కథా భారతి  
      కథా విహారం

- రచన :  విహారి

 
   అద్దం లాంటి కథనమే పెద్దిభొట్ల సుబ్బరామయ్య విధానం
 
 

తొలిసారిగా నీళ్ళ సమస్యని ఇతివృత్తంగా పట్టుకుని, నీళ్ళు కథగామలిచి, తెలుగు సాహిత్యంలో ఒక క్లాసికల్ కథకుడుగా నలభై ఏళ్ళ క్రితమే పేరు తెచ్చుకున్న రచయిత పె.సు.రా. ఈనాడు నీటి సమస్య ఎన్నెన్ని కథలకు వస్తువును కూరుస్తుందో మనకు తెలుసు.

మనిషి అంతర్లోకాల్ని స్పృశించి, అనుభవాల్నీ, అనుభూతుల్నీ పట్టి తెచ్చి కథాచిత్రణ చేయడం - పెద్ద అసిధారావ్రతం. ఆనాటి చలం, బుచ్చిబాబు, గోపీచంద్, మల్లాది, పద్మరాజు వంటి ఘనులంతా, ఆ వ్రతాన్ని ఎంతో జయప్రదంగా నిర్వహించారు. ఆ తర్వాతి తరంలోనూ ఎంతో మంది కథనంలో తమదైన కొత్త వరవడిని సమకూర్చుకుంటూ అలాంటి కథల్ని సృష్టించారు. చదువరుల్ని మెప్పించారు. ఆ కథకుల్లో పె.సు.రా కూడా ఒకరు. ఆయన గొప్ప కథ దగ్ధగీతం.

అనవసరంగా చాలాకాలం బ్రతికాన్నేను అనుకున్నాడు సేతూరాం - అని కథ మొదలవుతుంది కథ.

ఆస్పత్రి భవనం ఆవరణలో వెనుక ఉన్న రెండు గదుల్లో కుడి వైపు గది ముందు కూర్చుని ఉన్నాడు. అతను ఇప్పుడు అకాల వార్ధక్యం పైబడినవాడిలా ఉన్నాడు. ఆ కుడి వైపు గదిలో అతని సంగీత సామ్రాజ్యం శిథిలమై, దగ్ధమై, బూడిదయిపోతున్నది. ఆమె పంకజవల్లి. అతని బాల్య స్నేహితురాలు. తెల్లని దుప్పటిలో శుష్కించిన శరీరంపైన ముంజేతులు, తలమాత్రం కనిపిస్తున్నాయి. ఒక చేతికి ఒక ఎర్ర రంగు గాజున్నది. గుండెల మీద ఉన్న రెండో చేతికి ఏమీలేదు. పైన సన్నని కంఠం...నల్లని కంఠం..దేశం అంతటా సంగీత మాధుర్యాన్ని పంచిన కంఠం..బండరాళ్ళ వంటి హృదయాలను జలజల కరిగించిన కంఠం.

ఆమె రవిని ప్రేమించింది. పెళ్ళి చేసుకుంది. సేతురామన్ మాత్రం చిన్నప్పటి నుంచీ ఎవరిని ప్రేమించాడో, ఎవరిని కోరుకున్నాడో ఆమె దక్కకుండా పోయినందుకు అతడేమీ బాధాపడలేదు.

రవికి డబ్బు చేసి పెట్టే ఆమె కంఠం కావాలి. అందవిహీనమైన ఆమె, ఆమె శరీరం, ఆ శరీరంలో మనసు ఇవేమీ అతనికి ఆక్కర్లేదు. అతనికి కావలసిన అందమైన శరీరం అతడు వేరే ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల ఒకసారి గొంతు మంటగా ఉంది నేను కచేరీ చేయలేను అంటే పెద్దగా మాట్లాడి కోపగించి భయపెట్టి తీసుకెళ్ళాడు. ఆమె తిరిగి వచ్చి బాధతో మెలికలు తిరిగిపోతుంటే సేతురామన్ గబగబా వెళ్ళాడు. ఆమె దగ్గి దగ్గి చివరకు చారెడు రక్తం కక్కింది. అతనికి అప్పుడు గుండెలు దడదడలాడాయి. ఇవ్వాళ ఆ చిన్ని గొంతులో క్యాన్సర్. ఆపరేషన్ చెయ్యొచ్చు. చేస్తే ప్రాణం దక్కుతుందన్నాడు డాక్టర్. ఆమాటే అన్నాడామెతో. ఆమె చివాలున తలెత్తి ప్రాణం దక్కుతుంది కానీ గొంతుపోతుంది. జీవితాంతం మూగగా...గొంతు లేకుండా బతకాలి. గొంతు ఉండదు. కూనిరాగం తీయడానిక్కూడా వీల్లేదు. మాట్లేందుకు వీల్లేదు. కానీ తినొచ్చు..తిరగొచ్చు..గొంతు పోయిన తర్వాత నేను బ్రతనక్కరలేదు. బ్రతకడం అనవసరం. గొంతు ఉండగా త్వరగా పోతేనే మంచిది..ఇదీ ఆమె నిర్ణయం

ఆమె ఒక్కసారి తెలివి వచ్చి కళ్ళు తెరిస్తే..తాను ఒక్క మాట చెప్పగలిగితే ..తన గుండె చప్పుడు వినిపించగలిగితే...ఎంత బాగుండును..వల్లీ..మై హార్ట్..! నేను మొదటినుంచీ నిన్ను ప్రేమిస్తున్నాను. అనుకున్నాడు సేతురామన్.

అమె చనిపోయింది
సేతురామన్ విధుల్లోకి వచ్చేశాడు.
స్ట్టేషన్ పక్క పేవ్ మెంట్ మీదకొంత మేర చేత్తో తుడిచి అక్కడే తువ్వాలు పరుచుకుని పడుకున్నాడు.
నీళ్ళూరుతున్న కళ్ళను మూసుకున్నాడు. అంతలోనే అతనికి నిద్రపట్టింది.
నిద్రలో..గుంపులు..గుంపులుగా..పచ్చ పచ్చగా కళకళలాడుతున్న గంథపుచెట్లు తగలబడి పోతున్నట్లు కల.
కథ ముగిసింది!
ఇలా, ఈ కథంతా మనిషిలో అలజడనీ, వ్యధనీ తెలుపుతుంది.
అంతకు వేయిరెట్లు గ్రావిటీతో, వీటిని పంకజవల్లికూడా అనుభవించిపోయింది,. రవి అనబడే స్వార్ధపరుడి కుటిలత్వానికి, స్వప్రయోజనపరుడి నిర్లక్ష్యానికి బలైపోయిందామె.

చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు, సాహిత్యకారులూ ఒక తప్పు చేస్తూ ఉంటారు. పాత విలువలతో కొత్త తరానికి సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుందని రాస్తూ ఉంటారు. నిజానికి తమకి అనుకూలమైన కొత్త విలువలకు అవసరమైన రూపు దిద్దుతుంది కొత్తతరం. ఈనాటి సమాజంలో రవి వంటి వారు ఏర్పాటు చేసుకుంటున్న ఏకైక విలువ డబ్బు. పంకజవల్లి గానకళా వైదుష్యాన్ని సొమ్ముచేసుకోవడమే అతని లోలోపలి పన్నాగం. ఆ దుష్టబుద్ధి - కథలో రవగా మనకొక పాలిష్డ్ విలన్ పాత్ర రూపంలో సాధరణీకరణం చెంది ప్రత్యక్షమయ్యింది.

మనిషి అస్తిత్వానికి సంబంధించిన విచికిత్స , ఆలోచన, సేతురామన్ కి వున్నాయి. అందుకే కథ ఎత్తుగడలోని వాక్యం అవసరంగా చాలాకాలం బతికాను నేను అని మొదలైంది. అవి.. ఎంత ఆర్ద్ర స్ఫోరకమైన వాక్యాలు. జంట పదాలుగా కవిత్వం పాదాలుగా సాగాయి! ఆ వాక్య సముదాయంలో ఎంత ఆర్ద్రత. గుండెని పిండివేసే భావస్ఫురణ. కథలో శిల్పం ఎలా వస్తుందంటె ఇలా వస్తుంది..

కథ ముగింపు చూడండి..సంగీతలక్ష్మి అయిన పంకజవల్లి వంటి గంధపుచెక్క రవి వంటి దౌర్భాగ్యుడి చేతిలో పడి వంట చెరకుగా వాడుకోబడింది. ఒక నిలువు జీవితం నీరై పోయిన విషాదాన్ని ఒక పోలికతో చదువరుల నాడికెక్కించాడు కథకుడు. ఇదీ రచనలో క్వాలిటీ అంటే!

దగ్ధగీతం ఇతివృత్తం ప్రభావం మనకు సినిమాల్లోను, ఒక గొప్ప కథకుని రచనలోనూ కనబడింది. ఇలా తన సమకాలీన రచయితల్ని ప్రభావితం చేయగలగటం కంటే ఒక రచయితకు గౌరవం, ఔన్నత్యం మరేముంటాయి. కథకుడు పె.సు.రా సంపాదించుకున్న గౌరవం అదే నిరాడంబరతతో నిలిచిన దీపధారి పె.సు.రా! ఆయన వెలిగించిన ముసురు, అంగారతల్పం, పూర్ణాహుతి, బ్రష్టయోగి వంటి అనేక చిన్న కథాదీపాలు తెలుగు సాహిత్యానికెప్పుడూ కొండంత వెలుగు.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech