పెద్దమ్మతో ఉగాది!

--ప్రఖ్య మధు బాబు

సిలికానాంధ్ర నిర్వహించిన సర్వజిత్ ఉగాది కవిసమ్మేళనంలో ప్రస్తుతపఱచబడి శ్రోతలను ఉర్రూతలూగించిన ఈ కవితను మీకోసం అందిస్తున్నాం....

పూవులను పూయించే
గోవులను తోలించే
దిక్కులను పాలించే
దిక్పాలకులను లాలించే
అమ్మ దుర్గమ్మ!

పక్షులకు యక్షులకు
దైత్య గర్వులకు, గంధర్వులకు
మునికైన, యమునికైన
కొట్లాది జీవులకు
ముక్కొటి దేవులకు
అమ్మ దుర్గమ్మ!

ఉదయించ భానుడు
అమ్మను హౄదయమున ధ్యానించితిని
ఉగాది వచ్చింది ఆ కౄష్ణవేణమ్మ క్రీడలో
ఉగాది వచ్చింది ఇంద్రకీలాద్రి మేడలో
ఉగాది వచ్చింది పెద్దమ్మ నీడలొ
ఉగాది వచ్చింది దుర్గమ్మ ఒడిలో
ఉగాది వచ్చింది ఆ విజయవాడలో
కోయిలలు కూయంగ
ఈ ఇలను గేయంగ, వేదస్వరాలతో
సకల బీజాక్షరాలతో

అప్పుడు అమ్మ చెప్పింది

సంసారమును ఏలు సంసారమే నాది
అన్నియు అనాది, అన్నిట ఉగాది
ముద్దు బిడ్డలు నాకు ముగ్గురు నాయనా
!
అల్లారు ముద్దయిన వాడు ఆ పెద్దవాడు
వెన్నలను దోచేడు
మిన్నులా తోచేడు
రేపల్లె తిరిగేడు
ఆడు పిల్లలకు మరిగేడు
అవతారముల పేర్ల
అల్లర్లు చేసేడు
వేషములు మార్చేడు
జగతినేమార్చేడు
'బాబూ! ఏమిటి అవతారం?
కాదయ్య అన్నీ నీ తరం
దాదా నాయనా! యసోదా నయనా!
దాదా పని మాను , నా చిన్ని కన్నా!
నిక్రుష్టులకు దూరముగ
నీవు కృష్ణుండవై యుండు ' అని

కన్నయ్య పై కనక దుర్గమ్మ కన్నేసి వుంచేను
కన్ను మిన్నైన కన్న తల్లై కాచేను
కౄష్ణునికి అమ్మయై క్రిష్ణమ్మయై వెలిసె
కనక దుర్గమ్మ గా తెలిసె

ఇంకోడు బ్రహ్మనెడు వాడు
బొమ్మలను చేసేడు
అమ్మలను చేసేడు
అందాల బొమ్మలను అమ్మలుగ చేసేడు
అమ్మలను కూర్చి బొమ్మలుగ మార్చేడు
పిల్లలు పిల్లులు
ఈకలు మేకలు
తోకలు కోకలు
ఏనుగులు ఎలకలు
బ్రహ్మ తరమే గాదు
ఆ తరములెన్నున్నవో
అందుష్కరములెన్ను న్నవో

అతివౄష్టి అనావౄష్టి నికౄష్టి
అవకతవకల దృష్టి
అతుకుబొంతల సౄష్టి

రంగుహంగుల మధ్య వికలాంగులెందరో
లావు సన్నములేమి ? చావు జన్మములేమి ?
గుడి లేని దేముదు
బ్రహ్మ చెముడు
చెబితేను వినడు
భాగ్యముంటే లేదు ఆరోగ్యము
ఆరోగ్యమున్న మరి లేదు భాగ్యమో సౌభాగ్యమో

దారిద్ర్యమో భావ దారిద్ర్యమో
దారి తెలియని బ్రతుకు మహ భారమో
ఏమి లోకం ఇది పిచ్చి మాలోకం
చచ్చి పుట్టితిమి కదా ఇది ఏమి సోకం
బ్రహ్మ సౄష్టికి అమ్మ చక్క దిద్దును కర్మ
చరితార్ధముగ జన్మ కనుచున్న కనక దుర్గమ్మ

ముద్దు మూడోవాడు మూడుకన్నుల వాడు
ముద్ద తినకుండా రుద్రుడై తిరిగేడు
జడలు కట్టిన తలతో
పులిని కట్టిన మొలతో
ఎద్దుపై తిరిగేడు
ఇది ఏమి పిల్లోడు

అందరు దేవుళ్ళు సుగంధాలతో వుంటె
మసి పూసుకున్నాడు
పరమ శివుడు
పూవాటికీ పోడు
వీటికీ రాడు, కాటిలో తిరిగేడు

హిమరాజు కొమతెతో హిమాలయముల చేరి
గంగ జలమ్ములడేడు
తలముంగంగ
శీతలంబని చూడక
చందురుని శిరంబున దాల్చేడు

శంక లేదమ్మకు శంకరుని కరుణపైన
క్రీగంట తానెపుదు ముక్కంటి జూచేను
వరములిచ్చే వేళ స్థిరముగా కాచెను
' నిప్పు కన్ను నీవు విప్పకు నాయనా
తప్పు జరిగినను ముప్పు కలిగినను
రుద్రునివి కరాదు పుత్ర జగతి భద్రమ్ము కావలెయనె

ఎన్ని యుగములో ఏమి ఉద్యోగములో
నట్టింట వంట వార్పులు లేవు
నిట్టూర్పులె తప్ప
వెంట తిరిగిననేమి ఇంటి కోడళ్ళు

అమ్మ వరాల రూపుగా
అమౄతం సూపుగా
తాగి బతుంకుతున్నారు త్రిమూర్తులు

విరక్తితో శివుడు
విషము మింగును గాని
అన్నమే తినడేమి అన్నపూర్ణకి మొగుడు

చెదలు పట్టేటట్లు
చదువే లోకమ్ము
సభలలో మెలుగు
ప్రభలతో వెలుగు
ఆ వాణి కేంగాని
నావాని కేమౌనొ
పూట పూటకు పస్తు
వుండు నా కొడుకు
వాగ్దేవి వుత్తి మాటలతో నిండునా కడుపు

సిరి కిచ్చి చేసినా పెళ్ళి
స్థిరము లేదే తల్లి
పాల సంద్రాన కాపురం
పాము మా గోపురం
నా కొడుకు నారాయణత్వం
నడిపే ప్రభుతం
జగతికాధారి కోడలు
కోశాధికారి

ఎపుడు చూసినా వాడు
వైకుంఠ పాళిలో వుంటాడు
ఖాళి లేదంటాడు

కాళింది లోనో
కాల సర్పాలతోనో
నిచ్చెనలతోనో నిత్య అర్చనల తోనో
నాయనా!
అప్పు తీర్చని హంగు గొప్పదేమవుతుంది
ఏ కొండ అయినా గురువింద అవుతుంది
గుండు గొరిగింది అవుతుంది
జగతి గోవింద అవుతుంది

నువ్వు మాత్రం నాయన!
వర్ధిల్లు దేవి పుత్రుండవై
గురుచరణ భక్తుండవై
మంత్ర చిత్తుండవై
సజ్జనుల మిత్రుండవై
సాధకుల కండవై
వుద్దండవై
కుండలిని దండమై కోదండమై
మనసాధనం మన సాధనమ్మని
విహరించు సౌందర్యలహరి పై
శ్రీచక్ర ప్రహరిపై..