పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారిని ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు ఏప్రిల్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య

" ఇంటి కెడితేను టీవీని పెట్టి నారు "

క్రితమాసం సమస్య : విద్య లేని వాడు వింత పశువు

ఈ సమస్యకి ఎంతో నవ్వొచ్చే విధంగానూ, కొంటెగాను, మంచి సమాధానాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి!

మొదటి పూరణ (రెండు పద్యలలో పూరించారు) - పుల్లెల శ్యామసుందర్

ఆ.వె: వేడిగిన్నె చురక వాడిగా తగలగా,
వెర్రికేక పెట్టె గొర్రెలాగ,
పప్పు చేయబోవ, పలుచగా తేలగా,
ఓండ్ర పెట్టెనతడు నోర్వలేక,
,
ఆ.వె: పాకమువలెనున్న శాకముందినలేక,
రంకె వేసెనయ్య రంగచారి,
వంట చేసిపెట్ట యింట యిల్లాలు ' శ్రీ,
విద్య ' లేని, వాడు, వింత పశువు!!!,


రెండవ పూరణ - జక్కంపూడి సుబ్బారాయుడు

ఆ.వె.// విద్య యన వినయము, విజ్ఞాన సంపద,
విద్య యొసగు నేడు విత్తమార్జ,
నమున నేర్పు మిగుల, నరయగ (నయముగ) నిటువంటి,
విద్య లేని వాడు వింత పశువు,


మూడవ పూరణ - తల్లాప్రగడ రావు

ఆ.వె.// ఏమి చెప్పగలను ఏమి తెలియనోడ్కి,,
విద్యలేనివాడు వింత పశువు, ,
అంటె, ఆ విద్య ఎవరని యడుగునోడ్కి,,
నేను చెప్పనామె ఎవరొ నీకు! ,భక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్బం: అశోకవనంలో హనుమంతుడిని చూచి సీతామ్మవారికి ఎంతో ఆనందం కలిగింది. ఆ ఆనందం చూచిన కపివీరుడికి రాముడిని ఆతడి భార్య ఎలా ఏ విధంగా వర్ణిస్తుందోనని వినాలనిపించింది. కానీ ఆమె వర్ణన విన్నాక ఆతడి కపికాంక్ష కరిగి భక్తి భావన మరింత బలీయమైంది. ఆమె ఇలా అంది!

సీ://సుందరం సుమధురం సువచనపు కవచం, స్థిరతర సుహృదయ సుహృత తోడ,
ప్రహేలికా పరిరంభ ప్రస్తావనం, సీతాపతీం శిరసా న్నమామి!
పితృవాక్పాలనం పరమేశ్వరాధనం, పరమేష్టి పూజ్యం అపార జ్ఞాని,
ఆపాదమస్తకం! పాద్యపుష్ప సహితం, మదియు కరైక్యం సమర్పయామి!

తె.గీ://సుకృతం, ఖిదత్తం, సువిశారదావి
నమ్రతం, సుశీలం, సుజానం, మృదు మద
న వదనం, ఇత్యాది గుణగణ విరసిత న
ర అవతారమై నమసిత రామచంద్ర!

ప్రతిపదర్థం:

సుందరం = ఎంతో అందగాడు,
సుమధురం = మధురమైన మనస్సు కలవాడు
సువచనపు కవచం = మంచిని మాట్లాడటమే ఆతడిని కవచమై రక్షిస్తుంది.
(అటువంటి కవచం ధరించువాడు అనడం)
స్థిరతర = ఎప్పటికీ మారని
సుహృదయ = మంచి హృదయము కల
సుహృత = చెలికాడు
తోడ = తోటి
ప్రహేలికా = ప్రబంధ కావ్యాల తో
పరిరంభ = చుట్టబడి
ప్రస్తావనం = చెప్పుకొనెడి
సితాపతీం = నా భర్తకి (సీత భర్తకి)
శిరసాన్నమామి = శిరస్సు వంచి నమస్కారము చేతును!
పితృవాక్పాలనం = తండ్రి మాట పాటించడం
పరమేశ్వరాధనం = నిత్యం పరమేశ్వర ధ్యానం చేయడం
పరమేష్టి పూజ్యం = సాక్షాత్తు భ్రహ్మచే పూజించబడే
అపార జ్ఙాని = అవదులు లేని జ్ఙానం కలవాడికి
ఆపాదమస్తకం = తల నించీ పాదాల వరకు
పాద్య పుష్ప సహితం = నీరు, పుష్పాల తోటి
మదియు = మనస్సునూ
కరైక్యం = రెండు చేతులతో పెట్టేడి నమస్కరమునూ ఇచ్చి
సమర్పయామి = సమర్పించుకుంటున్నాను!

సుకృతం = పూర్వ జన్మ పుణ్యంతో
ఖిదత్తం = దేవతలచే నివ్వ బడిన
సువిశారదా = పాండిత్య శ్రేష్టుడైన
వినమ్రతం = (దానితో) ఎంతో నమ్రతతో కూడి
సుశీలం = మంచి గుణములు కల్గి
సుజానం = సుజానుడయ్యి
మృదు మదన వదనం = మిక్కిలి మెత్తటి అందమైన రూపులు కల్గి,
ఇత్యాది = ఇంకా ఇటువంటి ఎన్నో
గుణగణ విరసిత = గుణగణాలతో కలిసి పుట్టిన
నర అవతారమై = మానవ అవతారమయ్యి
నమసిత = నమస్కరింపబడువాడ
రామచంద్ర! = రామచంద్రుడా!