మనిషి మనసులో ఎగసిపడే భావతరంగాలకు
లెక్కేముంది, అంతేముంది! ఒక్క
శృంగారరసాన్నే కావ్యాలలో
యెన్నెన్ని రీతుల నిర్వహించ
వచ్చునో కిందటి నెలలో చవిచూసాం కదా.
అసలు మౌలికంగా శృంగార స్వరూపంలోనే
మన తెలుగు కావ్యాలలో ఎన్నెన్ని
అంతరాలున్నాయో యిప్పుడు
తెలుసుకుందాం.
శృంగారంలో ఒక సరికొత్త తరంగం అని
చెప్పదగ్గది తెలుగులో మొట్టమొదటగా
మనకి భాగవతంలో కనిపిస్తుంది.
తెలుగు కావ్యాలలో శృంగారం, భక్తి,
తప్ప వేరే యేముందని కొందరు పెదవి
విరుస్తూ ఉంటారు. అందులో
సత్యాసత్యాలని పక్కనపెడితే, ఈ
రెండు భావాలూ మన కావ్యాలలో
అత్యధికంగా కనిపిస్తాయనడంలో
ఏమాత్రం సందేహం లేదు. భక్తి
శృంగారాలు రెండూ సమపాళ్ళలో ఉండడమే
కాకుండా, ఆ రెండూ కలగలిసిపోయి
కనిపించే కావ్యం పోతన భాగవతం! ఆ
సన్నివేశం, గోపకాంతలతో గోపాలుని
రాసలీలా విలాసం. ఆ కాంతలతో
కృష్ణుడు జరిపిన రతికేళిని
వర్ణించడంలో పోతనగారు పెద్దగా
మొహమాటమేమీ పడలేదు!
కరుణాలోకములన్,
బటాంచలకచాకర్షంబులన్, మేఖలా
కరబాహుస్తనమర్శనంబుల,
నఖాంకవ్యాప్తులన్, నర్మ వా
క్పరిరంభంబుల,
మంజులాధరసుధాపానంబులన్, గాంతలం
గరగించెన్ రతికేళి గృష్ణుడు గృపం
గందర్పు బాలార్చుచున్
ఆ క్రీడలో కృష్ణుడు మన్మథుణ్ణి
సైతం మించిపోయాడట. ఎంతయినా ఆ
మన్మథునికి తండ్రి కదా మరి! ఆ
నందబాలుడు దూరమైనప్పుడు గోపికలు
పడ్డ విరహబాధ కూడా శృంగారనాయికల
విరహతాపం లాగానే ఉంటుంది. అంటే,
వారు కూడా మన్మథుని చేత
బాధింపబడతారు.
క్రమ్మి
నిశాచరుల్ సురనికాయములన్ వడిదాకి
వీక వా
లమ్ముల తెట్టెముల్ వఱవ నడ్డము
వచ్చి జయింతు వండ్రు, నిన్
నమ్మిన ముగ్దలన్ రహితనాథల నక్కట!
నేడు రెండు మూ
డమ్ములయేటుకా డెగవ నడ్డము రా దగదే
కృపానిధీ!
"ఏమయ్యా కన్నయా, నువ్వు కృపానిధివే!
దేవతలపైకి రాక్షసులు దండెత్తి
వచ్చి శరపరంపరతో ముంచెత్తినప్పుడు,
వారికి అండగా నిలిచి రాక్షసులను
జయిస్తావంటారే. మరి యిప్పుడేమిటి,
మాలాంటి ముగ్ధలను, అనాథలను, ఎవో
రెండుమూడు బాణాలు మాత్రం ఉన్న
విలుకాడొకడు (మన్మథుడికి
అయిదుబాణాలు కదా) బాధిస్తూ ఉంటే
వచ్చి కాపాడవా!" అని కృష్ణుడిని
నిలదీస్తారు, వేడుకుంటారు.
ఈ విధంగా, భాగవతంలో గోపకాంతల
ప్రణయం అటు సంభోగంలోనూ, యిటు
వియోగంలోనూ కూడా అచ్చంగా మనకి
తెలిసిన స్త్రీపురుష శృంగారమే.
అయితే ఆ శృంగారమంతా చివరికి
భక్తిలోకి పర్యవసించడం ఇందులోని
ప్రత్యేకత. ఎందుకంటే, గోపకాంతల
దృష్టిలో అది శృంగారమే అయినా,
పోతనగారి దృష్టిలో అది పరమభక్తి.
ఆ దృష్టిని తన కవిత్వంలో
అడుగడుగునా ఆయన మనకి
గుర్తుచేస్తారు. దీనికి ఒక గొప్ప
ఉదాహరణ యీ పద్యం:
ఒక్క లతాంగి
మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కి
తీగలన్
జిక్కగబట్టి హృద్గతము జేసి వెలిం
జనకుండ నేత్రముల్
గ్రక్కున మూసి మేన పులకంబులు
గ్రమ్మగ కౌగలించుచున్
చొక్కములైన లోచవుల జొక్కుచునుండెను
...
ఒక గోపిక, మేరిసిపోయే మాధవుని
రూపాన్ని తన చూపుల తీగలతో పట్టి,
తన హృదయంలో కట్టేసి, మళ్ళీ పైకి
పోకుండా వెంటనే తన కనులని మూసేసి,
తనువంతా పులకలు క్రమ్మగా, ఆ
రూపాన్ని హృదయంలోనే కౌగలించి,
స్వచ్ఛమైన లోలోపలి ఆనందాతిశయంతో
పరవశిస్తూ ఉందట. ఎంత రమ్యమైన
దృశ్యమో, ఎంత రమణీయ వర్ణనో చూడండి!
ఒక ప్రేయసి, కనులు మూసి తన
ప్రియుని రూపాన్నే తలపోస్తూ ఆ
తలపులతో పులకరిస్తూ పరవశించిపోయే
శృంగార సన్నివేశం. పద్యం ఇంతవరకే
ఉన్నట్టయితే, అది అచ్చంగా
శృంగారరస పోషణే అవుతుంది. కాని
అసలు మెలిక ఆఖరి పదంలో ఉంది! ఆ పదం
"యోగి కైవడిన్". మళ్ళీ మరోసారి యీ
పద్యాన్ని పూర్తిగా చదవండి.
ఒక్క లతాంగి
మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కి
తీగలన్
జిక్కగబట్టి హృద్గతము జేసి వెలిం
జనకుండ నేత్రముల్
గ్రక్కున మూసి మేన పులకంబులు
గ్రమ్మగ కౌగలించుచున్
చొక్కములైన లోచవుల జొక్కుచునుండెను
యోగి కైవడిన్
ఇప్పుడు మనకి కనిపించే చిత్రం
పూర్తిగా మారిపోలేదూ! ఒక పరమయోగి,
భక్తుడు, భగవంతుడినే స్మరిస్తూ,
అతని రూపాన్నే ధ్యానిస్తూ, ఆ
ధ్యానంలో పరమానందం పొందే సన్నివేశం.
అలా ఉందట ఆ లతాంగి స్థితి! మొదట
మనకి శృంగారంగా అనిపించినదంతా
చివరకు భక్తియోగంలో కలిసిపోయింది.
గోపికలతో శ్రీకృష్ణుని
లీలావిలాసాలు వర్ణించే
సన్నివేశమంతటా యిలాగే, ఎంతటి
శృంగారవర్ణన ఉన్నా, చివరకు
సహృదయుడైన పాఠకునిలో కలిగించేది
శృంగారరసానుభూతి కాదు, భక్తి
మాత్రమే. అది పోతనగారి కూర్పులోని
నేర్పు.
ఆ తర్వాత కాలంలో, శ్రీనాథుడికే
తప్ప పోతనగారికి పెద్దగా
వారసులెవరూ కనిపించరు! పోతన
వారసుడు కాదు కాని, దివ్య దంపతుల
శృంగారాన్ని భక్తితో వర్ణించిన
వారిలో అన్నమయ్య చాలా ప్రముఖంగా
కనిపిస్తాడు. అలమేలుమంగా
వేంకటేశ్వరుల శృంగారాన్ని తన
సంకీర్తనలలో అతను పుష్కలంగా
వర్ణించడం అందరికీ తెలిసిన విషయమే.
సంకీర్తనలే కాకుండా, "వేంకటేశ్వరా!"
అనే మకుటంతో ఒక శతకం కూడా రచించాడు
అన్నమయ్య. ఈ శతకంలో కూడా వారిద్దరి
శృంగార విలాసాలు రకరకాలుగా
చిత్రించబడ్డాయి. అందులో ఒక
సరసమనోజ్ఞమైన సన్నివేశాన్ని
వర్ణించే పద్యం ఒకటి రుచి చూద్దాం:
"అందవు,
కోసి యిమ్ము విరు" లంచును జే
రలమేలుమంగ ని
న్నుందగ గోర జెక్కులటు నొక్కిన
నాకును నందవంచు న
య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచు
పువ్వులు కోయజేయ ని
ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను
వేంకటేశ్వరా !
స్వామివారు తన సతితో కూడి
ఉద్యానవనంలో విహరిస్తున్నారు
కాబోలు. అక్కడ కొన్ని పూల
చెట్లున్నాయి. ఆ పూలు కోసుకోవాలని
అమ్మవారికి కోరిక పుట్టింది. కాని
అవి ఎత్తుగా ఉన్నాయి. "ఆ పూలు
నాకందవు, మీరు కోసిపెట్టం"డని
గోముగా అడిగిందావిడ. అయ్యవారేమయినా
తక్కువ తిన్నారా! నాక్కూడా అందవని
చెప్పి, నువ్వే కోసుకోమని ఆమెని
ప్రేమతో యెత్తుకున్నారు. ఆమె పూలు
కోస్తూ ఉంటే, ఆ పూలనుండి జాలువారే
మరందం, మేని చెమరింపుతో కలిసి
అయ్యవారి మేనిపై గందపుపూత
అద్దినట్టుగా అలదుకున్నదట! ఆహా, ఆ
పరమభాగవతునికి ఎంత మనోహరదృశ్యం
కనిపించింది! ఇది దంపతులు,
ముఖ్యంగా కొత్తదంపతులు తప్పక కలిసి
చదవాల్సిన శతకం. :-)
ఇక, శ్రీనాథుడితో మొదలైన
శృంగారప్రబంధ ధోరణి పిల్లలమఱ్ఱి
పినవీరభద్రుడి శృంగారశాకుంతలంతో
వికసించి, అనంతర కాలంలో బాగా
విస్తరించింది. రాయల కాలంలోనూ, ఆ
తర్వాతా వచ్చిన అనేక ప్రబంధాలు
కేవల శృంగారరస ప్రధానమైన కావ్యాలే.
క్షేత్ర మాహాత్మ్యాలు, భక్తి
కావ్యాలు అయిన కాళహస్తిమాహాత్మ్యమూ,
ఆముక్తమాల్యద వంటి కావ్యాలలో కూడా
శృంగార రసం బాగానే పోషింపబడింది.
పదిహేడు పద్ధెనిమిదవ శతాబ్దాలలో
యిది బాగా శ్రుతిమించి
పోయిందనికూడా చెప్పవచ్చు. అయితే,
శృంగారం విషయ పరంగా, చిత్రమైన
సన్నివేశాలతో కొత్తదనాన్ని
చూపించిన ప్రబంధాలు ప్రసిద్ధంగా
రెండున్నాయి. అందులో మొదటిది -
అల్లసాని పెద్దన రచించిన "స్వారోచిష
మనుసంభవం", అదే "మనుచరిత్ర".
మనుచరిత్ర కావ్యంలో ముప్పాతిక
మువ్వీసం శృంగారమే. అందులో సగానికి
సగం వరూధినీ ప్రవరుల వృత్తాంతమే.
ఇంత చేసీ, ఇందులోని శృంగారం
రసస్థాయిని చేరుకుందా అంటే
అనుమానమే! ఎందుకలాగ అంటే, ఆ కథలోని
వైచిత్రే దానికి కారణం. వరూధిని
మనసుపడ్డ ప్రవరుడు వరూధినిని కోరడు,
పైగా తిరస్కరిస్తాడు. అంచేత
వారిద్దరి మధ్యనా ఉన్న రతి,
ఏకపక్షం. నాయికా నాయకులలో
యిద్దరికీ పరస్పర అనురాగం ఉంటే
కాని అది రసస్థాయికి ఎలా చేరుతుంది?
ఉదాహరణకు, ప్రవరుడు తిరస్కరించి
పోయిన తర్వాత వరూధిని విరహమంతా,
పాఠకునిలో, అయితేగియితే జాలిని
కలిగిస్తుందేమో కాని శృంగారభావన
పెంపొందించదు. ఎందుకంటే అది
వ్యర్థ విరహం కాబట్టి. ఇది యిలా
ఉంటే, మరో వైపు, వరూధిని చేత
తిరస్కృతుడైన గంధర్వుడు ప్రవరుని
రూపంలో వరూధిని దగ్గరకు వస్తాడు.
ఆమెని మోసపుచ్చి ఆమెతో
సంభోగిస్తాడు. ఆ సందర్భంలో
వారిరువురూ పరస్పరం ఒకరిపై ఒకరు
కోరిక గలవారే అయినా ( వచ్చిన వాడు
ప్రవరుడు కాడన్న విషయం వరూధినికి
తెలియదు కాబట్టి), అది మోసంతో
కూడిన కలయిక కాబట్టి, అందులో
ఔచిత్యం లోపించి, సహృదయుడైన
పాఠకుడు దానిలో రససిద్ధి పొందలేడు.
ఇలాంటి ఏకనిష్ఠమైన భావము, లేదా
అనౌచిత్యంతో కూడిన భావమునే
ఆలంకారికులు "రసాభాసం" అని పేరు
పెట్టారు. రస ఆభాసం - అంటే రసంలా
కనిపిస్తుంది కాని, రసం కానిదన్న
మాట. కథా సందర్భాన్ని బట్టి
ఒకోసారి రసం కన్నా రసాభాసమే
ప్రధానమవుతూ ఉంటుంది.
కథలోని వైచిత్రి మాట అలా ఉంచితే,
పెద్దనగారి కథనంలో మరో విశేషం ఉంది.
అది - వరూధిని పాత్రకీ, ఆమెకి
ప్రవరునిపై కలిగిన అనురాగానికీ
పెద్దనగారిచ్చిన ప్రాధాన్యం.
ఒకవైపు ప్రవరుని వైదికనిష్ఠనీ,
మరొకవైపు వరూధిని వలపునీ, ఒక
త్రాసులో వేసి తూకం వేసారా
అనిపించేట్టుగా ఆ వృత్తాంతాన్ని
తీర్చిదిద్దారు! విరాగానికీ
సరాగానికీ, సంప్రదాయానికీ
శృంగారానికీ మధ్య యిలాంటి సంఘర్షణ
అంతకు ముందెక్కడా మనకి కనిపించదు.
పెద్దనగారి త్రాసు ముల్లు ఒకింత
వరూధిని వైపే మొగ్గు చూపిందన్నా
అది సత్యదూరం కాదు. పెద్దనగారికి
వరూధినిపై ఎంత మమకారం లేకపోతే,
అస్తమించే సూర్యుని చేత ప్రవరుడిని
ఇంతలా తిట్టిస్తాడు!
తరుణి
ననన్యకాంత నతిదారుణ
పుష్పశిలీముఖ్యవ్యధా
భర వివశాంగి నంగభవు బారికి నగ్గము
జేసి క్రూరుడై
యరిగె మహీసురాధము డహంకృతితో నని
రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె
గషాయ ధీధితిన్
"తరుణి - లేత యవ్వనంలో ఉన్న స్త్రీ,
అననన్య కాంత - వేరొకరిని వరించలేదు,
తననే వరించిందాయెను, అతి దారుణ
పుష్ప శిలీముఖ వ్యథాభర వివశాంగి -
శిలీముఖం అంటే బాణం. పుష్ప
శిలీముఖుడు మన్మథుడు. అతి
దారుణమైన మన్మథ బాధతో వశంతప్పిన
శరీరం కలది. అలాంటి వరూధినిని ఆ
మన్మథుడికి అధీనం చేసేసి క్రూరుడై
తనదారిని తాను పోతాడా ఆ
బ్రాహ్మణాధముడు!" అని తీవ్రమైన
కోపాన్ని పూనాడా అన్నట్టుగా
ఉన్నాట్ట సూర్యుడు. పెద్దనకి ఎంత
ధైర్యం ఉంటే ప్రవరుడంతటి వాణ్ణి
పట్టుకొని బ్రాహ్మణులలో అధముడు అని
అనగలడు, అదీ వరూధిని కోర్కెని
తీర్చకుండా పోయినందుకు!
శృంగారసాగరంలో ఎగసిన మరొక విశిష్ట
భావతరంగం కళాపూర్ణోదయం. ఈ
ప్రబంధంలో పింగళి సూరన, మొత్తం
అయిదు రకాల శృంగారాలని
చిత్రించాడని కట్టమంచి
రామలింగారెడ్డిగారు తమ
కవిత్వతత్త్వ విచారంలో
పేర్కొన్నారు. వారు చెప్పిన అన్ని
రకాలూ మన అలంకారశాస్త్రం ప్రకారం
శృంగారరసంగా పరిగణించలేము కాని
అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది
సుగాత్రీశాలీనుల కథ. ఈ కథ
చాలామందికి తెలిసే ఉంటుంది.
విచిత్రమైన కథ. సరస్వతీదేవి
వరప్రసాదంగా పుట్టిన సుగాత్రికి
శాలీనుడనే అతనితో వివాహమై, అతను
ఇల్లరికం వస్తాడు. తొలిరేయి
సర్వాలంకారశోభితయై వచ్చిన
సుగాత్రిని చూసి శాలీనుడు
కంగారుపడతాడు. దగ్గరకు చేరడు. ఆ
మరునాడూ, తర్వాతా, యిలా ఎన్ని
రోజులు గడచినా అదే పరిస్థితి. ఇది
తెలిసిన సుగాత్రి తల్లి, అలాంటి
వట్టి గొడ్డుని యింట్లో పెట్టుకు
వట్టిగా మేపడం దండగ అని చెప్పి,
శాలీనుడిని తోటపనికి
పురమాయిస్తుంది. శాలీనుడు బుద్ధిగా
అత్తగారు చెప్పినట్టు తోటపని
చేస్తూ ఉంటాడు. తన భర్త అలా
కష్టపడడం చూసి సహించలేక, సుగాత్రి
అతనికి తోడుగా పని చేయడం
మొదలుపెడుతుంది. కాని తోటపనులు
చేయాలంటే ఆభరణాలూ అవీ అడ్డు కదా.
అంచేత అవన్నీ తీసి పక్కన పెట్టేసి,
నారచీర కట్టుకొని పనికి దిగుతుంది.
తన భార్య సహజసౌందర్యానికీ,
సోయగానికీ ఆకర్షితుడైన శాలీనుడు,
ఆమెపై అనురాగాన్ని ఒలకబోస్తాడు.
ఇద్దరూ మదనకేళిలో తేలియాడుతారు.
భర్తకి తనపై అనురాగం ఏర్పడిందని
సంతోషించిన సుగాత్రి, ఆ రాత్రి
మళ్ళీ ఎప్పటిలాగే అలంకారాలన్నీ
ధరించి అతని దగ్గరకి వస్తుంది.
మళ్ళీ అతని పరిస్థితి మొదటికి
వస్తుంది. నిరాసక్తంగా ఉండిపోతాడు.
విషయమేమిటో తెలియక బాధపడుతుంది,
నిలదీస్తుంది. అయినా శాలీనుడు
కిమ్మనకుండా నిమ్మకు
నీరెత్తినట్లుంటాడు. నిరాశతో మళ్ళీ
మరునాడు తోటపనికి వెళ్ళిన భార్యని
తిరిగి అనురాగంతో దగ్గరకు
తీసుకుంటాడు శాలీనుడు. అప్పుడతని
వ్యవహారం అర్థమైన సుగాత్రి, ఆ
రోజునుంచీ అతనికి నచ్చిన రీతిలో
అతనితో కలిసిమెలిసి పనిచేస్తూ
హాయిగా దాంపత్యం సాగిస్తుంది.
ఇలాంటి చిత్రమైన సంఘటనలు
నిత్యజీవితంలో అక్కడక్కడా
జరుగుతాయేమో కాని, మన కావ్యాలలో
మాత్రం ఎక్కడా కనిపించవు. ఇలాంటి
గొప్ప కల్పన చేసిన సూరన,
సుగాత్రీశాలీనుల శృంగారాన్ని కూడా
చాలా రసవంతంగా చిత్రించాడు. భార్య
సహజసౌందర్యాన్ని, సోయగాన్నీ చూసి
శాలీనుడు మన్మథశరముల బారిన పడతాడు.
అపుడత డట్లు
పేర్చు కుసుమాస్త్రుని యుద్ధతి
యాపలేక "వె
ఱ్ఱి పడుచ! యెంత మాన్చిన
నెఱింగెడుదానవు గావు, నీకు దో
ట పనుల కెంత దూర మకటా!" యనుచుం దన
యుత్తరీయ వ
స్త్రపు మునికొంగునం దుడిచె దన్వి
కపోలపు ఘర్మబిందువుల్
సుగాత్రి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా,
"ఓసి వెఱ్ఱిదానా! ఎంత చెప్పినా
వినవు కదా. నీకు తోటపనులేమిటి"
అంటూ తన ఉత్తరీయపు మునికొంగుతో ఆమె
చెక్కిళ్ళపైనున్న చెమటని తుడిచాడు.
తుడిచిన
బోక మన్మథుని దుర్జనతా మహిమన్
బొరింబొరిం
బడతి మెఱుంగు చెక్కిళుల బర్వెడు
ఘర్మము గాంచి యంత నా
బడలిక చూడలే కిడుమపాట్లకు జొచ్చి
నలంగి తంచు నె
క్కుడు తమకంబుతోడ దల గ్రుచ్చి
కవుంగిట గూర్చె నత్తఱిన్
శాలీనుడు ఎంత తుడిచినా ఆ సుగాత్రి
చెమరింపు తగ్గలేదట! శృంగార భావం
అతిశయించినప్పుడు కూడా చెమరింపు
కలుగుతుంది కదా. ప్రియుడు తన
దగ్గరగా చేరి చెక్కిళ్ళని
స్పృశించడంతో సుగాత్రికి మరింత
చెమట పుట్టుకొచ్చింది. అది చూసి
శాలీనుడు మరింత బాధపడి, "అయ్యో
ఎంత కష్టపడుతున్నావో" అంటూ ఆమెని
ఎంతో ప్రేమతో తన కౌగిట్లోకి
తీసుకున్నాడు.
ఇంతటి సహజ శృంగార వర్ణన ప్రబంధాలలో
ఇంకెక్కడా కనిపించదు. శ్రీశ్రీ
అన్న "శ్రమైక జీవన సౌందర్యం" అనే
మాటకి అచ్చమైన ఉదాహరణ
సుగాత్రీశాలీనుల దాంపత్యం!
ఇందుకే కాబోలు కట్టమంచి వారికి
ప్రబంధాలలో కళాపూర్ణోదయమొక్కటే
కాస్త కంటికి ఆనింది. ఇతర
ప్రబంధాలనూ, వాటిలో వర్ణించబడిన
శృంగారాన్నీ, అతను చాలా తీవ్రంగా
దుయ్యబట్టారు తన కవిత్వతత్త్వ
విచారంలో. అదంతా పాశ్చాత్య ప్రభావం
వల్ల అతను చేసిన విమర్శ, అని
పూర్తిగా కొట్టిపారెయ్యడానికి లేదు.
మన అలంకారశాస్త్ర రీత్యా చూసినా,
యితర ప్రబంధాలలో రసమయమైన కవిత్వం
తక్కువగానే ఉందనిపిస్తుంది. అంత
మాత్రం చేత అవి కవిత్వం కాకుండా
పోవు. అద్భుతమైన కల్పనలు,
మనోహరమైన వర్ణనలూ ఎన్నో ఉన్నాయి.
కానీ రసస్థాయిని చేరుకొనేవి
తక్కువే. ఉదాహరణకి మాదయగారి మల్లన
రచించిన రాజశేఖరచరిత్రము అనే
కావ్యంలో యీ పద్యం చూడండి:
చిలుక
పురోహితుండగుచు జెంగటనుండగ,
సిగ్గుపెందెరల్
దొలగగద్రోచి, బంధుగతి దోరపు
గోర్కులు సందడింపగా
దలపు లతాంగి జన్నమును తాన కనుంగవ
దోయిలించి చూ
పుల దలబ్రాలు పోసె నృపపుత్త్రునిపై
విరహాగ్ని సాక్షిగన్
నాయకుడైన రాజశేఖరుడిని తన అంతఃపుర
గవాక్షం నుండి చూసిన నాయిక అవస్థని
వర్ణించే పద్యమిది. నాయిక
నాయకుడిని చూడగానే అతనిపై బద్ధ
అనురాగం ఏర్పడింది. వెంటనే ఆమె
హృదయంలోనే అతనితో వివాహం
జరిగిపోయింది! అలా ఎలా
జరిగిపోయింది అన్న దాన్ని
సమర్థిస్తున్నాడు కవి. పక్కనే ఆమె
పెంపుడు చిలుక ఉంది. ఆ చిలుక
పురోహితుడయ్యాడు. మనసులో
అలుముకున్న సిగ్గు అనే తెరలను
తొలగించింది (సుముహూర్తంలో తెర
తీయడం). అధికమైన కోరికలే బంధుజనమై
సందడి చేసాయి. రెండు కన్నులూ
దోసిలిగా పట్టి, చూపులనే తలంబ్రాలు
రాజకుమారునిపై పోసింది. గుండెలో
ఎగసిపడుతున్న విరహతాపమనే
అగ్నిసాక్షిగా నాయకునితో వివాహం
జరిగిపోయింది!
గొప్ప ఊహ! కొత్తదనమున్న ఊహ. విభావ
అనుభావ సంచారీభావాలన్నీ ఉన్నాయి.
అయినా యిది రసస్థాయిని చేరుతున్నదా?
చేరదు. ఇది కూడా కిందటి నెల
వ్యాసంలో చూసిన "కాలాంతఃపుర..."
అనే పద్యం లాంటిదే. ఇలాంటి ఊహలన్నీ
బుద్ధిని తాకుతాయి కాని, హృదయాన్ని
కాదు. హృదయాన్ని తాకితే కాని
రసానుభూతి కలగదు. హృదయాన్ని తాకే
వర్ణనలు ఎలా ఉంటాయో కిందటి
వ్యాసంలో చూసాం. పైననున్న
సుగాత్రీశాలీనుల ప్రణయదృశ్యం కూడా
హృదయాన్ని తాకే సన్నివేశమే. అలాగే,
పోతన అన్నమయ్య పద్యాలు కుడా.
యింతటితో, ప్రాచీన పద్య కావ్యాలలో
శృంగారరసాన్ని గురించిన చిరు
పరిచయం పూర్తయ్యింది. ఇంతకుముందే
చెప్పినట్టు, ఇది ఏమాత్రం సమగ్రమని
నేను అనను. నాకు తెలిసినంత వరకూ,
కొత్త తరం పాఠకులకు తెలియాల్సినది
- అని నాకు అనిపించినంత వరకూ,
సమగ్రంగా పరిచయం చేసే ప్రయత్నం
చేసాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా
అభిరుచికి అనుగుణమైన పద్యాలనూ
కావ్యాలనూ మాత్రమే ఉదాహరించాను.
శృంగారరస కావ్యాలు ఇంకా ఎన్నెన్నో
ఉన్నాయి. ఉదాహరించిన కావ్యాలలోనే
మరెన్నో సన్నివేశాలూ పద్యాలూ
ఉన్నాయి. అవన్నీ పాఠకులు తమ తమ
అభిరుచి మేరకు చదువుకొని ఆనందించ
వలసిందే!
ఇక ఆధునిక పద్య కవిత్వంలో శృంగారం
స్వరూపాన్ని వచ్చే నెల వ్యాసంలో
స్థూలంగా పరిచయం చేస్తాను.. అందాకా,
సుగాత్రీశాలీనుల కథలో కవిత్వానికి
సంబంధించిన అంతరార్థం ఏదైనా
ధ్వనిస్తోందేమో ఆలోచించండి.
|