శీర్షికలు  
     దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - 4

- ముత్తేవి రవీంద్రనాథ్,

 

దేవుడిని గురించీ, దైవ భక్తిని గురించీ మన విచారణను మరింత లోతుగా కొనసాగిద్దాం.అందులో భాగంగా మనం ప్రకృతి శక్తులపై దృష్టి సారిద్దాం .

 నా బాల్యం లో దేవుడి ఉనికిని నేను ప్రశ్నించిన ప్రతి సందర్భంలోనూ,  నా మిత్రులు కొందరనేవారు ," ఈ విశ్వం ముందూ, ఈ ప్రకృతి ముందూ ఆఫ్టరాల్ మనమెంత మన బిసాదెంత? ఈ ప్రకృతి యొక్క అనంతమైన శక్తిముందు త్రస రేణువుల  వంటి  మనం ఏపాటి ? మనకు తెలిసినదెంత ? తెలుసుకోవాల్సింది ఎంత? ఎందుకీ మిడిసిపాటు?" అని.

దేవుడి ఉనికిని ప్రశ్నించిన, దేవుడి ఉనికికి శాస్త్రీయ ఆధారాలను తెలుసుకోనగోరిన వారందరినీ గత కాలంలో కూడా  సంప్రదాయవాదులు ఇలాగే అని ఉంటారు.వారి దృష్టిలో ప్రశ్నించడం తప్పు.ముందు నమ్ము.ఆ తర్వాత అర్చించు; అనుసరించు-- అంతే వారికి కావాల్సిందల్లా.

వారితో నేనిలా వినయంగా ," అయ్యా! శాస్త్రీయ దృష్టితో ఆలోచించడం, దైవం ఉనికిని ప్రశ్నించడం, ఈ విషయమై సత్యాల్ని తెలుసుకొనగోరడం మీకు మిడిసిపాటులా కనిపిస్తున్నదా? మీకు(సంప్రదాయ వాదులకు) ఆలోచించకుండా గుడ్డిగా నమ్ముతూ మిమ్మల్ని అనుసరించే వారే కావాలి. ప్రశ్నించే హేతువాదుల పొడ మీకు గిట్టదు.ఎందుకంటే  ప్రశ్నించేవారి హేతు దృష్టి కేవలం  దైవం ఉనికిని ప్రశ్నించడంతో ఆగదు.సంప్రదాయవాదుల సామాజిక దుర్నీతినీ వారు రేపు ప్రశ్నించవచ్చు.దేవుడి పేరిట  ఇన్నాళ్ళూ వాళ్ళు చేస్తున్నస్వార్థపూరితమైన తప్పుడు  పనులన్నింటినీ రేపు వాళ్ళు ఇదే తరహాలో ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు.అదే జరిగితే ఇంకేమైనా ఉందా? కొంపలు మునిగిపోవూ? ఇన్నాళ్ళూ నిరాఘాటంగా సాగిన వారి సామాజిక, ఆర్ధిక పెత్తనానికి ముప్పు రాదూ? పెత్తందార్లకు  తమ పెత్తనం నిలుపుకోవడమే ముఖ్యం.అందుకే అనాదిగా వారు ప్రజలలోని  ప్రశ్నించే తత్వాన్ని తొక్కి పట్టారు.ప్రశ్నించే వారిని పాషండులనీ, అనాగరికులనీ ముద్రవేసి సమాజం లో వారి మాటకు విలువ లేకుండా చెయ్యడానికి ప్రయత్నించేవారు. ఓ సారి గత చరిత్ర తిరగెయ్యండి. మీకే తెలుస్తుంది. మీవరకు మీరు గుడ్డిగా అనుసరించే మూఢ భక్తులనే కోరుకుంటున్నా,మీ  శ్రీకృష్ణుడు మాత్రం  భగవద్గీతలో 'అపేక్ష లేనివాడూ,బాహ్య,అంతరంగ శౌచాన్ని పాటించేవాడూ,దక్షుడూ(సమర్థుడూ) అయిన భక్తుడే తనకు ప్రియుడన్నాడు.(అనపేక్ష: శుచిర్దక్ష- శ్లో.16 భక్తి యోగము-భగవద్గీత ). అంతే కాదు; అవ్యయపదాన్నిస్వర్గాన్ని అమూధుడు (మూధుడు కానివాడు) మాత్రమే చేర గలడని( గచ్చంతి అమూధా : పదమవ్యయం తత్ -శ్లో.5 పురుషోత్తమ ప్రాప్తి యోగము-భగవద్గీత ) కూడా విస్పష్టంగా చెప్పాడు." అనే వాడిని.  దాంతో వారు ఇక జవాబేమీ ఇవ్వలేక మిన్నకుండేవారు.
                                         

 నిజమే ; ప్రకృతి యొక్క అపార,అనంత,అమేయ శక్తిముందు మనం త్రస రేణువులం. ఐతే మాత్రం ఏం? న్యూనతా భావంతో క్రుంగి పోవాల్సిన పనిలేదు. ఒకప్పుడీ ప్రకృతిని చూసి ఆశ్చర్య పడి,భయపడిన మన ప్రాచీనులు క్రమంగా ప్రకృతి రహస్యాలను ఒక్కొక్కటిగా కనిపెడుతూ ప్రకృతి శక్తులపై క్రమంగా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు.ఏనుగు ఎంతో శక్తికలదే. అయితే ఏం? మానవుడు దాన్ని మచ్చిక చేసుకుని ఊడిగం చేయించడం లేదా? విద్యుత్తునూ,గాలినీ, ఉష్ణ శక్తినీ -- ఇలా ఒకటేమిటి? అన్ని ప్రకృతి శక్తులనూ మానవుడు తెలివిగా లోబరచుకుని సమాజ కల్యాణానికి వాడుకుంటున్నాడు.ప్రకృతి ముందు నేనెంత అని భయపడి,బిడియపడి కూర్చుంటే ఇవన్నీ మానవుడు సాధించ గలిగేవాడా?' ఏమిటి?', 'ఎందుకు?' అని ప్రశ్నించే తత్వమే మానవుడి అభివృద్ధికి మూలం.ఆ హేతు దృష్టి కారణంగానే మానవుడు పలు ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.కనుక మానవుడి శక్తి యుక్తులను, అతడి విజయాలనూ  న్యూనతపరచి ఎవరు మాట్లాడినా అది బాధ్యతా రాహిత్యమే అవుతుంది.కోతకోసే ముందు చేనును చూసి ఈ పంటంతా నేనేప్పటికి కోసేట్లు? అని కుంగి పోయి కూలబడతాడా రైతు?- ఒక పక్కనుంచీ మొదలుపెట్టి ఏకబిగిన కోసుకుంటూ పోతాడుగానీ!ఎంత సాధించినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంటుందని తెలిసినప్పటికీ   ముందే బెంగపడి అసలేమీ చేయకుండా నిష్క్రియా పరత్వంతో   ఊరికే కూర్చోవడం లేదు కదా!తాను కనుగొన్న ప్రకృతి రహస్యాలను పలు శాస్త్రాలుగా అభివృద్దిచేసి అందరికీ అందిస్తున్నాడు మానవుడు.దీంతో సమాజమంతటికీ విజ్ఞాన ఫలాలు అందుబాటు లోకి వచ్చి సామాజిక ప్రగతి ఊపందుకుంది.ఇలా విజ్ఞాన ఫలాలు, అభివృద్ధి ఫలితాలు సమాజంలో అందరికీ చేరుతుండడం  సనాతనవాదులకు ఇష్టముండదు.సమాజంలో వారు ఎప్పుడూ తాము అగ్ర భాగాన కొనసాగే  యథాతథ స్థితి (Status quo ante)నే కోరుకుంటారు.అందుకే వారు ఎప్పుడూ మానవుడి శక్తియుక్తులను ప్రకృతి శక్తులతో పోల్చి  కింంచపరచి మాట్లాడుతూ ఉంటారు.మానవుడి విజయాలన్నింటికీ అతడి హేతుదృష్టి, తన సామర్థ్యంపట్ల  తనకుగల నమ్మకమే మూల కారణం.మానవుడిలో హేతుదృష్టి పెంపొందడం ఇష్టంలేకనే సనాతనవాదులు మానవుడి విజయాలను ఎప్పుడూ కించపరచి మాట్లాడుతూనే ఉంటారు.కోడలితో అన్ని సేవలూ పొందుతూ కూడా ఆరళ్లు పెట్టే అత్తలా--అన్ని అభివృద్ధి ఫలాలనూ అనుభవిస్తూ కూడా 'ఇది చెయ్యండి చూద్దాం?', 'అది చెయ్యడం మీ  సైన్సు వల్ల ఏమౌతుంది?'అంటూ సతాయిస్తూనే ఉంటారు. ప్రపంచంలోకెల్లా మొదటి వ్యోమగామి సోవియట్ యూనియన్ కి చెందిన యూరీ గగారిన్ భూమండలాన్ని రాకెట్లో చుట్టివచ్చినప్పుడు, 'ఈ శాస్త్రజ్ఞులకు చేతనైతే చంద్ర మండలం మీదికి రాకెట్ పంపమనండి చూద్దాం',అని నసుగుతూ  సవాళ్లు విసరడం  నా చిన్నతనంలో  నేనెరుగుదును.వాళ్ళ నోళ్ళు అమెరికన్ వ్యోమగాములు నీల్ ఆమ్ స్ట్రాంగ్,ఎడ్విన్ ఆల్డ్రిన్ లు చంద్ర మండలం పై కాలుమోపగానే మూతపడ్డాయి.వైద్య రంగం లో మానవుడు అపార విజయాలను సాధిస్తున్నాడు.గుండె మార్పిడి, కాలేయం,మూత్రపిండాల మార్పిడితోసహా మానవ శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ మార్చగలిగే స్థితికి చేరుకున్నాడు మానవుడు.అయినా కొందరు ఆధ్యాత్మికవాదులు ఈ అభివృద్ధిని బేఖాతరు చేస్తూ'చేతనైతే చనిపోయిన మనిషిని బతికించండి.అది మీ వల్ల కాదు.ఆపని భగవంతుడు ఒక్కడి వల్లే అవుతుంది', అంటారు. ప్రార్థనల ద్వారా,ఉపదేశాల ద్వారా రోగులకు స్వస్థత (Faith Healing) చేస్తున్నామని  బడాయిలు పోతూ, దైవ ప్రతినిదులమని చెప్పుకునే   మత పెద్దలు తమకు ఏ కాస్త  చిన్న అస్వస్తత వచ్చినా ఆధునిక వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం   మనకి   తెలియనిది   కాదు. మొన్నటికి మొన్న 'భగవాన్' సత్య సాయి బాబా తనువు చాలించే వరకు  అన్ని రకాల ఆధునిక వైద్యసేవలు పొందాడే గానీ, తనపై భగవంతుడేవడో వచ్చి తనకు ఆరోగ్యం బాగు పరుస్తాడని ప్రార్థిస్తూ  ఎదురు చూడలేదు కదా!ఇంకో భాగవతుడికి రేపు ఏదన్నా అనారోగ్యం కలిగినా భగవదర్చన చేస్తూ కూర్చోడు.వైద్యుడిని-తనకు బాగుచేసి ప్రాణాలు కాపాడగలిగినంతటి  నిపుణ వైద్యుడిని- సంప్రదిస్తాడు.డబ్బులున్న వాళ్లకు ఖరీదైన వైద్యం అందుబాటు లోనే ఉంటుందికదా? ఇక దరిద్ర నారాయణుడిని  కాపాడే సంగతి నారాయణుడే చూసుకుంటాడా?  అదే నిజమైతే లక్షల సంఖ్యలో ఏటా పేద ప్రజలే పౌష్టికాహార లోపంతో,వివిధ వ్యాధులతో ఎందుకు మరణిస్తున్నారు?  నారాయణుడు వారిని తన మహిమతో బ్రతికించ లేక పోయాడా? వారందరిదీ అల్పాయుర్దాయమా?లేక వారందరూ పుణ్యాత్ములూ,భగవంతుడికి ఇష్టులూ కాబట్టి భగవంతుడు వారిని తన దగ్గరకు తొందరగా తీసుకెళ్ళి పోయాడా?ఆలోచించండి.మానవుడు హేతు దృష్టితో ప్రకృతిని అధ్యయనం చేసి అభివృద్ధి చేసిన శాస్త్ర జ్ఞానాన్ని అనుసరించే  ప్రపంచం లో ఎక్కడైనా రోగులకు వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు.భగవంతుడు  ప్రాణాలు పోసి బతికిస్తున్నది ఎవరిని  మరి?    సర్వతోముఖ సామాజికాభివృద్ధి  ఇష్టంలేని  వారు కనుకనే సనాతన వాదులు ప్రకృతిపై మానవుడు సాదిస్తూన్న విజయాలను చూడ నిరాకరిస్తూ,శాస్త్ర అభివృద్ధి  ఫలితాలను అనుభవిస్తూ కూడా  ఒక రకంగా అభివృద్ధికి అడ్డుగోడలుగా తయారయ్యారు.ఇదీ సంగతి.
                 ఇక మరికొందరు ఆధ్యాత్మికవాదులు ప్రకృతిలో ప్రతిదాన్నీ ఆరాధించినా తప్పులేదంటారు.ప్రపంచం లో ఒకప్పుడు అన్నిటినీ పూజించే (Pan-Theism)అలవాటు  ఉండేది.ప్రకృతి మన ఉనికికి అవసరమైన సకల వస్తుసంచయాన్నీ అందిస్తున్నది కనుక ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావం తో ఉండడం లో తప్పేమీ లేదు.ప్రకృతిని ప్రేమించడం , పరిరక్షించుకొనడం ఎంతో ముదావహం.అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రకృతి శక్తుల్ని ఆరాధించడంలో ఎంత మేరకు శాస్త్రీయత ఉన్నదో పరిశీలిద్దాం.
                ఆరాధన గురించి ఇక్కడ రెండు ముక్కలు చెప్పుకోవాలి.కొందరు  ప్రజలు తమ నేతల విగ్రహాలో,వారి బొమ్మలో పెట్టుకుని వారి పట్ల తమకు గల గౌరవాన్నీ ప్రేమనూ చాటుతూ,వారి ఆదర్శాలను పాటించాలని తామూ ప్రయత్నించడంలో అశాస్త్రీయత ఏమీ లేదు.మన  తల్లిదండ్రులూ,గౌరవనీయులైన పెద్దల ఫోటోలను ఇంట్లో పెట్టుకుని వాటికి దండలు వేయడం వేరు.ఇలాంటివారికి ఏవో అతీత శక్తులున్నాయని మనం వారి బొమ్మల్ని పెట్టుకోలేదు.వారి ఆదర్శాలు మనకు నచ్చి , వారు జీవించి ఉండగా వారు పాటించిన మానవీయ విలువలకు గుర్తింపుగా  మాత్రమే లేక వారితో మనకున్న అనుబంధానికి గుర్తుగా మాత్రమే  వారి ఫోటోలకు దండలు వేసి గౌరవిస్తాం.మనం కూడా ఆ ఆదర్శాలను పాటించడానికి  చేతనైన మేరకు  ప్రయత్నిస్తాం.కాని దేవుళ్ళని మనం భావిస్తున్నవారికి ఎన్నో అతీత శక్తులు ఆపాదించబడ్డాయి.అతిమానుష శక్తులు కలవారిగా  నేటికీ పలువురు   వారిని భావిస్తున్నారు .ఈ ఆరాధన కారణం గా తమకేదో ప్రయోజనం కలుగుతుందనికూడా  వారు  ఆశిస్తున్నారు .ఇది మాత్రమే అశాస్త్రీయం. గాందీజీకో, భగత్ సింగ్ కో,అల్లూరి సీతారామరాజుకో విగ్రహాలు పెట్టి, పటాలు పెట్టి దండలు వేస్తున్న వాళ్ళెవరూ ఆ నేతలకు మానవాతీత శక్తులున్నాయని నమ్మడం లేదు.అలాగే వారి ఫోటోలకు దండలు వేయడం ద్వారా తమకేదో ముక్తో, స్వర్గ ప్రాప్తో లభిస్తుందని వారలా చేయడం లేదు.అది కేవలం వారి ఆదర్శాలపట్ల తమకున్న గౌరవ భావాన్ని వ్యక్తపరచడం మాత్రమే.ఇలా  ఎవరైనా  ఒక్క భాగవతుడైనా  తండ్రి మాట ఔదల దాల్చడం,తమ్ముళ్ళపై అనురాగం కలిగి ఉండడం వంటి మానవీయ విలువలు కలిగిన పురుషోత్తముడని  భావించి రాముడి పటమో,విగ్రహమో పెట్టి దండలు వేస్తున్నాడా? శాస్త్రీయంగా రుజువు పరచలేని అతీంద్రియ శక్తులు రాముడికి ఉన్నట్లు భావించడం, అతడిని ఆరాధించడం ద్వారా తనకూ,తనవారికీ మేలేదో జరుగుతుందని నమ్మడం కారణంగానే రామ పూజలు, రామనామ జపాలూ చేయడం వాస్తవం కాదా? దాన్నే నేను అశాస్త్రీయమంటాను.రాముడి పాదధూళి తగిలి రాయి అహల్య అయింది అంటేనూ,రామ నామం రాసిన రాళ్ళు సేతువు నిర్మాణం చేసేటప్పుడు నీటిపై తేలాయి అంటేనూ - నాకే కాదు ఎవరికైనా శాస్త్ర విరుద్ధమనిపించడం లేదా? ఆలోచించండి.రేపు ఒక  గాంధీ భక్తుడు గాందీకీ అతీంద్రియ శక్తులు ఉండేవనీ, బ్రిటిష్ వాళ్ళ ఆయుధాలు ఆయనముందు కొరగాకుండా పోయాయనీ, అందుకే బ్రిటిష్ వాళ్ళు ఆయన్నేమీ చేయలేక విసుగుచెంది,  భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేసి పారిపోయారని కథలు సృష్టిస్తే వాటినీ అశాస్త్రీయమంటాను నేను.మరొక గాంధీ భక్తుడు గాంధీ సహస్ర నామాలు సృష్టించి, మనో వాంచా ఫల  సిద్ధి( మన మనసులో కోరుకుంటున్న కోర్కెలు నెరవేరడం) కోసం రోజూ మూడుసార్లు గాంధీ సహస్ర నామాలూ జపిస్తే చాలని బోధిస్తూ ఉంటే  దాన్ని అశాస్త్రీయమని అనకుండా ఉండగలనా?దేన్ని శాస్త్రీయంగా రుజువు పరచలేమో అదంతా అశాస్త్రీయమే.ఇందులో రాజీ ఏమీ లేదు.

ఇక ప్రకృతి శక్తులను ఆరాధించడం ఏమేరకు శాస్త్రీయమో చూద్దాం.ఇందాక చెప్పుకున్నట్లే మనకు కావలసిన సమస్తం సమకూరుస్తున్న ప్రకృతిని ఎవరైనా ప్రేమించే తీరాలి.ప్రకృతిని పరిరక్షించుకోక పోతే మనకి మనుగడే లేదని గ్రహించాలి.ఉపయోగితా విలువలున్న వృక్ష జాతులు నశించిపోకుండా కాపాడుకొనడం,మానవ జాతికి ఎంతో మేలు చేసే అటవీ సంపదను పరిరక్షించుకొనడం,మొక్కలు విరివిగా పెంచుతూ,జల,వాయు కాలుష్యాల నియంత్రణకు కృషిచేయడం,జీవ వైవిధ్యం లో అంతర్భాగాలైన వివిధ వృక్ష,జంతు, పక్షి జాతులను కాపాడుకొనడం ద్వారా పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షించుకొనడం లో మన వంతు పాత్ర పోషించడం , మన ముందు తరాలవారికి ఈ ప్రకృతిని  యథాతథ వారసత్వ సంపదగా అందజేయడం -- ఇవన్నీ ప్రతి ఒక్కరి కర్తవ్యాలని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.ప్రకృతికి మహిమలేవో ఉన్నాయనీ, అది పాపులను శిక్షిస్తుందనీ, పుణ్యాత్ములను రక్షిస్తుందనీ,అది మనల్ని అనుక్షణం  గమనిస్తూ మనం చేసే  మంచి చెడులను కనిపెడుతుందనీ ఎవరైనా నమ్ముతుంటే అది అశాస్త్రీయమంటాను నేను.తమ ప్రయోజనాలు ఆశించి ఎవరైనా ప్రకృతి శక్తులకు పూజలూ పునస్కారాలూ చేస్తుంటే అవి నిరర్ధకం అంటాను నేను.మన రాజ్యాంగం మనకు ఆరాధనా స్వేచ్చను కల్పించింది కనుక 'ఎవరి ఇష్టం వారిది' అని వదిలేసి ఊరుకున్నా,  ఇలాంటి పూజలూ,బలులూ నిష్ప్రయోజకమని  వారికి సలహా ఇవ్వకుండా మాత్రం ఉండలేను.
                      ప్రకృతి శక్తులకు విచక్షణాయుతమైన చైతన్యం ఉందా? అనేది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.ప్రాచీనులు ప్రకృతి శక్తుల్ని చూసి అబ్బురపడ్డారు.భయపడ్డారు కూడా.ఆకలేసిన  ఒక పులి తనకు దొరికిన ఒక మనిషిని చంపి తింటుంది.తనకు అపకారం తలపెడతాడని భయపడి ఒక పాము మనిషిని కరుస్తుంది.తాను చంపుతున్నది ఒక పాపినా,పుణ్యా త్ముడినా  అనే చైతన్యం పులికిగానీ, పాముకిగానీ ఉండదు.అలా మరణించే వారిలో చెడ్దవారూ,మంచివారూ కూడా ఉంటారు.అయితే ఈ సందర్భాలలో ప్రకృతి శక్తులు చెడ్డవారిని శిక్షిస్తున్నాయని నమ్మారు మన ప్రాచీనులు.కానీ ఈ ఆలోచన తప్పు.నలభై ఐదు  ఏళ్ళ క్రిందట  పల్నాడులోని గురజాలలోని ఒక పాత   మిద్దె ఇంట్లో మూడు నెలల పసికందు ఉయ్యాలలోకి పైనుంచి పడిన ఒక తాచుపాము కసిగా ఇరవై సార్లకు పైగా కాట్లు వేసి ఆ పసికందును చంపడం నాకు తెలుసు. మరి ఆ పసికందు ఏమైనా పాపం చేసిందా? ఉయ్యాలలోకి పడిన పాముకు మొదట  ఏదో ఒత్తిడి తగిలి అది ఆ శిశువును కాటేసి ఉంటుంది.ఆ తరువాత ఇక ఏడుస్తూ బాధతో కొట్టుకుంటున్న శిశువును మరిన్ని సార్లు అది కాటేసి ఉంటుంది.  ప్రతి మనిషీ జీవితంలో ఏవో తప్పులు చేయకుండా ఉండడు.ఆ తప్పులకు ప్రతిఫలం గానే ప్రకృతి శక్తులు తమను శిక్షించాయని భావించేవారు ప్రాచీన మానవులు  ఇలాంటి సందర్భాలలో.ఆ ప్రకృతి శక్తులకు తాము చేసే పాపాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగే అతీంద్రియ శక్తులున్నాయని కూడా వారు నమ్మడం మొదలెట్టారు. లేక కర్మఫల దాత అయినట్టి భగవంతుడు తన ప్రతినిధులైన ప్రకృతి శక్తుల చేత దుష్ట సంహారం చేయిస్తున్నాడని నమ్మడం మొదలెట్టారు.దాంతో తాము సురక్షితంగా ఉండాలంటే ప్రకృతి శక్తుల్ని ఆరాధించాలని వారు భావించారు. అలా ప్రకృతి శక్తుల ఆరాధనగానీ,భగవంతుడి ఆరాధనగానీ  భయంతోనే  మొదలైంది.అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు,వరదలూ,జలప్రలయాలూ సంభవించినప్పుడు, భూకంపాలలోనూ, పిడుగులు పడ్డప్పుడూ జరిగే జన నష్టానికంతటికీ తమపై ప్రకృతి శక్తులకున్న కోపమే  కారణమని వారు భయపడేవారు.ప్రాచీన మతగ్రంథాలు అన్నింటిలో ఇటువంటి ప్రస్తావనలు కోకొల్లలుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు.నాగారాధన ఇలా మొదలైనదే.పాములన్నిటికీ  తమకు హాని తలపెట్టిన మనుషులను గుర్తించి,పగబట్టే స్వభావం ఉంటుందనీ,ప్రతి పాము పుట్టకూ అడుగునుంచి  -ప్రత్యేకించి దండకారణ్యంలోని, నైమిశారణ్యం లోని పుట్టల అడుగు భాగాన్నుంచి, నదుల అడుగు భాగాలనుంచీ,పద్నాలుగు లోకాలలోనూ అట్టడుగుదయినట్టి పాతాళలోకానికి దారులున్నాయనీ, పాతాళం లేక నాగలోకం సర్పాలకు నెలవనీ వారు అశాస్త్రీయమైన అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు.కౌరవులు భీముడికి విషాహారం తినిపించి నదిలో పారేస్తే ఆ నది అడుగు భాగాన్నుంచి ఉన్న మార్గాలద్వారా పాతాళం చేరుకున్న భీముడిని నాగరాజు కాపాడి విష దోషాన్ని పోగొట్టి తిరిగి భూమి పైకి సురక్షితంగా చేర్చాడని మహాభారతంలో ఉంది.పాములు పగబట్టడం అనేది ఎట్టి ఆధారాలూ లేని అంధ విశ్వాసమని  శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో నిరూపితమైంది.భూగోళానికి అట్టడుగున--అంటే భూకేంద్రం లో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకు పాములేకాదు అసలు  జీవులేవీ బతకడం సాధ్యం కాదనీ,రాళ్ళూ రప్పలూ కూడా ఆ వేడికి  మండే వాయువుల రూపం లోనే ఉంటాయనీ శాస్త్రజ్ఞులు తేల్చారు. మనుషులకూ, పశువులకూ సూక్ష్మ క్రిముల కారణంగా సంక్రమించే తడపర,ఆటలమ్మ,ప్లేగు,మశూచికము,కలరా వగైరా ప్రాణాంతక వ్యాధులు, భూభారం తగ్గించడానికి భూదేవి చెల్లెళ్ళుమానవజాతిపై క్రోధం పూనిన కారణం గానే వస్తున్నాయని  నమ్ముతూ, ఆదిమ మానవులు   ఆ వ్యాదులన్నింటికీ అమ్మవార్ల పేర్లే పెట్టి ,ఆ అమ్మవార్ల శాంతి కోసం జంతు బలులు సమర్పించేవారు.  ఈ వ్యాధులు పాపిష్టి వాళ్ళను సంహరిస్తాయని వాళ్ళు నమ్మేవారు. ఈనాడు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఆ అంటు వ్యాధుల నివారణకు వాక్సిన్ లు కనుగొనడం జరిగింది.టీకాలు వేయించుకున్న ఎంతటి పాపిష్టివాడినైనా ఈ అమ్మవార్లు ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఎట్టి వైద్య సదుపాయాలూ లేని మారుమూల గ్రామాలలోని పుణ్యాత్ములు సైతం వ్యాధి నిరోధక టీకాలు వేయించు కొనకపోతే ఈ వ్యాధుల పాలవుతున్నారు.శాస్త్ర విజ్ఞాన పురోగతి ఆదిమ మానవుల అంధ విశ్వాసాలను ఎలా పటాపంచలు చేసిందో తెలిపే చక్కటి ఉదాహరణ ఇది.కాబట్టి   ఆదిమ మానవులు ప్రకృతి శక్తులపట్ల భయంతో ఏర్పరుచుకున్న అందవిశ్వాసాలివన్నీ.వీటికి ఎటువంటి శాస్త్రీయ పునాదీ లేదు.

           కేవలం భయంతోనే కాదు--తనకు మేలు జరిగిందనే కృతజ్ఞాతతోనూ, ఏవైనా భవిష్యత్  ప్రయోజనాలను ఆశించీ కూడా ఆదిమ మానవుడు ప్రకృతి శక్తులను పూజించడం మొదలెట్టాడు.  అదనులో వానలు కురిసి పదునుగా పంటలు పండాలని వానదేవుడికి పూజలు చేయడం మొదలెట్టాడు.'యజ్ఞాద్భవతి పర్జన్య' (అన్నాద్భవన్తి భూతాని-శ్లో.14  కర్మయోగము-భగవద్గీత)అనే గీతా వాక్యాన్ని బట్టి ప్రాచీనులు వానలు కురవాలని కోరుకుంటూ  యజ్ఞాలు చేసేవారని గ్రహించగలం.ఆధునిక యువకులు ప్రతి సందర్భానికీ ఏదో ఒక వంకతో  పార్టీ చేసుకోడానికి అలవాటు పడినట్లు ప్రతిదానికీ యజ్ఞం చెయ్యడం ,ప్రపంచం లో ప్రతిదీ యజ్ఞం ద్వారానే సమకూరుతుందని నమ్మడం నాటి రివాజు.యజ్ఞ యాగాదులు విపరీతంగా చేసిన ప్రాంతంలో ప్రయాగ పేరిట ఓ మహానగరం వెలిసింది అంటేనూ,యజ్ఞాలలో చేసిన విపరీతమైన  జంతు బలులలో  కట్టిన నెత్తుటి ధారలు గంగా నదికి ఉపనది అయిన చర్మన్వతి (నేటి చంబల్)ని పూర్తిగా రక్తం,కళేబరాలతో నింపి వేశాయి అంటేనూ నాడు యజ్ఞాలు ఎంత విస్తారంగా జరిగేవో గ్రహించవచ్చు.పిల్లలు కలగాలని పుత్రకామేష్టి,పుంసవనం,వానలు కురవాలని వరుణ యాగం,వర్ష పశుబంధ యాగాలు,గృహస్తులు చేసే వైశ్వదేవం,రాజులు చేసే రాజ సూయం, అశ్వమేధం,నెలల తరబడి,ఏళ్ళ తరబడి (పన్నెండేళ్ళపాటు కూడా)సాగే దీర్ఘ సత్త్ర యాగాలు మన భారత భూమినంతా ఓ యజ్ఞ స్థలిగా మార్చేశాయి. తీవ్రమైన జంతుబలి వ్యవసాయాన్ని దెబ్బతీసి, ఆ కారణంగా మొత్తం ఆర్ధిక వ్యవస్థే కుదేలైంది. అయినదానికీ కానిదానికీ యజ్ఞాలను గృహస్తులచే నిర్వహింప జేస్తూ  పురోహితవర్గం మాత్రం  ఆర్థికంగా బలపడింది. జంతుబలిని నిరసిస్తూ వ్యావసాయికులైన వైశ్యులు,యజ్ఞోపవీత ధారణకు అధికారం లేని కారణంగా స్త్రీలు,యజ్ఞాలు నిర్వహించే ఆర్ధిక స్తోమతు లేని సామాన్యులూ యజ్ఞాలను వ్యతిరేకించారు.యజ్ఞాలు,హింస,జంతుబలి పట్ల ఈ వర్గాల నిరసనే తూర్పు భారత దేశంలో  వైదికేతర జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించడానికి దారితీసింది. ఆరోగ్యకరమైన స్త్రీ అండం, పురుష వీర్య కణం ఫలదీకరణం చెందితేనే సంతానం కలుగు తుందనీ, ఇది ఏ యజ్ఞాల వల్లా సాధ్యపడదనీ శాస్త్ర పరిశోధనలు రుజువుచేసాయి. అలాగే స్త్రీ అండం లోని ' x ' క్రోమోజోము,పురుష వీర్య కణం లోని ' y' క్రోమోజోము కలిస్తే పురుష సంతానం, స్త్రీ అండం లోని 'x' క్రోమోజోము, పురుష వీర్య కణం లోని 'x' క్రోమోజోము కలిస్తే స్త్రీ సంతానం కలుగుతుందనీ,ఇందుకొరకు ఏ 'పుం సవనాలు'చేసీ, ఎట్టి ప్రయోజనమూ ఉండదని ఆధునిక శాస్ర పరిశోధనలు నిగ్గుదేల్చాయి.అలా శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ పోతున్న కొద్దీ క్రమంగా అంధ విశ్వాసాలూ,వాటి వెంబడే అర్థం లేని ఆచారాలూ కనుమరుగవుతూ వచ్చాయి.
                                              మరో విద్యుల్లేఖలో  ప్రకృతి శక్తులకు మహిమలు గానీ,విచక్షణా యుతమైన  చైతన్యం గానీ ఉన్నాయా? ప్రకృతి శక్తులను ప్రత్యక్ష దైవాలుగా  ఆరాధించడం ఏ మేరకు ప్రయోజనకరం?
 

ఈ శీర్షికలో గతమాసము వచ్చిన వ్యాసము పైన వచ్చిన స్పందనలకు, కృష్ణకుమార్ గారి "వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా?" అన్న వ్యాసానిపైన వచ్చిన స్పందనలను కూడా జతపరచుతున్నాము. రెండువ్యాసాలు ఒకే అంశంపైన వుండటం చేత పాఠకులకు అనువు వుంటాయని ఇలా జతపరచి సమర్పిస్తున్నాము. మీ స్పందనలను, విమర్శలను తప్పకుండా పంపండి. మళ్ళీ వచ్చే నే జతపరుస్తాము. మీకు అనువుగా వుంటునదని గత మాసపు వ్యాసాలకి లంకెలను కూడా మీకు గుర్తుచేస్తున్నాము.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb12/devudunnaada.html
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb12/vedantadharmamlo.html
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/mar12/devudunnaada.html
 
From: పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా

వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా? - 2వ భాగం


Subject: వేదాంత ధర్మంలో శాస్త్రీయత లేదా?
నేను జనవరిలో రాసిన వ్యాసం మీద వచ్చిన అభిప్రాయాలు, ముత్తేవి రవీంద్రనాథ్ గారి కామెంట్లు చదివిన తరువాత మళ్ళీ కొంత రాయదల్చుకున్నాను.

నన్ను వివరణలు అడిగిన వారికి నా అభిప్రాయాలు చెప్పడం సుళువు కనుక, కొంత వివరణలతో పాటు ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఎంతో జాగ్రత్తగా, సవివరణలతో రాసిన పాయింట్లకి జవాబుగా కూడా రాస్తే కొంత అందరికీ అర్ధం అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఆయన మార్చి సంచికలో రాసిన పాయింట్లని కూడా ఉదహరిస్తాను.

నేను మొదటిసారి రాసినట్లు, దేవుడిని నమ్మను అని భీష్మించుకున్న వారిని నేను మార్చాలనే ప్రయత్నం చేయటంలేదు. కాని, నేను రాసిన ప్రతి పాయింటుని అలక్ష్యం చేసి, పూర్తిగా వేరే రూపంలో వాదం చేస్తే కొంతైనా నేను జవాబు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ముందర ముత్తేవిగారు రాసిన మౌళికమైన పాయింట్లని పరిశీలిద్దాం:

1. కొంతమంది చంద్రుడిపైన అమెరికా వ్యోమగ్రాములు దిగలేదని వాదించేవారు: దీనికీ, వేదాంతంలో శాస్త్రీయతకీ, సంబంధం ఏమిటి? ఇలా వాదించేవారిని నేనుకూడా చిన్నప్పుడు చూసేవాడిని. అంతేకాదు, ఇప్పుడు, నేను అమెరికాలో ఇన్నాళ్ళనించీ ఉన్నా కూడా, ఈరోజుకూడా అమెరికనులే ఈవాదాన్ని నమ్మేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. మీరు గూగుల్ చేస్తే 80,000 పైగా లింకులు వస్తాయి ఈ ప్రశ్నకి. దీనికి సమాధానం ఏమిటంటే, వేదాంత ధర్మాన్ని కొంత సూక్ష్మ దృష్టితో అర్ధం చేసుకునే వారు తక్కువై, వారి భయం వారిని శాస్త్రం సాధించిన విజయాలని కాదనేలా చేస్తుంది. అలాంటివారిని అడ్డుపెట్టుకుని వేదమే తప్పనీ, వేదంలో శాస్త్రీయత లేదని వాదిస్తే ఎలా? ఇలాంటి మూఢ నమ్మకాలు ఎన్నో శాస్త్రం చదువుకున్న వారికీ, చదువుకోనివారికీ ఉన్నాయి!

నేను చాలా జాగ్రత్తగా వేదంలో ఉన్న పరిశీలనా పద్ధతులని మనం సశాస్త్రీయంగా ఎందుకు స్వీకరించవచ్చో రాసాను. ముత్తేవిగారు అదంతా పూర్తిగా విస్మరించినట్లు ఉన్నది. ఆయన చాలా చదువుకున్నవారని తెలుస్తూనే ఉన్నది, అయినా నేను వారు చదువుకున్నారని అంగీకరించలేదని, ఆ మాటని స్వీకరించలేదని ఆయనకి ఎందుకు అనిపించిందో నాకు అర్ధం కాలేదు. మనం శాస్త్రీయతని పరిశీలించాలంటే, మన వేదాలని విశ్లేషించేవారు కొన్ని పద్ధతులని పాటిస్తున్నారా లేదా అని చూడాలి. దీన్ని ఇంగ్లీషులో 'ఏపిస్తెమాలజీ' అంటారు. అంటే, ఙ్ఞానం ఎలా వస్తుంది? అది సరియైనదా, కాదా అని విశ్లేషించే సబ్జక్టు అన్నమాట. ఈపధ్ధతులు భరతదేశంలో పరాకాష్టనందుకున్నాయి వేదకాలం నుంచి. మధ్వుడు జయతీర్థ మధ్వాచార్య చాలా గొప్పగా వాడారు: 'ప్రమాణం' అంటే ఏమిటో వివరించి. 'ప్రమాణం' అంటే ఙ్ఞానం మరియు ఙ్ఞానం నేర్చుకునే పధ్ధతులు. యధార్థానికి ప్రమాణం అవసరం. ఈ ప్రమాణం రెండు రకాలు. కేవల ప్రమాణం, అను ప్రమాణం. అనుప్రమాణం అవలంబించే పద్ధతైతే, కేవల ప్రమాణం ఆ పధ్ధతినించి వచ్చే ఙ్ఞానం. అలాగే, ఙ్ఞానంలో కూడా మూడు రకాల ఙ్ఞానం ఉంటుందని చెప్పారు: 'ప్రత్యక్ష ఙ్ఞానం, (ఇంద్రియాలకి తోచేది), 'అనుమాన ఙ్ఞానం' (ఇంఫరెన్స్), శబ్ద ఙ్ఞానం (నోటితో చెప్పగలిగేది). వీటన్నిటిలోనూ శబ్ద ఙ్ఞానం, లేక ఆగమ ఙ్ఞానం దేవుడి ఉనికిని రుజువు చేస్తుంది, మిగతా రెండింటినీ వాడుతూ. ఇవికాక, ఉపమాన, అర్థపత్తి, అనుపలబ్ధి వంటి విభజనలెన్నో ఉన్నాయి, ఙ్ఞానానికి. ఇంత శాస్త్రీయంగా, సంపూర్ణంగా ఇంతమంది మహానుభావులు కృషి చేసి సంపాదించి పెట్టిన ఙ్ఞానం శాస్త్రీయం కాదని అనడానికి ఆధారాలేమిటి?

వీటన్నిటికీ ముత్తేవిగారి సమాధానం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, మూఢనమ్మకాలు ఎత్తిచూపడమే. దీనిగురించి, ఇవి జరుగుతున్న విషయం గురించీ, నేను సవివరంగా నా మొదటి వ్యాసంలో ప్రస్తావించాను. ముత్తేవిగారు అదంతా పూర్తిగా వదిలేసి, మళ్ళీ అవే విషయాల గురించి రాస్తున్నారు. అయితే, నేను ఇదివరకే రాసినట్లు, ఇలా సమాజ వికాసం కోసం పోరాడేవాళ్ళు అవసరమే. కానీ, వారి ధ్యేయం ఒక వర్గ భేదానికీ, వర్గ ద్వేషం ఎత్తిచూపటానికీ కాకూడదు. మనం ఇక్కడ సత్యాన్వేషణ చేస్తున్నాము, అంతే. సమాజంలో ప్రతీ విషయాన్నీ తమ తమ స్వలాభంకోసం వాడుకునేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఙ్ఞానాన్ని పూర్తిగా బయటకు తెస్తేగాని వాళ్ళ ఆట సరికట్టదు. దానికోసం ముత్తేవిగారిని పోరాడమని అడుగుతున్నాను, అంతేకాని, మనకిక్కడ వేరే పనిలేదు.

2. పదార్ధం మొదలా, శక్తి మొదలా?:

దీని గురించి నేను చాలా రాసాను నా మొదటి వ్యాసంలో. మళ్ళీ, ముత్తేవిగారు అదంతా వదిలేసి, మరి మీరు పదార్ధం మొదలని ఒప్పుకుంటారా? అని నన్ను మళ్ళీ నిలదీసారు. ఇలా ఒకే పాయింటుని మళ్ళీ మళ్ళీ తవ్వుతే, చదివేవారికి విసుగు తప్ప మనం నిజం వైపు ప్రయాణించం. మనం పదార్ధం అని ఏదైతే చూస్తున్నామో అదంతా శక్తి మాత్రమే. ఆ శక్తి రకరకాలైన పదార్ధాలుగా మనకి కనిపిస్తున్నది. థియరెటికల్ ఫిసిక్స్ ద్వారా మనకి ఇదే రుజువు అవుతున్నది. నా మొదటివ్యాసంలో దీనిగురించి చాలా రాసాను. మరి భగవానుడు భగవద్గీతలో కూడా ఇదే చెపుతున్నాడు. ఇంకెంత రాసినా చర్విత చర్వణం.

3. ఇక అన్నిటికన్న ఉత్సుకమైనది ఈనెల ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఉదహరించిన ఈశావాస్యోపనిషత్తు శ్లోకం:

ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావసిష్యతే|

దీనికి ముత్తేవిగారిచ్చిన భాష్యం ఆయన ఎంత కృషి చేసారో ఈ ఉపనిషత్తుల మీద, వాటిని అర్ధం చేసుకోవడం కోసం ఎంత కష్టపడ్డారో తెలియజేస్తుంది. వారికి నా నమస్కారాలు. అయితే, అది అర్ధం చేసుకున్నా కూడా వాటినించి పెడార్ధాలు తీయకుండా ఙ్ఞానం సంపాదించడంలో కొంచెం తేడాలున్నాయి. అసలు 'థియరీ అఫ్ కన్సర్వేషన్ అఫ్ మాటర్ ' ఎంత చక్కగా మనవాళ్ళు ఎన్ని వేల ఏళ్ళకిందట చెప్పారో చూడండి! ఇది మనం స్వీకరించక, వెయ్యేళ్ళు పాశ్చాత్యులు రిసెర్చి చేసి, మనకి ప్రతిపాదిస్తే వాళ్ళే ఈ యదార్ధం కనుక్కున్నారని వాళ్ళకి భరతం పడుతున్నాం. అసలు ఈ శ్లోకం ఆధారంగానే హిందువులు కేవల ఆధ్యాత్మిక శక్తితో '0' ని ప్రతిపాదించారు. మేథమేటిక్స్ లో ఇంతకన్నా శక్తివంతమైన గణం లేదు. అలాగే 'అనంతం' అంటే ఇంఫినిటీ కూడా ఇదే ప్రయోగం నించి పుట్టింది. మరి సున్నాని సున్నతో విభజిస్తే ఏమవుతుందనేది ఎవరికీ తెలియదుగా!

ఇవి రెండూ ఈ శ్లోకం నించి అర్ధం అవుతే, ఇంకొక సత్యం మనకి అర్ధం అవటం సుళువు అవుతుంది. అదే 'థియరీ అఫ్ కన్సర్వేషన్ అఫ్ ఆత్మ '. ఆత్మ నాశనము లేనిది. ఒక శరీరమ్నించి ఇంకొక శరీరంలోకి, ఒక రూపం/జాతి నించి ఇంకొక రూపంలోకి ఆత్మ మారుతుందని వేదం చెపుతుంది. నాకు ఎక్కువగా ప్రామాణికంగా ఇతర మతాల గురించి తెలియదు కానీ, క్రిస్టియానిటీలో 'మార్మన్ ' అనే శాఖవాళ్ళు, జుయిష్ మతం వారు చనిపోయింతరువాత ఆత్మ ఇంకా ఉంటుందనీ, అయితే మళ్ళీ మానవ శరీరాలలోనే ప్రవేశిస్తుందనీ నమ్ముతారు. ఈ వాదన వల్ల ముత్తేవి గారన్నట్లు కొంతకాలానికి ఆత్మ సంఖ్య సరిపోదు కదా? కాబట్టి వేదాంత ధర్మాన్ని ఒప్పుకోకతప్పదు - ప్రపంచంలో ఉన్న జీవులన్నీ కలిపి చూస్తే, ఉండే సంఖ్య ఒకటే. ఇక్కడ 'ప్రపంచం' అంటే ఒక్క భూమి మీదే అని మనం అనుకోవడానికి దాఖలాలేమీ లేవు. విశ్వంలో ఎక్కడైనా ఉండచ్చు ఆ ఆత్మ.

ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఇవ్వచ్చు. మచ్చుకి ఒకటి: ప్రస్తుతం 'నాసా ' - అమెరికా సంస్థ - విశ్వంలో మనం కనిపెట్టిన గోళాలన్నిటిలోనూ జలం ఉన్నదా లేదా అని పరిశీలిస్తున్నది. అలాగే భారతీయ స్పేస్ సంస్థ కూడా చంద్రుడిపైన నీరు ఉన్నదా లేదా అని పరిశీలిస్తున్నది. మీరు ఒకసారి మంత్రపుష్పం చదివి చూడండి! చంద్రుడిలోనూ, నక్షత్రాలలోనూ నీరు ఉన్నదని ఢంకాపధంగా చెబుతున్నది! ఇన్ని వేళ ఏళ్ళ కింద మన ఋషులకి ఈ సత్యం ఎలా తెలిసిందంటారు?

అయితే, అన్నీ వేదాలలో ఉన్నప్పుడు మనం ఈ చదువులు అన్నీ మానేసి, అవే చదువుతే సరిపోలా? అని ఎకసక్కెంగా మాట్లాడేవాళ్ళు నాకు చాలామంది తగిలారు. అనుకోకుండా ముత్తేవి గారు కూడా ఇదే ధోరణిలో 'ఒక యోగిని కూర్చోబెట్టి అన్నీ చెప్పమంటే పోలా? ' అని ఒక గంభీరమైన విషయాన్ని హాస్యాస్పదంగా మార్చారు. ఇంతెందుకు - మనదగ్గర ఉన్నదేదైనా మనం ఏ విధమైన ఆపేక్ష లేకుండా ఇంకొకరికి ఇస్తున్నామా? ఆ ఒక్క యోగి అనూహ్యమైన కృషి చేసి మనకి అన్నీ చెపితే, మనం ఇంక ఏం చెయ్యలి? ఊర్కే కూర్చుని అనుభవించాలా? దానివల్ల ఏ సమాజ సిద్ధి లభిస్తుంది? సమాజం నిర్వీర్యమై పోదూ?

ఈ విఙ్ఞానం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయేలోపల వీటిని వెలికితీసి అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనకి దాస్యం వల్ల, పాశ్చాత్య ప్రభావం వల్ల వీటిని విశ్లేషించే ఙ్ఞానం పోయి, ఇంకెవరైనా చెపితే తప్ప అర్ధం కాని స్థితికి చేరుకుంటున్నాము. ఇది దయనీయం కదా?

4. పదార్ధానికి బయట శక్తి ఉండగలదా?: ప్రస్తుతం మనకి తెలిసిన భౌతిక వాద పరీక్షలవల్ల ఇది తేటతెల్లమౌతుంది! ఈ విశ్వం అంతటా 'శక్తి ' నిండి ఉన్నది. కొన్ని కొన్ని చోట్ల అది పదార్ధరూపంలో, నక్షత్రాలగానూ, గ్రహాలగానూ తయారై, మనకి కనిపిస్తున్నది. మిగతా 'శూన్యం 'లో రేడియేషన్, గ్రావిటేషనల్ ఫోర్స్ గానూ, ఇతర తరంగాలుగానూ మన ఇంద్రియాలకి కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల రష్యా దేశం ఒక రాకెట్టుని అంగారక గ్రహానికి పంపించాలని ప్రయోగిస్తే, ఈ తెలియని కణాలు తగిలి ఆ రాకెట్టు విస్ఫోటకం చెందింది. అవేమిటో తెలుసుకుందామని అమెరికా ఇప్పుడు ఇంకొక రాకెట్టుని ప్రయోగించింది. అనగా, ఈ 'శక్తి ' అనేక రూపాలుగా పదార్ధేతరంగా విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఈ విశ్వంలో ఉండే 'టోటల్ ఎనర్జి గెయిన్ అండ్ లాస్ ' మనం అనేక విశ్వాలున్నాయని ఒప్పుకుంటేగానీ లెక్క సరిపోదని స్టిఫెన్ హాకింగ్ సెలవిచ్చాడు.

కాబట్టి, పదార్ధం అవతల శక్తి ఉండడం సామాన్యమేనని రుజువు అయింది. దీనిని బట్టి, భగవంతుడున్నాడనీ, ఈ మాట సుసారమేగానీ, నిస్సారము కాదనీ తేలిపోతోంది! అదీ, ముత్తేవిగారి మాటలలోనే!

5. ఒక మాట ఇంకా మనం రుజువు చేసుకోవాల్సి ఉంది. ఈ శక్తిలో ఒక శృజనాత్మక శక్తి, ఒక భావ ప్రకటనా శక్తి ఎక్కడున్నాయి? దీనికి పూర్తిగా సమాధానం నాదగ్గిర లేదని నేను ముందే రాసాను. కానీ, కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉండే పదార్ధానికి, మన భూమిలో ఉండే ప్రతి కణానికి, లేదా మనకి తెలిసిన ప్రతీ రెండు పదార్ధ కణాలకి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి - గ్రావిటేషనల్ ఫోర్స్ - ఎలా వచ్చిందో మనకి ఇప్పుడు అర్ధం అయిందా? లేదు కదా? అలాగే మనకి తెలిసిన ప్రతీ పదార్ధ ధాతు లక్షణం మనం తెలిసి తయారు చేసామా? అవి ఉన్నప్పుడు మన తెలివి వాడి వాటితో కొన్ని మనకి కావలసిన వస్తువులు, మరికొన్ని ధాతువులు తయారు చేసుకుంటున్నాము. అది గొప్పే, నేను కాదనడంలేదు. కానీ, మూలం మనం అడక్కుండానే తయారు చేసి ఇచ్చిన శక్తేదో మనందరిలో, మీలో, నాలో, అన్ని చరా చర జగత్తులోనూ వ్యాపించి ఉంది. ఇదే భగవద్గీత ఎంతో చక్కగా చెపుతోంది.

6. ఇక స్వర్గం యొక్క ప్రస్తావన నేను ఇదివరకే రాసాను కాబట్టి మళ్ళీ దాని గురించి రాయవలసిన పనిలేదు. ఆకలిగొన్నవాడికి పట్టెడన్నం దొరికితే అదే స్వర్గంలా కనిపిస్తుంది! రోజూ కడుపునిండా తినేవాడికి అన్నం తిన్నా తినకపోయినా స్వర్గం గుర్తుకు రాదు! అంటే, స్వర్గం అనేది మన మనోప్రయోగం అనీ, దాని గురించి ఇదివరలో రాసాను, ఒకసారి చూడమని మనవి.

7. నారదుడు, ఆంజనేయుడు వంటి అజరామరణులు ఏమైపోయారో అని ఎకసక్కమాడారు రవీంద్రనాథ్ గారు. ఒకసారి మార్కండేయ పురాణంలో చూడండి. కల్పాంతరంలో ఈ జీవులు ఎక్కడకిపోతాయో క్షుణ్ణంగా వివరించారు! సూర్యుడు ఏమైపోతాడో, ఈ విశుధ్ధాత్మలు ఎలా ఒక భూమినించి ఇంకొక భూమి వద్దకి వెళతాయో చాలా బాగా వర్ణించారు! దీని గురించి కూడా ఇదివరకే రాసాను. వీటన్నిటినీ కూడా 'నేను చూడలేదు, కాబట్టి ఇవి లేవు ' అనే తరహాలో వాదించడం సబబా?

8. శ్రీ జయశంకర్ గారు అడిగినట్లు, మనం ఏదైనా సులభ మార్గంలో భగవంతుడిని చేరుకోగలమా? దీనికి భక్తి మార్గమొక్కటే సులభ మార్గం. ఈ భక్తి పలు విధాలు. వాత్సల్య భక్తి, సఖ్య భక్తి, సేవక భక్తి, మధుర భక్తి, శాంత భక్తి - అనే భక్తి మార్గాల ద్వారా బ్రహ్మ ప్రాప్తిని సాధించవచ్చని వేదం చెపుతుంది. స్వలాభాపేక్ష లేనంత కాలం సేవాభక్తి చేసినా భగవంతుడిని చేరుకోగలం.

8. ముత్తేవి గారి అఖరి పేరాలో సవాలు బట్టి, పైన నేను చెప్పిన మాటలబట్టీ, భగవంతుడున్నాడనే విషయం రుజువైనట్లేనా?

From: ముత్తేవి రవీంద్రనాథ్
                అలా అసలు ఉందో లేదో ఎట్టి దాఖలా లేని ఆత్మ- ఉన్నాయో లేవో , ఉంటే ఎక్కడ ఉన్నాయో ఇదమిత్థంగా  ఎవరికీ  తెలియని స్వర్గ నరకాలకు మరణానంతరం ప్రయాణం కడుతుందనే నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకం ఎంతమేరకు శాస్త్రీయమో కూడా పరిశీలిద్దాం.ఇక్కడేమో జనాభా రోజు రోజుకూ పెరిగి పోతున్నది.కృష్ణ భగవానుడేమో 'భగవద్గీత'లో 'యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ'అని సెలవిచ్చారు.దీని అర్థం 'ఎక్కడికి  వెళితే అయితే తిరిగి రావడమంటూ ఇక ఉండదో-- అదే నా పరంధామం'-అని.ఆత్మలు వైకుంటమో,కైలాసమో,లేక స్వర్గంగా భావిస్తున్న మరొక తావుకో  చేరుకుంటే ఇక తిరిగి రావడం, పునర్జన్మ ఎత్తడం - ఇవేవీ ఉండవట.ఇక జన్మరాహిత్యమే.  పునర్జన్మ సిద్ధాంతం నమ్మినా,చచ్చిపోయిన వారి ఆత్మలు స్వర్గానికో, నరకానికో వెళుతూ ఉన్నది నిజమే అయితే- కొత్తగా పుట్టే జనం ఆత్మలు లేకుండా పుడుతున్నారని అనుకోవాలి.లేకపోతే ఎన్ని పాపాలు చేసినా ఎవరూ నరకానికి వెళ్ళడం లేదనో  , లేక ఎంత పుణ్యం చేసినా ఎవరూ స్వర్గానికి కూడా వెళ్ళడం లేదనో భావించాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ మరణించిన వారి ఆత్మలు ఇక్కడిక్కడే పునర్జన్మలు ఎత్తుతున్నాయనుకోవాల్సి ఉంటుంది.అలా అనుకుని సర్దుకుపోయినప్పటికీ పునర్జన్మ ఎత్తడానికి ఆత్మలకు కొరత ఏర్పడుతుంది కదా! క్రీస్తు శకారంభంలో ఇరవై కోట్లున్న ప్రపంచ జనాభా మొదటి వెయ్యేళ్ళలో ఇరవైయేడున్నర కోట్లకు చేరుకుంది. అంటే అప్పటి ప్రపంచంలో  వెయ్యేళ్ళలో జనాభా పెరుగుదల కేవలం ఏడున్నర కోట్లు కాగా,ప్రస్తుతం అది ఏటా ఎనిమిది కోట్లకు పైగానే పెరుగుతూ ఈ వ్యాసం రాసే సమయానికి 702 కోట్ల 44 లక్షలకు చేరుకుంది.ఇక ఆత్మలకు భూమిమీద  కరవు కాక ఏముంది? కనుక పుట్టుకొచ్చే నవజాత శిశువులు ఆత్మలు  లేకుండా పుడుతున్నాయనో, లేక మరణించినవారి ఆత్మలు స్వర్గ నరకాలకు వెళ్ళడం ఆగిపోయిందనో అంగీకరించక తప్పదు-- ఆత్మ ఉందని నమ్ముతుంటే.అలా ఈ ఆత్మ సిద్ధాంతం చిక్కుల చిట్టడవి.'ఆత్మవత్ సర్వ భూతాని' అంటూ ఎనభైనాలుగు లక్షల జీవజాతులను రంగంలోకి దించినా ఈ చిక్కు తీరేదికాదు.
                     భర్త తన భార్య మరణించిన తరువాత పునర్జన్మలో సైతం  ఎట్టి పరిస్థితులలో వేరొకరికి చెందరాదనే స్వార్థ పూరితమైన యోచన చేసిన కారణంగానే'భార్యా భర్తలది ఏడేడు-పద్నాలుగు జన్మల బంధం ' అనే నమ్మకం ప్రాచుర్యంలోకి వచ్చింది.తాను చిరకాలం జీవించాలనే స్వార్థ చింతనతో 
భార్యను నిత్య సుమంగళిగా ఉండాలని దీవించడం. ఆమె పసుపు కుంకుమలతోనే మరణించాలని ఆశీర్వదించడం అంటే ఆమె మరణించిన తరువాతకూడా తాను మాత్రం బతికే ఉండాలనే దురాశ తప్ప వేరొకటి కాదు. భార్య మరణిస్తే ఏడాది తిరక్కుండానే మళ్ళీ పెళ్ళికి సిద్ధపడే భర్త ,ఒకవేళ తాను ముందు మరణిస్తే  మాత్రం భార్యకూడా భర్త శవంతోపాటు ఆ చితిపైనే సహగమనం చెయ్యాలనే నియమం విధించాడు.ఈ నమ్మకాలన్నీ ఆత్మలు, పునర్జన్మల సిద్ధాంతాన్ని నమ్మడం కారణంగానే ఏర్పడ్డాయి.
                   అలాగే  పుణ్య పాపాలపై మనం ఏర్పరచుకున్న విశ్వాసాలు కూడా కొద్దిగా సావధానంగా పరిశీలిస్తే, అసంగతమైనవని గ్రహించగలం.పాము పుణ్య కార్యాలే చెయ్యాలంటే కప్పల్నీ,కోడి పిల్లల్నీ తినకుండా ఉండాలి.దాని ఆహారం అది.తన ఆహారాన్ని తాను తినడం కూడా పాపమైతే ఇక దానికి స్వర్గప్రాప్తి ఎప్పటికి? పులి,సింహం వంటి క్రూర జంతువులు, విష కీటకాలు వాటి జీవన వ్యాపారాన్ని అవి సాగించడమే పాపమూ, నేరమూ అయితే వాటికెప్పటికి విముక్తి? మాంసాహారులైన మానవులమాట అటుంచి,శాకాహారుల విషయమే తీసుకుందాం.ఆవు, గేదె,మేక వంటి జంతువులు తమ సంతానం కోసం ఉత్పత్తి చేస్తున్న పాలను వాటికి దక్కనీయకుండా  మనం అనుభవిస్తున్నాం. మనకు పుణ్య లోకాలు ప్రాప్తించాలని ఆ పాలతో దేవతా విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నాం.నైవేద్యాలుగా పాయసాలు అర్పిస్తున్నాం.ఆ నెయ్యితో యజ్ఞాలు చేస్తూ మనకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని ఆశిస్తున్నాం.మన ప్రయోజనం కోరి పశువులను  యజ్ఞాలలో  బలి ఇస్తూ, పైపెచ్చు ఆ కారణంగా  వాటికీ ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయనే నమ్మకాలు ప్రచారం చేసాం. తోటకూర మొక్కలు పీకి కూర వండుకోవడం, చిక్కుడు  గింజల్ని వండుకుతిని , ఆ గింజలలోని మొలకెత్తనున్న శిశుప్రాయమైన జీవిని అంతం చేయడం పాపం కాదా? మనం చేసే పనులన్నిటికీ ఏదో ఒక రకమైన సమర్థనలు రూపొందించుకుంటే రూపొందించుకోవచ్చుగానీ ఆత్మను నమ్ముతూ  ఉంటే  
 ఆ ఆత్మకు సమాధానం చెప్పుకోవడం కష్టం మరి!
                ఇక్కడ మరొక విషయం కూడా ముచ్చటించుకోవాలి.దేవుడనే వాడొక డున్నాడనీ అతడు మనల్ని అనునిత్యం కనిపెట్టి కాపాడుతూ ఉంటాడనే భావన సామాన్య జనానికి ఒక ఊరటనిచ్చింది.ఇది మాత్రం వాస్తవం. అందుకే బౌద్ధమతంలోని నాస్తిక హీనయాన శాఖ ప్రజాదరణ కోల్పోయి,బుద్ధుడినే దైవంగా భావించే మహాయాన శాఖ బలపడింది.ప్రజలను అనుక్షణం 'అవలోకితేశ్వరుడు' గా బుద్ధ భగవానుడు కనిపెట్టి, కాపాడతాడనీ , బోధిసత్త్వుడు 
వివిధ జన్మలు ఎత్తుతూ ప్రజల మధ్య తిరుగాడుతూ వారి కష్టాలు కడతేరుస్తాడనీ     నమ్మకం వ్యాపించింది.ఈ జన్మలకు సంబంధించినవే జాతక కథలు.        జైనంలోకూడా దైవ ప్రస్తావన లేని దిగంబర శాఖ సన్నగిల్లి ఇరవై నలుగురు తీర్థంకరులే దైవాలని ప్రచారం చేసిన శ్వేతాంబర శాఖ ప్రబలింది.హిందూ భావజాలంలోనూ కర్మ కాండ కంటే సామాన్యులు 'భక్తి కాండ' పైనే మొగ్గు చూపారు.భగవంతుడు అవతారాలు ఎత్తుతూ దుష్టుల్ని శిక్షిస్తూ తమను రక్షిస్తాడని సామాన్య జనం  నమ్మారు . ఆత్మ-పరమాత్మ, పుణ్యం-పాపం-- ఈ  సిద్ధాంతాలను తలకెక్కించుకుని ప్రజలు భగవదారాధననే ముక్తికి దగ్గర మార్గం గా భావించడం మొదలుపెట్టారు.దీనితో వారికి కొంత ఊరట,భరోసా లభించిన మాట వాస్తవం.అది శాస్త్రీయం అయినా కాకున్నా ప్రతివారూ తమలో ఒక ఆత్మ ఉన్నదనీ అదే శాశ్వతమనీ, ఈ శరీరం అశాశ్వతమనీ మరణించిన తరువాత తన ఆత్మ పునర్జన్మ ఎత్తుతుందనో లేక స్వర్గానికి వెళుతుంది అనో నమ్మిన   వారి ఆశావహమైన భావన కూడా వారికి కొండంత ఊరటనిచ్చింది. అందుకే దాని పట్ల జనం విపరీతంగా ఆకర్షితులయ్యారు.మరణిస్తే తాను రేపటినుంచీ పూర్తిగా లయమైపోతాననే భావనను ఎవరూ జీర్ణించుకోలేరు కదా!
                   కొందరి అభిప్రాయం --  ఈ తరహా దైవభావన లేక దైవభీతి  ప్రజలలో లేకపోతే నేరాల శాతం విపరీతంగా పెరిగిపోతుందని.ఇందులో ఎట్టి శాస్త్రీయతా లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 702 కోట్ల మంది జనాభాలో కోటికి వెయ్యిమంది కూడా  దేవుడిని నమ్మని వాళ్ళు ఉండరు.మరి ఇప్పుడు నేరాలు చేస్తున్నవారంతా దైవభక్తులేనా లేక కోటికి వెయ్యిమంది కూడా  లేని నాస్తికులా? కరడు గట్టిన బందిపోట్లు సైతం కాళీ ఉపాసకులుగా ఉండడం, 
తీవ్రనేరాలు చేసి జైళ్ళ పాలైన ప్రమాదకరమైన నేరస్తులు జైళ్లలో ప్రతి రోజూ దైవ పూజలు శ్రద్ధగా చేయడం, స్తోమత ఉన్న నేరస్తులు జైళ్ళ లోనే ప్రత్యేక దేవస్థానాలు నిర్మించడం చూస్తూనే ఉన్నాం! ఖైదీల మత విశ్వాసాలను జైలు రికార్డుల్లో నమోదు చేస్తారు.వాటిననుసరించికూడా దేవుడిని నమ్మడం- నమ్మకపోవడం, నేరం చెయ్యడం-- ఈ రెంటికీ  ఎటువంటి సంబంధమూ లేదని పలు సర్వేలు రుజువుచేసాయి.పాపభీతి, దైవ భీతి ఉంటే ఎవరైనా అంతటి తీవ్ర నేరాలు చేస్తారా? ఇవన్నీ చెప్పుకొనడం వరకే.విచక్షణ కలిగిన దైవ భక్తుల మాట అటుంచి, వివేచన లేని దైవ భక్తులు చేస్తున్న నేరాలే ఇవన్నీ.అందుకే జైళ్ళు  భగవద్భక్తులతో నిండిపోతున్నాయి.'అలనాటి భద్రాచల రామదాసుకే కారాగార వాసం తప్పలేదు!'అని వారంతా తమను తాము సమాధానపరచుకుంటున్నారు.జైళ్ళ ఆవరణల లోనే అన్ని మతాల ఆరాధనా మందిరాలు నిర్మించుకుంటున్నారు.ఇదేనా దైవ భీతి?
                            శాస్త్రీయత అంటే కేవలం శాస్త్ర సత్యాల ఆవిష్కరణ, ఆవిష్కృత సత్యాలను అనుష్టించడమే కాదు, ప్రతి వ్యక్తీ  తాను విశ్వసిస్తున్న అన్ని  సత్యాలను ఎప్పటికప్పుడు పరీక్షకు లోనుచేస్తూ, శాస్త్ర దృష్టికి నిలబడేవిగా రుజువుకాని తన  నమ్మకాలను విసర్జించడానికి కూడా సిద్ధపడాలి.ఇక ఈ విషయాన్నింతటితో ముగించి  మీరు  పేర్కొన్న కొన్ని విషయాలపై నా  స్పందన తెలియజేస్తాను.
                      మీరు  పేర్కొన్న శాస్త్రీయ విషయాలు, సత్యాన్వేషణకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి నాకు విభేదమేమీ లేదు.ఎటొచ్చీ శాస్త్రీయ  భౌతికవాదులు పదార్థమే అంతిమ సత్యమని(Ultimate Reality) అంటారు.(ఇక్కడ పదార్ధం అంటే ప్రోటాన్, ఎలక్రాన్,న్యూట్రాన్ వంటి  మౌలికమైన  పార్టికిల్స్). వాటి సంఘాత, విఘాతాల వల్లే ఈ విశ్వం లోని సకల  పదార్థాలూ ఏర్పడ్డాయి.ప్రతి పదార్థానికీ ద్రవ్యరాశి (Mass) ఉంటుంది.ప్రతి పదార్ధం లోనూ  శక్తి (Energy) ఉంటుంది. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన E = MC2 సూత్రం ఆ శక్తి పరిమాణాన్ని వివరిస్తుంది.వస్తువు ద్రవ్యరాశి పై ఆ వస్తువులో ఇమిడివున్న శక్తి ఆధారపడి ఉంటుంది.అలా మౌలికంగా  ఎంత గొప్పదైనా ఆ శక్తి కూడా పదార్థంపైన, అందులోని ద్రవ్యరాశి పైనా ఆధారపడి ఉంది.
                        ఋగ్వేదంలోని 'నాసదీయ సూక్తం' చూడండి.సృష్టికి పూర్వపు స్థితిని వివరిస్తూ' అర్వాగ్దేవా అస్య వివర్జనేనా'అంటూ దేవతలు కూడా ఈ సృష్టికి తరువాతవారేనంటారు.అయితే 'కామస్తదగ్రే సమవర్తతాధి -మనసో రేతః ప్రథమం యదాసీత్' అంటూ పదార్ధం కంటే భావమే ముందరిదనే ప్రతిపాదన చేశారు. దీన్ని భౌతిక వాదులు శాస్త్రీయమైనదిగా  అంగీకరించరు. ఒక వరుస  క్రమంలో పదార్ధం,జీవం,శరీరం, మనస్సు,ఆ తరువాత ఆ మనస్సులో కామం లేక సృష్టించాలనే కామన(కోరిక)( ప్రజాపతి మనస్సులో) కలిగిన కారణంగానే ఈ జనసందోహం సృష్టింప బడింది. బహు భార్యలు, లెక్కలేనంత సంతానం కలిగిన దక్షుడు, కశ్యపుడు మొదలైన ప్రజాపతులు మానవ జాతి సృష్టికి మూల పురుషులుగా ఖ్యాతి గాంచారు.అన్నింటి కంటే ముందే కామం (మనస్సులోని ఒక భావం) ఉన్నదనడం ఎలా సాధ్యమని భౌతిక వాదం ప్రశ్నిస్తుంది.పదార్థమే విశ్వానికి మూలమని నమ్ముతుంది. 
                        విశ్వానికి మూలమైన ఆ  పదార్థాన్నే మీరు' బ్రహ్మ పదార్ధం' అని పిలుస్తానంటే ఎవ్వరికీ ఎట్టి అభ్యంతరం ఉండబోదు.అయితే వేదాంత ధర్మం ఆ బ్రహ్మ పదార్థానికి పాప పుణ్యాల విచక్షణ, ఈ అనంత విశ్వంలోని ప్రతి విషయంపై క్షుణ్ణంగా  పరిజ్ఞానం ఉందని ప్రచారం చేసింది.ఆ బ్రహ్మం 'కర్మఫలదాత' అంటున్నది.దానికి  తృప్తి కలిగించడానికి  యజ్ఞాలూ,బలులూ, దాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఋక్కులలో ప్రార్థనలూ రూపకల్పన చేసింది.ఇక్కడే భౌతికవాదులకి   ఉన్న అభ్యంతరమల్లా.
                        పదార్ధం యొక్క పరిణామ క్రమంలో నిర్జీవ పదార్ధం జీవ పదార్ధం గానూ,ఏకకణ జీవులు పరిణామం చెంది క్రమంగా బహు కణ జీవులుగానూ, బుద్ధి జీవులుగానూ రూపొందాయని, జంతువుల కంటే విచక్షణ, వివేచన కలిగిన మానవుడు ఈ పరిణామ క్రమంలోనే రూపొందాడనీ నమ్ముతారు.మీరూ పదార్థమే అనాది అనీ, దాని క్రమ పరిణామ ఫలితమే ఈ సకల చరాచర జగత్తనీ ఒప్పుకుంటారా మరి?
                         పదార్ధం అంతిమ సత్యమనీ అది ఒక రూపాన్నుంచి మరొక రూపానికి మారుతుంది తప్పితే దానికొక సృష్టికర్త లేడని చెప్పే సందర్భంలో నేను బాబాలు శూన్యం నుంచి సృష్టి చెయ్యరనీ, వాళ్ళ అంగీల చాటునుంచే విభూతి పళ్ళు, బూడిద,చిన్న వస్తువులు గారడీ విద్యల మోసం సాయంతో తీసి ఇస్తుంటారనీ చెప్పడానికి చిన్న విభూతి పళ్ళు సృష్టించే బాబాలు ఒక బూడిద గుమ్మడి పండునో లేక ఒక ఏనుగునో సృస్టించమంటే  నోరు వెళ్ళబెట్టారని  పేర్కొన్నాను. అంతేగానీ వాళ్ళ విభూతి పళ్ళ  సృష్టిని నేనెక్కడ అంగీకరించాను? మీరిది గమనించండి.
                             మిమ్మల్ని ఈ సృష్టికి మూల కారకుడైన మూడు తలలు, నాలుగు చేతులు కల దేవుడిని చూపించమని నేను అడగలేదే?  సాకార  భగవంతుడిని నమ్ముతూ విగ్రహారాధన చేస్తున్న వారెవరికైనా చూపించండి- చూప గలిగితే. నాకైతే ఆ అవసరం లేదు. గాలి కనబడడం లేదు కనుక లేదనేటంత వెర్రివాడిని కూడా నేను కానని మీరీసరికే  గ్రహించి ఉంటారు.ఒకవేళ గ్రహించలేకపోతే అది స్పష్టంగా మీ బలహీనతే.పేరు ప్రఖ్యాతులను ఆశించే నేనీ సమస్యను లెవనేత్తుతున్నానని నాపై మరో పరోక్ష నిందారోపణ చేశారు.నా చిన్ననాటినుంచీ నేను లోతుగా ఆలోచిస్తున్నదీ, నాకు నేటికీ సమాధానం దొరకనిదీ అయినట్టి ఈ తత్వశాస్రపు మౌలిక ప్రశ్నపై నేను నిజాయితీతోనే నా మనస్సులోని భావాలను వెలిబుచ్చాను. నాకుండే పేరు, ప్రఖ్యాతీ నాకు చాలు. ఎక్కువైనా భరించడం కష్టం. స్వయం కృషితో ఎదిగిన నాకు గుర్తింపు కోసం ఏదేదో రాయాల్సిన అవసరం అసలే లేదు.ఇటువంటి వ్యాఖ్యలు మాని మీరు కూడా సీరియస్ గా చర్చకే పరిమితం అయితే బాగుంటుందని నా సూచన.ఇంతకుముందు అధారిటేరియన్  స్వరం తో ఆంగ్లంలో రాశారు మీరు. ఇప్పటి మీ తెలుగులో రాసిన  వ్యాసంలోనూ 'హెచ్చరిస్తున్నాను'వంటి పదాల వాడకం మీ వెనుకటి తీరునే ధ్వనిస్తున్నది.ఇటువంటివాటిని నేను పెద్దగా పట్టించుకోను.కాని ఈ తరహా పద ప్రయోగాలు  మీవంటి విద్యాధికులు, వివేకులకే మచ్చ.దయచేసి గమనించ గోర్తాను.
                          ఇక ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ ఎవరో తెలివైన మేనేజర్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న కారణంగానే ఏ మార్పూ లేకుండా  ఏ చెట్టుకి ఆ కాయలే  కాస్తున్నాయనీ, అదే రంగులో అలాంటి పూలే పూస్తున్నాయని ,ఏ జంతువుకి ఆ పిల్లలే పుడుతున్నాయనీ పేర్కొంటూ మీరు దీనికంతటికీ కారణం దీన్ని వెనుక ఉండి నడిపిస్తున్న భగవంతుడే కాదా- ఆలోచించమన్నారు.చదవగానే ప్రతివారికీ మీరు పేర్కొన్నది సత్యమేమో అనిపిస్తుంది. కాని వాస్తవం వేరుగా ఉంది.ప్రకృతిలో వాస్తవానికి వివిధ వృక్ష, జంతు, పక్షి, కీటక జాతులు ఒక నిత్య పరిణామానికి లోనవుతూ, అనునిత్యం మారుతూనే ఉన్నాయి.వివిధ జీవులకు,  పదార్థాలకున్న గతి లేక గమనం కారణంగా అవి నిత్య పరిణామానికి లోనవుతున్నాయి.ఒక జీవ జాతి నుంచి దానికి దగ్గర లక్షణాలు కలిగిన మరొక జీవజాతి ఆవిర్భవించడం అలాగే జరిగింది. వాస్తవానికి ఆయా ప్రాంతాల భౌతిక స్థితిగతులనుబట్టి కూడా  జీవజాతులకు ఈ మార్పులు సంభవిస్తాయి.ఎడారి మొక్కలకు భాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు ముళ్ళుగా రూపాంతరం చెందుతాయి.తగినంత నత్రజని, ఖనిజ లవణాలు లేని బురద,చిత్తడి నేలలలో పెరిగే మొక్కలు కీటక భక్షణం  ద్వారా ఆ లోటును పూడ్చుకోనడానికి అలవాటు పడ్డాయి.Nepenthes(Pitcher Plant),Drosera ఇటువంటి కీటక భక్షణ మొక్కలకు ఉదాహరణలు.బురద నేలల్లో పెరిగే అవిసెన్నియా (Avicennia) లేక  మడ  చెట్ల  వేళ్ళకు భూమిలో  గాలి పీల్చే అవకాశం తగినంత లేని కారణంగా  అవి గాలికోసం నేలపైకి పెరగడానికి అలవాటు పడ్డాయి.ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు.ఇక    దగ్గర లక్షణాలున్న జీవ జాతులను వర్గీకరణలో కుటుంబాలుగా ఏర్పరచారు. ఒక్కో  కుటుంబానికి చెందిన మొక్కల్నీ, జంతువులనీ నిశితంగా పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా విశదమవుతుంది.కుక్కలలో వివిధ జాతులే కాక,కుక్కలకూ, నక్కలకూ, తోడేళ్ళకూ గల దగ్గర పోలికలు గమనించండి.ఇవన్నీ కొద్ది కొద్ది తేడాలతో ఒకే జాతినుంచి క్రమ పరిణామం చెందాయని అర్థమవుతుంది.ధ్రువ ప్రాంతపు తోడేళ్ళు, కుక్కలూ అక్కడి చలిని తట్టుకునేందుకు ఒంటిపై మరింత బొచ్చును అభివృద్ధి చేసుకున్నాయి.అంతెందుకు బైసన్ అనబడే అమెరికన్ బఫెలోనే ఉదాహరణగా తీసుకోండి.చలి కాలంలో అది ఒంటినిండా దట్టమైన బొచ్చును వృద్ధి చేసుకుంటుంది. చలి కాలం వెనుకపట్టు పట్టగానే అదంతా రాలిపోతుంది.ఇలా జీవజాతులన్నీ పరిణామ క్రమంలో తమ బాహ్య లక్షణాలలో మార్పులకు లోనవుతూ, భౌతిక స్థితిగతులకు తగ్గట్లుగా తమను తాము తీర్చిదిద్దుకోవడం ,అలాంటి మార్పులకు(Adaptation) అలవాటు పడడాన్ని మనం గమనించవచ్చు. ఏ జాతి జంతువు,పక్షి, వృక్షం ఆ జాతినే అభివృద్ధి చేస్తూ ఉంటే ఇన్ని జీవ జాతులు ఏర్పడేవే కాదు. జీవ పరిణామం లోనే  ఈ జాతులన్నీ  అభివృద్ధి చెందాయనీ, వీటినీ ఏ బాహ్య శక్తో శాసించిన కారణంగా అవి అలా లేవనేది సత్యం.
                        అంతే కాదు ప్రకృతిలో అన్ని జీవ జాతులలోనూ వక్రీభవనాలు(Aberrations) ఉన్నాయి.వీటినే Recalcitrancies of Nature అంటారు.ప్రతి వృక్ష జాతీ పూర్తిగా  అదే రంగు పూలే,అదే రకం పూలే పూయక పోవడం కూడా ఉంది.కుంటి పూలు (గుడ్డి పూలు) అని పిలువబడే పూలు అన్ని  జాతుల వృక్షాలూ పూస్తాయి.మొక్కలు వెర్రి తలలు వేయడమూ ఉంది.కుక్కమూతి పిందెలు కాయడమూ ఉంది.మన దృష్టిలో తప్పుకు అతీతుడైనట్టి (Infallible) భగవంతుడే కనుక వీటన్నిటి వెనకాల ఉండి అంతా ఒక క్రమ పద్ధతిలో నడుపుతూ ఉంటే ఇటువంటి వక్రీభవనాలు ఉండనే కూడదు కదా! ఒక్క శాతం కూడా అతడు తప్పు చేయ కూడదు కదా!!
              మరో సందర్భంలో భగవంతుడు ఎప్పుడు  తెలుస్తాడో ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాన్ని  మీరు ఉటంకిస్తూ చదువుకుంటేనూ, మీమాంసల ద్వారానూ భగవంతుడు తెలియడనీ,'బుద్ధి చెడు నుంచి మళ్ళితేనే','మనస్సును మనం స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే' అది  సాధ్యమని పేర్కొనడం నవ్వు పుట్టించే దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెచ్చింది.తెలివిగల మోసగాళ్ళయిన నేతవాళ్ళు కొందరు కంటికి కూడా కనుపించనంత పలుచనైన దేవతా వస్త్రాలను నేస్తున్నామనే పేరుతో కొన్ని నెలలపాటు ఒక రాజు, రాణిని మోసం చేసి చక్కగా సొమ్ము చేసుకుంటారు.తీరా తీసి గడువు ముగిసేటప్పటికి వస్త్రాలేవీ నెయ్యకుండానే నేసినట్లు మోసం చేసి ఎవరి తల్లి పతివ్రత కాదో వారికి ఈ వస్త్రాలు కనుపించవు. మిగిలిన వారందరికీ ఇవి అతి నాజూకైన, పలుచని వస్త్రాల్లా కనుపిస్తాయి- అని చెపుతారు. దీనితో  ఇతరులు తమ తమ తల్లులను ఎక్కడ పతివ్రతలు కాదంటారోనని వెరచి పెద్దవాళ్లందరూ "ఆహాహా! ఎంత బాగున్నాయి ఈ వస్త్రాలు?" అంటూ నేతవాళ్ళను తెగ మెచ్చుకుంటారు.రాజు,రాణి కూడా ఇందుకే భయపడి తమ పాత వస్త్రాలు తీసేసి, దేవతా వస్త్రాలు ధరించి (దిగంబరంగా) ఏనుగుపై ఊరేగుతారు.చివరికి 'పాతివ్రత్యం'అనే పదానికి అర్థం ఏమిటో కూడా    తెలియని పసివాడొకడు 'ఛీ..ఛీ..రాజూ,
రాణీ బట్టల్లేకుండా ఊరేగుతున్నారేమిటి?' అంటాడు. దీంతో అందరిలో గుసగుసలు బయలుదేరి ఆ మోసగాళ్ళ నాటకం బట్టబయలవుతుంది.
                     దేవుడిని నమ్మని నాస్తికులను ప్రాచీన కాలం నుంచీ పాషండులని పిలిచేవారు. వారితో ఎవరూ కలవ వద్దని నిషేధించారు.వాళ్ళు మనస్సు తమ స్వాధీనంలో లేని వాళ్ళట! చెడ్డ బుద్ధి కలవాళ్ళట!! ఇలాంటి శాపనార్థాలు పెడితే ఇక పైనచెప్పిన  ఆ  రాజ్య పు అమాయకపు రాజ దంపతులు, ప్రజలలాగా ఇక ఎవ్వరూ దేవుడిని గురించి ఏ ప్రశ్నలూ వెయ్యరు కదా! 'దీన్ని మించి ఒక్క ప్రశ్న అడిగినా నీ తల వెయ్యి వక్కలవుతుంది' అనో, 'సంశయాత్మా వినశ్యతీ' అని బెదిరించో కొందరు గురువులు శిష్యుల జిజ్ఞాసను తొక్కి పట్టిన ఉదాహరణలు  కోకొల్లలు.చదివి తెలుసుకోలేనివీ,మీమాంస ద్వారా తెలుసుకోలేనివీ, గురువు శిష్యుడికి రహస్యంగా చెపితే మాత్రమే తెలిసేదీననీ,  ఉపనిషత్తుల సారాన్ని గురువుకు దగ్గరగా కూర్చుని శ్రద్ధగా గ్రహించాలనీ అనేవారు.ఉపనిషత్తులను మొదట్లో క్షత్రియులే రూపొందించారు. రాముని మామ జనకుడు అట్టి వారిలో ప్రముఖుడు.వాటి సారం వారికే ఎరుక.అందుకే దైవజ్ఞానాన్ని(ఆన్వీక్షకీ), మొదట్లో 'రాజగుహ్య విద్యా'(రాజులలో మాత్రమే దాగివున్న విద్య) అని పిలిచేవారు. క్రమంగా బ్రాహ్మణ పురోహితవర్గం ఈ విద్యనూ క్షత్రియుల నుంచి ఎలాగోలా తస్కరించి ఇక అక్కడినుండి అనూచానంగా వారు ఆ విద్యకు అధిపతులయ్యారట. గుప్త విద్యల రోజులు గతించాయి.ఈ విద్య మాకే స్వంతం. మేం ఎవరికీ చెప్పం-అనడం ఇప్పుడు కుదరదు.ఆ విద్యలో  ఏమాత్రం శాస్త్రీయత ఉన్నా అది శాస్త్ర పరీక్షలకూ, శల్య పరీక్షలకూ నిలిచి గెలవాలి. After all-- every  thesis is a postulate which should  stand against its  opposition.If it be a  Science,
it can no longer be Esoteric. వాదనకు నిలువలేని సిద్ధాంతాలు విలువలేనివంటే తప్పుకాదేమో! శిష్యుడి  శేష  ప్రశ్నలకు సమాధానం దొరకని గురువులే 'సంశయాత్మా వినశ్యతీ'అని ఉంటారు బహుశా.అన్నట్లు ఎప్పటినుంచో నాకొక అనుమానం.ఆత్మ నశించదంటారు. మరి సంశయించే ఆత్మ నశి స్తుందా? సంశయించినా నాదీ ఆత్మే కదా? మరైతే ఎలా నశిస్తుంది-అని తిరిగి నా సంశయం.ఇక సంశయించే మనిషి నశిస్తాడంటారా?సంశియించని వాడూ నశిస్తాడు వాడేమీ శాశ్వతంగా శిలా శాసనంలా నశించకుండా ఉండలేడు-- అలాగే కొద్దిగా ముందో వెనకో  నేనూ నశిస్తాను. నాకు ఆ శాపం వల్ల ప్రత్యేక ఇబ్బంది ఏమీ లేదు కదా?  కాకపోతే జడబుద్ధిలా ఏ సంశయమూ లేకుండా జీవించేవాడు జీవించినంత దీర్ఘ కాలం నేను జీవించక పోవచ్చు.కానీ జీవించినంతకాలం నేను జడునిగా కాక బుద్ధిజీవిగా జీవించడాన్నేఇష్టపడతాను. అదీ సంగతి!!!
 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech