పాఠకుల సమర్పణ  
     వోసారి ఏమైందంటే ! ...

- నిర్వహణ - డా. మూర్తి జొన్నలగెడ్డ

 
 

రెడీనా బావా! అంటూ ఉదయాన్నే ఏడున్నరకి ఆవలించుకుంటూ వచ్చాడు కొత్తగా పెళ్ళైన మా బామ్మర్ది.
ఆ ఇంక బయలుదేరుదా మనుకుంటున్నాను అన్నాను వదిన వేడి వేడిగా(?) ఇచ్చిన కాఫీ జుర్రుకుంటూ. సరే అన్నయ్య గబగబా సూట్కేసులు కార్లో పెట్టించేశాడు.అందరికీ టాటా చెప్పి బాన్ వాయేజీ లు అందుకొని కారెక్కబోతూ, రెండడుగుల వెనక ఆగిన బామ్మర్ది మొహంలోకి చూశాను ( ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఎప్పుడో అనేశారు కాబట్టి )
ఏవిటి నువ్వు ఎయిర్‌పోర్టుకి వస్తున్నట్లేనా? అన్నాను.
అరక్షణం తటపటాయించి, నువ్వు వెంఠనే లోపలకి వెళ్ళిపోవడమే కదా? అని అనుమానంగా, భయంగా అడిగాడు.
అవును పోనీలే ఉండిపో ! అన్నాను నన్ను దింపి గోడకు కొట్టిన బంతిలా 39 కిలోమీటర్లు ( అని తరవాత తెలిసింది ) వెనక్కొస్తుంటే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ.
సరే అయితే నేను సెలవు తీసుకుంటాను అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
బయలు దేర బోతుంటే మీటర్ రీడింగ్ ఎంతండి ? అని డ్రైవరు శంకర్ ని ( అతని పేరు కూడా తరవాతే తెలిసింది ) మా అన్నయ్య అడిగి, సమాధానం కోసం ఎదురు చూడకుండా నా వైపు తిరిగి అక్కడికెళ్ళాక రీడింగు చూసి, కిలోమీటరుకి 15 రూపాయల చొప్పున ఇచ్చెయ్ అని డ్రైవరు వైపు కూడా చూశాడు మా ఇద్దరి మధ్యా ఒప్పందం కుదురుస్తున్నట్టు.
సరే సార్ అని శంకర్ అనడంతో కారు బయలుదేరింది. కొద్దిసేపు ఇబ్బందికరమైన మౌనం తరవాత ఇవ్వాళ ఆగస్టు 15 కదా, ట్రాఫిక్కు ఎక్కువ ఉండదు కాబోలు అన్నాను. అవున్ సార్ సెలవ్ దినాన ఎవ్వర్ పొద్దున్నే లెగ్వర్ సార్ అన్నడు శంకర్. అప్పుడే ఒక ఎఫ్.ఎం. ఛానెల్లో ఒక రేడియో జాకీ తనదైన వెకిలి స్టయిల్ లో ఆగస్టు నెల సంవత్సరంలో ఆరవ నెల ఎలా అయిందో చెబుతున్నాడు.ఆ గొడవ అయిన తరువాత హైద్రాబాదుకి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం రాలేదని ఆశ్చర్యపోతూ, పటేల్ గారు నిజాం నవాబు చేత హైద్రాబాదుని ఎలా కక్కించారో కూడా చెప్పాడు.వెటకారం పోతే పోయాడు కాని, ఈ తరం జనాభాకి దేశం గురించి నాలుగు మాటలు చెబుతున్నాడు కదాని సంతోషించాను.
మెహదీ పట్నం వచ్చింది ( ? ) మళ్ళీ చాలా సేపు మౌనం తరువాత ఈ ఫ్లై ఓవర్ మళ్ళీ ఏడాదికి పూర్తవుతుందా? అని అడిగాను. లేదు సార్ ఈ అక్టోబర్ 22కి వోపినింగ్, ఇంకా రెండు చోట్ల కొంచెం ప్యాచ్ వర్కు ఉంది సార్ అన్నాడు శంకర్. హైదరాబాదు లో జనాల పిచ్చి స్పీడుకి ఫ్లై అండర్ అన్న పేరు కరక్టేమో అనిపించింది. ప్రముఖ కార్టూనిస్టు, డైరెట్కర్ వగైరా అయిన బాపూ కారుని అతి వేగంగా నడుపుతుంటే యూ ఆర్ ఫ్లైఇంగ్ టూ లో బాపూ అన్నాడట ఒక డర్టీ వోల్డ్ మేన్.
ఈ లోగా అదేదో ఎఫ్ ఎం వారు జాతీయ గీతాలు అంటూ వందే మాతరం ( రెహమాన్ ది ) ప్రసారం చేస్తున్నారు. మా! తుఝే సలాం, మ...మ్మా! తుఝే సలాం అని పళ్ళు బిగబట్టి పాప్ రంగులు పులిమిన పవిత్ర గీతాన్ని వింటుంటే, ఆ పాటగాడు బాధతో వెక్కిరిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది ( సారీ, ఇది పూర్తిగా నా స్వంత ఫీలింగు.రెహమాన్ దేశభక్తి మీద నాకెంత మాత్రమూ సందేహం లేదు.) ఆ ట్యూన్ బాగోలేదురా బాబోయ్ అనాలనిపిస్తుంది.
ఇంకొక మాట చెప్పాలంటే శంకర శాస్త్రిగారన్నట్లు ఆకలేసిన పసి బిడ్డడు అమ్మా! అని వొక రకంగా అరుస్తాడు ఎట్సెట్రా... డైలాగు గుర్తుకొచ్చింది. దెశభక్తి గీతం వింటుంటే మనసు పవిత్ర భావంతో నిండి, రక్తం పొంగి వొడలు గగుర్పొడచాలని నా దురభిప్రాయం. పళ్ళు బిగించి ముక్కడం, చిటికె లేసుకుంటూ నడుం ఊపడం వంటివి ఆ ఎఫెక్టు తీసుకు రాగలవా అని చిన్న సందేహం.( సర్లెండి, నాలాంటి సంగీత అఙాని ఎంత అరచి గీ పెట్టి ఏమి ప్రయోజనం! )
పర్లేదు, స్పీడు గానే వచ్చేస్తున్నాం! జన గణ మన అర్ధం వివరించి, అది ఠాగూర్ అనే బనారసీ బాబు రాశారు అని చెప్పాడు. ఆ బెంగాలీ బాబు బనారస్ లో ఎప్పుడైనా ఉన్నారేమో నాకు తెలీదు.
తరువాత దేశభక్తి గీతం యువ చిత్రం లోని జన గణ మన జన మొర విన అన్న పాట! ఆ గారాలు పోతున్నవెకిలి ఆర్ జె ఎపుడైనా నా జన్మ భూమి ఎంత అందమైన దేశమూ లాంటి పాటలు విన్నాడా అనిపించింది. వారు చెప్పిన ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే, ఒకానొక రోజుల్లో ఇందిరా గాంధీ గారు సారే జహా సే అచ్చా అన్న గీతాన్ని జాతీయ గీతం చేద్దామనుకొని ఎందుకో ఆగి పోయార్ట! ( ఎందుకో ఏమిటి? ఆ తరవాత లైనులో మొదటి పదం సున్నిత మనస్కులైన కొన్ని మతస్థుల హృదయాలకు ముల్లులా గుచ్చుకుంటుందని! వోరి ఆర్ జె! ఆ మాత్రం తెలీదూ! )

ఇంతలో ఫ్లై ఓవర్ నుంచి విడివడి, శంశాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్ ఎక్కాము.బహు చక్కని రాజ మార్గము. మార్గమున కిరువైపుల అశోకుడు నాటించిన టైపు చెట్లు కాక, అందమైన పూల చెట్లు రంగు రంగుల గడ్డి, పరిసరాలన్నీ "ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ" లాగ ఎంతో హాయిగా ఉన్నాయి. అప్పుడు శంకర్ తో అన్నా, ఏదైనా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 8 కిలో మీటర్ల పాటు ఇదేవిటి,ఇండియా గురించి ఇంత అసహ్యం గా చెప్పుకుంటారు గానీ ఎంత బాగుందో అనుకుంటారు, వాళ్ళకి అసలు సంగతి బెంగుళూరు హైవే జంక్షను వరకూ వచ్చాక గానీ తెలీదు ఎంత మోసం! అన్నాను. అవును సార్ గల్ఫ్ నుంచి వచ్చిన షేకులు కూడా కొంత మంది పరెషాన్ అవుతర్ సార్, మెయిన్ గా అందరూ ట్రాఫిక్ గురించే పరెషన్ అవుతర్ సార్ అన్నాడు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంగిట్లో కుడి కాలు పెట్టి దిగాను. పెద్ద బొజ్జ మరియు చిన్న గన్ వేసుకుని బిక్కు బిక్కు మంటున్న ఒక సెక్యూరిటీ గార్డు నా పాస్‌పోర్టు, బోర్డింగు పాస్ తీసుకుని, నా మొహం కేసి, నా పాస్‌పోర్టు కేసి తెలుగు సినిమాల్లో డిటెక్టివ్‌లు చూసినట్లు చూసి, వెళ్ళండి సార్ అన్నాడు.
ఎమిరేట్స్ లో ఈ మధ్య యమ రేట్స్ అని ప్రయాణించ లేదు. ఈ మధ్యే వాళ్ళు కాస్త తగ్గడం వల్ల, వాళ్ళ మీద దయ కొద్దీ మళ్ళీ గల్ఫ్ ప్రయాణాలు మొదలు పెట్టా.
చెక్ ఇన్ కౌంటర్ లో యువకుడు చాలా ప్లెజంటు గా పలకరించి, ఇంటర్ నెట్ లో చెక్ ఇన్ చేశారా సార్ రెండూ విండో సీట్లే వచ్చాయి ! అన్నాడు. ఆ తరువాత ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో ఆవదం మొహం పెట్టుకొని ఉన్న ఒక కుర్ర ఆఫీసరు కి గుడ్ మార్నింగ్ చెబితే దులిపేసుకుని, నా పాస్‌పోర్ట్ కేసి చూడడం మొదలు పెట్టాడు. అక్కడ నుండి ఎప్పుడు వచ్చారు సార్! అని అడిగాడు. ఏమో తెలీదు అనాలనిపించింది గానీ ఎందుకైనా మంచిదని కరెక్టు తేదీనే చెప్పాను. సరే వెళ్ళండి అన్నాడు.
సెక్యూరిటీ చెక్ కి వెళ్ళే గేటు దగ్గర వొక సెక్యూరిటీ గార్డున్నాడు. నన్ను ఆపి బ్యాగేజ్ టాగ్ ఏది? అన్నాడు ( హిందీ లో)
ఉంది కదా! అన్నాను (తెలుగు లో) ఇంగ్లాండు నుంచి వచ్చేటపుడు ఒక చక్కటి ప్లాస్టిక్ టాగ్ కట్టారు.
అది కాదు ఇలాంటిది!(హిందీ లో) అని, పక్క వాళ్ళ టాగ్ చూపించాడు.
ఆ పక్క టాగ్ ఆవిడ, చెక్ ఇన్ కౌంటర్ లో ఇస్తారు తెచ్చుకో అని చెప్పింది. ఒక థాంక్యూ ఆ పక్క గా పడేసి వెనక్కు తిరిగాను.
నన్ను దూరం నుంచి చూసిన ఒక ఎమిరేట్స్ ఆఫీసరు ఏమిటి సార్ అన్నాడు (ఇంగ్లీషు లో)
అది కావాలి అన్నాను ఆకుపచ్చ రంగు కాగితం టాగ్ చూపించి.(ఇంగ్లీషు లో)
మీరుండండి నేను తెస్తానని గబగబా వెళ్ళాడు ( ఇంగ్లీషు లో) అబ్బ! ఇంగ్లీషు లో వెళ్ళ లేదు!ఇంగ్లీషు లో అని గబగబ వెళ్ళాడు.
కొద్ది సేపట్లోఆ టాగ్ కట్టుకుని (ఇంకొక థాంక్యూ ఆ పక్కగా పడేశానని మళ్ళీ చెప్పఖ్ఖర్లేదు!)
సెక్యూరిటీ చెక్ సునాయాసంగా ముగించుకుని, డ్యూటీ ఫ్రీ షాపులు చూసుకుంటూ తిరగడం మొదలు పెట్టాను అక్కడేమైనా లాస్ట్ మినిట్ షాపింగు చేద్దామని( బుక్సు, డి.వి.డి లు)ఒక్క నాగార్జున కింగ్ సినిమా మాత్రమే ఉంది పుస్తకాలన్నీ చదివేసినవే. సరే నీరూస్ షాపులొ చాలా స్టైలుగా ఉన్న ఆడ మరియు ఆడ పిల్లల బట్టలు కొంచెం సేపు చూసి సంతోషించాక, బోర్డింగు గేట్ దగ్గర క్యూ లో నించున్నాను.
ఏవీ తోచక అటూ ఇటూ చూస్తుంటే, స్వైన్ ఫ్లూ వీరులు చాలా మంది కనిపించారు. వారందరూ ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కంకణం(మాస్క్) కట్టుకున్న వారే!
యుధ్ధ రంగంలో ఎన్ని ఆయుధాలు వాడతారో వీరూ అన్ని రకాల మాస్క్ లు వాడుతున్నారు. ఒకడైతే మాస్క్ కట్టుకొని, దాని లోపల జేబు రుమాలు కూడా మడిచి పెట్టుకున్నాడు.
ఇంకొకడు మాస్క్ పైకెత్తి దగ్గేసి మళ్ళీ మాస్క్ పెట్టేసుకున్నాడు మనకెవరికీ వాడి దగ్గు వల్ల ప్రమాదం లేదన్నట్లుగా!
మొత్తానికి లోపలకెళ్ళి కూర్చుందును కదా, అక్కడ ఒక సర్‌ప్రైజు ఎదురు చూస్తోంది. మనది విండో సీటే గానీ అక్కడ విండో లేదు! గమనించగా ఒకటి రెండు సీట్లు అలా ఉన్నాయి. బహుశా అక్కడ వింగ్ అటాచ్‌మెంట్ ఏదో ఉన్నట్లుంది.
చెక్ ఇన్ కౌంటర్ లో అన్నీ విండో సీట్లే అని వాడెందుకు నవ్వాడో ఇప్పుడు అర్ధమైంది. నేనెప్పుడూ కటికీ లోంచి చిన్న పిల్లాడిలా చూసుకుంటూ, ఏదో ఆలోచించుకుంటూ ఏదో రాసుకుందా మనుకుంటాను. మన పక్క కిటికీ మూసేసినా, మన మనసు కిటికీ ముయ్యలేడు కదా అని సమాధాన పడి కూర్చున్నాను.
ఇంతలో నా పక్క ఒక సాఫ్ట్ వేర్ టైపు వ్యక్తి కూర్చున్నాడు. 'హల్లో' అన్నాడు. 'హాయ్' అన్నాను.
దుబాయ్ కేనా అన్నాడు(ఇంగ్లీషు) అవును తెలుగొచ్చా? అన్నాను(ఇంగ్లీషు) రాదన్నాడు(ఇంగ్లీషు) మరేవొచ్చో?(ఇంగ్లీషే)
అయాం ఫ్రం పూనా అన్నాడు. అందువల్ల మిగతా సంభాషణంతా ఇంగ్లీషు లోనే నడిచింది.
వారు బిజినెస్ పని మీద ఫ్రాంకుఫర్ట్ ఒక ఎనిమిది వారాల పాటు వెడుతున్నారుట.ఫరవాలేదులే ఇప్పుడు సమ్మరు అందువల్ల బాగానే ఉంటుందని చెప్పాను.
నా దగ్గర నుంచి కూపీ లాగగా, నేను మాంచెస్టరు వెడుతున్నానని, నేనొక ఎనస్థిటిస్టుని అన్న విషయం బైట పెట్టాను. అంటే ఏవిటన్నాడు.వాడి అగ్నానాన్ని వెంఠనే పటాపంచలు చేశాను.
ఒక్క సారి బాఘా వొంగి, వెనక కిటికీ లోంచి బైటకు చూశాను కింద అంతా దట్టమైన మబ్బు. డౌన్‌వర్డ్ కెమేరా చానల్ ఆన్ చేస్తే అదే విషయం కన్‌ఫర్మ్ అయింది. పరవాలేదులే కిటికీ లేక పోవడం వల్ల ములిగి పోయినదేమీ లేదు అనుకొని, మళ్ళీ పూనా వాణ్ణి అడిగాను "ఫ్రాంకుఫర్ట్ కి లుఫ్తాంసా వాళ్ళ డైరెక్టు ఫ్లైటుంది గా హైదరాబాదు నుంచి?"
ఏమో నాకు తెలీదు నేను చెక్ చెయ్యలేదు అన్నాడు.
జేబు లోంచి ఒక ఘుట్కా పేకట్ తీసి, నేను తింటే ఏమీ అనుకోవు కదా అన్నాడు. పర్లేదులే ఏ సిగరెట్టో, చుట్టో కాల్చట్లేదు కదా అని నవ్వాను. వాడూ నవ్వి ఒక గుటక(ఘుట్కా) వేశాడు.
ఈ లోపు డ్రింక్సు వచ్చాయి.సరే బాగా ఐసు వేసి ఇమ్మన్నాను(నేనేం తాగితే మీకెందుకు! ఎవరిష్టం వాళ్ళది) పూనా వాడు ఘుట్కా మింగేశాడో, ఉమ్మేశాడో తెలీదు గాని డ్రింకు తాగడం మొదలు పెట్టాడు. డ్రింకుతో బాటు మా మరదలు రెండేళ్ళ కూతురు తినేంత మిక్చర్ ఇచ్చారు దాంతో ఆకలి ఆకాశాన్నంటింది. ఈలోగా భోజనం వచ్చింది. స్టార్టర్ ఏమిటంటే, మూడు ఫిరంగి గుళ్ళ లాంటి వడలు, దవడలు కదిలిపోకుండా ఉండడానికా అన్నట్లు దహీ లో నానేసి ఇచ్చాడు.
దహించుకు పోతున్న కడుపుకి ఆ దహీ వడలే అమృతం లా అనిపించాయి. ఆ తరవాత టేబిల్ మ్యాట్ లో నాలుగో వంతున్న పరాఠా, బైంగన్ బర్తాట (నా మొహవేం కాదూ!), ఇంకో టేదో చీజ్ లో బఠాణీలు వేసిన ఒక వేడి వేడి పదార్ధం ఇచ్చాడు. ఆ వేడి మీద అన్నీ బాగానే ఉన్నాయి. అవన్నీ కానిచ్చి, ఒక రకంగా ఉన్న చీజ్ కేక్ తిని కాఫీ తాగి చాక్లేటు నోట్లో వేసుకున్నా. వారిచ్చిన సోంపు పొట్లం జేబులో వేసుకున్నా (ఇంకా కడుపులో తిప్పట్లేదు కాబట్టి)
పూనా వాడు నేను ఎన్నేళ్ళ నుంచి ఇంగ్లాండు లో ఉంటున్నానని అడిగి తెలుసుకుని ఆశ్చర్యం ప్రకటించాడు. ఇంగ్లాండు కూడా ఇండియా లాగే ఉంటుందా అని ఒక అర్ధం లేని ప్రశ్న వేశాడు. నేను ఏమిటి వాడి ఉద్దేశ్యం అని కన్‌ఫ్యూజ్ అయ్యి, ఏమైతే అయ్యింది అనుకొని, అబ్బే ఉండదు ! అక్కడ జనం, కల్చర్ వేరు పెద్ద సిటీలలో మాత్రం ఇండియన్స్ కనిపిస్తారు అంటే నమ్మలేనట్లుగా చూశాడు. అప్పుడు నాకు అదేదో సినిమాలో బ్రహ్మానందం డైలాగు ఊరికే ఎర్ర బస్సెక్కి వొచ్చేస్తారు! గుర్తుకొచ్చింది.
ఇంతలో దుబాయ్ వొచ్చేశాం అని అనౌన్స్ మెంట్ వచ్చింది(అరబిక్, ఇంగ్లీషు). దిగేసరికి పన్నెండుం పావు అయింది(దుబాయ్ టైం). రెండు గంటల ముఫ్ఫై నిముషాలకి తరవాత ఫ్లయిటు. సరే ఏమైనా అత్తరులు కొందామని చూశాను. రోజ్ స్ప్రే కొట్టుకుంటే బాగుంది, కొంచెం సేపు పోయాక వేరే వాసనొచ్చింది మనకెందుకులే అని వొదిలేశాను.
వొచ్చేటప్పుడు చూసిన ఒక మంచి మొబైల్ ఫోను కొందామని అడిగితే స్టాకు లేదన్నాడు అపుడనిపించింది మన సెలక్షను మంచిదే అని. ఆకలి పెద్దగా లేదు, కాళ్ళరిగేలా అటూ ఇటూ రెండు సార్లు తిరిగి అన్ని షాపులూ చూసి కొనీ వాడిలా వివరాలడిగి, చివరకి బోర్డింగు టైము అయ్యిందనిపించాను. మళ్ళీ ఎమిరేట్స్ వారికి అనువైన క్రమంలో బోర్డింగ్ కి నెంబర్లు పిలిచాక వెళ్ళి కూర్చున్నాము.
హైదరాబాదు - దుబాయ్ విమానంలో సీటు 10కె. కిటికీ లేని సీటు(ఎయిర్ బస్ లో) దుబాయ్ - మాంచెస్టరు విమానంలో సీటు 11కె. దానికన్నా ఇది పెద్ద విమానం కదా అందుకని 11కె. సరిగ్గా కిటికీ లేని చోట వస్తుందేమోనని ఒక శంక. దూరం నుంచి చూస్తే 9, 10 కిటికీల తరవాత ఒక కిటికీ లేదు కరక్ట్ గా లెఖ్ఖ పెడదామంటే ఏదో అడ్డం ఉంది ఎల్లారా నాయనా అనుకుంటూ లోపలకెక్కాను. ఆశ్చెర్యం! ఎకానమీ క్లాసు సీట్లు నెంబరు 7 నుంచి మొదలయ్యాయి హమ్మయ్య! పెద్ద గండం గడిచింది. ఈ కిటికీ పక్క సీటు మనస్తత్వం ఎప్పటికీ మారదనుకుంటాను. ఏవీ లేదు, బయట కనిపించే వింతలూ, విశేషాలూ చూస్తోంటే హుషారుగా ఉంటుందన్నమాట.
దుబాయ్ పరిసర ప్రాంతాలన్నీ బాగా పొగమంచు తో నిండి ఉన్నాయి. పైకెగిరాక ఏం కనిపిస్తుందో అనుకున్నాను. నా ప్రక్కనే ఒక తల్లీ కూతుళ్ళు కూర్చున్నారు. అరెరే! ఇందాక పూనా వాడికి టాటా చెప్పడం మరచిపోయాం. కాస్త మెతక వాడిలా ఉన్నాడు జర్మనీ లో ఇంగ్లీషు లో ఎలా నెగ్గుకొస్తాడో! ఆ, ఏదో నెట్‌వర్క్ ఉండే ఉంటుంది. ఇండియన్స్ ప్రపంచం అంతా చెద పట్టినట్టు పట్టేశారు ఏం పర్లేదు. ఈలోపు తరుణ్, ఇలియనా నటించిన "భలే దొంగలు" సినిమా పెట్టాను.(ఈ మధ్య విమానాల్లో తెలుగు సినిమాలు కూడా ఇస్తున్నారండోయ్!)
నా పక్క వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు,లివర్ పూల్ లో ఉంటారు. సౌత్‌పోర్ట్ అనేసరికి సొంత మనిషిలా మాట్లాడారు.(19 మైళ్ళ దూరమే!) ఆ అమ్మాయి జి.సి.యస్.ఈ. లోకి వచ్చిందిట. కొడుకు మొన్ననే పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యడుట. ఆవిడ పేరు తెలేదు గానీ వాళ్ళమ్మ గారు ఆస్ట్రేలియా లో ఉంటారుట. ఒక ఆరు వారాలు సెలవులో వెళ్ళి వస్తున్నారు. ఇంక ఇంటి బెంగ వచ్చేసిందిట! నాకు ఒక రెండు వారాల తరువాత ఇంటికి తిరిగి వెళ్ళకపోతే అలాగే ఉంటుందని చెప్పాను. అవును సహజమే కదా అందావిడ. కిటికీ లోంచి బైటకు చూశాను, గల్ఫ్ దాటి కువైట్ మీదుగా ఇరాక్ ప్రవేశించాం. ఎటు చూసినా ఎర్రటి ఎడారి (ప్రాస కుదిరింది కదా అని ఎర్రటి అన్నాను గట్టిగా నిలదీస్తే, బాగా ముదురు గోధుమ రంగు అని చెప్పచ్చు)
మధ్యలో ఎక్కడినుంచో ఎక్కడికో పాపిడి తీసినట్లున్న నల్లటి తిన్నటి రోడ్లు.ఎటు చూసినా అంతా బల్ల పరుపుగా,"ఎవడ్రా భూమి గుండ్రంగా ఉందన్న వాడు!" అన్నట్లుగా ఉంది. ఈ లోపు శెనగలు, సలాడ్, పన్నీర్, పప్పుతో అన్నం తిని చాక్లేట్ లాంటి చాక్లేట్ కేక్ తిని ఒక సారి లేచి అటూ ఇటూ తిరిగి బోలెడు నీళ్ళు తాగి వచ్చి కూర్చున్నాను. ఈ లోపు ఇరాక్ దాటి జోర్డన్ వచ్చింది. ఇక్కడేమో అక్కడక్కడ జనావాసాలున్నాయి. ఎడారి మధ్యలోనే కాని అవి ఉన్నంత మేల పచ్చటి చెట్లున్నాయి. ఏదో పెద్ద మ్యాప్ మీద కొన్ని చోట్ల వొదిలేసి మిగతాది చెరిపేసి నట్లుంది. ఎర్రటి ఎడారి తగ్గి అక్కడక్కడ నల్ల నల్లగా, పచ్చ పచ్చగా కనిపించడం మొదలు పెట్టింది. ఇంక యూరప్ కి వెళ్ళేసరికి అంతా పచ్చదనమే కనిపిస్తుంది.
జోర్డన్ దాటి సిరియా ప్రవేశించడానికి కొంచెం ముందు నుంచే కొంచెం ఎత్తు పల్లాలు మొదలయ్యాయి. నా దుష్ట బుద్ధికి జోర్డన్ యువ రాణి గుర్తుకొచ్చింది. ఆ తరవాత చెప్పా పెట్టకుండా టర్కీ లోకి ప్రవేశించాం. ఏషియాకి యూరప్ కి మధ్య భూ సంధి ఇదే. ఇంకొంచెం ఎత్తైన ఇంకొంచెం పచ్చని ముడుత పర్వతాలు ప్రారంభం అయ్యాయి. మధ్య మధ్యలో పాల పిట్ట రంగు సరస్సులు కూడా వస్తున్నాయి.దానితో బాటూ ఆవలింతలూ, నిద్రా కూడా వస్తున్నాయి.
టర్కీ లో మొట్టమొదటి సారిగా ఎత్తైన కొండల్లోంచి ఒక నది పుట్టి మెలికలు తిరుగుతూ పోవడం చూశా. అదిగో కొంచెం దూరంలో కవ్వంతో చిలికిన వెన్న ముద్దల్లాగ తెల్లటి బొద్దుగా ముద్దుగా ఉన్న మేఘాలు కనిపిస్తున్నాయి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు హల్వా మీద జీడి పప్పులా అక్కడక్కడ వో మేఘం ఉండాలి గానీ పూర్తిగా కమ్మెయ్యకూడదు. ఇప్పుడు మంచి దట్టమైన అడవులు కూడా వస్తున్నాయి కొండల మీద. ఇంకొద్ది సేపట్లో నల్ల సముద్రం మీదకొస్తాం.ఆ సముద్ర తీరం, తెల్లటి ఇసుక, పారదర్శకంగా ఉన్న పాలపిట్ట రంగు నీళ్ళు (వడ్డుకి దగ్గరగా ఉన్నవి) ఎంతో బాగుంటాయి. అందుకే అది చాలా ప్రసిధ్ధి గాంచిన పర్యాటక కేంద్రంగా మారింది. అందులోనూ ఇంగ్లీషు వాళ్ళకి టర్కిష్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా.అన్నిటికంటే ముఖ్యం చాలా హాలీడే ప్రదేశాలతో పోలిస్తే చవక కూడా! చీప్ అండ్ ది బెస్ట్ విషయాలు కనిపెట్టడంలో ఇంగ్లీషోడిని కొట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు!
నల్ల సముద్రం మీద తెల్లటి మబ్బు తునకలు చాలా విచిత్రం గా సన్నగా పొడుగ్గా, వరసల్లో ఆకాశం అటు నుంచి ఇటు వరకూ బారులు తీరిన వాన పాముల సైన్యం లా ఉన్నాయి.
ఆ రకంగా ప్రయాణం సాగుతుంటే కాస్త కునుకు తీస్తే నయం అనిపించింది. హటార్తుగా మెలుకువ వచ్చి చూస్తే కిటికీ షట్టర్లు కిందకి దించి ఉన్నాయి. నేను పడుకున్నప్పుడు పక్కావిడ మరీ ఎండగా ఉందని దించేసింది కాబోలు. వెంఠనే ఎత్తేయడం బాగుండదని మళ్ళీ నిద్ర కంటిన్యూ చేసేశాను. ఈ లోపు బుఖారెస్ట్, యూరప్ లో అతి సుందరమైన నగరాలలో ఒకటైన వియన్నా మొదలగు నగరాలన్నీ వెళ్ళీపోయి, జర్మనీ లో న్యూరెంబర్గ్ వచ్చేసింది. జర్మనీ లో అంతా పచ్చదనమే! దట్టమైన అడవులూ పచ్చటి పొలాలు, కొండలు, అతి చక్కటి నగరాలూ ఎంత బాగుందో! వో సారి నేల మీద నుంచి కూడా చూడాలి. న్యూరెంబర్గ్ నుంచి ఫ్రాంకుఫర్ట్ పక్కనుంచి కోస్టు వరకూ ఒక నది చక్కగా వెడుతోంది( అది మెయిన్ నది కొంత దూరం వెళ్ళాక రైన్ నది తో కలిసిన తరువాత, నార్త్ సీ లో కలుస్తోంది.)
ఈ నగరాల పేర్లన్నీ ఫ్లైట్ పాత్ మ్యాప్ లో ఎప్పటి కప్పుడు చూపిస్తున్నారు. అదిగో అప్పుడే బెల్జియం వచ్చేస్తున్నాం! బ్రస్సెల్స్ నగరం కనిపించేస్తోంది. ఇంక ఇంచుమించు వొక గంట ప్రయాణం ఉంటుంది. సాయంత్రం భోజన రూపం లో ఒక చపాతీలో చుట్టిన కూర, మన వల్ల కాని కేకు ఒకటి వచ్చింది. ఆ కేకు కొంచెం కతికి, కాఫీ తాగి, త్రేన్‌చుకుంటూ కూర్చున్నాను. నిద్ర లేచాక చాలా ఫ్రెష్ గా ఉంది. భలే దొంగలు సినిమా భలేగా అయిపోయింది. సరే కదా అని ఢిల్లీ - 6 పెట్టాను. అదిగో అల్లదిగో ఇంగ్లీషు చానెల్ కనిపిస్తోంది. పొలాలన్నీ రక రకాల రంగుల్లో, అతుకులు వేసి కుట్టిన ముష్టి వాడి చొక్కా లా ఉన్నాయి. ఇంగ్లీషు చానెల్లో చాలా వోడలు రక రకాల రంగుల్లో వరసలు పేర్చిన బిల్డింగు బ్లాక్స్ లా ఉన్నాయి.
ఎండ మటుక్కు చాలా చక్కగా ఉంది. మాంచెస్టరు వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఏమో! అరే! ఒక్క సారి తల తిప్పి మళ్ళీ బయటకు చూసే సరికి దట్టమైన మబ్బుల్లోకి ప్రవేశించాము. దూరంగా చూస్తే లో లెవెల్లో దట్టమైన మబ్బులు. ఇంగ్లాండుకీ మబ్బులకీ, అప్పుకీ వడ్డీకీ ఉన్న సంబంధం! అరే చక్కగా ఎండలో వొణక్కుండా, తడవకుండా దిగుదామంటే వీలవ్వదే! ఎవరో దుష్ట మాంత్రికుడు నా మనస్సు చదివి, మంత్రం వేసి పంపినట్లు వచ్చేశాయి. అందుకే ఇంగ్లాండు గురించి ' సనామూర్ ' అనే కవి ఒకసారి అన్నాడు "ఎపుడు చూసిన వాన వాన! ఎండ నేను చూడ లేనా?" అని. పాపం చాలా కాలం చూసి ఉంటాడు.
అరె ఆశ్చర్యం! నా ఏడుపుకి కొంచెం మబ్బులు కరిగి పల్చబడ్డట్టున్నాయి, మళ్ళీ పల్చగా నేల కనిపిస్తోంది. పరవాలేదు అక్కడక్కడ జీడిపప్పు మబ్బులే ఉన్నాయి. మాంచెస్టరులో ఇరవై డిగ్రీలు ఉందని ఇప్పుడే ఎనౌన్స్ మెంటు ఇచ్చారు. ఇంగ్లాండు అతి చక్కగా, అతి పచ్చగా ఉంది. మా విమానం నెమ్మదిగా ఎత్తు తగ్గడం మొదలైంది. బర్మింగుహాం దగ్గరికి వచ్చేసరికి ఒకటి రెండు క్వారీలు కనుపించాయి. స్పైరల్ గా కిందకు దిగే రోడ్డు తో చాలా అందంగా ఉన్నాయి. నా సందేహాలన్నీ నివృత్తి చేస్తూ, నా భయాలన్నీ నిజం చేస్తూ, దట్టమైన మబ్బుల్లోకి ప్రవేశించాము. కొద్ది సేపట్లో మాంచెస్టరు విమానాశ్రయం లో, సన్నగా వాన పడుతున్న మబ్బుల్లోంచి సునాయాసంగా దిగాము. ఆ మబ్బులు చూశాక, రాడార్ లాంటివి కనిపెట్టక పోతే మన పని గోవిందే! అనిపించింది.
గబ గబా ఇమ్మిగ్రేషను పూర్తి చేసుకుని, లగేజి తీసుకుని బయటకొచ్చేసరికి, ముందు చెప్పినట్లు గానే డబల్ యూ. హెచ్. స్మిత్ బుక్ స్టాల్ దగ్గర, ఎం. డి. ట్రావెల్స్, సౌత్‌పోర్ట్ అని బోర్డ్ పట్టుకుని ఒక పొడవైన యువకుడు ఉన్నాడు. నేను "హల్లో వియ్ ఆర్ గోయింగ్ టూ సౌత్‌పోర్ట్" అన్నాను. వాడు "వాట్ నేము ఈజ్ యిట్" అనడిగాడు. నేను చెప్పగానే నవ్వేసి నేను పలకలేక పోతున్నాను కాబట్టి కరక్టే అని, గబ గబా వచ్చి ముందు జాగ్రత్త గా నా చిన్న సూట్కేసు అందుకుని కారు దగ్గరికి నడిచాడు. హమ్మయ్య అనుకుని వాడి వెనకే నేనూ కారెక్కాను.
ఇంక కధ కంచికీ, మనం ఇంటికీ! (ఏవిటీ? ఇంతకీ సబ్జెక్టేమిటంటారా!కుక్క పిల్లా, అగ్గి పుల్లా వగైరా కాదేదీ కవితకనర్హం అననే అన్నారు కదా, మరి నేనన్ని వేలు పోసి ఇండియా నుంచి ఇంగ్లాండు వరకూ ప్రయాణిస్తే ఆ విషయం చదవడానికేమిటండీ మరీనూ!)

 
డా. జొన్నలగెడ్డ మూర్తి గారు కోనసీమలోని అమలాపురంలో పుట్టి, పుదుచ్చెర్రీలో పనిచేసి, ఆ తువాత ఇంగ్లాండులో స్థిరపడ్డారు. వీరి వృత్తిని వీరి మాటలలో చెప్పాలంటే, సమ్మోహనశాస్త్రమే (Anaesthesiology) కాబట్టి, వీరి చమత్కారశైలితో మనల్ని సమ్మోహితులు చేస్తుంటారు.. తెలుగులో కవితలు వ్రాయడంతో పాటు, వీరు చక్కని నటులు, దర్శకులు, రేడియో యాంకర్, ఫొటోగ్రాఫర్, బహుముఖప్రజ్ఞాశాలి. మెడికల్ సైన్సెస్ లో అనేక పేటెంటులను సాధించి అనేక మన్ననలను పొందారు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.                    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                                                                                                            Site Design: Krishna, Hyd, Agnatech