Sujanaranjani
           
  సారస్వతం  
          శ్రీ రామ! నీ నామ మేమి రుచిర (అపరాధ పరిశోధక పద్య కావ్యము) 
 

                                                            రచన : ఆచార్య వి.ఎల్.యస్. భీమశంకరం

 

తే. గీ.   గుడిని చూడంగ నాలో నిగూఢమైన

చిన్ననాటి స్మృతు లెగసి చిందులేసె,

అంత చెలికానితో నాలయంబులోన

కాలు పెట్టినాడ నొడలు గగురుపొడవ.                                   89

నిగూఢ = దాగొన్న.

ఉ.        భక్తులు లేని దేవళము బావురుమం చగుపించె తారకా

త్యక్త నభమ్మువోలె; విననైతిని రింగున మ్రోగు గంటలున్,

ప్రాక్తన వేద మంత్రములు, బంధుర రీతిని వైదికార్చనల్

ప్రోక్తములై వినంబడవు, పూర్వ మహస్సు కనంగ లేదటన్.

తారకా త్యక్త నభము = నక్షత్రములు లేని ఆకాశము; ప్రాక్తన = పురాతన; ప్రోక్తము = చెప్పబడుట.

కం.      "పూజారైనన్ గలడా!

బేజారై పారి గుడిని వీడెనొ" అని నే

నాజి నిలిచి యడుగ హితుం

డా జాడను మసలు వాని నార్తిన్ జూపెన్.

ఆజి= క్షణ కాలము.

ఉ.        అంతట కాంచినా నచట - ఆలయ మండపమందు నుండి మా

చెంతకు వచ్చు నొక్కని, విశీర్ణ శరీరుని, ఊర్ధ్వపుండ్ర భా

మంతుని, శోణవర్ణ సుషమా పరిధాన సమావృతున్, జరో

పాంతుని, నిర్మలాస్యుని నవారిత తోషకు దేవళార్చకున్.

విశీర్ణము = వడలినది; ఊర్థ్వపుండ్ర భామంతుడు = నిలువు నామముతో ప్రకాశించువాడు;  శోషము= ఎఱుపు; సుషమ = అధిక కాంతి; పరిధానము = దోవతి; జరోపాంతుడు = ముసిలితనము సమీపించిన వాడు; అవారిత తోషకుడు = అడ్డగింపబడిన సంతోషము గలవాడు.

 

తే. గీ.   వచ్చు చున్నట్టి పూజారి వదనమందు

భక్తి తోడను రక్తియు వఱలుచుండె;

ఇంతదనుకను నీయూర నెక్కడైన

కాంచి యుండనట్టి ప్రశాంతి కానుపించె.

 

తే.గీ.    అంత, "శ్రీరామ! నీ నామ మెంత  రుచిర!

ఎంత రుచిర! ఏమి రుచిర! ఎంత రుచిర!"

అనుచు తనలోన తానిట్లు గొణుగు కొనుచు

అల్లనల్లన మము జేరె నర్చకుండు.

 

కం.      ఆ పూజారిని చూడగ

నే పరవశత దరికేగి ఎగసిన ప్రీతిన్

బాపని క్షేమం బడిగితి

పాప మతడు నన్ను గుర్తు పట్టగ లేమిన్.

 

ఉ.        దగ్గర జేరి మా కతడు దండమొనర్చుచు ఈయ నెవ్వరం

చగ్గలికంబు తోడ కనులార్పక చూడ -వానికిన్

దిగ్గన మ్రొక్కి స్నేహితుడు తెల్పెను నా వివరమ్ము లన్ని - ఆ

వగ్గు ముఖంబు స్నిగ్ధమయి పాతరలాడ నిగూఢ చక్షువుల్.

అగ్గలికము = ఆధిక్యము; వగ్గు= బక్క చిక్కిన వాడు; స్నిగ్ధము = స్నేహయుతము; పాతరలాడ = చిందులువేయు.

తే.గీ.    కొన్ని క్షణములు యోజించి కొంత యెరుక

స్మృతిపథంబున మెరయంగ చేరి నన్ను

కౌగలించుకొనుచు గొంతు మూగబోవ,

నిండుకొన్న నేత్రాల కన్నీరుగార,

 

తే.గీ.    కొంతసేపు పరిష్వంగ శాంతి నొంది,

కోల్కొని తిరిగి వీక్షించి కుశల మడిగి,

సతిని రమ్మని పిలిచి సంగతిని తెలిపి,

నన్ను జ్ఞప్తి చేయించె సంతసముతోడ.

 

కం.      "అతి ముఖ్యులైన వారీ

అతిథులు - ఊహించనటుల నరుదెంచిన స్నే

హితులగుటన్ పెట్టగదవె

అతివా రాముని ప్రసాద మానందముతో.                                

 

చం.     అనుచును భార్యనంపి, ప్రియమారగ మా దెస చూచి, మీరు దే

వుని గుడిలో నొకింత నిలువుండ"ని, మమ్ముల పంపె రామ ల

క్ష్మణ జనకాత్మజాత హనుమత్సహితమ్మగు దివ్య దేవళం

బునకు - మదీయ చిత్తము ప్రమోదము తోడను పొంగి పొర్లగన్.      100

 

తే.గీ.     కాని దేవళమును చూడగ నెదలోన

కలత రేగె, కాళ్ళు వణికె, గళము రుద్ధ

మయ్యె, నోట నాలుక తడి యారి పోయె,

కళ్ళు చెమరించి కన్నీళ్ళు వెళ్ళగ్రక్కె.

 

తే.గీ.    పాడుపడి యుండె నా గుడి గోడలెల్ల,

గోపురమ్మున ప్రతిమలు రూపు మాసె,

అతుకులూడి ధ్వజస్తంభ మచ్చటచట

తుప్పు పట్టె, మండపము పైకప్పు విచ్చె.

 

తే.గీ.    ఒక్క ప్రక్కను గరుడుని ఱెక్క విరిగె,

రాము డూరేగు పల్లకీ వ్రక్క వాఱె,

గర్భ గుడి తలుపుల కొయ్య గడియ లూడె,

ద్వారపాలకు డొక్కడు వార కొఱగె.                           

 

ఉ.        ధ్వాంతములోని గర్భగుడి తల్పులు మెల్లగ త్రోసికొంచు మే

మంతట లోనికేగితిమి - అచ్చరువయ్యెను నాకు చూడ

న్నంతటిలోన గర్భగుడి యంతయు చక్కగ తీర్చిదిద్ది న

ట్లెంతయు ముద్దులొల్కుచును హృద్యముగా కనుపట్టె నల్ దెసల్.

ధ్వాంతము = చీకటి

తే.గీ.    నలువుగా ముగ్గుతో నొప్పె నాపరాళ్ళు,

ప్రమిద లందున దీపాలు ప్రజ్వలించె,

విగ్రహంబుల గళముల పెద్ద పూల

దండ లొప్పుగా వ్రేలాడుచుండె నపుడు.

 

తే.గీ.    తేరి పరికించి నేనంత తెల్లబోతి,

అమ్మవారికి  గాని అయ్యలకు గాని,

బంటు హనుమంతునకు గాని వలయు రీతి

మంచి బట్టలు కఱవయ్యె నెంచి చూడ.

 

ఆ. వె. ముదుకు నూలుతోడ ముదురు రంగుల తోడ

నలిగి యుండిన వసనములె గాని

రామ లక్ష్మణులకు రాజసం బీనెడు

పట్టు బట్ట లేవి కట్ట లేదు.

 

ఆ. వె. పసుపు పచ్చ రంగు పట్టు బట్టయె గాని

సీత చీరకున్న చెంగు చినిగె,

హనుమ నడ్డి క్రింది నంతరీయము చూడ

అచ్చటచట చివికి మచ్చలయ్యె.

 

ఆ. వె. రామ లక్ష్మణులకు రతనాల మకుటాలు,

గళము లందు పసిడి పలకసరులు,

పొలుపుగా నడుమున విలువైన మొలనూళ్ళు

ఒక్కటైన లేదు లెక్కకైన. 

 

తే. గీ.   జానకీదేవి మెడలోన స్వర్ణ రచిత

హారములు గాని, సప్తకి, అంగదములు,

అంగుళులు గాని, ఇవి యవి అనగ నేల 

కానబడదయ్యె ఒక్క బంగారు నగయు.

 

ఆ.వె.   అంజనాకుమారు హస్తమందుండెడు

కంచు గదయు కానుపించదయ్యె,

ఉత్సవంబులందు ఊరేగుచుండెడు

మహిత విగ్రహాలు మాయమయ్యె.                              111

 

కం.      దయనీయమైన స్థితిలో

మయిదొడవులు దక్కిన ప్రతిమల కనలేమిన్,

రయమున గర్భగుడి వదలి

వయస్యుని గొని వెలికి వచ్చితి నార్తిన్.

 

కం.      ఈ రాయడికిన్ కారణ

మారయగా, నన్ను చూచి అలతను  మిత్రుం

డారాట మడప తెలిపె వి

చారమును తను దిగ మ్రింగి జరిగిన దెల్లన్.

రాయడి = ఉపద్రవము.

శా.       "జామిందారు దివంగతుం డగుట, దుశ్చారిత్రుడౌ ఆత్మజుం

డా మీదన్ గుడినున్న సొమ్ములు, హిరణ్యాలంకృతుల్, వస్తువుల్ సామూలంబుగ నుత్సవ ప్రతిమలున్, సామాగ్రితో సర్వమున్  మోమాటంబును లేక లాగికొనియెన్ పూజారి నీండ్రించుచున్.

ఈండ్రించు= పీడించు.

కం.      నీవట చూచియె యుందువు,

ఠీవిగ రాముని ఘన భృకుటిన్ గల నామం

బే విధియోగంబు వలన

నో వదలిరి పెరక జాల కుండిన బంటుల్.

భృకుటి=కను బొమ్మల మధ్య నుదుటి ప్రదేశము.

కం.      ఆ పై దేవుని పొలముల

నా పాపోపేతు డమ్మె -అయ్యవి యెల్లన్

మా పూర్వికుల వటంచును

వాపుచ్చక యుండ నూరివారలు భీతిన్.

పాపోపేతుడు= పాపముతోకూడిన వాడు; వాపుచ్చక= నోరు తెఱవక.

కం.      వ్యాజముతో వాడంతట

పూజారికి వేతనమ్ము పూర్తిగ నాపెన్,

పూజలకయ్యెడు ఖర్చు స

మాజపు బాధ్యత యగునని మానె  నొసంగన్.                       117

వ్యాజము= కపటము.

ఉ.        క్రూరుడు జీతమిచ్చుటను కుత్సిత బుద్ధిని మానివేయ  పూ

జారికి తిండి లేక తన జాయయు తానును పస్తులుండియున్,

వారలు మానరైరి భగవానుని పూజలు నిత్యసేవలున్

పౌరుల  నెన్నడైన నొక పైసను వేడరు పుణ్యదంపతుల్.

జాయ= భార్య.

 

తే.గీ.    కొంద రూరి ఖామందులు కొన్ని ఏండ్లు 

అర్చకస్వామి సంసార మాదుకొనిరి,

చెఱువు పూడుట చేతను కఱవు వలన

నడగి వారి శక్తి నశించు నంత వరకు.

 

తే.గీ.    భక్తు లెవరైన గుడి చూడ వచ్చునపుడు

చేతనైనంత సాయంబు సేయువారు;

అట్లు వచ్చిన సొమ్ముతో నర్చకునకు

మూడుపూటల కొకసారి కూడు కలిగె.

 

తే.గీ.    తులసి వనమున పూలమొక్కలను పెంచి,

కష్టపడి కూరగాయలు కాయజేసి,

గుడినిగల చెట్ల పండ్లను కోసి, వాటి

నమ్మి తినుచుండె భార్యతో నర్చకుండు.

 

కం.      ఆ విధి క్రుంగి కృశించుచు,

దేవునిపై భారముంచి దీనత వారల్,

జీవితమును సాగించిరి

భావి తలంచకను భక్తి పరిపాకముతో.                                    122

 

4. పూజారికి సిరి

*       *       *

4. పూజారికి సిరి

ఉ.        అంతయు మారె నీ నడుమ అర్చకు డించుక యంత తేర్కొనెన్,

కొంతకు కొంత భోగ మొనగూడెను, తిండికి కట్టుబట్టకున్

వంతలు దీరె, మంచిగ నివాసములో సమకూడె వస్తువుల్

సంతసమంది వారు సుఖశాంతులతో కనుపించి రెప్పుడున్.               123

 

తే.గీ.    వేళ మించగనీక దేవాలయాన

నిత్య దీపాలు వెలిగించి ప్రత్యహమ్ము

భక్తి సేవలు జరిపి విధ్యుక్తముగను

ఆరగింపుల చేయించు నర్చకుండు.

 

తే.గీ.    గుడికి వచ్చెడు భక్తులకు పులిహోర,

స్వాదు శర్కరాన్నములు ప్రసాదములుగ,

కోర్కెదీర సీతమ్మ కుంకుమము, పసుపు

పుష్కలంబుగ నిచ్చును పూజచేసి.

 

మ.      కలయో మాయయొ లేక తంత్ర బలమో కాకున్న నే రీతి నీ

కలికాలంబున నున్నపాటుగను భాగ్యంబబ్బు?  ఏవేని లం

కెల బిందెల్ కనిపించెనో, ఇతర మింకే కారణం బిందులో

కలదో! ఆ పెరుమాళ్ళకే యెఱుక ఈ కారుణ్య మెవ్వారిదో! 

 

కం.      కారణ మేమీ సిరికని

ఆరయ, మారాడకుండి ఆలును దానున్

నోరెత్తక స్మరియింతురు

శ్రీరాముని నామము తమ జిహ్వలపైనన్.

 

కం.      ఎక్కడిదో సొమ్మని మే

మెక్కువ తర్కించలేదు; ఎవరో దాతల్

 

 

మక్కువ నిడుచున్నారని

మ్రొక్కితి మా ఈవికాండ్ర మోదము తోడన్.

 

తే.గీ.    కొన్ని మాసాల కొకసారి గుట్టుగాను

ఆలయపు బాధ్యత నతివ కప్పగించి,

ఎవ్వరును గాని తన జాడ నెరుగ కుండ,

పట్టణమునకు పోవును వైష్ణవుండు.

 

తే.గీ.    రెండు దినముల లోనను దండిగాను

గుడికి నింటికి తగినట్లు కూడు గుడ్డ,

వలయు సంభారముల నన్ని కలయ బరచి

సంచి కెక్కించి తెచ్చును సంజ కడను."

 

తే.గీ.    అనుచు చెలికాడు చెప్పు చున్నపుడు వచ్చె

అగరవత్తులు కర్పూర మరటిపండ్లు,

పూలతో సజ్జ చేపట్టి పొందికగను,

అర్చనొనరింప మాపేర నర్చకుండు.

 

తే.గీ.    పూజలో నేను శీలనా స్ఫూర్తి తోడ,

రామచంద్రుని శ్యామల ప్రతిమ ముఖము

చూడ యత్నించియు మసక నీడ వలన

జాగరూకత పరికింప జాలనైతి.

 

తే.గీ.    ఐన శ్రద్ధ వీక్షించి కళ్ళార్పకుండ

మనసు నేకాగ్రతను నిల్పి మసలనీక

చూచినాడను హారతి శోభలోన

వెడలుపైనట్టి నామంబు భృకుటిపైన.    

 

తే.గీ.    దీని నే చిన్న నాటను మానసమున

నెంచి నెన్నియో మాఱ్లు పూజించినాడ

భక్తితో గాన, నా మనఃఫలక మందు

సతము చెరలాడు చెఱుగక శాశ్వతముగ.

 

తే.గీ.    కాని ఈనాడు నామంబు కాంతి దక్కి

నట్లు కనిపించె ననిపించె నాత్మలోన

నలుబదేండ్లాయె - నా జ్ఞప్తి నమ్మగలెనె

నేనె పొరబడినాడనో మానసమున.

 

తే.గీ.    అంతలో పూజ సంపూర్తి యగుట వలన,

నేను చెలికాడు పూజారి నెలవు జేరి

తీపి పొంగలి, పులిహోర తిని యొకింత,

పిచ్చపాటియు మాట్లాడి ఇచ్చ దీర,

 

తే.గీ.    వీడుకోల్ చెప్పి యవ్వారి వీడు వదలి,

చెట్ల దరి కూరుచుంటిమి సేద దీర

అంతలో వచ్చి మావెంట నర్చకుండు

మమ్ము కానక పండెను మంటపాన.

 

ఉ.        అల్లన పిల్ల గాలి తెర హాయిగ వీవగ నంబి తృప్తితో

చల్లగ విశ్రమించి సుఖ శాంతి హృదంతరమందు నిండి,

ల్లల్లన రామదాస కృత హార్దిక కీర్తన నార్తి తోడ మా

యుల్లములంత ఝల్లనగ నుద్యత పాడుచునుండె నాదృతిన్.

 

తే.గీ.    "రామ! శ్రీరామ! నీనామ మేమి రుచిర!

]           ఎంత రుచిర! ఏమి రుచిర! ఎంత రుచిర!"

అనుచు చర్విత చర్వణం బనగ పాడె,

ఒక్క పాదంబు మాత్రమే ఓర్మితోడ. 

 

తే.గీ.    పాట వినుచును మేమంత పరవశించి,

ఏగితిమి లేత చీకట్ల నింటి కడకు

దారిలో నిద్దరము గూడ నోరు మెదప

కుంటి మాలోచనలు మమ్ము నూపి వేయ.  

 

తే.గీ.    గృహములో నాటిరాత్రి నా హృదయమందు

చింత ముప్పిరిగొని ఇసుమంతయైన

నిదుర పట్టక, కనుమూయ కుదుర బోక

కలచి వైచెను నాటి సంఘటనలన్ని.   

 

తే.గీ.    అర్చకున కెట్లు సిరి యబ్బె నబ్బురముగ,

దాయలెవరైన ఇచ్చిన దాచనేల!

అప్పనంబుగ వచ్చిన నొప్పడేల!

పాతరేదైన దొరికెనో పర్వతాన!

 

ఆ.వె.   ధర్మకర్త కొడుకు దుర్మార్గుడై సొమ్ము

లన్ని దోచుకొనిన యపుడు మఱచె

నేమొ కొన్ని, వదలె నేమొ రత్నాల హా

రంబు కానక నొక ప్రతిమ మెడను. 

 

తే. గీ.   నిథులు దొరికి నట్లైనచో నేల లోన,

కనక మేదైన గుడియందు కానబడిన,

ధర్మ నిరతుడౌ పూజారి దాచ డెపుడు,

ఊరి పెద్దలతో చెప్పి తీరు నతడు.

 

తే. గీ.   కాక సొమ్ము నతడు కాంచి కాంక్షతోడ

వాడుకొనుచున్న, తెలివిగా వాని పట్టి

బైట పెట్టుట నావృత్తి, బాధ్యతయును,

మిత్రుడైనను పంకజమిత్రుడైన.

 

తే. గీ.   ప్రభువు లెంకలు భయమున రామమూర్తి

వదనమున నున్న వజ్రపు స్వర్ణ తిలక

మును వదలి పోయిరని మిత్రముండు పలికె,

నదియు నచ్చటనే  ఇప్పు  డమర గాదె.

 

తే. గీ.   కళుకు మనిపించె హారతి వెలుగు లోన,

కాంతి పాతమై కనుపించె కొంత మెఱుగు

తఱిగి నల్లనై - క్షణము మాత్రంబె కనుల

బడియె -  దీని పరీక్షింప వలయు నింక.                         

 

తే. గీ.   అంతియే గాక పూజారి వింత గాను

కోరి రామదాసుని పాట కొంత మార్చి

పాడినా డొకే చరణంబు వదలకుండ

దీనిలోనున్న భావంబు తెలియ వలయు.

 

తే. గీ.   అనుచు నాలోచనల తోడ నర్థరాత్రి

వఱకు మేల్కొని అట్టిట్టు దొఱలుకొనుచు,

కలత నిద్రకు జాఱితి క్రమము గాను,

తెల్లవాఱుఝామునకు నే నొళ్ళు మఱచి.

 

చం.     మఱుసటి నాల్గు రోజులును మానుగ సాగెను పెండ్లి  సందడిన్

సరసము లాటలో చెలుల సంగడితో చిననాటి జ్ఞప్తితో  -

మురిసితి నెంతయో కనగ పూర్వపు మిత్రుల వారి సంతతిన్,

చెఱిగిన సంగతుల్ తిరిగి  చేరువయై మది త్రచ్చి రేగగన్. 

 

ఉ.        ఆ మఱునాడు పెండ్లి - నిశయందు ముహూర్తము రెండు గంట్లపై

గోముగ కొండపైకి రవి గ్రుంకక పూర్వమె పెండ్లివారితో

మేమును  మిత్ర బాంధవ సమేతముగా చని చేరినారమున్,

రాముని ఆలయంబు దరి రంగుగ కట్టిన పెండ్లిపందిరిన్.

 

కం.      ఆలో నిర్మించితి రతి

వేలముగా నొక్క పెండ్లి వేదిక నచటన్,

చాలా ముచ్చటగా సుమ

మాలల, విద్యుత్ లతాంత మాలల తోడన్. 

 

కం.      ప్రద్యోతించుచు శిఖరము,

ఖద్యోతుని రీతి నిలను కానంబడె వి

ద్యుద్దీపాలంకృత స

ద్యుద్దీప్తి విరియ వివాహ ధామము నందున్.    

 

తే. గీ.   రామ, లక్ష్మణ, మారుతి, రామసతుల

విగ్రహములకు కృత్రిమ ప్రగ్రహ రుచు

లెనయగను కనకాంబరపు నన లల్లి

శోభగూర్చె నాచారి విస్ఫురితముగను.

 

ఉ.       వచ్చిన పెండ్లి పెద్దలును బందుగులున్, హితులున్, వధూవరుల్  

నచ్చిక నిచ్చతోడను వినమ్రత నేగుచు దేవళానకున్,

చెచ్చెర రామలక్ష్మణుల, శ్రీసతి సీతను మారుతాత్మజున్

మచ్చిక మ్రొక్కి పూజల సమాహృతిగా నొనరించి రంతటన్.

 

తే. గీ.   అర్చకుండిచ్చు శఠగోప మందుకొనుచు,

భోజనంబులు గానిచ్చి పోడిమిగను,

పెండ్లి మండపంబును చేరి పెందలకడ,

వేచిరట పెండ్లి కార్యంబు చూచు వేడ్క.

 

ఉ.        ప్రామినుకుల్ పురోహితులు బంధుర రీతి పఠింప గాయక

స్తోమము వాద్యబృందములతో  మధురంబుగ  పాడుచుండగా

మామిడి తోరణాల నడుమన్ గల వేదికలో వధూవరుల్

ప్రేముడి పెండ్లియైరి  కులపెద్దలు సేసలు జల్లుచుండగన్.

 

కం.      అంగజుడు కోర్కె రేపగ,

మంగళ సూచిగ వధువుకు మందాక్షముతో 

వంగిన గళమున బంగరు

మంగళ సూత్రంబు వరుడు మానుగ కట్టెన్. 

 

తే. గీ.   పదపడి పురోహితులు  వధూవరుల చేత

శేషహోమంబు చేయింప చేసిరపుడు

హోమధూమంబు చుఱ్ఱని ప్రాముకొనగ

అరుణమై వారి నేత్రంబు లార్ద్రమయ్యె. 

   

తే. గీ.   ముఖ్యమౌ తంతులన్నియు ముగియ రాత్రి

మూడుగంట లయ్యెను - నిద్ర ముంచి వేయ

పెండ్లి పెద్దలు కూర్చుండి కన్ను మూసి

                        తూగుచుండిరి - మధ్యలో  త్రుళ్ళిపడుచు.

 

కం.       చప్పుడు చేయక కొందఱు

నెప్పరు లట కండ్లు తెరచి నిదురించి రొగిన్;

అప్పట్టున మరి కొందఱు

దుప్పట్లను ముసుగు దన్ని దొర్లిరి నేలన్.                                                             161

                        *                      *                      *

5. పరిశోధన.

 

తే.గీ.     నేను మాత్రము మేల్కొని నిద్ర మాని

ఒక్క కునుకైన తీయక నోర్మితోడ

వేచి ఆలయంబున కాలు పెట్టినాడ,

సద్దు మణిగిన పిదప నిశ్శబ్దముగను.

 

తే.గీ.     కొన్ని ప్రమిదల దీపాలు కొండకెక్కి

గర్భగుడిలోన కొంత చీకటిగ నుండె,

నిర్జనంబయి నిశ్శబ్ద నిలయమగుచు

చీమ చిటుకన్న గూడను చెవుల జేరె.

 

తే.గీ.     మెల్లగా విగ్రహముల సమీపమునకు

అడుగులో నడుగిడుచు నే నరిగి చేరి,

వేది దరినున్న ముక్కాలు పీట తెచ్చి,

రాముని ప్రతిమ కడ దాని వ్రాల్చి నాడ.

 

తే.గీ.     తలను వంచి రామ హనుమంతులకు మ్రొక్కి,

చిన్న క్రొవ్వొత్తి వెలిగించి చేతబట్టి 

బల్లపైకెక్కి రాముని సరస నిలిచి

ముఖము శోధించితిని నికటముగ.

 

కం.      నిక్కముగ పెద్ద నామం

బొక్కటి రాముని ముఖమున నొద్దిక తోడన్

చక్కగ నున్నది,  కానీ

అక్కట! అది నల్ల వారినట్లుగ తోచెన్.

 

కం.      అబ్బురపడి నే నంతట

దబ్బున పైపంచె కొసను తడిపి తిలకమున్

 

నిబ్బరముగాను తుడిచితి

సుబ్బగ నిజ రూఫము - నతి సొంపుగ తోపన్.

 

ఆ.వె.   ఒడలు గగురు పొడిచె, తడబడె పదములు,

నల్లరంగు పోయి నామ మపుడు

చూచుచుండ మెరసె సుందరమౌ రీతి,

పసిడి రంగుతోడ ప్రజ్జ్వలించి.

 

తే.గీ.    స్వర్ణ తిలకము నందున వజ్ర శకల

ములు ధగ ధగ మెరయుచుండె పూర్వమట్లు

కాదు కాదది సత్యంబు గాదు - వాటి

మధ్య నైదారు తావుల మసక తోచె.

 

తే.గీ.    జాగరూకత నేనంత సాగి, మెడను

నిక్కజేసి పరీక్షింప నిజము తెలిసె  -

సరిగ మెరయని చోట్ల వజ్రములు లేవు,

బొక్కలే యుండె నెంతయో నక్కజముగ.

 

తే.గీ.    కన్నముల యందు నిసుమంత కాంతి పడిన

వాటిలో పూర్వమందున వజ్రములకు

డంబు మెరుపును కూర్చెడు డాకు రేకు

లిపుడు కొంత మెఱయు చుండె హీనముగను.

 

కం.      వెనుకటి దినముల తిలకం

బున గల వజ్రంబులన్ని పూర్తిగ మెఱసెన్;

గనుక నెవరో ఇపుడు ఱా

ళ్ళను పెకలించిరని యెడద లవలవ లాడెన్.

 

 

 

 

చం.     కదలకయుండ శిల్పమున గట్టిగ తాపిన నామమందునన్

పొదిగిన ఱాళ్ళు  క్రింద పడిపోవుట సాధ్యము కాదు కావునన్,

విదితము వీటి నెవ్వడొ  ప్రవీణుడు తచ్చెన తస్కరించె తా

కుదురుగ చెంత చేరి అతిగూఢముగా నను కొంచు నుండగన్. 

 

తే.గీ.    కొంత దూరాననుండి యొక్కింత సూక్ష్మ

రవము విన వచ్చి మంద్రమై మ్రాను పఱచె

"రామ! శ్రీరామ! నీనామ మేమి  రుచిర!"

అనుచు ప్రణవంబు బోలు వియత్స్వరంబు.  

 

తే.గీ.    అంతలోననె కోవెల చెంత జేరె

మసక చీకటి సందున మఱుగు పడుచు

పాట పాడుచునున్న అవ్యక్తమూర్తి

అర్చకుండాత డనుచు నే ననుకొనగను.

 

మ.      గణనీయంబుగ నిస్వనంబుదితమై కంపింప కంఠంబు వా

డనియెన్, "అంతయు చూచినాడవు గదా! అత్యంతమౌ నేర మీ

వనుభావంబుగ పట్టినాడవు గదా! ఆపైన నింకెట్లు  దీ

నిని రూపింపగ నిర్ణయించితివొ దానిన్ దెల్పుమా శోధకా!

 

తే.గీ.    అనుచు నాతండు నా వీను లదరిపోవ

పెద్దగా నవ్వుచు వచింప వినుచు, మున్ను

దోషు లిటులార్చి గట్టిగా దొమ్ములాట

లాడు నైజంబు  నెరిగిన వాడ నగుట.

 

తే.గీ.    అతడు చేసిన దౌష్ట్యంబు  నతని నోట

నొప్పు కొను నట్లు చేయించు నుద్యమమున,

వరుస నాతని ప్రేరేప వలయు ననుచు

పలికినాడను  దోషితో పలికినట్లు.

 

తే.గీ.    "అవును  - గర్భగుడిని చౌర్య మయ్యెననుచు

నే నెఱిగితి ఎరిగితిని నీవె స్వర్ణ

తిలకమందున గల వజ్రములను తస్క

రించితివని, ఒక వినూత్న రీతి లోన.

 

ఉ.        చెంతను చేరి రామునికి సేవలు చేసినటుల్ నటించి ఏ

వంతయు లేక వజ్రముల వ్యాజముతోడను దొంగిలించి నా

వంతియెగాక తస్కర రహస్యము నెవ్వరెఱుంగరంచు నీ

వెంతయు ధైర్యమూని అవహేలనతోడ చరించినాడవున్. 

 

కం.      ఏ నామములో ఱాళ్ళను

పూనికతో దొంగిలి సుఖముగ బ్రదికితివో,

మానితమౌ శ్రీరాముని

ఆ నామమె కించపరుప నపహాసముతో.

 

తే.గీ.    ''రామ! శ్రీరామ! నీ నామమేమి రుచిర!"

అనుచు నామమందున్న శ్లేష మొనరజేసి

ఒక్క వాక్యంబె పాడితి వక్కజముగ,

గర్వివై నీవు చర్విత చర్వణముగ. 

 

కం.      ఒక్కొక వజ్రమె దొంగిలి,

అక్కరతో దాని నమ్మి ఆకలిదీరన్

తక్కక నీ ఖర్చులకై

చక్కగ వెచ్చించినావు చాతురితోడన్.

 

తే.గీ.    ప్రతిమలకు మ్రొక్క వచ్చెడి భక్త తతులు

రాముని తిలకమందు వజ్రంబులన్ని

పూర్వ విధమున నున్నట్లు మోసబోవ

మసిని పూసినాడవు నీ వమానుషముగ.

 

తే.గీ.    మంచివాడ వీవని జనులెంచి పొగడ,

ఉన్న సొమ్ములో కొంత నీ వుక్కివమున

శర్కరాన్నమువంటి ప్రసాదములను

భక్తతతికి పెట్టితి వతిరిక్తముగను.

 

తే.గీ.    దొంగతనమున నీ భార్య దొందొ కాదొ!

కాని నేటితో మీ ఆట కట్టెసుమ్ము - 

ఇప్పుడే నిన్ను పోలీసు కప్పగింతు

ననుచు వాని నే బెదిరించు నంతలోన. 

 

తే.గీ.    వచ్చి నిలుచుండె నాతండు ద్వారమందు

రెండు చేతులు నిక్కించి రొండి నిలిపి,

వాకిలంతయు నిండిన భాతి దోప,

కలత రేగంగ వాని విగ్రహము గనగ.

 

చం.     తెల తెల వార జొచ్చె, రవి దీర్ఘమయూఖ నిపాత దీప్తి  దే

వళమును జొచ్చి అర్చకుని వక్త్రము పైబడి శోణకాంతితో

వెలుగగ జేసి వానికొక విస్తృత నూతన శోభ గూర్చెనన్ 

తలపు గదల్చ, డగ్గరి వితర్కణ చూచితి వాని తేజమున్.

*                      *                      *

 

6. ఆంజనేయ దర్శనం.

కం.   అత్యాశ్చర్యం బచ్చట

సత్యముగా నంబి లేడు - సాక్షాత్తుగ నే

ప్రత్యయముగ వినుతించెడు

నిత్యారాధ్యుడగు ఆంజనేయుండుండెన్.

 

ఉ.     కాంచితి నేత్రముల్ చెదర, క్రాలి శరీరము భ్రాంతి జెంద, నా కాంచన వర్ణ దేహుని, వికస్వర శోణముఖాంబుజున్, మహో గ్రాంచిత విగ్రహున్, శతసహస్ర ప్రభాకర కాంతిమంతు, నా సంచిత పూర్వజన్మ ఫలసంపద రూపము నొందెనో యనన్.

 

తే.గీ.           అంశుమంతుని లేనవ్వు లాననమున

సోకినందు వలన కాదు శోణకాంతి 

తోచె మున్ను చూచినపుడు - తోరమైన

అంజనాసుతు వక్త్రంబు హరువు గాని.

 

కం.   ప్రియముగ నేనట నిలబడి

క్షయించుచు నపుడు పిపీలకము వలె కుఱుచై, నయమున తల పైకెత్తితి

భయమును భక్తియు ముడివడి పరవశమొదవన్.

 

 

సీ.     లేత సూర్యుని బోలు పూతమౌ మోముపై 

కరుణారసంబు  పొంగారువాని,

నలినీదళములట్లు నలువుగా శోభిల్లు

లోచనద్వయితోడ తోచువాని,

దొండపండ్లను బోలు మండిత ప్రభతోడ

మెఱపు దీపించు వాతెఱలవాని,

జీవరాశిని తన భావంబుతో కట్టు

అంగజునకు లొంగనట్టి వాని,

తే.గీ.           రాక్షస ధ్వాంత విధ్వంస రశ్మివంతు,

ఘనుని ధీమంతు, బలవంతు,  కీర్తివంతు,

కీశ సామంతు, నతిలోక కాంతివంతు,

అవతరించిన హనుమంతు నతుల దాంతు.

తే. గీ.         చూచి తిలకించి పులకించి చోద్యమంది,

భక్తి ప్రభవించి చిగురించి పరిణమించి

పరగి ప్రసరించి ఫలయించి పరఢవించి,

నతిని తలవంచి మదినెంచి నాడ నపుడు. 

 

మ.   అనుకోనట్టి విధాన నా ప్రభువు వాతాత్మోద్భవుం డా విధిన్  కనిపించన్ మదిలోన సంతసిలి భాగ్యంబంచు స్పందించి  నా తనువుప్పొంగ మహోత్సుకంబునను సంధానించి సాష్టాంగముల్ వినయం బొప్పగ చేసి దండకముతో ప్రీతిన్ ప్రశంసించితిన్. 

దండకం:

శ్రీ ఆంజనేయా! శితాంభోజనేత్రా! మహా దివ్యగాత్రా! జగత్ప్రాణపుత్రా! మహొదగ్రవేత్తా! సురద్వేషసీమంతినీ స్తోమ మాంగల్య తంత్రీ లవిత్రా! పవిత్రా! గిరీశాంశజాతా! నమో రామ దూతా! సుమిత్రాసుత ప్రాణదాతా! నమో బ్రహ్మ తేజా! - వివస్వంతు నంశోద్భవుండైన సుగ్రీవుకున్ మంత్రివై నీవు శ్రీరామభూజానితో  సఖ్యమొప్పంగ చేయించి, అవ్వానికిన్ బద్ద శత్రుండు సాజన్ముడున్ శూరుడౌ వాలి దున్మించి, కిష్కింధలో కీశ సామ్రాజ్య  పట్టాభిషేకంబు చేయించి – శ్రీరామరాజేంద్రు భార్యామణిన్ జానకీదేవినిన్ రావణుండెంతయో మాయతో మున్ను గొంపోవ, నా సాథ్వి యన్వేషనార్థంబు నీవంత శ్రీరాము నాజ్ఞానుసారంబుగా దక్షిణాంభోధి లంఘించి, శ్రీలంక వే జేరి ఆ లంఖిణిన్ జంపి, ఆ దీవి గాలించి వైదేహినిన్ గాంచి, శ్రీరామ హస్తాంగుళిన్ గుర్తుగా నామె కందించి, ‘నీ భర్త వైళాన వేంచేసి దైతేయులన్ జంపి గొంపోవు ని’న్నంచు ధైర్యంబు కల్గించి –

లంకేశు గర్వంబు నిర్మూలమున్ జేయ సీతమ్మ బందీగ నున్నట్టి ఆరామమున్ గూల్చి ఆ తోట రక్షించు  యోధాళినిన్ మొత్త, కోపించి దైత్యేంద్రు డస్తోక సైన్యంబుతో పుత్రుడౌ అక్షునిన్ బంప, దర్పించి నీవంత దోర్వీర్య మొప్పంగ నీ ముష్టిబంధమ్ముతో వారి  తాటించి, ఘట్టించి, మర్దించి, ఘాటించి, సంహారముం జేయ, వాలంబు నల్గంగ బుస్సంచు వేలేచు నాగంబు బోలంగ రక్తారుణోదగ్ర నేత్రాననుండౌచు ఘూర్ణిల్లి ఆక్రోశముల్ పల్కి పౌలస్థ్యుడా ఇంద్రజిత్తైన ఆత్మోద్భవున్ మేఘనాదున్ జయోత్సాహు నీపైకి బంపంగ, నీవున్ దశగ్రీవు నీక్షింపగా గోరి స్వచ్ఛంద మార్గాన బ్రహ్మాస్త్ర బద్ధుండవై రావణాస్థానమున్ జేరి, ఆ రాక్షసాధీశుతోడన్, "కులస్త్రీని మోహించి బంధించుటల్ పాపమేగాక, నీ ప్రాణముల్ దీయు, నీ వంశనాశంబు తధ్యంబు శ్రీరామ బాణాగ్నిచే గాన భూపుత్రియైనట్టి  సీతామహాదేవినిన్  భర్తయౌ రామభూపాలు కర్పించి ఆ స్వామి పాదంబులన్ దాకి రక్షింపగా వేడి జీవింపుమా" యంచు ధర్మంబు బోధింప వాడల్గి నీ తోకకున్ నిప్పు ముట్టించ  నీవంతలో శృంఖలల్ ద్రెంచి, గర్జించి, జృంభించి నీ వాలమున్ ద్రిప్పి  జ్వాలల్ రగిల్పించి లంకాపురిన్ చైత్యముల్, హట్టముల్, కోష్టముల్,  గోపురంబుల్, నిశాంతంబులున్, కుడ్యముల్, కుట్టి మంబుల్,  చతుశ్శాలలున్, ఆయుధాగారముల్, పానశాలల్, గజాశ్వాది వాసంబులున్, రాజ హర్మ్యంబులున్, రాణి వాసంబులున్, వీతిహోత్రా హుతిన్ జేసి, సంతృప్తితో వేగ సంద్రంబునున్ దాటి, నీ మిత్రులున్, భృత్యులున్, సైనికుల్ మెచ్చ శ్రీరామునిన్ జేరి, సీతమ్మ క్షేమమ్ము  వాక్రుచ్చి, ఆ పైన నా దేవి చూడామణిన్ గుర్తుగా నిచ్చి, సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువౌ రామ  సర్వంసహా భర్తకున్ నీవు సంతోషభూతుండవై, ప్రీతిపాత్రుండవై, స్వామి దాసానుదాసుండవై మించు నిన్నెంచి  కీర్తింతునో అంజనాదేవి పుత్రా! మహాత్మా! మదీయాత్మ సంవాస!  ప్రీతిన్ నమస్కారముల్  చేసి అర్థించి, పూజించి, సేవించు భక్తాళినిన్ సాకి, వారిన్ చిరంజీవులన్ జేసి, ఆరోగ్య సౌభాగ్య భాగ్యంబులన్ గూర్చు సౌజన్య మూర్తీ! సదా బ్రహ్మచారీ! రామభక్తోపకారీ! దశగ్రీవ గర్వాపహారీ! ననున్ బోలు మూఢాత్ములన్ క్షాంతి వీక్షించి రక్షించి కాపాడుమయ్యా ప్రభూ! దేవ దేవా!

ప్రణామంబులయ్యా మహావీర! ఓ సుందరాకార! ఓ దుష్ట సం హార!  ఓ దివ్య రూపా1 నమస్తే! నమస్తే! నమస్తే! నమః!!

 

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech