సిలికానాంధ్ర కుటుంబము

సంస్కృతీ సుసంపన్నం :

దిగ్విజయమైన కవి సమ్మేళనం - గజల్ గాంధర్వం తెలుగు పిల్లలు దేవ గురువు బృహస్పతి వద్ద కలసిగటుగా చేసిన్ విద్యాభ్యాసం... ముదులొలికే చిట్టిపాపల మనసు మురిపించే పాటలు.. అక్షరవిన్యాసాలతో కవులు ఆవిష్కరించిన రసరమ్య భావ చిత్రాలు... గాన గంధర్వులు గజల్ బాణిలో మైమరపింపజేసి చేయించిన గానసుధారసపానం... ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం,అణువణువునా తెలుగుదనం నిండిన ఆహార్యం... ఇవన్నీ కలగలిసిన తెలుగు సాంప్రదాయ సప్తవర్ణచాపం ఆధునిక సాంకేతికతకు పుట్టినిల్లైన సిలికాన్ వేలీలో సరికొత్త హంగులతో ఆవిష్కృతమయింది. వీటికి తోడుగా కార్యక్రమం ఆసాంతమూ ఆస్వాదించిన ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోతే; క్రమశిక్షణ, తపన మూర్తీభవించిన కార్యకర్తలే అందరికీ వండి వడ్డిస్తే... ఈ షడ్రసోపేతమైన అనుభూతే సిలికానాంధ్ర ఈ సర్వజిత్ ఉగాది పురస్కతించుకుని చేసుకున్న ఉత్సవం.

సిలికాన్ వేలీలోని శివ విష్ణు దేవాలయం, సిలికానాంధ్ర సమ్యుక్తంగా మార్చ్ 24న నిర్వహించిన శ్రీ సర్వజిత్ ఉగది ఉత్సవం - గజల్ గాంధర్వం" దిగ్విజయమయింది. ఉదయం 11గం. నుండి 3 గం. వరకు పిల్లలకు వయసుననుసరించి చిట్టి-పొట్టి పాటల్లోను, మాస, ఋతు, రాశులలోను, సంవత్సరాల పేర్లలోను పోటీలు నిర్వహించారు. 170 మంది పిల్లలు పాల్గొని వారికి కేటాయించిన అంశాలకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివి ఉత్సాహంగా పాల్గొనడంతో న్యాయ నిర్ణేతల పని కత్తి మీద సాము అయింది.

సిలికానాంధ్ర ఈ ఉగాదిని పురస్కరించుకుని ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. తెలుగు వారి పిల్లలకు తెలుగులో అక్షరాస్యతను, ఆపైప్రతిభను పెంపొందించే సదాశయంతో వారాంతపు పాఠశాల, "మనబడి" అన్న పేరుతో ఘనంగా ప్రారంభించింది. దేవగురువు బృహస్పతులవారి సమక్షంలో పిల్లలు అక్షరాభ్యాసం చేశారు. గత కొన్ని నెలలుగ కార్యకర్తలు పాఠ్య ప్రణాళికలను శ్రమించి తయారు చేసుకుని బడి ప్రారంభానికి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. సుమారు 150 మంది కి పైగా నమోదు చేసుకుని మనబడిలో తెలుగు పాఠాలు నేర్చుకోటానికి శ్రీకారం చుట్టుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం తమ సహకారం అందిస్తుందని వారి తరఫున శ్రీమతి ఆవుల మంజులత దూరవాణి సందేశంలో తెలిపారు.

సాయంత్రం అయిదు గంటలకే సరిగ్గా వేద పఠనతో ప్రారంభమైన కార్యక్రమంలో కవితా గాన సుధలు ఆహూతులను పునీతులను చేశాయి. సంప్రదాయ పంచాంగ పఠన చేశాక కవులు స్వీయ కవితా పఠనతో అలరించారు. చిత్రాలను చూపి ఆశువుగా కవిత వ్రాయమని అడగగా ప్రేక్షకులూ తమ కవితా స్ఫూర్తిని వందలాది కవితలతో తెలియజెప్పారు. సుజనరంజని ఆ కవితలను నెల నెల కొన్ని అందించబోతోంది.

కార్యకర్తలే రచించిన కొన్ని గీతాలతోను, ప్రఖ్యాత రచయితల రచనలు కూడిన గజళ్ళు అందరినీ రసమయలోకాల్లో విహరింపజేశాయి. కార్యకర్తలే స్వరపఱచి పాడిన పాటలువారి ప్రతిభను ఎలుగెతి చాటాయి. ప్రేక్షకులు ఇంకా కావాలి అంటూ ఈలలౌ వేయించడం నిజమైన సత్కారం.

చివరగా కార్యకర్తలే వండి వడ్డించిన భోజనం కొసరి కొసరి వడ్డించారు. నాటి కార్యక్రమంలో చిన్నారులు ఎంతో మంది ఆసక్తిగా సంస్కృతి గురించి తెలుసుకుంటూ ప్రశ్నలడగడం, కార్యక్రమ ఉద్దేశ్యం నెరవేరిందని నిర్వాహకులు తెలిపారు.

ఓం భూర్భు వస్సువః

సిలికానాంధ్ర క్రియాశీలక సభ్యులైన తాటిపాముల మృత్యుంజయుడు, జయమాల గారల కుమారుడైన శ్రీదత్త కౌస్తుభ్ ఉపనయనం మార్చి 25 న సిలికాన్ వేలీ లోని సనాతన ధర్మ కేంద్రంలో జరిగింది. ఇతర సిలికానాంధ్ర సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి వటువును ఆశీర్వదించారు. తదుపరి ప్రీతికరమైన భోజనం కూడా ఏర్పాటు చేసారు.

మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు:

సుప్రసిద్ధ జానపద గాయకులు, కీ.శే. మానాప్రగడ నరసిం హమూర్తి గారు ప్రతి తెలుగువారందరికి పరిచితులే. వారి కుమారుడు శ్రీనివాస్ సిలికానాంధ్రలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నాడు. శ్రీనివాస్, కవితల కుమారుడైన "సిమ్హ" మొదటి పుట్టిన రోజు సన్నీవేలులోని ఇండియా స్పైస్ రెస్టారెంటులో జరుపుకొన్నారు. ఆ వేడుకకు ఇతర సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అంతా విచ్చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.