బంగారు వీణ.

-- సత్యవాడ సోదరీమణులు

"ఇప్పుడేం చేద్దాం టీచర్? పేపర్లో ఈ వార్త మా అత్తయ్య గారి కంట పడక తప్పదు". నిలువెల్లా కంపించిపోతూ అంది సూర్య కళ.
తేలికగా నవ్వేస్తూ, "పిచ్చి పిల్లా! ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసునాకు. ఈ పరిస్థితి ఎదుర్కొనే ధైర్యం నీలో వుండాలి. నిజానికి ఈ రోజు నీ తపన ఫలించి, ఉన్నత శిఖరాలు అధిరోహించినందుకు నీ మనస్సు పట్టరాని ఆనందంతో పరవళ్ళు తొక్కాలి. ఆ ఉత్సాహానికి, ఉద్వేగానికి ఆనకట్ట వేసి, ఇలా బేలవైపొవటం నాకేం నచ్చలేదు". సూర్య కళ వెన్నుతట్టి అంది శ్యామల.

ఆ స్పర్శకు అమ్మ ఆప్యాయత గుర్తుకు వచ్చింది. తన తల్లే కనక ఉంటే తన ఈ విజయానికి ఎంతైన గర్వించేది. అమ్మకి తనంటే అవ్యక్తమైన ఆపేక్ష. "ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి". తను పుట్టనగానే అందరూ అన్నారట. ఈ నా చిన్నారి సరస్వతీ పుత్రిక కూడా దీన్ని నా ఆశయాలకి ప్రతిరూపంలా పెంచుతాను. నా చిట్టితల్లి గొప్ప కళాకారిణి కావాలి. 'కళానిధీ లాంటి అత్యున్నత పురస్కారాలెన్నో సొంతం చేసుకోవాలి అందట. ఆ అనుభూతితోనే సూర్యకళ అని పేరు పెట్టి మురిసి పోయింది. తప్పటడగులు వేయించటంతో పాటు, తాళ గతులు నేర్పేది. బుడిబుడి మాటలతో సరిగమలు కలగలిపి తన నోట పలికించేది. తన కోసం చిన్నవీణ తయారు చేయించి, అక్షరాభ్యసం నాడే వీణా వాదనానికి కూడ అంకురార్పణ చేసింది.

పూల పరిమళం దారానికి అచ్చినట్టు, అమ్మ ఆకాంక్ష తనలో ఊపిరిపోసుకుంది. స్కూలుకు వెళ్ళటం, చదువుకోవటం కంటే అమ్మ దగ్గర వీణ నేర్చుకోవటమే ఇష్టంగా ఉండేది. మూలపడ్డ అమ్మ వీణ పైకి తీయటం, తనకు నేర్పటం నాన్నగారికి ఏమాత్రం గిట్టేది కాదు. "తగుదునమ్మా అని మళ్ళీ మొదలుపెట్టావా? మన పెళ్ళీ కాగానే చెప్పానా లేదా? ఇలాంటి వాటితో కాలాన్ని వృధా చేయవద్దని, ఇంటిపని,వంటపని చేసుకుంటూ, ఈ ఇంట్లో అందరికి తల్లో నాలుకలా మెలగాలనీ, తలవంచి అలానే నడచుకున్నావు. వినాశకాలే విపరీత బుద్ధి! అని నీకు క్రొత్త క్రొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయే! ఏదో ఆటాపాటగా అంటే పొనీలే అనుకున్నాను. అమ్మాయిని స్టేజీ ఎక్కిస్తున్నావట! అది బాగా చదువుకొని డాక్టరో, ఇంజనీరో కావాలి. నా కూతురిని సరిగమల పంతులమ్మను చేసే హక్కు నీకు లేదు".

నాన్న అలా గదమాయించే సరికి అమ్మ దు:ఖం కట్టలు తెంచుకుంది. "వీణలో డిప్లొమా చెసిన నేను, మీ చేత తాళి కట్టించు కోగానే,మీరు నా వీణను వెలివేసినా కిమ్మనలేదు. నా కళ మన అమ్మయిలో ప్రతిఫలించాలి! అనుకోవటం మీకు తప్పయి పోయిందా?" తనని ప్రాణంగ ప్రేమించే సరస్వతి మూర్తి లాంటి అమ్మ అలా కుమిలిపోతుంటే, పదకొండేళ్ళ పసిప్రాయంలో ఉన్న తను నాన్న మీద కోపం పట్టలేక పోయింది.
చప్పున వాళ్ళ మధ్య కెళ్ళి "ఏంటి నాన్నా? అమ్మను ఏడిపిస్తారు! మీ మాటకు ఎదురు చెప్పలేక, ఇంత బాగా సాధన చేసిన వీణని పెట్లొ పడేసి పెట్టి పూజ చేస్తొంది. అమ్మే కనుక నా ఇష్టం నాది అని వీణ కచ్చేరీలు చేస్తే, యెంత పేరు తెచ్చుకొనేదో! మీరు మంచి నాన్న కాదు". అని అనేసింది.
తల్లి కళ్ళు తుడిచి, తన చిన్ని వీణను చేతుల్లోకి తీసుకుంది. " నాన్నా! మీకు దండం పెడతాను. ఆమ్మను ఎప్పుడు ఇలా కోప్పడవద్దు. నేను బాగా చదువుకొని మీకు పేరు తెస్తాను. వీణ సాధన చేసి, అమ్మ కలలు పండిస్తాను. చూడు, ఈ సూర్య కళంటే ఏమనుకున్నావో!" వీణ మీటుతూ అంది.
మరుక్షణం తన ఆట సామాన్లు అటక మీద పడేసింది. అన్న లిద్దరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకోవటం, గారాలు పోతూ... ఎంచెక్కా షికార్లు తిరిగి రావటం, తన స్నేహితురాళ్ళతో అదే పనిగా గడపటం తగ్గించేసింది. పట్టుదలతో రెండింటా కృషి చేస్తూ, టెన్త్ క్లాసులొ ఫస్టు ర్యాంకు తెచ్చుకుంది. వీణ కచ్చేరీలిస్తూ, 'బాల విద్వన్మణి బిరుదు కూడా పొందింది.
ఆశ్చర్యంలొ తలమునకలైపోతూ, నాన్నా ఎంతో మెచ్చుకొని తనని ఆశీర్వదించారు. ఆ ఉత్తేజంతొ ఇంటర్ పూర్తి చేసింది.
తొలకరి జల్లుల్లో పులకించి పోతున్న చిరుమొలకకి హఠాత్తుగా ఆ జల్లే పెను తుఫానుగ మారినట్టు, తన జీవింతం లోనూ, ఊహకందని ముప్పు ముంచుకొచ్చింది. తను అమ్మలేని అమ్మాయి అయిపోయింది. తన సర్వస్వం అయిన అమ్మకోసం తనెంత ఆరాటపదింది? చదువుకి, సంగీతానికి స్వస్తిజెప్పి అమ్మని పసిపాపలా చూసుకుంది. ఇంట్లోనూ, హాస్పిటల్లొనూ ఎన్నో సేవలూ చేసింది. క్యాన్సర్ వ్యాధితొ తల్లి పడే బాధ చూడలేక పోయేది.
"అమ్మలూ! ఈ బాధ పడలేనే నన్నా దెవుడెందుకు తీసుకుపోడో? నా మూలాన నీ చదువు, వీణా మూలపడ్డాయి కదె! అంటూ ఏడ్చేసేది. తనకి మరింత దు:ఖం వచ్చేది. "అలా అనొద్దమ్మా! నా కోసమైన నీవు బ్రతికి తీరాలి. నువ్వే లెక పొతే వీణ పలికించగలనా?.
"కళా! అవేం మాటలు? నీ చేతుల్లో వీణ ఎప్పటికీ రవళిస్తూనే వుండాలి. ఆ సునాదంతోనె నీ జీవితానికి సార్ధకత. వీణే నేనుగా నీ ఒడిలో ఒదిగిపోతాను. నేను పోయినా బెంగ పడకు. నీ చేతి వీణలొ, ఎప్పటికి జీవించే ఉంటాను." అమ్మ తనకి దూరమైనా ఆ మాటలే పదె పదె గుర్తుకొచ్చేవి. చదువు సంగతి మళ్ళీ తలపెట్టలేదు. కాని, వీణ మాత్రం, అమ్మ స్మృతులతో మనస్సు బరువెక్కినా, ఇది ఆమె కోరిక అనుకుంటూ వాయిస్తుండెది.

ఆ ఆనందం ఎంతోకాలం నిలువలేదు. ఆడ పిల్లంటె ఆడ.....పిల్ల అన్నట్టు తనకో సంబంధం వచ్చి పడింది. హాస్పిటల్ లో అమ్మకి ట్రీట్మెంట్ చేసిన స్పెషలిస్టు, నాగేందర్ రావు గారు తన కొడుక్కి చేసుకుంటానంటూ, నాన్నతో అన్నారట. అది ఆయనకో పెద్ద శుభవార్తట. తనకి మాత్రం అలా అనిపించలెదు. ఇంత త్వరగా వైవాహిక జీవితమా? మనసు అంగీకరించటం లేదు. ఆ ఇంట్లో తనని సమర్దించేది వదినే. తన ఉద్దేశ్యం పసిగట్టి, "కళ కపుడే పెళ్ళేమిటి? మామయ్య గారు! ప్రైవేటుగా నైనా డిగ్రీ పూర్తి చేస్తనంటోంది. పట్టుమని పది నెలలైనా కాలేదు నేను మీ ఇంట అడుగుపెట్టి. ఇంతలోనే నా అర్ద్ధ మొగుణ్ణి వేరు చేసేస్తారా? మా ముద్దుల ఆడపడచు వీణా వాదనతో మన ఇల్లంతా కొంతకాలం ప్రతిధ్వనించ నివ్వండి. తమషాగానే అంటూ తన అభిప్రాయం వెలువరించింది.
"ఓస్, ఇంతే కదా! ఇలాంతివన్ని చిన్ని విషయాలు. కలిసొచ్చిన సంభందాన్ని కాదనుకుంతే, మన కన్నా తెలివితక్కువ వాళ్ళు వుండరు. కాబోయే దీని మామగారు ఏమన్నారో తెలుసా? హొస్పిటల్లొ రేయింబవళ్ళు కన్నతల్లికి ఇది చేసిన సేవలకు అబ్బురపడ్డారట. అంతటి అంకిత భావం ఈ తరం పిల్లలకెక్కడుంది? మీ అమ్మాయి అనురాగమూర్తి. మా ఇంటి కోడలు ఇలా వుండాలి అని మేమంతా ఇలంటి సంస్కారవంతురాలైన అమ్మాయి కోసం గాలిస్తున్నాం. మీరు సరే అంటే మా ఇంటిల్లిపాదీ అదృష్టవంతులం."

నాగేందర్ రావు గారు అలా అంటుంటే నా ఒళ్ళు పులకించి పోయిందనుకో. మగ పెళ్ళి వారు వాళ్ళదేముందీ, అద్రుష్తవంతులం మనం. మన స్తితిగతులు తెలిసి కట్న కానుకలేవీ అక్కర్లేదన్నారు. పెళ్ళిఖర్చులు కూడా వాళ్ళే భరిస్తారట. కోరి తెచ్చు కొంటున్న కోడలు కదా! మన కళ వాళ్ళ ఇంట అడుగుపెడితే అంతే చాలన్నారు" గర్వంగా చెప్పుకొచ్చారు నాన్న.
వదిన మరేం మాట్లాడలేక పోయింది. పెళ్ళి చూపుల తతంగం మామూలే! తనకి పట్టు చీర కట్ట బెడుతూ "నీ ముఖం వెలవెల బోయింది. నేనెంత మిస్తాబుచేసినా, నీ ముఖాన చిరునవ్వు లేక పొతే పెళ్ళి కొడుకు గారు పలాయన మంత్రం పఠిస్తాడు. ముందు ముఖాన కాస్త నవ్వు పులుముకో తల్లీ! " వదిన అలా అనగన్నె నవ్వు రాలేదు సరి కదా! ఏడుపొచేసింది. వదిన్ని కౌగిలించుకొని కన్నీరై కరిగిపోయింది. "ఇతగాడు కూడా నాన్నారిలానే నా వీనకి తలోదకాలిచ్చేయమంటే! అమ్మలా మనసు చంపుకొని బ్రతకటం నా వల్ల కాదొదినా! అంది.
విశాల ఫక్కున నవ్వేస్తూ,"ఓసి వెర్రి పిల్లా! ఎందుకు లేని పోని ఊహలు? నీ విషయంలొ అలా జరగక పోవచ్చు. నీ వీణాగానం అతన్ని పరవశింపచేస్తుందేమో! నీ లోని కళ వెలుగు చూడటానికి అండదండ లందిస్తాడని మన మెందు కాశించ కూడదు? ప్లీజ్! నీ మూడ్ మార్చు. నా ప్రియమైన ఆదపడచువి కదూ!" తన కళ్ళు తుడిచి చెక్కిళ్ళపై ముద్దుల వర్షం కురిపించింది విశాల. వదిన వాత్స్యలంతో ఆమె ఇచ్చిన ధైర్యంతో, సూర్య కళ మొహం విప్పారింది. "గుడ్ గర్ల్ ఇక హాల్లొకి వెళ్దాం పద!" ఆడపడచు చేయందుకొని చక చకా నడిచింది.
మాటల మధ్యలో " మా , అదే మన సూర్య కళ వీణ ఎంతో బాగా వాయిస్తుంది. మీరంతా వినాలి!" అంటూ నడచి వెళ్ళబోయింది. "కూర్చోండి విశాలగారు!వీణ మా ఇంట్లో కూడా ఉంది లెండి." అంది వర్ధనమ్మ.
ఆ హడావుడి సద్దుమణగగానే, "ఇప్పుడేవంటావోయ్! మీ అత్తారింట్లో వీణ వుండనే వుందట. పిచ్చి పిచ్చి ఆలోచనలతో, మనసు పాడు చేసుకోవటం నీ కలవాటయిపోయింది. "ఎగతాళిగా అంది." నువ్వు అలాగే చెబుతావు. అడుగుపెట్టబోయే అత్తారిల్లు , ప్రేమ మందిరమో? పసిడి ఫంజరమో? ఏ ఆడపిల్లకైనా అనూహ్యమే!" నిరాసక్తతగా అంది.
తను భయపడ్డంతా జరిగింది. పంచబాణుని పోలిన భర్తకి,రతీదేవిలా మెలగటమే కాదు. ఆ ఇంట్లో వృద్ధ పంచకానికి సేవకురాలిగా మారింది. క్షణం తీరుబడిగా ఉండనీయరు. అత్తమామలు, మామగారి తల్లితండ్రులు, తల చెడిన మామగారి చెల్లెలూ ఇంతమందీ ప్రతి చిన్న విషయానికి తన మీదనే ఆధార పడతారు. నిజానికి అత్తగారు, ఆమె ఆడపడచు కూడా ఇంటిపనీ, వంటపనీ చేసుకొనగలిగే వాళ్ళే! కోడలు ఏక్కడ సుఖ పడిపోతుందో అని బెంగ. అత్తగారిది అయితే, నేను, ఈ ఇంటి ఆడపడచును అన్న అహం ఈవిడది. ఆ మోస్తరు భావాలున్నవాళ్ళు తన వ్యక్తిత్వ్వన్ని ఎలా నిలుపుకోనిస్తారు?.
అందరికీ అన్ని అమర్చి పెడుతూనే, తలుచు కుంటే సాధ్యం కానిదే లేదు! అని తనను తానే మందలించుకొని, ఒక శుభముహూర్తాన వీణని ఆప్యాయంగా అందుకుంది.

"ఇదుగో, అమ్మయి! అవేం పెట్టుకు కూర్చోకు. అందులో మునిగితే, ఇహ నువ్వు సంసారం చేసినట్టే! మీ అత్తగారు వచ్చిన కొత్తలో ఈ వేషాలే వేస్తే, మానిపించడానికి నాకు, మీ తాతయ్యకి తల ప్రాణం తోక్కొచింది. ఇప్పుడు చూడు! మళ్ళీ సంగీతం, చట్టుబండలు అనదు. ఇలాటి ఆటలు సాగనివ్వదు". ఆవిడ మాటలు పూర్తి కాకుండానే, " చూడు! కోడలు పిల్లా! ఇలాంటివి చిన్ననాటి సరదాలు. ఆంతే! కాపురాలకు వచ్చాక కుదురుతాయ చెప్పు? నీలానే భ్రమపడి మొదట్లో కొన్నాళ్ళు, ఇంట్లో తగవులు పడ్డాను. అశాంతే తప్ప మనం ఏమీ సాధించలేము. ఆ నిర్ణయం తోనే దీన్ని మూల పడేసాను. నీవు దీని జోలికి పోవటం, నాకు ఇస్టం లేదు". సుతారంగా వీణ పెట్లో పెట్టేసింది.
కాలం అలానే కదలిపోసాగింది. ఎప్పుడూ తన గురించి తాను ఆలోచించుకున్నది లేదు. తనకంటూ ప్రత్యేకత ఉండాలని కొరుకోనూ లేదు.
వీణ మూలపడి తన ఆశయం మసిబారిపోతున్న తరుణంలో అప్పుడు, అప్పుడే చిత్రంగా తన జీవితంలో మరో మలుపు. తన మామయ్య గారి ఆఙ్ఞ మేరకి ఓ చిరుద్యోగిని అయింది.
ఎంత మృదువుగా శాసించారనీ, "చూడు కళా తల్లీ! మధ్యహ్నం వేళ మేమంతా నిద్రపోతాం. నీ కెలానూ ఖాళీ, ఆ టైమును కాస్తా సద్వినియోగం చేశావా; ఉభయ తారకం కదూ! అందుకే నువ్వు మధ్యహ్నంలో ఓ విసురు నా ఫ్రెండు ఆఫీసుకెళ్ళాలమ్మా! చక్కగా తెలుగు చదువుతావు. అనర్గళంగా మాట్లాడుతావు. వాడు ఒక మాగ్జయిన్ రన్ చేస్తున్నాడులే! అందుకోసం వచ్చే కతలూ కమామీషులు కాస్త చూసిపెట్టాలి. ఫ్రెండ్షిప్తో వాడ్ని ఏమి వదిలేయను. ఖచ్చితంగా నెల తిరిగేసరికి రెండువేలు నీ దోసిట్లో పోస్తాడు. ఇప్పటి మన అవసరాలు కూడా అలానే వున్నాయి. మా అమ్మా, నాన్న మందులు, పళ్ళ కోసం లెక్క లేకుండా ఖర్చు అవుతోంది. మా అక్కయ్య సరేసరి అదో నిత్య పేషంటు ఈ ఇంటికి. ఇవన్నీ దృష్టిలో వుంచుకొని, వాడు నాతో ఎవరైనా తెలివైన అమ్మయి వుంటే చూచి పెట్టరా! అని అనగానే నా మనస్సులో తళుక్కుమన్నావు నువ్వు. మా కోడలు సరస్వతీ పుత్రిక. దాన్నే పంపుతా! అని అనేశాను". విరక్తిగా నవ్వుకుంది.
ఆ రోజు పనిపూర్తి చేసి, తను బయట పడిందో లేదో, రివ్వున గాలి వీస్తూ, వర్షం మొదలైంది. ఆఫీసులోకి కనక వెళ్ళిందో, మావయ్య గారి మిత్ర మహాశయుడు ఓ నాలుగు కబుర్లు చెప్పి, మరో రెండు గంటల సరిపడా పని అంటగట్టేస్తాడు. అసలే తనకి తలనొప్పిగా వుంది. ఆటొలో వెళ్ళిపొతే! పర్సులో పాతిక రూపాయలు కూడా లేవు.
"ఇదేంటి; ఇలా నిలబడి పోయారు? నా గొడుగులోకి రండి! ఇక్కడే మా టీచరిల్లు. వర్షం తగ్గేదాక కూర్చొని వెళ్ళిపోదురు లెండి ఆ అమ్మయితో పాటు నడక సాగించింది.
ఆ పాపని ఎప్పుడూ చూడనే లేదు. ఇంత కలుపుగోలుగా మాత్లడుతూ, తన సమస్య తీర్చేసింది. సెవెంత్ చదువుతోందట!. ఆ పాప అన్నట్టే ప్రైవేటు మాష్టారు ఇంట్లొ వర్షం తగ్గేదాక వుండి ఇంటి కెళ్ళచ్చు అనుకుంది.
"అబ్బా! మళ్ళీ ఏంటాంటి? ఓ రెండడుగులు వేస్తే అదే మా టీచర్ ఇల్లు."
"అంటె పాప నువ్వు....."
"వీణ నేర్చుకుంటున్నానాంటీ. చదువు చెప్పే టీచర్ అనుకుంటున్నరా. ఇక్కడ బాగా సంగీతం చెప్తారు.
ఆ అమ్మాయితోపాటు లోపలికెళ్ళింది. ఓ నలుగురు అమ్మాయిలు పంచరత్న కీర్తనలు వాయిస్తున్నరు.
ఓ పక్క గదిలో కొత్తగా చేరిన వాళ్ళో ఏమో! సరళీ వరుసలు సాధన చేస్తున్నరు. తనని ఈ ఆలయానికి తీసుకొచ్చిన చిన్నారి మరో వీణ తీసుకొని ఆ ఇద్దరితో కలిసి వాయించ సాగింది. ఆ క్షణాల్లొ పొందిన దివ్యానుభూతి తన హృదయంలో చెరగని ముద్రవేసింది.
శ్యామలా టీచర్ తనని పరిచయం చేసుకోవటం, తొలి కలయికలోనే తన తపనని ఆమెతో పంచుకోవటం, ఆవిడ తన పట్ల చూపించిన అభిమానం, తన లోని ఆశయానికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసాయి. తన సందేహాలన్ని, ఆవిడ ఔదార్యంతో పటాపంచలై పోయాయి.

"నువ్వు నిరాఘాతంగా నీ విద్యని అభివృధ్ధి చేసుకో! ఇక నీ సాధనికి ఏ అవరోధాలు వచ్చినా నేను ఒప్పను. రేపటి నుంచే నువ్వు ప్రతిరోజు క్లాసుకు వస్తావు. నా శిక్షణలో నిన్ను ప్రఖ్యాత వైనికురాలిగా తీర్చిదిద్దుతాను." దృడనిశ్చయంతో పలికారావిడ.
నిజానికి, తామిద్దరూ ఎవరికెవరు? ఇంత గాఢంగా గురు శిష్య బంధం తమ ఇద్దరి మధ్య పెనవేసుకు పోయిందంటే ఆవిడకి విద్య పట్ల ఉన్న గౌరవ భావం ఎంతటిది? మరో తరాన్ని తీర్చి దిద్దాలన్న అభిలాష తొనే ఆమె ఎంతకు సాహసించారు! తను గురు దక్షిన ఇవ్వలేకపోగా, తను ఉద్యోగం మానేసిన విషయం గోప్యంగా ఉంచి, టీచర్ సంపాదనే తన కిస్తూ వచ్చారు. మామాగారి స్నేహితుడు టీచర్కి దగ్గర బంధువు కావటంతో అలా చేయటం కష్టం కాలేదు.
ఎలాంటి అలజడి లేకుండా, ఆమె సాన్నిధ్యంలో తన వీణ వదనానికి మెరుగులు దిద్దుకుంది. రెందేళ్ళు గడిచేసరికి, వీణా వాదనలో సిధ్ధహస్తురాలయింది. తనిక చేపట్టలేననుకున్న వీణలో ఇంత విద్వత్తు సంపాదించుకుంది.

ఆరోజు మైమరచి, సమయాన్ని గమనించకుండా, రాగం,తానం,పల్లవి సాధనలో మునిగిపోతే,"అధ్భుతంగా వాయించేస్తున్నవ్! నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందో! రాష్త్ర స్థాయి పోటీలో గనక నువ్వు పాల్గొంటే, ప్రథమ విజేతవి నువ్వే అవుతావు". టీచర్ తన చుట్టూ చేయి వేసి అన్నారు. అదిరిపడింది.

" నా ఆనందం ఈ ఆలయానికి, నా హృదయానికే పరిమితం. ఇంట్లో గనక తెలిస్తే ఇంకేమైన ఉందా?అంది.
ఆ ముసలాళ్ళకేం తెలీదులే, మీ వాళ్ళంత ఉత్త సుఖభోగులు. ఇలాంటివి పట్టించుకోరు, వచ్చేనెల గుంటూరులో జరిగే పోటీల్లో నువ్వు పాల్గొంటున్నావంతే! టీచర్ అనటమే కాదు., తన కళ ప్రదర్శనకి నోచుకుంటుందంటే, తనూ ఉప్పొంగి పోయింది. పుట్టి ఏడాదవుతున్నా,మేనల్లుణ్ణి చూడలేదన్న నెపంతో గుంటూరు బయలుదేరింది. దైవికంగా మూణ్ణెళ్ళ క్రితం అన్నయ్యకి ప్రమొషన్ వచ్చి గుంటూరు బదలీ అయింది. వదిన ప్రోత్సాహంతో అత్తింటి సంగతుల్లన్నీ ఆవలకి నెట్టి, ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంది.
టీచర్ ఆశీస్సుల బలమో! తమ ఇద్దరి అవిరళ కృషి ఫలమో! అన్ని జిల్లాల నుంచి వందలమంది పాల్గొన్నా, గోల్డ్ మెడల్, పారితోషికం ప్రథమ బహుమతిగా గెలుచుకొన్నది తనే! ఎంతోమంది విద్వాంసులు, విఙ్ఞులైన శ్రోతలు అభినందనలతో, ప్రశంసలతో,ముంచెత్తారు. సర్వం మరిచి కొద్దిసేపు తను ఆనందలోకాలలో తేలిపోయినా, గృహిణిగా తాను కొనసాగిస్తున్న జీవన విధాననికి ఇది గొడ్డలిపెట్టు. తన ఇంటి పెద్దల దృష్టిలో తను మాయలాడిగ ముద్ర పడిపోథుంది. భర్త మన్నించి అభిమానించిన శ్రీ వారి అభిప్రాయానికి విలువెక్కడా? పెద్దగా చదువబ్బని అతనంటే ఇంట్లో అందరికి చులకన భవం. నామకా ఏదో వ్యాపారం చేస్తున్న, అందరి దృష్తిలోను చేతగాని దద్దమ్మే! తనతో ముద్దు మురిపాలు పంచుకుంటూ, సరదాగా గడపాలన్నా బెరుకే అతనికి. ఎట్నుంచి ఏం జరిగినా, పెద్దల ఆఙ్ఞ శిరసావహిస్తాడు తప్ప దేనికి అతనిలో తెగింపు లేదు. ఈ మోస్తరు ఆలోచనలు చుట్టుముట్టేసరికి సుడిగాలిలో చిగురుటాకులా కంపించి పోయింది. వదినా, టీచర్ ఎంతగా ధైర్యం చెప్పినా తమాయించుకోలేక పోతోంది.

"మీకు ఎంతగానో ఋణపడిపోయాం మేడం! మా చిన్నారి ఆడపడుచు ఈ స్దాయికి ఎదగాలని తపిస్తూనే, మా అత్తయ్యగారు పోయారు. మీ దయాదాక్షిణ్యాలతో మీ సూర్యకళ గొప్ప కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. కనీసం మీ నోరు తీపి చెయనివ్వండి!" విశాల శ్యామలకి పాయసం కప్పు అందిస్తూ అంది.
"తను చేదు మింగినట్టు ఫీలయిపోతుంటె!" స్పూన్ తో పాయసం రుచి చూస్తూ నవ్వింది శ్యామల.
"వాళ్ళ స్వభావాలు నాకూ తెలుసు. తన సంసార జీవితం ఎక్కడ విచ్ఛిన్నమౌతుందోనని భయపడుతోంది. నాకూ అంతరాంతరాల్లో ఎదో కలుక్కుమంటోంది". ఆడపడుచుకు బలవంతాన పాయసం తినిపిస్తూ అంది. "మీ ఇద్దరూ నిశ్చింతగా ఉండండీ. అంతానేను చక్కదిద్దుతాగా! వాళ్ళది తగిన రీతిలో బ్రెయిన్ వాష్ చేసి, మన కళ స్వేచ్చగా కచేరీలు ఇవ్వగలిగేట్టు, ఇంట్లోనే వీణ వాయించుకోగలిగేట్టు చేయలేకపోతే, నా పేరు శ్యామలే కాదు. పద మీ ఇంటి కెళ్ధాం". శిష్యురాలి చేయందుకొని దిగ్గున లేచింది.
అదేక్షణాన యశోదమ్మ వీణ చేతుల్లోకి తీసుకోని దుమ్ముదులిపింది. పశ్చాత్తాపం ఆమె హృదయాన్ని దహించేస్తోంది. టేబుల్ పైన వార్తాపత్రికలో తన కోడలి ఫోటోను పదేపదే చూసుకుంటోంది. ఎంతటి ఉత్సుకతతో, అత్తింటికొచ్చిన తొలిరోజుల్లోనే ఈ వీణను పలికించ బొయింది? తన అత్తగారు వల్లకాదనేసరికి, తనూ వంతపాడింది. తను పొంద లేనిదాన్ని, కోడలూ పోగొట్టుకోవాలి! అనుకోవటం తనలో పేరుకొన్న అసూయేకదా! పాపం, సూర్యకళ! రహస్యంగా ఇంత సాధించటానికి ఎలాటి అవస్థలు పడిందో? ఈర్ష్య, స్వార్ధం లాంటి అవగుణాలే, తరాలమధ్య అంతరాలను పెంచేస్తున్నాయి. స్త్రీ ప్రగతికి ఇవే అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఎందరు ప్రతిభావంతులు తనలా అణగారిపోతున్నారో? తన కోడలు తెగువతో చాలా మంచి పనేచేసింది.
స్వచ్చమైన మనసుతో ఆ గురుశిష్యులను సాదరంగా ఆహ్వానించి, తన బంగారువీణను కోడలు చేతుల్లో ఉంచింది.
తన తప్పిదాన్ని తెలుసికొని, మానసిక పరవర్తన చెందిన యశోదమ్మను చూస్తుంటే, శ్యామలకి కొండంత సంతృప్తి కలిగింది. ఊపాధ్యాయురాలిగా ఆమె ఆనందానికి అవధులే లేకపోయాయి.

"బంగారు వీణ" కథకు విశ్లేషణ

కొంతమంది అత్తగార్లు తాము కోడలిగా ఉన్నప్పుడు తమ ఆలొచన్లకి గానీ, కనీసమైన ఇష్టాయిష్టాలకి గానీ ఏమాత్రం విలువలేకుండా మానసికంగా నలిగిపోతే తదుపరి తమ కోడలు కూడ అదే విధంగా బాధలు పడాలని మానసికంగ చిత్రహింస అనుభవించాలని కోరుకునేవాళ్ళు ఈ సమాజంలొ అక్కడక్కడా ఇంకా ఉన్నారని చెప్పడంలొ ఏ మాత్రం అతిసయోక్తి లేదు. ఇదే విషయాన్ని సత్యవాడ సోదరీమణులు తమ "బంగారు వీణ" కథలో చెప్పడం జరిగింది. కానీ సమస్య చూపించిన మాత్రాన ఫలితం లేదు. అందుకే కోడలు సాధించె ప్రగితిని చూసి ఈర్ష్య పడటం చాల పెద్ద తప్పని అర్ధం చేసుకుని అత్తగారు పరివర్తన చెందినట్లు ముగింపు చూపడం సమంజసంగా వుంది. ఈ రకమైన కథలు వర్ధనమ్మ లాంటి స్త్రీలలొ మంచి మార్పు తీసుకురావాలాని ఆశిద్ధాం.

-- తమిరిశ జానకి

సత్యవాడ సోదరీమణులు: జన్మతః అంధురాళ్ళైన ఈ అసమాన ప్రజ్ఞా మణులు సత్యవాడ సోదరీమణులుగా ప్రసిధ్ధులై సంగీత సాహిత్యాలలో కృషి చేస్తూ తమది అంటూ ఒక స్థానాన్ని ఏర్పఱచుకున్నారు. వీరి కలం నుండి వందలాది కథలు పలు పత్రికలలో ప్రచురితమైనాయి, ఐదు కథా సంపుటాలు వెలువడినాయి. అనేక వేదికలపై వీరి గానం శ్రోతలను అలరిస్తోంది. చిన్నవారైన సుర్య కుమారి గారు వీణా వాదనలోనూ నిష్ణాతులు. ప్రస్తుతం వీరు హైదరాబాదులో శివరామ సంగీత శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నారు.