Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 
 

రేడియో అన్నయ్య - శ్రీ న్యాపతి రాఘవ రావు

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.     

 

తెలుగులో ప్రప్రథమ బాలల పత్రిక " బాల " నెలకొల్పారు. 1940 లో వాసికెక్కిన " ఆంధ్ర బాలానంధ సంఘం " స్థాపించారు. పిల్లలకి తెలుగుదనంతో పాటు విజ్ఞానం, వినోదం రుచి చూపించారు. పిల్లల కోసం " జవాహర్ బాల్ భవన్ " స్థాపనకు సూత్రధారులయ్యారు. నేటి పిల్లలే రేపటి భారత పౌరులు అన్న నానుడిని అక్షర సత్యం చేస్తూ పిల్లల వ్యక్తిత్వ వికాశాలను పెంపొందించిన మహావ్యక్తి. ఇలా తెలుగు బాలల మానస్పటలం మీద చెరగని ముద్రవేసిన వారు రేడియో అన్నయ్యగా తెలుగు నాట జన హృదయాలలో చోటుచేసుకున్న వారు శ్రీ న్యాపతి రాఘవరావు గారు.

జననం, బాల్యం, ఉద్యోగం:

శ్రీ న్యాపతి రాఘవరావు గారు (రేడియో అన్నయ్య) ఏప్రిల్ 13, 1905 లో నాటి ఆంధ్ర రాష్ట్ర బరంపురం (బెహ్ రంపూర్) లో జన్మించారు. వీరి తండ్రి రామానుజ స్వామి బరంపురంలో పేరు పొందిన ప్లీడరు. రాఘవరావు గారికి ముగ్గురు సోధరులు, ముగ్గురు అప్పచెళెళ్ళు. వీరు అబ్బాయిలలో రెండోవారు, క్రమంలో నాలుగో వారు. కరుణ, సమానత్వం, ఏకత్వం, సత్య వాక్కు ఇవన్నీ తండ్రి ఛాయలో అలవడించుకున్నారు న్యాయపతి రాఘవరావు గారు. ఇవి వారి జీవితాంతం నిలచిపోయాయి.

విజయనగరం మహారాజా కాలేజి నుండి ఉత్తీర్ణులయ్యారు. ఇదే కళాశాలలో చదువుతున్న శ్రీమతి కామేశ్వరి గారితో వీరి వివాహం 1934 లో నూజివీడులో జరిగింది. కామేశ్వరి గారు విజయనగర మహారాజా కళాశాలలో చేరిన ప్రప్రధమ మహిళ. ఈ కళాశాల నుండి డిగ్రీ చదువు పూర్తి చేసి పట్టా అందుకున్న ప్రప్రధ మహిళ కూడాను!.

రేడియో అన్నయ్య గారు ఆటలలో కూడా మంచి అభిరుచి కలవారు. కేరెంస్, బ్యాడ్మంటన్ ఆడి చాలా బహుమతులు అందుకున్నారు. 1936 లో మద్రాసు హిందూ పత్రికలో ఉద్యోగం లభించడంతో అక్కడికి వెళ్ళారు. వీరి శతీమణి అక్కడే ప్రాధమిక పాఠశాలలో అధ్యాపకులుగా చేరారు. మద్రాసులో " ది హిండూ " పత్రికలో " సబ్ ఎడిటర్ " గా పనిచేసి తరువాత " బాల " మాస పత్రికను స్థాపించారు. బాల మాస పత్రిక ముద్రణ శ్రీ నాగి రెడ్డి, చక్రపాణి గారి బి ఎన్ కె ప్రెస్ (జార్జ్ టౌన్)లో జరుగుతూ ఉండేది. ఈ పత్రికలో అనేక కొత్త పాత్రలని పరిచయం చేశారు. వీటిలో రాము, సోము, సరళ, విరళ, లటుకు, చిటుకు పాత్రలు ఉన్నాయి. రత్నమాల, మల్లీశ్వరి, సుడిగుండాలు, నా ఇల్లు, స్వప్న సుందరి సినిమాలలో సరదాగా నటించారు.

ఆస్తి పాస్తుల మీద వీరికి గురి ఉండేది కాదు. కార్లు, బంగళాలు లేవు. సైకిల్ రిక్షాలలో తిరిగారు. నిరాడంబర జీవిగానే ఉన్నారు. ఎక్కువగా వీరు ఖాది లాల్చి, పంచ కట్టుతోనే తారసిల్లుతూ ఉండేవారు.

కృషి, సాధించిన ఫలితాలు:

పిల్లలలో విజ్ఞానం, వికాసం పెంపొందించడానికి అవిరళ కృషి చేశారు. ఇలా చెయ్యడంలో వారికి సాటి ఎవ్వరూ లేరు అని చెప్పవచ్చు. విశేషం ఏమిటీ అంటే వీరికి అన్ని పనులలో చేదోడు వాదోడుగా నిలచింది వీరి సతీమణి కామేశ్వరి గారు. పత్రిక నడపడంతో పాటు, " అక్కయ్యతో ఐదు నిమిషాలు " కాలం వ్రాస్తూ, రేడియోలో మహిళా మండలి సంక్షేమ సంబంధిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అన్ని సమయాలలో రాఘవరావు గారికి అండగా నిలిచారు.

ప్రప్రధ బాలల పత్రిక "బాల" ను ప్రకటించారు. ఇది దాదాపు ఇరవై ఏళ్ళ పాటు నడిపించారు. ఈ పత్రిక " చందమామ " పత్రికకు స్ఫూర్తిదాయకం అయ్యింది. ముళ్ళపూడి వెంకట రమణ గారి ప్రప్రధమ సంక్షిప్త కధ " అమ్మ మాట వినకపోతే " 1945లో రేడియో అన్నయ్య గారి బాల పత్రికలో ప్రచురించారు. ఇలా మేటి రచయితలను వెలుగులోకి తేవడానికి క్రియాశీలక పాత్ర పోషించారు.

1940 లో బాలానంద సంఘం ఏర్పాటు చేశారు. తరువాత రాష్ట్రమంతా పరివ్యాప్తి చేశారు.

మద్రాసు, హైద్రాబాదు రేడియో కేంద్రాలలో అనేక రేడియో కార్యక్రమాలు నిర్వహించారు.

ఆల్ ఇండియా రేడియో లో ప్రప్రధమంగా తెలుగులో బాలల కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి వినని తెలుగు వాడు బహుసా ఎవరూ ఉండరు. దాదాపు నలబై ఏళ్ళ పాటు నిండు తెలుగు దనం చాటుతూ అనేక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు తెలుగు కళల పట్ల అభిరుచిని పెంచడమే కాక వారిలో వ్యక్తిత్వాన్ని పెంపొందించారు. వారికి మంచి నడవడిక అబ్బేలా చేశారు; దిశామార్గం చూపించిన స్నేహశీలి. పిల్లలతోనే మొత్తం కార్యక్రం నిర్వహించారు కూడా.

వీరి ‘బాలానందం’ని స్ఫూర్తిగా తీసుకుని చలన చిత్ర దర్శకుడు శ్రీ కే ఎస్ ప్రకాశరావు గారు, తెలుగులో ప్రప్రధమ పిల్లల తెలుగు చలన చిత్రం చిత్రీకరించారు. ఇందులో అందరూ పిల్లలే వేషాలు వేశారు.

వీరి సోదరుడు, ప్రముఖ పాత్రికేయుడు శ్రీ న్యాపతి నారాయణ మూర్తితో కలసి " ఆంధ్రావని " పత్రిక నెలకొల్పి కొంత కాలం నడిపించారు.

ఆంధ్ర బాలానంద సంఘం:

రేడియో అన్నయ్య గారు ఆంధ్ర బాలానంద సంఘం వ్యవస్థాపకులు. అక్టోబర్ 23, 1956 లో శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ " ఆంధ్ర బాలానంద సంఘం " ఉధ్ఘాటన చేశారు.

బాలానందం అంటే పిల్లల కోసం సంతోషం అక్షరాల అదే ఆసయంతో మొదలు పెట్టారు. లక్ష్యాన్ని నూటికి నూరుపాళ్ళు సాధించారు. ఒక తరం తెలుగు బాలల వ్యక్తిత్వాలనే మార్చివేయగలిగారు. వీరు అందరికీ ఒక కొత్త స్పూర్తి, ఒరవడిని కల్పించారు, చక్కటి వ్యక్తిత్వాన్ని ఆపాదించారు, తెలుగు భాషని అందించారు. ఇలా జన హృదయాలని ఆకట్టుకుని ఏళ్ళ పాటు కార్యక్రమాలని నిర్వర్తించడం చాలా అసామాన్య మైన విషయం.

  • బడిగంట రచన (పిల్లల గేయాలు) కి బహుమతి లభించింది. వీరి "భుజ భుజ రేకుల పిల్ల " సూపర్ హిట్ పాట. ప్రతీ తెలుగు వాడు నెమరేసుకోక తప్పదు. ఇందులో మంచి సాహిత్యం, సందేశం రెండూ ఇమిడి ఉన్నాయి.

  • హైద్రాబాదు లో " జవహర్ బాల్ భవన్ " ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు.

  • కేంద్ర, రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంస్థల సభ్యుడిగా చాలా కాలం పనిచేశారు.

  • పిల్లల కోసం కధలు, నాటకాలు, నాటికలు, పాటలు, గేయాలు, ఏకాభినయం పాత్రలు ఇలా ఎన్నో రచనలు చేశారు.

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిల్లలకొసం జాతీయ సదస్సులు నిర్వహించిన ఘనత వీరిదే.

  • రేడియో అన్నయ్య గారు, వీరి శతీమణితో కలసి ప్రప్రధంగా పిల్లలకోసం " గ్రామో ఫోన్ " (హెచ్ ఎం వి) రికార్డులు రూపొందించారు.

  • 1975 లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో - పిల్లల విభాగం అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాలను నిర్వర్తించారు.

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్థాపించిన " బాలల అకాడమి " కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

  • వీరు ఆంధ్ర బాలనంద సంఘం లో నిర్వహిస్తున్న కార్యక్రమాల స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బుతో బాలానందం హాల్ నిర్మించారు. ఇది నేటికీ జంట నగరాలలో బాలల కార్యక్రమాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఈ ఘనత రేడియో అన్నయ్య గారిదీ, తరువాత ఈ సంస్థను నిర్వాహిస్తున్న నిర్వాహకులది అని చెప్పవచ్చు.

  • బూర్ల మూకుడు, పట్టుదల, పొట్టి బావ, చిట్టి మరదలు, గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఇత్యాది స్కిట్లని నిర్మించి జనాల మన్ననలు అందుకున్నారు.

  • ఆంధ్ర బాలానంద సంఘంలో సంప్రదాయానికి అద్దం పడుతూ బొమ్మల కొలువు ఏటా నిర్వహించారు. సంఘం సలహా సభ్యులుగా నరసరాజు గారు, శ్రీ కందా భీమశంకరం గారు (తరువాత సుప్రీం కోర్ట్ జడ్జి గా పనిచేశారు) ఉండేవారు. ఈ సంఘానికి రూపు ఇచ్చే క్రమంలో ఎడ్వకేట్ శ్రీ కస్తూరి శేషగిరి రావు (డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అల్లుడు) తోడ్పడ్డారు..

  • నేటికి ఈ సంఘాన్ని బాలానందం ట్రస్టు ద్వారా మంచిగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇది జే వి కామేశ్వరి గారు నిర్వహిస్తున్నారు. బాలగేయాలు, పిల్లల గేయాలు, అన్నయ్య పాటలు, ఆణి ముత్యాలు, రామూ సోమూ చిత్ర కధ బాలాంద సంఘం ద్వారా లభ్యమవుతున్నాయి.

నాటి ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఒక గ్రాంట్ మంజూరితో బాలానంద సంఘం రుణముక్తమయ్యింది. ఆట్టే మందికి తెలియని మాట ఒకటి చెప్పాలి మాజీ ముఖ్య మంత్రి ఎంతో కొంత మేలు చేయాలని వారికి హైద్రాబాదు లోని సంజీవ రెడ్డి నగర్ లో ఒక ఇల్లు కేటాయించారు. కాని అప్పట్లో రేడియో అన్నయ్య గారు అది స్వీకరించలేదు. ముఖ్య మంత్రి గారి ఆప్తుడు, ఆంతరంగికుడి ద్వారా ఈ విషయం తెలిసింది.

తెలుగు నాట రేడియో తాతయ్య యవరో మీకు తెలుసా? అది శ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు. తెలుగు లో ఆల్ ఇండియా రేడియో లో మొట్ట మొదటి వ్యాఖ్యానకర్తగా ఉండటం నా అదృష్టం అని పులకించి పోయారు.

రేడియో తాతయ్య శ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు ( ప్రముఖ సాహిత్యకారుడు శ్రీ మల్లంపల్లి శోమశేఖర శర్మ సోధరుడు), జేజి మావయ్య శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు, రేడియో మొద్దబ్బాయి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి అందరూ ఆల్ ఇండియా రేడియో, చెన్నై లో బాలల కార్యక్రమాల మీద పనిచేశారు. మల్లిక్ కూడా వీరితో ఉండేవారు. ఎస్ ఎన్ మూర్తి, ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు, జనమంచి రామకృష్ణ, ఎస్ వి సుబ్బారావు, శ్రీమతి ఎన్ వి రమణమ్మ సహకారం అందించారు. ఇలా సమిష్టిగా కలసి, కృషితో చక్కటి జన రంజక కార్యక్రమాలు నిర్వహించి తెలుగుదనం, విజ్ఞానం చాటుతూ బాలల శఖానికి నాందీ పలికారు.

 రేడియో అక్కయ్య గారు అక్టోబర్ 23, 1980 మరణించారు. రేడియో అన్నయ్య గారు ఫిబ్రవరి 24, 1984 లో తనువు చాలించారు. జీవితాంతం పిల్లలతో, హాయిగా గడిపేశారు. వేల మందికి విజ్ఞానం, వినోదం ప్రసాదించారు. చక్కని, నడవడిక ఆపాదించారు. ఒక్క మాటలో చెప్పలంటే తెలుగు సంస్కారానికి ఓ ఉజ్వల భవిషత్తు ఆపాదిస్తూ "నేటి బాలలే రేపటి భారత పౌరులు " అన్న ఆర్యోక్తిని అక్షర సత్యం చేసి భూమండలం నుండి ప్రస్తానించారు. వారి శత వశంతాలు జరుపుకుంది ఆంధ్ర బాలానంద సంఘం. వారి ఆదర్శాలు ఇంకా ముందుకి తీసుకు వెళుతుందని ఆశిద్దాం.

రాఘవరావు గారు సమాన్య జీవితం గడిపారు. ఆడంభరాలకు ఎప్పుడూ పోలేదు. కోరికలు లేవు; ముఖ్య మంత్రి హైద్రాబాదులో ఇల్లు కేటాయించినా తీసుకోలేదు. (వారికా దృష్టే లేదు). పిల్లలకి ఒక కొత్త ఒరవడిని ఇవ్వాలని తపన పడ్డారు. ఇచ్చారు. ఇలాంటి రేడియో అన్నయ్యలు ఇక ఉండరు. వారు చూపించిన మార్గదర్శంలో నడుస్తూ ఉంటే అదే పది వేలు; వారికి భావి తరాలు ఇచ్చుకో గల కానుక ఇదే!.
 


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech