సారస్వతం  
     గగనతలము-29

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు

 
పాఠాంతరాలు – మతాంతరాలు

పంచాంగశ్రవణం – వార్షిక ప్రణాళికా? - రాశిఫలితాలా?

 

బ్రహ్మగారు నిద్ర లేచారు.

            అంటే కల్పము ప్రారంభమయింది. కల్పంలో 1000 మహాయుగాలు ఉంటాయి. ప్రతీ మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. అవి అందరికీ తెలిసినవే. కృతత్రేతాద్వాపరకలియుగములు వాని పేర్లు. ప్రస్తుతము మనము ఉన్న మహాయుగమలో 3 యుగములు గడచిపోయాయి. ప్రస్తుతము మనము ఉన్న కలియుగములో 5113 సంవత్సరాలు గడచిపోయాయి. కలియుగం మొత్తం ప్రమాణం 432000 సంవత్సరాలు. దీనిని బట్టి మనము కలియుగము ఇంకా ఎంతకాలముందో లెక్క వేసుకోవచ్చు.  

బ్రహ్మగారి వయసెంత

            బ్రహ్మగారికి పగలు ఒక కల్పము రాత్రి ఒక కల్పము. అంటే రెండు కల్పములు కలిపి బ్రహ్మగారికి ఒక రోజన్న మాట. అలాంటిరోజులు కలిసిన వంద సంవత్సరాలు ఆయన వయస్సు. ఆ వయసులో ప్రస్తుతము 50 సంవత్సరాలు గడచిపోయాయి. 51వ సంవత్సరము ప్రారంభములో ఉన్న కల్పములో మనము ఉన్నాము.

దీన్ని మనము గర్తెలా ఉంచుకోవాలి?

            మనకు తెలియకుండానే మనము దీనిన గుర్తించుకుంటాము. మనము ఏ పూజ చేసినా చేయించుకున్నా లేకపోతే అది సంధ్యావందనమైనా సరే మనము సంకల్పముతో ప్రారంభిస్తాము.  ఆ సంకల్పములో మనము ఈ అంశాలన్నీ ప్రతిరోజూ ప్రస్తావిస్తాము కానీ దానిని మనం గుర్తించే ప్రయత్నము సాధారణంగా చేయము.బ్రహ్మ గారి ద్వితీయ పరార్థములో వైవస్వత మనువు యొక్క అంతరములో కలియుగములో అష్టావింశతి మహాయుగములో కృతత్రేతాద్వాపరములు గడచి కలియుగములో ప్రథమపాదములో మనమున్న ఈ స్థానములో (జంబూ ద్వీపము, భారత వర్షము మొదలుగునవి) వ్యావహారిక చాంద్రమాన నందన నామసంవత్సరములో వసంతఋతువులో చైత్రమాసములో శుక్లపక్షములో పాడ్యమి తిథినాడు నేను ........పనిని చేయబోవుచున్నాను. అని చెప్పబడే సంకల్పములో మనము ఏదో ఒక విధముగ కాలచక్రంలో మనకు పరిమితమైన బ్రహ్మ మొదటిరోజు నుండి నేటివరకు సమయాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుంటాము.

వార్షకప్రణాళిక

            ఉగాది నాడు కొత్త సంవత్సరము ప్రారంభమైనది. ఆనాడు ముఖ్యముగ చేయవలసిన పని నింబకుసుమభక్షణము. దానిని జీవనస్రవంతిలో ఒక భాగముగ మనము ఉగాది పచ్చడి రూపంలో ఎప్పుడో చేసుకున్నాము. చేయవలసిన రెండవ పని సంవత్సరము మొత్తము మీద గ్రహసంచార కారణముగ ఏర్పడు వివిధ కాలవికారములు మరియు మార్పుల చర్చ. అంతేగాక ఈ సంవత్సరమంతా ఏ గ్రహముదగ్గర ప్రకృతిని నడిపించే ఏ శాఖ చేరిందో తెలుసుకోవడము. శాఖలు ముఖ్యముగ తొమ్మది. రాజు, మంత్రి, రసాధిపతి, మేఘాధిపతి, నీరసాధిపతి, సస్యాధిపతి, దుర్గాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి. ఇవి తొమ్మిది నాయకత్వములు. వీనిని గురించి తెలుసుకోవడము ముఖ్యము.

నవనాయకులగురించి తెలుసుకొనుట వలన ఫలితమేమి?

రాజ్యం స్యాదచలం నృపశ్రవణతో మన్త్రీశ్రవాత్కౌశలమ్

ధాన్యేశాత్కమలా స్థిరా చ సురసా వాణీ భవేన్మేఘపాత్

ధర్మే బుద్ధిరధిష్ఠితా రసపతేర్దీర్ఘాయుషత్వం భవేత్

సస్యేశాద్ విమలామతిః శుభకరీ వర్షావళీ శ్రూయతామ్

రాజు గూర్చి వింటే రాజ్యము స్థిరమవుతుంది. ఇదే విధముగ మంత్రి వలన నైపుణ్యము పెరుగుట, ధాన్యేశునివలన స్థిరమైన లక్ష్మి, మేఘాధిపతి వలన రసయుతమైన వాణి, మేఘపతి వలన ధర్మాధిగతమైన బుద్ధి, రసపతి వలన దీర్ఘాయువు, సస్యాధిపతి వలన నిర్మలమైన బుద్ధి కలుగును. 

పంచాంగములంటే తిథివారాదులని అందరికీ తెలిసినదే. వానిని ప్రతిరోజూ తెలుసుకొనడము వలన లక్ష్మి, ఆయువు, పాపనాశనము,రోగనివారణము, కార్యసిద్ధి కలుగుతుంది.

తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనమ్

నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగనివారణమ్

కరణాత్కార్యసిద్ధిస్తు పంచాంగఫలముత్తమమ్

ఇంకా ఏమి తెలుసుకోవాలి?

1.      మూఢం ఎప్పుడు?

2.      గ్రహముల రాశిపరివర్తన ఎప్పుడు?

3.      కర్తరి ఎప్పుడు?

4.      పుష్కరములు ఎప్పుడు మరియు ఏ నదికి?

5.      గ్రహణముల ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

6.      వర్శములు ఎలా కురుస్తాయి?

7.      ఏ పంటలు పండుతాయి?

8.      అధిమాసాదులు ఉన్నాయా?

9.      రాశుల ఆదాయవ్యయములు ఎంత?

10.  రాశుల రాజపూజ్యావమానములు?

11.  కందాయఫలములు?

12.  వర్షలగ్నము మరియు జగల్లగ్నము ద్వారా రాజ్యానికి, దేశానికి, ప్రపంచానికి ఎలా ఉంటుంది?

13.  సంక్రాతిపురుషుని లక్షణముల ద్వారా ఏమి ఫలములు ఏర్పడతాయి?

 

ఇలా ఎన్నో విషయాలు క్రమముగ తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ నిశితంగా పరిశీలిస్తే పంచాంగశ్రవణమనేది మనము వర్షారంభములో వేసుకునే వార్షిక ప్రణాళిక అని ఖచ్చితముగ తెలుస్తుంది. అదే సమయములో మనము వివిధ గ్రహముల ద్వారా మనకు కలిగే లాభనష్టములను కూడ బేరీజు వేసుకుంటాము. తద్వారా మనము రాబోవు ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను ఏర్పరచుకోవచ్చు.

మరి ప్రస్తుతము మనమేంచేస్తున్నాం?

            కేవలం మన రాశి ఎలా ఉంటుందన్న తాపత్రయమే ఎక్కువ కనబడుతుంది. ఏ చిత్రరంగవ్యక్తి ఎలా ఉంటాడు¿ ఏ రాజకీయనాయకుని భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిమీద మనకు పెరిగిన శ్రద్ధ దురదృష్టవశాత్తు అతివృష్టి అనావృష్టులు, కార్తులు, వర్షప్రమాణములు , వేసుకోవలసిన పంటలు, వృద్ధిచెందు వస్తువుల వివరములు తెలుసుకోవడములో ఉండట్లేదు.

దానివలన ఇబ్బంది ఏమిటి?

గ్రహప్రభావము మానవుని అధీనములో లేనిది. దానినుండి మనని మనము కాపాడుకోవడానికి ప్రయత్నము చేయగలము. ఆ గ్రహప్రభావకారణముగ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పారివారికములైన మార్పులను మనము గ్రహించి తదను వ్యవహరించుకోవడము ఉత్తమము. దీనిని దృష్టిలో ఉంచుకునే రాజులు ఆనాడు, ప్రభుత్వాలు నేడు పంచాంగశ్రవణకార్యక్రమమును ఏర్పాటుచేస్తున్నాయి. ఒక వేలా అలా జరగని పక్షములో అది జరిపించవలసిన బాధ్యత మనందరిదీ. లోకహితం ఏ కార్యక్రమములో ఉన్నదో దానిని పాటించడం మన అందరి ధర్మము.

            ప్రణాళికారహితమైన మన అలవాట్లు వెంటనే ఏమి ప్రభావమును చూపవు,. కానీ అవి చూపబోవు దీర్ఘకాలిక సమస్యలు మానవ మాతృల పరిధినుండి దూరంగా ఉంటాయన్నది గ్రహించాలి.

            ముఖ్యంగా నేడు ఈ అంశాలన్నీ లోతుగా పరిశోధన చేయవలసిన అవసరము ఉన్నవి. అనాదిగా మానవుడు విశ్వసిస్తూ వస్తున్న గ్రహ ప్రభావము వాని కిరణములద్వారానా లేక తరంగాదులవల్లనా అన్నది మనకు నేడు తెలియని పెద్ద సమస్య అవి మనని సామూహికంగా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్నది మరొక పెద్ద సమస్య. పోనీ ఇవన్నీ మూఢనమ్మకాలందామంటే చరిత్ర ఒప్పకోనంటోంది. విజ్ఞానము అవివేకమంటోంది.

            యంత్రాలలో తరంగప్రభావాన్ని మార్చడానికి, ఆపడానికి ఒప్పుకునే విజ్ఞానం చుట్టూ కనిపించని ప్రభావాలను అనుకూలముగా మార్చుకునే విధంగా శరీరాన్ని జీవనాన్ని మార్చుకోవడానికి ముని కావద్దని , ఒక ఋషి కావద్దని మనని ఏ విధంగా ఆదేశించగలదు.

1.      కల్లులేని ధృతరాష్టృనికి కురుక్షేత్రయుద్ధాన్ని తెరపై చూపిన సంజయుని విజ్ఞానమేమిటి?

2.      విల్లంబుల ప్రకంపనలతో వర్షాన్ని , అగ్నిని పుట్టించిన అర్జుని ధనుర్వేదము విజ్ఞానము కాలేదా?

3.      ఏనిమేషన్ లో ఫ్రేమ్ లను అతివేగంగా నడిపితే బొమ్మ కల్లకు కనిపించనట్లు దేవతలు మన చూపు గ్రహించలేని వేగంతో పయనిస్తారని నమ్మడం అవివేకమా?

4.      సర్వాంతర్యామని చెప్పే దేవుడు ప్రతి కణంలో ఉండి అవసరమైనప్పుడు రూపమును ధరించడమనేది విజ్ఞానము ఒప్పుకోలేని వాదనా? 

ఉపసంహారము

            1500 సంవత్సరముపూర్వము వరాహమిహిరుడు మేఘములను ఎలా పరిశీలించాలి¿ ఆ మేఘములో 195 దినములలో ఎలా మరియు ఎంత వాననిస్తాయి అన్న విషయాలు విశదంగా వివరించాడు. గ్రహాలు ఆకాశంలో ఏ విధంగా కనిపిస్తే రాజ్యానికి మరియు రాజుకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయన్నది వర్ణించాడు. ఎలా ఒకటి కాదు. మానవజీవితములోని ప్రతి విద్య మరియ విజ్ఞానము అతని గ్రంథములో వర్ణించబడినది. వానిని గ్రహించలేని మనము మానవ కళ్యాణానికి విఘాతము కలిగిస్తున్నామన్నది నిజం. ఇప్పటికిప్పుటు మనము చేయగలిగింది కూడ ఏమీ లేదు. మనము ఆ పరంపరను ఎప్పుడో విస్మరించాం. ప్రస్తుతము ఆధునిక విజ్ఞానపు సహాయముతో మనము ఇందులో ఉన్న వైజ్ఞానికతను బయటకు తీసుకు రాగలమన్నది సత్యము. దానికి అన్వేషణ మరియు పరిశోధన చాలా అవసరము. అటువంటి కార్యక్రమములో మనకు ఆసరానివ్వగల పాశ్చాత్య ప్రాచ్య విజ్ఞానసౌరభాలు నేటికీ మనను ఆహ్వానిస్తున్నాయి. మన వార్షికప్రణాళికలో ఈ కార్యక్రమము కూడ చిన్న భాగమైతే ప్రకృతిలోని ప్రతి అణువుతోబాటు మానవ చరిత్రలోని ప్రతీ పుట వసంతశోభను సంతరించుకుంటుంది.

సశేషము........

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech