 |
|
|
కథా భారతి |
|
|
అంతర్ముఖం -
6వ భాగం |
|
రచన
: యండమూరి వీరేంద్రనాథ్ |
|
సాయంత్రం అయిదు దాటింది. కదలకుండా పని
చెయ్యడంతో నా స్టేట్ మెంట్స్ చాలావరకు
పూర్తయ్యాయి. కానీ చెయ్యి లాగేస్తోంది. మరో
రెండు గంటలు కూర్చుంటే పనంతా పూర్తవుతుంది.
కూర్చుని చెయ్యక తప్పదు.
నేను వెళుతున్నా సార్.. అన్నాడు సత్యం లేచి.
అదేమిటయ్యా! స్టేట్ మెంట్స్ టైపు చెయ్యాలి.
అయినా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళి, ఆఫీసర్
గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళు. నాకు
తెలియదు అన్నాడు పరంథామయ్య.
సరే! మరోగంట కూర్చుంటాను. ఎంతయితే అంత టైపు
చేసి వెళతాను.
ఆ తర్వాత ఆఫీసులో నేనుండను.. మళ్ళీ వెళ్ళి
సీట్లో కూర్చున్నాడు సత్యం.
పరంధామయ్య విజయసూచకంగా నవ్వాడు. ఇవాళ పని
పూర్తికాకపోతే రేపు వచ్చి పని పూర్తి
చెయ్యమని ఆర్డ్రర్స్. ఎల్లుండి టీమ్
వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలి. ఆ పైన
నీ ఇష్టం అన్నాడు.
అరగంట కూడా కాలేదు. పరంధామయ్య పెద్దకూతురు
సుశీల లోపలకి వచ్చింది.
అరె ! ఇదేమిటి డాడీ! ఇంకా పని చేస్తున్నారా?
ఆరవుతోంది. లేవండి.. త్వరగా అంది. ఆమె
ముఖంలో ఎగ్జయిట్ మెంట్ చూసి, ఏదో గొప్ప
విశేమే అనుకున్నాను.
ఎందుకమ్మా, ఎల్లుండి ఇన్ స్పెక్షన్ టీమ్
వస్తోమ్ది. చాలా పని ఉంది. ఇవాళ చాలా
ఆలస్యమవుతుంది అన్నాడు పరంధామయ్య.
అదేం కుదరదు. వెంటనే లేచి రండి. రావుగారు
సినిమా టిక్కెట్లు తీసుకొచ్చారు. ఎంత కష్టం
మీద దొరికాయో తెలుసా?
నాకు నవ్వొచ్చింది. సత్యం పళ్ళు బిగబట్టి
కసిగా చూస్తున్నాడు.
సినిమాకా? వద్దులేమ్మా! అందరం ఉంటున్నాం.
ఆయన అనేంతలోనే రావుగారు లోపలికొచ్చారు.
ఇదేంటంకుల్! ఇంకా కూర్చున్నారా? టైమయింది.
లేవండి!
అదికాదు బాబూ!..
ఏం కాదు డాడీ.. నీ కిష్టమయిన హీరో సినిమా
ఆఖరి రోజని ఆయన కష్టపడి టిక్కెట్లు తెస్తే
రానంటావేం? ఆమె రావుగారి వైపు తిరిగి, మీరు
వెళ్ళి కారులో కూర్చోండి, నేను డాడీని
తీసుకొస్తాను. అంది. ఆయన వెళ్ళిపోయాడు.
పరంధామయ్య నావైపు తిరిగి, తప్పేటట్లు
లేదయ్యా, రేపు ప్రొద్దుట వస్తావుగా,
అప్పుడు కూర్చుని అన్నీ పూర్తిచేద్దాం.
నీకు టైపింగు వచ్చుగా! అదీ నువ్వే
చేద్దువుగానీ, టేబుల్ సద్దుతూ అన్నాడు.
సత్యం నా దగ్గిరగా వచ్చాడు. రాత్రి బస్ కి
మీ అమ్మని చూడటానికి ఊరు వెళతానన్నావ్ గా?
రేపు రావడం ఎలా కుదురుతుంది? అని అడిగాడు.
ప్చ్..అమ్మను చూడ్డానికి ఈ వారం కాకపోతే,
మళ్ళీ వారం వెళ్ళొచ్చులే, పరంధామయ్య
తేలిగ్గా అన్నాడు.
అవునులెండి! ఊరు ఎప్పుడయినా వెళ్ళొచ్చు.
సినిమా రేపటిదాకా ఉండదుగా! నేనూ వెడుతున్నా,
నా స్వంత భార్యను తీసుకుని సినిమాకెళ్ళాలి,
అన్నాడు సత్యం. పరంధామయ్య గారి వైపు చూస్తూ
వ్యంగ్యంగా, అయితే ఆయన దాన్ని గుర్తించలేదు.
వెళ్ళు! అయినా స్వంత భార్య ఏమిటి? అద్దె
భార్యలు కూడా ఉంటారా? అదో జోక్ లా
నవ్వాడాయన. నా వైపు తిరిగి, రేపు
పదింటికల్లా వచ్చేసెయ్, నేనూ వస్తాను, అని
చెప్పి వెళ్ళిపోయాడు.
ఛీ! ఆ పిల్లకి, వచ్చిన పెద్దమనిషికి
సిగ్గులేకపోతే, ఈ ముసలాడికయినా
ఉండక్కర్లేదు. రేపు రాకు, రాత్రికే ఊరు
వెళ్ళిపో, ఏం చేస్తాడో చూద్దాం. అన్నాడు
సత్యం.
పోనేలే, సత్యం! ఆఫీసుపనేగా, అమ్మను
చూడ్డానికి వచ్చేవారం వెళతాను అన్నాను.
నేనూ కూర్చుంటాను. అన్నాడు సత్యం. వేడి
వేడి కాఫీ తాగాక కాస్త రిలీఫ్ గా
అనిపించింది.
రాత్రి సత్యం నన్ను ఇంటి దగ్గర డ్రాప్
చేసి వెళ్ళాడు. స్నానంచేసి, నాయర్ హోటల్లో
భోజనం చేసి వస్తూంటే, రావు గారి కారు
కనిపించింది. ఆయన పక్కగా అంటుకు పోయినట్టు
కూర్చుంది సుశీల. పరంధామయ్య కార్లో లేడు.
ఆయన్నింటి దగ్గర వదిలేసి, వీళ్ళిద్దరూ
సుశీల ఇంటివైపు వెళుతున్నారు. బహుశా ఆమె
భర్త ఊళ్ళో లేడేమో!
తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, సుశీల ఒక
నిరుద్యోగిని ప్రేమించి పెళ్ళి చేసుకుని,
అందర్నీ వదులుకోవడానికి సిద్ధపడిందని
తెలిసినపుడు, ఆ అమ్మాయి ధైర్యాన్ని,
వ్యక్తిత్వాన్ని చూసి నాకు ముచ్చటేసింది.
కానీ నాలుగేళ్ళయినా కాకుండానే ఆ విషయం
మర్చిపోయి ఇలా మరో వ్యక్తితో ప్రేమకలాపం
ఎలా సాగించగలుగుతోంది? ఆ అమ్మాయి
మనస్తత్వం ఎలాంటిది?
ఆమె చదువుకుంది. మంచి ఉద్యోగం ఉంది.
భర్తకు ఉద్యోగం లేకపోయినా కష్టపడకుండా
బ్రతకగలిగే సామర్ధ్యం ఉంది. ప్రేమించి
పెళ్ళి చేసుకున్న మగవాడిపై ఆమెలో ప్రేమ
తగ్గిపోయి ఉంటుందా? ఎంత ప్రేమించిన
వాడయినా, భర్త ఆర్ధిక పరిస్థితి సరిగా
లేకపోతే భార్యలో ప్రేమ తగ్గిపోతుంది
కాబోలు. లేదా, అప్పట్లో ఆమె కేవలం
వ్యామోహంతో అతడిని పెళ్ళాడి ఉంటుంది. అది
సరైన ఆలోచనగా అనిపించ లేదు. పెళ్ళి
చేసుకున్నప్పుడు ఆమె పదహారు కాదు... ఇరవై
ఆరు.
ఆలొచనలతోటె పడుకున్నాడు. ఉదయం లేవగానే ఈ
రోజు వెళ్ళి అమ్మని చూసిరావాలని
అనుకున్నాను. రాత్రి బస్సెక్కి వెళ్ళి
ఒకపూట అక్కడ ఉండి మళ్ళీ సోమవారం ఉదయానికి
వచ్చేయాలని నా ఉద్దేశ్యం. అమ్మని అక్కడ
వదిలి వచ్చాకా ఒక్కసారయినా వెళ్లలేదు.
అమ్మను చూడాలన్న తపన నిజంగా నాలో ఉందా?
లేదా పరంధామయ్య గారు ఈ రోజు చాలా
పనుమ్ది.. అనగానే ప్రయాణం క్యాన్సిల్
చేసుకున్నాను.
అందర్లాగా నాలో సెంటిమెంట్స్ లేవా? అసలు
ఎటాచ్ మెంట్ లేదేమో.. నేను పెరిగిన
వాతావరణం అలాంటిది. అయితే అమ్మపట్ల నాకు
అభిమానం, ప్రేమా ఉన్నాయి. అందరూ అమ్మ
అక్కడెలా ఉందో, ఒకసారి చూసిరా అంటారు.
కానీ, నాలో అంతర్లీనంగా అమ్మ అక్కడ
సుఖంగా, సంతోషంగా ఉందన్న సంతృప్తి ఉంది.
అందుకే వెళ్ళి చూడాలన్న ఆరాటం కలగటం లేదు.
ఎవరో ఏదో అంటారని అనుకుంటారని, దానికోసం
నేనేదో చెయ్యాలనే ఆలోచన నాకెప్పుడూ కలగదు.
దాని గురించి సిగ్గుపడను కూడా.
అమ్మ గురించి ఇంత ఆరాటపడుతున్నట్లు
మాట్లాడే వాళ్ళలో నిజంగా అమెపట్ల అభిమానం,
గౌరవం ఉన్నాయా? లేవు. కేవలం ఫార్మాలిటీస్
కోసం వాళ్ళూ అలా మాట్లాడతారు. అలాంటి
ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. కృత్రిమంగా
అనిపిస్తాయి. నాలోని ఈ గుణం చాలా మందికి
నచ్చదు.
దూరం నుంచి ఇల్లు కనిపిస్తోంది. అన్ని
పోర్షన్లలోనూ చీకటి. శ్రీనాథ్
క్యాంపుకెళ్ళాడు. లేకపోతే అతడూ చాలా
నిశాచరుడు. అర్ధరాత్రి దాటినా లైటు
వెలుగుతూనే ఉంటుమ్ది. ఆ రోజు వెళ్ళి
మల్లికను బ్రతిమాలి తీసుకొచ్చాడు.
రెండు రోజులలో మళ్ళీ షరా మామూలే. ఇంటికి
కాస్త దూరంలో సడన్ గా ఆగాను. తమ ఇంట్లోంచి
ఒక వ్యక్తి దొంగలా అడుగులో అడుగు
వేసుకుంటూ వచ్చాడు. గేటు బయటకు రాగానే,
గబగబా అడుగులు వేసుకుంటూ కాస్త దూరంలో ఆగి
ఉన్న కారు దగ్గరకు నడిచాడు. అక్కడున్న
వీధి దీపం వెలుగు అతడి ముఖం మీద పడింది.
గుర్తుపట్టాను.
ఆదివారం మల్లికతో సినిమాహాల్లో చూసిన
వ్యక్తి అతడు.
కారెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
* * *
క్యాంటీన్లో కూర్చుని టిఫిన్
చేస్తున్నాను. రెండు రోజులపాటు ఇన్
స్పెక్షన్ టీమ్ తో బిజీ అయిపోయారంతా. ఈ
రోజిక ఎవరూ పనిచేసే మూడ్ లో ఉండరు.
దూరం నుంచి సత్యం నవ్వుతూ వస్తున్నాడు.
అతడు రెండు రోజుల్నుంచి ఆఫీసుకి రావడం
లేదు. అందుకే త్వరగా వచ్చాడు.
టీమ్ వెళ్ళిపోయారా? అడిగాడు దగ్గరకు
రాగానే.
ఆ అంతా సవ్యంగానే జరిగింది. నువ్వేమిటి
చెప్పకుండా లీవు పెట్టావు.
అనుకోకుండా పెట్టాల్సొచ్చింది. ఆదివారం
వచ్చావా? ఏమన్నాడు గురుడు, సినిమా గురించి
బోర్ కొట్టాడా?
సినిమా గురించే కాదు, తన వాళ్ళందరి
గురించి, ఎప్పూడూ ఉండేదేగా?
నీ విషయం ఏమిట్రా అంత డల్ గా ఉన్నావు ?
అడిగాను.
ఏం లేదే బాగానే ఉన్నాను.
కాదు, పైకి నవ్వుతున్నావు గానీ నీ
కళ్ళల్లో తడి తెలిసిపోతోంది.
సత్యం ఆశ్చర్యంగా చూశాడు.
అవును. నా ప్రశ్నకి బదులు చెప్పకుండా,
అదేమోగాని ఒక్క విషయం ఆశ్చర్యంగా
అనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఎంత క్లోజ్ గా
ఉన్నా నీ నోట అలగా అన్నమాట, చిన్న
చిరునవ్వు తప్ప ఇలా ఇతరుల స్వవిషయాల పట్ల
ఆసక్తి చూపించడం నేనెప్పుడూ గమనించలేదు. ఈ
రోజు నువ్విలా అడగడం ఆశ్చర్యంతో పాటు
ఆనందాన్ని కలిగిస్తోంది.
నేనిన్నాళ్ళూ నీ ముఖంలో ఒకరకమైన తృప్తినీ,
ఆనందాన్నీ చూశాను సత్యం. ఈ రోజైనా నీ
స్వవిషయాలు తెలుసుకోవాలన్న ఆరాటంతో
నిన్నలా అడగలేదు. ఏదో తెలుసుకోవాలన్న
ఆసక్తి నాకు కలగదు. కానీ నీ చిరునవ్వు
వెనుక నీకూ అశాంతి కలిగించే
సమస్యలున్నాయంటే.. ఏమో నాకు అది బాధ
కలిగిస్తోంది.
అవును. చాలా రోజులుగా నాకు మనశ్శాంతి లేదు
నిజమే. కాని అది పైకి కనిపించకుండా
నిగ్రహించుకోగలిగే ఆత్మస్థయిర్యం,
విశ్వాసం ఉండేవి.
ఈ రోజు అదీ లోపించింది. ఇన్నాళ్ళూ నీకేమి
చెప్పలేదు. అందుకు నువ్వు అపెండ్ అయితే
సారీ.
అతడివైపు ఆశ్చర్యంగ చూశాను. ఇందులో
బాధపడేందుకేముంది సత్యం. ప్రతి మనిషి
జీవితం అతడిస్వంతం. అది ఎవరితోనైనా
పంచుకుంటే అది అతడి ఇష్టప్రకారం చేసుకునే
స్వతంత్య్రం ఉండాలి. ఈ క్షణంలో నువ్వు
నాతో ఏమీ చెప్పకపోయినా నాకేలాంటి ఫీలింగు
ఉందదు. అది నా తత్వం. ఆ విషయం నీకు తెలిసే
ఉండాలి.
తెలుసు. నా చిరునవ్వు వెనక ఎలాంటి విషాదం
ఉందో ఇంతవరకు నీకే కాదు. ఎవరికీ
చెప్పుకోలేదు. ప్రతి మనిషికీ సమస్యలు ఏదో
ఒక రూపంలో ఉంటాయి. కాని ఒకరి సమస్యలు
మరొకరికి సమస్యల్లాగా కనిపించక పోవచ్చు.
అటువంటి సమస్యలు బహిర్గతం చేసుకుంటూ
తిరగడం ఇష్టం లేక చిరునవ్వుతో
కప్పేస్తుంటాను. కాని ఒక్కోసారి ఆ సహనం
కూడా మొరాయిస్తుంది. అందుకే బయటపడ్డానేమో,
సత్యం ఆగాడు..
(సశేషం)
|
|
|
|
|
మీ
అభిప్రాయాలు, సలహాలు మాకెంతో
అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ
క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)
|
|
సుజనరంజని
మాసపత్రిక
ఉచితంగా మీ
ఇమెయిల్
కి పంపాలంటే
వివరాలు
కింది
బాక్స్‌లో టైపు
చేసి
సబ్‌స్క్రైబ్
బటన్ నొక్కగలరు.
|
|
|
|
|
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ
పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ
అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any
unsolicited purposes. Please keep comments relevant.) |
|
|
|
|
Copyright ® 2001-2012
SiliconAndhra. All Rights Reserved.
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site Design: Krishna,
Hyd, Agnatech
|
|