సుజననీయం  
   

   తాజమహల్ షాజహాన్ కట్టిచిందేనా? - మినార్ల చరిత్ర (ఐదవ భాగం)

- రచన : రావు తల్లాప్రగడ

 

ముందు భాగాలలో (గత నాలుగు మాసాలలో) తాజమహల్లో వున్న హైందవ చిహ్నాలను, చారిత్రాత్మక ఆధారాలను, వాస్తుకళలనూ, వయస్సును, బల్బు గోపురాలనూ పరిశీలించాము. రకంగా చూసినా ఇది మహమ్మదీయతను ప్రతిబింబించక పోయినా, ఇది హిందూ కట్టడమే అని కూడా ఖచ్చితంగా చెప్పలేక పోయాము. ఇక తాజమహలు కట్టడంలో భాగమైన మినారుల పైన మన విశ్లేషణ మొదలు పెడదాము.

మినారులు:

శీర్షమున్న ఆర్చీలు, బల్బు గోపురాల సంగతి తేలిపోయింది. అవి భారతీయ వాస్తుకళేననీ. ఆ కళ భారతదేశం నుంచే మహమ్మదీయ దేశాలకు కూడా ఎగుమతి అయ్యివుండడనికి కూడా ఆస్కారం వుందని తెలుస్తోంది. కనుక ఇక మిగిలింది మినారుల సంగతే. అందరూ మినారులు కూడా మహమ్మదీయుల వాస్తుకళకు చెందినదే అని భావిస్తారు. నిజమే పర్షియన్, బాగ్దాద్ మసీదులలో పూజా సమయము అయ్యిందని  చెప్పడానికి మినారులను వాడతారు. ప్రతి మసీదుకీ ఒక మినారు ఉండటం ఈనాడు పరిపాటే. మసీదు గోపురానికంటే ఇంతో ఎత్తుగా ఉండే మినారులు, వాటి పైనుంచీ గట్టిగా వినించే ఆలాపన, (ఆధాన్లు - పూజా సమయమయ్యింది రమ్మని పిలిచే ఆహ్వానం) ప్రతి మసీదులోను ఒక ముఖ్యమైన సాంప్రదాయములుగా నిలిచాయి. కానీ మినారులు, మహమ్మదీయ దేశాలలో మొదటినుంచీ వుండేవా? వుంటే ఎప్పటి నుంచీ ఉండేవి? ఎలా వీటిని కట్టడం నేర్చుకున్నారు? అన్న అంశాల పైన మనం కొంచెం అధ్యయనం చేస్తే అనేక కొత్త విషయాలు తెలుసుకుంటాము.

మినారెట్లు లేక మినార్ల పైన దొరికే అధ్యయనాలలో జోనాతన్ బ్లూము, (బోస్టన్లో ఇస్లామిక్ ఆర్ట్స్ ప్రొఫెసర్)  వ్రాసిన పరిశోధనాత్మక పుస్తకాలు ముఖ్యమైనవి. మహమ్మదీయ నగరాలలో ముఖ్యచిహ్నాలుగా కనిపిస్తూ, సన్నగా పొడుగ్గా మసీదుల పైనే వుంటూ, మహమ్మదీయ ఉనికిని సుదూర ప్రాంతాలకు చాటుతూ వుండేవే, మినారులు. మినార్ల నుంచీ రోజుకి ఐదు సార్లు వినిపించే ఆధాన్లు (నమాజుకి పిలుపులు), నగరాలలో వారి సంస్కృతిని గుర్తు చేస్తూ వుంటాయి. మినారుల కట్టడానికి వెనుకనున్న ఉన్న ముఖ్య ఉద్దేశము ఆధానులే.

మహమ్మదీయ వాతావరణాన్ని కన్నులపండుగగా సృష్టించడానికి, ఒక డోముని, మినారుని చూపిస్తే చాలు. మొదట్లో మ్యుయెజిన్లు (ఆధాన్ పలికే గాయకులు) మినార్ల పైన నుంచీ గట్టిగా పాడుతూ పిలిచేవారు. రోజులలో శబ్ధకాలుష్యం తక్కువగా వుండేది కనుక, పిలిపు నగర వాసులందరికీ వినిపించేది. కానీ నేడు పిలుపు వినపడాలంటే మైకులు తప్పడం లేదు. ఎలాగూ ఈ మైకులు వచ్చేసాయి కనుక, ఇక అవి మినారుల పైన కట్టినా, లేక కింద కట్టినా, లేక ఎక్కడ వున్నా వినిపిస్తాయి. అందుచేత నేడు, మినార్లకున్న ఉపయోగం తగ్గి, అవి మసీదులకి చిహ్నాలుగా, సంస్కృతిలో ఒక భాగంగా, సంప్రదాయ అలంకారప్రాయంగా మిగులుతున్నాయి. నిజానికి రోజు ఆధాన్ పిలుపుకి మైకులు కూడా అవసరంలేదు, సెల్ల్ ఫోన్లమీద మెస్సేజిలుగా కూడా పంపుకోవచ్చు. ఆధునికత జీవనశైలినే ప్రభావితం చేస్తుంది మరి.

మహమ్మదీయతను ప్రతిబింబించే ఈ మినారులు, మతకలహాల వేళలలో పరమతస్తులకు ముందుగా కనపడే చిహ్నాలుగా కూడా ఎదురొస్తున్నాయి. కోసవో దేశంలోని కలహాలలో సెర్బియన్లు తరుచూ మినార్లనే పేల్చి వేసేవారని మనకు తెలుసు. అలాగే 1453లో బెజంటైన్ రాజధానియైన కాన్స్టాంటినోపుల్ని, ఒట్టొమాన్ మహ్మద్ ఆక్రమించుకున్నప్పుడు చేసిన మొదటిపని - పైన చూపిన హజియ సోఫియా చర్చికి ఒక 900 అడుగుల మినారుని కట్టి దాన్ని మసీదుగా మార్చడమే. తరువాత కాలక్రమేణా ఇస్తాన్బుల్ నగరం నిర్మించి, అనేక మినార్లతో నింపేసి,  మహమ్మదీయతను చాటుకున్నాడు. అలాగే క్రిస్టియన్లు ఐబేరియన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు, అక్కడున్న మసీదుల మినార్లను బెల్ టవర్లుగా మార్చుకున్నారట.

ఇలా క్రైస్తవమహమ్మదీయ మతాల మద్య జరిగిన కలహాలలో అనేక మినార్లు రూపాంతరంచెంది, ఏది ఎవరివో తెలియని పరిస్థితికి వచ్చేసాయి. ఐతే మినార్లు నిజంగా మహమ్మదీయ సాంస్కృతిక చిహ్నాలేనా అనే దాని పైన అనేక మంది మహమ్మదీయులలోనే భిన్నాభిప్రాయాలు వున్నాయట. ప్రాచీన మసీదు వాస్తులో అసలు మినారు భాగమేనా అంటే, కాదనే చాలామంది అభిప్రాయం. మొదట్లో మలేసియా, కాశ్మీరు, తూర్పు ఆఫ్రికా మహమ్మదీయ ప్రాంతాలలో మినారులే లేవని, అందరూ ఒప్పుకునే విషయమే. 10 శతాబ్దికాలం నుంచీ దేశాలమద్య రాకపోకలు, దండయాత్రలు పెరిగి, ఒకరి సంస్కృతి నొకరి దానితో సంపర్కము చెంది,  రూపాంతరం చెందడం వలన, తరువాతి కాలంలో, అంతర్జాతీయ మహమ్మదీయ చిహ్నలుగా మినార్లు, డోములు రూపు దిద్దుకున్నాయి. రూపుదిద్దుకోవడమే కాదు, వాటి అసలు రూపే పూర్తిగా మారిపోయి, పొట్టివి కాస్తా చాలా పొడుగ్గా తయారయ్యాయి. డా మహమ్మద్ రషుడీ అనే విజ్ఞుని ప్రకారం, నాటి మినార్లు ఎంతాగా అధినీకరించబడ్డాయి అంటే - "వీటిని  రూపొందించేటప్పుడు మహమ్మద్ ప్రవక్త చెప్పిన సిద్ధాంతాలను సైతం పరిగణలోకి తీసుకోవడం కూడా కుదరడం లేదు" అని చెప్పాడు. ఐతే, మిగితా మహమ్మదీయులందరూ రషుడీతో ఏకీభవించకపోవచ్చు. కానీ మహమ్మద్ ప్రవక్త కాలం నుంచీ ఆధాన్ అనేది వున్నా, వాటిని పలకడానికి వాడే మినారులు మాత్రం, చాలా కాలం తరువాతే పుట్టుకొచ్చాయని అందరూ ఒప్పుకునేదే.

మహమ్మదీయల ముందు కాలంలో జ్యూ మతస్తులు షోఫర్ అనే వాయిద్యం ద్వారా పూజలకు పిలిస్తే, క్రైస్తవులు చెర్చి గంటల ద్వారా పిలిచే వారు. అబ్దుల్లా ఇబిన్ జయాద్  అనే భక్తుడు తాను మసీదు పై కప్పునుంచీ పూజకు పిలిపునిస్తున్నటు కలగన్నానని చెప్పుకుంటే, మహమ్మదు దాన్ని భగవంతుని ఆజ్ఞగా అంగీకరించి, బిలాల్ అనే మధుర గాయకుడైన భక్తుడిని పిలిచి, తొలి మ్యూయెజిన్ గా (పూజకు పిలిచే గాయకుడిగా) ఇకపై వ్యవహరించమని ఆదేశించాడట.

నాటినుంచీ బిలాల్, అలాగే అతని తరువారి వారు, మసీదు దర్వాజా పైన నుంచి, లేక గోడల పైన నుంచి, లేక ఏదైనా వేరే కాస్త ఎత్తైన కట్టడాల పైన నుంచి, వారి ఆదానులు పలికేవారట. ఆనాటి మహమ్మదీయులకు మినారులు లేక స్తూపాలు కట్టుకునే సాంప్రదాయాలు కాని, అంతటి చాలా ఎత్తైన ప్రదేశాలు ఎక్కి ఆధానులు పలికే ఆచారాలు కానీ లేవు.. ఇంకా తెలియవు. అంతేకాదు, ఆలీ ఇబిన్ అబి తాలిబ్ తమ మసీదుకు పక్కన కొంచెం ఎత్తుగా ఉన్నట్టి కట్టడాన్ని ఆధానుకు వాడే అవకాశం కూడా ఉండకూడదని దాన్ని కూలగొట్టించాడట.  ఎందుకంటే ఆధాన్ కోసం, దాని మీద ఎక్కెన వారు పక్క ఇళ్ళలోకి  తొంగి చూస్తున్నారనీ, అది సబబు కాదని అనిపించి అలా కూలగొట్టించాడట. అలా అధాన్ కుండే ప్రదేశం "మసీదు పై కప్పుకన్నా ఎత్తుగా కూడా వుండకూడదని" కూడా ఆలీ ఆదేశించాడని చరిత్ర తెలుపుతున్నది. ఐనా సరే తరువాతి కాలంలో, (అంటే మినారుల కట్టడం మొదలు పెట్టిన కాలం నుంచీ), మసీదు గోపురాని కన్నా చాలాచాలా ఎత్తుగా మినారులు కట్టడం అనేది, ఒక సదాచారమయ్యిపోయింది.  

అలా ఎత్తైన ప్రదేశాన్నే నిషేదించిన ఇస్లాంలోనే, మెల్లిగా, మిల్లిమెల్లిగా, మినారుల వంటి ఎత్తైన కట్టడాలను ఆధాను కోసమే మళ్ళీ ప్రవేశపెట్టారు. కానీ అలాంటి ఎత్తైన కట్టడాల పైనుంచీ ఆధాను పలకడాని పైన వున్న నిషేధాన్ని కొంచెం సవరించి, ఇక ప్రక్క ఇళ్ళలోకి చూడటానికి వీలే లేకుండా, "గ్రుడ్డివాళ్లనే మ్యూయెజిన్ గా ఎంపిక చేసుకోవడం" మొదలుపెట్టేరట. అవి అలా సవరణలతో ఎదగడం మొదలు పెట్టి, మసీదు గోపురం కన్నా చాలా ఎత్తుకి ఎదిగి, ఆకాశాన్నే తాకడం మొదలుపెట్టాయి. తరువాత మ్యుయేజన్ల పైన ఆంక్షలను కూడా సడలించారు.

ఇలా మహమ్మద్ కాలంలో తిరస్కరింపబడ్డ మినారులు, తరువాతి కాలంలో ఒక మహమ్మదీయ చిహ్నంగా ఎలా ఎదిగాయి, అన్నది చాలా ఆశక్తికరమైన విషయం. ఎదగడం కూడా అవి మసీదుల గోపురాల కన్నా ఎత్తుగా ఎదగడం మొదలు పెట్టాయి. అల్లాను మించినదేదీ లేదు అన్నది మహమ్మదీయ నమ్మకం. గోపురాలు అల్లాను సూచిస్తాయి. కానీ మినారులు కట్టడంలో సూత్రాన్నే విశ్మరించి, వాటిని గోపురాల కన్నా ఎత్తుగా కట్టడం మొదలయ్యింది. అంతే కాదు అనేక రూపాలలో -- సన్నగా పెన్సిళ్ళలాగా ఒట్టోమాన్ మసీదుల పైన, - మల్టీస్టొరీలతో ఈజిప్టు లోనూ, - చతురస్రాకార స్తంభాలుగా ఆఫ్రికాలోనూ, అనేక రూపాలతో విలసిల్లడం మొదలుపెట్టాయి. మింబార్ (ప్రార్థన జరిపే ప్లాట్ఫారం), మిహ్రబ్లు (ప్రార్థన దిక్కు కోసం కట్టుకున్న గోడ) మారలేదు కానీ, - మినారులు మాత్రం తరువాత పుట్టినా, అవి ఎంతగానో మారిపోయి, అన్నిటి కన్నా ఎత్తుగా ఎదిగి, అనేక రూపాలలో దర్శనమిస్తున్నాయి.

మహమ్మదు ప్రవక్త కాలానికి మహమ్మదీయ ప్రాంతాలలో తెలియని, ఈ మినారులు అసలు ఎలా పుట్టాయి? ఎక్కడి నుంచీ కళను తెచ్చుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానంగా, బ్రిటీషు చరిత్రపరిశోధకుడైన, .జే. బట్లర్ ప్రకారం "ఇవి మాములుక్ కాలపు కైరీన్ మినారు నుంచీ, పుట్టాయని అభిప్రాయపడ్డాడు. వీటికి మూలం అలనాటి ప్రపంచ వింతలలో ఒకటైన అలెగ్జాండ్రియాలోని లైటుహౌసే అని కూడా పేర్కొన్నాడు. పురాతన గ్రంధాల ప్రకారం, ఈ లైటుహౌసు క్రింది భాగం చతురస్రాకారంలో వుండి, అష్టభుజాకారంగా మద్యలో భాగంలోకి మారి, పైభాగానికి వృత్తాకారంలోకి మారుతుంది. అలాగే జర్మన్ వాస్తుచరిత్రకారుడు హెర్మన్ థీర్ష్ దీనిపైన విస్త్రుత పరిశోధనలు జరిపి, ఆ లైటుహౌసు చిత్రాన్నికూడా ఊహించి, రూపొందించాడు.  

 

 

తరువాత, చర్చి టవర్ల నుంచీ "చతురస్రాకారపు  మినారులు" ఉత్పత్తి చెందాయని హెర్మన్ థీర్ష్ ఋజువుచేసాడు; కానీ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మద్యఆసియా దేశాలలోని వృత్తాకారపు మినారులు మాత్రం ఎలా పుట్టాయో చెప్పలేక పోయాడు. ఇవి రోము నుంచీ వచ్చాయేమో అని అభిప్రాయపడ్డాడు, కానీ రోము నుంచీ ఆసియాకి ఎలా చేరాయి అన్నది ఋజువు చేయలేకపోయాడు అంటే చతురస్త్రాకారపు మినార్లను లైటు హైసు నుంచీ, తద్వారా చర్చిల నుంచీ, మహమ్మదీయ వాస్తు కళ తెచ్చుకుందని తెలుస్తున్నది. కానీ వృత్తాకారపు మినారులు ఎక్కడినుంచీ వచ్చాయి అన్నది తెలియలేదు. నిజానికి వృత్తాకారపు మినారులే ఎక్కువగా కనబడతాయి.

మరికొందరు యూరోపియన్ శాస్త్రవేత్తలు, పండితులు,  వృత్తాకారపు మినారులు ఆసియాలోనే, అదీ భారతదేశంలోనే పుట్టి ప్రపంచమంతా వ్యాప్తిచెందాయని ఋజువులు చూపించడం మొదలు పెట్టారు. ఆస్ట్రియన్ వాస్తుచరిత్రకారుడు జోసఫ్ స్ట్రోయ్గోవిస్కీ (1862-1941) ఇటలీ, ఐర్లాండులలోని మినారులు, స్తూపాలు అన్నీ భారతదేశం నుంచే వచ్చాయని ఋజువుచేసాడు. భారతదేశం నుంచీ యూరపు దేశాలలోకి కళ వ్యాప్తి చెందినది అని ఉదాహరణలలో చూపించాడు. ఎర్నేస్ట్ డియాజ్(1878-1961) అనే మరొక ఆస్ట్రియన్ మహమ్మదీయ వాస్తుచరిత్రకారుడు నిరూపించిన దాని ప్రకారం ఇండో-ఆర్యన్ ధ్వజస్థంబాలతో పోల్చి చూపాడు జేంస్ ఫర్గూసన్ కూడా అలాగే అభిప్రాయపడ్డాడు. ఫర్గూసన్ ప్రకారం మినారుల పరిణామదశలో బౌద్ధస్తూపాలను, జైనస్తూపాలనూ, హైందవ విజయసంకేత స్తూపాలను, అధారాలుగా మహమ్మదీయులు గ్రహించారు. రెండూ భారతదేశంలోనివే కనుక, రెండిటికి పోలికలు అనేకం కనుక, ధ్వజస్తంభాల నుంచీ బౌద్ధస్తూపాలు వచ్చాయన్నది చెప్పడానికి పెద్దగా ఋజువుల అవసరం వుండదు.  ఇక భారతదేశంలో స్తూపాలు ఎలాగూ వున్నాయి కనుక, ఇక దీపపు స్తంభాలు, లైటుహౌసులు ఎలా వచ్చాయి అన్నది ఊహించడం కూడా తేలికే. కాకపోతే భారతదేశంలోని బౌద్ధస్తూపాలు చైనాలో పగోడాలుగా, మద్య ఆసియాలో మినారులుగా, ఎలా, ఏ క్రమంలో మారాయి అన్నది ఋజువు చేయడానికి ఉదాహరణల అవసరం వుంటుంది.

  

భారతదేశం నుంచి ధ్వజస్థంబాలు, స్తూపాలుగా మారి, బౌద్ధుల ద్వారా, తూర్పు దిశగా నేపాల్ లోకి, తరువాత, టిబెట్టు, బర్మా, థాయిలాండు, చైనా ప్రాంతాలకి వ్యాప్తి చెంది మెల్లిమెల్లిగా,  క్రింద చూపిన విధంగా, స్తూపాలు కాస్తా చైనీ పగోడాలుగా మారాయి. అలాగే ద్వజస్తంబాలు, స్తూపాలు పశ్చిమ దేశాలలోకి వ్యాపించినప్పుడు మినారులగా పరిణితి పొందాయి.

 

ఇలా బౌద్ధ స్తూపాలే చైనీల బౌద్ధపగోడాలుగా రూపుదిద్దుకుంటూ మారాయని పలువురు శాస్త్రవేత్తలు ప్రస్తుతించారు ఋజువుచేసారు. అలాగే మరొక ప్రక్క భారతదేశంలో ధ్వజస్తంభాలు, స్తూపాలనుంచీ లైటుహౌసులు, మినారులు వంటివి పుట్టాయన్న సిద్ధాంతాన్ని  కూడా ఆకళింపుచేసుకోవడం తేలికే. బౌద్ధస్తూపాలు కూడా అంతస్తులు అంతస్తులుగా పొడుగ్గా కట్టుకోవడం ఆనవాయతీనే. పగోడాలు అలాగే కట్టుకున్నారు. లైటుహౌసులు దీపపుస్తంభాలు అలాగే కట్టుకున్నారు. మినారులుకూడా అలాగే వుంటాయి. వాటి రూపాలుకూడా స్తూపాలనే పోలి కనిపిస్తున్నాయి. ఈ మినారులు కుడా పగోడాల లాగే, అంతస్తులుగా, సన్నగా పొడుగ్గా, అదే క్రమలో రూపంతరం చెందుతూ ఎదిగాయి. బౌద్ధులద్వారా మద్య ఆసియాలోకి ప్రవేశించాయి.  ఏది ఏమైనా సరే కాని, కొందరు మహమ్మదీయులు స్పైరలుగా వుండే మినారులు మాత్రం, ఐరోపాలోని టవర్ ఆఫ్ బాబెల్ వంటి జిగ్గురట్ల నుం చే వచ్చాయని ప్రతిపాదిస్తారు.

కానీ విగ్రహారాధన వున్న టవర్ ఆఫ్ బాబెల్ని ఉదహరిస్తూ, ఖురాన్ లోని సుర 16 ఇలా చెబుతుంది - "దేవుడు భవనం పునాదిని ధ్వంశం చేయడంతో అది పైనుంచీ విరిగి పడింది". అంటే తమ భగవంతునికి ఇష్టం లేని టవరుని మహమ్మదీయులు అనుసరించారనే ప్రతిపాదన సరిగా కనపడదు. అంటే మినార్ల పుట్టుక ఐరోపానుంచీ మాత్రం కాదు అని ఖచ్చితంగా తేల్చేయవచ్చు. భారతదేశం నుంచి, తూర్పుదేశాలు నేర్చుకున్నట్లే, మహమ్మదీయ దేశాలు కూడా నేర్చుకున్నాయని తేలిపోతోంది. బౌద్ధమతం తూర్పుదేశాలలో వ్యాపించినట్లే పశ్చిమదిక్కులోని ఆఫ్ఘనిస్తాను వంటి సుదూర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని అక్కడ కనబడే బౌద్ధ శిధిలాలనుబట్టే తెలుస్తోంది. ఇటీవల ఆఫ్ఘనిస్తానులోని తాలిబాన్లు అక్కడ ఉన్న ప్రపంచంలోకెల్ల పెద్దదైనటు వంటి బుద్ధభగవానుని విగ్రహాన్ని తుపాకులతో కాల్చి చిన్నాభిన్నంచేయడం మనం అందరం ఎరిగిన విషయమే. అలా ఆఫ్ఘన్ ప్రాంతం దాటి వ్యాపించిన బౌద్ధమతం ఆ ప్రాంతాలకు బౌద్ధస్తూపాలను చేర్చడంతో, అక్కడ మినారులు అన్నవి తద్వారా పుట్టాయి అన్నదే సారాంశం.

ఐతే ఇది నమ్మలేని వారు, ప్రపంచంలోని మొట్టమొదటి మహమ్మదీయ మినారు 8వశతాబ్ది నాటి డమాస్కస్ లోని పొట్టిగా కట్టబడిన చతురస్రాకారపుదని చెబుతారు. ఏది ఏమైనా, స్తూపాలు భారత దేశంలో క్రీస్తుపూర్వ కాలం నుంచే వున్నాయని మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది.  కనుక వాదనలో బలం కనిపించదు. అలాగే ఈ డమాస్కస్ మినారు కూడా, అంతకు మునుపు ఉన్న రోమనుల భృహస్పతి మందిరపు శిధిలాలకు చెందిన స్తంభాలే, అని కూడా ఒక నమ్మకం అక్కడ ప్రచారంలో వుందట.

కానీ ఈ స్తంభాలు, మినారులగా ఎలా మారేవో తెలియదు. కానీ, ఉమాయ్యద్ కాలంలో ఎత్తుగా వున్న స్తూపాలను ఆధాన్కు అనువుగా వుంటుందని భావించి ఎక్కేవారని, అలా అవి మహమ్మదీయ మినారులుగా రూపుదిద్దుకోవడం మొదలు పెట్టాయని చరిత్రకారుల సిద్ధాంతం. కాలక్రమేణా వాటి ఉపయోగం ధృవపరుచుకున్నాక,  వాటి ఎత్తును పెంచడం మొదలు పెట్టారట. తరువాత మరిన్ని కొత్త మినారులను కూడా కట్టడం మొదలుపెట్టేరట. ఏది ఏమైతేనేమి మినారులు అసలు మహమ్మదు కాలం నాటికి లేవని, తెలియవని చరిత్రకారులు విశ్వసించడం మొదలుపెట్టారు. మొట్ట మొదటి సారిగా, కావాలని మినారు ఆకారంలో కట్టించుకున్న కట్టడం, -- 8 శతాబ్దినాటి మదీనాలోని మసీదులో ఉండేదట. ఇవి సన్నగా 25 మీటర్ల ఎత్తు వుండేవట. దాదాపు అదేకాలంలో మక్కాలో కూడా మినార్లని ఉమాయ్యద్ ఖాలీఫా కట్టించాడట. కానీ మినార్లను ఆధాన్ కోసం వాడలేదట. వీటిని ధ్వజస్తంభాల లాగా ఇక్కడ ఒక మసీదు (లేక ఆలయం) వుంది అని తెలిపే చిహ్నాలుగానే రూపొందించారట అంటే ఈ మొదటి మినారుల పైన, హిందూ ధ్వజస్థంబాల ప్రభావం ఉండేది అని ఒప్పుకోక తప్పదు.

తరువాత, అంటే 9 శతాబ్ది నాటికి ఆబ్బాసిద్ ఖాలిఫాల కాలంలో మసీదుల పైన మినార్లను నిర్మించడం ఒక మహమ్మదీయ ఆచారంగా రూపుదిద్దుకోవడం మొదలు పెట్టింది. మక్కా మదీనా మసీదులలో అనేక మినారులు ఉన్నా, -- ఆబ్బాసిద్ మసీదుకి ఒకటే --  అది కూడా మక్కా వైపుకున్న (మిహరబ్) గోడపైనే నిర్మిం చి, అలా ఆ మిహరబ్ గోడ పైననే నిర్మించే ఆచారాన్ని కూడా క్రమబద్దం చేసాడు. ఉదాహరణకి ముందు చూపిన సమారాలోని మాల్వియా మసీదు చిత్రపఠాన్ని చూడండి.

మినారులలో రకాలు

మినారులు అన్నీ సన్నగా పొడుగ్గా ఎత్తుగా ఉన్నా, వాటిని కట్టడంలో ఉన్న ఉద్దేశాలు వేరు వేరు. ప్రతి మినారు కట్టడం వెనుక ఒక నిర్ధిష్టమైన ఉద్దేశం ఉంటుంది. కేవలం అలంకార ప్రాయంగా మినారులను నిర్మించరు. మినారులను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు.

1) మహమ్మదీయమత  సంస్థాపనా చిహ్నాలు :- అది మహమ్మదీయత నెలకొన్న ప్రాంతమని తెలిపే సంకేతంగా కట్టిన మినారు; లేక ఇక్కడ మసీదు ఉన్నది అని సుదూర ప్రాంతాలకు తెలిపే మినారు ఉదాహరణగా ఆఫ్ఘనిస్తాన్ లోని ఘజనీ మినారుని, అలాగే డిల్లీ లోనీ కుతుబ్ మినారుని చరిత్రకారులు ఉదహరిస్తారు.

 

ఘజనీ, ఆఫ్ఘనిస్తానులోని 12 శతాబ్దినాటి మినారులో ఈనాడు క్రిందిభాగం మాత్రమే మిగిలి వున్నా, అది 64 అడుగుల ఎత్తుగా వుండి  రాజసంగా నిలిచి కనిపిస్తోంది. దీని పైభాగం ఇటీవలే 1902లోని భూకంపంలో పడిపోయిందట. మినారు  అష్టభుజాకారంలోనే వుంటుంది. ఇది కూడా ఒకనాటి బౌద్ధస్తూపమే అనే వాదనలు కూడా లేకపోలేదు ఇది బౌద్ధస్తూపమని దీనిని మహమ్మదీయులు మినారుగా మార్చుకున్నారనీ, వాటిపైన ఖురాను రాతలు వ్రాయించుకుని తగిన మార్పులు చేయించారనీ, వగైరా, వగైరా వాదనలు వినిపిస్తాయి. కానీ, నిజానిజాలు నిర్థారించడానికి మరింత విశ్లేషణ అవసరం అవుతుంది.

2) విజయస్తూపాలు (ఫలానా విజయస్మారక చిహ్నంగా మినారు):- కుతుబ్ మినారుని విజయస్తూపంగా కూడా చరిత్రకారులు ఉదహరిస్తారు. అలాగే కుతుబ్ మినారు కూడా ఒక హైందవ ఆలయం పైన కట్టారన్న కథలు కూడా వినిపిస్తుంటాయి. అక్కడ వున్న క్రీస్తుపూర్వ కాలం నాటి ఉక్కు స్తంభాన్ని విష్ణువు ఆలయ ధ్వజస్తంభం అనీ దాని పైనున్న సంస్కృత శాశనం బట్టి ఉదాహరణగా చూపిస్తారు. ఐతే మనం చదువుకునే చరిత్ర ప్రకారం, ఈ కుతుబ్ మినార్ - 1199 నాటి 238 అడుగుల ఇస్లాం విజయస్తూపమే తరువాత శతాబ్దంలో ఖిల్జీ ఇంకా ఎత్తైన మినార్ కట్టాలని సంకల్పించినా, దాన్ని పూర్తిచేయలేకపోయాడట ఈ మినారులని ఎవరు కట్టించినా సరే, విజయస్తూపం అన్న ఆలోచన మాత్రం పురాతన హిందూబౌద్ధసాంప్రదాయమే అని ఎవ్వరైనా ఒప్పుకునేదే. ఇలా వీటి పైన హైందవ ప్రభావం మాత్రం నిస్సందేహంగా, ఆనాటి నుంచి కూడా, కనిపిస్తోంది.

అలాగే హైదరాబాద్ లోని చార్మినార్ ని (1591 నాటి)  కూడా ప్లేగు వ్యాది పైన సాధించిన విజయాన్ని చాటే విజయస్తూపంగా కట్టించారని మనకు తెలుసు.  

3) అధాన్ మినారులు (ప్రార్ధనా సమయమయ్యిందని తెలుపుతూ పాడటానికి ఎక్కే మినారులు) :- మినారులు అన్నిచోట్లా కనిపించడానికి, వ్యాపించడానికి, మినారులు మహమ్మదీయ చిహ్నాలుగా మన మనస్సులలో నిలిచిపోవడానికి, జనబాహుళ్యంలో ప్రసిద్ధి పొందడానికి, ఈ అందమైన ఆధాన్ మినారులే, అసలు సిసలైన కారణాలు. రోజుకి 5 సార్లు ఈ మినార్ల పైకి ఎక్కి ఇచ్చే ఆధాన్ పిలుపులతో, మినారులని పదేపదే గుర్తు చేస్తూ, అందరి మనసులలో మహమ్మదీయ చిహ్నాలై నిలిచిపోయాయి ఈ మినారులు. ప్రపంచంలో నలుమూలలా కనించే మినారులలో ఆధాన్ మినారులే ఎక్కువ. ప్రతి మసీదులోని మినారు దీనికి ఉదాహరణే. కాలగర్భంలో మహమ్మదీయ మత సంస్థాపన మినారులు, విజయస్తూపాల మినారుల  ప్రక్రియలు మరుగున పడి, నేడు మినారు అంటే ఈ ఆధాన్ మినారుల నిర్మాణమే మిగిలింది.

అలా అనతి కాలంలోనే, మినారులు మసీదు వాస్తులో అంతర్భాగమైపోయాయి. మధ్య ఆసియా ప్రాంతంలో, 11- 13 శతాబ్దాల మద్య కాలంలో, మసీదులపైన 60కి పైగా స్తూపాకారపు మినారులు కట్టబడ్డాయి ఇంకా ఎత్తు, ఇంకా ఎత్తు, అని కట్టుకుంటూ పోతున్న రోజులలో, మసీదుకి ఒక్క మినారే కాదు, ఇరుపక్కలా రెండు కడదాం, అన్న భావన చిగురించడం మొదలు పెట్టిందట. ఆలా 14 శతాబ్దికాలం నాటికి మసీదు గోడ పైన రెండు మినారులు సౌష్ఠవంగా కట్టడం అన్నది, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఒక కొత్త ఆచారంగా ఊపునందుకుంది. అలా మద్య ఆసియాలోని మహమ్మదీయుల సంస్కృతిలో మినారులు ఒక అంతర్భాగమైపోయినా, భారతీయ మహమ్మదీయులలో ఆనాటికి కూడా  మసీదులపైన మినారులు కట్టుకునే సాంప్రదాయం ఇంకా రాలేదు. భారతీయ మహమ్మదీయులు ఆధాన్ పిలుపును 15వ శతాబ్దిలో కూడా మసీదు పైకప్పులమీద నుంచే ఇచ్చేవారు. మెల్లిగా ఆజ్మీరులోని మసీదులోను, అలాగే గుజరాత్ లోని మసీదులోను మినారులు చిగురించడం మొదలు పెట్టాయట.

దాదాపు అదేకాలం నాటి, అంటే 1632నాటి,  తాజమహల్ సమాధి పక్కన నాలుగు మినారులు కట్టారని మన చరిత్ర చెబుతోంది. కానీ ఇక్కడ గమనించాల్సినదేమిటంటే, అవసరం ఉన్న చోట (అంటే, తాజమహల్ మసీదుకి) ఒక్క మినారు కూడా లేదు. కానీ సమాధికి నాలుగు మినారులు ఉన్నాయి. అంతేకాదు, ఆ కాలం నాటి మిగితా మహమ్మదీయ సమాదుల పైన మినారులు కనిపించకపోవడం కూడా గమనార్హమే.

ఉదాహరణకి కొంచెం ముందు కాలంలో కట్టిన హుమాయున్ సమాధికి కాని, కొంచెం తరువాత కాలంలో కట్టిన గోల్‌గుంబజ్ సమాధికి కానీ మినారులు వుండవు. మరి సంప్రదాయమే లేని తాజమహల్ సమాధి చుట్టూ నాలుగేసి మినారులు వుండగా, మినార్ల సాంప్రదాయము ఉన్నటు వంటి మసీదుకి ఒక్క మినారు కూడా ఎందుకు లేదు? ఎక్కడో పెద్ద తేడానే  జరిగిందని అనిపించడం లేదూ?

తాజమహల్ కాలం నాటి మిగితా మహమ్మదీయ మినారులను గమనిస్తే తెలిసే విషయాలివి. మంగోలియాలోని మసీదుకి నాలుగు మినారులు కట్టారు, అందులో రెండు మసీదు భవనం పైనే కట్టారు, రెండు బయట గోడ పైన కట్టారు. ఒట్టోమాన్ స్థపతి యైన సినాన్ (1550-1556) కట్టడాలలో ఇస్తానుబుల్లోని సిలేమాన్ మసీదులో నాలుగు మినార్లను కట్టడం తొలిసారిగా కనబడింది. వీటిలో రెండు పొడుగ్గావుంటాయి. రెండు పొట్టిగా వుంటాయి. ఇతడు కట్టిన సుల్తాన్ సలీం మసీదులో నాలుగూ ఒకే ఎత్తులో (230 అడుగులు) వుంటాయి.

ఇక 16 శతాబ్ది కాలంలోని జావా దీవిలోని ఖుద్దూస్ మినారు చూస్తే అక్కడి మసీదుకీ మినారుకీ పోలిక కనపడదు. మసీదుని చెక్కతో కడితే, మినారు మాత్రం అక్కడి స్థానిక హిందువుల కట్టడంలా కనిపించడమే కాకుండా హైందవ గాలిగోపురాన్ని పోలి కనిపిస్తుందట. అంటే మినారుపై కూడా హిందువుల ప్రభావం స్పష్ఠంగా కనిపిస్తోంది. లేక హైందవ స్తూపాన్నే మినారుగా మార్చుకున్నారు అని తెలుసుకోవచ్చు.

ఇక భారతదేశంలోని తాజమహల్‌ని చూస్తే, అక్కడ మసీదు పైన ఒక్క మినారు కూడా లేదు. ఉన్న నాలుగు మినారులూ సమాధి చుట్టూతానే వున్నాయి. అంటే ఇవి అధాన్ పిలిపు కోసం వాడిన మినారులు కావు. అలాగే ఇది సమాధి కనుక ఇవి విజయస్తూపాలు అయ్యే అవకాశం కూడా కనపడటం లేదు. ఈ మినారులు గోపురం కంటే ఎత్తుగా కూడా లేవు కనుక మహమ్మదీయమత సంస్థాపనా మినారులు అని కూడా అనుకోవడానికి లేదు. పోనీ రాజపుత్రులైతే కాపలాకోసం కట్టుకున్న చత్రీల వంటివి అనుకోవచ్చు. షాజహాన్‌ని  చూస్తే రాజపుత్రుడు కూడా కాడు. అందునా సమాధికి కాపలాలు అనవసరం. మరి ఏమిటివి?

పోనీ, ఎందుకో కట్టారులే అనుకుందాం. ఐనా, అవి కూడా మహమ్మదీయ అచారానుసారం ముఖ్యకట్టడం పైన లేవు. నాలుగూ ముఖ్య కట్టడానికి దూరంగానే ఉంటాయి. సార్సెనిక్ వాస్తు ప్రకారం మినారు అన్నది ముఖ్యకట్టడం పైనే వుండాలి కానీ దూరంగా కాదు. అంతే కాదు, నాటి మహమ్మదీయ ఆచారం ప్రకారం, మినారు అన్నది కడితే, అది కట్టడంలో అన్నిటికన్నా ఎత్తుగా ఉండాలి. కానీ తాజమహల్ మినారులన్నీ గోపురాని కన్నా పొట్టిగానే వుంటాయి. అంటే ఇది మహమ్మదీయ లేక సార్సెనిక్ వాస్తు ప్రకారం కట్టినది కాదు. మొగల్ కట్టడాలన్నీ సార్సెనిక్ వాస్తుతోనే కట్టారని ప్రతీతి.  "అంటే తాజమహల్ మినారులు మొగలాయిలు కట్టించినవి కావు", అని తేల్చేసే ముందు, తతిమా మసీదు భవనాలను ఉదాహరణకి పరిశీలించి చూద్దాం.

సారసెనిక్ వాస్తులో మినారులు మసీదు లేక ముఖ్యభవనం పై నుంచీ మొలుస్తాయి కానీ, ముఖ్యభవనానికి పక్కన కట్టరు. అంటే మహమ్మదీయ మినారులు పైన చూపిన చిత్రాలలోలాగా వుంటాయి. కానీ తాజ్మహల్లో నాలుగు మినారులలో ఒక్కటి కూడా ముఖ్యకట్టడానికి పైన లేవు. అన్ని దూరంగానే విడివిడిగా కట్టారు. అంటే తాజ్మహల్ లోని మినార్లలో సారసెనిక్ వాస్తు ప్రేరణ కనపడదు. మినార్లు ఒక మహమ్మదీయ నిర్దేశిత అవసరానికి కట్టినవి కావు. కనుక తాజమహల్ మినార్లని కట్టినవారు మహమ్మదీయులు కారు అని నిర్థారించవచ్చు.

తాజమహల్ నిర్మాణాన్ని, లేక మరమత్తులని షాజహాన్ కొడుకైన ఔరంగజేబే పర్యవేక్షించాడని ముందు అధ్యాయాలలో తెలుసుకున్నాము. ఈ ఔరంగజేబే మళ్ళీ తాజమహల్ లాంటిదే మరొక కట్టడం నిర్మించాలని తలపెట్టి, ఔరంగాబాదులో కట్టించిన "బీబీ కా ముక్బర" లోని కూడా మినారులు కూడా (పైన చూపిన పటంలో లాగా) గోపురం కన్నా ఎత్తుగానే వుంటాయి. అంటే "తాజమహల్ మినారుల విషయంలో ఉన్న సార్సెనిక్ దోషం సంగతి అతడికి కూడా బాగా తెలుసు", అని మనం గమనించవచ్చు. దోషం సంగతి తెలిసి ఎందుకు అలా కట్టిస్తాడు? అవి ముందు నుంచీ అలాగే వున్నాయి కనుక, అవి అతడు కట్టించినవి కావు కనుక, అని మనం గ్రహించవచ్చు.  

కాకపోతే తాజమహలుకి నకలుగా రూపొందించడం మొదలు పెట్టాడు కాబట్టి, ఔరంగజేబుకు కూడా మినారులని ముఖ్యకట్టడానికి దూరంగానే వుంచవలసి వచ్చింది. అది కూడా మారిస్తే, అసలు నక్షానే మారిపోయి,  కట్టడం మొత్తం వేరే రకంగా మారిపోతుందేమోనన్న భయంతో కాబోలు, ఆ దోషాన్ని మాత్రం సరిపెట్టుకుని వదిలేసాడు.

అంతే కాదు తాము కట్టించిన తాజమహల్ కట్టడం వంటిదే మళ్ళీ ఎందుకు కట్టించాలనుకున్నాడు? సరే అనుకున్నా, అలా అందుకు కట్టించలేక పోయాడు? ఫర్గూసన్ కూడా ఈ నకిలీ తాజమహల్ ని "వల్గర్ ఇమిటేషన్ ఆఫ్ తాజమహల్" అని వర్ణించాడు అంటే, ఆ కట్టడంలోని శిల్పకళ, నాణ్యత ఎంత తక్కువ వుందో తెలుస్తోంది. ఇందులో కూడా జయపూరు నుంచీ తెప్పించిన పాలరాయే వాడారే? తాజమహల్ ఆకారంలోనే కట్టారే? మరి దీన్ని చూస్తే ఆ అనుభూతి ఎందుకు కలగడం లేదు? ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఒక్కటే! మొదటి తాజమహల్ వారు కట్టించినది కాదు కనుక! వారు నేర్చుకోవడానికి రెండవ తాజమహల్ మొదలు పెట్టి, దాన్ని మొదటి తాజమహల్ లాగా కట్టలేకపోవడమే --- "మొదటి తాజమహల్ వారి కట్టడం కాదు అని నిరూపిస్తోంది"!

భారత దేశంలో మినార్ల యుగం తాజ్మహల్తోనే మొదలయ్యిందని నిరూపించవచ్చు నేమో గానీ, మినార్ వుంది కనుక తాజ్మహల్ మహమ్మదీయ కట్టడమని  మాత్రం చెప్పలేము. స్తూపాల ఆచారం అంతకు ముందు నుంచే వుంది కనుక అది హిందువుల లేక జైనుల లేక బౌద్ధుల స్తంభాలు లేక స్తూపాలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది, అని చెప్పుకోవచ్చు.

మహమ్మదీయులు భారతదేశానికి రాక మునుపే, మినార్ల కంటే చాలా ముందు కాలం లోనే, జైనులు తమ ఆలయాల చుట్టూ నాలుగు దీపపు స్తంభాలను కట్టుకునేవారు. ఆచారం ఇప్పటికీ వారి ఆలయాలలో కనిపిస్తుంది. అంతే కాదు, వారి ఆలయాలని పాలరాతితో కట్టుకునే సాంప్రదాయం కూడా ఎప్పటి నుంచో వుంది. అలాగే " భారతదేశంలో నౌకాయానం క్రీస్తుపూర్వం నాటి నుంచీ వుంది" అని చరిత్ర ఒప్పుకునే విషయమే. దీపపుస్తంభాలు (లేక లైటుహౌసులు) అలా ఎప్పటినుంచో మన కట్టడాలలో భాగమై నిలిచాయి. ఇక తాజమహల్ని చూస్తే అది యమునా నది ఒడ్డున ఉన్నటుగా తెలుస్తోంది. భవనం వద్ద నౌకలు ఆగేవని, అక్కడ ఉన్న లంగరు రింగుల వల్ల తెలుస్తోంది. కారణం చేత అక్కడ దీపపు స్తంభాలు వుండటం సబబుగానే అనిపిస్తుంది. అంతేకాక జైన మందిరాలకి చుట్టూ నాలుగు దీపపు స్తంభాలు ఉండాటం కూడా సదాచారమే.

అంటే తాజమహల్ లోని మినారులు నిజానికి మహమ్మదీయ మినారులు కావు అని గ్రహించగలుగుతున్నాము కనుక, ఆ మినారులు నౌకాయానానికోసం వాడిన లైటుహౌసులు అయివుండవచ్చు, లేక జైనుల మందిర దీపపుస్తంభాలైనా అయి వుండవచ్చు. షాజహాన్ ఆ భవనాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ స్తంభాలను మినార్లుగా ప్రకటించివుండవచ్చు.

అంటే క్లుప్తంగా మినార్ల యుగం ఇలా మొదలయ్యింది అని చెప్పుకోవచ్చును,

1) భారతదేశంలోని ధ్వజస్తంభాల నుంచీ బౌద్ధ జైన స్తూపాలు పరిణితి చెందాయి.

2) ఇవి అన్నిదేశాలకు వెళ్ళి కొన్ని చోట్ల పగోడాలుగా, కొన్ని చోట్ల మినారులుగా, పరిణితి పొందాయి. భారతదేశంలోనూ మిగితా దేశాలలోను ఇవి లైటుహౌసులుగా, దీపపు స్తంభాలుగా కూడా పరిణితి పొందాయి.

3) తాజమహల్లోని దీపపుస్తంభాలను లేక  లైటుహౌసులను మినారులుగా మొగలాయులు మలుచుకున్నారు లేక చిత్రీకరించుకున్నారు.

4) మొగలాయిల కాలం తరువాత, కేవలం మహమ్మదీయులే (ఎక్కువగా) మినారులను కట్టుకోవడంతో మిగితా మతస్తులు వాటిని మహమ్మదీయ చిహ్నాలుగా పరిగణించి వారు ఇటువంటి స్తూపాలను కట్టుకోవడం తగ్గించారు. అలా మినారులు మహమ్మదీయతను ప్రతిబింబించడం మొదలు పెట్టాయి.

అందుచేత తాజ్మహల్లో మినార్లున్నాయి కనుక అది సార్సెనిక్ వాస్తు అని చెప్పడానికి మాత్రం ఆస్కారం లేదు. పైపెచ్చు భారతదేశంలో ఆ నాటి మహమ్మదీయులకు మినారులు కట్టుకునే ఆచారం కూడా లేదని తెలిసింది. ఈ విశ్లేషణ వల్ల తాజమహల్ గోపురం కానీ, మినార్లు కానీ, అసలు మొత్తం తాజమహలే మొగలులు కట్టినది కాదని నిర్ధారించవచ్చు. అంతే కాదు, కట్టడం షాజహాన్ కన్నా చాలా ముందు కాలం నాటిదని కూడా తెలుస్తోంది.  తాజమహల్,  షాజహాన్ల కథ మొత్తం అనుమానాస్పదమేనని అనిపిస్తుంది.

మరి ఈ తాజమహల్ హైందవ భవనమా లేక మందిరమా? లేక బౌద్ధ లేక జైన మందిరమా? ఇంతకీ మనం మొదటి భాగంలో చర్చించుకున్న తాజమహల్ గోపురం పైన ఉన్న పద్మ చత్రమేమిటి? ఇంకా అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. కనీసం ఇది మహమ్మదీయ కట్టడం కాకపోవచ్చని ఈ ఐదు భాగాలలో దొరికిన ఆధారాల వల్ల, విశ్లేషణ వలన  గ్రహించవచ్చు. మిగితావి కూడా తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం (సశేషం).

మీ

రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech