|
"తెలుగంటే కాలక్షేపం,
తెలుగంటే పూర్వ వైభవం అనుకుంటున్న శిధిలపు రోజుల్లో,
ప్రభంజనంలా దూసుకొచ్చి మన బాషకి పదునైన
ఉత్సాహానిచ్చిన నవకెరటం భవానీ శంకర్ గారు ఈ
రోజు మనతో ముచ్చటించడానికి వచ్చారు, వారిని
అడిగి మనకి తెలిసీ, తెలియని బ్లాగోగులు
తెలుసుకుందాం- వెల్కమ్ టు ది షో సర్"
“మీ ఆహ్వానానికి కృతజ్ఞతలండి”
సర్! శ్రోతలు
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమంలో,
మొదటి ప్రశ్న - అసలు బ్లాగ్ అంటే ఏమిటి?
"బ్లాగంటే ఆశువుగా, స్వేచ్చగా ఇంటర్నెట్లో
పొందుపరిచే మన సొంత లాగ్. మనమీ మధ్యకాలంలో
వాడుతున్న ఫేస్ బుక్, యూ ట్యూబ్లానే
బ్లాగులు అందరికీ అందుబాటులో ఉండే
అంతర్జాల లోగిళ్ళు, సొంతిల్లు కాబట్టి ఏ
నిబంధనలు లేకుండా పూల మొక్కలు నాటుకోవచ్చు,
తోరణాలు కట్టుకోవచ్చు. విచ్చలవిడి
స్వేచ్చతో చిక్కల్లా బ్లాగ్ పిచ్చివాడి
చేతిలో రాయి కావచ్చు, సమర్ధుని చేతిలో
దివిటీ అవ్వొచ్చు"
ఈ ప్రక్రియ
మనవాళ్ళకి పరిచయం చెయ్యాలనే ఆలోచన మీకెలా
కలిగింది?
దీని వెనకో కధుంది, ఒకప్పుడు నేను స్వార్ధపరుడిని,
కెరీర్, సంపాదనంటూ సొంత బాగు తప్ప
సమాజానికి, బాషకి ఉపయోగపడట్లేదనే అసంతృప్తి
నిలువునా వేధించేది, అదే విషయాన్ని మా
గురువుగారికి చెప్పగానే అయన-
“శంకరం! కడుపు నిండిన బేరాలతో సమాజానికి
ఎప్పుడూ ప్రయోజనం జరగలేదు, కలతలోంచి
నిజమైన మార్పు పుడుతుంది, నీ అసంతృప్తి
ఇంధనంగా మార్చి, కలానికి (కీబోర్డ్)
పనిపెట్టి జనాలకి పనికొచ్చే రచనలు చెయ్యి.
నీలాంటి వారి అవిశ్రాంతి ఉన్నంతవరకు తెలుగుకి
వెలుగు తప్ప దిగులు లేదు!" అలా ఆయనిచ్చిన
స్పూర్తితో నా ఆలోచనలు నలుగురితో పంచుకోవడం మొదలుపెట్టాను.
బ్లాగులు
తెలుగు లిపిలో కూర్చడం చాలా కష్టమని
విన్నాము, నిజమేనంటారా?
డ్రైవింగ్ నేర్చుకునే ఆడవారి భయంలా,
తెలుగులో బ్లాగ్ కూర్చడం మొదట ప్రాణసంకటంగా
ఉండడం ఖాయం. రాను, రాను అలవాటు పడ్డాక
భోంచేసినంత తేలికయిపోతుంది, ఓ ఆలోచన, ఓ
విశ్లేషణ నలుగురితో పంచుకోవాలనే గట్టి ఆసక్తి
ఉంటే చాలు, ప్రతిలేఖించడం
(transliteration) గమ్మత్తుగా జరిగిపోతుంది.
బ్లాగులు
రాయడానికి కారణాలు ఏమిటంటారు?
మనం ఇదని చెప్పలేమండి, రక రకాల ప్రేరణలు...మచ్చుక్కి నా శిష్యులు
వెళ్ళబుచ్చిన వేదన, వారికి బ్లాగ్ముఖంగా నేనిచ్చిన
సలహాలు చదువుతాను -
ఆర్యా! నావి ఇంగ్లీష్ మీడియం చదువులు,
మరోలా భావించకండి....దానర్థం నాకు తెలుగు,
ఇంగ్లీష్ రెండునూ సరిగా రావని మాత్రమేనని గ్రహించగలరు.
బాష లేని ఈ ఇరవై ఏళ్ళ అర్తుడికి గుండె పిండేసే భావాలు,
ఆరని గాయాలు లంకె బిందెలు, వాటిని వెలికి
తీసి, విముక్తి పొందే మార్గం చెప్ప మనవి"-
ప్రణయ్, ప్రేమ్
నగర్ కాలనీ
రాయడం గాయాలని మాన్పే దివ్యఔషదం...మీకు
తోచిన బాషలో, మిమ్మల్ని తొలిచే ఆలోచనలకి రూపం
ఇవ్వండి, పస ఉంటే చదువుతారు, నస అనుకుంటే
వదిలేస్తారు….శైలిలో అందం, రాతలో ఛందస్సు
అంటూ ఆగిపోకండి...రాస్తూ ఉంటే అదే వస్తుంది,
రాకపోయినా పర్వాలేదు...మన వాళ్ళు
మంచివాళ్ళు సర్దుకుపోతారు
శంకర్ గారు! కొన్నేళ్లుగా అద్భుతమైన
కథలు, పులకరించే కవితలు, ఆలోచింపజేసే
వ్యాసాలు రాసి పేరున్న పత్రికలకి పంపాను,
కనీసం 'రిజక్ట్' అనే గుర్తింపు కూడా
లభించలేదు, నేనిలా బీడులా మోడుగా
మిగిలిపోవాలా ?"-
కధావ్యాస్,
కొత్తగూడెం
అద్బుతం అని మనం అనకోడదు పాఠకులు
అనాలి, నిరుత్సాహపడక మీ ప్రస్థానం మళ్ళీ
మొదలుపెట్టండి, సొంత బ్లాగ్‌లో చిన్న,
చిన్న అంశాలతో జనాలని ఆకట్టుకుంటూ
సాగిపోండి, వారి కామెంట్స్ మీకు కొండంత
అండ, ప్రోత్సహం..అల్ ది బెస్ట్!
"గురూజీ! పగలు ఆఫీసు చాకిరీ, రాత్రి
ఇంటి చాకిరీతో నా బతుకు చాకిరేవయిపోయింది,
తప్పించుకునే సులువైన మార్గం చెప్పండి"-
సాంకేత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేడ్చల్
ఇంట్లో కవిగా, కధకుడిగా నటిస్తూ కంప్యూటర్
ముందు కూర్చుని ఏవో రాస్తూ ఉండండి...భార్య,
పిల్లలు మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవించి
మీ మానాన మిమ్మల్ని వదులుతారు, మీరు
క్రికెట్, సినిమా రివ్యూలు, స్టాక్
మార్కెట్ దిశ, మన దశ ప్రశాంతంగా
చదువుకోవచ్చు
"నేను చాలా క్రియేటివ్ పర్సన్‌ని,
అందుకే రాత్రి కలలు వస్తూ ఉంటాయి"- లిల్లీ
(అసలు పేరు లలిత), వనస్థలిపురం
గూఢమైన మీ
ప్రశ్నకి నా సలహా- కలలు రాళ్లవంటివి,
వాటిని చెక్కి కవితలుగా మలిచేవాడే కవి...మీ
స్పందన నలుగురితో పంచుకోండి, మీ
క్రియేటివిటీకి వెలుగు చూపండి.. గాడ్
బ్లెస్ యు!!
“చాలా ఆసక్తికరమైన సలహాలు చెప్పారు, తరవాత
ప్రశ్న-మీ ప్రయాణంలో ఏమైనా విచిత్ర సంఘటనలు
చెప్పండి”
విచిత్రాలకేమండి జీవితమే చిత్ర,
విచిత్రం…మొన్నామధ్య బ్లాగర్ల సమావేశంలో
ఓ దూర్వాస బ్లాగర్ మాట్లాడితే చెవులు
రింగుమన్నాయి-
"ఏడేళ్ళ నుండి సాంప్రదాయానికి కట్టుబడి, విలువలకి
లోబడి రచనలు చేస్తున్నాను, బ్లాగ్ పెడితే
నలభై కామెంట్స్ తగ్గని దిగ్గజాన్ని..అలాంటి
నాకు ఈ పిల్ల బ్లాగర్ల ప్రవర్తన చాలా అమర్యాదగా
(గ్యాప్ ఇచ్చి) భరించరానిదిగా ఉంది....సూచనలకి,
సలహాలకి పెద్దలని సంప్రదించాలనే
ఇంగితజ్ఞానము లేకుండా అంతర్జాలాన్ని
అవాకులు, చెవాకులతో కలుషితం చేస్తున్నారు.
వీరికి అలగాజనం తోడై పదుల సంఖ్యలో ఆహా, ఓహో
అంటూ ప్రోత్సహకపు కామెంట్స్ గుప్పిస్తున్నారు,
ఇక విస్మరిస్తే బాషకి అధోగతి తప్పదు,
బ్లాగుకుల పెద్దగా వీరిని తక్షణమే
అంతర్జాలం నుండి బషిష్కరించాలని
ఆదేశిస్తున్నాను"
"మాష్టారు! ఇంటర్నెట్ అంటేనే వరద
గోదావరి, మనం ఎవ్వర్నీ ఆపలేము" అని నేనగానే
"మీరు వెనకేసుకురాకండి.. ఈ రోజు నుంచీ మీరు ఆ
కోవకే చెందుగాక!! " అని శపించారు..
చెప్పుకుంటూ పోతే మా పిచ్చి లోకంలో బోలెడు
చమత్కారాలు
"ప్రస్తుతం
తెలుగు బ్లాగుల పోకడ గురించి చెప్పండి"
"ముగ్గులైనా, బ్లాగులైనా మనవారి లక్షణాలు
పెద్దగా మారవండి"
"అలా అనేసారు,
ఆ ముగ్గులు ఏమిటంటారు"
"మనం ఆవు వ్యాసాలే మళ్ళీ, మళ్ళీ చదువుతాము,
ఆ వ్యాసంలో నవ్వించే ఆవుల ప్రస్తావనే
ఉండాలి"
“కొద్దిగా
వివరంగా చెప్పండి సర్”
వివరంగా చెప్తాను, తెలుగు బ్లాగులు
నాలుగు రకాలు- తిండి, తిట్లు, తీపి
గురుతులు, కొంగల గోల
తిండి- ఇవి చాలా రుచిగా ఉంటాయి, మరి
టాపిక్స్ అలాంటివి...ఉల్లి కూరి నిమ్మరసం పిండిన మిరపకాయ
బజ్జీలు, రోట్లో పచ్చడి, గుళ్ళో దద్దోజనం,
సుబ్బయ్య హోటల్.... వారి వర్ణనలకి హాస్యం
తోడయ్యి వినోదాన్ని పంచుతాయి, స్వతహాగా భోజన
ప్రియులం కాబట్టి ఎంత మంది ఎన్ని సార్లు రాసినా తిన్నంత
ఆనందం చెంది కామెంట్స్ గుప్పిస్తాము..ఇక తిన్నాకా
చేసే పని ఏమిటి? హాయిగా, కడుపునిండా తిట్టడం...
తిట్లు- వీటిలో ప్రధమ పీట మన అభిమాన
పంచ్ బాగ్ రాజకీయాలది, ఎన్ని సార్లు
చదివినా తాజాగా ఉండే తిట్టు టాపిక్ కాబట్టి అంతా
ఏకమై దూది ఏకినట్టు ఏకేస్తారు; ఇక రెండో
స్థానం పాత గుడ్ బాయ్స్, కొత్త బాడ్ బాయ్స్
మధ్య వైరం..మేము భరతుడిలా సింహం పిల్లలతో,
ప్రకృతి ఒడిలో ఆడుకుంటూ, గురువులను,
తల్లితండ్రులని మూడు పూటలా పూజిస్తూ పెరిగాం,
ఇప్పడి తరం ధూళిలో పుట్టి, బూజులో పెరిగి,
విలువల వలువలు తీస్తున్నారు అంటూ సాగుతాయి,
మూడో స్థానం టికెట్ డబ్బులు పోయాయని కసితో రాసిన
సినిమా రివ్యూలు...తిట్లకి అలుపు రాగానే
ఏం చేస్తాం..ఓ కునుకు తీస్తాం, ఆ కునుకులో
ఓ కల...
తీపి గురుతులు- వలలా వదలని జ్ఞాపకాలు
వెంటాడే నీడలు, ఆ నీడలు పరిచే చల్లటి కలలో...పక్క బెంచి
వనజిచ్చిన దోర జామకాయ, శీనుగాడితో కోతి
కొమ్మచ్చి, మా ఊరి తీర్ధం, అమ్మ
గోరుముద్దలతో పాఠకులని టైం మెషిన్లో గిర,
గిరా తిప్పేసరికి కామెంట్ మీటర్ ఆటో
మీటర్లా ఆగకుండా తిరుగుతుంది.
కొంగల గోల- కొంగలు వెచ్చటి చోటికి వలస
వెళతాయి, ఆ తర్వాత ఎందుకు ఎగిరిపోయాము, ఎలా
ఎగిరిపోయాము, నా మొదటి రోజు, రెండో
రోజులాంటి బ్లాగులు (వెళ్లిపోయారుగా..ఇంకెందుకు
గొడవ). ఇక ఖాళీ సమయం దొరికితే 'ఒక్కరోజులో ఇండియాని
జపాన్ చెయ్యడం ఎలా' లాంటి చిట్కాలు రాస్తే,
చదివిన వాడికి మండి 'సోదరా మొదట నీ ఇల్లు
వాక్యుం చేసుకో' అని కామెంట్ పెడతాడు. ఇక
భావుకులు సరే సరి…కొత్త దేశపు అందాలు,
ఒంటరి మంచుకొండలు, ఆహ్వానించే జలపాతాల
వర్ణనలు...ఈ గోల రాతల్లో వారు, వారు చూసే
ప్రపంచం కేంద్ర బిందువులు!
“మీ మాటల్లో ఏదో
అసంతృప్తి ధ్వనిస్తోంది?
'రెండు గంటల పాటు కష్టం మర్చిపోదాం', 'మనకెందుకు
గొడవ', 'ప్రతి ఒక్కడూ మాట్లాడేవాడే' అనే
నిర్లక్ష్య- వ్యంగ్యపు ధోరణి ప్రతికోణంలోను
కనిపిస్తుంది..తెలుగు బ్లాగులు పరిస్థితీ
అదే! స్వేచ్చకి ప్రజాస్వామ్యం ఎంత అవసరమో,
నిజమైన స్వేచ్చకి ప్రజల చైతన్యం అంతే
అవసరం..సోషల్ నెట్వర్కింగ్కున్న శక్తి
మొన్న ఈజిప్ట్, లిబియాలో చూసాము...ఆలోచనలు
పంచుకునే ఈ బలమైన అవకాశాలలో కుక్క బొమ్మలు,
బ్రహ్మానందం వీడియోలు, సినిమా చెత్త
పెట్టే దశ నుండి ఎదగాలి (ముఖ్యంగా నవతరం).
ఎలా
ఎదగాలంటారు?
మన కళ్ళ ముందు ఉదాహరణ ఒకటి-వార్తల
ఛానళ్ళు, దిన పత్రికలు వ్యాపారస్తుల మేలి
ముసుగులు, ఆ పరదాలలో చిక్కుకున్న నిజాలు
బయటపడాలంటే ప్రజలే నడుం కట్టాలి, సగటు
మనిషి భయపడే మానవ హక్కులు, సామాజిక
సమానతలాంటి అంశాల దాకా వెళ్లక్కరలేదు…ఆరోగ్యం,
విద్య, ఆహారం, పరిసరాల్లాంటి మౌలికాంశాలు
చర్చించుకోనే బాధ్యతైన సమాజం బ్లాగుల ద్వారా
సాధ్యం.
ఎన్నికలప్పుడే ప్రజల అభిప్రాయం అనుకుంటే
పొరపాటు, ప్రతి రోజూ, ప్రతీ పూట ప్రజల
స్పందన అవసరం. ఆ ప్రక్రియని చాట్ చేసినంత సులువుగా సాధ్యపరిచే మాధ్యమం
బ్లాగులు, వినోదం నేరం కాదు, ముందుకు
వెళ్ళాలంటే వినోదం సరిపోదు అనేది నా
పాయింట్.
“వీటికి
కంప్యూటర్, ఇంటర్నెట్ అవసరం కాబట్టి కేవలం
1% ప్రజలకి మాత్రమే అందుబాటులోఉందంటారా?
నా దృష్టిలో 1% చిన్న సంఖ్య కాదండి,
మిగతా జనాభాని ప్రభావితం చెయ్యగలిగిన
సంఖ్య. ముఖ్యంగా కొత్తతరం గాలి కబుర్లు,
ప్రేమ గోలలు, సినీ పరిశోధనలతో పాటు
నలుగురికి పనికొచ్చే విషయాలు చెప్పే
దృక్పదం అలవర్చుకోవాలి, దేశం దిశని
నిర్దేశించే వారి బాధ్యతని గుర్తించాలి.
ఈ రోజు
బ్లాగ్స్, సోషల్ నెట్వర్కింగ్ లాంటి
సాధనాల సామర్ద్యం చక్కగా చెప్పారు, థాంక్స్
ఫర్ యువర్ టైం సర్! ”
"ప్లెషర్ ఇస్ మైన్...గాడ్ బ్లెస్ యు!" |
|