విజ్ఞానమనంతం బ్రహ్మ
"The major attraction of Science is that it never claims to have
finished.
As you progress you discover new questions"
విజ్ఞానమునకు హద్దులు లేవన్నది
నిర్వివాదాంశము. తెలుసుకునే కొలదీ
తెలుసుకోవలసినవిషయములసంఖ్య పెరుగుతూనే
ఉంటుంది. అదే దాని గొప్పతనము. ఇది ఒకవంతు
అయితే మధించగ వచ్చిన దాని ఫలములు
సమాజాభివృద్ధికి నిరంతరము దోహదపడుతూనే
ఉంటాయి. సామాజికోపయోగిత లేని జ్ఞానము
విజ్ఞానము కాజాలదు.
జ్యోతిషమునకు సమాజమునకు ఉన్న సంబంధము మరియే
ఇతర విజ్ఞానశాఖకు లేదని చెప్పవచ్చును.
దృశ్యములయిన కారణములను విశ్లేషించడము కన్న
అదృశ్యములయిన కారణములను తెలుసుకొనడము కష్టము.
ఆ అదృశ్యములనే మనము అదృష్టము అని
వ్యవహరిస్తాము. అదృష్టము అంటే న దృష్టము అని
అర్థము. అనగ కనిపించనిది.
ఆ విధముగ కనిపించని విషయములను మనకు అర్థమయ్యే
రీతిలో లేక మనకు ఉపయోగపడే రీతిలో చర్చించుకునే
ప్రయత్నమును మనము గత 36 నెలలుగా చేస్తూ
వచ్చాము. కారణాంతరములవలన మన ప్రయాణమునుకు ఈ
నెలతో స్వస్తి పలకబోతున్నాము. మన
చర్చాప్రసంగమునకు ఇది స్వస్తివచనము గానీ మన
విజ్ఞానతృష్ణకు మాత్రము కాదు. మనము ఎన్ని
లోతులకు వెల్లినా ప్రతీలోతూ మనకు ఆరంభమే కానీ
అంతము మాత్రము కాదు.
ఆది అంతములేని కాలచక్రములో ప్రతీప్రాణీ పుడుతూ
గిడుతూ అనేక పర్యాయములు పుట్టిన పిదప
శాశ్వతముగ ఆ చక్రమునుండి తప్పుకుంటుంది. ఒక
పుట్టుక తరువాత మరొక పుట్టుకకు కారణము ఆ
ప్రాణి చేసుకున్న కర్మే. ఆ కర్మఫలితమువలన
ప్రాణి సుఖమును మరియు దుఃఖమును అనుభవిస్తూ
ఉంటుంది. దుఃఖాన్ని పొందజాలని మనిషి తన
నిరంతరాణ్వేషణాఫలితముగ ఆ కర్మఫలమును, ఆ
కనిపించని (అదృష్టము) తన జీవితమును
తెలుసుకోవడానికి గ్రహనక్షత్రములతో కూడిన
వ్యవస్థను తనకు సహయోగిగా ఎంచుకున్నాడు.
ఆ వ్యవస్థను మనిషి ఉపయోగములోనికి ఎప్పుడు
తెచ్చుకున్నాడు¿
ఇది ఎంతవరకు వైజ్ఞానికము¿
అనేవి పెద్దగా ఆలోచించవలసిన అవసరములేదు.
వైదికవాఙ్మయములోని అనేక ఉదాహరణలద్వారా
జ్యోతిషము వైదికకాలములోనే ప్రచారములో
ఉండెడిదన్న సత్యము ప్రస్ఫుటమవుతుంది.
వైదికవాఙ్మయము యొక్క సమయమిది అని చెప్పే ఏ
చారిత్రక ఆధారము లేక వైజ్ఞానిక ఆధారము నేటి
వరకు మనకు దొరకని కారణముగ వేదము అపౌరుషేయము ,
వేదము అనాదిగ ప్రచారములో ఉన్నది అనే విషయములను
మనము పూర్తిగా అంగీకరించక తప్పని పరిస్థితి
ఉందన్నదీ సత్యమే.
గ్రహముల ఆధారముగ మనిషి జీవితములోని ప్రతి
అంశమును గూర్చి తెలుసుకునే అవకాశమును కలిగి
ఉన్నాడు. కానీ విజ్ఞానము యొక్క మిగిలిన
శాఖలవలెనే జ్యోతిషము కూడ సమర్పిత భావము మరియు
నిరంతర శ్రమ వలనే మనిషిని సఫలుని చేయగలదు.
నేడు ఇందలి అనేకాంశముల సామాన్య వివరములు
మనిషికి తెలియక తల పట్టుకునే పరిస్థితులు
కనబడుతున్నాయి. గవేషణాత్మకము మరియు
సమీక్షాత్మకము అయిన అధ్యయనమును చేయవలసిన
అవసరము ఎంతైనా ఉన్నది.
జ్యోతిషముయొక్క అంగములు లేక భాగములే
ముహూర్తము, వాస్తు, సాముద్రికము మొదలుగునవి.
నాడీ జ్యోతిషము, ప్రశ్నజ్యోతిషము,
శకునశాస్త్రము మొదలుగునవి మనిషి మరియు సమాజము
యొక్క మంచి కొరకు ఏర్పడినవే అయిననూ నేడు
ఇవన్నియూ అధ్యయనలోపము కారణముగ మరియు
గవేషణలోపము కారణముగ నిరాదరణకు గురయ్యాయన్న
విషయమును విజ్ఞులు ఇప్పటికే గ్రహించి
యున్నారు. ఖగోళవిజ్ఞానము, భౌతికశాస్త్రము,
రసాయనశాస్త్రము వంటి వాటిలో తలెత్తే సంశయములను
నివృత్తిచేయడానికి అనేక మార్గములు మరియు
ప్రామాణిక సంస్థలు నేడు అందుబాటులో ఉన్నాయి.
కానీ ఈ గడ్డపై పుట్టిన వేదములు వేదాంగములు
మిగిలిన దేశములలో పొందిన ఆదరణను లేక
ప్రచారమును వాటి జన్మస్థానములో
పొందలేకపోతున్నాయి.
విజ్ఞానము మూడు పూవులు ఆరు కాయలుగ
పరిఢవిల్లుతున్న సమయమిది. ఐహికముగ
ఎదగాలనుకున్న మనిషికి ఇది స్వర్ణయుగముగ
కనిపిస్తోంది. ప్రతీ రంగములోనూ తనదైన
నిర్వచనాన్ని ఏర్పరచుకున్నాడు మనిషి. వివాహము,
సంతానము, విద్య, బంధములు వీటన్నిటినీ కూడ
మనిషి తనదైన శైలిలో మలచుకోవడానికి ప్రయత్నములు
చేస్తున్నాడు. దాని ఫలితముగ నేడు వివాహవయస్సు
30-40
సంవత్సరాలమధ్య స్థిరమైపోయింది. ఆ బంధము కొన్ని
సందర్భములలో మూన్నాల్ల ముచ్చటగా కూడ మారుతూ
మనకు కనిపిస్తోంది. ఇక సంతాన విషయానికి వస్తి
మనిషికి తన జీతములో వృద్ధి (ఇంక్రిమెంట్ ) లేక
పదోన్నతికి గల విలువను కూడ పొందలేకపోతోంది.
మారుతున్న పరిస్థితులకనుగుణముగ ప్రాచీన
విజ్ఞానములను కూడ మనిషి చమత్కారసాధనములుగ
చూడాలని, మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
అఖండమైన విశ్వములో భూమి ఉనికే అంతంతమాత్రము.
విశ్వాంతరాలములో చిన్న అలజడి రేగినా ఈ భూమి
భవిష్యత్తు ప్రశ్నార్థకముగ మారుతుంది. ఈ
విషయము నేటి విజ్ఞానమునకు పూర్తిగా తెలిసిననూ,
ఆ విజ్ఞానమును అనుసరించే మనిషి మాత్రము ఈ నగ్న
సత్యములను ఉపేక్షిస్తున్నాడు
సాంగోపాంగము ప్రాచీన సాహిత్యముయొక్క సారమును
గ్రహించిన పిదప దాని నిజానిజములపై మనము చర్చ
చేసుకుంటే అది చాలా వరకు మనకు మరియు మన
తోటివారికి సహకరించగలదు. విశ్వం పోకడ లేక కాలం
పోకడలను తెలుసుకోవడానికి ప్రత్యేకముగ మన
ప్రాచీనసాహిత్యమే కాదు దానితో బాడు స్టీఫెన్
హాకింగ్ లాంటి నేటి విజ్ఞుల రచనలనుకూడ మనము
పరిశీలిస్తే ప్రాచీనసాహిత్యం కేవలం పాతకాలం
కాక అన్ని కాలములకు సంబంధించినది, అందులోని
ప్రతీ విషయము కొత్తరూపమును ధరించి మనముందుకు
వస్తున్నదే కానీ లేనిది మనముందుకు రావట్లేదన్న
విషయము తేటతెల్లమవుతుంది. ప్రాచీన సాహిత్యము
సమాజశ్రేయస్సే పరమావధిగా జన్మించినది.
ఆ సాహిత్యము యొక్క పరమార్థము మనకందరికీ
తెలిసినదే. దానిని మరొకమారు మననము చేసుకుంటూ
మన చర్చాప్రసంగమునకు ఇచట స్వస్తిపలికెదము…
సర్వే సంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్
దుఃఖభాగ్భవేత్.
|