సారస్వతం  
 సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (11వ భాగం)
 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil

 

16. పద్మినీ పత్రజలబిందు న్యాయము

పద్మినీ పత్రం = తామరాకు, జలబిందు = నీటి బిందువు.

 

ఇది అందరికీ తెలిసి, చాలా సందర్భాలలో వాడబడే తామరాకు మీద నీటి బొట్టు అన్న తెలుగు సామెతని తెలియజేసే న్యాయం.

తామరాకు మీద ఉన్న జలబిందువు అటు ఇటు కదులుతూనే ఉంటుంది కానీ ఆ ఆకుని అంటుకోదు. మనం మన జీవితానికి అనేక విధాలుగా దీనిని అన్వయింప చేసుకోవచ్చు.

ధర్మార్ధకామ మోక్షాలైన పురుషార్ధాలని ఆచరిస్తూ, మనం మన విద్యుక్త ధర్మాన్ని విడవకుండా, గృహయజ్ఞాన్ని నిర్వహిస్తూ, సంసార జీవితాన్ని సాగిస్తూనే సర్వం ల్విదంబ్రహ్మ అని తలచి, అంతా ఆ పరమాత్మనే కాన, ఆయనకే చెందాలి, మనం కూడా అనగా సర్వజీవులు ఆ పరమాత్మకి చెందిన వారే అని అనుకుంటూ నిరంతరం ఆ స్వామినే సేవిస్తూ ప్రహ్లాద, నారద, పరాశర పుండరీక, వ్యాస, అంబరీష, శుక శౌనకాది భక్తులవలే ఎవరు జీవితాన్ని గడుపుతారో అట్టి వారికి పద్మినీ పత్ర జలబిందు న్యాయంలా ఎట్టిపాపములు అంటవు. మనం చేసే కర్మలే మన జన్మలకి కారణమవుతాయి. మనం ఎంత సంపాదించినా, ఎన్ని మేడలు కట్టుకొన్నా..ఎంత బలగం ఉన్నా ఇవి మన వెంటరావు. భార్యనీ, పిల్లల్ని కూడా అధికంగా ప్రేమిస్తాయి. వారు కూడా చివరిదశలో మన వెంటరారు. చూడండి

నారీగృహద్వారి, జనఃస్మశానే
దేహశ్చితాయా, పరలోకమార్గే
కర్మానాగోగచ్ఛతి జీవయేకః

భార్య గృహద్వారం వరకు (స్త్రీలు శ్మశానానికి రాకూడదు అన్న ఆచారం) కూడా వచ్చే బంధుజనం, స్నేహితులు స్మశానం వరకే, ఎంతో చక్కగా పెంచిపోషించిన ఈ శరీరం కూడా చితిలో కాలిపోతుంది. జీవితో (ఆత్మతో) పాటు వచ్చేది కర్మ మాత్రమే వస్తుంది.

అదే జన్మ జన్మలకి మనతో ఉంటుంది. కనుక జన్మరాహిత్యం పొందాలంటే కర్మరాహిత్యం చెందాలి లేకుంటే మోక్షం లభించక పునరపిజననం, పునరపిమరణం, పునరపి జననీ జఠరేశయనం అని ఆది శంకరులు చెప్పినట్టు అమ్మ కడుపులో పడి పుడుతూనే ఉంటాము. కర్మ ఫలాలని జన్మజన్మల వ్యత్యాసాలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా చూడవచ్చు.

పూర్వ జన్మల సంస్కార ఫలితంగానే కదా మేథావులు - మందబుద్ధులు, ధనవంతులు-ధనహీనులు, స్ఫురద్రూపులు (అందమైనవారు) అందవిహీనులు, వికలాంగులు, రోగపీడితాలు, రాక్షస ప్రవృత్తి కలవారు, కళాకారులు, క్రీడాకారులు, నైపుణ్యం కలవారు, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, గాంధి, సోక్రటీస్, కోపర్నికస్, ఐన్ స్టీన్..వంటి మహా పురుషులు, మేథావులు జన్మిస్తున్నారు.

పూర్వ జన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
అనగా పుర్వజన్మలో చేసిన పాప ఫలం ఈ జన్మలో వ్యాధి రూపంలో పట్టిపీడిస్తుంది. అని లేదా
అత్యుత్కటైః పుణ్యపాపైః
ఇహైనఫలమశ్నుతే
అన్న ప్రమాణాన్ని అనుసరించి ఈ జన్మలో చేసిన తీవ్రమైన పాప, పుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుసరించాలి అన్నట్లో ఎంత గొప్పవారైనా రోగగ్రస్తులై బాధపడి మరణించే వారిని చూస్తున్నాం. అలాగే ఏ బాధలేకుండా సునాయాసంగా మరణించే వారిని చూస్తున్నాం. వీటన్నింటికీ మనం చేసే కర్మ ఫలాలే కారణభూతాలు. అందుకే ప్రతి వ్యక్తి

-అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం
అనగా పరబాధలు లేకుండా సులభంగా మరణించాలని, వృద్ధాప్యంలో కూడా ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలని ఆ దేవుని ప్రార్ధించాలని పెద్దలు చెబుతారు. ఉదాహరణకి దోమని చంపవచ్చు హాస్యం గా కాదు నిజంగానే... దోమ-మనల్ని యాచించకుండానే మన రక్తం త్రాగి జీవిస్తుంది. అలాగే కాలం తీరిపోతే ఒక్క దెబ్బ వేస్తే మరణిస్తుంది. కనుక దోమ జీవితం ధన్యమైనది. అట్టి దోమలు కూడా అందరిచే దూషింపబడతాయి.

ఇంకా గోవులు పూజింపబడతాయి. పాములు (నాగులచవితి, నాగపూజలు కాకుండా) ద్వేషించబడతాయి. వాటియడ కర్మఫలం చూడండి - గడ్దితినే ఆవుమనకి పాలనిస్తే, ఆ పాలని త్రాగిన పాము కాటు వేస్తుంది.
కొందరు ఉపకారికి ఉపకారం చేస్తే, మరికొందరు ఉపకారికి కూడా అపకారం చేస్తే, మరికొందరు అపకారికి కూడా ఉపకారం చేస్తారు. ఎందులకీ వ్యత్యాసం? ఎందులకీ తేడాలు అని విచారిస్తే వేదం చెప్పినట్టు తప్పక కర్మ ఫలాన్ని నమ్మాలి. అందుకే గీతాచార్యుడు కర్మణ్యేవాధికారస్తే / మాఫలేషుకదాచన అన్నాడు.
నీ కర్మలయందు అధికారం ఉంది కాని, ఫలితములందు లేదు. అది భగవానుని అధీనంలో ఉంటుంది. కనుక మనం మంచిగా ఉంటూ నిష్కామకర్మని ఆచరించాలి.
దైవాధీనం జగతే సర్వం/ సత్యాదీనాంతు దైవతం తత్ సత్య ముత్త మాధీనం/ ఉత్తమోమిను దేవతాః
అన్న సూక్తి ప్రకారం, జగత్తుదైవాధీనం. దైవం సత్యానికి ఆధీనం(లొంగి ఉండటం) సత్యం ఉత్తములకధీనం. అట్టి ఉత్తములే భగవంతుని రూపాలు. ఎవరు ఉత్తములు అనగా
శ్లోకార్ధేన ప్రవక్షామి - యదుక్తంగ్రధకోటిభిః| పరోపకారాయ పుణ్యాయ / పాపాయ పరపీడనం||
ఎంత అద్భుతమైన వాక్యం!
కోటి గ్రంథాల సారాన్ని సగం శ్లోకంలో వివరిస్తాను. ఎట్లన పరోపకారం చేయడమే పుణ్యం. ఇతరులకు అపకారం చేయడమే పాపం. అన్న సత్యాన్ని పై శ్లోకం బోధిస్తుంది. నదులు, వృక్షాలు, గోవులు, పర్వతాలు, అన్ని పరోపకారానికే సృష్టించబడ్డాయి.

జంతూనాంనర జన్మ దుర్లభం అన్నట్లు

ఉత్తమమైన నరజన్మమెత్తిన మనం సక్రమ మార్గంలో నడుస్తూ ‘నళినీ పత్ర జల బిందు న్యాయం’ లా ఎట్టి పాపాలు అంటని నిష్కామ కర్మల నాచరించి, మోక్షాన్ని పొందాలని కోరుకోవడం ఉత్తమ లక్షణం.

ఒక మంచి కథతో ఇంకా ఈ న్యాయాన్ని వివరిస్తాను.

హరినామస్మరణలో నారదునికి మించినవారు లేరు. నారాయణ నామం జపిస్తూనే ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాడు. ఒకరోజు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని స్తుతించి ఇలా అంటాడు. స్వామి నిరంతరం నీ నామ స్మరణచేస్తూ తిరిగే నేనే నీ భక్తులలో మొదటి వాడిని కదా! అని ప్రశ్నిస్తాడు. ఓహో! నారదునికి అహం (నేనే) కారం పెరిగింది. అది తొలగించాలి అని శ్రీహరి తలచి యిలా జవాబు చెపుతాడు - నారదా! నీవు గొప్ప భక్తుడువి కాదనను. కానీ నీకన్నా గొప్ప భక్తుడు భూలోకంలో ఉన్నాడు పరికించు అని భూలోకం వైపు చూడమంటాడు.

భూలోకంలో ఓ పేదరైతు తన వ్యవసాయం తాను చేసుకుంటూ, తన కుటుంబాన్ని, తను పోషించుకుంటూ, ప్రతి పనికీ ముందూ శ్రీహరి నామాన్ని జపిస్తూ అంతా స్వామిదయ, నాదేమీ లేదు అని తలపోస్తూ జీవితాన్ని గడుపుతూ కనబడతాడు.

ఆ భక్తుని చూసి నారదుడు శ్రీమన్నారాయణా! ఆ రైతు తన పనులు తాను చేసుకుంటూ, అప్పుడప్పుడు మాత్రమే నీ నామాన్ని జపిస్తున్నాడు. నాకంటే నీకు ఆ భక్తుడు ఎలా ఆప్తుడౌతాడు? అని ప్రశ్నించిన నారదునితో శ్రీహరి.
సరే నారదా! నీకు ఓ పరీక్ష పెడతాను అందులో నీవు నెగ్గితే నీవే గొప్ప భక్తుడవని అంగీకరిస్తాను. అని పలికి నూనెతో నిండిన ఒక పాత్రను తెప్పించి అది నారదుని తలపై పెట్టి ఒక్క చుక్క కూడా నూనె క్రింద పడకుండా ఈ రోజంతా నీవు భూలోకం చుట్టిరా! అలా వస్తే నీవే గొప్ప భక్తుడివి అని చెబుతాడు..

పందెంలో గెలవాలని, నూనె చుక్క క్రిందపడకూడదనే తలంపుతో సంచరిస్తూ, నారాయణ నామాన్ని స్మరించడం మరచిపోతాడు. అలా తిరిగి సాయంత్రానికి విష్ణులోకం చేరుకుని, ప్రభూ నీవు చెప్పినట్లే నూనె చుక్క క్రింద పడకుండా వచ్చాను. పందెం గెలిచినట్లే కదా! అన్న నారదునితో నూనె క్రిందపడలేదు కాని నా నామాన్ని ఎన్ని మార్ల జపించేవు? అని అడిగిన శ్రీహరితో అయ్యో పాత్రమీద ధ్యాసతో నీ నామం పలకడమే మరచిపోయాను. అంటాడు. అపుడు శ్రీహరి ‘చూసావా నారదా! నీకు వేరేపని లేదు కనుక నిరంతరాయంగా నా నామాన్ని స్మరిస్తున్నావు. ఇంకో పని చేయాలంటే నా నామం పలకడం మరిచావు. కాని ఆ రైతు తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ మనసులో నన్నే స్మరిస్తూ జీవిస్తున్నాడు. ఎవరైతే మనసా, వాచా, కర్మణా నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారికి నళినీపత్ర జలబిందు న్యాయంలా పాపములు అంటక పరమాత్ముని సన్నిధి చేరుకుంటాడు. అని పల్కి నీవు కూడా నాకు ఆప్తుడవే అందులో సందేహం లేదు. అని పల్కిన శ్రీహరితో స్వామి నన్ను క్షమించండి. నిజమైన భక్తికి తారతమ్యాలు లేవని తెల్పి, నా గర్వాన్ని పోగొట్టిన మీకు శతకోటి వందనాలు అని పలికి నిష్క్రమిస్తాడు చక్కని ఉదాహరణ.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech