ఒకానొక బతికిన క్షణం

-- శైలజామిత్ర

గతమంతా ఒకసారి తరచి చూస్తే,
ఒకానొక బతికిన క్షణం
నాకునేనై నిలుపుకున్న గమ్యం
కొద్దిపాటి కంటి చూపులో
కనపడుతున్న దృశ్యాల తాలూకు
అక్షరాల అల్లికల్ని అర్థం చేసుకుంటూ,
భావాల వొడిలో
అనుభూతుల రెక్కల్ని రెప రెపలాడిస్తూ,
కాలం నాతో పరుగులు తీస్తోంది
నాకన్నా ముందుకు వెళ్ళాలంటూ
నేను వెళ్ళే దారిలో అన్నీ ముళ్ళూ, కొండలూ,
నేను కదిలే మార్గం మొత్తం దుమ్మూ, రాళ్ళూ
నా వెనుక వదలలేని నా వాళ్ళు,
నా ముందు చిరునవ్వు తెలియని అయిన వాళ్ళూ,
ఎక్కడుంది ఆనందం?
అంతా దు:ఖ తరంగ మయమే
ఒక బాధ అంతమయితే మరొబాధ సారంగం
ఒక అలంక్రియ పోతే మరోకటి
ఒక భయం పోతే మరొకటి
ఒక విధం పోతే మరొక విధం
ఒక వీధి దాటిపోతే మరొక వీధి
ఒక ఊరు దాటిపోతే మరో ఊరు
అన్నీ వదులుకుని బయట పడితే
ఎదురయ్యేది అంతిమ ఘడియలే
కొన్ని కాదనుకుంటే అంతా
పెంపుడు పక్షుల జ్ఞాపకాలే ....,
చుట్టూ నాకు ఏమాత్రం తెలియని చుట్టాలే ...,
నిప్పుల్ని నెత్తిన వేస్తూ గాలిని విసిరే పలకరింపులే..,
నా నాలుకపై పడుతున్న వర్షపు చినికులను సైతం
దోసిలితో పట్టి దాచుకునేవారే....,
నా ఇంటి తలుపు సందులో దాచుకున్న చీకటిని
మాత్రమే చూస్తూ ఆరా తీసేవారే...,
జారిపడుతున్న నా వెచ్చటి కన్నీటితో
దాహం తీర్చుకునేవారే
ఇలాంటి ఊపిరి సలపని అవమానానకి
భయానికి దూరంగా
వెన్నెల రెక్కలతో ఎగిరిపోకున్నా..,
గుండె మంటలకి ఆహుతి కానంత దూరంలో
సమయాన్ని బట్టి ప్రేమనో ..... త్యాగాన్నో
రాత్రయితే నిదుర తీరాన్ని
పగలైతే మెలుకువ మైదానాన్ని
తోడుగా పెట్టుకుని
మాసిన బట్టలతో, అలసిన ముఖంతో ...
కలల ప్రపంచంతొ కలిసి వెళుతున్నా ....
గొంతును ఎండనీకుండా
ఆశను పోనీకుండా
తడిపిన మేఘంతో కలసి మెలసి
కన్నీళ్ళని వెంట తీసుకొని
స్నేహ స్పర్శ వీడకుండా
ఒకే దిశగా ప్రయాణిస్తూ వుంటాను
ఆశ్చర్యం .... !!!
దిశ ఏదయినా
ఎంతటి శరీరాన్నయినా
ఆయువున్నా లేకున్నా మోస్తుంది
సంకల్పం ఎంతటి జీవితాన్నైనా
తన రెక్కలపై భరిస్తుంది!