శీర్షికలు  
     శ్రీ శనీశ్వర శతకం-6
 

- రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ

 

41. ఇమ్ముగ నిన్నె చాల నుతియించుచు మ్రొక్కుచు భక్తి మీర; మో
దమ్మున వేడు చుంటినని దర్పము మీరగ పొంగిపోకు; మీ
తొమ్మిది మందిలో వెతల ద్రోల గలాడవుగాన; పెక్కు స్తో
త్రమ్ములు జేతు; నా యవసరమ్ములు దీర్పగ - శ్రీ శనీశ్వరా||

42. వారికి వీరికెప్డు తలవంచు ఘటంబును గానునేను, నా
దారియె వేరు; నా అభిమతంబులు వ్రాతలు ముక్కు సూటిగా
నేరుగ మాటలాడుటలు నీ కెరుకే గద; నేనేదేమొ నా
తీరది యేమొ జాతకమిదే మరి సాక్ష్యము - శ్రీ శనీశ్వరా||

43. చతుర కవిత్వ తత్త్వ పటు సంపద చాలగ నున్నవాడ; భా
రతికిదె ఆత్మ నందనుడ, రమ్యగుణుండను కీర్తి సాంద్రుడన్!
స్తుతులను గొన్న జాతకుడ; సొంపగు ని ర్వది యేడు తారలన్
‘శతభిష’ యౌను నాది; కడు సకృప నేలర - శ్రీ

44. శతభిషవారి పల్కులకు చిక్కిలి గింతలు నీకెగాదు, దు
ర్మతులకు గూడ నిక్కమగు మక్కువ పెల్లుబుకున్ మహాశయా!
కతలిక నేల? నన్ కరుణ గావగ జాతక చక్ర యోగపున్
స్థితి-గతి చర్చలేల? నతి చేకొనుమయ్యరొ – శ్రీ శనీశ్వరా!

45. పలుకులు పెక్కులేల? అల భార్గవ రాముని అంశనాది; లో
కులు మరి యెవ్వరేగతిని క్రోధము మీరగ నన్ను దూరినన్;
పలుచగ మాటలాడిన రవంతయు కుంద నిరాశ జెంద; నే
నలుగును తొక్కు పల్కుల కహస్కర పుత్రక – శ్రీ శనీశ్వరా!

46. అగ్నిని మించు తేజ మలరారగ నన్నిటు చేసినావు, నా
లగ్న బలమ్ముబల్ దృఢతరంబది యౌటను బ్రహ్మరుద్రులేన్
భగ్న మొనర్ప లేరు నను; వాయస వాహన! సూర్యనందనా!

47. అంద రదేమి చిత్రమొ మహాశయ; నన్ కవి లోకమమందు, గ
ర్వాంధునిగా దలంచి తెగనాడుట వింటిని పెక్కుమారు; లా
నందము జెందితిన్; తరణి నందన! నాదు ముఖారవింద మీ
చంద మొనర్చి ధాత అపచారము సల్పెర – శ్రీ శనీశ్వరా!

48. ‘మంద’ మహాశయా స్వకుచమర్దన గాదిది; సత్య సంధు నన్
సుందర రామకృష్ణ సుందరు గూరిచి చర్చ వద్దు; ఆ
రింద తెఱంగు గాంచకు; మరీ విసిగించకు; పోయి పోయి, నా
ముందర వాదులాడకు నభోమణి పుత్రక – శ్రీ శనీశ్వరా

49. నవ్వకు మయ్య దేవ, కడు నల్లగ మోమును బెట్టి నీవు; నా
కివ్వసుధన్ నిజంబుగ నొకించుక కొంటె తనంబు జాస్తి; న
న్నెవ్వ రదెట్టు పల్కినను ఏడ్పు మొగంబిడి క్రుంగి పోను; తా
వివ్వను దెబ్బలాటలకు నేవిధినైనను - శ్రీ శనీశ్వరా!

50. చింతన జేయగా నరుని జీవిత మంతయు నాటకంబె; ఈ
కాంతలు బంధువర్గములు గాదిలి పుత్రులు పాత్ర ధారులే!
అంతము లేదు ఈశ్వరుని అచ్చపు మాయకు! జాలిగావరా
‘అంతక’ నామధేయ - తిమిరాంతక నందన - శ్రీ శనీశ్వరా!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech