Sujanaranjani
           
  కబుర్లు  
  వీక్ పాయింట్
      మున్నాభాయ్? కాదు - ఖల్‌నాయక్  
 

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 
  సంజయ్ మంచి బాలుడు.
ఎందుకంటే చెడ్డ పనులు బాగా చేస్తాడు.
ఫస్ట్‌క్లాస్ దేశద్రోహులతో ఎక్స్‌లెంట్ సంబంధాలు పెట్టుకుంటాడు.
గుర్తుందా? ఇరవై ఏళ్లకింద ముంబయి వరస పేలుళ్లు 257మంది అమాయక పౌరులను దారుణంగా బలిగొన్నాయి. దేశంలోకెల్లా ఘోరమైన టెర్రరిస్టు దాడి అది. పాకిస్తాన్ పనుపున దానికి పుణ్యం కట్టుకున్నవాడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. అతడికి కుడి భుజం తమ్ముడు అనీస్. ఎడమ భుజం అబూసలెం.
ఆ ముగ్గురితోనూ రాసుకుపూసుకు తిరిగినవాడు ‘మున్నాభాయ్’ సంజయ్!
పేలుళ్ల కేసులో మొన్న సుప్రీంకోర్టు శిక్షించిన ముద్దాయిలు వంద పైచిలుకు. ప్రధాన కుట్రదారులతో నేరుగా ముఖ పరిచయం ఉన్నది ఉరి ఖరారైన వాడు కాక ఒకే ఒక్కడికి. అతడి పేరు సంజయ్‌దత్!
ముంబయి ఘోర కలి నిమిత్తం దావూద్ గ్యాంగు దేశంలోకి దింపిన మారణాయుధాల్లో కొన్ని హీరోగారి ఇంటికి రాత్రివేళ రహస్యంగా చేరాయి. వాటిని మూటగట్టి తన కారు డిక్కీలో దాచిపెట్టానని స్వయంగా అతడే కోర్టుముందు ఒప్పుకున్నాడు.
కాబట్టి సంజయ్ గుడ్‌బాయ్! అంతటి మంచి మనిషికి జైలుశిక్ష పడటమేమిటని బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌దాకా బడాబడా సినిమా శాల్తీల సున్నిత హృదయాలు లబలబలాడుతున్నాయ. దర్యాప్తు దశలో ఇంతకుముందే ఏణ్నర్థంపాటు జైలుపాలయి నాన్నగారి రాజకీయ పలుకుబడివల్ల ఆశ్చర్యంగా బెయిలుమీద బయటపడ్డ గుణవంతుడిని శిక్ష ఖరారయ్యాక మళ్లీ కటకటాల వెనక్కి పంపటం ఎంత అన్యాయం!? మంచి కుటుంబంలో పుట్టి, మంచి వేషాలు వేసి, మంచి ప్రియుడు, మంచి భర్త, మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నవాడిని మూడున్నరేళ్ల స్వల్పకాలానికే అయినా జైలుకంపితే అతడి కుటుంబం ఎంత బాధపడుతుంది? ఆ సత్పురుషుడి సుతారపు మనసుకు ఎంత రంపపుకోత- అని పార్లమెంటులోని మాజీ తారలూ, పెద్ద పార్టీల పెద్ద తలకాయలూ శోకాలు పెడుతున్నారు.
సాక్ష్యాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సాక్షాత్తూ సుప్రీంకోర్టే శిక్షిస్తేనేమి? ఆ మహానుభావుడు ఒక సినిమాలో గాంధీగిరీ చేసి గాంధీ సందేశాన్ని కుర్రకారుకు బాగా పట్టించాడు. కాబట్టి గాంధి అంత గొప్పవాడు. అటువంటి మహాత్ముడిని ఖైదు చేయటమేమిటి- అని అదే సుప్రీంకోర్టులో మొన్నటిదాకా జడ్జిగిరీ నెలిగించిన ఒకానొక మాన్య న్యాయమూర్తి గుండెలు బాదుకుంటున్నాడు. (‘ఖల్‌నాయక్’ వేషం కూడా అతడే వేశాడని కట్జూ గారికి బహుశా తెలియదు) గవర్నరో, రాష్టప్రతో అర్జంటుగా కలగజేసుకుని సుప్రీంకోర్టు తీర్పును అడ్డం కొడితేకానీ న్యాయానికి న్యాయం జరిగినట్టు కాదని ఆయన ఆపసోపాలు పడుతున్నాడు. శిక్ష ఎత్తేసే అధికారం గవర్నరుకు ఉంది; ఇలా పిటిషను అందగానే అలా ఆయన నిర్ణయం చేస్తారులెమ్మని దేశానికి న్యాయ శాఖమంత్రి అయిన పెద్దమనిషే పబ్లిగ్గా భరోసా ఇస్తున్నాడు.
తారల ఏడుపులూ, నేతల ఓదార్పులూ, సంఘీభావ ప్రకటనల కోరస్‌ను బట్టి- సినిమా నటుడికేదో జరగకూడని అన్యాయం జరిగిందని, చిన్నపాటి పొరపాటుకు పాపం చాలా పెద్ద శిక్ష పడిందని తెలియనివారు అనుకోవచ్చు. కాని- నిజానికి అతడి తప్పిదానికి న్యాయంగా పడాల్సిన శిక్షయినా పడిందా?
దుబాయినుంచి దారుణ మారణాయుధాలను ఆర్డరుచేసి అక్రమంగా తెప్పించుకున్నవాడు సంజయ్‌దత్. అతడికి అందిన మూడు ఎ.కె.56 రైఫిళ్లలో రెండు కొద్దిరోజుల తరువాత జైబున్నీసా అనే మహిళ ఇంటికి చేరాయి. అతడు ఇంట్లో పెట్టుకున్న రైఫిలును అతడి పురమాయింపుమీద వేరేవాడు ధ్వంసం చేశాడు.
తెలిసీ తెలియక మారణాయుధాలను ఇంట్లో పెట్టుకున్న వృద్ధురాలిని, సంజయ్ ఇంటి నుంచి ఆమె దగ్గరికి వాటిని కారులో చేరవేసినవాడిని, తుపాకిని ధ్వంసం చేసినవాడిని టెర్రరిస్టులుగా గుర్తించి ‘టాడా’ చట్టం కింద న్యాయస్థానం శిక్షించింది. దుబాయిలోని దావూద్ తమ్ముడికి అనేక పర్యాయాలు తానే ఫోను చేసి, అడిగి మరీ ఆ ఆయుధాలను తెప్పించి, వాటిలో ఒకదాన్ని ధ్వంసం చేయించిన అసలు కధానాయకుడిమీదేమో ‘టాడా’ను ఎత్తేసి, ఆయుధ చట్టం కింద మామూలు కేసు పెట్టారు.
బుద్ధి గడ్డి తిని అక్రమంగా ఒక తుపాకిని - అదీ ఆత్మరక్షణ నిమిత్తం తెప్పించుకోవటం మినహా దావూద్ అండ్ కో ముక్కూ మొగం కూడా సంజయ్ ఎరుగడని బుకాయించడానికి వీల్లేదు. ఎందుకంటే - సంజయ్‌దత్ తన నేరంగీకార వాజ్ఞ్మూలంలో ఏ సమీర్, హనీఫ్‌లనైతే పేర్కొన్నాడో - వాళ్లే బాబరీ మసీదు కూల్చివేత అనంతర అల్లర్ల దరిమిలా ఏదైనా చెయ్యరాదా (‘‘్భయ్, ఏ షహర్ మే క్యాహోరహా హై? కుఛ్ కరోగే నహీఁ?’’) అని దావూద్ తమ్ముడు అనీస్‌తో సంజయ్ అంటుండగా తాము విన్నట్టు పోలీసులకు చెప్పారు. అంతకుముందే లైసెన్సు పొందిన తుపాకులు తన దగ్గర మూడు ఉన్నాయని తానే చెప్పుకున్న వాడికి ఆత్మరక్షణ కోసం ఇంకో భయంకర ఆయుధాన్ని దొంగతనంగా స్మగుల్ చేసుకోవలసిన అవసరమేమి వచ్చింది? నిజంగా ప్రాణభయమే ఉంటే పోలీసులను రక్షణ అడగాలిగాని పాకిస్తానీ తొత్తు అయిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ నుంచి చాటుమాటున - అదీ మూకుమ్మడి హత్యలకు వాడే ఎ.కె.56లను, టెర్రరిస్టు విధ్వంసాలకు ఉపయోగించే హాండ్ గ్రెనెడ్లను కట్టలకొద్దీ ఇంటికి తెప్పించుకోవటమేమిటి?
నేర ప్రవృత్తిని, దేశద్రోహులతో సంపర్కాన్ని సూచించే ఇలాంటి కీలకాంశాలన్నీ చార్జిషీటుకెక్కకుండా సిబిఐ తొక్కేసింది. ఘోరంలో తన ప్రమేయాన్ని నిందితుడు తానే ఒప్పుకున్నా టాడా కోర్టు వల్లమాలిన కరుణ చూపి, సంజయ్‌దత్ మీద ‘టాడా’ కేసు ఎత్తేసి, అక్రమంగా ఆయుధాన్ని దాచుకున్నాడన్న చిన్న అభియోగం మాత్రం మోపింది. ఎ.కె.56 రైఫిలును కొలిమిలో కరిగించి, విలువైన సాక్ష్యాన్ని ధ్వంసం చేశాడని ఒకడి మీద గట్టి అభియోగం మోపిన వారు ఆ ఒకడిని ఆ తప్పుడు పనికి నియోగించిన ఖల్‌నాయక్ కూడా అతడికంటే ఎక్కువ నేరస్థుడేనన్న చిన్న పాయింటును మరచిపోయారు. పత్తేదారులు, ప్రాసిక్యూటర్లు మొదలుకుని కిందా, పైనా కోర్టుల దాకా అన్ని అంచెల్లో ఉదారంగా ఉపకారాలు జరిగాయి కనకే సంజయ్ మీద కేసు నీరుకారి, యావజ్జీవ ఖైదు పడాల్సిన వాడు ఐదేళ్ల చిన్న శిక్షతో బయటపడ్డాడు. ఎలాగూ కేసులో పసలేదు కనక ఆ శిక్ష మాత్రం ఎందుకు? అతగాడు సినిమాల్లో గొప్ప వేషాలు వేశాడు కాబట్టి వ్యక్తిగతంగా అతడూ గొప్పవాడేనని గుర్తించి దాన్నీ ఎత్తెయ్యరాదా అని ఇప్పుడు స్టార్లు, లీడర్లు గొంతులు చించుకుంటున్నారు. స్టారుగారు ఇతరులను ఎగదోసి, తాను బింకంగా డైలాగులు కొడుతున్నా రేపో మాపో ప్రభువులకే ప్రేమ పొంగి, అతడి శిక్షను అడ్డగోలుగా ఎత్తేస్తే విస్తుపోనక్కర్లేదు. కర్మంచాలక అదే జరిగితే - ఈ దేశంలో సామాన్యులకు ఒక న్యాయం; పెద్దోళ్లకు ఒక న్యాయం... అని మనందరం నిస్సంకోచంగా గర్వపడవచ్చు.
 
 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech