ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు పాఠకులు రకరకాల
అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. కొంతమంది ఆ ఆత్మకథలు చాలావరకూ
స్వోత్కర్షలుగా వున్నాయనో, ఆయా వ్యక్తుల గురించి చేస్తున్న
వ్యాపార ప్రకటనలలాగా వున్నాయనో, ఏముంది మన జీవితంలాటిదే కదా అనో
అనటం సహజంగా చూస్తూవుంటాం. మరి కొంతమంది ఆత్మకథ వ్రాస్తున్న ఆ
వ్యక్తి జీవిత విశేషాలనీ వ్యక్తిత్వాన్నే కాక, ఆ రంగంలో ఆ
జీవితకాలంలో చరిత్ర ఎలా పరిణామం చెందిందో, మానవ సంబంధాలు ఎలా
మారాయో తెలుసుకుందామని చదువుతారు. అలాటి పుస్తకాలు వ్రాసే
పద్ధతిని బట్టి, ఆయా అభిప్రాయలు ఏర్పడతాయని నేను అనుకుంటున్నాను.
అందుకని ఇలాటి పుస్తకాలు వ్రాసేవారు ఎంతో నిజాయితీతో అవి
వ్రాయటం అవసరం. మహాత్మాగాంధీ
'My
Experiment with Truth',
నెహ్రూ Discovery of India’, కలాం వ్రాసిన
'Wings
of Fire',
శ్రీశ్రీ
'అనంతం',
తిరుమల రామచంద్ర
'హంపీ
నుంచి హరప్పాదాక',
గొల్లపూడి మారుతీరావ్
'అమ్మ
కడుపు చల్లగా',
గుమ్మడి వెంకటేశ్వరరావు
'తీపి
గురుతులు, చేదు జ్ఞాపకాల'
మొదలైనవి ఆత్మకథలుగా వారి వారి రంగాలలో చరిత్రకి కలకాలం అద్దం
పడుతుంటాయి. అలాగే డెస్మండ్ డాయింగ్ వ్రాసిన
'మదర్
థెరెసా',
బాస్వెల్ వ్రాసిన
'Life
of Johnson',
రామానుజం గురించి రాబర్ట్ కానిగెన్ వ్రాసిన
'The
man who knew infinity',
అబ్బూరి ఛాయాదేవి
'వరద
స్మృతి',
శ్రీవిరించి వ్రాసిన
'కుప్పిలి
వెంకటేశ్వరరావు',
యాతగిరి శ్రీరామనరసింహారావు – మేడిశెట్టి తిరుమలకుమార్ వ్రాసిన
'మన
వావిలాల'
లాటి జీవిత చరిత్రలు కూడా అలాటివే. పైన చెప్పిన పుస్తకాలన్నీ
మా స్వంత గ్రంధాలయంలో పెట్టుకుని, కావలసినప్పుడల్లా అవసరమైన
విషయాలను మళ్ళీ చదువు కుంటూ వుంటానంటే, నాలాటి మీలాటి వారి మీద,
వాటి ప్రభావమేమిటో తెలుస్తుంది.
కోహోతి కొమ్మచ్చి
కొమ్మకి రెమ్మొచ్చి
రెమ్మకి పువ్వొచ్చి
పువ్వుకి నవ్వొచ్చి
నవ్వుకి నువ్వొచ్చి
నీకు నేనొచ్చి
కోతి కొమ్మచ్చి..
ఇది ముళ్ళపూడి వెంకటరమణగారి ఆత్మకథ కాదు. బాపూ-రమణల ఘాడ
స్నేహం కథ. ఆరున్నర దశాబ్దాల పైన నడిచిన, నడుస్తున్న సాహిత్యం
కథ. సున్నితమైన హాస్యం కథ. సామాన్య మనుష్యుల జీవిత కథ. మనిషికీ
మనిషికీ మధ్య వుండే బంధుత్వం కథ. వాళ్ళ మధ్య ఉండవలసిన అనుబంధం
కథ. అన్నిటికీ మించి చక్కటి దృశ్య కావ్య సినిమాల సుమమాల.
మరి పైన అనుకున్న నేపధ్యంలో ఈ ఆత్మకథ వ్రాయటానికి రమణగారికి
వున్న అర్హతలు ఏమిటి?
మళ్లీ పైన అనుకున్నట్టే ఆయనకున్న పదమూడో, నూట అరవయ్యో
అర్హతలలో ముఖ్యమైనది నిజాయితీ.
శ్రీశ్రీగారిని మహాప్రస్థానంలాటి అంత గొప్ప కవితల్ని ఎలా
వ్రాశారండీ అని అడిగితే
'నేను
వ్రాయలేదు. ఆకలేసి కేకలేశాను'
అన్నారు.
ముళ్ళపూడి వెంకటరమణగారు ఆకలేసి జోకులేశారు. అదీ ఆయన నిజాయితీ!
'ప్రొద్దున్న
ఏడు నించీ సాయంత్రం ఏడు దాకా ప్రెస్లో నిలబడి కంపోజింగ్ చేసేది
అమ్మ. రెండు ఇడ్డెన్లు కొని, నాకు ఇడ్డెన్లు ఇచ్చి తను మిగిలిన
పచ్చడి తినేది!'
– అదే అమ్మకి, అమ్మ అనే పదానికి నిర్వచనం!
“అమ్మకి రాత్రిపూట నొప్పులుగా వున్నాయని కాళ్ళు పట్టేవాడిని'
– చదువుకునే కుర్రాడి మాతృ పూజ!
'మసాలదోసెలో
బంగాళదుంప కూర కోసం మావేళ్ళు పోట్లాడుకునేవి నువ్వంటే నువ్వని.
ఒరే! పూర్వజన్మ లో మనం క్లాసుమేట్సులుగా పుట్టివుంటామురా అంది
మా అమ్మ ఓసారి'
రమణగారు ఫోర్త్ ఫారంలో వున్నప్పుడే -
'ప్రొద్దున్నే
ఏడు నించి తొమ్మిది దాకా రెండిళ్ళు, సాయంత్రం ఆరు నించి ఎనిమిది
దాక రెండిళ్ళు ప్రైవేట్లు చెబుతూ వుండేవాడిని. నెలకి మా అమ్మకి
ఐదు రూపాయలు, నాకు రెండేసి వచ్చేవి... చూస్తుండగానే గొప్పవాళ్ళం
అయిపోతున్నాం అనుకునే వాళ్ళం!'
'నా
నిరుద్యోగ విజయ విహారం మూడేళ్ళు నడిచింది. కంకర రోడ్డు మీద జటకా
బండిలా జాయిజాయిగా, అపార్థాలు పూనేసిన ఆలుమగల కాపురంలా
హాయిహాయిగా, ఉప్పులేని మిరపకాయ బజ్జిలా తీయతీయగా, నేను
చేశానన్న గొప్ప పనుల్లా కోయ్ కోయ్ గా – గడబిడగా నడిచింది'
అందుకే ఆయన
'నవ్వొచ్చినప్పుడు
ఎవరైనా నవ్వుతారు. ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో!'
అనే డైలాగు అవలీలగా వ్రాయగలిగారు!
నేనలాటి హీరోని కాదు కనుకనేనేమో, రమణగారి ఆత్మకథ
చదువుతున్నప్పుడు - నవ్వుతున్నప్పుడూ నవ్వు ఆపుకోలేక కన్నీళ్లు
వచ్చాయి, కొన్ని సంఘటనలు మనసుని బాధ పెట్టినప్పుడూ కన్నీళ్లు
వచ్చాయి!
౦ ౦ ౦
ఇండియానించీ తమ్ముడు
'కోతి
కొమ్మచ్చి'
మొదటి భాగం కొని, నాకు బహుమతిగా పంపించాడు. అది ఎన్నోసార్లు
చదివి మా ఇంటి గ్రందాలయంలోనే కాక హృదయంలో కూడా ఎంతో భద్రంగా
దాచుకున్నాను. దాని తర్వాత (ఇం)కోతి కొమ్మచ్చి (రెండవ భాగం),
దాని తర్వాత ముక్కోతి కొమ్మచ్చి (మూడవ భాగం) నాకు బహుమతులుగా
పంపించాడు. నా జన్మలో ఇంతవరకూ ఎవ్వరూ విలువ కట్టలేని ఇంత గొప్ప
బహుమతులు నాకు ఇవ్వలేదు. ఒక్కొక్క పుస్తకం కనీసం మూడుసార్లు
చదివాను.
మహాత్మాగాంధీగారు మూడు కోతుల గురించే చెప్పారు. అందుకని రమణగారు
వ్రాయవలసిన తన ఆత్మకథ ఇంకా వున్నా, నాలుగో కోతి గురించి
వ్రాయకుండా, తన మిగతా కథ వెండితెరపై చూసుకోమని చెప్పి, అక్కడ
స్వర్గంలో ఏవో కొంపలు ముణిగిపోతున్నట్టుగా, మనల్ని ఈ
భూప్రపంచంలో ఇలా వదిలేసి, హడావిడిగా అలా వెళ్ళిపోయారు.
౦ ౦ ౦
ఈ
'కోతి
కొమ్మచ్చి'
మూడు పుస్తకాల్లోనూ మనకి కావలసిన సమాచారం ఎంతో వుంది.
సాహిత్యపరంగా – బాపూ రమణలు చిత్రకారుడు-రచయితలుగా ఎలా జీవితం
మొదలు పెట్టారో తెలుస్తుంది. అంచలంచలుగా ఎలా పైకి వచ్చారో
తెలుస్తుంది. బాల పిల్లల పత్రిక, బాలానందం రేడియో అన్నయ్యగారు
అక్కయ్యగారు ఎలా ఆదరించారో, ఆంధ్రపత్రిక శివలెంక శంభుప్రసాద్
గారు ఎంతగా ఉత్తేజ పరిచారో చెబుతారు. జ్యోతి మాసపత్రిక
వివిరాఘవయ్యగారు, బాపు రమణలతోపాటూ రావి కొండలరావు, ఆరుద్ర,
నండూరి రామమోహనరావు, విఎకే రంగారావులతో కలిసి, తెలుగు సాహిత్య
చరిత్రలో ఎంత విశిష్ట ప్రయోగం చేశారో సరదాగా చెబుతారు. ఇంకా
ఇంకా ఎన్నో విశేషాలు – హాస్యంతో రంగరించిన గుళికలు వున్నాయి.
విద్వాన్ విశ్వంగారి దగ్గరికి వెళ్ళి రమణగారు, తను వ్రాసిన
కథతో పాటు బాపు వేసిన బొమ్మకూడా ఇచ్చి, నా కథ మీ పత్రికలో
వేసుకుంటారా అనే అడిగారుట. అంతేకాదు నా కథ వేసుకుంటే, ఈ బొమ్మ
ఫ్రీ అన్నారుట. విశ్వంగారు నవ్వి,
'ఇడ్లీ
కన్నా పచ్చడే బాగుంది. వేస్తాను లెండి!'
అని ఆ రెండూ ప్రచురించారుట!
ఇంతకీ బుడుగు, అప్పుల అప్పారావు ఎవరో తెలుసా? కోతికొమ్మచ్చి
పుస్తకాలు చదవండి తెలుస్తుంది.
చలన చిత్రపరంగా చూస్తే – సినిమారంగం చిన్నప్పటినించీ ఎంతగా
బాపూ రమణలని ఆకర్షించిందో వివరంగా చెబుతారు. ఆ సినిమారంగంలో
ముందు దిగటానికి, తర్వాత నిలబడటానికి ఎన్ని అవస్థలు పడ్డారో,
నిలబడ్డాక ఇంకా నిలదొక్కుకోటానికి ఎన్ని అవస్థలు పడ్డారో
తెలుస్తుంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు అన్నట్టు, ఆ మునకే
ఎలా సుఖమనుకుని ఇంకా ఎంతో ఉత్సాహం తెచ్చుకుని ఇంత ఎత్తుకి ఎలా
ఎదిగారో చెబుతారు.
ప్రప్రధమంగా సాక్షి సినిమా తీద్దామనుకుని, పెట్టుబడి కోసం
వెడితే వాళ్ళు అడిగిన ప్రశ్న సినిమాలు తీయటంలో మీకున్న అనుభవం
ఏమిటి అని. దానికి బాపు రమణలు,
'సినిమాలు
తీయటంలో మాకు అనుభవం లేకపోవటమే మాకున్న అర్హత'
అన్నారుట. గమ్మత్తేమిటంటే పదహారణాల నిజాయితీ వున్న వీరి ఆ జవాబే
నిర్మాతలని, పంపిణీదారులని సంపాదించిపెట్టింది.
అందాలరాముడు అక్కినేని నాగేశ్వరరావు అన్ని విధాలా సహాయం
అందించటమే కాకుండా, చిన్న చిన్న నటులతో కూడా కలిసిపోయి, వారిని
కలుపుకుని ఎంత అండగా నిలిచారో చెబుతారు. అందాలరాముడు సినిమానే
కాక, ఎన్నో సినిమాలలో, నటీనటులు, సాంకేతిక నిపుణలు అందరూ కలిసి
ఎంతో సరదాగా పిక్నిక్కులకి వెళ్లినట్టు ఎంతగా ఆనందిస్తూ ఆ
సినిమాలు తీశారో చెబుతారు.
సినిమా విజయవంతంగా ఆడినప్పుడు ఆ సినిమా నిర్మాణంలో
పాలుపంచుకున్న వారందరికీ పాలాభిషేకం చేసి అందర్నీ పొగిడేయటం;
సినిమాలు బాగా ఆడకపోతే, ఆ తప్పంతా మాదేనోచ్ అని ముఖమాటం లేకుండా
ఒప్పుకోవటం బాపు రమణలకే చెల్లింది!
తాము పాలు పోసి పెద్ద నటుడుగా తయారు చేసిన ఒక ‘పెద్ద’ హీరో,
రమణగారిని ఇరికించి, ఉంటున్న ఇంట్లోనించి బయటికి లాగి, ఎలా
రోడ్డెక్కించారో చెప్పకుండా చెబుతారు. (అవును.. ఆయన గురించే
వ్రాశారు) ఇక్కడ జరిగిన మంచి విషయం ఏమిటంటే - సృష్టిలోనే
తీయనైన మా స్నేహం మామూలు గొప్పది కాదు, మహా గొప్పది - అని
బాపుగారు ఇంకోసారి నిరూపించటం.
మహాప్రభో! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడు పుస్తకాల్లోనూ ఎన్నో
మరెన్నో గొప్ప విషయాలు వున్నాయి. నేనవన్నీ వ్రాయలేను. వ్రాయటం
నా ఉద్దేశ్యమూ కాదు.
జగమెరిగిన రమణగారిని నేను మీకు పరిచయం చేయబోవటమే ఒక పెద్ద
జోకు. అలా చేస్తే కోతి కొమ్మచ్చిలో కోతిలా కుప్పిగంతులు
వేస్తున్నట్టు వుంటుంది. అందుకని, మీరే ఈ మూడు పుస్తకాలు
కొనుక్కుని చదవండి. కాకపొతే మిమ్మల్ని ఈ పుస్తకాల విషయంలో కొంచెం
హెచ్చరించాలి.
రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేసే ముందు, పెళ్లి
ముహూర్తానికి తయారవుతున్నప్పుడు, ఇవన్నీ ఎందుకు - ఏదైనా
ముఖ్యమైన పని పెట్టుకున్నప్పుడు, ఈ పుస్తకాలు చదవకండి. ఒకసారి
మొదలుపెడితే ఆరు నూరయినా ఆపటం కష్టం. మీ ప్రయాణాలు ఆగిపోతాయి.
దారిలో చదువుకుందాములే అని మీతోపాటు పుస్తకాలు తీసుకు వెడితే,
తెలుగు నిజంగా చదవటం వచ్చిన ఏ తెలుగువాడో వాటిని కొట్టేసే
అవకాశం వుంది. మీ పెళ్లి ముహూర్తం టైముకి మీరు వెళ్ళలేరు. ఏ
కత్తికో భాష్యం కట్టి రాజుగారి (అవును.. మళ్ళీ ఆయనే) పెళ్లిలా
'ఇన్-యాబ్సెన్షియా'
పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
ఈ వ్యాసం ముగించే ముందు, రమణగారిని మరోసారి స్మరించుకుంటూ,
ముక్కోతికోమ్మచ్చిలో ఆయన అక్కడక్కడా వ్రాసిన కొన్ని
'వంకర
గీతలు',
'అడ్డమైన
రాతలు'
వ్రాస్తాను. ఎందుకంటే అవి నాకు నచ్చాయి కనుక!
సావిత్రి బహు పతివ్రత
ద్రౌపది బహుపతి వ్రత
కొందరు సంపాదకులు
కొందరు సంపాతకులు
రాత్రీ పగలూ బూతుల
పత్రే
'సారాం'శమైన
ఫిల్మీధాత్రిన్
‘బూత్రేయ’ బిరుదునందిన
ఆత్రేయుడి పాట నేడు
'ఆవ్'పాలాయెన్!
ఒరే అబ్బీ! మీ నాన్న తొంభై ఏళ్ల భోజనాన్ని
నలభై ఏళ్లలో నమిలేశాడు
నేను ముఫై ఏళ్ల తిండిని
తొంభై ఆరేళ్ళు వాడుకున్నాను
అందువల్ల – ఉన్నాను
నాకు పున:పునర్జన్మల మీద నమ్మకం వుంది.
అందువల్ల నా యావదాస్తినీ
నా పేరిటే వీలునామా వ్రాయడమైనది - విల్ రాజు
౦ ౦ ౦
|