Sujanaranjani
           
  సారస్వతం  
   
 

                                                            రచన : పి.వి.లక్ష్మణరావు, తెలుగుఉపన్యాసకులు,
                                                                        రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
 

 

          

 జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే దండకారణ్యే కృష్ణాగోదావరీ మధ్యదేశే..

 
ప్రాచీన భారతదేశ చరిత్రకు ఉపయుక్తంగా ఉన్న విషయాలెన్నో పురాణ వాఙ్మయంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా భౌగోళిక విన్యాసం గురించి ప్రశంస కూడా ఉన్నది. మన ప్రాచీనులు భూభాగాన్ని ఏడు ద్వీపాలు గాను, ఏడు సముద్రాలుగానూ విభజించారు. 'సప్త ద్వీపావసుమతీ' (జంబు,ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కర) అని మార్కండేయ పురాణంలోనూ, 'సప్త ద్వీపవతీ మహీ' అని బ్రహ్మాండ పురాణంలోనూ కలదు. పురాణాలలో వర్ణింపబడిన ప్రకారం జంబూ ద్వీపమే ఈ ఏడు ద్వీపాలకు మధ్యలో ఉన్నది. ఈ జంబూ ద్వీపమే ఇప్పటి ఆసియా ఖండానికి, దానికి తూర్పు దక్షిణంలో ఉన్న ద్వీపాలకు సరి పోతున్నది. ఈ జంబూ ద్వీపంలో మొదటి పదం నేటి జమ్ము కాశ్మీర్ అను రాష్ట్రంలోని జమ్మూ విభాగంలో శేషించి ఉన్నది.

          జంబూ ద్వీపం తొమ్మిది వర్షాలుగా విభజింపబడింది. ఈ జంబూ ద్వీపంలో ఏడు కుల పర్వతాలు న్నాయి. అవి హిమవంతం, హేమకూటం, నిషధం, మేరువు, నీలగిరి, శ్వేతాచలం, శ్రుంగవంతం అనేవి. ఈ కులపర్వతాలనంటుకొని ఏడు వర్షములున్నాయి. అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కిం పురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. హిమవన్నగానికి దక్షిణంగా, సముద్రానికి ఉత్తరంగా భరత వర్షమున్నదని, ఈ భరత వర్షమునకు తూర్పున కిరాతులు, పశ్చిమాన యవనులు, మధ్యన బ్రాహ్మణ, క్షత్రి య, వైశ్య, శూద్రులు ఉన్నారని వాయుపురాణంలో రాయబడినది. ఈ భరత వర్షాంతర భాగమే నేటి భరత ఖండం, హిందూ దేశమని మన రాజ్యాంగ శాసనంలో ఉన్నది.

          భరతవర్షము పురాణాల ప్రకారం ఇంద్ర, కేతుమంత, తామ్ర వర్ణ, గభస్తిమంత, నాగ, సౌమ్య, గాంధర్వ, వారుణ, కుమారికా అను తొమ్మిది ద్వీపాలుగా విభజించబడింది. నాటి కుమారికా ద్వీపమే నేటి హిందూ దేశం తో సరిపోవును. ఈ కుమారికా ద్వీపము మరలా ఏడు విషయాలుగా విభజించబడింది. అవి మధ్య, ఉదీచ్య, ప్రాచ్య, దక్షిణాపథ, అపరాంత, వింధ్య, హిమాలయ ప్రదేశములు. ఇందలి దక్షిణాపాతమే నేటి దక్కన్ పీఠ భూమి. ఈ దక్షిణాపథ దేశాలలో పాండ్య, కేరళ, చోళ, కూల్య, మహారాష్ట్ర, మహిష, కళింగ, విదర్భ, కుండల, ఆంధ్ర దేశములు తెలుపబడినవి. మార్కండేయ పురాణాదులలో ఆంధ్ర దేశము దక్షిణాపథములలో చెప్పబడి నది. కానీ నాటి దేశముల యెల్లలు పురాణములలో వివరింపబడలేదు. స్థల నిర్దేశాన్ననుసరించి ఆంధ్రదేశం కళింగ దేశానికి దక్షిణం గాను, ద్రావిడ దేశానికి ఉత్తరం గాను, కర్ణాటక మహారాష్ట్ర దేశాలకు పశ్చి మాన ఉన్నట్లు మాత్రం చెప్పవచ్చును. ఈ స్థలనిర్దేశం సంస్కృత కావ్యయుగం  తర్వాతి  శిలాశాసనాలలో స్పష్టం చేయబడినది.

          నేటికిని మన సంకల్పంలో “జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే దండకారణ్యే కృష్ణాగోదావరీ మధ్య దేశే” అని చెప్పుకుంటాం. నేటి ఆంధ్రదేశం సగం భాగం దండకారణ్యంలోనూ, సగం భాగం కిష్కింధరాజ్యం లోనూ ఇమిడి ఉన్నది. వింధ్య పర్వతానికి దక్షిణంగా, కృష్ణాస్రవంతికి ఉత్తరంగా, మలయా,మహేంద్ర పర్వ తాలకు మధ్యమంగా దండకారణ్య మున్నది. దానిలో తూర్పు భాగం జనస్థానం, కృష్ణకు దక్షిణంగా కిష్కింధా రాజ్యముండెను. రామాయణ కాలమున రావణుని సోదరుడగు ఖరుడు ఈ జనస్థానానికి అధిపతి. ఈ జన స్థానమందే పంచవటి కలదు. శ్రీ రామభద్రుడు సీతా సౌమిత్రి సమేతుడై ఈ పంచవటి యందే కొంతకాలం కాపు రముండెను. ఇచ్చటనే సీతాపహరణం జరిగినది. ఈ పంచవటి ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరీ మండలంలోని భద్రాచల క్షేత్రానికి ఉత్తరంగా ఇరవై రెండు మైళ్ళు దూరంలో ఉన్నది. శ్రీమద్రామాయణం, కిష్కింధాకాండలో హనుమదాదులను సీతను వెదకటానికి దక్షిణ దిక్కుకు పోయి, దండ కార ణ్యానికి వెళ్ళి అక్కడ గిరివన దుర్గ ముల, గోదావరీ తీరముల నండ్ర, పుండ్ర, కేరళ, కురుదేశముల పరికించి రండని ఆజ్ఞాపించినట్లు గలదు. 

          ఇకపోతే తెలుగు ప్రాచీన చరిత్రలో అంధ్రశబ్దం మొట్ట మొదట జాతివాచకంగా. తర్వాత దేశవాచకం గా,తదనంతరం భాషావాచకంగా ఏ విధంగా ప్రయోగింపబడిందో పరిశీలించడం ఈ వ్యాసోద్దేశం.  

1. జాతివాచకంగా ఆంధ్రశబ్దం.  

1.1. మొట్ట మొదటి సారిగా ఆంధ్రశబ్దం ఋగ్వేద కాలానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో అనగా క్రీ.పూ 800 - 600లో శునశ్శేపుని వృత్తాంతంలో కనిపిస్తుంది. బ్రాహ్మణాలన్నింటికంటే ఐతరేయ బ్రాహ్మణం చాలా ప్రాచీన మైంది. ఐతరేయ బ్రాహ్మణంలో చాలా ఉపాఖ్యానాలు ఉన్నాయి.వీటిలో ప్రసిద్ధమైనది శునశ్శేపోపాఖ్యానం (7.13.18) ఈ ఉపాఖ్యానానికి సాయణాచార్యులు భాష్యం రాశారు.  

1.1.1. ఐతరేయ బ్రాహ్మణంలో శునశ్శేపుని వృత్తాంతంలో ఆంధ్రులు ప్రసక్తి వచ్చిన అంశం ఈ క్రింది విధంగా ఉంది."తస్యహా విశ్వామిత్రస్యైక శతం పుత్రా ఆసు:,తే ఏతేఐన్ద్ర: పుణ్డ్రా : పుళిన్దా మూతిబా, ఇత్యుదన్త్యా బహవోభవన్తి,వైశ్వామిత్రా దస్యూనాం భూయిష్ఠా!" (ఐతరేయ బ్రాహ్మణము సంచిక -7,అధ్యాయం 13 ఖండిక -18)          

          విశ్వామిత్రుడికి వందమంది కొడుకులు .శునశ్శేపుని తమ జ్యేష్ఠపుత్రుడుగా అంగీకరించడానికి నిరా కరించిన మొదటి యాభైమంది పుత్రులనూ అనార్యజాతులైన ఆంధ్ర,పుండ్ర,పుళింద,శబర,మూతిబ మొద లైన జాతులలో కలిసిపొండని విశ్వామిత్రుడు శపించి బహిష్కరించినట్లుగా ఐతరేయ బ్రాహ్మణంలో ఒక ఐతి హ్యం ఉంది. ఈ వృత్తాంతంలో ఆంధ్రశబ్దం మనకు జాతి వాచకంగా కనిపిస్తుంది.మనకు తెలిసినంతవరకు సంస్కృతంలో ఆంధ్రశబ్దం మొట్టమొదట ప్రయోగింపబడిన సందర్భం ఇదే.దీనివల్ల ఆంధ్రుల ప్రాచీనత కూడా తెలుస్తుంది.  

1.2 వ్యాస భారతంలో ఆంధ్రుల ప్రసక్తి :  

1.2.1. సభాపర్వంలో సహదేవుని దక్షిణ దిగ్విజయ సందర్భంలో ఆంధ్రుల ప్రసక్తి ఉన్నది. ఇందులో సహదేవు డు పౌండ్రుల్ని,ద్రవిడుల్ని,కేరళీయుల్ని,ఆంధ్రుల్ని,తాలవనుల్ని,కళింగుల్ని,ఉష్ట్రకర్ణికుల్ని,ఆటవికుల్ని, యవనుల్ని ఓడించినట్లు ఉంది,ఆంధ్రులు అని చెప్పడం వల్ల ఇక్కడ ఆంధ్రశబ్దం జాతివాచక మని చెప్ప వచ్చు.  

1.2.2. అరణ్యపర్వంలో మార్కండేయుడు ధర్మరాజుతో కలియుగ ధర్మాన్ని చెప్పే సందర్భంలో ఆంధ్రులు, శకులు,పుళిందులు,యవనులు,కాంభోజులు,ఔర్ణికులు,శుద్రులు,అభీరులు పాపాత్ములని ఉంది. ఇక్కడ ఆంధ్రశబ్దం జాతివాచకంగా ఉంది.  

1.2.3. భారతదేశంలో నదీ,దేశ,జనపద నామాల్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే సందర్భంలో ఆంధ్రుల ప్రస్తావన ఈ విధంగా ఉంది. ఔషా : పుణ్రా : ససెరన్రా : పార్వతీయాశ్చ మారిష వనవాసుల,ఉన్నతకుల, మహిషకుల,మూషకుల జనపదాలున్నాయని ఉంది.  

1.2.4. కర్ణపర్వంలో పాండ్యవధ సందర్బంలో పాండ్యరాజు కౌరవసైన్యంలో పుళిందుల్ని,ఖసుల్ని,బాహ్లీకుల్ని, నిషాదుల్ని,ఆంధ్రకుల్ని,కుంతలుల్ని,దాక్షిణాత్యుల్ని,భోజుల్ని చంపినట్లు ఉంది. ఆంధ్రీకుల్ని దిగ్విజయ సందర్భంలో ఆంధ్రశబ్దం జాతివాచకం.  

1.2.5.అశ్వమేధపర్వంలోఅర్జునునిదిగ్విజయసందర్భంలోఆంధ్రశబ్దంజాతివాచకంలాఇలాప్రయోగించబడింది. ఆంధ్రులతో,ద్రవిడులతో,ఔద్రులతో,మాహిషికులతో,కోలగిరేయులతో యుద్ధం అయినట్లుగా ఉంది. దీనిని బట్టి వ్యాసుని కాలం నుండే ఆంధ్రశబ్దం జాతివాచకంగా వాడబడి ప్రాచీనత కలిగి ఉన్నదని తెలుస్తుంది.  

1.3. సంస్కృతం భాగవతంలో శుకమహర్షి హరిస్తుతి గావిస్తూ కిరాతులు,హూణులు,ఆంధ్రులు,పుళిం దులు మొదలైన జాతులవారు పాపవిముక్తి కోసం హరిని ఆశ్రయించినట్లుగా వర్ణించబడింది. కిరాత హూణాం ధ్ర పుళిందపులస్కా,అభీరకంతాయవనా: కషాదయ:" ఇందులో ఆంధ్రులు అనడం వల్ల ఆంధ్ర శబ్దం జాతి వాచకంగా చెప్పవచ్చు.(శ్రీమద్భాగవతమ్,1914 ద్వితీయస్కందం,14వఅధ్యాయం.శ్లో.18)  

1.4. మనువు తన మనుస్మృతిలో కారవరస్త్రీవల్ల వైదేహునికి జన్మించి వేటాడి జీవించేవాళ్ళు ఆంధ్రులని చెప్పాడు. మనస్మృతిని బట్టి ఆంధ్రశబ్దం జాతిపరంగా కనిపిస్తుంది. "కారవరోనిషదస్తుచర్మాకారప్రసూయతే

వైదేహికాన్ద్రయేదౌబహిర్గామప్రతిశ్రయౌ(మనుస్మృతి - అధ్యా10.శ్లో36)

1.5. భరతుడు నాట్యశాస్త్రంలో పాత్రోచితభాషను గూర్చి చర్చిస్తూ బర్బర,కిరాత,ఆంధ్ర,ద్రావిడ లేదా ద్రమిల జాతుల వారు శౌరసేని వంటి ప్రాకృతభాషల్నిఉపయోగించడానికి వీలులేదని నిషేధించాడు. ఇక్కడ ఆంధ్రపదం జాతివాచకంగా కనిపిస్తుంది.

1.6. భరతుడు నాట్యశాస్త్రంలో ఆంధ్రులను జాతిపరంగా పేర్కొన్నాడని పుల్లెల శ్రీరామచంద్రుడు అలంకారశాస్త్ర చరిత్రలో పేర్కొన్నాడు.

1.7. క్రీ.పూ.300 సంవత్సరంలో చంద్రగుప్తమౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకురాయబారి మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో మౌర్యుల తర్వాత ఆంధ్రులు చెప్పుకోదగ్గ ముప్పది దుర్గాలు లక్షకాల్బలం, రెండువేల అశ్వదళం, వేయిఏనుగుల చతురంగబలం కలిగి వున్నారని చెప్పాడు.  

1.8. క్రీ.పూ.3వశతాబ్దంలో అశోకుడు వేయించిన 13వ ధర్మశిలాశాసనంలో ఆంధ్రులు అశోకుని సామ్రాజ్యం లోని వారనీ ఆయన ధర్మబోధల్ని అనుసరించారని ఉంది.

1.9. క్రీ.శ. 1 వ శతాబ్దంలో భరతుడు తన నాట్యశాస్త్రంలో ఆంధ్ర,ద్రమిల జాతులను పేర్కొన్నాడు.

1.10. క్రీ.శ.2 వ శతాబ్దంలో శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా వాయు, బ్రహ్మండ, మత్స్య పురా ణాల్లో పేర్కొనబడింది. శాతవాహన రాజులే ఆంధ్ర భృత్యులుగా పిలువబడ్డారు.

1.11. క్రీ.శ.9 వ శతాబ్దానికి చెందిన ఉద్యోతనుడు తన కువలయమాల అనే ప్రాకృత గ్రంధంలో ఆంధ్రులు అంద మైన వారనీ, ఆహార, విహార ప్రియులని వర్ణించాడు.

అంధర : ప్రముఖ గ్రీకు చరిత్ర కారుడైన “ప్లినీ” అంధర జాతివారిని వర్ణించడమే కాక వారి గుణగణాల్ని, వైభ వాన్ని కూడా ప్రశంసించాడు. వారికి లక్ష కాల్బలం, రెండువేల అశ్వదళం, వేయి ఏనుగులు, 80 దుర్గాలు గల పురములున్నాయని పేర్కొన్నాడు. (సోమయాజి, గంటిజోగి ఆంధ్రభాషా వికాసం. పుట 10)

అంధక: వ్యాస భారతం ఆది,అరణ్య పర్వాలలో అంధకుల ప్రస్తావన ఉంది. ద్రౌపది స్వయంవరానికి వచ్చిన వారిలో అంధకులు ఉన్నారు.(ఆది.ప.అధ్యా.186.శ్లో.8)(సోమయాజి,గంటిజోగి ఆంధ్రభాషా వికాసం.)

ఆంధ్రక: భారతంలో కర్ణపర్వంలో ఆంధ్రక, పుళింద, కిరాతాది, మ్లేచ్చ జాతులవారు కౌరవ పక్షంలో యుద్ధం చేశారనీ వారు పరాక్రమవంతులనీ ఉంది.

          వివిధ గ్రంధాలలో వాడబడిన ఆంధ్ర, అంధర, అంధక, ఆంధ్రక అనే పదాలు ఏకజాతి వాచకాలని తెలు స్తుంది. ప్రాచీన వాఙ్మయ శాసనాలలో ఆంధ్రశబ్దం మొదట జాతివాచకంగా కనిపిస్తుంది.

దేశవాచకంగా ఆంధ్రశబ్దం :

        ఆంధ్రులు నివసిస్తున్న ప్రాంతాన్నిఆంధ్రదేశం అని అంటారు.ఆంధ్రదేశం అనే సమాసంతో పాటు అంధా పధం,అంధరట్టి,ఆంధ్రపథం,ఆంధ్రమండలం,ఆంధ్ర విషయం మొదలైనవి దేశవాచకాలుగా కనబడుతున్నాయి.

2.1. వాల్మీకి రామాయణం లో కిష్కిండ కాండలో సుగ్రీవుడు వానరుల్ని దక్షిణ దిక్కుకు పంపుతూ సీతకోసం వెదకవలసిన రాజ్యాల్లో ఆంధ్ర, పుండ్ర, పాండ్య దేశాలను పేర్కొన్నాడు.  "తధైవా ఆంధ్రశ్చ పుణ్డ్రాంశ్చ చోళోన్ పాండ్యాన్ త్య కేరళాన్, అయోముఖశ్చ గన్తవ్యః పర్వతో ధాతుమణ్డిత:" (6 -13 శ్లో.41 స.కి.కాండ). ఇక్కడ ఆంధ్ర శబ్దం దేశవాచకంగా వాడబడింది.

2.2. భాగవతంలో బలిచక్రవర్తి కుమారులైన ఆరుగురు తమ పేర్లతో ప్రత్యేక రాజ్యాలు స్థాపించుకున్నారని వారిలో ఆంధ్రుడనేవాడు ఆంధ్రరాజ్యాన్ని స్థాపించాడని ఉంది.యయాతి కొడుకులైన అనువువంశంలో పుట్టిన బలి అనే వానికి అంగ,వంగ,కళింగ,సింహ,పుండ్ర,ఆంధ్రులు ఆరుగురు కుమారులనీ,వారి పేరుల మీదుగా అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్ర అనే ఆరు దేశాలు వెలసినట్లు ఉంది. అంతేగాక ఇందలి ఆంధ్రరాజు దశరథుడు.

3. క్రీ.శ. 234 నాటి శివస్కంధవర్మ మైదవోలు శాననంలో "అంధాపథీయోగామోవిరిపమ్" అనే వాక్యాన్ని బట్టి ఆంధ్రపదం దేశవాకమని తెలుస్తుంది.

4. క్రీ.శ. 553 సంవత్సరం నందలి జవానుపూరు శిలాశాసనంలో "ప్రతిరంధ్రమాంధ్రుపతివా" అనీ, "అంధ్రసేనా భటేషు"అని పేర్కొనబడింది. అంధ్రము, ఆంధ్రము అను రెండు నామాలు శాసనాలలో ఉన్నాయి. అంధ్రమే మొదటిదనీ, ఆంధ్రం తర్వాతదనీ ఒక ఊహ కూడా ఉంది.

5. క్రీ.శ. 555 నాటి ఈశానవర్మ వేయించిన హరహశసనంలో "జిత్వాంధ్రాధిపతిమ్" అని ఉంది.

6. క్రీ.శ. 600 ప్రాంతం వాడైన వరాహమిహిరుడు బృహత్సంహితలో "కౌశిక విదర్భ వత్సాంధ్ర ఛేదికాశ్చో ర్వితండకా" అని ఆంధ్రదేశాన్ని పేర్కొన్నాడు.

7. క్రీ.శ. 7వ శతాబ్ధంలో భారతదేశంలో పర్యటించిన హుయాన్ త్సాంగ్ అను చైనా యాత్రికుని రచనల్లో ఆంధ్ర దేశ ప్రసక్తి కనబడుతుంది.

8. క్రీ.శ 1072వ సంవత్సరంలో యశకర్న దేవుని "ఖైరా" తామ్రశాసనంలో "అంధ్రాధీశమరంధ్ర దోర్విలసితమ్ భూవల్లి గోదావరి" అని వ్రాయబడింది.తర్వాత ఆంధ్రదేశమనే పేరుతో అనేక ప్రసిద్ధ గ్రంధాలు వెలువడ్డాయి.

9. క్రీశ 340 లో మల్లిదేవ నంది వర్మ వేయించిన దానశాసనంలో ఆంధ్రమండలే ద్వాదశ సహస్ర గ్రామ సప్తార్త లక్షవిషయాధిపతే!"అనిఉంది. ఆంధ్రమండలమంటేఆంధ్రదేశమే. క్రీ.శ. 234 నాటి ఆంధ్రపదం క్రీ.శ. 340 నాటికి ఆంధ్ర మండలమైంది.

10.వీరరాజేంద్రచోళుని ప్రశంసించే ఒకశాసనంలో క్రీ.శ. 1169 లో'ఆంధ్రమండలమ్'అని ఉంది. ఆంధ్ర రాజుల అనంతరం రాజ్యానికి వచ్చిన పల్లవ రాజుల కాలంలో'ఆంధ్రపధము'అనీ అనంతరం'ఆంధ్ర మండ లము'అనీ మొదలగు పదాలతో ఆంధ్రదేశమని వ్యవహరింపబడింది. చారిత్రక యుగంలో ఆంధ్రపదం దేశ పరంగా అనేక గ్రంథాలలోను, శాసనాల్లోనూ కన్పిస్తుంది. ఆంధ్రపదం మొదట జాతిపరమై, తర్వాతదేశ పర మైంది.  

3.భాషావాచకంగాఆంధ్రపదం

3.1.గుంటూరులోని అమరావతి స్తూపం చాలా ప్రాచీన మైంది. దాన్నిమూడు అంచెలుగా కట్టారు. క్రీ.పూ. 200 మొదలుకొని క్రీ.శ. 200 లోపు ఈనిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన ఒక రాతిఫలకం మీద 'నాగబు' అనేమాట వాడబడింది. ఇదేమనకులభించినమొట్టమొదటితెలుగుమాట.  

3.2.క్రీ.పూ. 200 నాటి గాథాసప్తశతిలో తెలుగుపదాల వాడకం కనిపిస్తుంది. ప్రాకృత భాషలో వచ్చిన వాఙ్మయంలో చెప్పుకోదగింది హాలుని గాథాసప్తశతి. శాతవాహన చక్రవర్తి అయిన హాలుడు కవిపండితుడు. ఈయన ఎందరోకవుల్ని, పండితుల్ని పోషించాడు. హాలుని గాథాసప్తశతిలో ప్రముఖంగా తెలుగుపదాలు కనిపిస్తాయి. అత్త,పిల్ల,మోడి,పొడి,పొట్ట,కరణి మొదలైన తెలుగుమాటలున్నాయి. క్రీ.పూ.200 నాటికే తెలుగు పదాలు ఉన్నాయనటానికి ఈ పదాలే సాక్ష్యం. గోదావరి,నర్మదానదుల ప్రస్తావన కూడా ఉంది. ఆ కాలం నాటికే ప్రజలు స్పష్టంగా తెలుగుభాషను మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుమాటలు కొన్ని ప్రాకృతంలోకి వచ్చి చేరాయి. ఇందులోని పదాలు ఆనాడు ఆంధ్రభాష ఉందని నిరూపిస్తున్నాయి.  

3.3. శాతవాహనుల మొదటిరాజధాని ఔరంగాబాదులోని ప్రతిష్టానపురమైన నేటి “పైఠాన్” లో ఆనాడు ప్రాకృ తం అధికార భాష. అయితే దేశభాష వేరేగా ఉండేది. అది తెలుగే అని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయి. శాతవాహన కాలానికి చెందిన గుణాఢ్యుడు శర్వవర్మతో కలిగిన వివాదంలో తాను ఓడిపోతే సంస్కృతాన్ని ప్రాకృతాన్ని, దేశభాషను మాట్లాడనని ప్రతిజ్ఞ పూనాడనీ అప్పటి దేశభాష ఆంధ్రభాషే అయివుండవచ్చు. ఎందుకంటే అప్పటికి ఈ సంభాషణ జరిగిన పైఠాన్లో మరాఠి భాష లేదు. దీనివల్ల గుణాఢ్యుని కాలం లోనే దేశ భాషగా ఆంధ్రభాష ఉందని తెలుస్తుంది. (సుందరం, ఆర్.వి.యస్. పుట25)

3.4. క్రీ.శ.1వ శతాబ్ధంలో భరతుడు నాట్యశాస్త్రంలో నాటకంలో పాత్రోచితభాషను గూర్చి చర్చిస్తూ ఉపయోగిం చిన భాషలు ఏడువిధాలు. అవిశకార,అభీర,చండాల,శబరి,ద్రమిల,ఆంధ్ర వనచరుల వ్యవహారంలోనివనీ చెప్పారు. అక్కడ ఆంధ్ర అనే పదాన్ని భరతుడు భాషాపరంగా ప్రయోగించాడు.  

3.5. నన్నయ రాసిన నందంపూడి శాసనంలో (శాసనకాలం 23-11-1053)లో నన్నయ,నారాయణ భట్టుని బహుభాషా కోవిదుడుగా ప్రశంసించాడు". 'సంస్కృత కర్ణాటక ప్రాకృత పైశాచికాంధ్ర భాష సుకవి రాజ శేఖర ఇతిప్రథితస్సుకవిత్వవిధనేన' (నందంపూడిశాసనం. 74-79) అనీ,నారాయణ భట్టు ఆంధ్రభాషలో కూడా మహాకవి అని చెప్పాడు. ఆంధ్రశబ్ధం భాషాపరంగా మొట్టమొదట ఈ శాసనంలోనే ప్రయోగించబడింది.  

3.6. తిక్కన నన్నయను'ఆంధ్రకవిత్వవిశారదుడు' అని సంభోదించాడు. "ఆది దొడంగి మూడుకృతులాంధ్ర కవిత్వ విశారదుండ విద్యాదయితుండొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్"(మహాభారతం –విరాట పర్వం-16)తిక్కన ఇక్కడ ఆంధ్రపదాన్ని భాషాపరంగా వాడాడు. అంతేగాక తిక్కన శిష్యుడైన మూలఘటిక కేతన తన లక్షణ గ్రంధమైన ఆంధ్రభాషా భూషణంలో ఆంధ్ర పదాన్ని భాషాపరంగా ప్రయోగించాడు. గ్రంధం పేరు లోనే గాక గ్రంధంలో కూడా ఆంధ్రశబ్ధాన్ని భాషా పరంగా ప్రయోగించాడు.

తెలుగుపదప్రయోగం:

          క్రీ.శ. 2 వ శతాబ్దం లో త్రిలింగ శబ్దం వ్యవహారంలో ఉన్నట్లు విదేశీ యాత్రికుల రాయబారుల లేఖ నాన్ని బట్టి తెలుస్తుంది. తెలుగు పదం అర్వాచీన మైందనీ, ప్రాచీన మైందనీ కొందరు భావిస్తున్నారు. గ్రీకు దేశస్తుడైన టాలమి మన దేశాన్ని వ్యాపార నిమిత్తం సందర్శించినప్పుడే తాను త్రిలింగ దేశాన్ని గురించి తెలిపాడు.

     నన్నయ తన మహాభారతంలో "నానారుచితార్థ  సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్" (ఆదిపర్వం 26)అనే పద్యంలో పూర్ణబిందు పూర్వక మైన తెనుంగు శబ్దాన్ని వాడాడు తెనుగు,తెనుంగు శబ్దాలు రెండూ భాషాపరంగా,ప్రాస ఘటితంగా నన్నయ్య వాడాడు.  

4.2. నన్నెచోడుని (12వ శతాబ్దం) కుమార సంభవంలో "వెలయగ దేశికవిత బుట్టించి తెనుంగున నిలిపి రంధ్ర విషయంబున జన చాళుక్యరాజు మొదలగు బలువుర్" అన్న చోట తెనుంగు శబ్దం మనకు కనిపిస్తుంది.  

4.3. పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో "తెలుగు" మాటలనంగ వలదు వేదముల కొలదియకా చూడుడు" అన్నచోట తెలుగు పదప్రయోగం చేశాడు.  

4.4. తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో "తెలుగు కవిత్వము జెప్పందలచిన కవి" (నిర్వ.ఉ.రా. 1-16) అని తెలుగు అనే శబ్దాన్ని భాషాపరంగాను,లకారాన్ని ప్రాసఘటితంగాను ప్రయోగించాడు.  

4.5. క్రీ.శ. సుమారు 1650లో బాలసరస్వతి కూడా తన బాలసరస్వతీయము పీఠికయందు "తెలుగున్ వ్యాకరణంబు" అని తెలుగు శబ్దంలోని లకారాన్ని ప్రాసఘటితంగా,భాషాపరంగా వాడాడు.

తెనుగు, తెలుగు రూపంతరాలే గాని భిన్న ధాతుజాలుకావు. ద్రావిడ భాషల్లో న,ల వినిమయం జరిగింది. ఈనాడు కూడా కొన్ని ప్రాంతాల గ్రామీణుల వ్యవహారంలో తెలుగులో నలల వినిమయం కనిపిస్తుంది. ఉదా: మునగ -ములగ, నేదు-లేదుమొదలైనవి.  

          నన్నయ్యకు ముందే తెనుగు వాడుకలో వుండి ఉంటుంది. లేకపోతే తాను రచించిన భాషను కొత్తగా తెనుగని వ్యవహరించడు. శాసనంలోగానీ. గ్రంథంలోగానీ నన్నయ్యకు పూర్వం తెనుగు, తెలుగు శబ్దాలని ఎవరు జాతి, దేశ, భషపరంగా వాడారని పరిశోధించవలసిన బధ్యత పరిశోధకులపై ఉంది.          

          కావ్యసాహిత్యం, శాసన రచన, జానపద సాహిత్యం, సామాన్య జనవ్యవహారం ఈ నాలుగు రంగా లలోనే తెలుగు 19వ శతాబ్దం వరకు వాడుకలో ఉండేది.శతకాలు,ఉదాహరణ వాఙయం,ద్విపద,కీర్తనలు, విన్నపం లాంటి ప్రక్రియలు ఎన్నో దేశీయమైన ఛందస్సులో వెలువడ్దాయి.  

          ఈ విధంగా క్రీస్తుకు పూర్వం జాతివాచకమైన ఆంధ్రశబ్దం తర్వతా దేశవాచకంగా,తదనంతరం భాషా వాచకంగా వ్యాప్తిలోకి వచ్చింది. ప్రస్తుతం కూడా ఆంధ్రశబ్దం జాతి,దేశ,భాషలను సూచించడానికి వాడ బడుతూ ఉంది. దీని వల్ల ఐతరేయ బ్రాహ్మణ కాలం నాటినుండి ఆంధ్రశబ్దం ఉంది అనే విషయం తెలిస్తుంది.  

ఉపయుక్త గ్రంథసూచి :  

1.ఆరుద్ర, 2007 సమగ్ర ఆంధ్ర సాహిత్యం -1,తెలుగు అకాడమి,హైదరాబాద్.

2.కృష్ణమూర్తి,భద్రిరాజు, 2000 భాష - సమాజం - సంస్కృతి. నీల్ కమల్ పబ్లికేషన్,హైదరాబాద్.

3.కృష్ణమూర్తి, భద్రిరాజు,2006,తెలుగు భాషా చరిత్ర,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరా బాద్.

4.దక్షిణామూర్తి,పోరంకి 2007,భాషా ఆధునిక దృక్పథం,నీల్ కమల్ పబ్లికేషన్,హైదరాబాద్.

5.రామారావు,చేకూరి 2000,భాషాంతరంగం (భాషానిర్మాణ వ్యసాలు) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం,హైదరాబాద్.

6.శ్రీ రామ అప్పారావు,పోణంగి,1992 నాట్యశాస్త్రము (అనువాదము) గుప్త భావప్రకాశికా నాట్యమాల ప్రచురణ,హైదరబాద్.

7.శ్రీ రామచంద్రుడు పుల్లెల 2002,అలంకారశాస్త్ర చరిత్ర,నందనం ప్రచురణ,హైదరాబాద్.

8.సుబ్రహ్మణ్యం పి.యస్. 2004 ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యా లయం,హైదరాబాద్.                

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech