృత్తిని, స్వార్ధ చింతనను పెంపొందించినంత కాలం మనం అక్షరాస్యులము అవగలమేమో కానీ వివేకవంతులం కాలేము.

డబ్బు సంపాదనే ధ్యేయంగా పరుగులు పెదుతున్నాం కనుకనే అక్షరాస్యత వైపు మాత్రమే మనం పురోగమిస్తున్నాం. అందుకు యే చదువు మనకు ఉపయోగపడుతుందో అది పిల్లల ముక్కున పట్టేలా చేస్తున్నాం. అందువల్ల మనుషుల్లో విలువల లేమి ఒకపెద్ద నష్టం. అందునా డబ్బు వెంట మత్రమే పరుగెత్తే చదువు వల్ల తెలుగు జాతికి అదనంగా ఒక పెద్ద నష్టమే జరుగుతోంది. ఇటీవలి అనేక పరిశోధనలలో ఆ విషయం నెమ్మదిగా బయట పడుతోంది. నేడు ఆంధ్రావనిలో 70% మంది పిలల్లు తెలుగు వ్రాయటానికే దూరమవుతున్నారట. తెలుగు నేర్చితేనే వివేకం వస్తుందని అనట్లేదుగానీ, ఆ క్రమంలో తెలుగుకు పెద్ద దెబ్బే తగులుతొంది. అందుకు మళ్ళీ కాసేపయినా బాధపడేదీ మనమే.

నిన్న- రేపు మధ్య సంధియుగంలో ఉన్నాం కాబట్టి తెలుగును బతికించుకోవల్సిన బాధ్యతా మనమీదనే ఉంది. మళ్ళీ మన చదువుల పుణ్యమో ఎమో తెలియదు బాధ్యత దగ్గరకి వచ్చేసరికి ప్రతి వారూ పక్కవారిని ఎత్తి చూపేవారే. పాపాలభైరవుడిలా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే ఎత్తి చూపేవారే. ఈ బాధ్యతలో ప్రభుత్వానికి ఎంత పాలు ఉందో అంతకు రెట్టింపు పాలు మనదే. అనగా ప్రజలదే! మనం వాడట్లేదు కాబట్టి 'అక్షరాలను తొలగించేయండ'నేవారు ఒకరైతే, మాకు అర్ధం కాని విషయాలు చెబుతున్నారు, మా మాండలీకంలో ఆ పదాలు లేవు కాబట్టి పాఠాలు తొలగించమనే వారు ఇంకొందరు. ఇక చదువుకు పరమార్ధమేమున్నది? మనకు తెలిసినదే చెబితే అది చదువెట్లా అవుతుంది.

కాబట్టి అర్ధం లేని వివాదాలు కట్టిపెట్టి "గట్టి మేల్ తలపెట్టాల్సిన" బాధ్యత మనందరి మీద ఉన్న్నది. బాధ్యత స్వీకరించి, మన భాషలో స్వయం సమృధ్ది సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విలువలు కలిగిన తెలుగు చదువును మనంతట మనమే మొదలెడితే ఉభయ తారకంగా ఉంటుంది.

సరిగా ఈ ఉద్దేశ్యంతోనే సిలికానాంధ్ర "మనబడి"ని ప్రారంభించింది. ఔత్సాహికులైన వ్యక్తులు కొంతమంది అహోరాత్రులు పరిశ్రమించి పాఠ్య ప్రణాళికలు తయారుచేసి తెలుగు పిల్లల్లో విలువలు నిండిన తెలుగు బోధనా తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రవాసంలో తెలుగువారు ఒక వ్యవస్థీకృతంగా పెద్దయెత్తున చేయటం ఎంతో ముదావహం. ఈనాటి పరిస్థితులలో ఆదర్శవంతం. తెలుగు వారిగా మన కనీస ధర్మం. ఈలాంటి ప్రయత్నాలు తెలుగు గడ్డ బయటే కాక తెలుగు పుట్టింట్లోనూ జరిగితే ఇక తెలుగు భవితవ్యానికి పూర్తి భరోసా ఉన్నట్లే.

తెలుగును పదికాలాలు పాటు కాపాడుకోవల్సిన బాధ్యతలో భాగంగా సుజనరంజని నవీన సాంకేతికతను తెలుగు నట్టింట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తొంది. అందులో భాగంగానే మా చిట్టిపాపాయి సుజనరంజని కి కొత్త సంవత్సరానికి యూనికోడ్ పావడా కుట్టించాము. ఇక నుంఛి ఈ కొత్త సంప్రదాయపు హంగులతో అలరారబోతున్నది. మునుపటికన్నా తేలికగా సుజనరంజని వ్యాసాలు అంతర్జాలంలో వెతికి పట్టుకోవడానికి వీలుగా ఈ సంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నాము. కొత్తదనాన్ని ఆహ్వానించి మన విస్తృతి పెంచుకునే ఈ ప్రయత్నం మీకూ నచ్చుతుందని భావిస్తాము.

ఇదే ఉద్యమంలో మరో ముఖ్య ప్రయత్నం తెలుగును విరివిగా వాడటం. శాస్త్ర రంగంలోనూ తెలుగును వాడగలిగే పరిస్థితులు పెంపొందిస్తే ఇక తెలుగు భవిష్యత్తు కోసం చింతించాల్సిన పని ఉండదు. అందుకు నవీన సాంకేతిక యుగానికి తగినట్లు కొత్త పదజాలాన్ని తెలుగుకు అందిస్తే మనం భవిష్యత్తుకు సరైన వారధి కట్టిన వారము అవుతాం. ఆ ఉద్దేశ్యంతో ఈ నెల నుంచి ప్రఖ్యాత శాస్త్రవేత్త శ్రీ వేమూరి వెంకటేశ్వర రావు గారి నిర్వహణలో "వీరతాళ్ళు" అనే శీర్షికను, కొత్త పదాలను తయారుచేసే యజ్ఞాన్ని మొదలుపెడుతున్నాము. ఈ బృహత్ కార్యక్రమంలో "నేను సైతం.. పదమొక్కటి ఆవిష్కరించాను.." అని పాడుకునేలా వీరతాళ్ళు వేసుకోవలసినదిగా మనవి.

మీ
ప్రఖ్య వంశీ కృష్ణ