శీర్షికలు  
     ఎందరో మహానుభావులు

 - రచన : తనికెళ్ళ భరణి

 

తిరుపతి విద్యల నారాయణస్వామి నాయుడు

                               

వెంకటగిరి సంస్థానానికి ఒక చరిత్ర ఉంది.
వెంకటగిరి సంస్థానాధీశులు వెలుగోటివారు. వీరు పద్మనాయక వంశజులు. వీళ్ళు మొదట్లో 15 శతాబ్దంలో విజయనగర చక్రవర్తుల సామంతుల్లో ముఖ్యులుగా ఉండేవారు.
విజయనగర పతనానంతరం - కొంతకాలం మహమ్మదీయులకు సామంతులై ఆ తర్వాత బ్రిటీష్ వారితొ కూడా స్నేహంగా ఉన్నారు.
కాకతి రుద్రగణపతి నియమించిన డెబ్బై ఏడు గోత్రాల వెలమ దొరల్లో వెలుగోటి వారిది రేచర్ల గోత్రం - వీళ్ళు మొదట నుంచీ వెంకటగిరిని రాజధాని చేసుకుని పాలించారు.

ఈ వంశంలో ఇరవయ్యో తరంవారైన యాచశూరుని నుంచీ వెంకటగిరి పాలకులకు యాచేంద్రులని వంశపారంపర్యంగా ఆ పేరు స్థిరమైనది.
ఇరవై మూడోతరం వారైన వెలుగోటి సర్వజ్ఞాయాచ భూపేంద్రుడు..కళాపోషకుడూ సారస్వత ప్రియుడూ..ఈయన కాళహస్తి జ్ఞానప్రస్తూనాంబిక మీద ఒక అష్టకం...ఒక చూర్ణిక రచించాడు.!

తర్వాత 27వ తరం వాడైన సర్వజ్ఞకుమారయాచేంద్రుడు..విద్వత్కవి..
ఇతడు..
గీతార్ధ సారసంగ్రహం
సభారంజని
నాస్తిక ధ్వాంతభాస్కరం
రత్న షట్కాంగుళీయకం
సర్వమత సారసంగ్రహం
మొదలైన కావ్యాలు రాసిన గొప్ప పండితుడు.. వీటిలో సభారంజని సంగీత సంబంధిత గ్రంథం.
అలాగే ఇరవై ఎనిమిదో తరానికి చెందిన ముద్దుకృష్ణయాచేంద్రుడు దక్షిణ భారతదేశంలోని సంగీత విద్వాంసులందర్నీ పిలిపించి, కాళహస్తిలో జరిగే శివరాత్రి ఉత్సవాలకి ఘనంగా సన్మానించేవారట.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటె..కాళిదాసు తయారు కావాలంటె ఓ భోజుడి అవసరం ఉంది. అష్టదిగ్గజాలు కావాలంటే ఓ కృష్ణదేవరాయల అవసరం ఉంది.!
రాజులు ఎల్లకాలం రాజ్యకాంక్ష..యుద్ధాలు...జయస్థంభాలు పాటించే కార్యక్రమంలో ఉంటే.. వారి తరంతోటే వారి కీర్తి అంతరించి పోతుంది. కాకుండా..ఇలా సంగీత..సాహిత్య సమర్చన చేసుకుంటే వారి వంశం తరిస్తుంది.

ఇలాటి వెలుగోటివారి సంస్థానంలోనివారే...సరస్వతి శేషశాస్త్రి.
సరస్వతి సూర్యనారాయణశాస్త్రి..
షట్కాల నరసయ్య..
తిరుపతి విద్యల నారాయణ స్వామినాయుడు..!

నారాయణస్వామి నాయుడు తల్లి కోమలమ్మ!
కోమలమ్మ...త్యాగరాజస్వామి శిష్యపరంపరలోని వాలాజీపేట శిష్యపరంపరంలోని ఒకరి ఆడపడుచు.
స్వతహాగా.. సంగీతం రావటం చేత చిన్నతనంలో కొన్నాళ్ళు సంగీతం నేర్పి, తర్వాత - కాళహస్తి వెంకటస్వామి నాయుడుగారి దగ్గరికి పంపింది తల్లి.
ఏం నేర్చుకుందామని వొచ్చావోయ్.. అన్నారు గురువుగారు.
‘హరికథండీ!’ అన్నాడు శిష్యుడు.
హరికథా! ఆశ్చర్యపొయారు గురువుగారు.
అవునండీ..సంగీత సాహిత్యాల సమాహారం కదా అని నసిగాడు శిష్యుడు.
అలాగే కానీ..అయితే అన్నీ ఒక్కసారైతే గుక్కతిప్పుకోలేవు గనుక.
ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకో..
చిత్తం స్వామీ అన్నాడు నారాయణస్వామి.
వీణ...మీటితే పలికేజాణ!
వెల్లకిలా.. పడుకున్న ప్రౌఢలాటి వీణని రెండు చేతుల్లోకి తీసుకునీ
ఎడం చేత్తో తీగల్ని సవరిస్తూ.. చూపుడు వేలితో మీటుతూ..
చక్కిలిగింతలు పెట్టబోయాడు!
అంత తేలికా ,తర్జని తెగింది!!
పగడం లాంటి నెత్తుటి బిందువు..
పసివాడు గదా.. నోట్లో పెట్టుకుని తగ్గక కసికొద్దీ మీటటం ప్రారంభించాడు!!
ఓ ఏడాదిలో వీణ లొంగింది!
హృదయానికి తీగలు అల్లితే..వాయులీనం.
ఓ యేడాది పాటు..వాయులీనం..
కొన్నాళ్ళు..పగలు వాయులీనం..రాత్రి వీణ
తర్వాత వీణ- వాయులీనం...మొత్తానికి రెండు వాయిద్యాలలో సవ్యసాచిత్వం వొచ్చాక అప్పుడు హరికథ! రెండేళ్ళ పాటు నిద్రాహారాలు లేకుండా సాధన చేశాడు.
చిరుగజ్జె కట్టి..చిడతలు పట్టి..
నడుముకి అంగవస్త్రం కట్టి... తిరునామం పెట్టి
ఆ చిన్ని వయసులో నారాయణస్వామినాయుడు
హరికథ ఆరంభిస్తే..
రామాయణం చెప్తే..తను బాలరాముడై పోయేవాడు.
భాగవతం చెప్తే.. తను కృష్ణుడైపోయేవాడు..
గిరిజాకళ్యాణం చెప్తే
ముందు అంబ అయిపోయేవాడు..
తర్వాత సాంబడైపోయేవాడు..
అంతలోనే మన్మధుడైపోయేవాడు..
ధనుస్సైపోయేవాడు!
పంచశరాలు..
అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అయిపోయి పరమేశుని తాకేవాడు!
వెంటనే శివుడి కన్నై పోయేవాడు!
అందులోంచి వొచ్చే అగ్ని అయిపోయేవాడు!!
ఆ దెబ్బకు బూడిదైపోయేవాడు!!
వెంటనే రతీదేవి కన్నీరైపోయేవాడు!!
ఆ తర్వాత పార్వతీ పరమేశుల కళ్యాణం అయిపోయేవాడు!!
ఇన్నివిద్యల్లో ఆరితేరిన వాణ్ణి ఎవడు మాత్రం విడిచిపెడతాడు!
అదిగో అదే చేశాడు.. సర్వజ్ఞయాచేంద్రుడు!
తన ఆస్థానంలో సంగీత విద్వాంసుని పదవి కట్టబెట్టాడు.
సరస్వతీ..లక్ష్మీ..కూడబలుక్కుని ..కూడు గట్టుకునీ..
నారాయణస్వామి నాయుడ్ని ఆశీర్వదిచారు.
అంచేత ఎక్కడ సభ జరిగినా సరస్వతీ సాక్షాత్కారం!
ఇంటికొచ్చేసరికి లక్ష్మీ ప్రసన్నం..
ఇంతకన్నా కళాకారుడికి ఏంకావాలండీ!
సంగీత గ్రంథాల్లో ఉన్న నవరత్న రాగమాలిక తీసుకుని ప్రసిద్ధమైన రాగాల పేర్లను ప్రతీచరణంలోనూ సందర్భానుసారంగా వొచ్చేలా శ్రీ రాజరాజ మహారాజ కుమార చిన్న వెంకటప్పనాయుని బహద్దర్ పై రాగమాలిక రాశాడు నారాయణస్వామి నాయుడు.
నవరత్న రాగమాలికలోని రాగాలు: దర్బారు, సావేరి, మలయ మారుతం, చంద్రకళ, అఠాణ, సురటి, సరసాంగి, భూపాళం, వరాళి..
దర్బారు- రూపకం
నీ దరబారు గాచినది నీరజాక్షి నేలుకోరా
మాబోటి నీ చతురత లేమరు విని విని
ఇప్పుడో దామర కుమార చిన్న వెంకటేంద్ర..
సావేరి..రూపకతాళం..
మన సావేరిక దలచక-
మా మనోహరిణీ
దాని సొబగు మరి అల
లిక యెప్పుడును నిజంబగు

మూడో చరణం - మలయమారుతం..
మలయమారుతము
వీవ - మరిమరీ ఓర్వక
సారెకు - మరుడు-
వడి విరిశరము గురియు
చిలుకలు కలకలమని పలికగ
మనసు బెదిరి సరసుడ

నాలుగవరాగం - చంద్రకళ
చంద్రకళలు దేరు మోముతో
పగడములకు సరిరా సరోజముఖ అధరము
మదగజయానర మనలి ఇక రతులన్
పెనగొనరతడయక చంద్రకళలు

ఐదోరాగం ఆఠాణ
అలివేణీ బోదనలే హఠాణరావేమి
యేల ఇటు అబలపై యనాదరణ జేసితె

ఇలాగే చివరి - భూపాళ, వరాళిరాగాలలో రాజుని భూపాలదేవేంద్రా అంటూ సంబోధిస్తాడు. భక్తదీన జనవరళీ ప్రియునిగా తిరుపతి వెంకటేశ్వరుణ్ణి ధ్యానిస్తూ - భక్తులుండే నీ దర్బారు అని ముగిస్తాడు..
‘మునుస్వామి నాగరి’ సంపాదకునిగా ప్రకటించిన ‘సంగీతసుధా సంగ్రహం’ అనే గ్రంథంలో అటు తమిళ దేశపు వాగ్గేయకారులు ఇటు తెలుగు వారివీ కృతులు ఉన్నయ్. అందులో కొన్ని నారాయణస్వామి నాయుడు గారి కృతులు మనకు లభిస్తాయ్.
తన రచనల్లో కూడా నారాయణస్వామి గారు.. తిరుమలేశ, తిరుపతిపుర, తిరుపతి అన్న ముద్రవాడారు.
అన్నమాచార్యులు వలె వాగ్గేయకారుడైన తిరుపతి విద్యల నారాయణస్వామి నాయుడు.. జీవితంతం ఆ వేంకటేశ్వరుణ్ణే స్మరించుకుంటూ ఆయనలోనే లీనమయ్యారు.
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech