శీర్షికలు  
     సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 16
 

- రచన : సత్యం మందపాటి

 

    రమణ – సంస్మరణ

రెండు మూడు వారాల క్రితం అనుకుంటాను, స్వాతి వార పత్రికలో ఒక వ్యాసం చదివాను. అ వ్యాసం పేరు నాన్న, మామ, మేము అను తోక కొమ్మచ్చి. వ్రాసినది అను ముళ్ళపూడి. అవును. తెలుగు సాహిత్యంలో హాస్యానికి మరో నిర్వచనం ఇచ్చిన, మన గురువుగారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారి అమ్మాయి అనూరాధ ముళ్ళపూడి.  ఆ శైలి కానీ, అందులోని హాస్యం కానీ, నవ్విస్తూనే ఏడిపించే వ్రాసిన తీరు కానీ చదువుతుంటే నాకు రమణగారే కనిపించారు. వెంటనే కాలిఫోర్నియాలోని అనుని పిలిచాను.

చాల బాగా వ్రాశావమ్మా! మీ నాన్నగారు గుర్తుకొచ్చారు. అని మెసేజ్ పెట్టాను.

రెండు వారాల తర్వాత అను ఫోన్ చేసి, రమణగారి సంవత్సరీకాలకు ఇండియా వెళ్లి అంతకు ముందు రోజే తిరిగి వచ్చానని చెప్పింది.

రమణగారు ఇక్కడ సాహిత్యపు విందులు పూర్తి చేసుకుని, ఇంకెక్కడో సాహితీ సమావేశాలకి హడావిడిగా వెళ్ళిపోయి అప్పుడే ఒక సంవత్సరం అయిందా అనిపించింది. అ రోజంతా అయన తీపి గురుతులతోనే గడిపాను.  ఆరోజు రాత్రీ, తర్వాత ఇంకో రెండు రోజులు, నా స్వంత గ్రంధాలయంలో వున్న, రమణగారి ఆత్మకథ మూడు పుస్తకాలు - కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చిలతో కాలాన్ని కాస్త వెనెక్కి తిప్పుకుని, అ మధుర స్మృతులతో గడిపాను. అ ఆలోచనల ఫలితమే ఈ రమణగారి సంస్మరణ.

                             ౦                           ౦                           ౦

ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూ గారిలా బొమ్మలు వేద్దమనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా టెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు. అదేరకంగా కథలు వ్రాసే నాబోటి వాళ్ళు రమణగారిలా వ్రాయలనుకుంటారు. ముఖ్యంగా హాస్య కథలు వ్రాసేవాళ్ళు. కనీసం ఒక్క కథ అయినా అయన బాణిలో వ్రాస్తే, వ్రాసారని ఎవరైనా అంటే, ఇక వారి జన్మ తరించినట్టే!                                                                                       

నేనూ చేశాను ఆ పని. గోపాలం, భామ అనే పేర్లు పెట్టి భార్యాభర్తల మధ్య జరిగే తీయటి చేదు నిజాల్ని

హాస్యం రంగరించి మూడు కథలు వ్రాశాను. శయనేషు రంభ, కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని. ఆంధ్రభూమి వారపత్రికలో ఆ కథలు ప్రచురింపబడ్డాయి. కొంతమంది పాఠకులు రమణగారి శైలిలో వున్నాయి అంటే, ఎవరూ చూడకుండా, ఎగిరి గంతేసినట్టు కూడా గుర్తు. ఈ మధ్యనే యువ జంట సీత, సీతాపతిలతో భోజ్యేషు మాత కూడా వ్రాసి స్వాతి పత్రికకి పంపించాను. ఇదెందుకు వ్రాశానంటే కథా రచయితల మీద రమణగారి ప్రభావం ఎంత వుందో చెబుదామని. మరి అది ప్రభావమా, కాపీనా అనే వాళ్ళు కూడా వున్నారు. దాని గురించి రమణగారు అన్నారు, కాపీ రైటు అంటే కాపీ కొట్టటం రైటు అని!

రమణగారి రచనల గురించి ఇక్కడ చెప్పటం, హనుమంతుడి ముందు గుప్పికంతులు వేసినట్టే! అందుకే అయన రచనల మధుర స్మృతులు మీకే వదిలేస్తున్నాను. 

తెలుగు భాషలోకి తమిళం సంస్కృతం ఇంగ్లీషు మొదలైన ఎన్నో భాషలలోనించి ఎన్నో పదాలు వచ్చాయి. వాటితో పాటూ రమణగారు ఎన్నో కొత్త పదాలను తెలుగు భాషకి పరిచయం చేయటమే కాకుండా, ఇంటింటా రోజూ వాడకంలోకి కూడా తెచ్చారు.

అలాటి వాటిలో కొన్ని: హన్నా, తీతా, ఆమ్యామ్యా, అప్పుతచ్చులు, ఖద, జాటర్ డమాల్, తుత్తి,  మొదలైనవి ఎన్నో...

రమణగారి ప్రభావం పాఠకుల మీద ఎంత వుందో నేను వేరే చెప్పాల్సిన పని లేదు. బాపు రమణలు మన నిత్య జీవితంలో రోజూ, ప్రతిరోజూ కనపడే రకరకాల వ్యక్తుల్ని సజీవమైన పాత్రల రూపంలో మనం ఏనాటికీ మరిచి పోకుండా చేశారు. ఎవరైనా మనల్ని అప్పు అడిగితే అప్పారావ్ గుర్తుకొస్తాడు. లంచాలు కుంచాలతో కొలిచే వాళ్ళని చూస్తే తీతా గుర్తుకొస్తాడు. రెండు జడలు వేసుకున్న అమ్మాయిని చూస్తే, రెండు జడల సీత గుర్తుకొస్తుంది. ఆమె వెనకనే ఈల వేస్తూ వెళ్ళే బాబాయి గుర్తుకొస్తాడు. అల్లరి చేసే పిల్లాడిని చూస్తే జాటర్ డమాల్ బుడుగు గుర్తుకొస్తాడు. అతని పక్కనే వున్న సీగానపెసూనంబని మరిచిపోలేము కదా!  బుడుగు నాన్న గోపాలం, రాధ కవ్విస్తూ నవ్విస్తూనే వుంటారు. పక్కింటి లావుపాటి పిన్నిగారు దాని ముగుడూ లేని ఇరుగూ పొరుగూ వుంటుందా? ఆకాశంలో ఎర్రటి సూర్యుడిని చూస్తే, అక్కడ హత్య జరిగిందేమోననే అనుమానం కూడా రేకేత్తిస్తారు. ఇలా ఎన్నో రకాల మనుషుల్ని, మన ముందుకి తెచ్చి, మరిచిపోకుండా చేయటం రమణగారికి అదో తుత్తి.

అంతే కాదు. ఇలాటి పాత్రల్ని సృష్టించి, రమణ ప్లస్ బాపుగార్లు గొప్ప హాస్యం పుట్టించి మనల్ని పాడు చేశారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ. లేకపోతే ఏమిటి చెప్పండి – ఆంధ్రాలోనే కాదు అమెరికాలో వున్నా కూడా ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, హఠాత్తుగా ఆ సంఘటనలకు సంబంధించిన రమణగారి జోకు ఏదో గుర్తుకు వచ్చి, నాలో నేనే నవ్వుకుంటుంటాను. అది చూసి నా చుట్టుపక్కల వున్నవాళ్ళు నేనో పిచ్చి శంకరయ్యననుకునే అవకాశం కూడా వుంది. ఉదాహరణకి విమానం ఎక్కినప్పుడల్లా పైలట్ నాకు విమానం తోలేవాడిలా కనిపిస్తాడు. ఏదన్నా అర్ధం పర్ధం లేని సినిమా చూసినప్పుడల్లా భశుం అనటం అలవాటయిపోయింది. ఈమధ్య ఆఫీసులో అమెరికన్ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కూడా, వాళ్ళు నన్ను అపార్ధం చేసుకోకుండా, ముందుగానే రమణగారి జోకుని ఇంగ్లీషులోకి అనువాదం చేసి వాళ్లకి చెప్పేసి, అప్పుడు నాలో నేనే నవ్వుకుంటున్నాను. అందువల్ల అపార్ధసారధుల సంఖ్య తగ్గిపోయినట్టు అనిపిస్తున్నది.

అయన రచనల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. సరదాగా వ్రాస్తూనే, హఠాత్తుగా సాంఘిక, రాజకీయ, మానవతావాదంతో చెంప చెళ్లుమనేలా కొట్టి మరిచిపోకుండా చేసే రచనా చాతుర్యం.

మచ్చుకి కొన్ని: (అంటే అరడజను)

నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో

సిఫార్సులతో కాపురాలు చక్కబడవు”

సత్యాన్వేషికి సమాధానమేమిటని ఒక గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటాడు

పగటి కల అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనసులో పేరుకుపోయిన దురాశలనీ నిరాశలనీ, అందీ అందని ఆశలుగా పరిమార్సివేసే మందు. మితంగా సేవిస్తే, గుండెకూ, కండకూ పుష్టినిచ్చే దివ్యౌషధం

టైము అనగా కాలము. చాల విలువైనది. బజార్లో మనం మిరపకాయలు కొనగలం. చింతపండు కొనగలం. ఇడ్లీలు, కిడ్నీలు కొనగలం. గొడుగులు, గోంగూర కొనగలం. బాల్చీలు, లాల్చీలు కొనగలం. కానీ కాలాన్ని మాత్రం కొనలేం. కాలాన్ని వృధా చేయటం క్షమించరాని నేరం

          వారానికి అర్ధ రూపాయి ఇస్తే, రోజూ హోటల్ భోజనపు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చే వరకు వుంచి, నువ్వు రాగానే పడేస్తా!

          ఇలాటివి చదువుతుంటే, శ్రీశ్రీలా ఆకలేసి కేకలే వెయ్యఖ్కర్లేదు, రమణగారిలా ఆకలేసినప్పుడు జోకులేసి కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది.  

          దటీజ్ రమణ!

ముళ్ళపూడి వెంకట రమణ!

మీరు ఎక్కడికీ వెళ్ళలేదు సార్!

ఇక్కడే సజీవంగా వున్నారు!

మీ రచనల్లో!

తెలుగు సాహిత్యంలో!

మా హృదయాల్లో!

 

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech