మా పెళ్ళి పల్లకి

--పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం ,
పద్మ బిందు

అతడు

మా పెళ్ళి పల్లకి.... కాదు కాదు మా పెళ్ళి నావ అంటె సబబు ఏమో. ఎందుకంటే మా పెళ్ళి జరిగింది 2000 సం|| అగస్టులో. అప్పుడు హైదరాబాదు లో ఉన్నవారికి తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నానో అని. 30 ఏళ్ళ తరవాత భోరున వర్షాలతో, సుడిగాలులతో, హైదరాబాదు నగరం జల స్థంబనమయింది. కాని, అంత ప్రకృతి భీభత్సంలో మా పెళ్ళి జరిగి మా పెళ్ళి నావ సంసారమనే సాగరంలోకి రేవు దాటింది.

మాది మధ్య తరగతి కుటుంబం. నేను మావాళ్ళకి ఒక్కడినే కోడుకుని. గారాబంగా పెరగకపోయినా కొంచం అల్లారు ముద్దుగానే పెరిగాను. దాంతో మా వాళ్ళ ఆశలన్ని నా మీదే. కాబట్టి విద్యలో నా ప్రమేయం ఉన్నా నా వివాహం విషయం మాత్రం వాళ్ళకి వదిలేశాను. పీజీ చేసిన తరువాత, లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు, నాకో సంబంధం వచ్చింది. మా వాళ్ళు చూద్దామన్నారు. కాని నాకు అప్పుడు 24 ఏళ్ళు మాత్రమే. అయినా మావాళ్ళు పట్టుబట్టారు. వాళ్ళ బలవంతం మీద వెళ్ళాను. మొక్కుబడిగా చూశాను తప్పితే, నా మనుసు నా జీ(వి)తం మీదే.

దైవానుగ్రహమో ఏమో, నేను ఆ అమ్మాయికన్న కొంచం ఎత్తు తక్కువని, వాళ్ళే మా సంబంధం వద్దనుకున్నారు. బ్రతుకుజీవుడా అనుకుని, ఇక అక్కడే ఉంటే మా వాళ్ళు పెళ్ళి అంటు ఇంకేం సంబంధాలు చూస్తారో అనే భయంతో మాకాం హైదరాబాదు మర్చేశాను. నానా విధాలుగా కష్టపడి, వాళ్ళని వీళ్ళని పట్టుకుని మొత్తానికి సాఫ్ట్ వేర్ కంపెనిలో పడ్డను. ఉద్యోగం బానే ఉంది, సరిగ్గా సంవత్సరం అయ్యాక నాకు లండన్ వెళ్ళే అవకాశం వచ్చింది.

కాస్తా జీ(వి)తం కుదుట పడింది అనుకునే లోపల మా వాళ్ళు మళ్ళా పెళ్ళి సంగతి తీశారు. నాకు సెండాఫ్ ఇవ్వడానికి వాళ్ళు రాబోతున్నారు అనుకునే లోపల, అదే సమయంలో ఒక మధ్య వయుసు వ్యక్తి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. తనను తాను పరిచయం చేసుకుని, నన్ను పైనించి ఎగాదిగా (స్కానింగ్ అన్నమాట) చూశారు. నా ఇష్టాయిష్టాలు గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఆ తర్వాత నాకు ఎటువంటి భార్య కావాలి అని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. నేను ఇంక ఆగలేక ధైర్యం చేసి గట్టిగా అడిగాను. మీరు ఎందుకు ఇవన్నీ ఇలా అడుగుతున్నారని? అప్పుడు చల్లగా చెప్పారు. తాను పెళ్ళి కూతురు మేనమామనని, మా వాళ్ళు పిల్లని చూడడానికి వస్తున్నారని. నేను ఆశ్చర్య పోయాను. రెండు రోజుల్లో ప్రయాణం పెట్టుకుని ఈ పెళ్ళిచూపులేమిటని మావాళ్ళు రాగానే నిలదీశాను. వాళ్ళు సావధానంగా ఈ సంబంధం ఎలా వచ్చిందో చెప్పి ఓ ఫొటో బయట పెట్టారు. ఫోటో ఒక్క సారి చూశాను. బానే ఉంది... కాని ఒక్క సారి మళ్ళా నా వయసు, జీతం గుర్తుకొచ్చి ప్రక్కన పెట్టేశాను. ఇవన్నీ కాదని ప్రయాణం హడావిడిలో పడిపోయాను.

ఎయిర్ పోర్ట్ లో మా వాళ్ళు సెండాఫ్ ఇస్తున్నప్పుడు మరొక వ్యక్తి వచ్చాడు. నాకన్నా కొంచం వయసు తక్కువ అనుకంటా, తనని పరిచయం చేసుకుని, మాళ్ళా స్కానింగ్ మొదలు పెట్టాడు. తరువాత చెప్పాడు, తాను పెళ్ళి కూతురు అన్ననని. ఇదంతా ఎమిటిరా బాబు అనుకున్నాను. నేను మా వాళ్ళ వంక తీవ్రంగా చూశాను. అప్పుడు మా వాళ్ళని ఏమి అనలేక పోయాను.

ఆ తరువాత, ప్రయాణమంతా సజావుగా సాగినా మనసు మాత్రం ఫోటొ మీదే ఉంది. చక్కటి రూపం, సున్నితమైన నవ్వు, ఆ కళ్ళలో స్వచ్చదనం. చూద్దాం ఎమౌతుందో అనుకుని, నా ట్రిప్ ముగిసి ఇండియా రాగానే, మావాళ్ళు వెంటనె "మేము చుసేశాము, మాకు నచ్చింది, నువ్వెప్పుడు చూస్తావని " నా మీద వత్తిడి పెట్టారు. ఇంక లాభం లేదనుకుని ఒప్పుకున్నాను.

పెళ్ళి చుపులు- ఫొటోలో లాగానే ఉందీ. మనుసు గట్టిగా నొక్కి చెప్పింది, ఈ అమ్మాయే నాకు జోడి అని. తరవాత పెద్దవాళ్ళు మమ్మల్ని బలవంతంగా పర్సనల్ గా మాట్లాడుకోమన్నారు. ఏమున్నాయి అనుకుంటూ, అయిష్టంగానే అడుగు పెట్టాను గదిలో. గదిలోకి వస్తూనే, ఆ అమ్మాయి నిర్మోహమాటంగా అడిగేసింది. "మీకు సిగరెట్టు, మందు తాగే అలవాటు ఉందా?" అని. నేను అవాక్కయ్యను". హైదరాబాదేమో, కొంచెం స్పీడేమో అనుకున్నాను. 'కాలేజిలో అలవటుండేది కాని, ఇప్పుడు అడపాదడపా పార్టీల్లో కొంచెం కొంచెం తీసుకుంటాను ' అని చెప్పేశాను. ఆ సమాధానానికి ఆమె నొచ్చుకున్న్నట్టుంది. కాని ఏంచేస్తాం అబద్ధ మాడి పెళ్ళి చేసుకోలేము కదా. ఆ రాత్రి మా వాళ్ళకి చెప్పాను, తను నన్ను అలా అడిగిందని, కాని నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని చెప్పేశాను. మా వాళ్ళు, ఆ అమ్మయిని సమర్ధించి నాకు కొన్ని అక్షింతలు,మొట్టికాయలు వేశారు (నిజం అప్పుడు బయిట పడిందిగా!)

ఆ తర్వాత రోజు దిల్షుక్ నగర్ బాబా గుడిలో మమల్ని కలవమని, వాళ్లకి కబురు పంపారు. నేను నిశ్చయించుకున్నాను, ఆమెకు ఒక వేళ ఇష్టమైతెనే పెళ్ళి అని. బాబా దర్శనమయ్యాక, మా వాళ్ళు కొంచెం దూరంగా ఉండగా , తనను సూటిగ అడిగాను, నేనంటె నీకు ఇష్టమేనా? అని. ఆమె కుడా అంతే సూటిగా నా వంక చూసింది. నేను గబుక్కున తల దించుకున్నాను, 'వ్యసనం మానుకుంటాను ఒప్పుకోవా ' అన్న మొహం పెట్టేశాను. నెమ్మది గా తల దించుకుని సిగ్గుతో మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పి దూరంగా వెళ్ళిపోయింది. దాంతో నా మనుసు ఉప్పొంగి పోయింది. మా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేశాను, ఈమే నా జీవిత భాగస్వామి అని.

ఆమెని చూసిన వేళా విశేషమో ఏమిటో, నాకు ఉద్యోగంలో మార్పు వచ్చింది, స్థాన చలనమయ్యింది. జీతం నాలుగింతలయ్యింది. పెద్దవాళ్ళు పెళ్ళి తతంగంలో పడితే మేము మా ప్రేమ విహంగం లో పడ్డాము. పెళ్ళి చూపులు దగ్గర నుంచి, పెళ్ళి వరకు ఒక మధురమైన వియోగంతో కూడిన ప్రయాణము చేశాము. ఈ- మెయిళ్ళు, చాట్‌లు, ఫోనులు తో మూడు నెలలు మూడు క్షణాల్లో గడిచి పోయాయి. ఇప్పటికీ అనుకుంటాము అవి మా జివితంలో మధుర క్షణాలని.

పెళ్ళి ముందు రోజు. విజయవాడ నుంచి హైదరాబాదుకి బస్సులో ప్రయాణం. బస్సులో పెళ్ళివారందరము, అనందంతో ప్రయాణిస్తుంటే, ఆకాశం మేఘవృతమైంది, వర్షం మొదలయ్యింది, బస్సు ఆగిపోయింది. బంగాళాఖాతంలో వాయుగుండం. ఏవరో చెప్పారు, హైవే మూసుకు పోయిందని, హైదరాబాదులో వర్షాలు, రాత్రికి రోడ్డు మీదే అని. మేమంతా కంగారు పడ్డాము. బస్సులో ఇరుక్కుపోయాము, స్నాతకానికి చేరుతామో లేదో అని. అది జరక్క పోతే, పెళ్ళి జరగదని తెలుసు. చివరకి ఎట్లాగైతెనేం, 18 గంటలు ప్రయాణం చేసి (6 గంటలే అసలు ప్రయాణం) విడిదికి చేరాము.

నన్ను హడావిడిగా పెళ్ళికొడుకుని చేశారు. స్నాతకం సవ్యంగా జరిగింది. రాత్రికి పెళ్ళి వైభవోపేతంగా జరిగింది. పెళ్ళికి వచ్చినవారంతా ఒకటే మాట, మీ పెళ్ళికి మేము 'ఈదుకుంటు వచ్చాము నాయనా ' అని. ఇప్పటికీ అనిపిస్తుంది, మా పెళ్ళికి ప్రకృతి పులకరించిందా, లేదా జలదరించిందా అని నవ్వుకుంటాము.

అలా మా పెళ్ళి పల్లకి, కాదు కాదు, పెళ్ళి నావ, సంసారమనే ఒడిదుడుకలతో, ఒక చక్కటి పాపతో (నాగ ప్రహర్షిత), చిరు గొడవలతో, బహు ముచ్చటలతో, వివిధ ప్రదేశాలు తిరిగి, ఇదిగో ఇలా సిలికాన్ వాలిలోకి వచ్చి ఆగింది... ఈ నావ ఈలాగే మౄదువుగా సాగాలని దేవుడిని ప్రార్ధిస్తూ... ముగిస్తాను.

మర్చి పోయాను, నా ధర్మ పత్ని పేరు.... పద్మ బిందు.

ఆమె

నేను పుట్టి పెరిగినది మొత్తం హైదరాబాదు. మాది పెద్ద బంధు వర్గం. మావయ్యలు, అత్తయ్యలు, పిన్నులు, బాబాయిలతో, నా చిన్నప్పటి జీవితం గడిచిపోయింది. మాది మధ్య తరగతి కుటుంబమైనా, మాకు ఆర్థిక రీత్యా చాల సమస్యలుండేవి. దాంతో , నేను డిగ్రీ పాసవ్వగానే ఉద్యోగం చేసి ఇంట్లోకి సహాయం చేద్దామనుకున్నాను. తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది.

నా జీవితం ఫిబ్రవరి 21 2000న ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ రోజు మా అన్నయ్య ఉపనయనం. మా దూరపు చుట్టం ఒకాయన నన్ను చూసి, సిర్పూర్ లో ఒక మంచి సంబంధం ఉందని, మా వాళ్ళకి చెప్పారు. నా జాతకం వివరాలు కావాలని అడిగారు. అప్పుడు నా వయసు కేవలం 21 మాత్రమే. మా వాళ్ళకి ఇష్టంలేదు. అప్పుడే పెళ్ళేంటని. ఎదో రకంగా పోస్టులో పంపిస్తామని నచ్చచెప్పారు. తర్వాత ఆయన ఫొనులో చాలా సార్లు జాతకం కావాలని వత్తిడి తెచ్చారు. మా వాళ్ళు కాదనలేక పోస్టు చేశామని తప్పించుకో చూశారు. అయినా ఆయన హైదరాబాదు వచ్చి జాతకం కావాలని పట్టుబట్టారు. జాతకం, ఫోటొ పంపించారు. మావాళ్ళకి అనిపించింది, ఎందుకో, ఈ సంబంధం కుదురిపోతుందని. నాకు మాత్రం ఇష్టంలేదు. దెబ్బలాడాను, ఇంట్లో.

పెళ్ళి చూపులకు ముందుగా మా వాళ్ళు అబ్బాయిని చూడాలని పట్టుబట్టారు. అందుకు మా మేనమామ అతన్ని చూసివచ్చారు. అయినకి అతను నచ్చినట్ట్లున్నారు. ఆయిన లండన్ వెళ్తున్నారుటా అని హడావిడిగా మా అన్నయ్య కూడా చూసి వచ్చి నాకు సరి పోతారని చెప్పేసరికి నాకు మండిపోయింది. ముంబైలో మా పెద్ద మేనమామ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో ఆయనను ఓకే చేసేశారు. నాకు నచ్చకుండా వీళ్ళకి ఎలా నచ్చుతున్నారని. పెళ్ళి చూపులకి ఒప్పుకున్నారు. పెళ్ళి చూపులలో వాళ్ళ అమ్మ నాన్నగారు మాత్రమే వచ్చారు. వాళ్ళకి నేను నచ్చినట్టున్నాను.

ఒక నెల వరకు ఏ సమాధానం లేదు. ఆ తరువాత, అతను నన్ను చూడటానికి వచ్చారు. చెవికి పోగులుతో , 16వ శతాబ్ధం కుఱ్ఱాడిలా కనిపించారు. అయినా ఈ సంబంధం చెడకొట్టాలని నిశ్చయించుకొని, అతనితో పర్సనల్ గా మట్లాడుతున్నప్పుడు, "మీకు సిగరెట్టు, మందు తాగే అలవాటు ఉందా?" అని ఏదైతే అది అయ్యిందని ధైర్యంగా అడిగేసాను. అతను హీరో లెవెల్లో అలవాటు ఉందని చెప్పాడు. నాకు చిరాకేసింది. తర్వాత ఏమీ మాట్లాడలేదు. మా వాళ్ళతో ఖచ్చితంగా చెప్పేశాను వాళ్ళు తిరిగి రారని. కాని అదేమిటో, మమ్మలని బాబా గుడికి రమ్మని పిలిచారు.

అక్కడ బాబా దర్శనం అయ్యాక, అతను నాతో మాట్లాడాలని ప్రయత్నం చేశారు. మా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు, కావాలనే, మమ్మల్ని విడిచి పక్కకు వెళ్ళరు. అదే అదనుగా, నన్ను అడిగారు, 'నీకు నేనంటే ఇష్టమేనా?' అని. ఒక్క సారిగా ఏమనాలో అర్థంకాలేదు.

అవును, ఇతను బానే ఉన్నారు, కాని ఆ ఓక్క అలవాటు లేక పోతే బావుంటుందేమో అనుకుంటూనే 'మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే' అని వాటంతట అవే మాటలు వచ్చేశాయి. అప్పుడు అనిపించింది, నా గమ్యం ఇదేనేమోనని. ఇక అంతా బాబా మీద భారం వేసేశాను.

ఆ తర్వత, అతను నాకోసం ఫొనులు చేయటం, ఈ-మెయిలులు రావడం, ఒకరి ఇంటి సమస్యలు ఒకరికి చెప్పుకోవడం అన్నీ వెంట వెంటనే అయి పోయాయి. నాకు పెళ్ళి ముందువరకు తెలియలేదు, నేను అతనంటే ఎంత ఇష్టపడుతున్నానో.

23 ఆగస్ట్ 2000 - ఆ రోజు గాలి వాన, మేము పెళ్ళి హాలుకి సాయంత్రం 6 గంటలకి వెళ్తున్నప్పుడే హైదరబాదులో వరదలు వచ్చేశాయి. అప్పుడే పెళ్ళి వారు బయలుదేరారని రాత్రికల్లా వచ్చేస్తారని మాకు ఫోను వచ్చింది. కాని రాత్రి 8-9 అయినా వాళ్ళు రాలేదు. మా వాళ్ళకి టెన్షన్, వాళ్ళకంటే నాకు బాగా ఉంది. ఈ పెళ్ళి తప్పితే, మళ్ళా ఎప్పుడు జరుగుతుందో ఏమో? వాళ్ళు ఉదయం 6 గంటలకి వచ్చారు. హమ్మయ్యా అనుకున్నాము.

చక చక నన్ను పెళ్ళి కూతుర్ని చెయ్యడం, వాళ్ళూ స్నాతకం చేసుకోవడం, సాయంత్రం రిసెప్షన్, అర్థ రాత్రి పెళ్ళి ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. నాగావల్లి సదశ్యం అంటు, తెల్ల వారివరకు మా పెళ్ళి జరుగుతూనే ఉంది. మరుసటి రోజు రాత్రివరకు మాకు నిద్రలేదు.

అలా మా పెళ్ళి జీవితం మొదలయ్యింది. ఇప్పుడు 7 సంవత్సరాలు తరువాత, నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే, నేను బాబాకి ఋణపడి ఉన్నాననిపిస్తుంది. నాకు ఇంతటి ప్రేమతో, అభిమానంతో చూసుకొనే భర్త దొరికాడని. ఆయన , నాకు సుఖాల్లోని కాదు, కష్టాల్లో కుడా భాగస్వామి అని నిరూపించుకున్నారు. ప్రేమంటే నాకు అర్థం చెప్పారు. ఇప్పటికీ అంటు ఉంటారు, ముందు మనం స్నేహితులమని, తరువాత ప్రేమికులమని ఆ తర్వాతే భర్యా భర్తలమని.

మేము ఇప్పుడు సాంతా క్లారాలో , మా పాపతో, హాయిగా జీవితం గడుపుతున్నాము.

బాల సుబ్రహ్మణ్యం గారు మంచి నటుడు, రచయిత, గాయకుడు, నిర్వహణా దక్షుడు. సిలికానాంధ్ర కార్యక్రమాలలో తన ప్రతిభను పలు రంగాల్లో ప్రదర్శించారు. పద్మ బిందు గారు కార్యక్రమాల్లో ముందుంటూ భర్తకు ఏమాత్రమూ తీసిపోని మృదు స్వభావి. దంపతులిద్దరూ స్నేహశీలురు. ఎంతో ఉత్సాహంగా పాల్గొనటమే కాక వారి చిటి పాపాయిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి యేటా ప్రహర్షిత చిట్టి గీతాల పోటీల్లో బహుమతి పొందాల్సిందే! వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని మనసారా కోరుకుందాం.