శీర్షికలు  
      సంగీత సౌరభాలు - 4

 - రచన: సంగీతాచార్య డా|| వైజర్సు బాలసుబ్రహ్మణ్యం

 

సద్గురు శ్రీ త్యాగరాజ శిష్య శిరోమణి శ్రీ వాలాజాపేట వేంకటరమణ భాగవతార్ - జీవిత విశేషములు

వ్యాసో నైగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మా మునిః

వైరాగ్యే శుక యేవ భక్తి విషయే ప్రహ్లాద యేవ స్వయం

బ్రహ్మా నారాద యేవ చాప్రతిమయోః సంగీత సాహిత్యయోః

యో నామామృత పాన నిర్జిత శివాహ్ తం త్యాగరాజం భజ||

వేదముల అధ్యయనములో వ్యాస మహర్షితో, లలితమైన పదములతో కూడిన కవిత్వము వ్రాయుటలో వాల్మీకితో, విషయ పరిత్యాగమునందు శుకునితో, అపార భక్తి తత్త్వమునకు ప్రహ్లాదునితో, సాహిత్య విషయములందు బ్రహ్మతో, సంగీతమునందు నారదునితో, రామనామ గానరసపానమునందు శివునితో సరియైన శ్రీ త్యాగరాజస్వామి వారికి నమస్కరిస్తున్నాను అని గురువుగారైన త్యాగరాజ స్వామివారిని స్తుతిస్తూ వాలాజాపేట వేంకటరమణ భాగవతార్ గారు వ్రాసిన ఈ గురు స్త్రోత్ర అష్టకములోని శ్లోకమును ఈనాటికీ స్మరించని వారుండరంటే అతిశయోక్తి కాదు.

వాలాజాపేట వేంకటరమణ భాగవతార్ గారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ప్రియ శిష్యుల్లో ప్రథమగణ్యులు. వీరు గొప్ప సంగీత విద్వాంసులు మరియు స్వరజతులు, వర్ణములు, కృతులు, తిల్లానాలు వంటి అనేక రచనలు చేసిన వాగ్గేయకారులు కూడా. ఇంతేకాక, వీరు గురువుగారి సంగీత సంపదను తరువాతి తరముల వారికి అందించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడమే కాకుండా, అనేకమంది వాగ్గేయకారుల రచనలు, గ్రంథములు సేకరించి, భద్రపరచి సంగీత లోకమంతటికీ మహోపకారము చేశారు.

వీరు ఇటీవల కాలమునకు చెందినవారైననూ, వీరి యదార్థ జీవిత వృత్తాంతములు, వీరి రచనలు సంపూర్ణముగా మనకు లభించడంలేదు. కొంతవరకు వీరి జీవిత విశేషములను తెలుపు గ్రంథములు, వ్యాస రచనలు మాత్రం లభ్యమవుతున్నాయి. వీటివలన తెలియవచ్చే వీరి జీవిత విశేషాంశములు సంగ్రహముగ ఇక్కడ పేర్కొనబడినవి.

తాత తండ్రులు:

సంస్కృతాంధ్రములలో పండితులు మరియు గొప్ప ఖగోళ శాస్త్రకారులు అయిన కుప్పయ్య భాగవతార్ గారి పౌత్రుడే శ్రీ వేంకటరమణ భాగవతార్. కుప్పయ్య భాగవతార్ గారు తమిళనాడులోని తిరుచి సమీపంలో గల అరియలూరు గ్రామమునకు చెందిన సౌరాష్ట్ర బ్రాహ్మణులు. వీరి పుత్రులైన నన్నుస్వామి భాగవతార్ కూడా ఎంతో పాండిత్యము కలవారు. కుప్పయ్య భాగవతార్ గారు తన పుత్రునికి గొప్ప పండితుల కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయితోనే వివాహము జరుపదలచి, తంజావూరు జిల్లాలోని అయ్యంపేటలో సౌరాష్ట్ర బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల అరియలూరు నుండి అయ్యంపేటకు వచ్చి స్థిరపడ్డారు.

తంజావూరు ప్రాంతంలో గల గొప్ప సంగీత వాతావరణం వల్ల, వీరు ఇక్కడ స్థిరపడిన దగ్గర నుండి సంగీతం పట్ల అమితమైన మక్కువ ఏర్పడింది. అందువల్ల, నన్నుస్వామి గారి వివాహానంతరం, వారికి అపార సంగీత జ్ఞాన సంపన్నుడైన కుమారుడు కలగాలని తాత తండ్రులిరువురూ ఎన్నో క్షేత్రాలు తిరిగి భగవంతుని ప్రార్ధించగా, వారి కోరిక ఫలించి అబ్బాయి జన్మించాడని తెలుస్తోంది. పౌత్రుని జాతక చక్రం పరిశీలించిన కుప్పయ్య గారికి తన మనుమనికి సంగీత విద్యయే గొప్ప జీవితాన్ని ప్రసాదించి, పేరు ప్రఖ్యాతలు కలుగజేస్తుందని తెలుసుకొని, తిరుపతి దేవునికి మ్రొక్కుకున్న విధముగా, తన మనుమనికి వేంకటరమణ అని నామకరణం చేశారు.

జననం, బాల్యం, విద్యాభ్యాసం:

శ్రీ వేంకటరమణ గారు తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన అయ్యంపేట అనే గ్రామంలో శార్వరి నామ సంవత్సర మాఘ బహుళ దశమి అనగా 18.02.1781 ఆదివారం నాడు మూల నక్షత్రంలో, వృషభ లగ్నంలో జన్మించారు. వీరి మాతృభాష సౌరాష్ట్ర అయినప్పటికీ, చిన్ననాటి నుండే సంస్కృతం, తెలుగు, తమిళ భాషలు నేర్చుకుని పదమూడు సంవత్సరముల చిరు ప్రయములోనే ఈ భాషలన్నింటిలో ఎంతో ప్రావీణ్యతను సంపాదించి, వీటిలోని సాహిత్యం, ఛందస్సులలో పట్టు సాధించారు.

వేంకటరమణ చదువుకొనుటయందు ఎంత శ్రద్ధ వహించేవారో శరీర ధృడత్వం కొరకు కూడా అంతే శ్రద్ధ వహించేవారు. వీరు హఠయొగం చేసేవారు. అయ్యంపేటలోని రుక్మిణీ సత్యభామా సమేత ప్రసన్న రాజగోపాలస్వామి ఆలయమునందు ఎల్లప్పుడూ పూజలు చేసేవారు.

వీరు చిన్నతనం నుండే సంగీతం పట్ల ఆసక్తి కలిగియుండి, తమ తండ్రిగారి వద్ద కొంత శిక్షణ పొందారు. సంగీతం పైగల మక్కువతో ఈ కృష్ణ భక్తుడు అయ్యంపేటకు సమీపంలో గల తిరువయ్యారుకు చెందిన రామభక్తుడైన త్యాగరాజస్వామిగారి వద్ద సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళారు. వేంకటరమణ గారు త్యాగరాజస్వామి వారి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన సంవత్సరము సరిగ్గా తెలియరాకున్ననూ, ఆ కాల సాంప్రదాయమును బట్టి తన 14-15 ఏట ప్రారంభించి యుండవచ్చును అని తెలుస్తున్నది.

త్యాగరాజస్వామి వారి ఇంటి బయట నుండి సంగీతాన్ని వింటుండగా త్యాగరాజస్వామి వారి సతీమణి చూచి త్యాగరాజస్వామి వారితో చెప్పగా త్యాగరాజస్వామి వేంకటరమణని, నా దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఉందా అని అడుగగా, వేంకటరమణ చాలా ఆనందంగా త్యాగరాజస్వామి వారి శిష్యులలో ఒకరిగా జేరిపోయారు. అప్పటి నుండి త్యాగరాజ స్వామి వారికి అమితమైన భక్తిశ్రద్ధలతో సపర్యలు చేస్తూ దాదాపుగా 30 సంవత్సరాలు గురువుగారి వద్దనే ఉండిపోయారు.

త్యాగరాజస్వామి వద్ద శిష్యునిగా చేరిన తర్వాత రెండు సంవత్సరాల కాలం వరకు కేవలం గురువుగారికి సేవచేస్తూ వారు ఇతర శిష్యులకు నేర్పుతుండగా విని నేర్చుకునేవారు. వేంకటరమణగారికి త్యాగరాజస్వామి వారంటే అమితమైన భక్తి. త్యాగయ్య గారు నిత్యము చేయు పూజానుష్టానము కొరకు ప్రతిదినము అయ్యంపేట నుండి తులసీ దళములను, మాలలను సమకూర్చి, అయ్యంపేట నుండి తిరువయ్యారుకు అడ్డత్రోవన ఏడు మైళ్ళు నడిచి, వాటిని పూజా సమయానికి అందించేవారు. అంతేకాక పూజ అయిన తర్వాత మంగళం కూడా గానం చేసేవారట. అయితే, పూజ కోసం ఈ తులసీపత్రిని సమకూర్చేది వేంకటరమణ గారేనన్న విషయము త్యాగయ్య గారికి తెలియదు. ఒకనాడు కొంత అస్వస్థత కారణంగా వేంకటరమణ గారు పూజా సమయానికి తులసీ దళాలను అందించలేకపోయారు. ఆనాడు పూజలో తులసీ దళాలు లేకపోవడంతో, విషయమేమిటో తెలుసుకొని, వేంకటరమణ గారి భక్తి విశేషములను గ్రహించారు. ఇంతలో త్యాగయ్యగారు పూజకు ఉపక్రమించగా వారి భార్య కమలమ్మ గారి దగ్గరకు ఒక సాధువు రూపంలో శ్రీకృష్ణుడు వచ్చి భాగవతార్ వస్తున్నారు! వచ్చి మంగళం పాడతారు, ఆగండి అని చెప్పి వెళ్ళిపోయారు. వేంకటరమణ గారు కృష్ణభక్తుడు కావడం వలన కృష్ణుడే ఆ విధంగా వచ్చి వేంకటరమణను భాగవతార్ అని సంభోధించడం వలన, ఆనాటి నుండి వీరు వేంకటరమణ భాగవతార్ గా పిలువబడ్డారు. ఈ సంఘటన వలన కమలమ్మ గారికి కూడా కృష్ణుని దర్శన భాగ్యం కలిగింది.

మరుసటి దినము నుండి వేంకటరమణ భాగవతార్ తిరిగి తులసి దళములను త్యాగయ్యకు సమర్పించడం, వాటిని త్యాగయ్య గారు ఆనందంగా స్వీకరించడం జరిగింది. ఒకనాటి ఉదయం వేంకటరమణ గారు గురువుగారికి పూజకోసం తులసీదళాలు, పూవులు సమకూర్చారు. త్యాగరాజు గారు పూజను ప్రారంభించి తులసీ దళములచే అను కృతి పాడుతూ పుష్పార్చన చేస్తున్నారట. ఆశ్చర్యకరముగా, సరసీరుహ పున్నాగ అని చరణం పాడుతుండగా, వారు పాడుతున్న వరుసక్రమములోనే అవే పుష్పములను చేతిలోనికి తీసుకుని పూజించటం గమనించారు. అనుకోని ఈ ఘటనయందు గల దైవసందేశాన్ని గ్రహించి త్యాగరాజు గారు వేంకటరమణకి సంగీతం చెప్పడం ప్రారంభించారు. అయితే సంగీతం అభ్యసించే తొలిరోజుల్లో వేంకటరమణ గ్రహణశక్తి కొంచెం తక్కువగా ఉండి విద్య నేర్చుకోవడం కొంత మందకొడిగా సాగేది. ఇది గమనించిన త్యాగరాజస్వామి వారు శ్రీరాముని ధ్యానించి, దైవానుగ్రహం ప్రసాదించమని, జ్ఞానమొసగరాదా,,, అను కృతిని షడ్విధమార్గిణి రాగంలో రచించి గానం చేస్తూ వేడుకొన్నారు. ఆ మరునాటి నుండి వేంకటరమణ గ్రహణ, ధారణశక్తులు అభివృద్ధి చెంది చాలా చురుకుగా సంగీతాన్ని అభ్యసిస్తూ గురువుగారు పాడిన కృతులన్నీ తాళపత్రములలో స్వరపరచగలిగే జ్ఞానాన్ని పొందారు.

త్యాగరాజుగారు కృతులను ఆశువుగా పాడి రచిస్తూండేటప్పుడు పక్కన కూర్చుండి వ్రాసే శిష్యులలో ప్రముఖుడీయన. వ్యాసునకు భారతం వ్రాసిపెట్తిన గణపతి వలె గురువుగారి కితడు వ్రాసిపెడుతున్నాడనే అభిమానంతోనో, వావుగా, పొడుగ్గా ఉండేవాడనో ఇతనిని సహాధ్యాయులంతా గణపతి అని పిలిచేవారట. మిగిలిన శిష్యులవలె గాక, వేంకటరమణ భాగవతులూ అతని బృందంవారూ త్యాగరాజుగారి కృతులనే కాక నౌకా చరిత్రాది సంగీత నాటకాలను కూడా పాఠం చేసుకున్నారు.

(సశేషం)


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech