Sujanaranjani
           
  కబుర్లు  
  వార్త - వ్యాఖ్య
         

డేరింగ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి

 
 

- రచన : భండారు శ్రీనివాస రావు

 
 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తరువాత త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారన్నది ఆయన్ని సమర్ధించేవారు కూడా చేస్తూ వస్తున్న ప్రధాన విమర్శ. కిరణ్ ఎక్కువగా అధికార గణం మీదనే ఆధారపడతారని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రివర్గ సహచరులను కూడా విశ్వాసం లోకి తీసుకోరని సొంత పార్టీ నాయకులే చెణుకులు విసురుతుంటారు. సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన లోగుట్టు మనిషి అనే పేరు. రేడియో, దూరదర్శన్ విలేకరిగా పనిచేసే రోజుల్లో మిగిలిన కాంగ్రెస్ నాయకులలాగానే ఆయన కూడా నాకు బాగా తెలిసిన మనిషే. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా ప్రెస్ గ్యాలరీ పాసులను నియంత్రిస్తూ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మూడు దశాబ్దాలకు పైగా నాకున్న అసెంబ్లీ ప్రెస్ పాసు రద్దయినా కూడా నేను ఆయన నిర్ణయాన్ని స్వాగతించాను. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు అంటే ఆషామాషీ కాదనీ, పరిమిత సంఖ్యలో పాసులను ఇవ్వడం వల్ల వాటికి వుండే గౌరవం, విలువలను మరింత పెంచినట్టు అవుతుందని భావించి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పదవీ విరమణ చేసిన మా బోటివారికి ఆ ప్రివిలేజ్ లేకుండాపోయిన మాట నిజమే. అయినా కూడా స్పీకర్ మంచి పనే చేసారని అభిప్రాయపడ్డ జర్నలిస్టులలో నేనొకడిని.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి నేను క్రియాశీలక పాత్రికేయ వృత్తి నుంచి తప్పుకోవడంవల్ల ముఖ్యమంత్రి వ్యవహార శైలిని గతంలో మాదిరిగా దగ్గరనుంచి పరిశీలించే అవకాశం నాకు లేకుండాపోయింది. కాకపొతే, ప్రైవేట్ టీవీ ఛానళ్ళ పుణ్యమా అని జర్నలిజం రంగంతో నా సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఆ రీత్యా ఎప్పటికప్పుడు ఆయన పరిపాలన గురించి బేరీజు వేసుకోవాల్సిన అవసరం, వేసుకోగలిగిన అవకాశం నాకు లభించాయి.

ఆయన ముఖ్యమంత్రి అయిన ఇన్నేళ్ళకు డేరింగ్ చీఫ్ మినిస్టర్ అని కితాబు ఇవ్వడానికి సరయిన ప్రాతిపదిక కరెంటు చార్జీల పెంపు రూపంలో నాకు కనబడింది.

నిజమే, పవర్ చార్జీలను ఆయన తప్ప ఇంత భారీ స్థాయిలో ఒకేసారి పెంచగల ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి వుంటుంది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సయితం ఇంతటి సాహసోపేత నిర్ణయానికి పూనుకుని వుండేవారు కాదేమో.

రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఆధారపడుతూ వచ్చిన అధికారులు కూడా ఒకే తడవ ఇంత భారీగా పెంచే ప్రతిపాదనలు సమర్పించలేదనీ, ఇప్పుడు కాకపొతే (వచ్చే ఏడాదికి ఎన్నికలు ముంగిట్లోకి వస్తాయి కాబట్టి) మరెప్పుడూ పెంచే అవకాశం ప్రభుత్వానికి దొరకదనీ (నౌ ఆర్ నెవ్వర్) వాదించి కిరణ్ కుమార్ రెడ్డే పూనుకుని వడ్డన పరిమాణాన్ని బాగా పెంచమని అధికారులకు సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి అనుకూల మీడియా కూడా కోడై కూసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆయన తరహా చూస్తుంటే వెనక్కు తగ్గే సూచనలు కానరావడం లేదు.

వాస్తవానికి కాంగ్రెస్ ఈ నాడు అధికారంలో వున్నదంటే అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఈ అంశం కూడా. నాడు తెలుగుదేశం పార్టీ సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడం అనేది ఆనాడు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీకి బాగా కలసి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత , పవర్ డిస్కం ల ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి ‘హరాకిరీ’ వంటి ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాన్ని తీసుకోగలిగారంటే నిజంగా ఆయన డేరింగ్ చీఫ్ మినిస్టరే. డేర్ డెవిల్ చీఫ్ మినిస్టరే.
గతంలో వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా ఆయన రాష్ట్ర ఖజానా సంక్షేమానికే పెద్ద పీట వేశారన్న పెద్ద అపవాదు మోశారు.

రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, 104, 108, ఫీజు రీయింబర్సుమెంటు వంటి వోట్ల గుడ్లు పెట్టే అనేక సంక్షేమ పధకాలను అధికారుల మాట విని అటకెక్కించే ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దిగజారిందని, తెలుగుదేశం వారు కూడా విమర్శించడానికి సంకోచించిన ఆరోగ్య శ్రీ పధకాన్ని అధికారగణం సలహా మేరకు ప్రభుత్వ నిధులను ఆచి తూచి ఖర్చు పెట్టే విధానానికే పచ్చ జెండా వూపి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేసారని సొంత పార్టీ నుంచే విమర్శలను ఎదుర్కోవడానికి చాలా తెగువ కావాలి. అది తనలో పుష్కలంగా వుందని కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించారు.

భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం పన్నులు కూడా కిరణ్ హయాం లోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కాకపొతే అవి కలిగినోళ్ల వ్యవహారాలు కనుక ప్రజల్లో అత్యధికులు పట్టించుకునే అవకాశం వుండదు.

కానీ, కరెంటు చార్జీల సంగతి అలా కాదు. ఈ మంట రాజుకోవడం చాలా తేలిక. ఈ అగ్నికి ఆజ్యం పోసేవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఆ రకమయిన విభీషణులకు కాంగ్రెస్ పార్టీలో కొదవ వుంటుందని అనుకోలేము.

ఇంకో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇలా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకోవడం ఆషామాషీ కాదు. అయినా ధైర్యం చేస్తున్నారంటే ఏమిటి అర్ధం?

రెండు రకాల రాజకీయ నాయకులే ఈ రకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఒకరు – రాజనీతిజ్ఞులు. వీళ్ళు రేపు గురించి భయపడరు. పదేళ్ళ తరువాత పరిస్థితులు గురించి ఆలోచిస్తారు. దేశం, దేశ భవితవ్యమే వీరికి ముఖ్యం. వోట్లు, సీట్లు, అధికారం కాదు.
ఆ విధంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం ఆహ్వానించదగిందే.

మరో రకం – వీరికి రేపు అనేదే లేదు. తనని నమ్ముకుని బాధ్యత అప్పగించిన పార్టీని ఎన్నికల రేవు దాటించి అధికార తీరం చేర్చాల్సిన అవసరం ఇలాటి వారికి వుండదు. తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగే పదవులు వీరివి. అటువంటప్పుడు ఇలా తెగించి నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డేమివుంటుంది?

మరి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రెండింటిలో ఏ రకం.
కాలమే జవాబు చెప్పాలి.

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech