శీర్షికలు  
     పద్యం - హృద్యం

- నిర్వహణ : రావు తల్లాప్రగడ

 

"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు ఏప్రిల్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.   

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ  మాసం సమస్యలు 

ఆ.వె.|| చిటికెలోని పనికి చేయిరాదు 

వర్ణన --  "వసంతశోభ" (స్వేచ్ఛావృత్తంలో)

క్రితమాసం సమస్యలు  

తే.గీ.|| పతిని దూషించ నట్టి యా పత్ని తగదు

వర్ణన(స్వేచ్చా వృత్తంలో) : "నందన నామ సంవత్సరం" 

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ - గండికోట  విశ్వనాధం హైదరాబాద్ ,   

తే.గీ.|| నీతి, రీతి తొలగ, పరపతియు పోవ

అమిత వ్యసనాల దాసుడై, ఆలి తాళి

తెంపి గొంపోవు తెంపరి తెగులు తెంప

పతిని దూషించనట్టి యా పత్ని తగదు.

 

శా.|| శ్రీ వాణీ గిరిజా మనోహర కృపాశ్రీ మాధురీ పూర్ణమై

యావద్భారత దేశ వాసులకు సద్వ్యాపార సౌభాగ్యమై

ఈ విశ్వంబున శాంతి సౌఖ్యముల నుద్దీపించు సందేశమై

ఠీవిన్ "నందన"నామ వత్సరము రూఢిం గాంచ వాంఛించెదన్.

 

ఉ.|| ఎందరి రాజకీయ ఘన నేతల రాతలు మార్చి వేయునో ?

అందల మెక్క జేయునొ?,మదాంధుల దర్పము కూల్చి వేయునో?

కొందరికైన మేలొసగి కొల్వులు,కొంపలు కూర్చి యిచ్చునో?

'నందన 'వత్సరంబు జన నందన వందిత హర్ష వర్షమై.

 

(నందన= సంతోషించ దగిన ;వందిత= పొగడ దగిన)

 

రెండవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం


 తే.గీ.|| తప్పు మార్గాన జనుచున్న తనదు భర్త

వర్తనము చక్కదిద్ద సుభాషితములు

పలికి చివరకు అవసరంబైన వేళ

పతిని దూషించకున్నట్టి పత్ని తగున!

 

సీ.|| నవవసంతమ్మున నందన వత్సరం - బరువది ఏడ్లకు తిరిగి రాగ

తరులతాదుల యందు విరియపూచిన పూజ - పిల్లవాయువులతో వియ్యమంద

పూలమధువు గ్రోలి పుష్పం ధయమ్ములి - అలరుచు వింత నాట్యముల నలువ

మావి చిగురు మేసి మత్తకోకిలములు - పంచమస్వరమున పాట పాడ

 

తే.గీ.|| మాసరాజంబయిన చైత్ర మాసమునను

శుక్లపక్షము పాడ్యమి శుభదినమున

షడ్రుచులతో ఉగాది పచ్చడులకూర్చి

అఖిల జనులకు శాంతి సౌఖ్యముల నొసగ

వచ్చేనిది నందన ఉగాది పర్వదినము

నందన ఉగాది కిదియె మా వందనములు

 

మూడవ పూరణ- నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ 

తే.గీ.|| కలియుగమ్మున న్యాయమ్ము కన్య కేది ?

లోక మంతయు నేకమై కాకు లవగ  

మోస బోయిన యాతల్లి నీస డించ

పతిని దూషించ నట్టియా పత్ని తగదు ! 

 

సుగంధి .

పండు వెన్నె లంత నింగి పైట వేసి యాడ గన్

గండు కోయి లమ్మ లన్ని గాన మాల పించు చున్

రండు మిత్రు లార రండు రంగు లీను పండు గన్

నిండు శోభ  గూర్చు  నంచు  నంద నమ్ము వచ్చె గా !

 

 నాల్గవ పూరణ -యం.వి.సి. రావు, బెంగళూరు

 తే.గీ.||బాధ్యతెరుగక తిరుగాడు భర్తవలన

దిశను నిర్దేశమొనరించు దిక్కులేక

పిల్లలందరి బ్రతుకులు బీటగిల్ల

పతిని దూషించనట్టి యాపడతి తగదు

 

ఉ.|| నందననామ వత్సరము నాట్యముసేయుచు వచ్చినట్లుగన్

డెందముయుల్లసిల్ల మకరందము గ్రోలుచు తేటులంతటన్

అందములైన పద్యతతులాశువుగాగను నల్లెనోయనన్

చందము గూర్చె నీ ఇలను పొందగు ఝుమ్మను నాదరీతులన్

 

ఐదవ పూరణ జగన్నాథ  రావ్  కె.  ఎల్. , బెంగళూరు

తే.గీ. || పీట  వేయదు  కంచము  పెట్టబోదు

కొసరి  వడ్డించ  జాలదు  కోమలాంగి

నోరు  తెరచి  యడిగినచో  పోరు  పెట్టి

పతిని  దూషించ,  నట్టియా  పత్ని  తగదు

 

కం|| ప్రస్తావనగా  'ఖర'  తన

పుస్తకమును  మూసి  తెల్పె " ముస్తాబై   సా

రొస్తా  రొస్తా  రొస్తా

రిస్తా రానంద మందరికి  'నందన' గా "

 

ఉ|| ఉంది  సరోవరం  బొకటి  ఊరిని  'నందన'  నామమొప్పగా

అందలి  తామరల్  కవితలైనవి  స్వాగత  గీతికాకృతుల్

సందడి  స్నేహమై  అలల  సంబరముల్  కవి  రాజహంసలా

నందము  తెచ్చెనింక  అభినందన  తెల్పుడు  పౌరులెల్లరున్

 

ఆరవ పూరణ-  డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా.

 తే.గీ.||వెలది-జూదంబు-పానంబువేడ్క మునిగి

తల్లిదండ్రుల-యిల్లాలిధనము కొరకు

రాచి-రంపానబెట్టెడు రక్కసుడగు

పతిని దూషించనట్టియా పత్నితగదు

 

ఏడవ పూరణ - నిరంజన్ అవధూత, బోస్టన్

 తే. గీ.|| తగిన కారణమది లేక తగవు లాడి

చిత్తమున ఏవగించుకు , చీత్కరించి,

కుమతియై, తీర్చ లేనట్టి కోర్కె లడిగి

పతిని దూషించి నట్టి యా పత్ని తగదు.

 

తే. గీ.|| "పతిని దూషించి నట్టి యా పత్ని తగదు"

యనగ తగదు తన స్థితి అరయ కుండ

పరగ మోసము చేసిన పతిని పట్టి

తిట్టి పోసిన ఇల్లాలి తీరు సబబు !

 

కం.|| 'నందన' వత్సరమా ! మా

వందనముల గొనుము, నీకు స్వాగతమమ్మా !

చిందించుచు  చిరునవ్వులు

అందముగా నడచి రమ్ము, అలరింప మమున్ !

 

కం|| కమ్మని మామిడి కాయలు,

కొమ్మలలో దాగియున్న కోకిల పాటల్ !

తుమ్మెద ఝుంకారమ్ములు !

ఇమ్మహిలో నందమంత ఇమ్ముల గూర్చున్.

 

ఎనిమిదవ పూరణ - సింహాద్రి జ్యోతిర్మయి - తెలుగు అధ్యాపకురాలు, ఒంగోలు

 సీ.|| పార్వతీనందన పాహియని కొలిచి

                       మొదటి దండముతోడ మొదలుపెట్టి

   దేవకీనందన దేహి నీ దయయంచు

                     పదమంటి ఆపదలు బాపుకొనుచు

 వాయునందన నన్ను వదలబోకని వేడి

                              భయవిహ్వలత నుండి బయటపడుచు

వసంతనందన వాకిట వేంచేయు

                    శుభవేళ జగమంత సుఖము పొంద

 

తే.గీ.|| ఆరు ఋతువులు శోభిల్లి హాయి గూర్ప

ఆరు రుచులను చవిచూచి అలరి వేడ్క

శ్రీకరము కోరి వీడ్కొని శ్రీఖరమును

వందనమిడి స్వాగతి చేతు నందనమును

 

తొమ్మిదవ పూరణ -  రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

 తే.గీ.|| పతిని దూషించు వాడెడెవ్వాడు యైన

పురపతి అవనీపతి గాని, పరపతున్న

వాడుగానింకెవడు గాని, బదులుగ అధి

పతిని దూషించ నట్టి యా పత్ని తగదు!

 

సీ.|| వందనమిది నందనందననందక

                        యానంద నందన యందికలకు,

నవనందనమునకు, కవిపుంగవులకును

                        నవ నవక కవన కవచములకు,

సువిశాల భువికిని, రవిచంద్ర తారల

                        భావజాలములకు, భాగ్యములకు,

భావభవునికునూ, పవిపూలు మీకునూ

                        భువనవిభునికునూ పూలతోటి!  

తే.గీ.|| కొత్త సంవత్సరంబిది కొదమ తేటి!

అస్మదీయులపాలిట విశ్మయమ్ము!

సత్యనారాయణుడికినీ  నిత్యసూరు

లకును, ప్రణమిల్లి పిల్చేను, రామచంద్ర!

 

పదవ పూరణ- జె.బి.వి.లక్ష్మి

 కవిత:   ధూమపానం,మద్యపానం పేకాట నాగరికతకు చిహ్న మని భావించి

దోస్తులతో జల్సాలు, దావత్తులు మారు పేరుగా మార్చి

సగ భాగమైన సతితో సంవాదములకు దిగి, నావ నడిపించు వాడే నదిలోకి దూక నెంచు

పతిని దూషించనియట్టి యా పత్ని తగదు

 

పదకొండవ పూరణ - గొర్తి వేంకట లక్ష్మి, హైదరాబాద్

 

 కవిత: నందనలో ఆనందం అందించే కబుర్లు- తీపి

 సుందర స్వప్నాలు చెదిరించే కధనం- వగరు

 పలు రుచి కోరికల రసనకు రసాలం- పులుపు

 రుచి పెంచగ కరిగించిన చిటికెడు లవం- లవణం

 జిహ్వకు చుర్రనిపించే పచ్చటి మిర్చి- కటువు

 మధు మేహానికి,మృదు దేహానికి  వేపపూల- చేదు

 కలగా పులగం షడ్రుచుల ఉగాది పచ్చడి-అది,  తెలుగువారు, తెలిసినవారు మెచ్చినదది ,  

జీవన ఒడుదుడుకుల ముచ్చట అది, మంచిని పెంచే మమతల పులకరింతలకు,  

ఆదరాభిమానాల పలకరింపులకు , పంచంగ పాఠాల పాటింపులకు,  స్వాగతం! సుస్వాగతం! నందన  వర్షమా!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech