Sujanaranjani
           
  శీర్షికలు  
  ఎందరో మహానుభావులు       

వాగ్గేయకారుడు యానం రామకృష్ణ

 

 

 - రచన : తనికెళ్ళ భరణి      

  చరిత్ర చాలా విచిత్రమైనది!
చరిత్ర పుటల్ని తవ్వుకుంటూ పోతే...ఎన్ని అనర్ఘ రత్నాలు దొరుకుతాయో..! ఎన్ని ఘనీభవించిన కన్నీటి బిందువులు ముత్యాలై దొరుకుతాయో!

అన్ని రంగాల్లోనూ ఎప్పుడూ కొంత మందే వెలుగులో కనిపిస్తారు.. కొంతమందే ప్రముఖులుగా వినిపిస్తారు.
మిగతావాళ్ళూ!! మసకమసకై పోతారు..కంటికి కనిపించరు..చరిత్ర హీనులైపోతారు!
ఆ పాపం ఎవరిదీ?
మనదే కదూ..!
ఇదిగో అలా చరిత్రకందకుండా పోయిన మరో మహానుభావుడే యానం రామకృష్ణ.. 1912 లో కార్వేటి నగరంలో పుట్టాడు. ఆయన బలిజ కులస్థుడు. కళలకి కులం కూడా అడ్డమొచ్చే కాలం.. రామకృష్ణకి సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉంది.. కానీ గురువేడీ!

అయితే అపారమైన సంకల్పబలం ఉంటే.. మార్గం అదే ఏర్పడుతుంది గామేసు..
దొరికాడు..
గురువు దొరికాడు..
అల్లాటప్పా గురువు కాదు.. సాక్షాత్తు ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్య ప్రశిష్యులకు శిష్యుడు.. ఎంత తపించాడు.. ఎన్ని గుమ్మాలెక్కి దిగాడు.. ఎన్ని అవమానాల్ని భరించాడు.. అలాంటి స్వాతి చినుకంటి యానం రామకృష్ణ వెళ్ళి ముత్యపు చిప్పలో పడ్డాడు.

నీరము తప్త లోహమున నిల్చి అనామకమైన నశించు - నీటి బిందువు వేడి వేడి పెనం మీద పడ్తే చుయ్ అని ఆవిరైపోతుంది.
ఆ నీ రమె ముత్యమట్లు నళినీ దళసంస్థితమై తరర్చు
అదే నీటి బిందువు తామరాకు మీద పెడితే కాస్సేపైనా ముత్యంలా మెరుస్తుంది.
ఆ నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ ఆ నీటి బిందువే ముత్యపు చిప్పలో బడిందో ముత్యమై మెరిస్తుంది.

దాన్నే యోగం..అంటారు..ప్లేస్ మెంట్..
ఎలాంటి మహానుభావుడు దొరికాడయ్యా అంటే.. ఆ మహానుభావుడి పేరు కూత్తనూరు అయ్యాస్వామి అయ్యరు... ఆయన భార్య లలితాంగి వీళ్ళ బిడ్డ.. ప్రముఖ గాయని ఎం.ఎల్. వసంత కుమారి.. ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్.

అరైకుడి రామానుజ అయ్యంగార్ మొదలైన మహానుభావులు.. ఈయన సహపాఠులు..
మరో విషయం ఏమిటంటే ఏదైనా తేలిగ్గా లభిస్తే..దానికి విలువుండదు. ఏదైనా కుప్పలకొద్దీ దొరికితే ఆసక్తి ఉండదు.
బంగారం చూడండి.. వెండి చూడండి..ఇనుము చూడండి.
మొత్తానికి రామకృష్ణ కొలిమిలో కాలాడు.
సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
గురువుగారి ఆశీస్సులు ... పుష్కలంగా పొందాడు.
చాలా చోట్ల కచేరీలు చేస్తున్నాడు.! ఎందరికో సంగీతం కూడా నేర్పిస్తున్నాడు. కానీ ఏదో అసంతృప్తి...
ఏదో శూన్యం గుండెల్లో..ఏదో బెంగా... ఏదో దిగులు..
ఏదో స్ఫూరించింది..అన్నమయ్య కీర్తనల్లే..

ఆకటి వేళల.. అలిసిన వేళల
చేకువ హరినామ మొక్కటే.. వేరే గతిలేదు

సంగీతనికి.. పరమార్ధం...పరమ .. అర్ధం... తోచింది.
ఓ రాత్రివేళ నిద్రపట్టక...కూనిరాగాలు తీస్తున్నాడు..
కృష్ణుడి విగ్రహం... పిల్లనగ్రోవి... ఊత్తోంది.. అందులోంచి

అగరుపొగలు...రంగురంగుల ఇంధ్రధనుస్సులు.. ఆనందలహరులు..
పిల్లనగ్రోవి..ఘంటమైపోయినట్టూ..కృష్ణుడు అది తన చేతపెట్టి ఆశీర్వదించినట్టూ
కలం కాగితం మీద పెట్టగానే భావ సముద్రాలు పొంగినట్టూ..
సప్తవర్ణాలు..ఉబికి ప్రవహించినట్టూ.. వెళ్ళిపోతోంది కలం... కలిసిపోతుంది గలం..?
గొంతెత్తి పాడ్డం...దాన్నే రాయడం..
తన్మయత్వంలో మునిగిపోతూ...కీర్తన.. సుధాలహరిని మొదలెట్టేశాడు..

కళ్ళముందున్న కన్నయ్యతో మాట్లాడుతున్నట్టే...తన గోడు వెళ్ళబోసుకున్నట్లే..కొన్ని స్తోత్రాలు..కొన్ని స్తవాలు...కొన్ని లాలి పాటలు.. కొన్ని జోలపాటలు.. కొన్ని మేలుకొలుపులు..కొన్ని ఆధ్యాత్మిక ప్రబోధాలు ఒకటారెండా.. మొత్తం నూట మూడు..
మొట్ట మొదట సంగీత త్రయంలోని ప్రధముడైన త్యాగరాజ స్తుతితో ఆరంభించాడు. రుద్రప్రియ రాగంలో..

మంత్ర తంత్రాలు నేను ఎరుగను..
నిన్నే తలుస్తూ ఉండే దాసులకు నేను దాసుడనూ..
రామకృష్ణనుత అనేది ముద్ర..

ఆ తర్వాత సరస్వతీ దేవిని కళ్యాణిరాగంలో వాణీసుత శర్వాణీ వనజాతాసన రాణీ.. అని రూపకతాళంలో స్తుతి.

ఇంకా.. శ్రీరాగం, నాటకురంజిరాగం, హంసధ్వని, నాటంగం హంసానందినిలో కామాక్షి స్తోత్రం..
భైరవి, అభోగి, జంఝాట, కళ్యాణి, సావిత్రి, మహాలక్ష్మిని గురించి మధ్యమావతిరాగంలోను..
నరసింహస్తుతి మార్ కౌస్.
ఇలా అనేక రాగాల్లో అనేక దేవతల్ని కరువుతీరా..కన్నీరు స్తుతించాడు రామకృష్ణ.
రాముడి మీద రాసిన ఒక కీర్తన;

కలడా లేడా రాముడు - కలనైన గాన రాడే మనసా
అంతవాడని యందురే జగమంత వాడని యందురే..
అంతరాత్ముడే రాముడుండ యిల వింతగాదే గానరాక యుంట

అలాగే యదుకుల కాంభోజి రాగంలో హనుమంతుని మీద కీర్తన.

హనుమంతా బలవంతా ఘనవంతా బ్రోవుమా
నిన్ను సన్నుతించలేదా ... నన్ను బ్రోవగారాదా
కన్నతండ్రివి కాదా...కాపాడుటకు వాదా
కిన్నెర సుత సాదా.. సన్నుతి జేసేదా!

ఇలా ఉంటుండగా ఒకసారి రామకృష్ణునికి కలరా సోకింది.
ఆ కాలం ఎలాంటిదంటే.. ఏ పెద్ద జబ్బొచ్చినా.. పసర్లూ.. కాల్చివాతలూ.. తప్ప సవ్యమైన మందులు లేని కాలం.. అన్నిటికన్నా అవగాహన లేని కాలం.. మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్న కాలం.

ఏదైనా మందు వేసాడో లేదో గానీ పరమ భక్తితో హనుమంతుణ్ణి ప్రార్ధిస్తూ..
కలరానుబారత్రోలు..కరుణతో మమ్మునేలు
చలమేలాశ్రితలోలా. ..సమయము ఇది వేళా
అంటూ ప్రార్ధించాడు. ప్రార్ధన బలం వల్ల కలరా పోయింది!

తెలుగులో చాల జోల పాటలున్నాయి. అందులో ముందు గుర్తొచ్చేది అన్నమయ్యది..
జో అచ్యుతానంద జోజో ముకుందా.. అని అది పాడుతుంటే వింటున్నవాళ్ళే ఖాదు..పాడ్తోన్న వాళ్ళూ కూడా పడుకుంటారు. అంత గొప్ప పాట.

అలాగే రామకృష్ణుడు ఒక అద్భుతమైన పాట రాశాడు.
బంగారు తొట్టేలో పవ్వళించర సామి
రంగానిదురబోర..జోల పాడేదా...

అంటూ జో కొడ్తూ.. రెండో చరణంలో చంకదిగని పసిబాలుడిలా ఎంతో ఎత్తు మరిగావు ఏం చెయ్యాలిరా రంగా...అండపిండాల్లో వెలిగేటి దొంగ..! అంటాడు. ప్రేమా..పిచ్చీ ఒకటి అని..కవి వాక్కు... పిచ్చంటే ఏవిటీ.. ఏదైనా ఒక విషయం మిద.. ఒక విషయం మీదే.. దృష్టిని కేంద్రీకరించడం..
డబ్బు పిచ్చి, పదవి పిచ్చీ.. స్త్రీల పిచ్చీ..అలాగే భక్తి పిచ్చి.
అందులో మునిగిన వాడికి ఐహికం పట్టదు.

మదిలో కోర్కెల లతలు తెగిపోతాయి. జుట్టు మాత్రం అట్టలు కడుతుంది. పలవరింపో కలవరిపో తెలీదు.. ఎవడ్తో మాట్లాడుతున్నాడో తెలీదు. వొళ్లంతా ఎండి పోయి ఉంటుంది.
కళ్ళు మాత్రం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంటాయి.
తన సర్వస్వాన్నీ, పరమేశ్వరుడికి అర్పించి, అనుక్షణం ఆయనను స్మరిస్తూ.. అద్భుతమైన కీర్తనలు రాసి.. చరిత్రలో కరిగిపోయినా.. రామకృష్ణ..కిర్తన సుధాలహరి.. మాత్రం సంగీత విశ్వంలో చిరస్థాయిగా నిలుస్తుంది.!!
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech