కబుర్లు  
     సిలికానాంధ్ర కబుర్లు

రచన : కొండుభట్ల దీనబాబు,
అద్యక్షులు , సిలికానాంధ్ర  

 

ఆంతర్జాతీయంగా అనుపమానమైన పేరు తెచ్చుకుని, తనదైన శైలిలో తెలుగు సాహితీ, సాంస్కృతిక , సంప్రదాయ స్ఫూర్తిని నిలబెట్టడానికి నిరంతరం శ్రమిస్తున్న సిలికానాంధ్ర సంస్థ నందన నామ ఉగాది ఉత్సవాన్ని మార్చి ఇరవై నాలుగున సిలికాన్ వేలీలో విజయవంతంగా నిర్వహించింది. మొదటినుంచి చివరిదాకా సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానాంశం జంటకవుల అష్టావధానం. వినూత్నమైన, విశిష్టమైన ఈ అవధాన కార్యక్రమంలో తమ పాండితీ ప్రకర్షని ప్రదర్శించిన జంట అవధానులు గురు సహస్రావధాని డా.కడిమిళ్ళ వరప్రసాద్ గారు, శ్రీ కోట లక్ష్మీనరసింహం గారు. రెండున్నర గంటలపాటు సాగిన ఈ అష్టావధాన కార్యక్రమానికి సంచాలకుడిగా కిరణ్ ప్రభ వ్యవహరించారు. కార్యక్రమం ఆరంభంలో కిరణ్ ప్రభ, జంట కవుల అష్టావధాన కార్యక్రమంలోని ప్రత్యేకతని వివరంగా ప్రేక్షకులకి తెలియచేశారు. ఈ అవధానంలో నిషిద్దాక్షరి అంశాన్ని నిర్వహించిన రావు తల్లాప్రగడ , విజయవాడ కనకదుర్గని ప్రశంసిస్తూ చెప్పమని అడిగిన పద్యానికి అడుగడుగున అవధానులకి నిషిద్దం విధిస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. దత్తపది అంశంలో డా.కె.గీత, ఎలుగు, వృషభం,వానరం, జంబుకం పదాలతో భర్త గొప్పదనాన్ని పొగుడుతూ భార్య పరంగా పద్యం చెప్పమని అడిగారు. అవధానులిరువురూ అత్యంత ప్రతిభావంతంగా, భావస్ఫోరకంగా ఆవృత్తానికొక పాదం చొప్పున ఈ దత్తపదిని పూరించి ప్రేక్షకుల మన్ననలందుకున్నారు. ఒక విజేత మనస్తత్వాన్ని వర్ణించమని గుండా శివచరణ్ అడిగారు. హర్మ్యంబందునహాయిగా తిరిగిరే ఆ పార్వతీ, కృష్ణులున్ అన్న అంశాన్ని సమస్యాపూర్ణానికి ఇచ్చారు పుల్లెల శ్యామ్ సుందర్. ఆవృత్తానికొక సందర్భాన్ని ఇచ్చి ఆశుకవితలు చెప్పమని కూచిభొట్ల శాంతి గారు అవధానులని అడిగారు. వంశీ ప్రఖ్య వ్యస్తాక్షరి, తాటిపామల మృత్యుంజయుడు పురాణ పఠనం అంశాలని నిర్వహించగా , కార్యక్రమం జరుగుతున్నంత సేపూ మధుబాబు ప్రఖ్య తన చెణుకులతో వ్యంగ్యోక్తులతో అవధానుల ఏకాగ్రతకి పరీక్ష పెడుతూ అప్రస్తుత ప్రసంగం కొనసాగించారు . అవధానులు కడిమిళ్ళ గారు, కోట గారు ప్రదర్శించిన భావ సమన్వయం అద్వితీయం. ఒకరి తర్వాత ఒకరుగా పద్యపాదాలని పూరించే ప్రక్రియ ప్రేక్షకులని ఆశ్చర్యానందాలలో ముంచెత్తింది. జంటకవుల పద్యప్రవాహం నందననామ ఉగాదికి కవితాహ్వానం పలికింది. కార్యక్రమం ఆరంభంలో సిలికానాంధ్ర అధ్యక్షుడు దీనబాబు కొండుభొట్ల సిలికానాంధ్ర చేపట్టిన, కొనసాగిస్తున్న విశిష్టకార్యక్రమాలని వివరించారు. రాబోయే మే నెలలో హైదరాబాదులో జరగనున్న మంగళవాద్య సమ్మేళనం విశేషాలని కూడా దీనబాబు తెలియచేశారు. అవధానానికి ముందు మారేపల్లి వెంకట శాస్త్రి గారు పంచాంగ పఠనం చేసి , ఈ సంవత్సరం రాసి ఫలాలని వివరించారు. అవధానం అనంతరం జంట కవులని సిలికానాంధ్ర కార్యవర్గం సన్మానించారు. మే నెలలో సిలికానాంధ్ర నిర్వహించబోతున్న ఆంధ్రకుటుంబ శిబిరం గురించిన వివరాలని సిలికానాంధ్ర వైస్ ఛైర్మన్ దిలీప్ కొండిపర్తి తెలియచేశారు. శిబిరదళాన్ని కూడా దిలీప్ ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఆ రోజు ఉదయం నుంచీ చిన్నపిల్లలకి తెలుగుభాషా పోటీలు నిర్వహించారు. వందలాది మంది చిన్నారులు సంప్రదాయ బద్ధమైన వస్త్రధారణలో తమ తెలుగు భాషా పాటవాన్ని ప్రదర్శించారు. ఈ మొత్తంకార్యక్రమాన్ని కాజ రామకృష్ణ సమన్వయించారు. బండి ఆనంద్, చామర్తి రాజు, వంశి నాదెల్ల, స్నేహ వేదుల ,అనిల్ అన్నం, కిరణ్ కొండుభట్ల,విజయ్ సారధి మాడభూషి,కష్యప్ జమ్మలమడక, వికాన్ విన్నకొట, మంగళంపల్లి వసంత మొదలైన సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు ఈ నందన నామ ఉగాది కార్యక్రమం విజయవంతమవడానికి అహర్నిశలు శ్రమించారు. కార్యక్రమం అనంతరం పదహారణాల తెలుగు భోజనాన్ని సిలికానాంధ్ర కార్యకర్తలే స్వయంగా వండి వడ్డించారు. ప్రేక్షకులకి నిజమైన ఉగాది ఉత్సవాన్ని ఆస్వాదించిన అనుభూతి కలిగింది.

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech