Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

మనిషి మనస్తత్వంలో ఒక వికృత ఛాయ చిల్లర భవానీదేవి కథ - ఆమె విముక్తి

 

 రచన : విహారి     

   
 
ఒక కథ మనసులో భేదాన్ని రగుల్కొలిపితే, మరొకటి ఆమోదం చిలకరిస్తుంది.
ఒకటి చిరునవ్వుకు దారి తీస్తే, మరొకటి నిట్టూర్పుకు నెగడు వేస్తుంది. ఒకటి వడగాల్పులా గూబలదరగొడితే, మరొకటి మలయ పవనంలా సేద దీరుస్తుంది. కథల్లో మందుటెండలే కావు. చలువ పందిళ్ళు కూడా ఉంటాయి.

వస్తు వైవిధ్యాన్ని సంతరించుకున్న చిల్లర భవానీదేవి గారి కథల గురించి సుప్రసిద్ధ కథకులు కీ.శే.మధురాంతకం గారి అభిప్రాయం ఇది.

పరిణామ శీలమైన సమాజగతిని పరిశీలించే శక్తి కలిగిన రచయిత్రికి సమస్యాత్మకమైన జీవన చిత్రణలు చేయాలనే నిబధ్దత, కథారచన పట్ల ఆరాధనా భావమూ ఉన్నప్పుడు ఆ రచయిత్రి కథలు - సమకాలీనమై భాసిస్తూ ఉంటాయి. ఈ గుణగణ వైశిష్ట్యం గడించిన రచయిత్రి చిల్లర భవానీ దేవిగారు.

భవానీదేవి గారు కథా రచయిత్రి, కవయిత్రి, తన రచనలతో తెలుగు సాహితీ లోకానికి సుపరిచితురాలు. ఆమె కవితా సంపుటి ‘వర్ణనిశి’ కి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది. అబ్బూరి ట్రస్టు వారి అవార్డు, ఉమ్మడిశెట్టి, సాహితీ పురస్కారం (శబ్బస్పర్శకు) తెలుగు విశ్వవిద్యాలయం వారి సాంస్కృతిక సమాఖ్య వారి శ్రీ శ్రీ అవార్డు, వంశీబర్క్ లో కథా పురస్కారం వంటి అనేక బహుమతులూ, సత్కారాలూ సన్మానాలతో ఆమె లభ్దప్రతిష్థురాలు. 5 కవితా సంపుటాలూ, రెండు కథా సంపుటాలూ, 2 వ్యాస సంకలనాలు, 3 నానీ సంపుటాలూ ప్రచురించి ప్రముఖుల ప్రశంసలనందుకున్నారు.

కథా రచయిత్రిగా భవానీ దేవి గారి ప్రతిభ - పైన తెలిపినట్లు వస్తు వైవిధ్యంతో అలరారటం మాత్రమే కాక ‘అంతరంగ చిత్రణ’ సాఫల్యంలో ఉంది.

యదార్ధ జీవన చిత్రణం కథకు ఆయువు. ఈ చిత్రణ చేసేటప్పుడు సాధారణ రచయిత దృష్టి ఎక్కువగా పాత్ర బహిరంగ స్వరూపం, వర్తన మీద ఉంటుంది. సన్నివేశ కల్పన ద్వారా వీటిని సాధించుకుంటూ పోతాడు. అయితే మనుషుల అంతరంగం అట్టడుగున తారట్లాడే ఆనంద విషాద ఛాయలకు, అంటే ఆయా పాత్రల అంతరంగ తరంగాల కదలికకు, మనస్తత్వానికి, స్వభావానికీ, కథాత్మకమైన చిత్రణనీయటం కష్టంతో కూడిన పని కనుక, సాధారణ రచయిత ఈ అంశాల పట్ల శ్రద్ధ వహించడు. జీవితానికి దర్పణం పట్టడం కాక, జీవితాన్ని వ్యాఖ్యానించి పాఠకులకొక దిశా నిర్దేశం చేయగల ప్రతిభావంతులు ఇలాంటి కథల్ని వెలియిస్తారు. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు.

తన ప్రతిభా స్వరంతో అలాంటి ఒక గొప్ప కథని రాశారు భవానీదేవిగారు. కథ పేరు ‘ఆమె విముక్తి’.

అనసూయ మనసు నోరు నొక్కిపెట్టడానికి ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుని జీవితాన్ని గడిపింది. ఇప్పుడిక శరీరం సహకరించలేనని మొరాయిస్తోంది. విశ్రాంతిని కోరుతోంది. కాని మనసుదాడిని తట్టుకోవడం కష్టంగా ఉన్నదామెకు. భర్త శ్రీపతి, అతను ప్రేమని ప్రకటించని స్వభావం వాడు. చిరాకు, విసుగు. లోతైన బావిలో నీరు ఉంటుంది కానీ అది ఎవరి దాహాన్ని తీర్చలేనప్పుడు సార్ధకత ఏముంది? అతని ప్రేమా అంతే అనిపించేది. పెద్దకొడుకు, కోడలు ఎనిమిదింటికి గానీ గదిలోంచి బయటకి రారు. సాఫ్ట్ వేర్ కోడల్ని పొద్దున్నే లేవమని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది. రెండో కొడుకు ఐ.ఏ.ఎస్. ప్రిపేరవుతున్నాడు. తన ట్రీట్ మెంట్ కోసం స్కానింగ్ కోసం ఉంచిన డబ్బు అతనికి అందించే తల్లి అనసూయ.

ఇవ్వాళ నగరంలోని నక్షత్రాల హాస్పటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో స్పృహ ఉండలేని స్థితిలో అనసూయ! హడావిడంతా మామూలే. ఆడవాళ్ళు తమ కోసం తాము ఎందుకు బతకరు? ఇతరుల కోసమే ఎందుకు బతుకుతారు? చివరి దశలో స్త్రీవాదం ఆలోచనలు! శ్రీపతికి తెలిస్తే - అమ్మే! అనసూయ రకరకాల మాటలు అభిప్రాయాలు, ఆందోళనలు!

ఎన్నాళ్ళిలా డాక్టర్? శ్రీపతి గొంతులో కొండంత దిగులు. పేషేంట్ రెస్పాన్స్ ని బట్టి ... ఎన్నాళ్ళనేది, ఇప్పుడే చెప్పలేం...అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ రాత్రి చీకటి నిర్దయగా వ్యాపించింది. ఒళ్ళంతా పైపులు, ట్యూబులతో ఉన్న భార్యకేసి పరిశీలనగా చూశాడు శ్రీపతి. సెడేషన్ లో ఉన్న అనసూయ మత్తులో ఉంది. సారీ! అనూ., నీ బాధ చూళ్ళేక పోతున్నాను. నేను నీకేమీ చేయలేకపోయాను. కనీసం త్వరగా విముక్తి కలిగిస్తాను. అని వెంటిలేటర్ కనెక్షన్లు కొన్ని తీసేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నాడు శ్రీపతి.
అనసూయ మొహంలో చెక్కుచెదరని ప్రశాంతత. నిశ్చల దీపంలా వెలుగుతోంది! ఇది కథ! ఆమెకు విముక్తి లభించింది.

కథలో సంభావ్యత, అసంభావ్యతల చర్చకు అవకాశం లేదు. ఎందువలన? అంటే కథాత్మకంగా అనసూయ ఒక All gone గృహిణి. ఛాయాదేవి గారి సుఖాంతంలో నాయిక లాంటిది. సంసార చట్రంలో ఇరుక్కుపోయి, ఆ పళ్ళ చక్రంలో నలిగి, నుజ్జయిన స్త్రీ బాధ్యతల బరువుతో క్రుంగిపోయిన స్త్రీ.
She is more misunderstood than understood type ఆమె. కనీస మానవత్వ స్పందనల రోదన అయిపోయింది. శ్రీపతి ఆమెకి విముక్తి కలిగించడం కేవలం ఆమె బాధ చూడలేక మాత్రమేనా? అంటే అవునని నిర్ధారణగా చెప్పలేం. ఎన్నాళ్ళనేది చెప్పలేం. అన్న డాక్టర్ మాటలే అసలైన Proximate cause గానూ బావించాల్సి ఉంది.

తెలుగు కథకి ఏ వాదపు Tag తగిలించడానికైనా నేను విరోధిని కనుక ‘ఆమె విముక్తి’ కీ ఏ tag అక్కర్లేదు. ఆమె విముక్తి వస్తువు, శిల్పం దృష్ట్యా ఒక కథాతేజోరేఖ. జీవితంలోని సంఘర్షణల వలన సాహిత్యానికి ప్రేరణ కలుగుతుంది. కొందరి జీవితాల్లోని అంతరంగ సంఘర్షణ వలన ఉత్తమ కథా సృష్టి జరుగుతుంది. ఈ కథలో అనసూయ సంవేదన కథౌన్నత్యానికి ఆలంబమైంది. ఒక గొప్ప కథ రాసిన భవానీదేవి గారికి అభినందనలు!

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech