కలియుగం మీద కంపరం పుట్టిన
భగవంతుడు అవతారగుణం వదులుకున్నాడు
ఇకమీదట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
తన బాధ్యత కాదని మిన్నకుండిపోయాడు
ఇదే అవకాశమని రాక్షసుడు విజృంభించాడు
దుష్ట రక్షణ శిష్ట శిక్షణ పథకరచనకి
పూనుకున్నాడు
దేవుడిలా దశావతారాలు కాదు
కేవలం ఒకేఒక్క తీవ్రవాద అవతారం వాడిది
మనతో సహజీవనం చేస్తూ నమ్మకరూపమై చరిస్తూ
తుపాకీ గుండై పేలతాడో
మానవబాంబై బ్రద్దలవుతాడో తెలియక
భయం గుప్పిట్లో బంధీలవుతున్నారు
మనిషికి మనిషికీ మధ్య
పలకరింపు చోటుచేసుకోలేనంత అనుమానం
అప్పటిదాకా పూదోటలా వెల్లివిరిసిన జనవనం
రక్తసిక్తమై..క్షతగాత్రులతో..విగత
జీవులతో
యుద్ధభూమిని తలపిస్తోంది
ఇప్పుడు మానవుడు
సంఘజీవి కాకపోతే బాగుణ్ణనుకుంటున్నాడు
రాక్షసవతార పరిసమాప్తికి
ఇంకెంత కాలం పడుతుందో?
రావణకాష్ఠానికి..సామూహిక దహనకాండకి
చరమగీతం ఎప్పుడో?
మానవ మనుగడకి
భరోశానిచ్చే ఆ మంచిరోజెప్పుడో?