సారస్వతం  
              శకుంతల (పద్యకావ్యం) - 3

రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

 

అనగ సాగుచుండ నా భూమి రక్షకుం
డమిత తీక్ష్ణమైన యమ్ము గొనుచు
ధనువునందు నిలిపి దానిపై వేయగ
బూనునంత రథము ముందు నిలిచి. 12


వ్యాఖ్యానం
మహావేగంతో రథం సాగి పోతూ ఉండగానే ఆ భూపాలుడైన దుష్యంతుడు తన అమ్ముల పొదిలో నుండిఒక నిశితమైన ( వాడియైన ) బాణాన్ని తీసికొని దానిని తన ధనుస్సుపై నిలిపి ఆ లేడిపిల్ల మీద ప్రయోగించడానికి పూనుకొనేలోగానే అతని రథానికి అడ్డుగా ఒక మునీంద్రుడు అడ్డుగా వచ్చి నిలబడ్డాడు.

వలదిటు సాయకంబుగొని వచ్చుట మౌనుల కాననంబులన్
జెలగు మృగంబు చంపుటకు జీర్ణము నొందునె ధర్మమియ్యెడన్?
లలితశరీరమున్ గలిగి లాలననొందెడి వాని జంపగా
వలదు సమస్త దేశజనవత్సల! మానుము వేట నియ్యెడన్. 13

వ్యాఖ్యానం
ఆ అమాయక జంతువుపై బాణం వేయడానికి ప్రయత్నిస్తున్న రాజును చూసి వైఖానసుడు అనే ఆ మని ఇలా అన్నాడు-`సమస్త దేశ ప్రజల ప్రేమను చూరగొన్న ఓ రాజా! నీవు ఇలా మునుల తపోవనాలకు ధనుర్బాణాలను వెంట బెట్టుకొని రావడం తగదు. ఒకవేళ తెచ్చినా వాటిని ఈ మృగాలపై ప్రయోగించడం అసలే తగదు. నీవు ఇలా చేస్తే ధర్మం చిక్కి శల్యమై పోతుంది కదా? లేడిపిల్లలు సహజంగా మృదువైన శరీరాలను కలిగి ఉంటాయి. అవి మునుల లాలనలోనే పెరుగుతాయి. అలాంటి అమాయక జీవులను చంపడం నీకు తగదు కనుక ఈ వేటను మానుకో!

ఆర్తుల గావగావలయు నంతక ఘోర మృగాల జంపుచున్
కీర్తిని పొందగావలయు కీడుల నీడల పారద్రోలుచున్
మూర్తిని గొన్న దీ పృథివి పూజ్యధరేశుల ధర్మవర్తనన్
భర్తవు నీవు గాన దలపన్ సరిగాదిటు వ్యర్థసంహృతిన్! 14


వ్యాఖ్యానం
సాధుజీవులను చంపే క్రూర మృగాలను చంపి ఆర్తులైన వారిని కాపాడడం నీకు ధర్మం. అలాచేసి నీవు కీర్తిని పొందడం మంచిది. కీడులు అనే నీడలను పారద్రోలడం నీకు న్యాయం. పూజ్యులైన ఎందరో పూర్వ చక్రవర్తుల ధర్మప్రవర్తనలతో ఈభూమి మూర్తీభవించింది. దానిని నీవు రక్షించే భర్తవు కనుక ఈ వ్యర్థమైన సంహారక్రియను చేయడం నీకు తగదు.

అనిన వైఖానసుండగు మునిని గనుచు
నాశ్రమోచితకార్యంబు నంత దలచి
బాణమును దించి యరదాన భద్రుడగుచు
వందనమ్మొనరించెను భక్తి మునికి. 15


వ్యాఖ్యానం
వైఖానసుడు అనే ముని ఇలా ఆ రాజును ఉద్దేశించి పలుకగానే ఆ రాజు ఆ మునిని చూచి తాను చేస్తున్న పని ఆశ్రమధర్మానికి విరుద్ధమని భావించి తాను ఎక్కుపెట్టిన బాణాన్ని క్రిందకు దించి దానిని రథంలో ఉంచి కుశలుడై భక్తిప్రపత్తులతో ఆ మునికి నమస్కారం చేశాడు.

                                                                                    - (సశేషం)    


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech