నటరంజని : రాఘవ

-- కాకుళవరపు రమ

>

సకల కళలకు సర్వవిద్యలకు పుట్టినిల్లు భారత దేశం. అందుకే "భారతి భరతాశ్రితా" అన్నారు. అంటే జ్ఞానాన్ని,విద్యలను ఆరాధించే దేశము భరతావని, అందువల్లనే ప్రపంచ దేశాలన్నింటికీ గురుపీఠమై నిలచింది. ఆసేతు నీలాచలం వ్యాపించి ఉన్న భారతీయ శాస్త్రీయ నృత్యాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఉంటాయి. ఈ సంప్రదాయ నృత్యాలలో ఏకత్వాన్ని తెలుగు నాడి జీవనాడి అయిన కూచిపూడి నాట్యాన్ని ప్రధానంగా చెప్పవచ్చు. వాచిక సాత్వికాభి నయాలు ప్రధానంగా కలాపాలు, యక్షగానాలు, నృత్య నాటికలు ఏకపాత్ర కేళికలుగా విభిన్న శాఖలతో ఖండాతరాలదాక వ్యాపించి యున్నది ఈ కళారూపం. అంధ్రప్రదేశ్ రాష్త్రంలోని కృష్ణా జిల్లాలోని కృష్ణా నదీ తీరాన ఉన్న కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ నాట్య కళ ఈ గ్రామం పేరుతోనే కూచిపూడి నాట్యంగా యావత్ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఉన్న కొన్ని కుటుంబాల వారికి కులవృత్తి ఈ నాట్యం. అలా ఉన్న వారిలో ప్రముఖంగా చేప్పదగిన వారు భాగవతుల, వేదాంతం, చింతా, వెంపటి, మహంకాళి, పసుమర్తి, ఏలేస్వరపు మొదలైన కుటుంబాల వారు. ఇటువంటి నాట్య సంప్రదాయ కుటుంబమైన వేదాంతం వారి వంశంలో పుట్తిన వారు వీరు.

రాఘవగా పిలవబడే వీరి అసలు పేరు వేదాంతం రాఘవయ్య. కీ.శే.వేదాంతం రత్తయ్య శర్న్మ , రాజ్య లక్ష్మి గార్ల ప్రధమ సంతానంగా కూచిపూడిలో పుట్టిన వీరి తాత గారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు, పెద తండ్రి భరత కళాప్రపూర్న వేదాంతం రాఘవయ్య గారు ప్రముఖ కూచిపూడి కళాకారులే కాక దేవదాసు, సువర్ణసుందరి,అనార్కలి,వంటి శతాధిక ఉత్తమ తెలుగు చలన చిత్రాలను నిర్మించిన చలనచిత్ర దర్శకులు. ఇలా వీరి వంశములోని వారందరూ కళామూర్తులు కావడంవల్ల వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ యెక్కువై చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తనవిద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగ శాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.

ఏక పాత్ర కేళికలు (సొలొ డాన్సెస్)ప్రదర్శించడం కన్నా నృత్య నాటికలలో పలు నాయక, ప్రతి నాయిక పాత్రలు ధరించడం పైనే ఆసక్తి కలిగిన వీరు - సత్యభామ, కృష్ణ, మాధవి, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు,బాణాసురుడు, రావణాసురుడు, రాముడు, శివుడు, ఇంద్రుడు మన్మధుడు, భృగువు, చోళరాజు, ఆకాశరాజు, శిశుపాలుడు, అగ్నిజ్యొతమడు,గజాసురుడు, మహిషాసురుడు, మహావిష్ణువు, విశ్వామిత్రుడు, బలిచక్రవర్తి, తానీషా ఈ విధంగా ఎన్నో రూపానురూప (స్త్రీ వేషం వేయడం) నాయక ప్రతినాయక, సహాయక పాత్రలను - పద్మభూషణ్ డా. వెంపటి, పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ శోభానాయుడు, నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి, నాత్యాచార్య వేదాంతం రాధేశ్యాం, డా. ఉమారామారావు, డా.అరుణాభిక్షు, డా.అలేఖ్య వారిచే రూపొందించిన పలు యక్షగాన, నృత్యనాటికలో పాత్రలు ధరించారు అందుకు కారకులు, మార్గదర్శకులు, స్ఫూర్తి వారి తండ్రిగారేనని చెబుతూ వారి నాన్నగారు చేసిన సూచనలను మన ముందుంచుతున్నారు.

- ఎవరన్నా వారి ప్రదనర్శనలోవచ్చి పాత్ర వేయమన్నప్పుడు ఆ పాత్రకు నీ అంగసౌష్టవం కనుముక్కు తీరు సరిపోతుందా, లేదా అని ఒక్కసారి ఆత్మ విమర్శచేసుకొవడం
-ధరించే పాత్ర యొక్క లక్షణాలు, సాహిత్యార్ధం తెలుసుకొని నృత్యదర్శకులు చెప్పిన దాన్ని సాకల్యంగా నేర్చుకొని సాధనచేయడం
- ప్రదర్శనకు ముందు రోజే నువ్వు ధరించే పాత్ర యొక్క ఆహార్యాన్ని అంతా ఒకలాగా ఉన్నాయో లెదో చూసుకోవడం
-రంగముపైకి వెళ్ళే ముందు నీ సొంత విషయాలు, కష్టాలు సుఖాలు అన్నీ ప్రక్కన పెట్టి నువ్వు ధరించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రంగముపైన అభినయించడం
ఇలా వారి తండ్రిగారు చేసిన పలు సూచనలను తూ.చా. తప్పక పాటిస్తూ కృతకృత్యుడౌతానన్నారు రాఘవ

తన పదిహేడౌవ యేటనుండే నాట్య బోధనను ప్రారంభించిన వీరు ఇరువైకి పైగా నృత్యాంశాలను రూపకల్పన చేసి వాటిని తన సోదరుడైన వేదాంతం వేంకటాచలపతి గారితో, మరియు తన శిష్యులతో ప్రదర్శింప చేసి ప్రేక్షకుల నాట్యకళాకారులే కాక సంగీత విద్వాంసులైన 'సంగీతకళానిధి ' నేదునూరి గారు మొ. పెద్దల మన్ననలు పొందంటము వీరి నాట్య ప్రతిభకు వికపోపలం.

సంప్రదాయ నృత్యాంశాలతోపాటు వినూత్న నృత్యాంశాలైన , సూర్యాష్టకం, కృష్ణతాండవం, సంధ్యాతాండవం, రావణస్తవం, మృత్యుంజయాష్టకం, శివలీలలు, మొదలైనవికాక వీరు స్వీయ రచన చేసిన తిల్లానాలు సంప్రదాయపు మూలం చెడకుండా వినూత్న పద్దతిలో జతులను, నటనను కూర్చి తన గంభీర కంఠ స్వరంతో సమర్ధవంతంగా నట్టువాంగం చేయగల సమర్ధులు వీరు.

భారత ప్రభుత్వము వారి స్కాలర్షిప్ అవార్డు గ్రహీతలైన వీరు, లండన్ లో తన శిష్య బృందంతో కూచిపూడి నాట్య ప్రదర్శనలు గావించారు. ఇవేకాక నటనలోను ప్రావీణ్యము ఉన్న వీరు హైదరాబాదు దూరదర్సన వారు ప్రసారం చేసిన 'తానీషా కూచిపూడి సందర్శనం' అను సీరియల్ నందు - భాగవతినిగా, కృష్ణునిగా 'సంధ్యా వేదిక' అను ప్రత్యేక కార్యక్రమము నందు సూత్రధారునిగా నటించడమే కాకుండా కొన్ని టెలిఫిలింసికి డబ్బింగ్ కూడా చేప్పిన బహుముఖ ప్రజ్ఞాశాలురులు.

తన తండ్రిగారైన వేదాంతం రత్తయ్యశర్మ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన 'భక్తప్రహ్లాద ' కూచిపూడి యక్షగానాన్ని, రసహృదయులు, కళాపోషకులైన ప్రవాస భారతీయుల ముందు ప్రదర్శనచేసి వారికి, ఆంధ్రకళా సారస్వత శాఖయైన కూచిపూడి వారి యక్షగానాన్ని, చూపించాలన్న తన తండ్రి గారి అంతిమ కోర్కెను తన సోదరుడైన వెంకటాచలపతితో తీర్చాలన్న సత్సంకంపల్పంతో ఉన్నారు.

వీరి భార్య అయిన షర్మిపద్మజ గారుకూడా కూచిపూడి నాట్యకళాకారిణి కావడం విశేషం. ఈమె పద్మశ్రీ శోభానాయుడు గారి వద్ద చిన్నతనము నుంచి కూచిపూడినాట్యాన్ని అభ్యసించి అందులో 'నాట్యవిశారదా డిగ్రీతో పాటు బంగారుపతకాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం వీరిరువురు హ్యూస్టన్ లోకూచిపూడి నాట్యప్రచారం గావిస్తున్నారు.వీరి ఆరునెలల ముద్దుల బాబు గుహన్.

ఇలా వీరి తరతరాల వారు ఈనాట్యకళని నమ్ముకొని దానితోనె భుక్తిని, ముక్తిని పొందుతున్నారు. వారి బాటలోనే తన జీవనయానాన్ని సాగిస్తున్నారు. అందుకు కారణమైన తనకు జన్మనిచ్చిన తనతల్లితండ్రులకు , విద్యనిచ్చిన గురువులకు ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతునకు ఋణపడి వున్నానని సవినయంగా వివరించారు, రాఘవ.