Sujanaranjani
           
  కథా భారతి  
   

 లిఫ్ట్

 

రచన : శర్మ జీ ఎస్  

 

అమ్మా స్కూల్స్ రీ ఓపెనింగ్ రేపటినుంచే కదా ! బస్ ఫీజు కట్టారా లేదా ? అడిగాడు కొత్తగా హైస్కూల్ కి వెళ్ళబోతున్న సంజయ్.

సంవత్సరానికి రూ 6000 లు బస్ ఫీజు , అందుకే రూ 6000 లు పెడితే , మాంచి కొత్త  సైకిలు వస్తుంది . 10 త్ క్లాస్ వఱకు హాయిగా సైకిల్ మీదనే వెళ్ళవచ్చు . అనవసరంగా ఖర్చు పెట్టడం దేనికని , మీ నాన్నగారికి నేనే సలహా యిచ్చాను అన్నది పద్మ .

నాన్నగారేమన్నారు ?

ఇంకేమంటారు సరే అనక అన్నది.

ఎఫ్ఫుడు కొంటారు ?

కొన్నాళ్ళలో.

అందాకా ఎలా వెళ్ళటం ? అడిగాడు అమాయకంగా .

మీ నాన్నగారికి వీలున్నపుడు స్కూల్ దగ్గఱ డ్రాప్ చేస్తారులే అన్నది పద్మ.

వీలులేనప్పుడెలా అమ్మా ? అన్నాడు.

ఎవరినైనా దారిన పోయేవాళ్ళని లిఫ్ట్ అడిగి వెళ్దువుగాని అన్నది .

లిఫ్టా ? నేనా ? ఆశ్ఛర్యంగా అడిగాడు.

లిఫ్టేరా , ఎవరైనా , ఎవరినైనా అడగవచ్చు . ఆసలు జీవితంలో పైకి రావాలంటే కొంతమందిని లిఫ్ట్ అడిగి తీసుకొంటే గాని పైకి రాలేము .

తప్పేమీ కాదురా , ఆది మన రైట్ రా అన్నది .

అలా లిఫ్ట్ అడగటం రైటా ! అంటే కరెక్ట్ అనేగా  అడిగాడు.

కరెక్ట్ అని , యింకా హక్కు  అని కూడా అర్ధం . నువ్వడిగేది లిఫ్ట్ గానీ గిఫ్ట్ కాదుగా , గిఫ్ట్ అడిగి తీసుకోకూడదు , లిఫ్ట్ అడిగి తీసుకోవాలి  అర్ధమైందా అన్నది .

ఙ్నానోదయం అయినవాడిలా , మాఱు మాట్లాడకుండా అలాగేనమ్మా అన్నాడు.

           *         *         *                                     

కొన్నాళ్ళకి పద్మ కొత్త సైకిలు కొనిచ్చింది సంజయ్ కి .

కొత్త సైకిలు మీద రోజూ స్కూల్ కి వెళ్ళి వస్తున్నాడు. 6 త్ క్లాస్ నుంచి 7 త్ క్లాస్ కి ప్రమోట్ అయ్యాడు .

అప్పుడప్పుడు  స్కూల్ నుంచి ఆలస్యంగా యింటికి చేరుకుంటున్న సంజయ్ ని  " సంజూ , స్కూల్ 5 గంటలకే అయిపోతుందిగా , ఆలస్యంగా వస్తున్నావ్ ? స్పెషల్ క్లాస్ లేమైనా ఉన్నాయా " అని  అడిగింది  పద్మ .

స్పెషల్ క్లాస్ లేవి లేవమ్మా ?

మఱి ?

రోజూ నేను వస్తుంటే , ఎవరో ఒకరు లిఫ్ట్ అడుగుతున్నారు . లిఫ్ట్ ఇచ్చి రావటంతో యింటికి రావటం ఆలస్యమవుతుంది అంతే అన్నాడు.

లిఫ్ట్ ఇస్తున్నావా ? ఆశ్ఛర్యంగా అడిగింది .

అవునమ్మా లిఫ్టే , నిజ్జంగా అన్నాడు.

అలా యివ్వకూడదురా తెలియని వాళ్ళకి.

అయితే తెలిసిన వాళ్ళకే యివ్వాలా ?

అసలు లిఫ్ట్ ఎవరికి యివ్వకురా ?

నువ్వేకదమ్మా చెప్పింది " గిఫ్ట్ అడిగి తీసుకోకూడదు , లిఫ్ట్ అడిగి తీసుకోవాలని .

నిజమేరా . కానీ నీది కొత్త సైకిలు కదా ! పైగా నిన్ను లిఫ్ట్ అడిగిన వాళ్ళెవరైనా , నీ వెనకేగా కూర్చునేది .

అవునమ్మా లిఫ్ట్ అడిగారని వాళ్ళను ముందు కూర్చొని తొక్కమంటం బాగుండదు కదా !

వేళ బాగుంటుందనిపించినా , అలాంటి పని మాత్రం చేయకు. ఎందుకంటే , హాండిల్ అప్పచెప్పావంటే , వాళ్ళు హాండిల్ చేసే విధానం వేరుగా వుంటుంది .

అదెలా ? నాలాగా తొక్కరా ? అడిగాడు  అమాయకంగా .

నీలాగానే తొక్కుతూ , వాళ్ళకు కావలసిన చోటికి నిన్ను , నీ సైకిల్ ని తీసుకు వెళ్తారు .

అయితే వెనక కూర్చోపెట్టుకుని తొక్కుంటూ వెళ్ళి లిఫ్ట్ యివ్వటమే మంచిదంటావ్ అన్నాడు.

అలా వెనక కూర్చోపెట్టుకుని వాళ్ళకు లిఫ్ట్ నువ్వివాలనుకుంటే , నిన్ను కత్తితోనో లేక పిస్తోలుతోనో బెదిరించి ఎక్కడకో తీసుకు వెళ్ళి , బ్లాక్ మెయిల్ చేస్తే ఎంత యిబ్బందో తెలుసా నీకు ? అసలు లిఫ్ట్ యివ్వడమే మంచిది కాదురా .

నువ్వు చెప్పింది నిజమే కావచ్చు , మఱి యిన్నాళ్ళు నేను చాలామందిని ముఖ పరిచయం కూడా లేని వాళ్ళని లిఫ్ట్ అడిగి తీసు కొన్నా కదా ! పైగా ఎన్నో మార్లు బైకుల మీద , స్కూటర్ల మీద  కూడా వెళ్ళాను కదామనం అనుకుంటున్నట్లు వాళ్ళు అనుకుంటే , నేనెలా స్కూల్ కి వెళ్ళగలిగే వాడిని ఎంత యిబ్బంది పడేవాడినో  కదా  అన్నాడు .

 మనం  మంచివాళ్ళం కదా ! అందుకే లిఫ్ట్ యిచ్చారు నీకు . మనల్ని లిఫ్ట్ అడిగినవాళ్ళెటువంటివాళ్ళో మనకు తెలియదుగా .

అందుకే మన జాగ్రత్తలో మనం వుండటం ఎప్పుడూ మంచిదిరా .  కనుక నువ్వు క్షణం నుంచి ఎవరికీ లిఫ్త్ యివ్వద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది.

మనకో నీతి , పరాయివారికో నీతా ? అన్నాడు .

అదేం లేదురా . అవసరాన్ని బట్టి మనకనుగుణంగా వాటిని వాడుకొంటాం అంతే అని బదులిచ్చింది .

తన పర భేదం అంటే యిదేనా అమ్మా ? అడిగాడు సందేహ నివృత్తి చేసుకోవాలని .

యిదేరా కన్నా , మా బంగారు నాయన , మా బాగా అర్ధం చేసుకొన్నావు  అన్నది .

తన పర భేదం అంటే మాష్టారు గారు యిలా చెప్పలేదే అన్నాడు అమాయకంగా .

మాష్టారు గారు చెప్పేవి వినాల్సిందే , పరీక్షలలో చక్కగా వ్రాయాల్సిందే . అప్పుడే నువ్వు పాస్  అవుతావు . సర్టిఫికెట్ కూడా యిస్తారు . జీవితానికి సంబంధించిన చదువులు తల్లితండ్రులు నేర్పుతారు , విఙ్నానానికి సంబంధించిన చదువులు గురువులు నేర్పుతారు . నే చెప్తున్నవి , నీ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడ్తాయి ( గుర్తుంచుకోరా అన్న లెవల్లో )అన్నది .

అందుకే గాబోలు , తల్లితంద్రులను గురువుతో సమానమంటుంటారు అనుకుంటూ " అలాగే నమ్మా " అన్నాడు .

                                    *            *     మా     *    ప్తం      *

 

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech