కథా భారతి  
     

    కలియుగాంతం

 - రచన: మంథా భానుమతి.

 

ఉంగరాల జుట్టూ, కనుపాపలు గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యంగా చూసే పెద్ద పెద్ద కళ్ళూ, బూరెబుగ్గలూ.. ఎనిమిదేళ్ళ చిన్నాని చూస్తే ఎవరికైనా ఎత్తుకుని  ముద్దు పెట్టు కోవాలనిపిస్తుంది. అలివేణి, హరిల ఏకైక సంతానం వాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వమేమో.. తన వయసు అబ్బాయిల కంటే పొట్టిగా, ఐదారేళ్ళ పిల్లవాడిలా ఉంటాడు.

   కొంతమందికి తిన్నదంతా బుర్రలోకి వెళ్లి తెలివిగా మారుతుందంటారు.. అది చిన్నా విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజం. ఒక్క సారి చెప్తే చాలు, ఇట్టే గ్రహించేస్తాడు. సహజంగా ఆ వయసు పిల్లల కుండే జిజ్ఞాస వాడికి ఒక పాలు ఎక్కువే. సమాధానాలు చెప్పే వాళ్ళు ఉండాలే కానీ, తూటాల్లా ప్రశ్నలు వదులుతూ ఉంటాడు.

   ఏయ్ చిన్నా! ఏమిటా అల్లరి? కొత్త పరుపులు. స్ప్రింగులు ఎందుకన్నా పనికొస్తాయా.. దుప్పటి మీద చూడు మరకలు ఎలా పడ్డాయో! అప్పుడే వేసిన తెల్లని దుప్పటి మీద ఎగిరెగిరి దుంకుతున్న చిన్నాని కేకలేసింది అలివేణి.
స్ప్రింగులంటే ఏంటమ్మా? అవీ పరుపులో ఎలా పెడతారూ? మంచం దిగి అమ్మ ఒళ్ళో కూర్చుని అడిగాడు చిన్నా.

   నోట్లోంచి ఏదయినా మాట రావడం చాలు.. అంతులేని ప్రశ్నలు. మీ తాతగార్నడుగు. తీరిగ్గా చెప్తారు.తనకి తెలియదని చెప్పకుండా తప్పించుకుని  సంచీ తీసుకుని బజారుకి  బయలుదేరింది అలివేణి.
                                                  ..........................

   సోఫాలో తాతగారి పక్కన కూర్చుని బుద్ధిగా టి.వీ చూస్తున్న చిన్నా అమ్మ రాకని పట్టించు కోలేదు. కాయగూరల సంచీ తీసుకుని వంటింట్లోకి వెళ్తూ తెర కేసి చూసింది అలివేణి. ఎవరో పండితుడు, నుదుటి మీద విభూతి రేఖలూ, వాటి మధ్య కుంకం బొట్టూ ధరించి ఏదో వివరిస్తున్నాడు. సంతృప్తిగా లోపలికి నడిచింది. ఫరవాలేదు.. చిన్నాకి ప్రాచీన సంస్కృతీ, పురాణాలూ, సాంప్రదాయాల గురించీ తెలుస్తోంది.

   చిన్నా టి.వీ టైం సాయంత్రం ఆరు నుంచీ ఏడు. అదీ తాతగారి పర్యవేక్షణలో. అలివేణి మామగారు వేదాంత పరమైన, పురాణాలకి సంబంధించిన ఉపన్యాసాలూ, యాత్రల వివరాలూ చూస్తుంటారు. పిల్లలకి పనికొచ్చేవి చూస్తే బాగుంటుందని అనిపించినా, పెద్దాయన్ని నొప్పించ లేక  ఊరుకుంటుంది.

   వంటింట్లో గట్టు మీదున్న రేడియో  పెట్టుకుని, పాటలు వింటూ, కుక్కరులో బియ్యం కడిగి పెట్టి కత్తిపీట ముందేసుకుని, కూరల సంచీ తీసింది.
    హాల్లోంచి రణగొణ ధ్వనులు వస్తున్నాయి. పోను పోనూ గోల ఎక్కువైపోతోంది. అలివేణి వంట కూడా అయిపోయింది. రేడియో ఆర్పేసి హాల్లోకి నడిచింది. పండితుడి ప్రవచనాలు అయిపోయినట్లున్నాయి. ప్రకటనల హోరు, చెవులు బద్దలయ్యేలా.. మామగారికోసం అటూ ఇటూ చూసింది.

తాతగారేరి చిన్నా? టి.వీ కట్టేస్తూ అడిగింది. మాట్లాడకుండా వీధి  తలుపు చూపించాడు చిన్నా. టి.వీ శబ్దం ఆగిపోయినట్లు కూడా గమనించలేదు వాడు. ఇంత సేపు కుదురుగా కూర్చోడం.. అలివేణి ఆశ్చర్యంగా చూసింది.
ఏంటి నాన్నా అలా ఉన్నావు? ఆకలేస్తోందా.. అన్నం కలిపి తీసుకురానా.. డాబా మీద చందమామని చూస్తూ తింటావా? 

  చిన్నా జవాబు చెప్పలేదు. శూన్యంలోకి చూస్తున్నాడు. అంత చేటు సమస్య ఏమిటో ఇంత చిన్న బుర్రలో.. అలివేణికి నవ్వొచ్చింది. దగ్గరగా వెళ్లి  వాడి బుగ్గ మీద మృదువుగా ముద్దు పెట్టుకుంది. మామూలుగా, ఛీ! ఎంగిలి..అంటూ గట్టిగా చిట్టి చేత్తో తుడిచేసుకునే వాడికి ముద్దు పెట్టినట్లు కూడా తెలియలేదు. అదే దీర్ఘాలోచన. ఒళ్ళు వేడిగా ఉందేమోనని నుదుటి మీదా, మెడ కిందా చెయ్యి పెట్టి చూసింది. మామూలుగానే ఉంది.
ఏమైంది మామయ్యా? చిన్నా మాట్లాడట్లేదు. పావుగంట నుంచీ ఇక్కడే కూర్చున్నాడు. తలుపు తోసుకుని ఇంట్లోకి వస్తున్న  మామగారిని అడిగింది. అలివేణి అత్తగారు ఊర్లోనే ఉన్న కూతురింటికి వెళ్ళింది చూసోస్తానని.
ఇప్పటివరకూ బాగానే ఉన్నాడే.. ఏం లేదమ్మా.. నిద్దరోస్తోందేమో.. అలిసిపోయుంటాడు.
    అలివేణి తలూపి లోపలికి వెళ్ళిపోయింది, చిన్నాని కిందికి దింపి.
                                       ........................

అమ్మా! కలియుగం అంటే ఏమిటి? చందమామని చూస్తూ అడిగాడు చిన్నా.
   అలివేణీ వాళ్ళది ఐదో అంతస్తు. మెట్లు ఎక్కగానే పెద్ద డాబా. అక్కడ బెంచి మీద కూర్చుని గోరుముద్దలు తినడం చిన్నాకీ, కథలు చెప్తూ పెట్టడం అమ్మకీ చాలా ఇష్టం. 
   స్తబ్దుగా ఉన్న చిన్నాలో ఉత్సాహం వస్తుందని ఆ రాత్రి కూడా తీసుకొచ్చింది.
కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించారు.
కాలం అంటే?
రోజులూ, వారాలూ, నెలలూ.. తెలుసు కదా? చాలా చాలా ఏళ్ళు అవుతే ఒక యుగం అవుతుంది. మొదటి యుగం పేరు కృత యుగం. ప్రహ్లాదుడు ఉన్నది. రెండోది త్రేతా యుగం, రాముడి కాలం అన్నమాట. మూడోది ద్వాపర యుగం, నీలాగా అల్లరి చేసే కృష్ణుడు ఉన్న కాలం. నాలుగోది  కలియుగం.. అంటే ఇప్పుడు మనం ఉంటున్నది."
కలియుగం తర్వాత? చిన్నా ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియలేదు అలివేణికి. ఆలోచించింది.
మళ్ళీ మొదటిది కృతయుగం వస్తుంది. ఎప్పుడో ఎవరో చెప్పింది అనేసింది.
అంటే కలియుగం అంతం అయిపోయాకా?
అవునూ. కానీ ఇవన్నీ ఎందుకురా కన్నా నీకు? చక్కగా చదువుకుంటూ, హాయిగా ఆడుకుంటూ ఉండకుండా?
అంతం ఎలా అయిపోతుందీ? అందరూ మాయం అయిపోతారా? పెద్ద పెద్ద తుఫాన్లూ అవీ వస్తాయా? సముద్రాలు పొంగిపోతాయా? కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. వెన్నెల వెలుగులో మిలమిలా మెరిసాయవి.
ఇదెక్కడి గొడవరా బాబూ? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావురా? దా.. నీకు కుందేలూ, తాబేలూ కథ చెప్పనా? మీగడ కలిపిన పెరుగు  అన్నం ముద్ద నోట్లో పెట్టబోయింది. తలతిప్పేసి చందమామని చూసాడు చిన్నా.
అభిమన్యుడు అప్పుడు మనం చూసిన సినిమాలో చందమామలోకి వెళ్ళిపోయాడు కదామ్మా? 

  అలివేణికి ఏం చెప్పాలో తెలియలేదు. భారతం, భాగవతం కథలుగా చెప్తుంటుంది పడుకోబోయే ముందు. ఆ మధ్యన టి.వీలో కురుక్షేత్రం సినిమా వస్తే అందరూ చూసారు. సినిమా అంతా కదలకుండా చూసాడు చిన్నా.

  అవునూ. చంద్రలోకం నుంచి వచ్చాడు కనుక అక్కడికే వెళ్ళిపోయాడు. కష్టపడి ఒక ముద్ద నోట్లో పెట్టగలిగింది.
   కలియుగం అంతం అయిపోతే అందరూ ఎక్కడికి వెళ్లిపోతారూ? మరీ భూమి ఉండనే ఉండదా? మన అపార్ట్మెంట్ కూలిపోతుందా? సన్నగా గొణుగుతూ నిద్రలోకి జారుకున్నాడు చిన్నా.

   అలివేణికి భయం వేసింది. చిన్నాని నడిపించుకుంటూ, ఇంట్లోకి తీసుకొచ్చి వాడి మంచం మీద పడుక్కోబెట్టింది. మూడు పడగ్గదుల ఇల్లు అది. చిన్నా ఒక్కడే వాడి గదిలో పడుక్కుంటాడు. 
   అమ్మా! దీనంగా పిలిచాడు చిన్నా.

లైట్ ఆర్పద్దు. అంతం అయిపోతుంటే నీ దగ్గరకోచ్చేస్తా. అందరం కలిసి వెళ్లి పోదాం. కళ్ళు  తెరిచి అనేసి, మళ్ళీ నిద్రలోకి వెళ్లిపోయిన చిన్నాని చూస్తూ స్థాణువులా నిలబడి పోయింది అలివేణి.
                                              .....................

ఆ రోజు నుంచీ చిన్నాలో చాలా మార్పు వచ్చింది. వరుసగా మూడు రోజులు, సాయంత్రం పూట తాతగారితో టి.వీ లో సిద్ధాంతి గారితో ముఖాముఖీ చూసాడు. అది అలివేణికి వంట సమయం.. పట్టించుకోలేదు. అల్లరి బాగా తగ్గిపోయి, ఆలోచనలు పెరిగాయి.
 

మామయ్యా! టివీలో రోజూ మీతో ఏం చూస్తున్నాడూ చిన్నా? మామగారికి ఆరాత్రి అన్నం వడ్డించి అడిగింది అలివేణి. చిన్నా అప్పుడే పడుక్కున్నాడు.

ఏవుందమ్మా.. వీరబ్రహ్మేంద్ర స్వామి పాటలూ వాటి వివరణలూ.. సిద్ధాంతి ఎంత బాగా చెప్తున్నాడనుకున్నావు.. ఎందుకడుగుతున్నావూ?

ఎందుకో నాలుగు రోజులనుంచీ చిన్నా మామూలుగా లేడు. ఏమిటో అంతం, యుగాలూ అంటూ మాట్లాడుతున్నాడు. విచారంగా అంది అలివేణి.
అదా! ఎప్పుడో జరగబోయే యుగాంతం గురించి చెప్తున్నారు. వీర బ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయేవి ఊహించి ఎలా చెప్పారో, అవన్నీ ఎలా నిజమయ్యాయో  వివరిస్తున్నారు. అంతకంటే ఏమీ లేదు. పెద్దగా నవ్వేసి అన్నారు..ఇంకోటి విన్నావామ్మా? అమెరికాలో అయితే కొంతమంది రెండువేల పన్నెండుకి ప్రపంచం అంతమైపోతుందని అంటున్నారుట.. ఏవో మార్పులు సంభవిస్తాయిట. మన కంటే ఘనుల్లా ఉన్నారు వాళ్ళు.
ఎందుకైనా మంచిది చిన్నా ఉన్నాప్పుడు అటువంటివి చూడద్దు మామయ్యా.. నాకెందుకో భయం వేస్తోంది.
అలాగేనమ్మా . . అయినా ఆప్రోగ్రాములు అయిపోయాయిలే. రేపట్నుంచీ రుద్రాక్షల గురించి చెప్తానన్నారు సిద్దాంతిగారు.
అమ్మయ్యా.. అని నిట్టూరుస్తూ లేచి పెద్దాయన తినేసాక అంతా సర్దేసి, హాల్లో కూర్చుంది అలివేణి, పుస్తకం తిరగేస్తూ.. హరి కోసం ఎదురు చూస్తూ. 
                                                  ........................

ఆరోజు ఆదివారం. పొద్దున్నే తీరికగా అందరూ ఫలహారం చేసి హాల్లో చేరారు. అలివేణి కూరలూ, కత్తిపీట తెచ్చుకుని కింద కూర్చుంది, హరి అమ్మానాన్నలతో చెప్పే కబుర్లు వింటూ. చిన్నా ఒక మూల, తలుపు పక్కన గోడకి ఆనుకుని నిల్చుని, తల మీద అడ్డంగా గీత గీస్తున్నాడు. యుగాలు, వాటి అంతం గురించి ఆలోచించడం మానేసి, మామూలు ధోరణిలో పడ్డాడని సంతోషిస్తోంది అలివేణి.
చిన్నా! ఏం చేస్తున్నావు కన్నా?

పొడుగు చూసుకుంటున్నా. ప్రయోగం చేస్తున్న పరిశోధకుడిలా  కనుబొమ్మలు ముడిచి అన్నాడు.
వాడి ఏకాగ్రత చూస్తుంటే హరికి ప్రేమ పొంగుకొచ్చింది. చటుక్కున లేచి వెళ్లి, ఎత్తుకుని ఎగరేసి ముద్దు పెట్టుకున్నాడు.
ఉండు నాన్నా! నన్ను డిస్టర్బ్ చెయ్యకు. చూసుకోనీ.. కిందికి జారి గోడమీదున్న రెండు గీతాల్ని పరిశీలిస్తున్నాడు. హరి ఆశ్చర్యంగా చూసాడు, చిన్నా చేష్టల్ని.

కిందటి నెల ఎంత ఎత్తున్నానో ఇప్పుడూ అంతే ఉన్నా నాన్నా! అమ్మా.. తాతయ్యా! నేను మరుగుజ్జు అయిపోతున్నానా? చిన్నా గొంతు ఏడుపుతో పూడుకుపోయింది. పెద్ద పెద్ద కళ్ళల్లో నిండుగా నీళ్ళు.. ఏ క్షణంలోనైనా రాలి పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి.
 అదేంట్రా బాబూ! ఏమైంది కన్నా? అలా మాట్లాడుతున్నావేంటి? కత్తిపీట దగ్గర్నుంచి లేచి , పరుగెత్తుకుంటూ వచ్చి చిన్నాని పొదివి పట్టుకుంది అలివేణి.

 అమ్మా! బావురుమన్నాడు చిన్నా.ఎప్పట్నుంచో ఉగ్గబట్టిన ఏడుపు అంతా ఒక్క సారి బైట పడింది. అలివేణి అత్తమామలు నోట్లోనుంచి మాటలు రానట్లు నిలబడిపోయారు. 

మనం అంతా మరుగుజ్జులైపోతాంట కదా! కలియుగం అంతం అయిపోతుందిట. అప్పుడు టి.వీలో చూపించారు. పెద్ద పెద్ద మేడలన్నీ టపటపా కూలిపోతున్నాయి. సముద్రాలు పొంగిపోతున్నాయి. అందరూ పరుగులు పెడ్తూ కేకలేస్తున్నారు. మనం కూడా అంతేనా? నాకు భయం వేస్తోంది. చూడు మరీ.. అన్ని రోజులనుంచీ చూస్తున్నానా.. కొంచెం కూడా పొడుగు పెరగలే.. చేతులతో చూపిస్తూ మళ్ళీ భోరుమన్నాడు.

 ఏమీ అవదు నాన్నా.. టి.వీలో ఊరికే అలా చూపిస్తారు. అంతా కథ అన్నమాట. చిన్నాని వంటింట్లోకి తీసుకెళ్ళి, మొహం చల్లని నీటితో కడుగుతూ  అంది అలివేణి. హరి వెనుకే వెళ్ళాడు తెల్లబోయి చూస్తూ.

ఏం కాదు. సిద్దాంతి గారు  నిజమే చెప్తారు. తాతయ్య రోజూ చూస్తుంటారు. మన ఇల్లు కూలిపోతుంది. అందరం ఎక్కడి కైనా వెల్లిపోదాం. అబ్బెబ్బే..ఎక్కడికెళ్ళినా అంతం అయిపోతాం. చిన్నా వణికి పోతున్నాడు. ఒళ్ళు పెలిపోతోంది. ఉన్నట్లుండి జ్వరం వచ్చేసింది.
చిన్నాని భుజం మీద వేసుకుని, కాంప్లెక్స్ లోనే ఉన్న క్లినిక్ కి తీసుకెళ్ళాడు హరి. అలివేణి వెనుకే పరుగెత్తింది.
                               ....................................

అర్ధరాత్రి.. అంతా అంధకారం.. కిటికీ రెక్కలు భయంకరంగా కొట్టుకుంటున్నాయి. హోరున వాన. చిన్నా మంచం మీది నుంచి దిగాడు. తడబడుతున్న అడుగులతో వెతుక్కుంటూ వెళ్లి వీధి తలుపు తీశాడు  భయం..ఆందోళన నిండిన కళ్ళల్లో నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. అలాగే నెమ్మది గా డాబా మీద ఉన్న పిట్ట గోడ  దగ్గరికి వెళ్తున్నాడు. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. కలియుగాంతం.. ఆ మెరుపు వెలుగులో సిమెంటు బెంచీ ఎక్కి పిట్టగోడ మీద నుంచి వంగుని చూస్తూ నిల్చున్నాడు.
 చిన్నా! గట్టిగా అరుస్తూ లేచిన అలివేణి కింద పడిపోయింది.

 వేణీ.. వేణీ! మంచం మీదనుంచి కిందికి పడిపోయిన భార్యని లేపాడు హరి.
 అయోమయంగా చూసింది అలివేణి. ఒళ్ళంతా చెమటలు. ఒకటే దగ్గు.. గొంతు సవరించుకుంది.
 ఏమయింది వేణీ? పీడకలా? లే.. మంచినీళ్ళు తాగు. గ్లాసులో నీళ్ళు తెచ్చి అలివేణిని మంచం మీది నుంచి లేపి కూర్చోపెట్టాడు హరి.
 హరీ! చిన్నా.. నీళ్ళ గ్లాసు నెట్టేసి చిన్నా గదిలోకి పరుగెత్తింది అలివేణి.
చిన్నా మంచం మీద లేడు. హాల్లోకి వెళ్లి చూసారు. వీధి తలుపు తీసి ఉంది. అలివేణి, హరి డాబా మీదికి పరుగెత్తారు.
సరిగ్గా అప్పుడే చిన్నా చేతులు పైకెత్తి కిందికి దూకడానికి గోడ ఎక్కాడు. అలివేణి చిన్నా! అని అరుస్తూ నాలుగే అంగల్లో వెళ్లి చిన్నాని వెనక్కి లాగేసింది. ఇద్దరూ హరి మీద పడిపోయారు. ముగ్గురూ తడిసి ముద్దయిపోతూ అలా ఉండిపోయారు.
                                    ..............................
  ఆర్నెల్ల తరువాత..
ఆ రోజు ఆదివారం. హాలంతా గోలగోలగా ఉంది. తాతయ్యా, నాన్నమ్మా ఒక పార్టీ. అలివేణీ, చిన్నా ఒక పార్టీ. నలుగురూ కారంబోర్డ్ ఆడుతున్నారు. నాలుగు కాఫీ కప్పులూ, ఒక బోర్న్వీటా   గ్లాసూ ట్రేలో పెట్టుకుని వంటింట్లోనుంచి వచ్చాడు హరి. 
టి.వీ ఉన్న స్థానంలోకి పెద్ద మ్యూజిక్ సిస్టం వచ్చింది. పొద్దున్నే ఆలిండియా రేడియో వారి వందేమాతరం తో నిద్రలేస్తున్నారు అందరూ. అభిరుచి ఉన్న రేడియో ప్రోగ్రాములు వింటున్నారు. చక్కని సంగీతం ఉన్న సి.డీలు తెచ్చుకుంటున్నారు.
హరి తృప్తిగా నిట్టూర్చాడు. చిన్నా పిట్టగోడ మీది నుంచి దూకే ప్రయత్నం చేసిన మరునాడు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మంచి పని చేశాననుకున్నాడు , డా.గౌరి పేరు పొందిన చైల్డ్ సైకియాట్రిస్ట్. చిన్నాని నాలుగు సిట్టింగులతో, చిన్న చిన్న డోసు మందులతో మార్చేసింది. టి.వీ కొన్నిరోజులు అటక ఎక్కించి వెయ్యాలంది.. చిన్నా పెద్దవాడయ్యే వరకూ. 
మీరు చాలా అదృష్టవంతులు. అలివేణి గారి ఆదుర్దా, పిల్లవానిలోని మార్పులు గమనించడం సహాయం చేశాయి. అయినా ఒక్క క్షణం ఆలస్యం అయుంటే.. ఎందుకైనా మంచిది టెర్రస్ మీదికి వెళ్ళే తలుపు తాళం వేసి ఉంచండి. ఇలా దూకేసిన  పిల్లలు కూడా తెలుసు నాకు. కొన్ని రోజులు  మందులు వాడండి. తలుచుకుంటేనే హరికి కాళ్ళుచేతులు  వణికాయి.
ఉన్నట్లుండి చిన్నా అరిచాడు.
కలియుగం ఎప్పుడు అంతం అయిపోతుందో నాకు తెలిసిపోయింది.
అందరి మొహాలూ నెత్తురు లేనట్లు పాలిపోయాయి. హరి ట్రే కింద పెట్టి నిస్తేజంగా కూలబడ్డాడు.
అన్ని వేల ఇయర్స్ తర్వాత .. చేతులు బార్లా జాపి అని, ట్రే లోనుంచి బోర్న్విటా  గ్లాసు తీసుకున్నాడు చిన్నా.
                                           


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech