కబుర్లు  
     వీక్ పాయింట్

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 

తెలుగు బాల‘శిక్ష’

‘పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పెట్టెల మీద ముద్ర కొట్టించినట్టు ‘తెలుగు మాట్లాడటం ఆరోగ్యానికి హానికరం’ అని రాష్ట్రంలో అన్ని ఇంగిలిపీసు స్కూళ్లముందూ పెద్ద బోర్డులు వేలాడతీయిస్తే మంచిది. బళ్లో తోటివాళ్లతో తెలుగులో మాట్లాడిన నేరానికి విశాఖపట్నంలో ఓ పెద్ద పంతులయ్య తొమ్మిదేళ్ల చిన్నారి చేతిమీద వాతలు తేలేలా బెత్తంతో కొట్టాడట. అంతకు ముందు ఇంకో జిల్లాలో ఓ దయగల పంతులమ్మ క్లాసులో తెలుగు మాట్లాడిన అపరాధానికి ఓ పసివాడిచేత ‘ఐ డోంట్ టాక్ తెలుగు’ అని 300 సార్లు, ఇంపోజిషను రాయించింది. ఇంచుమించుగా అదే సమయాన వేరొక జిల్లా అయ్యవారు ‘తెలుగులో మాట్లాడినందుకు క్షమించండి’ అని ఖైదీలకు కట్టినట్టు కుర్రవాడి మెడకు పలకకట్టి పగలబడ్డాడు. పంతుళ్లు ఇంత స్ట్రిక్టుగా ఉన్నా పవిత్రమైన పాఠశాలలో దిక్కుమాలిన తల్లిభాషను మాట్లాడే దురలవాటు మన చిరంజీవులకు వదలటం లేదు. ఎలాగైనా దాన్ని మాన్పించాలనే ఉపాధ్యాయులవారు దశలవారీగా శిక్ష మోతాదు పెంచుతున్నారు. బెంచి ఎక్కించటం, స్కూలు చుట్టూ పరిగెత్తించటం, మెడలో పలక కట్టడం లాంటి ‘చిరుశిక్ష’ల నుంచి బెత్తంతో వాతల మధ్యమస్థాయికి తెలుగు బాల‘శిక్ష’ పురోగమించింది. ఇది ఇంకా ముందుకు పోయి చేతులు విరచటం, నోటిమీద వాతలు పెట్టడం, నాలుక కోసెయ్యటం దాకా వెళ్లినా విస్తుపోనక్కరలేదు. ఈ ధోరణిని అరికట్టాలన్న ఆలోచన ఏలినవారికి ఎలాగూ లేదు కనుక కనీసం ప్రతి బడిలోనూ పైన సూచించినట్టు ‘చట్టబద్ధమైన హెచ్చరిక’ బోర్డులు నదరుగా ఏర్పాటుచేయిస్తే దిక్కులేని తెలుగు పిల్లలకు, వారిని కన్నవారికి అనవసరపు క్షోభ కాస్తయినా తగ్గవచ్చు.

మూడేళ్ల కింద పిల్లవాడి మెడలో పలకకట్టి అవమానించిన మైదుకూరు స్కూలు వాళ్లను ప్రభువులు ఏమిచేశారు? నిర్వాకానికి మెచ్చుకోలుగానా అన్నట్టు అంతదాకా హైస్కూలుగా ఉన్న సంస్థకు జూనియర్ కాలేజి ప్రతిపత్తినిచ్చి ఈ మధ్యే సత్కరించారు. మెడలో పలక కడితేనే స్కూలుకు ప్రమోషను ఇచ్చినవాళ్లు ఏకంగా బెత్తంతో వాతలే పెడితే ఇంకెంత సన్మానిస్తారోనని విశాఖ ప్రిన్సిపాలు ఆశపడ్డాడేమో!

ఇంగ్లిషు బళ్లో తెలుగుకు కొరత వెయ్యటం కొత్తగా ఇప్పుడే పుట్టుకొచ్చిన దురాచారం కాదు. తాను చదువుకునే రోజుల్లోనే పబ్లిక్ స్కూల్లో తెలుగు మాట్లాడితే శిక్షించేవాళ్లని, అందుకే ఇప్పటికీ తెలుగులో సరిగా మాట్లాడలేనని సాక్షాత్తూ ముఖ్యమంత్రే కిందటి నెల మాతృభాష ‘దినం’నాడు మురిసిపోతూ గుర్తు చేసుకున్నాడు. బహుశా దాన్ని వినే... తమరి హయాంలో మామూలు బళ్లూ ‘పబ్లిక్ స్కూళ్ల’ లెవెలుకు చేరుకున్నాయని చాటి సి.ఎం.సారును సంతోషపెట్టటానికి విశాఖ మాస్టారు బెత్తానికి పనిచెప్పి ఉండవచ్చు! రాష్ట్రానే్నలే వాడే తెలుగు తత్తిరబిత్తరగా మాట్లాడటం తన విశిష్టతగా భావించేటప్పుడు... శాసనాలు చేసి తెలుగు భాషకు చట్టపరమైన రక్షణలు కల్పించవలసిన లెజిస్లేచరులోనే తెలుగు మంత్రులు, తెలుగు శాసనకర్తలు, తెలుగు సభాపతులు తెలుగు మాట్లాడటం దాదాపుగా మానేసి, వచ్చీరాని ఇంగ్లిషులో వాదులాడుకుంటున్నప్పుడు... తెలుగు భాషను ఉద్ధరించటానికి పుట్టిన తెలుగు అకాడమీకే ఇంగ్లిషు పుస్తకాలను అచ్చేసుకుని బతకాల్సిన కర్మ పట్టినప్పుడు... తెలుగుకు ఉత్తమ గతులు కలిగించటానికి అవతారమెత్తిన తెలుగు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికమీదే ఆంగ్ల భాష రివాజుగా మారుమోగుతున్నప్పుడు - తెలుగు మాట్లాడిన విద్యార్థినికి వాతలు పెట్టాడని విశాఖ పంతులొక్కడినే కుళ్లబొడవటమెందుకు?

చాలామంది చూసే ఉంటారు. మొత్తం దేశానికీ ఉత్కంఠ కలిగించిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక ‘మాన్ ఆఫ్ ది మాచ్’ అనదగ్గ అఖిలేశ్ యాదవ్‌ని అన్ని జాతీయ టీవీ చానెళ్లూ పోటీలుపడి ఇంటర్వ్యూలు చేశాయి. ఎవరు ఇంగ్లిషులో ఏమి అడిగినా ఆ కుర్రవాడు శుద్ధమైన హిందీలో అనర్గళంగా జవాబులిచ్చాడు. ఇంగ్లిషు రాక కాదు. మాట్లాడ లేకా కాదు. మాట్లాడటం ఇష్టంలేక! అదే మన ఆంధ్ర నాయక రత్నాలైతే... తెలుగులో అడిగినా సాధారణంగా ఇంగ్లిషులోనే దడదడలాడేస్తారు. తెలుగింట తెలుగు తలిదండ్రులకు పుట్టిన తెలుగు నేతలకే... తెలుగు బోధించే, తెలుగు విశ్వవిద్యాలయం లాంటి విద్యా సంస్థలను నడిపే తెలుగు పెద్దలకే తెలుగులో మాట్లాడటం నామోషీ అయినప్పుడు అదే ఆదర్శాన్ని బడి దొరలూ పుణికిపుచ్చుకుంటే ఆశ్చర్యమెందుకు?

కర్ణాటక, తమిళనాడు, మహారాష్టల్ల్రో స్థానిక భాషను అది మాతృభాష కాని విద్యార్థులు కూడా విధిగా నేర్వాలన్న నిబంధన ఉంది. తెలుగునాట తెలుగు విద్యార్థులకు కూడా తెలుగుభాష అధ్యయనం తప్పనిసరి కాదు. రాష్ట్రంలో పదివేల దాకా ఉన్న తెలుగు మీడియం గవర్నమెంటు హైస్కూళ్లలోనే మూడింట రెండు వంతులను తెలుగుకు దూరంచేసి, ఇంగ్లిషు మోజును రెచ్చగొట్టి తెలుగు భాష నోట మన్నుకొట్టినప్పుడు ప్రైవేటు స్కూళ్లకు మాత్రం తెలుగంటే చులకన ఎందుకు కాదు? ఉత్తర భారతమంతటా అన్ని ప్రభుత్వోద్యోగాల రాత పరీక్షలు హిందీలో నిర్వహిస్తారు. ఇంగ్లిషు రాకున్నా తల్లిభాష మీద పట్టుతో అక్కడి అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర కొలువులను అవలీలగా సంపాదిస్తారు. మన పొరుగున ఉన్న తమిళనాడుల్లోనూ అన్ని రాత పరీక్షలు తమిళ భాషలోనే నిర్వహిస్తారు. దాని తర్వాతే ఇంగ్లిషుకు ప్రాధాన్యం ఇస్తారు. దాంతో తమిళ మీడియంలో చదువుకున్న ఏ అభ్యర్థికీ అన్యాయం జరగదు. అదే మన రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులు పిశాచ భాషలో ఇచ్చిన ప్రశ్నలను అర్థం చేసుకోలేక తికమక పడి బోలెడు నష్టపోయారు. ఇంగ్లిషులో పరిక్ష రాసిన వాళ్లకు మాత్రమే మంచి మార్కులు దక్కాయి. తెలుగు గడ్డమీదే తెలుగు నేర్వటం శాపమైనప్పుడు, తెలుగులో చదివిన వారిని రెండో రకం వారిగా ప్రభుత్వమే వివక్ష చూపుతున్నప్పుడు ప్రైవేటు స్కూళ్లకు మాత్రం తెలుగుపట్ల ఆదరణ ఎందుకుంటుంది? భాష ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం అవతరించి అరవై ఏళ్లు కావస్తున్నప్పటికీ తెలుగులో బోధన, తెలుగులో పాలన ఆకాశకుసుమాలే అయినప్పుడు... అజాగళస్తనం లాంటి అధికార భాష సంఘాన్ని కొలువు తీర్చటానికి కూడా సర్కారుకు తీరిక లేనప్పుడు... తెలుగును క్లాసికల్ ప్రతిపత్తిని కేంద్రం ప్రకటించి, చాలినన్ని నిధులు ఇవ్వటానికి, భవనాలు కట్టించటానికి ముందుకు వచ్చినా, తన వంతు చొరవ తీసుకునే కోరిక రాష్ట్ర సర్కారుకు లోపించినప్పుడు తెలుగు భాష అందరికీ అలుసు కాదా మరి?


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech