సర్వజిత్ సంవత్సరాది

-- డా. అనంతలక్ష్మి

కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించటం ఋషులు భారతీయులకిచ్చిన సంప్రదాయం. కాలం అంటే ఏమిటో, దాని స్వరూపం ఏమిటో తెలుసుకున్న వారు సమస్తమూ తెలుసుకున్నట్టే. వీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని, కాలవేదులు కనుక కాలవిజేతలవుతారని ఆర్యోక్తి. అందుకే, సంవత్సరంలో ఒక్క రోజైనా కాలసంబంధమైన జ్ఞానసముపార్జనకి కేటాయించాలనే ఉద్దేశంతో సంవత్సరాదినాడు పంచాంగశ్రవణం చేయాలని విధించారు. దీనినే నిత్యం సంద్యావందన సమయంలో కాని, పూజాసమయంలో కాని సంకల్పం అనే పేరుతో స్మరించుకునే పద్ధతినికూడా అలవాటు చేసారు. సంకల్పంలో అనంతవిశ్వంలో మనం ఉండేచోటు, అఖండకాలంలో మనం తలచుకుంటున్న సమయం గుర్తించటం వుంటుంది - ఉత్తరాలలోను,ఇతర పత్రాలపైన తేదీ, స్థలం వేసే అలవాటులాగా. చోటు విషయం అటుంచి, కాలానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకోవాల్సిన సమయం క్రొత్త సంవత్సర ఆరంభం.

"సంవత్సరాది" లేక "ఉగాది" కాలానికి చేసే పుట్టినరోజు పండుగ. అనంతమూ, అఖండమూ అయిన కాలాన్ని సౌలభ్యంకోసం, ప్రకృతి సహజమైన రీతిలో విభాగించుకొని, తదనుగుణమైన ఆచార విధానాలను ఏర్పరుచుకొన్న విజ్ఞులు భారతీయులు. కాలగమనం మండలాకారం. కనుకనే దానికి ఆది, అంతం ఉండవు. ఏదిమొదలో అదేచివర అవుతుంది. మనకి బాగా అనుభవంలో ఉన్న కాల"చక్రం" -వారం. ఆదివారంతో ప్రారంభమైన వారం శనివారంతో పూర్తి అయి, అంతటితో ఆగిపోదు. మళ్ళీ ఆదివారంగా కొనసాగుతుంది. కార్యాలయాలలో పనిచేసేవారు వారాన్ని లెక్కించటం సోమవారంతో మొదలుపెడితే ఆదివారం చివరిరోజు అవుతుంది. అన్నిటికన్నా చిన్న "చక్రం" రోజు. ఇంకొంచం పెద్దది నెల. అంతకన్నా పెద్దది సంవత్సరం. అన్ని దేశాలవారు, అన్ని సంప్రదాయాలవారు కాలగణనకి స్థూల ప్రమాణంగా సంవత్సరాన్ని గ్రహించారు. దీనికి కారణం - ప్రకృతిలో జరిగే అన్ని మార్పులూ ఒకసారి వచ్చిపోవటానికి పట్టే కాలం ఇది. ప్రకృతిలో సంభవించే మార్పులు ఋతువులు. వాటి ఒక ఆవృతం ఒక ఏడాది.

కాలగణనకి స్థూల ప్రమాణం ఒక "ఏడాది" అయితే, సూక్ష్మ ప్రమాణం పరమాణువు. ఇది సృష్టిక్రమంలో "దేశము", "కాలము" అనే విభజన ఏర్పడటానికన్నా ముందున్న స్థితి. ఆ పరమాణువు నుండి బ్రహ్మాయువు వరకు కాలాన్ని చాలా శాస్త్రీయంగా గణించారు ద్రష్టలైన ఋషులు. వాటిలెక్క ఈవిధంగా తెలిపారు:

సూర్యుని వెలుగులో తిరుగుతూ కనపడే నలకలో ఆరవ వంతు అన్నింటికన్నా చిన్న ప్రమాణం. దానిని "పరమాణువు" అంటారు. ఆ పరమాణువులో ఒకవైపునుండి మరొకవైపుకి సూర్యరశ్మి ప్రయాణించటానికి పట్టేసమయం 'సూక్ష్మకాలం' - 12 రాశులలో సూర్యుడు ఒకసారి తిరిగి రావటానికి పట్టే సమయం. 'మహత్కాలం' అంటే సంవత్సరం.
2 పరమాణువులు - ఒక అణువు
3 అణువులు - ఒక త్రసరేణువు
3 త్రసరేణువులు - త్రుటి
100 త్రుటులు - వేధ
3 వేధలు - లవము
3 లవములు - నిమిషము (రెప్పపాటు, నిముషం కాదు)
3 నిమిషములు - క్షణము
5 క్షణములు - కాష్ఠ
10 కాష్ఠలు - లఘువు
15 లఘువులు - నాడి
2 నాడులు - ముహూర్తము
3 ముహూర్తములు లేక 6 నాడులు - ప్రహరము లేక యామము
4 యామములు - పగలు లేక రాత్రి
8 యామములు (ఒక పగలు + ఒక రాత్రి)- ఒక దినము
7 దినములు - వారము
2 వారములు (సుమారుగా) - పక్షము
2 పక్షములు - నెల, విలాసము
2 మాసములు - ఋతువు
3 ౠతువులు - అయనము
2 అయనములు - సంవత్సరము
4,32,000 సంవత్సరములు - కలి యుగం
8,64,000 సంవత్సరములు - ద్వాపర యుగం
12.96,000 సంవత్సరములు - త్రేతా యుగం
17,28,000 సంవత్సరములు - కృత యుగం
43,20,000 సంవత్సరములు - మహా యుగం
71 మహా యుగాలు - మన్వంతరం
14 మన్వంతరాలు - బ్రహ్మాహం, బ్రహ్మకు ఒక పగలు
360 దినాలు - బ్రహ్మకు ఒక సంవత్సరం
100 బ్రహ్మ సంవత్సరాలు - బ్రహ్మ పదవీ కాలం

లెక్కించుకోవటం, గుర్తుంచుకోవటం అనే వీలు కోసం కాలాన్ననుగుణంగా విభజించుకోవటానికి ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుడే మూలం. అటు పైన చంద్రుడు. వీరిద్దరి గమనాల రూపంగానే కాలం వ్యక్తమౌతుంది.

సూర్యగమనాన్ని అనుసరించి కాలగణనం చెయ్యటం సూర్యమానం. చంద్రుడి గమనాన్ని అనుసరించి కాలగణనం చెయ్యటం చంద్రమానం. గురుడిగమనాన్ని అనుసరించి చేసే కాలగణనం బార్హస్పత్యమానం. భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రులు చాంద్రమానాన్ని పాటించేవారే అయినా, సౌరమానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయనాలు, సంక్రమణాలు, విషువులు మొదలైనవి సౌరమానాన్ని అనుసరించి పాటిస్తారు. ఈరెండు మానాలని సమన్వ్యయించటానికి ఫలితమే మూడేళ్ళకొకసారి వచ్చే అధికమాసాలు.

మొత్తానికి, పాటించేది ఏమానమైనా, ప్రతి పద్ధతిలోనూక్రొత్త సంవత్సర ప్రారంభాని వేడుకగా జరుపుకుంటారు అందరూ. తెలుగువారు, మహారాష్టృలు, కన్నడిగులు చైత్రశుద్దపాడ్యమిని క్రొత్త సంవత్సరాదిగా పండుగ చేసుకుంటారు. ఉత్తరదేశవాసులు, తమిళులు, మలయాళీలు వేరు, వేరుగా పాటిస్తారు. చైత్రశుద్దపాడ్యమి ప్రత్యేకత ఏమిటి? అనే సందేహం కలగటం సహజమే. సృష్టి కర్త అయిన బ్రహ్మ చరాచర సృష్టిని ప్రారంభించి, కృతయుగారంభం చేసిందీరోజునే కనుక ఇది 'యుగాది ' అని, కాలక్రమంలో అది 'ఉగాది ' అయిందని చాలా మంది అభిప్రాయం. చాంద్రమానాన్ని పాటించేవారికి ఈరోజే సంవత్సరాదిగా విహితమైందని చతుర్వర్గ చింతామణి ఉద్ఘాటించింది.

"చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జప్రధమేహని
శుక్లపక్షే సమగ్రంతు తథాసూర్యోదయేసతి
వత్సరాదౌ వసంతా దౌరవిరాజ్యేతదైవచ"

ధర్మసింధువు కూడా ఇదేవిషయాన్ని బలపరుస్తోంది. వరాహమిహిరుడు, హేమాద్రి పండితుడు, నిర్నయసింధుకారుడు కూదా సృష్ట్యాదిని ఉగాదితో ముడిపెట్టి ఉపపత్తులను కూడా చూపారు

భస్కరాచార్యుడు తన సిధ్ధాంత శిరోమణి అనే గ్రంథంలో చైత్రశుధ్ధ పాడ్యమినాడు లంకానగరం (శ్రీలంక కాదు, రేఖపై సూర్యుడు ఉదయించే ప్రదేశం) నుండి ఉదయించటం వల్ల ఆనడే ఉగాదుల, దిన, మాస, వర్షారంభము ఒకేమారు సంభవించును అని పేర్కొన్నాడు.

ఇది "యుగాది" కాదు. 'ఉగాదీయే అని నిర్ధారించినవారూ "ఉ" అంటే నక్షత్రం, "గ" అంటే గమనం. "ఉగ" మంటే నక్షత్రం గమనం 'ఉగ+ఆది ' అంటే నక్షత్రాల గమన ప్రారంభం. శకాలు , మానాలు మారవచ్చుకాని, నక్షత్ర గమనం స్థిరం. (నక్షత్రాలంటే మనం అనుకునే తారలు కావు. భూమధ్యరేఖని అనుసరించి ఉంటే కంకణాకారపు చోటు లో ఉన్న విభాగాలు. కణుపులు వంటివి). దానినాధారంగా వేసే లెక్కలలో ఎప్పటికీ తేడాలుండవని అందరూ అంగీకరించినదే. ఇటువంటి నక్షత్ర గమన ప్రారంభాన్ని కాలగణనానికి అదిగా గ్రహించటం శాస్త్రీయమని చాలామంది పంచాంగ కర్తల అభిప్రాయం. దానిననుసరించి 'ఉగాది ' అంటే నక్షత్రచారణం, గ్రహచారణం ప్రారంభమైన క్షణం కనక అదే సృష్ట్యాది, అదే సంవత్సరగణనానికి మొదలు.

ఈ లెక్కలని అనుసరించి ఈ సర్వజిత్ ఉగాది సృష్ఠికి నూటమూడుకోట్ల, ఇరవైతొమ్మిది లక్షల, నలభైతొమ్మిదివేల, నూటఏడేళ్ళునిండి నూట ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభసందర్భం. ఇప్పుడు ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో అయిదువేల నూట ఎనిమిదవ సంవత్సరం ప్రారంభం అవుతోంది. కొత్త సంవత్సరంలో తొలి రోజు శుభప్రదంగా ఉంటే ఏడాది అంతా శుభంగా ఉంటుందని నమ్మకం. దాని కోసం శాస్త్రకారులు కొన్ని సూచనలు కూడా చేసారు.

అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, నింబపల్లవ భిక్షణం పంచాంగ శ్రవణం తప్పనిసరియట! పిండివంటలు, బంధుమిత్రులతో పందుగలు చేసుకోవటం యథాశక్తి. పంచాంగములు అంటే తిథి,వార నక్షత్ర, యోగ, కరణములు - తెలుసుకుంటే మనిషికి తన అల్పత్వం అర్థం అయి, వినయ సంపన్నుడౌతాడు - కాల్సృభావం తెలుసుకుంటే, కాలవిహిత వర్తమానం అలవడే అవకాశం ఉంటుంది. నవనాయకులు, ఆదాయ కందాయాలు, సంక్రాంతి పురుషవర్ణన మొదలైనవి తెలిస్తే సంవత్సరానికి తగిన ప్రణాలిక వేసుకోవటానికి వీలవుతుంది. ఉగాది పచ్చడి ప్రయోజనం, ప్రతీకాత్మకత అందరికీ తెలిసిందే!

కాలమానానికి ప్రమాణం '60' సంఖ్య. నిమిషానికి సెకెనులు, గంటకి నిముషాలు అరవై. అదేవిధంగా సంవత్సరాలు అరవై. ఇవన్నీ నారదుని కుమారులని పురాణోక్తి. సంవత్సరనామం దాని లక్షణాలకి సంకేతం. వ్యయ అంటే కర్చు చేసేది. కాలవిదులకు అయిన కర్చు కష్టాలు కన్నీళ్ళు, కోపాలు, తాపాలు, పాపాలు, రోగాలు మొదలైనవి. పంచాంగ శ్రవణం చేయాల్సింది ఈ తెలివి కోసమే. అడుగుపెడుతున్నది ‘సర్వజిత్’లో. సర్వజిత్ అంటే అన్నింటినీ గెలిచినది అని అర్థం. ఖష్టాలను, నష్టాలని గెలిచి, సుఖాలపైన, శుభాలపైన ఆధిపత్యం సంపాదించుకుని ఎదురులేని విధంగా జయపతాక ఎగురవేయాలనినిర్ణయించుకుందాం. ఆదిశగా అడుగువేద్దాం.

అవ్యయమౌ సుఖానుభవమందగజేసి గతించినట్టిదై
నవ్యయనామ వత్సరము నాల్కలపై చిరుచేదునించెగా
భవ్యత దాని నింబముగ పచ్చడిజేర్చి శుభంకరంబుగా
సవ్యమగు స్థలాన నిడి సర్వజిదబ్దము సార్ధకంబాయెను

ఆంతరంగిక బాహిర అరుల గెలిచి
ఆత్మపై పట్టు బాగుగ నలవరించి
తోటి నారల మనసెరిగి తోడగూడి
సర్వము జయించ నేర్పుత సర్వజిత్తు

.

డా. అనంతలక్ష్మి గారు 34 యేళ్ళుగా అధ్యాపక వృత్తిలో ఉండి పలు కథలు, గేయాలు, విమర్శనా వ్యాసాలు వ్రయటం వీరి ప్రవృత్తి. సాహిత్యంలో పలు పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించారు. వీరి డాక్టరేట్ పట్టా ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి పొందినారు. హైదరాబదు వీరి ప్రస్తుత నివాసస్థలం.