Sujanaranjani
           
  అన్నమయ్య కీర్తనలు   
 

                                                             రచన : జి.బి.శంకర్ రావు

  కంటి శుక్రవారము (మాతృక : తాళ్ళపాక శేషాచార్యుల వ్రతప్ర్తతి)

కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు ఱొమ్ముల మొలచుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని

పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని

తట్టు పునుగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని


తిరుమల శ్రీ వారికి ప్రతి శుక్రవారము అభిషేక సేవ జరుగుతుంది. ఈ సేవను ప్ర్తత్యక్షంగా నిర్వహించిన అన్నమాచార్యులవారు, ఈ సేవా సమయంలో స్వామివారి వైభవాన్ని అద్భుతంగా ఈ కీర్తనలో ఆవిష్కరించిన అభిషేక సేవను ప్రత్యక్షంగా తిలకించలేని మనందరికీ ఆలోటును తన కీర్తన ద్వారా తీర్చాడు. తెలతెలవారే సమయంలో అమ్మ అలమేల్మంగమ్మ అండన ఉండే స్వామివారికి కప్పు పన్నీరు, పచ్చ కర్పూరం, తట్టుపునుగు మొదలగు సుగ్ంధాలను వెండి పళ్ళాలతో నింపి స్వామికి అభిషేకము చేసి ఆ వేడుకను కన్నులారా దర్శించాడన్నమయ్య! మనమూ ఈ సంకీర్తనలో స్వామివారి అభిషేక సేవను చూసి తన్మయులమవుదాం! తరిద్దాం! ఈ సేవను మనకు అనుగ్రహించిన అన్నమాచార్యుల వారికి హారతులు పడదాం!

గోణము = గోచి;
కదంబము = మిశ్రమము;
బిట్టు = శీఘ్రము;
వేష్టువలు = వలువలు;
చట్టలు = పునుగు చట్టాలు;
పళ్యాలు = పల్ళెములు;
నిచ్చమల్లె = నిత్యమల్లె;
కప్పు -వ్యాపించు;
బిత్తరి స్వామి = నిగనిగ ప్రకాశించే స్వామి (శృంగారమూర్తి);
అంటి = అనుకొని;
కడబెట్టి = దూరంగా ఒక ప్రక్క ఉంచి;
అచ్చెకపడి = ఆశ్చర్యపడి;
శిరసాదిగ దిగనలది = తలమొదలుకొని నఖము పర్యంతము
తట్టుపునుగు = తట్టి ఎత్తిన మేలైన పునుగు;
పునుగు = సుగంధ ద్రవ్యము - పునుగు పిల్లి నుండి తీసేది;
పళ్యాలు = పళ్ళెరములు
 


కందర్ప జనక


కందర్ప జనక గరుడగమన
నందగోపాత్మజ నమో నమో

వారిధి శయన వామన శ్రీధర
నారసింహ కృష్ణ నమో నమో
నీరజనాభ నిగమగోచర
నారాయణ హరి నమో నమో

పరమ పుర్షా భవవిమోచన
వరద వసుధావధూవర
కరుణాకాంతా కాళిందీరమణ
నరసఖ శౌరీ నమో నమో

దానవదమన దామోదర శశి
భానునయన బలభద్రానుజ
దీనరక్షక శ్రీ తిరువేంకటేశ
నానాగుణమయ నమో నమో

కందర్ప జనక గరుడగమన
నందగోపాత్మజ నమో నమో

వారిధి శయన వామన శ్రీధర
నారసింహ కృష్ణ నమో నమో
నీరజనాభ నిగమగోచర
నారాయణ హరి నమో నమో

పరమ పుర్షా భవవిమోచన
వరద వసుధావధూవర
కరుణాకాంతా కాళిందీరమణ
నరసఖ శౌరీ నమో నమో

దానవదమన దామోదర శశి
భానునయన బలభద్రానుజ
దీనరక్షక శ్రీ తిరువేంకటేశ
నానాగుణమయ నమో నమో
 

భక్తి స్తుత్యాత్మకంగా సాగిన నామ విశేషణ కుసుమమాలిక ఈ సంకీర్తన!

శ్రీమన్నారాయణుని విశేషగుణాలను అన్నమాచార్యుల వారు కందర్ప జనక (మదనుని తండ్రి), గరుడగమన (గరుడ వాహనంపై తిరిగేవాడు), నందగోపాత్మజ (నంద గోవుని కుమారుడు - బాల కృష్ణుడు), వారిధిశయన (శేషసాయి), వామన, శ్రీధర (లక్ష్మీదేవిని ధరించేవాడు, భరించేవాడు), నారసింహ, కృష్ణ, నీరజనాభ (పద్మం నాభిలో కలవాడు), నారాయణ, హరి, పరమపురుషా, భవ విమోచన (సంసార సాగరాన్ని తొలగించేవాడు) వరద, వసుధావధూవర (భూమాతకు భర్త), కరుణాకాంతా (కరుణ కల్గినవాడు), కాళిందీ రమణా (కృష్ణ), నరసఖ (అర్జునుని స్నేహితుడు), శౌరి(శౌర్యము కలవాడు), శశిభాను నయన (చంద్ర, సూర్యులను కన్నులుగా కలవాడు), బలభద్రానుజ (బలరాముని సోదరుడు), దీనరక్షక(దీనులపాలిట రక్షకుడు, ఆపదమొక్కులవాడు) నానా గుణాల గల ఓ తిరువేంకటేశ్వరా! నీకు నమస్కారము తండ్రీ! అంటున్నాడు అన్నమయ్య!


 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech