కబుర్లు  
     వార్త - వ్యాఖ్య

- రచన : భండారు శ్రీనివాస రావు

 

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి.

దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
గత వారం కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.

ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిళ్ళ అంగళ్ళు.

కలకత్తాలోనే కాదు దేశంలో ఏ బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.

పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది.
 

ఆ ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు.

కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం
చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీ’ – మమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఆ ఇంట్లోనే అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా. సాధారణంగా ఎవరయినా రాజకీయ నాయకులు నివాసం వుండే ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు బాగా వుంటాయనీ, మామూలు పౌరులను వేధించే నీటి కొరత, కరెంటు కోతలు వుండవనీ, వీధులు పరిశుభ్రంగా వుంటాయనీ జనంలో ఓ నమ్మకం. నమ్మకమే కాదు మనవైపు చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు నివసించే ప్రాంతాల్లో ఇలాటి ఇబ్బందులు లేకపోవడం నిజం కూడా.

ఈ నేపధ్యంలో మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఆ ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటి? దీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని ‘హింగ్లీ’  (హిందీ-బెంగాలీ) భాషలో ఆ వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు ఆ వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో ‘దేవత’ కలకత్తా కాళీనే చెప్పాలి. 

దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఆ వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech