Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

సర్దుబాటు.

 

 రచన : ఆదూరి. హైమావతి.     

 

అందరూ వినండహో! 'నవీన్‘జంట'విడిపోయిందిట !"..అన్నఅరుపువినగానే . సిస్టంస్ వద్ద తమసీట్లలో సెటిలవుతున్న స్టాఫంతా ఒక్కసారిగా తలతిప్పి వార్త ఎనౌన్స్ చేసిన వామనరావ్ వైపు చూసారు, చూసి ఊరికే ఉంటారా ! ఉండగలరా! ఉండేవార్తేనా అది! వెంటనే లేచి వామనరావ్ వైపు పరుగుతీశారు. ఆ హడావిడిలో ఒకరిద్దరు టేబుళ్ళు తగిలి క్రింద పడ్డారు కూడా కూడా " నేన్నమ్మను." అని ఒకరూ," మమ్మల్ని ఫూల్స్ చేయకు "అని మరొకరూ," చెవిలో పూలెడుతున్నావా? "అని ఇంకోరూ , "అపహాస్యానికీ హద్దులుంటాయ్ "అని ఇంకా ఇంకోరూ, "నిద్రలో జోగుతున్నావా?" అని ఒకరూ, " ఈరోజు ఏప్రెల్ ఫస్ట్ కాదు." డేట్స్ బాగా గుర్తుంచుకునే గుర్నాధమూ, " ఇంత వయసొచ్చింది! పైగా దగ్గరుండి పెళ్ళి ఘట్టానికి తీసుకెళ్ళి ఇప్పుడీ మాటలేంటి? “ ఇలాతలో వ్యాఖ్య చేస్తున్నంతలో…..బాస్ భూపాలరావ్ వచ్చాడు. అందర్నీఅలా మూకగా చూడగానే  ఆయన కోపం నషాళానికంటి అగ్గిమీద గుగ్గిలంలా పేలి, అందరి మీదా ఫైరైపోయాడు. " ఏమైంది మీకంతా? ఇంకా పని మొదలెట్టకండా మంది కూడి ముచ్చాట్లాడుతున్నారు. ఓపూట జీతం కట్” అని హూంకరిం చాడు. ఆయన్నంతా ' భూతాలరావ్ 'అంటారు సరదాకి ..ఎప్పుడూ '  పని ---పని '  అంటుంటాడు . డ్యూటీ ఈజ్ గాడ్  , వర్క్ ఈజ్ వర్షిప్ , టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ ..ఇవీ ఆయన డైలాగ్స్ , అందుకే స్టాఫ్ అంతా అతగాడి పేరులో ' పా'  తీసేసి  ' తా ' పెట్టి పిలుస్తుంటారు. 
  " సార్ అదిరిపోయే న్యూస్ ! " అంటూ వామనరావ్ ముందుకొచ్చి " సార్ ! నవీన్ జంట విడి పోయిందిట!!" అని అరిచాడు బాస్ కోపం పోగొట్టే ప్రయత్నం కూడా  .....అది.
           " ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కాదు ..డోట్ బిహేవ్ లైక్ ఏమ్యాడ్  మ్యాన్ .. పని ఆపేసి --- గప్ అండ్ గ్యాస్ ..ఛ ఛా…..ఇంత వయసొచ్చింది ఎందుకు ? "  కసిరాడు బాసు.
" సార్ ! నేనూ అదే అన్నాను సార్ ! ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కాదని !" .అని గుర్నాధం ఏదో చెప్పబోయాడు. 
" నిజం సార్ ! గాసిప్స్ కాదు, కావాలంటే వాళ్ళనే అడగండీ! ... " అంటూ బాస్ క్యాబిన్ లోకి దారితీశాడు వామనరావ్ .అందరూ బాస్ వెంటబాస్  'క్యాబిన్ ప్రవేశం  ' చేసారు, ఎప్పుడైనా బాస్ పిలిస్తే ఏంతిడతాడోని భయంభయంగా అదురుతూ అడుగు పెట్టేవారంతా ఇప్పుడు ఉత్సాహంగా నదురూ ఏబెదురూ లేకండా క్యాబిన్ లోప్రవేశించారు. బాస్ క్యాబిన్ కు ఇరువైపులా ఉన్న రెండు వేర్వేరు క్యాబిన్స్లో మిస్టర్. అండ్ మిసెస్  నవీన్లు కూర్చుని ఏకాగ్రంగా తమ పని తాము చేసుకుపోతున్నారు , బయటి ప్రపంచాన్నేవారు మరచినట్లున్నారు.వారిద్దరినీ  అలా చూడగానే బాసు భూపాలరావ్  భయంకరంగా తన స్టాఫును ఉరుమి చూశాడు … " చూశారుగా ? ఇహనైనా వెళ్ళి పనిలో దిగండి. వాళ్ళను చూసి బుధ్ధి తెచ్చుకోండి. జీతాలు ఎక్కువై, పనితక్కువై కాలక్షేపానికి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటారా? గెట్లాస్ట్ " అని హుంకరించాడు. అతగాడి అరుపుకు హడలి, అంతా గబగబావెళ్ళి తమతమ సీట్లలో సెటిలయ్యారు.శరీరాలుకూర్చున్నాయే తప్ప, వారందరి మనస్సులు మనస్సుల్లో లేవు . ఏదో పని చేసుకు పోతున్నారు బాస్కు భయపడి.

ఎప్పుడెపుడు లంచ్ టైం అవుతుoదాని వాచెస్ చూసుకో సాగారంతా.

న్యాయం తనపని తాను చేసుకు పోతుందన్నట్లు ,గడియారం తన పని తానుచేసుకుపోయి అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న లంచి సమయంకానే ఐంది..
అంతా ఆదరాబాదరాగా క్యాంటిన్ కేసి పరుగులు తీశారు. వారినందరినీ కళ్ళద్దాలపై నుంచీ ఓ దొంగ కంట కని పెడుతూనే ఉన్నాడు, సదరు బాసుభూపాలరావ్ . ఓచెవి బయటికే వేశాడు కూడా. ఆన్యూస్ అలాంటిది మరి ! .అందరి ఆశలూ అడియాశలు చేస్తూ..ఆపాటికే ఆ నవీన్ జంట బయటి కెళ్ళిపోయింది. తిరిగి అంతా వామనరావ్ వైపు ఉక్రోషంగా,ఉగ్రంగా ఉగ్ర నార సింహాల్లో చూశారు. వారి చూపుల అగ్గికి బుగ్గికావలసినవాడే వామనరావు, ఐతే అతగాడి సత్య వార్తే అతన్ని కాపాడి నట్లుంది పాపం !.

"ఏమోయ్ మిస్టర్ వామన్ ! ఏదీ ఆజంట.ఏదో ఇరగ బొడిచే వార్తలా అనౌన్స్ చేసి అందరి పని , మైండ్స్ చెడగొట్టి , బాస్ చేతచెత్తతిట్లు తినిపించావ్ ? ఆపాప పరిహారార్ధంగా ఈపూట అందరి బిల్లూ కట్టి పాపందింపుకో."అంటూఎప్పుడూతనబిల్స్ మరోరిపై రుద్దే మనోహర్ తన బిల్ తీసి వామనరావు ముందుంచాడు. 

"నావార్త నిజమైతే నా నెలబిల్లులూ నీవేకట్టాలిమరి." అని వామనరావ్ బెదిరించగా' వీడు మహా దుర్మార్గుడు బిల్ కోసమైనా అసత్యాన్నిసత్యంగా,అన్యాయాన్నిన్యాయంగా ,దుర్మార్గాన్ని సన్మార్గంగా మార్చగల సమర్ధుడు ..వీడితో మనకేంటి ' అనుకునితనబిల్  చేతికితీసుకుని ముందుకు సాగాడు మనోహర్.

అన్నిటేబుల్స్ దగ్గరా ఇదేసంభాషణ .ఆడ, మగఅందరూనూ. అన్ని టేబుల్స్ మాటలూ విని క్యాంటిన్ యజమాని కామయ్య " ఏందిసార్ ! మీమాటలు! వాళ్ళిద్దరూ ఇందాకే వచ్చి టిఫిన్తిని పోయారు. ఐతే ఇద్దరూ వేరేవేరేగా వచ్చారు , వేరేవేరే టేబు ళ్ళదగ్గరకూర్చుని తిన్నారు , నేనంత గమనించలా ఆసమయానికే క్యాంటిన్, బాగా రద్దీగా ఉండటాన అలా కూర్చున్నారనుకున్నా , దాని వెనుక ఇంత కధ ఉందా! "అంటూనోరెళ్ళబెట్టి ,అంతలోనే బిల్స్ వసూలుచేసుకోవాల్ని గుర్తొచ్చి , నోరు మూసుకు ళ్ళాడు. 

"విన్నారా! విన్నారా? నామాటలు ’హంబక్ ‘అనీ’ గాసిప్స్ ‘అనీ ..గారెలనీ బూరెలనీ .. నన్ను బాస్ చేతతిట్టించారు కూడా, విన్నారు గాకా మాయమాటలు, మనమంతా వస్తే నిజం బయట పడుతుందని, ముందుగా నేవచ్చి వేరేవేరేగా కూర్చుని తిన్నామనిపించివెళ్ళారుట ! దగ్గరుండి ఏడాది పాటు శ్రమించి, చర్చలు జరిపించి పెళ్ళి చేయించిన పరమానందయ్య గారికి ఎంతవమానం తెచ్చారు! హవ్వ !లాగుతా ....కూపీలాగుతా.....నిజం కక్కిస్తా.. .నిరూపిస్తా, వామనరావా? మజాకానా? మీఅందరి చేతానా నెల బిల్లులూ కట్టించుకోనూ..వదుల్తానా?" అంటూ వామ రావ్ కాలరెగరేసుకుని పెద్దపెద్ద అంగలేసుకుంటూ ఆఫీసువైపు వెళ్ళాడు.

*****************************

వామనరావ్ ఎదురుచూస్తున్నసాయం సమయంకానే ఐంది. వేగంగా పని కట్టేసి, నవీన్ జంట బయటికి వచ్చేలోగా, బయట మాటేసి మగనవీన్నుపట్టేయను వేటకుక్కలా వేచిఉన్నాడు,నవీన్ గబ గబా బయటికి వచ్చి,కారెక్కబోతుండగా,కాలర్ పట్టేసుకుని అతగాడిని వాటేసుకుని," నేనూ నీతో ఈ రోజు వస్తున్నాను, మీ ఇంటికి ,నీతో చాలా విషయాలు మాట్లాడాలి." అంటూ అటకాఇంచాడు.
  నవీన్ గొంతులోపచ్చివెలక్కాయ పడినవాడిలా ముఖంపెట్టి "లేద్సార్ !నేను వేరే పని మీద బయటి కెళ్తున్నాను ..మరోరోజు.." అంటుండగానే ...
" అదస్సలు కుదరనే కుదరదు, ఈరోజే తాడోపేడో తేలి పోవాల్సిందే. పదపద నేనూనీకారెక్కి వస్తాను” అంటూ ఎడంవైపువెళ్ళి డోర్ తీసుకుని కూర్చున్నాడు, ధీమాగా.
చేసేదేంలేక  నవీన్ " వామనరావ్ సార్ ! ఇంటికి కాదు మరెక్కడికైనా వెళదాం." అన్నాడు ఓడి పోయిన వీరునిలా...
  " ఓయాస్ !దాందేముంది !ఎక్కడికైనాసరే ,నీతో మాట్లాడే అవకాశం ఇవ్వుచాలు.నీకోసం ఈపాటికే
కాచుక్కూర్చునుంటారు. పరమానందయ్యగారు. నేచెప్పేశాన్లే మీగురించీ ఉండలేనుగా!?" అంటూ వామనరావ్, మొబైల్ ఫోన్ తీసి గబగబాఎస్.ఎం.ఎస్ లుచేసేశాడు అందరికీనీ.
పరమానందయ్యగారు వయస్సులో పెద్దవారే గాక ,అందరి బాగోగులు విచారించి, కావల్సినసాయం చేసే మనస్తత్వం గలవాడు ,ఏవిషయాన్నైనా ఇట్టే పసిగట్టి పట్టేసి,నిజానిజాల నిగ్గుతేల్చి, సమస్యలు నివారించి , 'భేష్ !'అనిపించుకునేవాడు.  అందరిశ్రేయోభిలాషి , ముఖ్యంగా 'నవీన్' జంటను కలిపిన ముఖ్య పాత్రధారి. మంచి చెడులు ముచ్చటించి, ఏడాది పాటు చర్చలు సాగించుకుని, కష్టనష్టాలు బేరీజు వేయించి బాధ్యతల బరువులు తూకం చూసి అందరికీ ఆదర్శంగా, కార్యక్రమాన్ని తెరమీదికి తెచ్చి రక్తి కట్టించిన దర్శక మహా శయుడు. అందుకే పరమానందయ్య గారిని తిరస్కరించే ధైర్యం ఆయన పెద్దరికాన్ని కాదనే అహంకారం , ఆయన చనువును తోసేసే  సాహసం 'నవీన్'కులేవు. …
అందుకే ఆయన ఎదురుచూస్తున్నారనగానే మారు మాట్లాడక వామనరావ్ ఆయన్ను ఉండమన్న చోటుకు బయల్దేరాడు నవీన్ . వామనరావుకూ తమ వివాహ విషయంలో కొంతభాగ ముండటాన ఇతడినీ కాదనలేడు నవీన్ .వామనరావ్ ఆఫీ సు బృందాన్నంతా ఆపాటికే పోగుచేశాడు అక్కడ.అంతా వచ్చిచుట్టూ చేరగానే విషయమంతా వివరంగా చెప్పాడు నవీన్.
"సార్ !నన్నుమన్నించండి,మీముఖం చూడలేను . అందరి ముందూ  చేసిన ప్రతిఙ్ఞలు నిలుపుకోలేక పోయాను. మిగిలిన విషయాలన్నీచర్చించుకున్నంకానీ నా గురించిననాకే తెలీని పచ్చినిజం అప్పుడు బయటపడలేదు. చిన్నతనంలో మాఅమ్మచెప్పిన మంచి అలవాట్లు , ఆమెఎంత పోరినావంటబట్టించు కోక నిర్లక్ష్యం చేసి, ఇపుడనుభవిస్తున్నాను. నాసోమరితనం, నిర్లక్ష్యమే నాజీవితాన్ని నాగుపాముల్లా కాటేశాయి, నా యీతప్పుకు నిష్కృతి లేదు,ఈతప్పంతా నాదే,మరెవ్వరి దీకాదు. ఇంతచదివి, ఇంత మంచి ఉద్యోగంలో ఉన్ననేను నా అలవాట్లుమార్చుకోలేక ,గర్వంతో,అహంతో నిండు భోజనాన్ని కాలు తో తన్నినట్లు జీవితాన్ని తన్నేసుకున్నాను...." అంటూ ఏడుస్తున్న నవీన్ ను ఓదార్పుగా చూడటం తప్ప మరేం చేయలేక పోయారు  అంతా. 

*******************************         
 గబగబా క్యాబిన్ లోంచీ బయట పడిఆరోజు తనపాత స్నేహితురాలి ఇంటికెళ్ళాలని బట్టలు కూడా సర్దితెచ్చుకున్న'నవీన ‘ ఆరూట్కెళ్లే బస్సెక్కిముందున్నసింగిల్సీట్లో ఓపుస్తకంలోముఖం పెట్టు క్కూ ర్చుంది.ఆమె కోసమే అన్నట్లు ఎదురుచూస్తున్న లేడీకొలీగ్సంతా,చకచకా బస్సెక్కి సీట్లలో సర్దు క్కూర్చుని, నవీనను పరిశీలించసాగారు. వామనరావ్లా , నేరుగా ఆమెను అడిగే సాహసం, చనువు కూడా వారికిలే కపోయి నాగుండెల్ని  తొక్కేసే క్యూరియాసిటీ ఆపుకోలేక  వారిలో వారు మాట్లాడుకో సాగారు. 
" నిజానికి నవీన్ జంట విడిపోయిందంటావా?ఆముసలి  వామనరావ్ పైత్యమేనంటావా?"  
“ఏమోనోయ్! నాకంతా అయోమయంగా ఉంది మరి." 
" అయోమయ మేంటే బాబూ! ఈ రోజు బాస్  నేనుచేసినపని గురించీ అడగలేదుకానీ- పని చేస్తే ఒట్టు ...మైoడ్ అంతా బ్లాంక్ ఐందనుకో."
" ఐనా అంత అందగాడు , హీరోలా ఉండే ' నవీన్ ' ను ఒదులుకోడం శుధ్ధ తెలివితక్కువ పనే."
" అసలుపరమానందయ్య  వీళ్ళిద్దరికీ  జతకట్టాడు కాని ,నేనే ధైర్యంగా ' నవీన్ ను ప్రపోజ్ చేద్దా మనుకుంటుంటిని  , నాప్లాన్సన్నీ ఆ పరమానందయ్య  యముడిలా చెడగొట్టాడు."
  " ఇప్పుడు పోయిందేముందీ!! ఎటూ విడిపోయారంటున్నారుగా? ఇప్పుడు నీవు ప్రెపోజ్ చెయ్యి " ఫక్కున నవ్వి అంది అరుణ. …… " పోవే ఎంతైనా సెకండ్ హ్యాండ్ మొగుడైపోడూ  !"
 '”ఐతే నేం ? నీకలల రాజు కదా? నీ అభిమాన హీరో , నీమనస్సు దోచిన మనోహరుడు .."
" ఆపవే , ఇంతోటి అందగత్తెను , ఆ  హీరో ఒప్పుకోవద్దూ? రెండోపెళ్ళి కైనా …."
" ఒప్పుకోకేం చేస్తాడే వండిపెట్టను ,ఇల్లు, ఒళ్ళూ చూడను  ఒకరుకావాలిగా?" 
“ ఒట్టి పాతకాలపు పాపమ్మలా మాట్లాడకు, ఐనా 'నవీనకు' నీకూ పోలికెక్కడే ! బంగారం వంటి ఛాయ ,ఐదడుగుల ఆరంగు ళాల పొడవు , తీర్చి దిద్దినట్లుండే ఆ కనుముక్కుతీరు , పొడవాటి నల్ల త్రాచులాంటి ఆజడ !ఎక్కడా ఎక్కువ తక్కువలు లేనిశరీర నిర్మాణం ఆడవారికే మత్తెక్కించే ఆ వయ్యారం ,పైగాచదువు, తెలివి ,మేధస్సు .బాస్ కే సెక్రెటరీ!మనందరికీ మేనేజర్ ,నిజానికి' మొగ నవీన్ కంటే పెద్ద పోస్ట్ , ఎక్కువ జీతం. పూర్వం పి.జి.హోంలో మనతోఉన్నా, ఇపుడు మనకూ బాస్ , కనుకే మనం ఆమెతో చనువుగా ఈ విషయం ప్రస్తావించలేక పోతున్నాం."
" చాలించoడి !! ఎన్నుండి ఏంలాభం ? మొగుడ్ని దక్కించుకోలేని  ఆవయ్యారం  ఉండేం? ,లేకేం ?"
 " అసలు ఇద్దరూ తమ తప్పేలేనట్లు ఊర కుండిపోయారంటే నమ్మబుధ్ధి కావట్లేదు !"
 " నాకో అనుమానo! [ స్వరంతగ్గించి , రహస్యంగా గుసగూస లాడినట్లు ] అసలు అతగాడు మగతనం ఉన్నమగాడేనా! అని."……
.. " ఛ ఛా ఊర్కోవే! మరీ నాపసానిలా మాట్లాడకు.."
" తప్పేమన్నది? ..అది..నిజమేనేమో , పెద్దరికం చేసి పెళ్ళిజరిపించిన పరమానందయ్యకు  కూడా ఏమీ చెప్పక విడిపోయారంటే.. అది చెప్పుకోలేనిదే ఏదో ఐఉంటుంది." 
 " ఏమోనే అతగాడ్నే ఎందుకనుకోవాలి , తనకే ఏమైనాలోపముందేమో! సంసారానికి పనికి రాలేదేమో ! ఉప్పూకారం తినే మగాడు ఊరికే ఎలాఉంటాడేo ! సంసార సుఖమివ్వలేని దాంతో ఎంత మంచి వాడైనాఎలా సర్దుకుపోతాడేo !”
“మగాడు పెళ్ళిచేసుకునేది దానికోసమేగా! అందమున్నంత మాత్రాన కడుక్కు తాగుతాడా ! సన్యాసి జీవితం గడిపేందుకేం అతగాడు మగాడు కాదా! మగతనమున్నవాడుకాదా!? "అంటూ మూతీ ముక్కూ తిప్పితిప్పి యాక్షన్ తోసహా  మాటల బాణాలు వదిలిందివాసంతి ,ఆమెకసలు నవీనంటే పడదు,అందం,తెలివి, జీతం మంచితనం అన్నీఉన్న నవీనను ఆమెతన రైవల్ గా భావిస్తుంది , దేన్లోనూ నవీనకు సరికాని వాసంతి…………
" ఏంటీ ! పదిమందిని కన్న ఆడదానిలా మాట్లాడుతున్నావు వాసంతీ!?"
" నీ కసలు నవీనంటే పడదులే! ఐనా అదివారి వ్యక్తిగత విషయం ,మనమంతావారికాపురంలో దూరి దుమారం లేపడం బావులేదు.ఏకుటుంబంలోఐనామాటామాటారాకపోతుందా?,కొంతకాలముంటే  అవే
సర్దు కుపోతాయి. కాపురాలు నిలబెట్టే విధానాలు ఆలోచించాలిగానీ , విడగొట్టే వక్రపు ఆలోచనలు తగవు." వసంత అంది , ఆమె అక్కాబావావిడిపోడంతో వారికుటుంబంలో ఏర్పడిన తుఫాన్ తెల్సును గనుక..
" అసలు మనం తోటి సహోద్యోగులంగా ,ఆడపిల్లలంగా ‘నవీన ‘ కష్ట మేంటో తెల్సుకునే విధాన మిది కాదు. " అంది ఆనంది.
" మీరందరూ  ఊర్కోండి, నేవెళ్ళి ' నవీన ‘తో మాట్లాడుతా..." అంటూ నవీన దగ్గరకొచ్చింది వసంత. అక్కడపనిచేసే అమ్మాయిలంతా ఒకే పీ.జీ. హోంలో ఉంటారు.అందరూ పెళ్ళీకాని ఆడపిల్లలే. బాబాయ్ ఇంట ఆఫీస్ కుదగ్గరగా వున్ననవీన, వారి పధ్ధతులుకొన్నినచ్చక,ఈ పి.జి.కి మారి కొంత కాలం ఉంది .. నవీన్ తోపెళ్ళి కుదిరాక ఓ అపార్ట్ మెంట్ కొని , దాన్లోకిమారిపోయింది. ఆతర్వాతే పెళ్ళయింది.
వారిమాటలన్నీముందుకూర్చున్ననవీన వింటూనే ఉంది.'   అబ్బ ! ఎంత అసహ్యంగా మాట్లాడు తున్నారు? కాస్త వివేకం , విచక్షణా కూడాలేకుండా! అసలుపెళ్ళికాని ఆడపిల్లలే నావీరు! ఇలాంటి వీరితోనా తానుకొంత కాలం కలసి ఉంది!'  అని ఆశ్చర్యపడి ఓనిర్ణయాని కొచ్చింది నవీన.
తనను పలుకరించను దగ్గరికి వచ్చిన  వసంతతో "వసంతా!మనసేంబావు లేదు,రెండు రోజులు మీ అందరితోకల్సి ఉందామను కుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే! " అంది . దానికి వసంత "ఓస్ !హ్యాపీగా ఉండు ,ఆవిషయం అడగనే నేను నీదగ్గరకు  వస్తా..." అనిచెప్పి “వినండహో! నవీన మనతో కొద్దిరోజులు ఉండను మన పీ.జీ.హోం కొస్తోందహో...." అని పెద్దగా అరిచింది.
అంతా చప్పట్లు చరిచారు. 'నిజానికి నవీన తమతో ఉన్నపుడు ఎంతో బావుండేది. అందరినీ నవ్విస్తూ, బోలెడ న్నికబుర్లు చెప్తూ  సరదాగా గడిచిపోయేది .చాలానిగర్వికూడానవీన   'అనికొందరుమనస్సుల్లో అనుకున్నారు.
**********************

ఆరాత్రి  నవీన కోరి వాసంతి రూం లోనేపడుకుంది , అది రెండుబెడ్స్ మాత్రమేఉండే గది.ఎవరైనా గెస్ట్ వస్తే ఆమెరూంలో షేర్ చేసుకోడం అలవాటు.స్నానం చేసిఆతడిటవల్ ,విడిచినబట్టలు ,ఇన్వేర్స్  సైతం వాసంతి బెడ్ మీద వేసిన నవీనను ఏమీ అనలేక పోయింది వాసంతి.
    మరునాడు ఉదయాన్నేరూంలోవాడే స్లిప్పర్స్ తోబాత్ రూo, కెళ్ళివాటితోనే రూంలో తిరగడం, ఆ తడి అంతారూం లోఅంటినేల తడిగాఐపోడం  , టాయ్ లెట్ కెళ్ళి వాటర్ ఫ్రష్ చేయకుండానే వచ్చిన నవీనను  అదోలా చూసింది  వాసంతి , బ్రష్ చేసుకుని నీరు త్రిప్పకుండా ఉమ్మి ,టూత్ పేస్ట్ నురగ అలానే వాష్ బేసిన్లో వదలిన నవీనను చూసి , ఇహ ఉండలేరక అంది వాసంతి. "ఏంనవీనా !మనస్సుబావులేకున్నాఇలాటాయ్లెట్ ,వాష్బేసిన్   యూజ్ చేసి వాటర్ ఫ్రష్ చేయడం మరచిపోడం బావులేదు  ..." అంది అసహనంగా .
"ఓ ఐ యాం సో సారీ ! " అనింది తప్ప నవీనవెళ్ళి వాటర్ ఫ్రష్ చేయనేలేదు. పైగా "ఈరోజునేను  అరుణ రూం లోఎడ్జస్ట్  అవుతాన్లే  , సోథాంక్స్  ఫర్ గివింగ్ షెల్టర్ ఒన్ నైట్ " అనేసి చక్కా పోయింది.  ఆరోజు శనివారం కావడంతో అంతాలేట్ గాలేచి బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి నవీన జంట గురించీ చర్చలో పడ్డారు.. నవీన ,అరుణ,వసంతల రూంలో వారితోనే ఉంది ,షూతో బెడ్ మీద పడుకోడం, చాక్లెట్లు తిని రేపర్లు బెడ్ మీద వేయడం,కాఫీ తాగిన గ్లాసు కూడా బెడ్ మీదఉంచడంతో కాఫీ ఒలికి పరుపు మీద పడింది.అరుణ అదోలావాసంతి వైపు చూడగా ,వాసంతి ఊర్కోమని సైగ చేసి . " పాపం నవీన మనస్సుబావోలేదోయ్ ! అందుకే అలా కాఫీగ్లాస్ వదిలేసింది.పోనీలే .." అని సర్దింది.
" ఇంతకీ  నవీనా! నీస్వంత విషయమే అనుకో ..మీరిద్దరూ విడిపోయారని అంతా అంటున్నారు., నిజమా ?" అని అడిగింది వసంత ఆసక్తిగా...
ఈలోగాబిలబిలమంటూఅతావచ్చారు,చర్చలుముగించి .  "నవీనా !మాతో ఈపి.జి.లో కొన్నాళ్ళు కలసి ఉన్నావ్!ఒకే ఆఫీస్లో పని చేస్తున్నాం.నీవు నీ తెలివి తేటలు, అవకాశం, కలసి వచ్చి మంచి పోజిషన్లోకి వచ్చావు , ఎక్కువజీతం,హయ్యర్పోస్ట్  తోపాటుగామంచి వాడు, అందగాడు ఐన నవీన్ తో పెళ్ళైంది . "
" అంతేనా పెళ్ళికి ముందే ఓసంవత్సరంపాటు ఒకరిఅభిప్రాయాలు ఒకరు తెల్సుకుని ,ఒకరు ఫ్లాట్ కొంటే , మరొకరు కారు కొన్నారు.జీవితాన్నిఎలాగడపాలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇద్దరి తల్లి దండ్రులను ఒప్పించి , వారి అవసరాలు తీర్చను కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఎవరి బ్యాంకి బ్యాలెన్సులు వారివైనా ఇద్దరూకల్సి ఖర్చుచేయనూ పరస్పరం అంగీకరించారు...."
" ఒకరి అభిప్రాయాలను ఒకరు అర్ధం చేసుకుని గౌరవించాలనీ , ఒకర్నొకరు అనవసరంగా విమర్శించు కోరాదనీ,ఒకరికి తెలీకుండా ఒకరుఏమీ చేయరాదనీ..  ఒకరిఉద్యోగ భవిష్యత్తుకు మరొకరు అడ్డు కారాదని ఇంకా ఏవేవో చాలావిషయాలు చర్చించుకుని నిర్ణయాలుతీసుకున్నారు ... చివరకు పిల్లల్ను కనేందుకు కూడ ఒక పధకం నిర్ణయించుకున్నారు అందరికీ ఆదర్శగాఉండేలా వివాహం చేసుకున్నారు , అవన్నీ ఏమైనట్లు? “
  " ఇద్దరి కిద్దరూ అందమైనవారే! పెద్ద జీతగాళ్ళే! తెలివైనవారే! కాకపోతే నీవు ' నవీన్ ' కంటే కొంచేం పెద్ద పొజిషన్లో ఉన్నావంతే!"…
..  "  మీ ఇద్దరి ఉద్యోగాల్లా మీ ఇద్దరి పేర్లు  కలవడమూ చిత్రమే!"
" ఏడాదికాలేదు ! విడిపోయారనే మాటేంటి ! “ ………
…… “ఇదీ విచిత్రమే! "? "
" నిన్ను చేసుకోక పోతే మనలో చాలామంది అతగాడిని చేసుకోవాలనే తలంపుతో ఉన్న విషయం బహుశానీకు తెలీదేమో !"   
" ఏమైందో చెప్పవా!? మేమంతా టెన్షన్ పడలేక చచ్చిపోతున్నాం ..." అంటూ ఇహ ఉండబట్టలేక  కక్కేశారు వారిమనస్సులో విషయాలు..
“ నాకు మరోరోజు గడువీయండి ...." అందినవ్వుతూ నవీన.అంతా ' సరే ' నని లంచ్ కి వెళ్ళి పోయారు. లంచ్ కోసం అంతాలాంగ్ డైనింగ్ టేబుల్ ముందుకూర్చున్నారు.అంతాభోజనాలుమొదలెట్ట బోతుండగా నవీన పేద్దగా దగ్గి ,ఆతర్వాత తుమ్మింది,నోటికి ముక్కుకూ చేయిగానీ , కర్ఛీఫ్ గానీ అడ్డు పెట్టుకోలేదు...ఆమెతుమ్ము,దగ్గుల ఉమ్మి డైనింగ్ టేబుల్పైన ఉన్నప్లేట్స్లోను,మంచినీళ్ళగ్లాసుల్లోనూ పడింది. అంతా " ఛ ఛా .. వాటిజ్ దిస్ ? మాకంతా గుడ్ హ్యాబిట్స్ గురించిన నీతులు వల్లించేదానివి కదా ఏమైంది నీకు! , టేబుల్ మ్యానర్స్ తెలీదా? ఇలా చేస్తున్నావ్?" ……….
." ఇప్పుడు మేమంతా ఎలా ఇక్కడ భోజనాలు చేయాలి"
" ఏదో కష్టంలో ఉన్నావనీ , ఓదార్చుదామనీ పిలిచాం..."
" ఔనోయ్ ! నిన్నరాత్రి తుడుచుకున్న టవల్ , విడిచిన తడి బట్టలు, ఇన్నర్స్ తోసహా అన్నీ నా బెడ్ మీదవేసింది , ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చిందో చెప్పలేనుఎలాగోభరించాను.. . బాత్రూంలోవాడిన స్లిప్పర్స్  తో రూం లోతిరగడం ..ఇంకా... వద్దులే లంచ్ వద్ద ఉన్నారు ..చెప్పలేను.. బాబోయ్ ! అసలు ఆ’నవీనే ‘నా !అని అనుమానంవస్తోం దిస్మీ ! రాత్రంతా నిద్రలేదు ,ఒకే గురకలు!బాబోయ్ ! ”
ఇలా అందరూ తలోమాటాఅంటుండగా ”ఆపండి !చాలిక .స్వవిషయమైన నాసంసారం గురించీ నిన్నటినుండీ నాకు వినీవిని పించకుండా అనేక వ్యాఖ్యానాలు , విమర్శలూ , వెటకారాలూ చేశారు, ఔనా? నేను చేసుకోక పోతే నవీన్నుచేసుకోవాలను కున్నట్లూ ,నాకు పొగరనీ, గర్వమనీ , నాఅందం వేస్టనీ ఎన్నెన్నోఅన్నారు,చివరకు నవీన్కు మగతనం లేదనో ,నేను సంసారానికి పనికిరానిదాన్ననీ ఎన్నెన్నో గ్యాసిప్స్ చెప్పుకున్నారు.మీమ్యానేజర్ ననీ ,మీ బాస్ వంటిదాన్ననీమరచి , మీరే నన్ను పిలిచి, నాస్వవిషయం ప్రస్తావించినదీ మరచి,మీకు అసౌకర్యం కలిగిందని కోపంతో ఏదేదో అంటు న్నారు. దేనికీ పనికి రానిదానిలా తీసిపారేస్తున్నారు.నేచెప్పేది వింటే మీకు'ఓస్ఇందుకేనా ?!' అన్పించవచ్చు.కాని జీవితంలో ఒక్కోరుఒక్కోదానికి ప్రాధాన్యత నిస్తారు .మీకంతా తెల్సు, నాకు నీ ట్ నెస్ ముఖ్య మని , డబ్బుకూ మరిదేనికీ అంత  ప్రాముఖ్య మివ్వననీను, ఆ కారణంగానే మాబాబాయ్ ఇంటినే వదలి ఈపి.జిహోంకు వచ్చిన విషయమూ మీకుతెల్సు.. నిన్నటి నుండీ ఒక్కరోజు నేను మీ రూంస్లో చేసిన పనులకు మీరింతగా బాధపడి పోతున్నారే! నేను ఇలాంటివి సంవత్సరం బట్టీ అనుభ విస్తూ, అతడిని మార్చాలనీ,నేర్పాలనీ ప్రయత్నించి విఫలమై , భరించలేక , విసిగి పోయి విడిపోవా లనుకుంటే,దానికిమీరంతా ..అసలు విషయమే తెలీకుండానే ఎన్నెన్నివ్యాఖ్యానాలు చేశారు !? ఇలా ఏదో ఒకటి అంటారనే  నేనుమౌనంగా మీకు దూరదూరంగా ఉన్నామీరు నన్ను వదలక మాటల తో హింసించారు. ఇదాస్నేహమంటే?!ఇదా సహోద్యోగికి మీరుచూపే సింపతీ?! ! ఇదేనాపెళ్ళికానిఆడ పిల్లల లక్షణం!?గుడ్బైటుఆల్”అంటూ అక్కడి నుంచీ లేచి బయటికి నడిచిందినవీన.      
----------------******************* ***********************------------------
ఒక్కవారంలోనే మిస్టర్.నవీన్ ఆఫీస్ వర్క్ మీద అమెరికా వెళ్ళవలసి వచ్చింది.నవీన్అమెరికా వెళ్ళే ముందుకూడా వామనరావ్,పరమానందయ్యగార్లు నవీన జంటనుకలపాలని ఎంతో ప్రయత్నించారు. కానీవారి ప్రయత్నం ఫలించలేదు. "ఈజన్మకు నాగతింతే వదిలేయండి సార్!" కళ్ళనీళ్ళతో చేతులు జోడించాడునవీన్. చెట్టంత మగాడి కంటనీరు చూచి చలించిపోయారు వామన రావ్, పరమా నందయ్యకూడానూ. ఐతే చేతులు దాటి పోయినవ్యవహారమాయె! ఏంచేయలేక లోలోన ఎంతో బాధపడ్డారు. నవీన్ చికాగో వెళ్ళి పోయాడు. తర్వాత మరోవారానికే లేడీనవీనకూడా అమెరికా వెళ్ళి పోయింది. ఇద్దరూ US వెళ్ళగానే తాత్కాలికంగా ఆఫీసువారి నోట ,మనస్సుల్లోనూ వారికధ మరుగున పడిపోయింది.
అలా మూడుసం.కాగానే ఓ ఫైన్మార్నింగ్ అంతా గాలికూడాపీల్చుకోడం ఆపేసి సీరియస్ గా ఆఫీస్ పనుల్లోమునిగిపోయి చీమ చిటుక్కుమన్నావిన్పించేత నిశ్శబ్దంతాండవిస్తున్నసమయంలో ఒక స్ర్టోలర్ లోముద్దు లొలికే ఏడాది కుర్రాడితో ఒకజంట ప్రవేసించింది ఆఫీస్ లోస్ర్టోలర్ లోని పసివాడి ‘ఊ..ఊ..' లకు 'అత్తత్త 'అనే మాటలకు,అంతా క్యాబిన్స్ లోంచీ తలలు బయటికి పెట్టి చూసి, ఒక్క గెంతున బయటికి దూకారు……. "ఓ హుర్రే!" ఏంటీ వింత!" ….. "ఆశ్చర్యం పరమాశ్చర్యం " …….
" ఇది కల కాదు గదా!" "నేను మేలుకునే ఉన్నానా! “ " తొమ్మిదో వింత కాదు గదా!"
." నేను చూస్తున్నది నిజమా!" … " ఏదీ గిచ్చుకోనీ!"……… ……
“అయ్యా! వామనరావ్ ! నీ జోస్యం ఫలించిందయ్యా!" అంటూ బాస్కూడా బయటి కొచ్చిఆ జంటతో చేతులు కలిపాడు " ఏమోయ్! మీరు నిజంగానే. కలిశారుగా!..!"
" అసలేం జరిగిందో చెప్పండర్రా! నా బుర్ర తిరిగిపోతోంది " అంటూ అంతా ఎగబడ్డారు.
" దయచేసి అంతా కూర్చొండి! మీరు చూస్తున్నది నిజమే!" అంటూ ధృవీకరించి నవీన్ అందరితో చేతులు కలిపాడు. లేడీ ఎంప్లాయీస్ అంతా వచ్చి నవీనను చుట్టేశారు. నవీన నయనానందంగా నవ్వింది. " ఏముందోయ్! వడ్లగింజలో బియ్యపుగింజ! అమెరికా వెళ్ళాక కానీ అడ్జస్ట్ మెంట్ ఏంటో పూర్తిగా తెలీలేదు. అడ్జస్ట్ మెంటే జీవితమని తెల్సివచ్చింది." అంది తల వంచుకుని .

"కాదు కాదు మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలో ఇతరులతో పేచీలు లేకుండేందుకు ఎలాంటి అలవాట్లు అలవరచుకోవాలో అమెరికా వెళ్ళాకే తెల్సుకున్నాను .జీవించను కేవలం చదువు, ఉద్యోగమే కాక సమాజంలో ఇతరులతో కలసి బ్రతకను నేర్చుకోవలసిన పధ్ధతులు తెలుసుకోడంవల్ల నాజీవితంలో తిరిగి అమృతం కురిసింది. మన అలవాట్లు ఇతరులకు ఇబ్బందికలిగించకుంటే ఎంత ఆనందం స్వంత మవుతుందో దానికి ఇడుగో వీడేసాక్షి " అంటూ కొడుకునెత్తి చూపాడు అందరికీ. అంతా క్లాప్స్ ఇస్తూ వారి ఆనందాన్ని తెలిపారు. అప్పుడే లోపలికొచ్చిన పరమానందయ్య, వామన రావ్ వైపూ, బాస్ భూపాల రావు వైపు చూస్తూ మీసాలు దువ్వుకోడంలో ఉన్న మర్మ మెవ్వరికీ తెలీదు , అతడి ప్రోద్బలంతోనే భూపాల్ రావు వారిని విడివిడిగా ఒకే ఆఫీస్ కు అమెరికా పంపిన విషయం.
 

 
 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech