పాఠకుల సమర్పణ  
     మా నాన్నకు జేజేలు - నిర్వహణ : దుర్గ డింగరి  

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి. 


 

మా నాన్నగారే నా జీవితాన్ని తీర్చిదిద్దారు

- కృష్ణవేణి చారి

 

మా నాన్నగారు, దూసి నరసింహస్వామి మంచి విలువలు కలిగిన వ్యక్తి.  మంచి ఆరోగ్యవంతులు, ఎప్పుడు సిగరెట్, మందు ముట్టి ఎరగరు, వెజిటరియన్, నీతి నియమాలకు ప్రాముఖ్యతనిచ్చిన వ్యక్తి.  ఆంధ్రా నుండి డిల్లీకి నేను మూడు, నాలుగు నెలలున్నపుడు వచ్చారు. ఆయన డిల్లీలో స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేసారు.  నాకు ఐదేళ్ళ వయసప్పుడు మా నాన్న గారికి ఒక భయం పట్టుకుంది, మా మాతృభాష తెలుగుని పూర్తిగా మర్చిపోతామేమొ అని.   తెలుగు నేర్పించడం మొదలు పెట్టినపుడు హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు భాషలు ఒకటే సారి నేర్చుకోవడం మొదలుపెట్టాము.  మా నాన్నగారు తెలుగు వార్తాపత్రికలు తెప్పించేవారు, అమ్మ అన్నపూర్ణ, తెలుగు వారపత్రికలు, మాస పత్రికలు తెప్పించేది.  తెలుగు నేర్పించడం మొదలుపెట్టగానే చందమామతో పాటు మిగతా పిల్లల పత్రికలు అప్పుడు వచ్చేవన్నీ తెప్పించేవారు.  నా బాల్యంలో మా ఇంటికి దగ్గరలో ఆంధ్రా లైబ్రరీ, వుండేది.  అప్పటికే నాన్నగారి దగ్గర తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాం కాబట్టి నా చేతికి ఏ తెలుగు పుస్తకం దొరికినా చదివేదాన్ని.  నేనొక పుస్తకాల పురుగుని నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ లైబ్రరీ మాకు ఒక వరంలా అనిపించేది.  నేను ఎక్కువగా తెలుగు పుస్తకాలు చదివేదాన్ని, నా టీనేజ్ లో సీరియస్ వి  వేయిపడగలు, లాంటి పుస్తకాలు, మిగతావి చాలా చదివాను.  కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పట్లో అలా చదివేసేదాన్ని కానీ అవి నాకు ఎంతవరకు అర్ధం అయ్యాయి అని అనిపిస్తుంది, ఆ వయసులో అంత సీరియస్ పుస్తకాలు చదివి అర్ధం చేసుకునే తెలివి ఇంకా వచ్చిందో, లేదో తెలియదు.  అప్పుడే ఎంతో మంది రచయిత(త్రు)ల పుస్తకాలు చదివే అవకాశం కలిగింది.  కానీ ఇప్పుడు తెలుగు పుస్తకాలు చదివే అవకాశం లేదు, నేను ఎప్పుడైనా తిరుపతికి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఆంధ్రాకి వెళుతుంటే, చాలా తెలుగు బుక్స్ తెప్పించుకుంటాను.  మాది విజయనగరం జిల్లాలొ చిన్న వూరు, ఇప్పటికీ మా అమ్మగారి పెద్ద మండువా ఇల్లు వుంది అక్కడ. నేను 84 లో మా బందువుల ఇంట్లో పెళ్ళయితే వెళ్ళాను అంతే, మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళలేదు.  తెలుగు నేను ఎక్కువగా రాయలేదు, నేను నా ఇండియన్ ఏయిర్ లైన్స్ ఉద్యోగం నుండి వలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాక కొన్నేళ్ళ క్రితం కాలిఫోర్నియాలోని ఒక రేడియో స్టేషన్ వారికి తెలుగు రాయడం మొదలు పెట్టాక ఇప్పుడు బాగా రాయడం అలవాటయ్యింది.   మా ఇద్దరు తమ్ముళ్ళూ నా కంటే  తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం ఎక్కువే ఎందుకంటే వాళ్ళుండేది తెలుగు వారు ఎక్కువగా వుండే ప్రదేశంలో మేముండేది ఎనబై శాతం పంజాబీ కుటుంబాలుండే చోట.

నాన్నగారు తర్వాత డిల్లీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి డైరెక్టర్ అయ్యారు.  నేను ఒక్కగానొక్క కూతురిని.  డిల్లీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్స్ లో పదకొండవ తరగతి వరకే వుండేది ఆ తర్వాత కాలేజికెళ్ళి బ్యాచిలర్స్ డిగ్రీ చదవాలి.  ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు మా సెంటర్ చాలా దూరం పడింది, దాదాపు 35కిలో మీటర్లు దూరం మా ఇంటి నుండి.  అందుకని మా అమ్మ నా తోడుగా మా నాన్న వెళ్ళాలని అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది.  ఆడపిల్ల అయినంత మాత్రాన నిస్సహయంగా, ఏమి పనికిరాకుండా, బద్దకంగా, ఫూలిష్ గా వుండాలని అర్ధమా?  నా కూతురు తన కాళ్ళ మీద తను నిలబడేలా, ధైర్యంగా అన్నీ నేర్చుకోవాలి, జీవితంలో ఏ కష్టం వచ్చినా బెంబేలు పడకుండా ఆ కష్టాలని తనే ఆలోచించి పరిష్కరించుకోగలిగేలా ఉండాలి, ఆడపిల్ల అయినంత మాత్రానా ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడి బ్రతకాలని లేదు, అని ఖచ్చితంగా చెప్పారు.  ఆ విధంగా నాలో స్వతంత్ర భావాలని నాటారు.  మానసికంగా నన్ను ధృడంగా తయారు చేసారు.  ఆయనకి న్యాయా, అన్యాయాల గురించి బలమైన అభిప్రాయాలుండేవి ఆయన దగ్గర నుండి వచ్చిన ఆ విలువలు నాలో కూడా బాగా జీర్ణించుకుపోయాయి.  మా నాన్నగారు తనలో వున్న ధృఢమైన మంచి, చెడుల అభిప్రాయాలను నాలో ఎంతంగా నాటారంటే దాని ప్రభావం ఇప్పటివరకు వుంది, నా జీవితాంతం వుంటుంది.  ఒకోసారి నేను కొంచెం పట్టు విడుపుగా వుండాలని అనుకుంటాను కానీ ఆయన జీవించి చూపించిన జీవితపు విలువలు నాలో బలంగా నాటుకుని పోయి వుండడం వల్ల నేను అలా వుండలేకపోతున్నాను.  దానికి నేను ఆయనకి ఎంతో రుణపడి వుంటాను.  ఆయన అబిప్రాయం ప్రకారం నేను పురుషులు చేసే పనులన్నీ చేయగలగాలి వారితో సమంగా.  నేను ఏ పనైనా చేయలేను అని అనుకున్నా, చేయకుండా వుండడానికి ప్రయత్నించినా అది కేవలం నేను స్త్రీనని చెప్పి,  నిస్సహయురాలిని అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అనేవారు.  నాకు ఈ రోజున స్త్రీ స్నేహితులెంతమంది వున్నారో అంతే మంది పురుష స్నేహితులు వున్నారంటే నేను అందరితో సమంగా ఒకే రకమైన విలువలతో బందాన్ని సునాయసంగా పెంపొందించుకోగలను.  నాలో కొద్దిగా వున్న తాత్వికంగా వుండే ప్రకృతి, నాలో అంతర్లీనంగా వున్న న్యాయం, ధర్మ విచక్షణ, నాకెంతో ఇష్టమైన పుస్తకపఠనం, ప్రతి ఒక్కరితో మంచిగా వుండాలనే తపన - ఇవన్నీ మా నాన్నగారు నాకిచ్చిన ఎన్నటికి మరిచిపోలేని జీవితపు విలువలు.   

నాకిప్పటికీ మా నాన్నగారి సౌమ్యమైన, తెలివైన, దయని కురిపించే కళ్ళు ఇంకా గుర్తున్నాయి.  ఆయన ఏదైన నేర్పిస్తే ఒకటే సారి నేర్పించేవారు, మొదటిసారి నేర్చుకున్నారా సరే లేదా ఆయన మళ్ళీ తిరిగి చెప్పటం అంటూ జరిగేది కాదు, ముఖ్యంగా ఫిజిక్స్ అంకెలతో నాకెంతో ఇష్టమైన సబ్జెక్ట్ బాగా చదివే దాన్ని కూడా.  ఆయన నన్ను తీర్చిదిద్దారు అంటే అతిశయోక్తి కాదు.  నాన్నగారు ఎప్పుడు సహనమూర్తి కారు, కానీ చాలా తెలివైన మనిషి, కొద్దిగా విబిన్నంగా కానీ సౌమ్యంగా వుండేవారు, ఆయనకి చదరంగం ఆటంటే చాలా ఇష్టం.  ప్రతి సాయంత్రం టీ కానీ కాఫీ కానీ తాగుతూ చెస్ ఆడడం అంటే చాలా ఇష్టం, ఒకోసారి ఆ ఆట మూడు రోజులదాకా సాగుతూనే వుండేది ఆయన స్నేహితులతో.  ఎపుడైనా ఆయన స్నేహితులు రాకపోతే నేను ఆయనతో పార్ట్ నర్ గా ఆడేదాన్ని. అలా ఆయనతో ఆడి ఆడి ఆ ఆటంటే నాకూ చాలా ఇష్టమయిన ఆట అయ్యింది.  ఆయన నేర్పించారు నాకు, కానీ ఒకోసారి నేను ఆయన్ని ఓడించేదాన్ని.  ఇప్పుడు అలవాటు తప్పిపోయింది.  ఆయన గురించి ఎంత చెప్పను, ఆయనలో వున్న ఎన్ని మంచి లక్షణాల గురించి ఎంతకనీ చెప్పను.  నేను ఈ రోజున ఈ విధంగా వున్నానంటే ఆ రకంగా చేసింది మా నాన్న గారే అని గర్వంగా చెప్పగలను.  ఆయన ధృఢమైన విలువలు, మంచి ఆశయాలున్న మనిషి.  జీవితంలో ఎటువంటి పరిస్థితిలోనైనా సరే అబద్దం చెప్పకూడదు, ఆయన ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు, యోగ్యతకి విలువిచ్చేవారు, అందరిని సమంగా చూసే విషయాన్నిగౌరవించేవారు.   మా నాన్నగారు మాకు నేర్పించిన జీవన విలువలతో బ్రతకడం కష్టమేమో ప్రస్తుత సమాజంలో కానీ నేను మాత్రం ప్రతి విషయాన్ని వదిలిపెట్టకుండా ఆ విలువలతోనే బ్రతుకుతున్నాను.  ఆయన శారీరకంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన భావనే నాకు రాదు ఎందుకంటే ఆయన నా వెంటే వుండి నాకు దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.   మా నాన్నగారు మా పాపకి కూడా తెలుగు నేర్పించారు, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆంధ్రా వదిలిపెట్టి వచ్చిన మూడవ తరంకి చెందిన పిల్ల అయినా తెలుగు చాలా తొందరగా నేర్చుకుంది మా పాప.  ఇప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది, చదువుతుంది కానీ రాయడం అంత బాగా రాదు.  ఆంధ్రాలో వుండి తెలుగు మాట్లాడటానికి రాని వారు ఎంత మందో ఆ లెక్కన మేము మా నాన్నగారికి ఈ విషయంలో రుణపడి వున్నామనే చెపొచ్చు. 

మా నాన్నగారు యాబైఎనిమిదేళ్ళ వయసులో ఫిజిక్స్ ఫీల్డ్ నుండి రిటైర్ అయ్యారు, అదే సమయంలో IGNOU (ఇందిరాగాంధి నేషనల్ ఓపెన్ యునివర్సిటి) బాగా అభివృద్దిలోకి వస్తున్నది.  ఆ యునివర్సిటీ వారు మా నాన్నగారిని రిటైర్మెంట్ తర్వాత కన్సల్టెంట్ గా చేరమని అడిగారు.  ఆయన పోయేవరకు అక్కడే పనిచేసారు.  అనుకోకుండా సెప్ట్ంబర్ నెలలో ఆయన ఆకలి మందగించసాగింది, ఆయన మామూలుగా మంచి ఆరోగ్యవంతంగా తినేవారు, అలాంటివారు తిండే తినకుండా అయిపోయారు.  మా అమ్మా, నాన్న డాక్టర్ కి చూపించుకుని వస్తే అంతా బాగయిపోతుంది అనుకుని హాస్పిటల్ కి వెళ్ళిన వారు, మా నాన్న అదే ఆఖరిసారిగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు.  డాక్టర్లు కొన్ని టెస్ట్స్ చేస్తామని అనడంతో నాన్న అక్కడే వుంటే అమ్మ ఇంటికి వచ్చి బట్టలు తీసుకుని వెళ్ళడానికి వచ్చింది.  మేమంతా అది తాత్కాలికమైన విషయం అనుకున్నాం ఎందుకంటే మా నాన్న గారు సునాయసంగా పది కిలోమీటర్లు నడిచేవారు, ఆరోగ్యకరమైన ఆహారమే తినేవారు.   ఆయన మొదట శ్రీ గంగారాం హాస్పిటల్ లో చేరారు, అక్కడే ఆయన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మొదలుపెట్టింది.  అక్కడినుండి సర్ వెలింగ్టన్ హాస్పిటల్ కి మార్చారు, ఇప్పుడు అదే హాస్పిటల్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ అంటున్నారు, మళ్ళి అక్కడి నుండి ఒక దగ్గరి బందువు డా. గోపినాధ్, హెడ్ ఆఫ్ కార్డియాలజీ ఆఫ్ AIIMS (ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES) సలహా మీద అక్కడికే మార్చారు.  డాక్టర్లకు మా నాన్నగారి పరిస్థితి అస్సలు అర్ధం కాలేదు, వైద్య పరంగా ఏ ప్రత్యేక కారణం లేకుండా ఆయన ఆరోగ్యం దిగజారసాగింది.  నేనపుడు ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్ లో పని చేసేదాన్ని ఒక పది రోజులవరకు ఆయనని చూడలేకపోయాను.  నాకు కుదరగానే నా బట్టలు సర్దుకుని, కొన్ని పుస్తకాలు తీసుకుని నాన్నగారి దగ్గర సమయం గడపడానికి వెళ్ళాను.  నాన్నగారి కళ్ళలో నన్నుచూడగానే వెలుగు కనిపించింది. అమ్మ నేను వెళ్ళగానే కాఫ్టేరియాకి వెళ్ళింది టీ తాగడానికి, నాన్నగారు ఇంక బాగయిపోతారు అన్న నమ్మకంతో.   నేను స్పూన్ తో కొద్ది కొద్దిగా పాలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాను. 

 అమ్మ బయటికి వెళ్ళగానే నాన్న గారు నీరసంగా వున్న చూపుడు వేలుతో గోడపై ఏదో రాస్తూ టైమ్ ఎంతయింది అని అడగడానికి ప్రయత్నిస్తున్నారు.  నేను ఎందుకు అని సంజ్ఞలతో అడిగితే తన మణికట్టు చూపించి కరెక్ట్ మూడు గంటలకి తన ప్రాణం పోతుందని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నేను అలా అనొద్దని ఆయనని వూరుకోబెట్టడానికి ప్రయత్నించాను కానీ ఆయన వూరుకోకుండా మూడు గంటలయినప్పుడు చెప్పమని అన్నారు.  ఆయన తల క్రింద చేయిపెట్టి పాలు పడుతున్నాను, మొదటి మూడు స్పూన్స్ తర్వాత సడన్ గా మ్రింగడం ఆగిపోయిందని గమనించాను.  నేను ఆయనని కదిపి చూసాను ఆయనలో కదలిక లేదు, డాక్టర్ కోసం అరిచాను. డాక్టర్లు వచ్చి నన్ను బయటికి వెళ్ళమని చెప్పి కాసేపయి తర్వాత వచ్చి మా నాన్నగారు పోయారని చెప్పారు.  మా అమ్మ కాప్టేరియా నుండి తిరిగి వస్తూ నన్ను దూరంనుండే చూసి కళ్ళు తిరిగి పడిపోయింది.  మా నాన్న గారి రిపోర్ట్ లో " ఏ వైద్యపరమైన కారణాలు లేకుండానే పోయారని, ఆయన పోయిన సమయం కరెక్ట్ గా మూడు గంటలని, రాసారు.  ఆయన మూఢనమ్మకం అనండి, భవిష్యత్తు దృష్టి అనండి ఆయన చెప్పినట్టుగా మూడు గంటలకే పోయారు.  మా అమ్మ గారు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు,  అన్నేళ్ళు కాపురం చేసిన తనని ఆయన పోయేపుడు తన దగ్గర వుండనీయకుండా నన్నేందుకు దగ్గర వుండమన్నారో అర్ధం చేసుకోలేకపోతుంది.  ఆయన లేని నిజాన్ని ఇంకా ఒప్పుకోలేకపోతున్నది.  నాకు మాత్రం మా నాన్నగారు నా వెంట వుండి మంచి దారిలో నడిపిస్తున్నారు, నేనెప్పుడు తప్పటడుగు వేయకుండా నన్ను కాపాడుతూనే వున్నారు. నాకు సంబందించినంతవరకు మా నాన్న మా దగ్గరే, మా మనసుల్లోనే వున్నారు, ఎప్పటికీ వుంటారు. 

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.                    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                                                                                                            Site Design: Krishna, Hyd, Agnatech