ముందుమాట  
 

   రచన: రావు తల్లాప్రగడ       

 

 

ముందుగా అందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గత ఆరేళ్ళకు పైగా నిర్వహిస్తున్న సుజనరంజని సంపాదకత్వ బాధ్యతల నుండీ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి ప్రకటనను విని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ఆశ్చర్యాన్ని తెలిపారు. దీనికి మహత్తర కారణం వుంది.

ఆ కారణాన్నే సుజననీయంలో "మౌంట్ శాస్తా రహస్యం" పేరిట వివరించాను. కొన్ని మాసాల సమయాన్ని సొంతతృష్ణలకు కేటాయించి ఆ తరువాత సాధ్యమైతే నూతనోత్తేజంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా ఈ సంపాదకత్వ బాధ్యతను నిర్వహిస్తూ వుండటం వల్ల సుజనరంజని వదులుకోవడం కొంచెం కష్ఠమే. ఐనా ముందుకు వచ్చిన అనేక మంది ఔత్సాహిక సంపాదకులకు అవకాశం కల్పించడం కూడా మన బాధ్యతే. అందులో తాటిపాముల మృత్యుంజయుడు సిలికానాంధ్రలో సుపరిచితుడే. ఆయనను ఈ బాధ్యతను నిర్వహించమని కోరుతున్నాను. మే మాసం నుంచీ సుజనరంజని సరికొత్త శీర్షికలతో ముస్తాబయ్యి మీ ముందుకు వస్తుంది. అన్ని శీర్షికలూ కొత్త సంపాదకుని అభిరుచిని బట్టి మారనున్నాయి. నా అభిమానము, సహాయసహకారాలు ఆయనకెప్పుడూ లభిస్తూనేవుంటాయి.

నాకు గత ఆరేళ్లలో సహకరించిన ప్రతి రచయితకూ పేరుపేరునా ధన్యవాదాలు. మన సుజనరంజనిని ప్రతినెలా అందంగా తన గ్రాఫిక్సుతో తీర్చిదిద్ది సాహిత్యంలో కూడా సహకారాన్ని అందిచిన సి.కృష్ణ గారికి వారి ఆజ్ఞా టెక్నాలజీసుకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పాఠకులే ఏ పత్రికకైనా ఊపిరి, స్పూర్థి, ఆశయం. ఆ లక్షలాదిమంది పాఠకులకు, అభిమానులకు చేతులెత్తి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే, భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తే, మీతో మళ్ళీమళ్ళీ సాహితీ కాలక్షేపం చేయాలనే కోరుకుంటున్నాను.

సుజనరంజని ద్వారా మీతో పరిచయం అవ్వడం నా అదృష్టం. నేను ఈ సంపాదకత్వ బాధ్యతలను చేపట్టిన నాటికి 10 వేల హిట్లు కూడా లేని మన పత్రిక 12 లక్షల హిట్లను సాధించుకుంది; అలెక్సాలో ఒక రేటుంగు కూడా లేని పత్రిక నేడు అన్ని తెలుగు అంతర్జాల మాసపత్రికలలో బెస్టు రేటింగుని సాధించుకుని అందరికంటే చాలా ముందు నిలిచింది. మొన్న ఆక్టోబరులో నూటపదహారవ సంచికను చూసుకున్నాము. నేడు 121వ సంచికను విజయవంతంగా విడుదలచేసుకొంటున్నాము. ఈ 121 సంచికలలో 79 సంచికలకు నేనే సంపాదకుడిగా వుండినందుకు ఎంతో గర్విస్తున్నాను. ఈ పత్రిక ద్వారా ఈ గత ఆరున్నర సంవత్సరాలలో ఎందరో గురుతుల్యుల సహవాసాన్నీ, జ్ఞానాన్నీ, స్నేహితులను, అభిమానులనూ పూజ్యపాఠకులను సంపాదించుకోవడం జరిగింది.

మీ అధరణే లేకుంటే ఈ విజయాలేవీ సాధ్యపడేవి కావు. ఈ ఆధరణ ఇలాగే కొనసాగాలనీ, మనం స్థాపించుకున్న ఈ పత్రిక యొక్క విజయకేతనం ఇలాగే పైకెగరాలనీ, దానికి నా సహకారం ఎప్పుడూ వుంటుందని మనవి చేసుకుంటున్నాను.
ఈ విజయనామ సంవత్సరంలో మీకు అన్ని విధాలా విజయాలు ప్రాప్తించాలని కోరుకుంటూ, ముకుళిత హాస్తాలతో, వీడ్కోలు చెప్పుకుంటూ


మీ
రావు తల్లాప్రగడ.


 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

   

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech